చర్చకు రా.. తేల్చుకుందాం!: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Fires On KCR | Sakshi
Sakshi News home page

చర్చకు రా.. తేల్చుకుందాం!: సీఎం రేవంత్‌

Jun 25 2025 1:12 AM | Updated on Jun 25 2025 1:12 AM

CM Revanth Reddy Fires On KCR

రైతుభరోసా విజయోత్సవ సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. వేదికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క

గోదావరి– బనకచర్లపై తప్పెవరిదో అసెంబ్లీలో మాట్లాడదాం

తారీఖు చెప్పి స్పీకర్‌కు లేఖ రాయి.. నేను పూర్తి వివరాలతో వస్తా

రైతుభరోసా విజయోత్సవ సభలో కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌  

పదేళ్లు అధికారంలో ఉండి నదీ జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు 

గోదావరి జలాలు సీమకు తరలించమని చంద్రబాబుకు చెప్పింది నువ్వు కాదా? 

అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం.. అసెంబ్లీకి రా.. నీ సంగతి చెపుతా అన్న సీఎం

సాక్షి, హైదరాబాద్‌:  పదేళ్లు అధికారంలో కొనసాగి కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్‌.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తనపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీలో చర్చకు రావా లని సవాల్‌ విసిరారు. 

‘నేను చంద్రబాబుతో కలిసిపోయి గోదావరి– బనకచర్లకు నీళ్లిస్తున్నానని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నావు. దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో స్పీకర్‌కు లేఖ రాయి. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత–చేవెళ్లను తరలించి లక్ష కోట్లు దోచుకున్నది ఎవరో చర్చిద్దాం..’ అని అన్నారు. 

కేసీఆర్‌ సూచనలతో హరీశ్‌రావు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో మంగళవారం సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో రేవంత్‌ మాట్లాడారు.  

నీ దిక్కుమాలిన సూచన వల్లే ఈ దరిద్రం 
‘చంద్రబాబును కలిసి గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నయ్‌.. రాయలసీమకు తరలించమని 2016లో చెప్పింది నువ్వు కాదా? నువ్వు చెప్పినంకనే కదా ఉమాభారతి ఆదేశాల మేరకు చంద్రబాబు హంద్రీనీవా నుంచి 400 టీఎంసీలు తరలించడానికి 2016లో జీవో ఇచ్చిండు. 

2018లో వ్యాప్కోస్‌ సంస్థను నియమించి, 400 టీఎంసీలు హంద్రీనీవా నుంచి బనకచర్లకు తరలించడానికి ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చింది నిజం కాదా? నువ్వు ఇచ్చిన దిక్కుమాలిన సూచనతోనే ఈ దరిద్రం దాపురించింది? తెలంగాణను ఎడారిగా మార్చేలా వందలాది టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు. నేను తప్పు చేసినట్టు ఒక్క ఆధారం చూపిస్తే దేనికైనా సిద్ధం. 

నేను మొత్తం వివరాలతో వస్తా? నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీలో చర్చకు పెట్టించే బాధ్యత శ్రీధర్‌బాబు తీసుకుంటరు. నువ్వు, నేను చర్చ చేద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నవా?..’ అని సీఎం నిలదీశారు.  

ఆ ప్రాజెక్టులన్నీ ఎందుకు ఆగిపోయాయి? 
‘బీఆర్‌ఎస్‌ పదేళ్ల వాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో గ్రామాల్లో, రచ్చబండల దగ్గర రైతులు చర్చ పెట్టాలి. వ్యవసాయాన్ని పండుగ చేయాలని 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంటుపై తొలి సంతకం చేశారు. 

రుణమాఫీ అమలు చేశారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్‌ హయాంలోనే మొదలయ్యాయి. కానీ కేసీఆర్‌ కుట్రలు, కుతంత్రాలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. 

కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినయ్‌. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? కేసీఆర్‌ కాంట్రాక్టర్లకు రూ.2 లక్షల కోట్లు చెల్లించిండు. 

మరి రూ.1,000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా, రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు, రూ.6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ఎందుకు ఆగిపోయాయి? దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి..ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న నువ్వు.. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా? కృష్ణా జలాల్లో 68 శాతం కేటాయింపులు తెలంగాణలో, 32 శాతం కేటాయింపులు ఆంధ్రలో ఉండాలి. ఈ లెక్కన 555 టీఎంసీల వాటా తెలంగాణకు రావాలి. కానీ 290 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, 519 టీఎంసీలు ఆంధ్రకు ఇచ్చి తెలంగాణ రైతాంగానికి మరణశాసనం రాసిందే నువ్వు.   

అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం.. 
మేం తెలంగాణకు న్యాయం కోసం పోరాడుతున్నం. గోదావరి–బనకచర్లకు అనుమతులు ఇవ్వవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రిని కోరాం. ప్రాజెక్టులను పడావు పెట్టి మీరు ఫాంహౌస్‌లో పడుకుంటే.. మేం వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం. అప్పుడంటే జానారెడ్డి నీతో ఎందుకని ఊరుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీకి రా. నీ సంగతి చెపుతా..’ అని రేవంత్‌ అన్నారు. 

మీకు ఫామ్‌హౌస్‌లు ఎట్లా వచ్చినయ్‌? 
‘కేసీఆర్‌ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్‌ బారిన పడేసి మాకు అప్పగించారు. కోకాపేట భూములు, ఓఆర్‌ఆర్‌ అమ్మి రైతుబంధు ఇచ్చారు. రైతుల పేరుతో అప్పులు చేసిండు.. దోపిడీ చేసిండు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడేంటి? మొయినాబాద్‌లో హరీశ్‌రావుకు, జన్వాడలో కేటీఆర్‌కు, గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఫామ్‌హౌస్‌లు ఎట్లా వచ్చినయ్‌? రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చి, పదేళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులయ్యారు. 

మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. మీరు పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు చెప్పు. కాళేశ్వరం పేరుతో మీరు రూ.లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం 

మా తొలి ప్రాధాన్యత రైతులే 
ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులుం. ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు. ఆనాడు కేసీఆర్‌ రైతుబందు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7,625 కోట్ల నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. 

కేసీఆర్‌ ఆనాడు వరి వద్దంటే మేం వరి పండించండి అని చెప్పాం. చివరి గింజ వరకు కొనడమే కాదు.. మద్దతు ధరతో పాటు బోనస్‌ కూడా ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు మాట్లాడారు. 

మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, వాకిటి శ్రీహరి, విప్‌ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement