బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందంటూ తప్పుడు ప్రచారం
నిజానికి కాంగ్రెస్సే ఆ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంది
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
బీఆర్‌ఎస్‌లో చేరిన స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనమవుతుందని, చీకట్లో ఒప్పందాలు చేసుకున్నామని ప్రచారం చేస్తున్నారు. మాకు వాళ్లతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజులుగా జైల్లో ఉండేదా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కవిత సోదరుడిగా న్యాయవాదులతో మాట్లాడేందుకు, అక్కడి విషయాలు తెలుసుకునేందుకు ఢిల్లీకి వెళ్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందాల వల్లే ఆ పార్టీ నేత ఒక్కరు కూడా జైల్లో లేడు.
కేసీఆర్ టీఆర్‌ఎస్ పెట్టిన నాటి నుంచి పార్టీ మాయం కావాలని కోరుకుంటున్నవారు అనేకమంది ఉన్నారు. అలాంటి వారే కనుమరుగయ్యారు తప్ప 24 ఏళ్లుగా పార్టీ విజయవంతంగా కొనసాగుతోంది. మరో 50 ఏళ్లు కూడా కొనసాగేలా బలంగా తయారు చేసుకుందాం’అని మాజీమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మంచి రేవంత్ ఖాతాలో..చెడు కేసీఆర్ ఖాతాలో
‘మంచిని తన ఖాతాలో వేసుకుని, చెడును మాత్రం కేసీఆర్ ఖాతాలో వేయడం, కేసీఆర్ చేసిన పనులను తన క్రెడిట్‌గా చెప్పుకోవడం రేవంత్‌కు అలవాటు అయింది. కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టును తామే కట్టినట్లుగా రిబ్బన్ కటింగ్‌లు చేస్తున్నారు. కానీ ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీల విషయంలో రేవంత్ మాట తప్పిన తీరును యువత, రైతులు, మహిళలు, వృద్ధులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.
పీఆర్ స్టంట్లతో ప్రజలను రేవంత్ ఎక్కువకాలం గందరగోళానికి గురి చేయలేరు. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడతారు. మనం కూడా వాటిని ఉప ఎన్నికల్లో ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదు. కొందరు సీనియర్ నాయకులకు పార్టీ మేలు చేసినా వెళ్లిపోయారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నిక రావడం ఖాయం..’అని కేటీఆర్ అన్నారు.
పాలనలో రేవంత్ సోదరుల జోక్యం
‘ప్రజలు ఎన్నుకుంటే పదవుల్లోకి వచ్చిన మాపై కుటుంబ పాలన అని నిందలు వేశారు. తప్పుడు ప్రచారం చేశారు. కానీ రేవంత్ సోదరులు ఏ హోదాలో పాలనలో జోక్యం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నిండా ఆయన సోదరులే కనిపిస్తున్నారు. ఓ తమ్మునితో రేవంత్ అమెరికాలో ఒప్పందం చేసుకుంటే, మరో తమ్ముడు ఆ్రస్టేలియాలో పర్యటిస్తున్నాడు. రేవంత్ బావమరిది సృజన్ కంపెనీకి రూ.1,000 కోట్ల టెండరు పనులు అప్పగించారు..’అని కేటీఆర్ ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో బస్సుల్లో తన్నుకున్నారా?
‘బస్సులో ఎల్లిపాయలు ఏరితే తప్పా అని మంత్రి సీతక్క అంటోంది. తప్పని మేం అనలే.. కుట్లు, అల్లికలు కూడా తప్పుకాదు. అందుకే బస్సులు పెట్టారని మాకు తెలియదు. ఎక్కువ బస్సులు లేక తన్నుకుంటున్నరని అన్నాం. మనిషికో బస్సు పెట్టండి. అందులో కుట్లు, అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు చేయండి. కేసీఆర్ పాలనలో బస్సుల్లో తన్నుకున్నారా?.’అని మాజీమంత్రి ప్రశ్నించారు.
స్వాతంత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే
మహోన్నత వ్యక్తుల పోరాటం, త్యాగాలు, పట్టుదల ఫలితంగా దేశానికి వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని కేటీఆర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత స్వాతంత్య్ర పోరాటం కుల, మత, వర్గాలన్నింటికీ అతీతంగా జాతి యావత్తును ఒక్క తాటిపై నిలిపిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment