
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎంపీలు నేడు సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు భేటీ అవుతున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నివాసంలో వీరంతా సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా హెచ్‌సీయూ భూముల వివాదంపై ఎంపీలు చర్చించనున్నారు.
అంతకుముందు బీజేపీ, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు బీఆర్‌ఎస్ పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల, మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది.
జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?
ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌ను కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు.