చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలిపారు
అన్నదాతలను నిండా ముంచి రైతు పండుగ చేస్తున్నారు
జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘మీ కమలం నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసికట్టుగా పని చేస్తున్నారు. చోటేభాయ్‌కు వ్యూహకర్తలుగా, కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పనిచేస్తున్నారు. చీకటి రాజకీయ ప్రయోజ నాల కోసం చేయి కలిపి చోటేభాయ్‌తో కలిసి పనిచేస్తున్నారు’అని బీజేపీ నేతలను ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కలిసి కట్టుగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్య లపై కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా విమర్శలు చేశారు. ‘రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరు మెదపరు. రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు. హైడ్రా మంచిదని, మూసీ కావాలని అంటారు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారు. తెలంగాణలో కాంగ్రెస్ చేతిలోనే కమలం ఉంది. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. సమస్యలపై నిలదీస్తే నిర్బంధం విధిస్తూ.. బడి పిల్లలకు బాసటగా నిలిచిన వారిపై కేసులు పెడుతున్నారు.
గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, పిల్లల మరణాలపై గళమెత్తితే గొంతు నొక్కుతున్నారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు’ అని కేటీఆర్ విమర్శించారు. ‘రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరిట పంగనామాలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా రైతు పండుగలు చేస్తోంది. రైతులను నిండా ముంచి విజయోత్సవాలు చేసుకుంటోంది. కాకిలెక్కలు, కల్లబొల్లి కబుర్లతో ఎల్లకాలం వెళ్లదీయాలనే ప్రభుత్వ కుట్రలు ఎంతోకాలం సాగవు’అని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో జరిగిన మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని నివాళి అర్పించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో జరిగే దీక్షాదివస్ ఏర్పాట్లను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి కేటీఆర్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment