
హెచ్‌సీయూ భూముల్ని కాజేయజూసిన బిల్లీ రావుతో ఒప్పందంలో ఆయనకు ముట్టాల్సిన కమీషన్ అది
విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపణ
కానీ కేటీఆర్ దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూకి చెందిన భూముల విలువ రూ. 5,200 కోట్లని మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారని.. కానీ అది భూముల విలువ కాదని.. కేటీఆర్ ముడుపుల పద్దు అని టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. ఐఎంజీ భారత్ సంస్థ ముసుగులో హెచ్‌సీయూ భూముల్ని కాజేయజూసిన బిల్లీరావుతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ రూ. 5,200 కోట్లని దుయ్యబట్టారు.
శుక్రవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఆమేర్‌అలీ ఖాన్, ఎమ్మెల్యే శ్రీగణేశ్, టీజీఎంఆర్‌ఈఐఎస్ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీలతో కలిసి మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు. బిల్లీరావుతో ఒప్పందం ప్రకారం హెచ్‌సీయూకు చెందిన 400 ఎకరాలను ఐఎంజీ భారత్‌కు అప్పగిస్తే ఆ భూమి విలువలో 30 శాతం కమీషన్ కేటీఆర్‌కు ముట్టేదన్నారు. అయితే కేటీఆర్ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.
టీడీపీ హయాంలో బిల్లీరావుకు ఇచి్చన ఆ భూముల్ని నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్ కాపాడితే సుప్రీంకోర్టులో పోరాడి ఆ భూముల్ని రేవంత్‌రెడ్డి వెనక్కి తెచ్చారని చెప్పారు. ‘రూ. 5,200 కోట్లు నీ ఫిగర్. మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి లేకుంటే ఆ భూములు బిల్లీరావుకు ఎప్పుడో వెళ్లిపోయేవి. ఇప్పుడు ఆ భూములు అభివృద్ధి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. ఇంత కడుపు మంట ఎందుకు? ఉద్యోగాలు రాకూడదా? రుణమాఫీ చేయకూడదా?’అని మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ హయా ంలో ప్రభుత్వ భూములు అమ్మినప్పుడు కోకాపేటలో ఎకరం రూ. 100 కోట్లు పలికితే.. ఐఎస్‌బీ, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, గూగుల్, యాక్సెంచర్ లాంటి సంస్థల సమీపంలో అమెరికన్ కాన్సులేట్‌కు ఆనుకొని ఉన్న భూమి రూ. 75 కోట్లు పలకదా? అని ప్రశ్నించారు.
ఆ భూమిపై రూ.10 వేల కోట్ల రుణ సేకరణ
రాష్ట్ర ప్రభుత్వం ఆ 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ఇచ్చి రూ. 10 వేల కోట్లను బాండ్ల రూపంలో ఐసీఐసీఐ నుంచి రుణం తీసుకుందని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ఆ మొత్తాన్ని రైతు రుణమాఫీ, సన్న ధాన్యానికి బోనస్ కోసం ఉపయోగించిందన్నారు. కేటీఆర్ ఆరోపించిన రూ. 175 కోట్ల విలువైన టెండర్లు పిలిచి కన్సల్టెన్సీకి ఇచ్చామని.. అందులో కుంభకోణం ఎక్కడిదన్నారు. ఆనవాయితీగా టెండర్లు పిలిచి అధికారికంగా వైట్‌మనీ ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీకి ఇచ్చామని చెప్పారు.
సీబీఐ విచారణ జరపాల్సింది కేటీఆర్‌పైనే
సీబీఐ విచారణ జరపాల్సింది నిజంగా కేటీఆర్ మీదేనని, దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కు వ ప్రజాధనాన్ని దోపిడీ చేసింది కేసీఆర్ కుటుంబమేనని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు.