
హైదరాబాద్,సాక్షి: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు.
వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebrations) కోసం బీఆర్‌ఎస్ (brs) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.
ఈ తరుణంలో కేటీఆర్ బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ,హెచ్‌సీయూ భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
‘25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండవ తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్. అందుకే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది. ఈ సారి డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెడుతున్నాం. అన్ని జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నెలకో కార్యక్రమం జిల్లాల్లో నిర్వహిస్తాం.
అమెరికా దుందుడుకు నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు నష్టపోయారు. మోదీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా మౌనం ఎందుకు?. తర్వాత దెబ్బ తెలంగాణపై పడబోతుంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు ఉంటాయి. వాటిపై ఎఫెక్ట్ ఉండబోతుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు BRS పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల,మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది.
జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?
ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు.