Loan waiver
-
రైతు సాయానికి కోతలు పెట్టే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతు బంధుపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు, కత్తిరింపులు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో శనివారం రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చను ప్రారంభిస్తూ.. ఈ పథకంపై సభ్యులు సూచనలు చేయాలని, దీని ఆధారంగా విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.కేటీఆర్ ఈ చర్చలో మాట్లాడారు. ‘‘రైతు భరోసాకు రూ.23 వేల కోట్లు అవసరమైతే రూ.15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం కోత విధించడానికే. రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను ప్రజల ముందుంచాలి. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలుదార్లకు కూడా రైతు భరోసా ఇస్తారా?’’అని ప్రశ్నించారు. ప్రభుత్వం యాసంగి, వానాకాలం కలిపి ఒక్కో రైతుకు రూ.17,500 చొప్పున... రైతులందరికీ కలిపి రూ.26,775 కోట్లు బాకీ పడిందని చెప్పారు. గెలిచిన వెంటనే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలిరైతులు పచ్చగా ఉంటే కొంతమంది కళ్లు మండుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు తీసుకుంటున్న వారిలో 98 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. 91.33 శాతం లబ్ధిదారులు ఐదెకరాల కంటే తక్కువ ఉన్నవారేనని.. 5 నుంచి 10 ఎకరాలు 7.28 శాతం మందికే ఉన్నాయని, 10 ఎకరాలు పైబడి ఉన్నవాళ్లు 1.39 శాతమేనని పేర్కొన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమేనని చెప్పారు.రైతుబంధు నిధుల్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయని వివరించారు. గిరిజనులకు చెందిన 4.5 లక్షల ఆర్వోఎఫ్ఆర్ భూములకు, పత్తి, కంది ఉద్యానవనాలకు రైతు భరోసా ఇస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగే వరకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా.. ‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు కాంగ్రెస్ సర్కారు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. రూ.40 వేల కోట్లు అవుతుందని సీఎం అన్నారు. కేబినెట్లో రూ.31 వేల కోట్లు అన్నారు. తీరా బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించారు. ఆఖరుకు రూ.17,934 కోట్లే మాఫీ చేశారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా 24 గంటల ఉచిత విద్యుత్ అందించినట్టు లాక్బుక్కుల్లో చూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.నల్లగొండకు నీళ్లు ఇచ్చిన అంశంపై ఆ జిల్లాలోనే తేల్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి వలసలు ఆపామని చెప్పారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే స్నానానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని గతంలో కాంగ్రెస్ పారీ్టపై సీఎం రేవంత్ చేసిన విమర్శలను కేటీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్ తెలిపారు.రుణమాఫీపై చర్చిద్దాం.. రెడీనా?సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ ఇచ్చిన మాట మేరకు పెట్టుబడి సాయం పెంచి ఇవ్వాల్సిందేసాక్షి, హైదరాబాద్: మొత్తం రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని... దీనిపై ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అయినా, సొంత నియోజకవర్గం కొడంగల్లోనైనా రైతుల ముందు చర్చిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమయ్యారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చే యడం చేతకాదని చెప్పకనే చెప్పారు. రూ.49,500 కోట్ల రుణమాఫీ రూ.26 వేల కోట్లతో ఎలా అయిందో రేవంత్ చెప్పలేకపోయారు. కేవలం 25శాతం రుణమాఫీ చేసి 100శాతం అయిందని చెబుతున్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు ఎవరికి ఇచ్చారో అడిగితే ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. కంది, పత్తి, మొక్కజొన్నల రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ రూ.12 వేల కోట్లు మాత్రమే చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి రైతుబంధుకు పాన్‌కార్డు ఆప్షన్ పెడితే 1.30 కోట్ల మంది నష్టపోతారు. ఐటీ ఉన్న వారందరికీ రైతుబంధు కట్ చేస్తే ఇక మిగిలేదెవరు? మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అయింది. రుణమాఫీ, రైతుబంధు ఏమైందని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రజలంతా నిలదీయాలి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు. రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నీడలా వెంటాడుతూనే ఉంటాం. రైతు ఆత్మహత్యలపై అన్నీ అబద్ధాలే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పే దుస్థితికి దిగజారింది. కేంద్ర నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం... 2014లో 1,348 రైతు ఆత్మహత్యలు జరిగితే... రైతు బంధు పథకం ప్రారంభమైన తర్వాత 2022 నాటికి కేవలం 178 మందికే తగ్గింది. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతోనే ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలోనే తెలంగాణ ప్రాంతం రైతు ఆత్మహత్యల్లో తొలి రెండు స్థానాల్లో ఉండేది. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి చెప్పే ప్రతీ మాటా నమ్మాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ఇచ్చేదెప్పుడో! సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తామంటున్న ప్రభుత్వం ఏ సంక్రాంతికో చెప్పడం లేదు. రైతు భరోసాపై కాలయాపన కోసమే కమిటీ వేశారు. ప్రజలు కోరుకున్నది పేర్ల మార్పిడి కాదు, గుణాత్మకమైన మార్పు. మేం సీఎం రేవంత్‌రెడ్డి కేసులకు, ఈడీ, మోదీలకు భయపడబోం’’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రుణమాఫీపై సీఎం రేవంత్‌తో చర్చకు సిద్ధం: హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తాను చర్చకు సిద్ధంగా ఉన్ననాని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు సవాల్ విసిరారు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారని, అబద్ధాల్లో ఆయన గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కుతారని ఎద్దేవా చేశారు హరీష్.రుణమాఫీ, రైతు భరోసా, బోనస్‌లపై క్లారిటీ ఇవ్వలేదని, ఏడాది దాటినా రుణమాఫీ పూర్తి చేయలేదని విమర్శించారు. ఇక సంద్య థియేటర్ ఘటన చాలా బాధాకరమన్న హరీష్.. వాంకిడి హాస్టల్లో విషాహారం తిని బాలిక చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో బాలిక కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదన్నారు. ఒక వ్యక్తి సీఎం సోదరుడి కారణంగా చనిపోతే చర్యలు మాత్రం శూన్యమని మండిపడ్డారు హరీష్.సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు -
సంక్రాంతి తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో ‘రైతు భరోసా’ ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారంటీ అమలై తీరుతుందని చెప్పారు. రైతు భరోసా విధివిధానాల పై మంత్రివర్గ ఉపసంఘం వేశామని, త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని ఖరారు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించామని, రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామని అన్నారు. మారీచుల తరహాలో మారువేషంలో వచ్చి అబద్ధాలు చెప్పే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దని రైతులను కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. మరో నాలుగేళ్లకు అవసరమైన శక్తి లభించింది ‘2023 వానాకాలం రైతుబంధును నాటి సీఎం కేసీఆర్ ఎగ్గొట్టారు. మేము అధికారంలోకి రాగానే రూ.7,625 కోట్లు రైతుబంధు కింద చెల్లించాం. శనివారం పాలమూరులో జరిగిన రైతు పండుగలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు తరలివచ్చి మా ఏడాది పాలన బాగుందంటూ ఆశీర్వదించారు. తద్వారా మిగిలిన నాలుగేళ్లు ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన ఇంధనశక్తి మాకు లభించింది. తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2న కేంద్రంలోని నాటి యూపీఏ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ.69 వేల కోట్ల అప్పులతో ఇచ్చింది. పదేళ్ల కేసీఆర్ పాలన అనంతరం 2023 డిసెంబర్ 7న రూ.7 లక్షల కోట్ల అప్పులతో మా ప్రభుత్వం ఏర్పడింది. అసలు, వడ్డీలు కలిపి ప్రతినెలా రూ.6,500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితిలో మేం అధికారం చేపట్టాం. రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పులు కలిగి ఉన్నట్టు నాటి సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్లు ఎన్నడూ ప్రజలకు చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చాక డిసెంబర్ 9న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను వివరించాం..’ అని సీఎం చెప్పారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో దానం నాగేందర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు.. ‘రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీల ను అమలు చేస్తున్నాం. రైతును రాజు చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర, ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణమాఫీని 100 శాతం పూర్తి చేశాం. బ్యాంకర్లు మాకు ఇచ్చిన రూ.2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేశాం. ఏదైనా కారణాలతో బ్యాంకర్ల నుంచి వివరాలు అందక ఎవరిదైనా రుణమాఫీ జరగకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిశీలించి రుణమాఫీ చేస్తాం. రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదు. పంట పొలాలను తనఖా పెట్టి వ్యవసాయేతర అవసరాలకు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సైతం బ్యాంకర్లు పంట రుణాలుగా చూపించడంతోనే గతంలో రూ.31 వేల కోట్ల పంట రుణాలున్నట్టు చెప్పాం. తప్పుడు సమాచారమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించడంతో బ్యాంకులు వివరాలను సరిచేసి ఇచ్చాయి. మేము అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు సంబంధించిన రూ.17,869 కోట్ల రుణాలు మాఫీ చేశాం. నాలుగో విడతగా శనివారం మహబూబ్‌నగర్ సభలో రూ.2,747 కోట్ల రుణాలు మాఫీ చేశాం. మొత్తం 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616 కోట్ల రుణమాఫీ పూర్తైంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో రుణమాఫీ జరగలేదు. ఇది గొప్ప రికార్డు..’ అని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్ర ధాన్యమే పేదలకు ఇస్తాం.. ‘సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లింపు యాసంగి పంటకు సైతం కొనసాగిస్తాం. ఇప్పటివరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇక్కడ పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతాం. ప్రభుత్వ కార్యక్రమాలను మీడియా మరింతగా రైతులకు చేరవేయాలి. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలనలో సైతం తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. గుజరాత్లో మధ్య నిషేధం ఉందని బీజేపీ అంటోంది. కావాలంటే ఇక్కడి నుంచి గుజరాత్‌కు మీడియాను తీసుకెళ్లి ఏయే బ్రాండ్లు దొరుకుతున్నాయో చూపిస్తా. కేంద్రంలో మోదీ ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో మేమిచ్చిన హామీలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం..’ అని సీఎం చెప్పారు. విలేకరుల సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మందుల సామ్యేల్, దానం నాగేందర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, శ్రీగణేష్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ రుణమాఫీ రూ.3,331 కోట్లే..‘రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఏక మొత్తంగా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారు. రెండో పర్యాయంలో అధికారంలోకి వచ్చాక తొలి నాలుగున్నరేళ్లు రుణమాఫీని పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి వచ్చిన రూ.11 వేల కోట్లతో రుణమాఫీ చేశారు. ఆ నాలుగున్నరేళ్ల కాలానికి రైతులు వడ్డీల కింద రూ.8,578.97 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. వడ్డీలు పోగా రెండో పర్యాయంలో బీఆర్ఎస్ సర్కారు చేసిన వాస్తవ రుణమాఫీ రూ.3,331 కోట్లు మాత్రమే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
నాలుగో విడత రుణమాఫీకి మరో రూ. 2,747.67 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచి్చన రూ. 2 లక్షల రుణమాఫీ హామీ అమలు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేసింది. ఇప్పటివరకు మూడు విడతల్లో 22.37 లక్షల మంది రైతుల రుణాల కింద రూ. 17,933 కోట్లు బ్యాంకులకు చెల్లించిన ప్రభుత్వం, శనివారం పాలమూరు వేదికగా నాలుగో విడత రూ. 2,747.67 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెక్కును రైతులకు అందజేశారు. తద్వారా ఇప్పటివరకు రూ.20.68 వేల కోట్లు రుణమాఫీ కింద బ్యాంకులకు విడుదల చేసినట్లయింది. శనివారం పాలమూరులో ప్రకటించిన రూ. 2,747 కోట్ల మొత్తాన్ని 3,13,897 మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. తద్వారా నాలుగు విడతల్లో రాష్ట్రంలోని 25 లక్షల పైచిలుకు రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ జరిగినట్టు. భవిష్యత్తులో రూ.2 లక్షలపైన ఉన్నవారికి.. రూ. 2 లక్షలపైన రుణాలు పొందిన రైతులకు కూడా రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని గతంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే రూ. 2 లక్షలపైన ఉన్న రుణం మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించిన వారికి ఈ రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులు లెక్కలు తీశారు. శనివారం సీఎం ప్రకటించిన రూ. 2,747 కోట్ల మొత్తాన్ని రేషన్‌కార్డులు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నవాళ్లు, బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు, పేర్లలో తప్పులు దొర్లిన 3,13,897 మంది రైతుల రుణ ఖాతాలకు జమచేస్తారు. తరువాత రూ. 2లక్షల పైన అప్పులున్న రైతులకు జమచేయాల్సి ఉంది. -
రుణమాఫీపై సిట్టింగ్ జడ్జికి నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తాము ఇచ్చిన హామీ అమలు చేశామని చెప్పే ధైర్యముంటే.. రుణమాఫీ విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జికి నివేదిక సమర్పించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు మధ్య నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో సైతం హామీలు, సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ధ్వజమెత్తారు. ఏడాది తిరక్కుండానే రూ.లక్ష కోట్ల అప్పులు మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తే, కాంగ్రెస్ ఏడాది తిరగకుండానే రూ.లక్ష కోట్ల అప్పులు చేసిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ‘ప్రచారం ఫుల్ పనులు మాత్రం నిల్’అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు గాను 22 లక్షల మందికే రుణమాఫీ చేసి, మొత్తం చేశామంటూ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి, మహిళలకు సాయం ఏదీ?కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, ప్రియాంక, రాహుల్.. డిక్లరేషన్లు, గ్యారంటీల పేరిట ఇచ్చిన అనేక హామీల అమలు ఏమైందని కేంద్రమంత్రి ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణలలో మాదిరిగానే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో సైతం మభ్యపెట్టే హామీలు, గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా హామీలను ఎప్పటిలోగా, ఏవిధంగా అమలు చేస్తారనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం కరువవుతోందని అన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, వివాహం చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం హామీలు ఏమయ్యాయని కిషన్‌రెడ్డి నిలదీశారు. -
కాంగ్రెసోళ్లను ప్రజలే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరపడ్డాయి
సాక్షి, ఆదిలాబాద్: ప్రజలే మర్లవడి కాంగ్రెసోళ్లను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. గరీబులు, రైతులు, విద్యార్థులతోపాటు తనపై కేసులు పెడతానంటే ఊరుకొనేవారెవరూ లేరన్నారు. ఈ ప్రభుత్వం ఎవరినీ వదలకుండా అందరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు.ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమా ఇచ్చే దాకా.. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే వరకు పోరాడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ఆదిలాబాద్ నుంచే అగ్గి అంటుకుందని.. ఈ సర్కారుపై మూడేళ్లు కొట్లాడేది ఉందని.. అందుకు పోరాట తోవ చూపారన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు పోరుబాట సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రజలు కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా? రుణమాఫీ కాలేదని రైతులు ప్రభుత్వ దిష్టి»ొమ్మలు దహనం చేస్తే పోలీసులు వారిని జైల్లో పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వంద రోజుల్లో అన్నీ చేస్తామని మాట తప్పిన వారిని జైల్లో పెట్టాలా లేక పేద ప్రజలను జైల్లో పెట్టాలా అని ప్రశ్నించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు వరుసపెట్టి కేసులు పెడితే ఒక్క కాంగ్రెసోడైనా మిగులుతాడా అంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీకి శక్తినిస్తే రైతుల పక్షాన పోరాడతామని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అంటే.. భారత రాష్ట్ర సమితే కాకుండా భారత రైతు సమితి కూడా అని ఆయన పేర్కొన్నారు. అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలి.. ‘పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు చట్టబద్ధంగా నడుచుకోవాలి. లేదంటే మా టైమ్ వ స్తది. ఎవరైనా ఎక్కువ చేస్తే పేర్లు రాసి పెట్టుకోండి. మిత్తితో సహా చెల్లిస్తాం. పెద్ద పెద్దోళ్లను చూసినం.. చంద్రబాబుతోనే కొట్లాడినం.. ఈ చిట్టినాయుడు ఎంత? అతన్ని చూసి మనం భయపడాల్నా?’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అక్కడి బంధువులు, శ్రేయోభిలాషులకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసిన మోసాల గురించి వివరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మన పత్తికి సైతం గుజరాత్ ధర ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్ కంటే బీజేపీ నేతలు మరింత ప్ర మాదకారులని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబా ద్ ఎమ్మెల్యే, ఎంపీ బీజేపీ నేతలేనని వివరించా రు. ‘గుజరాత్లో పత్తి క్వింటాల్‌కు రూ. 8,800 ఇ స్తున్నారు. అక్కడికన్నా తెలంగాణలో పత్తి నాణ్య మైనదని పరిశ్రమ వర్గాల వారే నేను మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. అందుకే గుజరాత్లో ఇచ్చినట్టే పత్తికి ఇక్కడ కూడా ధర ఇవ్వాలని బీజేపీపై కొట్లాడాలి’అని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ రెండు దొందూ దొందేనన్నారు. పీఎం మోదీ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోసగిస్తే.. రేవంత్‌రెడ్డి రూ. 15 వేలు రైతుల ఖాతాల్లో వేస్తానని వేయలేదని విమర్శించారు. ఈ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాడి కౌసిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, లోలం శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు. -
