జన్వాడలోని ఇంట్లో కేటీఆర్ బావమరిది దావత్‌పై పోలీసుల దాడి
అది రేవ్ పార్టీ అంటూ విస్తృతంగా ప్రచారం
కేటీఆర్, బీఆర్‌ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలు
అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారంటూ పోలీసుల కేసులు
అటు రాయదుర్గంలోని కేటీఆర్ బావమరుదుల నివాసాల్లో సోదాలు
కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్‌ఎస్ నేతల మండిపాటు
అది రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ దావత్ అని స్పష్టం చేసిన కేటీఆర్
కొత్తగా ఇల్లు కట్టుకుని దీపావళికి దావత్ ఇచ్చారు
కుటుంబ సభ్యులు, పిల్లలు ఉంటే.. రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తారా?
ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని చెప్తూనే.. కేసు ఎలా పెడతారని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: జన్వాడలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన విందు రాజకీయ రంగు పులుముకుంది. పోలీసుల దాడులు.. రేవ్ పార్టీ జరిగిందనే ప్రచారం.. అనుమతి లేకుండా మద్యంతో పార్టీ నిర్వహించారంటూ కేసులు.. ఒకరికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిందనే వార్తలు.. రాయదుర్గంలోని కేటీఆర్ బావమరుదుల నివాసాల్లో పోలీసుల సోదాలు.. అధికార, విపక్షాల నేతల విమర్శలతో ఆదివారం పొద్దంతా హైడ్రామా చోటు చేసుకుంది.
శనివారం అర్ధరాత్రి రాజ్ పాకాల ఇంటిపై ఎక్సైజ్, ఎస్‌వోటీ పోలీసులు చేసిన దాడిలో విదేశీ మద్యం సీసాలు దొరకడం, విందులో పాల్గొన్న ఒకరు డ్రగ్స్ తీసుకుని ఉన్నట్టు తేలడంతో.. కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో రేవ్ పార్టీ జరిగిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయగా.. విందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
తమను రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులతో కుట్రలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కొత్తగా ఇల్లు కట్టుకుని, దీపావళికి దావత్ చేసుకుంటే.. రేవ్ పార్టీ అని ప్రచారం చేశారని, అక్కడ తన బావమరిది తల్లి, చిన్న పిల్లలు కూడా ఉన్నారని వివరించారు. అసలు డ్రగ్స్ ఏమీ దొరకలేదని చెప్తూనే.. కేసులు ఎలా పెట్టారని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment