
సాక్షి, మేడ్చల్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మేడ్చల్‌లోని ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటి వద్ద పోలీసులు మోహరించి.. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను శాడిస్ట్ అంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు ఈరోజు.. ఈటల ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీగా సంఖ్యలో ఈటల ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే భారీ సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు ఈటల ఇంటికి చేరుకున్నాయి.
అనంతరం, బీజేపీ ఎంపీ ఈటల మాట్లాడుతూ..‘కలెక్టరేట్ల ముట్టడి, కార్యాలయాల ముట్టడి చూశాం.. ఇళ్లను ముట్టడిస్తారా?. కుటుంబాలు ఉంటాయి.. ఇళ్లను ముట్టడించడం పద్ధతి కాదు. అనుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయి ఉంటే హైదరాబాద్‌లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందో చూడాలి. పాలకుడు అనే వాడు ఏదైనా నిర్మించే ప్రయత్నం చేస్తారు.. డిస్‌స్ట్రక్షన్ చేస్తారా?. 50 ఏళ్లుగా మొదటిసారి చూస్తున్నాను. డిస్‌స్ట్రక్షన్ చేస్తున్న మొట్టమొదటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసులకు భయపడేది లేదు.. అధికారం లేనినాడే కొట్లాడిన పార్టీ బీజేపీ. ఎవరు మోసం చేసే వాళ్లు, ఎవరు సంస్కార హీనులో ప్రజలే చెబుతారు. కుక్కలా అరిస్తే ఏం వస్తుంది?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.