ఖరీఫ్ సీజన్ రైతు భరోసా లేదు!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసిందని, పంట దిగుబడులు కూడా వచ్చేశాయన్నారు. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందన్నారు.కమిటీ నివేదికకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రబీ సీజన్ నుంచి రైతుభరోసా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్‌లోని రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా అమలు చేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత డిసెంబర్ నుంచి ఈ పథకం అమలవుతుందన్నారు. గత ప్రభుత్వం పంటలు సాగు చేయని, పంట యోగ్యత లేని భూములకు రైతుబంధు కింద డబ్బులు ఇచ్చిందని, దాదాపు రూ.25 వేల కోట్లు ఇలాంటి భూములకు ఇచ్చినట్లు తుమ్మల వ్యాఖ్యానించారు. చిన్న పొరపాట్లతో..: దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతురుణ మాఫీ చేయలేదని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏకంగా రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. సాంకేతిక కారణాలు, చిన్నపాటి పొరపాట్లతో దాదాపు 3 లక్షల మందికి మాఫీ కాలేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించారని, వారికి డిసెంబర్‌లోగా రూ.2,500 కోట్ల మేర రుణమాఫీ చేయనున్నట్లు వివరించారు. రెండు లక్షల రూపాయలకు మించి రుణాలు తీసుకున్న వారికీ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా రూ.2 లక్షలకు మించి ఉన్న బకాయిని చెల్లించిన రైతులకు మాఫీ చేసేందుకు విడతల వారీగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. రాష్ట్రంలో పంటబీమా అమలు లేదని, త్వరలో ప్రతి రైతుకూ ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుందని, త్వరలో బీమా కంపెనీలను టెండర్లకు పిలుస్తామన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, కానీ కేంద్రం మాత్రం 25 శాతానికి మించి కోటా కొనుగోలు చేయడం లేదని చెప్పారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగానికి లబ్ధి కలిగించే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిందని, రెండేళ్లపాటు ఈ కమిషన్‌కు అవకాశం ఉందన్నారు. మెరుగైన అంశాలతో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
27 రోజుల్లో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం... ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు రుణమాఫీ చేసేందుకు పైసల్లేవుగానీ.. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారా అని సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే కమీషన్లు రావని.. అదే మూసీ ప్రాజెక్టు అయితే రూ.30 వేల కోట్లు దోచుకోవచ్చని ప్లాన్ వేశారని ఆరోపించారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, పెద్ద లూటిఫికేషన్ అని విమర్శించారు. పార్టీ పెద్దలకు కమీషన్లు పంపి కుర్చీని కాపాడుకోవటం కోసమే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ‘‘పైసలు కావాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చందాలు వేసుకుని ఇస్తాం. రాహుల్‌గాంధీకి పంపి కుర్చీని కాపాడుకో.. అంతేకానీ పేదల జోలికి రావొద్దు. నీ కళ్లు చల్లబడతాయంటే మా ఇళ్లు కూల్చు.కానీ పేదల ఇళ్లను కూలగొట్టవద్దు. ముందు రెడ్డికుంటలోని మీ ఇంటిని, దుర్గంచెరువులోని మీ అన్న ఇంటిని కూల్చు’’ అని రేవంత్‌కు సవాల్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘సిగ్గు, శరం ఉన్నవాళ్లకు మనం మర్యాద ఇవ్వాలి. ఈ సీఎంకు అలాంటివి ఏమీ లేవు. కేసీఆర్ రుణమాఫీ చేసిన వాళ్లను కూడా మళ్లీ రుణం తెచ్చుకోండి మాఫీ చేస్తాం అని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి చెప్పారు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానన్నారు. పది నెలలైంది. ఇప్పటికీ పైసా రుణం మాఫీ కాలేదు. ఎన్నికల ముందు ఎక్కడ దేవుడు కనిపిస్తే.. ఆ దేవుళ్ల మీద ఒట్లు వేశారు. ప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేశారు. చిట్టినాయుడు కట్టేటోడు కాదు.. కూలగొట్టేటోడు. రైతుబంధు లేదు, రైతు భరోసా లేదు. పెద్ద మనుషులు, మహిళలకు పింఛన్లు అన్నారు. లేవు. మహిళలకు బతుకమ్మ చీరలు వచ్చాయా? పండుగ పండుగలా ఉందా? ఇందిరమ్మ ఇళ్లు కడతా అంటే ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఇళ్లు కూలగొడుతున్నారు. ఇలా అన్ని వర్గాలను మోసం చేశారు.బ్రదర్స్‌కు దోచిపెట్టేందుకే..మేం ఏడేళ్లపాటు కష్టపడి ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి 14 వేల ఎకరాలు సేకరించాం. ఈ సర్కారు ఫోర్త్ సిటీ కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదు. ఫార్మా సిటీ భూములనే ఫోర్త్ సిటీ కోసం వాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ఫోర్త్ సిటీ కాదు. రేవంత్‌రెడ్డి ఫోర్ బ్రదర్స్ సిటీ. వాళ్లు రైతులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు. ఫార్మా సిటీ రద్దు కాలేదని కోర్టుకు చెప్తున్నారు. బయట మాత్రం ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు ప్రయత్నం చేస్తున్నారు. ఫోర్త్ సిటీ పేరుతో చేస్తున్న డ్రామాలపై రైతులు కోర్టుల్లో కేసులు వేయాలి. వారికి బీఆర్ఎస్ లీగల్‌సెల్ అండగా నిలుస్తుంది. రీజనల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే అలా వ్యవహరిస్తున్నారు. రేవంత్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్నారే తప్ప.. సీఎంలా పనిచేయటం లేదు.ఎవరినీ వదిలిపెట్టేది లేదు..మూసీ గబ్బు అంతా సీఎం, మంత్రుల మెదళ్లలోనే ఉంది. వారి గబ్బు మాటలను ఇక వదిలేది లేదు. నాపై అడ్డగోలు గా మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టను. క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తా. గతంలో ప్రతి పక్షంలో ఉన్నారని ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోలే దు. ఇకపై వారిని వదిలేది లేదు. మోదీనే ఏం చేసుకుంటావో చేసుకో అన్నోళ్లం. ఈ చిట్టి నాయుడు ఎంత?’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.సీఎంకు బతుకమ్మ అంటే గిట్టదా?‘‘ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి సీఎంకు మనసు రావడం లేదా? పండుగ పూట కూడా పల్లె లను పరిశుభ్రంగా ఉంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కాచెల్లెళ్లు బతుకమ్మ ఆడుకో వాలా? పల్లెల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపు రించాయి. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం?బతుకమ్మ చీరలను రద్దు చేశారు. బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?’’ – ‘ఎక్స్’లో కేటీఆర్ విమర్శలు -
నిత్యం ప్రజాక్షేత్రంలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని భారత్ రాష్ట్ర సమితి భావిస్తోంది. ప్రజా సమస్యలే ఎజెండాగా అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రైతులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాన్ని బలంగా ఎత్తిచూపుతున్న బీఆర్ఎస్.. ఇతర వైఫల్యాలపైనా ఫోకస్ పెంచాలనుకుంటోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు తదితర అంశాలపై వివిధ రూపాల్లో నిరసన తెలిపిన పార్టీ.. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ పేరిట నిర్వాసితులను బలవంతంగా తరలించడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయిన నేపథ్యంలో, ఆరు గ్యారంటీల అమలు కోసం ఒత్తిడి పెంచే యోచనలో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఉన్నారు. దసరా పండుగ తర్వాత ఆరు గ్యారంటీల అమలు కోసం పార్టీ పరంగా చేపట్టాల్సిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై కసరత్తు జరుగుతోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగం, ఆరు గ్యారంటీల లబ్ధిదారులను భాగస్వాములను వీటిల్లో భాగస్వాముల్ని చేయాలని భావిస్తున్నారు.బీసీ డిక్లరేషన్ అమలు కోసం .. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీల కోసం కాంగ్రెస్ ప్రకటించిన ‘కామారెడ్డి డిక్లరేషన్’ అమలుకు నవంబర్ 10వ తేదీని గడువుగా బీఆర్ఎస్ విధించింది. ఆ లోపు కాంగ్రెస్ స్పందించని పక్షంలో బీసీ వర్గాలను కలుపుకొని ఉద్యమించాలని భావిస్తోంది. బీసీ సామాజికవర్గానికి 42 రిజర్వేషన్ల పెంపు, బీసీ కులగణన వంటి అంశాలపై ఇప్పటికే బీఆర్ఎస్ బీసీ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీల రిజర్వేషన్లపై అధ్యయనం కోసం ఇటీవల తమిళనాడులో రెండురోజుల పర్యటనకు వెళ్లిన వచ్చిన బృందం త్వరలో కేసీఆర్‌కు నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను మరింత గట్టిగా విన్పించనుంది. మరోవైపు కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన ఉద్యమ రూపాలపైనా బీసీ నేతల భేటీల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ‘జాట్లు’ తమ హక్కుల కోసం చేపట్టిన నిరసన రూపాలను అధ్యయనం చేస్తున్నారు. ఢిల్లీ శివార్లలో నెలల తరబడి రైతులు చేసిన ఉద్యమ తీరుతెన్నులు కూడా పరిశీలిస్తున్నారు. స్థానిక సమస్యలపైనా..స్థానిక సమస్యలపైనా ఆందోళనలు నిర్వ హించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఫల్యాలను ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తోంది. పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజ కవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నేతలను భాగస్వాము లుగా చేస్తూ క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపయోగపడ తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణాలు, పంచాయతీలకు నిధుల కొరత, గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, పారిశుధ్య లోపం, ప్రజారోగ్యం, వైద్యం, అధికారుల పనితీరు, అధికార పార్టీ దాడులు, అక్రమ కేసులు వంటి అనేక అంశాలపై స్థానికంగా ఉద్యమించాలని నేతలకు పార్టీ సూచిస్తోంది. జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్ అఫీసులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ధర్నాలు తదితర రూపాల్లో నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలకు చెప్తోంది. స్థానికంగా జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొనేలా చూడటం ద్వారా పార్టీ యంత్రాంగంలో ఉత్సాహం నింపాలని భావిస్తోంది. -
‘మాఫీ’ కోసం సెల్ఫీ..
