Telangana: సెక్షన్‌–3 ప్రకారమే.. కృష్ణా జలాల పునఃపంపిణీ! | Krishna River Waters Redistribution As per Section 3 | Sakshi
Sakshi News home page

Telangana: సెక్షన్‌–3 ప్రకారమే.. కృష్ణా జలాల పునఃపంపిణీ!

Published Fri, Jan 17 2025 12:48 AM | Last Updated on Fri, Jan 17 2025 4:43 AM

Krishna River Waters Redistribution As per Section 3

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తాజా నిర్ణయంతో మార్గం సుగమం

ఐఎస్‌డబ్ల్యూడీఏ–1956లోని సెక్షన్‌–3 కింద రెండు రాష్ట్రాల మధ్య 1,050 టీఎంసీల పంపిణీకి చాన్స్‌ 

తెలంగాణ కోరుతున్నట్టుగా పూర్తైన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశల్లోని ప్రాజెక్టులకూ నీటి కేటాయింపుల పరిశీలనకు అవకాశం   

సెక్షన్‌–3 కింద విచారించిన తర్వాతే పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 కింద విచారిస్తామన్న ట్రిబ్యునల్‌ 

రాష్ట్ర ఐఏపై మధ్యంతర ఉత్తర్వులు  

సెక్షన్‌–89 కిందే తొలుత విచారణ జరపాలని కోరిన ఏపీ 

దీనికింద ‘ప్రాజెక్టులవారీ’గా కేటాయింపులకు మాత్రమే అవకాశం 

ట్రిబ్యునల్‌ విచారణకు హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అందుబాటులో ఉన్న కృష్ణా జలాలు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పునఃపంపిణీకి మార్గం ఏర్పడింది. అలాగే తెలంగాణ కోరుతున్న విధంగా ఇప్పటికే వాడకంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టులకు సైతం నీటి కేటాయింపులను కృష్ణా ట్రిబ్యునల్‌ పరిశీలించేందుకు అవకా శం చిక్కింది. తొలుత అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం (ఐఎస్‌డబ్ల్యూడీఏ) 1956లోని సెక్షన్‌–3 కింద.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి 2023 అక్టోబర్‌ 6న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అదనపు రెఫరెన్స్‌ ప్రకారమే విచారణ నిర్వహించాలని జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2 నిర్ణయం తీసుకుంది. 

ఆ తర్వాతే ఏపీ కోరిన విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 కింద విచారణ నిర్వహిస్తామని తెలిపింది. తెలంగాణ దాఖలు చేసిన ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్‌ (ఐఏ)పై గురువారం ఢిల్లీలో విచారణ నిర్వహించిన ట్రిబ్యునల్‌ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్‌ విచా రణకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ట్రిబ్యు నల్‌ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.  

సమాంతర విచారణ జరపలేం 
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌– 89 కింద రెండు రాష్ట్రాల సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ముగియడంతో ట్రిబ్యునల్‌లో ఇకవిచారణను ప్రారంభించాల్సి ఉండగా, ఐఎస్‌డబ్ల్యూడీఏ చట్టంలోని సెక్షన్‌–3 కింద కేంద్రం అదనపు రెఫరెన్స్‌ జారీ చేసింది. దీంతో పాటు సెక్షన్‌–89 కింద కేంద్రం చేసిన రిఫరెన్స్‌ కూడా విచారణకు సిద్ధంగా ఉండగా, రెండింటినీ కలిపి విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ ఐఏ దాఖలు చేసింది. దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. 

మరోవైపు సెక్షన్‌–3 కింద కేంద్రం జారీ చేసిన అదనపు రెఫరెన్స్‌ను సవాలు చేస్తూ ఏపీ సుప్రీం కోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. అదనపు రెఫరెన్స్‌పై స్టే విధించాలని ఏపీ కోరగా, తమ తుది తీర్పునకు లోబడి ట్రిబ్యునల్‌ విచారణలో పాల్గొనవచ్చని ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు సూచించింది. కాగా కేంద్రం జారీ చేసిన రెండు రెఫరెన్స్‌ల్లో కొన్ని అంశాలు ఒకేలా ఉండగా, మరికొన్ని అంశాలు లేవు. 

రెండు రిఫరెన్స్‌లను కలిపి విచారించి తాము ఒకే తీర్పు జారీ చేస్తే భవిష్యత్తులో సుప్రీంకోర్టులో ఏపీకి అనుకూలంగా తుది తీర్పు వస్తే ఇబ్బందులొస్తాయని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తాజాగా అభిప్రాయపడింది. అదే జరిగితే తమ తీర్పులోని నిర్ణయాలు, నిర్థారణకు వచ్చిన అంశాలను రెండు రెఫరెన్స్‌ల వారీగా విభజించడం ఇబ్బందికరంగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రెండు రెఫరెన్స్‌లను కలిపి విచారించడం కంటే వేర్వేరుగా విచారించడమే మేలని తేల్చి చెప్పింది.  

తొలుత రెండో రిఫరెన్స్‌పై విచారణే సమంజసం 
అయితే తొలుత ఏ రెఫరెన్స్‌పై విచారణ జరపాలన్న ప్రశ్న తలెత్తింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి జారీ చేసిన రెండో రెఫరెన్స్‌పై తొలుత విచారణ నిర్వహించడమే సమంజసమని ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. ‘ప్రాజెక్టుల వారీ’గా నీటి కేటాయింపులు జరపాలంటూ మొదటి రెఫరెన్స్‌లో ఉన్న అంశంతో పాటు మరికొన్ని ఇతర అంశాలతో రెండో రెఫరెన్స్‌కు సంబంధం ఉండడమే దీనికి కారణమని స్పష్టం చేసింది. 

అయితే మొదటి రెఫరెన్స్‌ కింద నిర్వహించిన సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను రెండో రెఫరెన్స్‌పై విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవడానికి ట్రిబ్యునల్‌ అంగీకరించింది. అయితే, రెండో రెఫరెన్స్‌ కింద నిర్వహించిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను మొదటి రెఫరెన్స్‌ కింద పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. ఇక ఆయా డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై విచారణ సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 

రెండు రెఫరెన్స్‌ల కింద ఏపీ, తెలంగాణ దాఖలు చేసిన అభ్యర్థనలు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లను రెండు రెఫరెన్స్‌లకు ఉమ్మడి రికార్డులుగా పరిగణించాలని తెలంగాణ తన ఐఏలో కోరడంతో ట్రిబ్యునల్‌ ఈ మిశ్రమ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19 నుంచి 21 మధ్య నిర్వహిస్తామని తెలిపింది.  

సెక్షన్‌– 89 ఏమిటి? 
ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్‌–89లోని క్లాజు(ఏ) కింద బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువును కేంద్రం పొడిగించింది. గతంలో రాష్ట్రాల్లోని ‘ప్రాజెక్టుల వారీ’గా నిర్దిష్ట కేటాయింపులు జరిగి ఉండకపోతే ఇప్పుడు జరపాలని ఇందులో (తొలి రెఫరెన్స్‌) ట్రిబ్యునల్‌ను కోరింది. నీటి లభ్యత లేని సమయాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల విషయంలో అమలు చేయాల్సిన అపరేషన్స్‌ ప్రోటోకాల్స్‌ను సిద్ధం చేయాలని క్లాజు(బీ) కింద సూచించింది. ‘ప్రాజెక్టుల వారీ’గా అని సెక్షన్‌ 89 ఉండగా, అందులో ఏ  ప్రాజెక్టు లొస్తాయన్న అంశంపై స్పష్టత కొరవడింది. 

సెక్షన్‌ –3 ఏమిటి ? 
తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఐఎస్‌డబ్ల్యూడీఏ–1956లోని సెక్షన్‌–3 కింద జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌కు అదనపు రెఫరెన్స్‌ (మరిన్ని విధివిధానాలను) జారీ చేస్తూ 2023 అక్టోబర్‌ 6న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు సైతం ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇందులో కేంద్రం ఆదేశించింది. 

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌–89లోని క్లాజులు 89(ఏ), 89(బీ)లోని ‘ప్రాజెక్టుల వారీగా’ అనే పదానికి ఈ మేరకు విస్తృత అర్థాన్నిస్తూ గజిట్‌ నోటిఫికేషన్‌లో నిబంధన చేర్చింది. ఉమ్మడి ఏపీకి 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా ట్రిబ్యునల్‌–1 గంపగుత్తగా 811 టీఎంసీలను కేటాయించగా, 65 శాతం లభ్యతతో 1005 టీఎంసీలను కృష్ణా ట్రిబ్యునల్‌–2 కేటాయించింది. 

ట్రిబ్యునల్‌ కేటాయించిన నీళ్లతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నాగార్జునసాగర్‌ ఎగువన లభ్యతలోకి వచ్చిన కృష్ణా జలాలను కలిపి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని అదనపు రిఫరెన్స్‌లో కేంద్రం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే, దానికి ప్రతిగా నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ వెసులుబాటు కల్పించింది. 

ఈ 80 టీఎంసీల్లో ఏ రాష్ట్రం వాడుకోని 45 టీఎంసీలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉంది. ఈ 45 టీఎంసీలకు 1005 టీంఎసీలను కలిపి మొత్తం 1050 టీఎంసీలను సెక్షన్‌–3 కింద కృష్ణా ట్రిబ్యునల్‌–2 రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. తాజాగా సెక్షన్‌–3 కిందే తొలుత విచారణ జరపాలని ట్రిబ్యునల్‌ భావించడంతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చినట్టైంది. 

తెలంగాణలో ప్రతిపాదన/నిర్మాణం దశలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్‌ఎల్బీసీ, నారాయణపేట–కొడంగల్‌ వంటి ప్రాజెక్టులకు సైతం నీళ్లు కేటాయించే అంశాన్ని ట్రిబ్యునల్‌ పరిశీలించడానికి వీలు కలిగింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement