రాజకీయ పార్టీల విమర్శలు, సవాళ్లు.. రైతుల ఆందోళనలతో ప్రకంపనలు
గడపగడపకు వెళ్లి రుణమాఫీ బండారం బయటపెడతామన్న బీఆర్‌ఎస్
రుణమాఫీ బోగస్ అంటూ రాహుల్‌గాం«దీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖలు
వంద శాతం రుణమాఫీ ఎక్కడ జరిగిందంటూ బీజేపీ ఫైర్
23న రైతుదీక్ష చేపడతానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటన
తమకు మాఫీ కాలేదంటూ రైతుల నుంచి పోటెత్తుతున్న ఫిర్యాదులు
వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని వ్యవసాయ శాఖ యంత్రాంగం
రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణాల మాఫీకి కొర్రీ ఎందుకంటున్న అన్నదాతలు
అదనపు సొమ్ము చెల్లించేందుకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల రుణమాఫీ వ్యవహారం రోజురోజుకు మరింత రచ్చరేపుతోంది. ఓవైపు రాజకీయ పార్టీల మధ్య రగడకు.. మరోవైపు రైతుల ఆందోళనలు, ఆవేదనకు వేదికగా మారుతోంది. ‘రుణం తీరలే’ శీర్షికన ‘సాక్షి’ రాసిన కథనంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు, బీజేపీ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు రుణమాఫీ డొల్లతనాన్ని ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్రంలో గడపగడపకు వెళ్లి రుణమాఫీ బండారాన్ని బయటపెడతామని బీఆర్‌ఎస్ ప్రకటించింది. మరోవైపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీలకు రుణమాఫీ బోగస్ అంటూ లేఖలు రాశారు. ఇక రుణమాఫీ కోసం 23న రైతుదీక్ష చేపట్టనున్నట్టు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు.
తమకు రుణమాఫీ కాలేదంటూ పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. రుణమాఫీ కాని అర్హులకు న్యాయం చేస్తామని, ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తామని ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రుణమాఫీ వ్యవహారం మున్ముందు మరిన్ని ప్రకంపనలు సృష్టించే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
చెప్పిందొకటి.. చేసిందొకటి!
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) గణాంకాల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 నాటికి రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు రూ.64,940 కోట్లు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన డిసెంబర్ నాటికి ఇచ్చిన రుణాలు రూ.49,500 కోట్లు. మొదట్లో రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్ల వరకు అవసరమని కాంగ్రెస్ సర్కారు ప్రాథమిక అంచనా వేసింది. అనంతరం రూ.31 వేల కోట్లు అవుతాయని కేబినెట్ సమావేశంలో తేల్చారు.
ఈ మేరకు సీఎం, మంత్రులు స్వయంగా ప్రకటనలు చేశారు. కానీ బడ్జెట్‌లో మాత్రం రుణమాఫీకి రూ.26 వేల కోట్లే కేటాయించారు. చివరికి మూడు విడతల్లో కలిపి రుణమాఫీకి ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమే. దీనితో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ అందలేదన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.లక్ష మాఫీ కోసం 36.68 లక్షల మంది రైతుల లెక్కతేలితే.. ప్రస్తుతం రూ.2 లక్షల మాఫీ కేవలం 22.37 లక్షల మంది రైతులకే అందడం విస్మయం కలిగించింది. రైతుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పెద్ద ఎత్తున ఫిర్యాదులు.. రోడ్డెక్కుతున్న అన్నదాతలు
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు తమకు రుణమాఫీ జరగలేదంటూ ఆందోళనలు చేపడుతున్నారు. వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పీఎం కిసాన్ నిబంధనలు, ఇతర షరతులు తమకు వర్తించకపోయినా రుణమాఫీ జరగపోవడానికి కారణాలేమిటో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి.
ఆదివారం మధ్యాహ్నం వరకు అందిన వివరాల మేరకు.. 58 వేల మందికిపైగా రైతుల నుంచి ఫిర్యాదులు అందాయని వ్యవసాయశాఖ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదుల వివరాలను తెప్పించుకున్నామని.. వాటిని సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నాయి.
కామారెడ్డి జిల్లా వజ్జపల్లి తండాలో రుణమాఫీ కాలేదంటూ రైతుల నిరసన
తలపట్టుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు
ఇప్పటివరకు 58వేల ఫిర్యాదులు అందాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నా.. ఈ సంఖ్య లక్షల్లో ఉంటుందని రైతు సంఘాల నేతలు, నిపుణులు చెప్తున్నారు. లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని.. చాలా మంది లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని అంటున్నారు. చాలా మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపిస్తున్నారని.. లిఖితపూర్వక ఫిర్యాదులు తీసుకోవడానికి అంగీకరించడం లేదని చెప్తున్నారు.
అయితే ప్రభుత్వ నిర్ణయాలు ఒకవైపు, రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి మరోవైపు.. ఏం చేయాలో అర్థంగాక తల పట్టుకుంటున్నామని వ్యవసాయ అధికారులు వాపోతున్నారు. లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగకపోవటానికి కారణమేంటో, ఏ ప్రాతిపదికన అర్హులను నిర్ధారించారో, ఏ కొలమానాలతో అనర్హులను తేల్చారో తమకు కూడా అంతు పట్టడం లేదని అంటున్నారు.
అదనపు మొత్తం కట్టేదెలా?
ప్రస్తుతం రూ.2 లక్షల వరకు రుణమున్న రైతులకే రుణమాఫీ వర్తింపజేశామని.. రూ.2 లక్షలపైన రుణాలున్నవారు అదనంగా ఉన్న సొమ్మును చెల్లించాకే మాఫీ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదాహరణకు ఒక రైతు బ్యాంకులో రూ.3 లక్షల రుణం తీసుకుంటే.. రైతు ముందుగానే రూ.లక్ష బ్యాంకులో జమ చేయాలి, ఆ తర్వాతే మిగతా రూ.2 లక్షల మాఫీని ప్రభుత్వం వర్తింపజేస్తుంది. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి నిబంధన పెట్టాల్సిన అవసరమేమిటని నిలదీస్తున్నారు. ఆ అదనపు రుణసొమ్మును చెల్లించడానికి ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం నేరుగా మాఫీ వర్తింపజేస్తే.. మిగతా రుణాన్ని కొంతకాలం తర్వాతైనా తీర్చుకునే వెసులుబాటు వస్తుందని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నారు.
మాఫీగాక.. కొత్తరుణాలు రాక..
బ్యాంకులు ఇప్పటివరకు రుణమాఫీ జరిగిన రైతులకు.. వానాకాలం పంటల కోసం రుణాలు ఇస్తున్నాయి. కానీ మాఫీ జరగని రైతులకు మాత్రం రుణాలు ఇవ్వడం లేదు. దీంతో కీలకమైన వ్యవసాయ సీజన్‌లో పంట రుణాలు దొరక్క ప్రైవేట్ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు.
అర్హులైతే మాఫీ చేస్తాం: తుమ్మల
బ్యాంకుల నుంచి తమకు వివరాలు అందిన ప్రతి రైతుకు అర్హతను బట్టి మాఫీ చేసే బాధ్యత తమదేనని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీచేశారు. రూ.2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరిగిన రైతులందరికీ మాఫీ చేశామని.. కుటుంబ నిర్ధారణకాని వారికి ఆ ప్రక్రియ పూర్తిచేసి మాఫీ సొమ్ము జమ చేస్తామని తెలిపారు.
రూ.2 లక్షలకుపైన రుణాలున్న వారికి మాత్రం.. అదనంగా ఉన్న మొత్తాన్ని చెల్లించేస్తే, అర్హతను బట్టి వారికి మాఫీ చేస్తామన్నారు. బ్యాంకర్ల నుంచి డేటా తప్పుగా వచ్చిన రైతుల వివరాలనూ సేకరిస్తున్నామని వివరించారు. రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరామన్నారు.
‘‘రూ.లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి, సగం మందికి కూడా చేయని ఒకరు.. అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రాల్లోనూ రుణమాఫీ ఆలోచనే చేయని మరొకరు.. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, ఇంకా ఆ ప్రక్రియ కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. వారు ఇకనైనా హుందాగా ప్రవర్తించి ప్రజల్లో స్థాయిని కాపాడుకుంటారని ఆశిస్తున్నా..’’ అని తుమ్మల పేర్కొన్నారు.
తనిఖీ చేసేదెప్పుడు.. మాఫీ అయ్యేదెప్పుడు?
అర్హత ఉండీ రుణమాఫీ కాని రైతుల విషయంలో తాము బాధ్యత తీసుకొని మాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల చెప్తున్నారు. కానీ తొలి విడత నుంచే ఎందరో రైతులు ఫిర్యాదు చేసినా మాఫీ చేయలేదని రైతు సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. అధికారులు ఇంటింటికీ తిరిగి కుటుంబాలను తేల్చి, అర్హులను గుర్తించి రుణమాఫీ చేస్తామని అంటున్నారని.. అదంతా ఇప్పటికిప్పుడు సాధ్యమా అని నిలదీస్తున్నారు.
లక్షలాది మంది రైతుల ఇళ్లకు వెళ్లడం, వారి డేటాను తనిఖీ చేయడం, కచ్చితత్వాన్ని నిర్దేశించుకోవడానికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద పూర్తి సమాచారం ఉందని ప్రభుత్వం చెప్పిందని.. ఇంటింటికీ తిరిగి సర్వే చేయడం ఏమిటో అంతుబట్టట్లేదని అంటున్నారు. మాఫీ వ్యవహారాన్ని, విమర్శలను కొన్నాళ్లపాటు పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment