
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాదాపు రూ.10వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందన్నారు. అటవీ భూమిని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ఆర్థిక నేరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కాం చేస్తున్నారు. వాల్టా, ఫారెస్ట్ యాక్ట్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించింది. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త గోల్‌మాల్‌కు తెర తీసింది.
15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 3D మంత్రాను పెట్టుకున్నారు. HCUలో పర్యావరణ విధ్వంసం, హననం జరుగుతోంది. ఐఎంజీ కుంభకోణంపై ఆనాడు 2014 వరకు ప్రభుత్వం, తర్వాత బీఆర్‌ఎస్ కొట్లాడింది. ఈ భూముల వెనుక రూ.10వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. HCU చుట్టూ ఉన్న 400 ఎకరాలు అటవీ భూమి ఉంది. అది అటవీ భూమి అని సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు.. అన్ని రాష్ట్రాల హై కోర్టులకు ఇచ్చింది. 1980 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అటవీ భూమి తాకట్టు పెట్టడానికి అమ్మేందుకు ప్రభుత్వానికి హక్కు ఉండదు.
పోడు యాక్ట్ ప్రకారం ఆది అటవీ భూమి అని రేవంత్ రెడ్డికి ముందే తెలుసు. భూమిని అమ్మడానికి ముఖ్యమంత్రి దగ్గరికి బీజేపీ ఎంపీ ఒక ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ బ్రోకర్‌ను తెచ్చారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్త ద్వారా చట్టాలను, ఆర్‌బీఐ నిబంధనలను తుంగలో తొక్కారు. మ్యుటేషన్ కాలేదని ప్రభుత్వమే అంటుంది. TGIIC 400 ఎకరాలకు యజమాని కాదు. కేవలం ఒక GO ఆధారంగా TGIIC యజమాని అని ప్రభుత్వం చెబుతోంది. తనది కానీ భూమిని TGIIC తాకట్టు పెట్టే కుట్ర చేసింది.
బ్రోకర్ ద్వారా కుమ్మకై లోన్..
400 ఎకరాలకు యాజమాన్య పత్రాలు లేవు.. రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు. 26.6.2024 GO-54 ఒక్కటే ఉంది.. తప్ప ఏమీలేదు. 400 ఎకరాలకు కమిషన్ టైటిల్ కూడా లేదు. కంచెలో గజం విలువ 26900 వందలు ఉంది.. 400 ఎకరాలకు 5239 కోట్ల విలువ మాత్రమే. అక్కడ ఎకరాకు 75 కోట్లకు అమ్మడానికి రెవెన్యూ శాఖ GO విడుదల చేసింది. రూ.5239 కోట్ల విలువైన భూమిని 30,000 వేల కోట్లుగా చిత్రీకరించారు. ప్రభుత్వం.. బ్రోకర్ ద్వారా కుమ్మకై బ్యాంకులో లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.75 కోట్లు అని బ్యాంకుల దగ్గరకు పోయి.. 15కోట్లకు అమ్మే కుట్ర చేశారు. రూ.169 కోట్లు బ్రోకర్‌కు కమీషన్ ఇచ్చారు. కోకాపేటలో భూములను చూపించి 75 కోట్లు ఎకరా అని ప్రభుత్వమే ధర చూపించారు. ఐదు నెలల్లో వ్యాల్యువేషన్ రివైజ్ చేసి 52 కోట్లకు తగ్గించారు. మళ్ళీ మూడోసారి 42 కోట్లకు కుదించారు. రూ.30వేల కోట్లు అని మొదట చెప్పి 16వేల కోట్లకు తగ్గించారు. ఢిల్లీ బ్రోకర్‌కు తనకా పెట్టే ప్రయత్నం చేశారు’ అని విమర్శలు చేశారు.

బీకర్ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్థను ఏ బేసిస్ ప్రకారం ఎంపిక చేశారు?. బీజేపీ ఎంపీ చెప్పారని వడ్డీకి పావుచెరుగా అమ్మే కుట్ర చేశారు. నేను ఉరికే ఆరోపణలు చెయ్యడం లేదు.. దీన్ని వదిలిపెట్టను. RBI గవర్నర్, సెబీ, SFIO, సెంట్రల్ విజిలెన్స్, CBI, మా పార్టీ తరపున ఫిర్యాదు చేయబోతున్నాం. బీజేపీ ఎంపీ పేరు తర్వాత ఎపిసోడ్‌లో బయటపెడతాం. 10 వేల కోట్లకు ప్రభుత్వానిది కానీ భూమిపై ICICI బ్యాంకు లోన్ ఇచ్చారు.
కేంద్రం స్పందించాలి..
భూమిని ఫీల్డ్ పై చూడకుండా ICICI బ్యాంక్ ఇచ్చింది. 10వేల కోట్లు ఎక్కడికి పోయాయో ఎవరికి తెలియదు. రైతుభరోసా అన్నారు అది ఇవ్వలేదు. నేను రాసిన లేఖలపై కేంద్రం స్పందించకపోతే ఊరుకోం. ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా జరిగింది అనుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే విచారణ మొదలు పెట్టాలి. సెబీ, సెంట్రల్ విజిలెన్స్, CBI విచారణ మొదలు పెట్టాలి. భూమిని చూడకుండా 10వేల కోట్లు లోన్ బ్యాంకు ఎలా ఇస్తుంది. HMDA భూములు 60వేల కోట్లు అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం. అవసరం అయితే ప్రధాని కలుస్తాం.. లోక్ సభలో లేవనెత్తుతాం’ అని కామెంట్స్ చేశారు.