
విజిలెన్స్ విభాగం నివేదికను ఆమోదించిన కమిషన్
బరాజ్‌ల వైఫల్యానికి 40 మంది ఇంజనీర్లు,
అధికారులు బాధ్యులని తేల్చిన విజిలెన్స్
వారిపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలకు సిఫారసు
జాబితాలో కొందరు ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లతో పాటు మాజీ ఈఎన్‌సీలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సమర్పించిన నివేదికను రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ ఆమోదించింది. మేడిగడ్డ బరాజ్ కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీకైన విషయం తెలిసిందే. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించగా.. బరాజ్‌ల వైఫల్యానికి 40 మందికి పైగా ఇంజనీర్లు, ఇతర అధికారులు బాధ్యులని తేల్చుతూ, వారిపై క్రిమినల్ చర్యలతో పాటు శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది.
ఈ నివేదికను తాజాగా విజిలెన్స్ కమిషన్ ఆమోదించడంతో.. బాధ్యులైన ఇంజనీర్లు, ఇతర అధికారులపై చర్యలకు మార్గం సుగమమైంది. బాధ్యులైన అధికారుల జాబితాలో కొందరు ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లతో పాటు పలువురు మాజీ ఈఎన్‌సీల పేర్లు సైతం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిని రక్షించడానికి కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నతాధికార వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి.
ఓ అండ్ ఎం వైఫల్యంతోనే..
మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో సాంకేతిక తప్పిదాలు చోటుచేసుకున్నాయని, బరాజ్ పునాదుల కింద రక్షణగా ఉండే సికెంట్ పైల్స్ నిర్మాణంలో లోపాలతోనే 7వ బ్లాక్ కుంగిపోయిందని విజిలెన్స్ నిర్థారించినట్టు తెలిసింది. ఇక బరాజ్‌ల పనులు పూర్తికాక ముందే పూర్తైనట్టు నిర్మాణ సంస్థలకు వర్క్ కంప్లిషన్ సర్టిఫికెట్లు జారీ చేయడం నేరపూరిత చర్య అని పేర్కొంది.
బ్యాంక్ గ్యారెంటీల విడుదలలో సైతం నిర్మాణ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించేలా వ్యవహరించినట్టు తప్పుబట్టినట్లు సమాచారం. మేడిగడ్డ బరాజ్ 2019లో వినియోగంలోకి రాగా అదే ఏడాది వచ్చిన వరదల్లో బరాజ్ దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ బ్లాకులు (అప్రాన్) కొట్టుకుపోగా, మూడేళ్ల పాటు మరమ్మతులు నిర్వహించకుండా ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్ (ఓ అండ్ ఎం) విభాగం నిర్లక్ష్యం చేయడంతోనే 2022 అక్టోబర్‌లో బరాజ్ కుంగిందని పేర్కొంది.
ఏటా వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత బరాజ్ స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదికను తయారు చేయాల్సి ఉండగా, నాటి రామగుండం ఈఎన్‌సీ నిర్వహించలేదని తప్పుబట్టినట్లు తెలిసింది. నిర్మాణం పూర్తైన తర్వాత లోపలి భాగంలో షీట్‌పైల్స్‌తో ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్‌ను తొలగించక పోవడంతో నది సహజ ప్రవాహానికి అడ్డంకిగా మారి బరాజ్‌పై ఒత్తిడి పెంచిందని అభిప్రాయపడింది. ఈ విషయంలో నిర్మాణ సంస్థతో పాటు రామగుండం మాజీ ఈఎన్‌సీ, ఎస్‌ఈ, ఈఈలే బాధ్యులని తేల్చినట్లు తెలిసింది.
కాళేశ్వరం కమిషన్‌కు విజిలెన్స్ నివేదిక
బరాజ్‌ల వైఫల్యాలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తమ నివేదికను అందించింది. ఈ నెల 20 తర్వాత జస్టిస్ ఘోష్ హైదరాబాద్‌కు చేరుకుని సాక్షుల తుది దఫా క్రాస్ ఎగ్జామినేషన్ జరపనున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు లేఖ రాసి, క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాల్గొనడం ద్వారా కమిషన్‌కు సహకరించాలని కోరనున్నట్టు తెలిసింది.