తెలంగాణలో వైఫల్యంతోనే హరియాణాలో కాంగ్రెస్‌ ఓటమి | Ktr comments over congress | Sakshi
Sakshi News home page

తెలంగాణలో వైఫల్యంతోనే హరియాణాలో కాంగ్రెస్‌ ఓటమి

Published Wed, Oct 9 2024 4:30 AM | Last Updated on Wed, Oct 9 2024 4:30 AM

Ktr comments over congress

డొల్ల గ్యారంటీల గారడీని ప్రజలు తిరస్కరించారు: కేటీఆర్‌  

కాంగ్రెస్‌ చేసిన మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు 

బీజేపీని ఢీకొనే సత్తా ప్రాంతీయ పార్టీలకే ఉందని స్పష్టమైంది 

2029లో కేంద్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరిట డొల్ల హామీలతో ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్‌.. హరియాణాలోనూ ఏడు గ్యారంటీల పేరిట మభ్యపెట్టాలని చూసింది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లలో గ్యారంటీల పేరిట కాంగ్రెస్‌ చేసిన మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీనికి హరియాణాలో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించడమే నిదర్శనం..’’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పేర్కొన్నారు. 

ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా గ్యారంటీలు ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్‌.. చివరికి బొక్క బోర్లా పడిందని విమర్శించారు. కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డులు చిత్తు కాగితంలా మారాయని, అలవి కాని హామీలతో గద్దెనెక్కాలని భావించిన కాంగ్రె స్‌కు జనం కర్రు కాల్చి వాత పెట్టారని పేర్కొ న్నారు.

తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రజల కు కాంగ్రెస్‌ గ్యారంటీల డొల్లతనం పూర్తిగా అర్థమైందని.. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలే హరియాణాలో ఓటమికి దారితీశాయని విమ ర్శించారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరుగు తున్న ప్రస్తుత సమయంలో ప్రజల నుంచి వాస్తవాలు దాచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 

బీజేపీని ఢీకొట్టే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది 
కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరు ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తోందని.. రాహుల్‌ బలహీన నాయక త్వం కూడా కాంగ్రెస్‌ ఓటమికి కారణ మని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీని ఢీకొని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందన్నారు. 

ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి 2029లో కేంద్రంలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌కు మెజారిటీ సాధ్యం కాదని.. బలమైన ప్రాంతీయ పార్టీలే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని, సమగ్రతను, సెక్యులరిజాన్ని కాపాడాలని కోరుకునే మేధావులు, ప్రజలంతా ప్రాంతీయ పార్టీలకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. 

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్‌రాజ్, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే వ్యవహారాలు నడుస్తున్నా రాహుల్‌ గాంధీ చూసీ చూడనట్టు వ్యవహరించిన తీరును దేశం మొత్తం గమనిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డులకు ప్రజాక్షేత్రంలో కాలం చెల్లిందనే విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్‌ గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. 

పండుగ పూట పస్తులు 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ దండగగా మారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు తప్పడం లేదని.. ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు లేవని కేటీఆర్‌ ఆరోపించారు. పంచాయతీ, మున్సిపల్‌ కారి్మకులు, ఆస్పత్రుల సిబ్బంది, హాస్టల్‌ వర్కర్స్, గెస్ట్‌ లెక్చరర్స్‌ మొదలుకుని ప్రతీ ప్రభుత్వ శాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. 

ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని.. దసరా పండుగ వచి్చనా చిరుద్యోగుల చేతిలో చిల్లిగవ్వ లేదని విమర్శించారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోతే.. చిరుద్యోగుల బతుకు బండి ఎలా సాగుతుందని కేటీఆర్‌ ప్రశ్నించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement