
సాక్షి, హైదరాబాద్: జల వివాదాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులు, సీనియర్ లాయర్లతో ఆయన చర్చించారు. గోదావరి, కృష్ణా జలాల వివాదంపై ఈనెల 15నుంచి విచారణ జరపనున్న నేపథ్యంలో న్యాయ బృందానికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట స్వయంగా హాజరవుతానని ఆయన చెప్పారు.
కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గత నెలలో మూడు రోజుల పాటు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు కేటాయించినా, ఏపీకి నష్టమేమీ ఉండదని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఏపీ బేసిన్ బయట ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏ మేరకు మళ్లిస్తోందని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ప్రశ్నించగా.. ఉమ్మడి రాష్ట్రంలో అంతర్గత ఏర్పాటు ద్వారా 512 టీఎంసీలను ఏపీ వినియోగించుకుంటోందని వైద్యనాథన్ వివరించారు.
ఇందులో ఇతర బేసిన్‌లకు 323 టీఎంసీలను మళ్లిస్తోందని, కృష్ణా బేసిన్‌లో 189 టీఎంసీలను మాత్రమే వినియోగిస్తోందని తెలిపారు. ఢిల్లీలో జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్.తాళపత్ర సభ్యులుగా ఉన్న ట్రిబ్యునల్ ఎదుట తన వాదనలు కొనసాగించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 15-17కు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున తుది వాదనలను వినగా, మిగతా వాదనలను ఏప్రిల్ 15 నుంచి చేపట్టే విచారణలో వింటామని ట్రిబ్యునల్ పేర్కొంది.