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా(కే) రైతులు రుణ మాఫీకోసం వినూత్న నిరసన చేపట్టారు. రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని సోమవారం రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో సెల్ఫీ దిగి సీఎం కార్యాలయానికి పంపించారు. తమకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, రైతు భరోసా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖరా(కే)లో 190 మంది వరకు చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో 50 మంది రైతులకే రుణమాఫీ అయిందని, మిగతా 140 మంది అర్హులైనా రుణమాఫీ కాలేదని వాపోయారు. రుణమాఫీకి అన్ని అర్హతలు ఉన్నా అమలు కాకపోవడంతో పొలం పనులు విడిచి రోజుల తరబడి బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని తెలిపారు. రైతు భరోసా ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. -
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల రాస్తారోకో
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని కామారెడ్డి– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు. గంటసేపు రైతులు బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు రైతుబంధు వేయలేదన్నారు. అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు విజయ డెయిరీ నుంచి నాలుగు నెలల బిల్లులు రావాలని, వెంటనే వాటిని రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తాడ్వాయి, గాంధారి ఎస్సైలు తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని రైతుల ఆందోళనను విరమింపజేశారు. అనంతరం రైతులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ రహిమొద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. -
ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కోరుతూ ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన రైతులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ‘రుణమాఫీ కోరుతూ చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన రైతులను బుధవారం రాత్రి నుంచే అక్రమంగా అరెస్టు చేసి దొంగలు, ఉగ్రవాదుల్లా పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణం.పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్రమంగా నిర్బంధించిన రైతులను పోలీసులు బేషరతుగా విడుదల చేయాలి. రుణమాఫీపై హామీ ఇచ్చి మోసం చేసినందునే రైతులు ఆందోళన చేస్తున్నారు. పారీ్టలతో సంబంధం లేకుండా రైతులు సంఘటితమై చేస్తున్న ఉద్యమం ఆగదు. దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదు’ అని కేటీఆర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శిశు మరణాలపై కమిటీ వేస్తాం గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. సమస్యపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై బీఆర్ఎస్ తరపున నిజ నిర్ధారణ కమిటీ నియమిస్తామన్నారు. ఈ కమిటీ గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి, ప్రజలకు నివేదిస్తుందని చెప్పారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం స్వీకరించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమీక్ష చేసి వైద్యంలో నాణ్యత పెరిగేలా చూడాలన్నారు. గాంధీ ఆసుపత్రిలో అనుభవం కలిగిన వైద్యులను బదిలీ చేయడం వల్లే చికిత్సకు ఆటంకం ఏర్పడిందన్నారు. -
రేషన్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డుల అంశం ప్రజల్లో పరేషాన్ రేపుతోంది. లక్షలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన అంశాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. రేషన్‌కార్డులకు కోత పెడతారా? పెళ్లిళ్లు అయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలన్నింటికీ కొత్తకార్డులు జారీ చేస్తారా? పాతవాటిలో మార్పు చేర్పులపై ఏం చేస్తారు? రేషన్‌కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందడం ఎలా? అర్హతల పునః సమీక్ష అంటే ఎలాంటి నిబంధనలు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు వెల్లడించారు. రేషన్‌కార్డులను విభజించి, స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్‌కార్డులు ఇస్తామని.. రేషన్‌కార్డులకు అర్హతలపై పునః సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు.. ప్రస్తుతం మంత్రులు వెల్లడించిన అంశాలు.. ఇటీవలి పరిణామాలను బేరీజు వేసుకుంటూ.. రేషన్‌కార్డుల అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. రేషన్ కార్డుల్లో కోత పడుతుందా? అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే అర్హు లను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా కార్డుల కోసం ఏడెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల డేటాపై స్పష్టత లేదు. దీంతో మరోసారి ప్రజాపాలన నిర్వహించి రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలేమిటనే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. వార్షికాదాయం ప్రాతిపదికన జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్‌కార్డులకే పరిమితి అమలు చేస్తారా? పాతకార్డులకూ వర్తింపజేస్తూ.. అధికాదాయం ఉన్నవారికి రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్‌కార్డులు జారీ చేశారని, అధికాదాయం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్నవారికి కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్డులకు కోతపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందేది ఎలా? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికమని సీఎం రేవంత్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్‌కార్డు సమస్యలతో చాలా మంది రైతులకు ‘రుణమాఫీ’ అందలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనివారూ ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ రేషన్‌కార్డుల లింకు ఉండనుంది. దీనివల్ల ఉన్న రేషన్‌కార్డులు రద్దయినా, కొత్త రేషన్‌కార్డులు మంజూరుకాకున్నా.. తమకు పథకాలు అందేది ఎలాగని పేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని.. అర్హతకోసం పరిగణించే వార్షికాదాయ పరిమితిని దానికి అనుగుణంగా పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రేషన్‌కార్డులను విభజించి బియ్యం వద్దనుకునే వారికి స్మార్ట్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్న మంత్రుల ప్రకటనతోనూ సందేహాలు మొదలయ్యాయి. అలా స్మార్ట్ హెల్త్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం రేషన్‌కార్డుల అంశంపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
17ను విమోచన దినంగా నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష సమావేశం డిమాండ్ చేసింది. రైతు భరోసా, రుణ మాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న బీజేఎల్పీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేసింది. గురువారం అసెంబ్లీ ఆవరణలోని బీజేఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీలు డా.కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, అర్వింద్, డీకే అరుణ, గోడెం నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, డా.పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పాటిల్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అర్హులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని, అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందించాలని, ‘హైడ్రా’నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే డిమాండ్లను ఈ సమావేశం ఫ్రభుత్వం ఎదుట పెట్టింది. దీంతో పాటు పార్టీపరంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, దేవాలయ భూముల రక్షణకు పోరాడాలని, బీజేపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వరద నిధుల వ్యయంపై శ్వేతపత్రం: ఏలేటి డిమాండ్ వరద నష్టానికి సంబంధించి ఇప్పటివరకు చేసి న పనులు, ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరద సహాయంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేఎల్పీ భేటీ అనంతరం ఎంపీ అ ర్వింద్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వరద సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. కాగా, అరికెపూడి గాం«దీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వలసదారుడు, పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హైడ్రా అధికారులు పాతబస్తీకి వెళ్లడానికి భయపడుతున్నారని, మూసీ నది పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను దమ్ముంటే కూల్చాలని అన్నారు. -
త్యాగమనే మాటే కేసీఆర్‌కు నప్పదు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధనలో అసలైన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని.. అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా అవమానించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. త్యాగమనే పదం కొండా లక్ష్మణ్‌కే చెల్లుతుందని, కేసీఆర్ త్యాగాలు చేశానంటూ చెప్పుకోవడం ఏమా త్రం సరికాదని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని లలితకళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌కు నీడనిచ్చిన వ్యక్తి కొండా లక్ష్మణ్. ఆయన సొంత ఇల్లు (జలదృశ్యం)ను కేసీఆర్‌కు ఇస్తే.. కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా కేసీఆర్ వ్యవహరించారు. ఉద్యమం పేరుతో రాజకీయ రాజీనామాలు చేశారు. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ అనే మార్గంలో భారీగా లబ్ధి పొందాడు. ఉద్యమం కోసం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌కు ఎలాంటి ఆస్తులు లేవు. కానీ కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం టీవీ చానళ్లు, పత్రికలు, బిల్డింగులు, ఫాంహౌజ్‌లు, ఇతర ఆస్తులు సంపాదించుకున్నారు. రాష్ట్రంలోనే చేనేత టెక్నాలజీ చదువు కోసం.. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎనాడూ చేనేతల అభివృద్ధి కోసం ఆలోచించలేదు. రాష్ట్ర విద్యార్థులు హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో చేరాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వెంకటగిరికో, ఒడిశా రాష్ట్రానికో పోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ అంశం నా దృష్టికి వచ్చింది. వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లకు వినతిపత్రం ఇచ్చాం. వారు సానుకూలంగా స్పందించి ఐఐహెచ్‌టీని మంజూరు చేశారు. వెంటనే దీనిని అందుబాటులోకి వచ్చేలా అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో తరగతులు ప్రారంభిస్తున్నా.. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేస్తాం. చేనేతల సంక్షేమం కోసం.. చేనేత ఉత్పత్తులంటే గత ప్రభుత్వంలో సినీతారల తళుకుబెళుకులే ఉండేవి. ఒక్క చేనేత కార్మికుడికి కూడా ప్రయోజనం కలగలేదు. గతంలో బతుకమ్మ చీరల పేరిట చేనేత కార్మికులకు పనికలి్పస్తామంటూ ఆర్భాటం చేశారే తప్ప నిధులు విడుదల చేయలేదు. మా ప్రభుత్వం తక్షణమే రూ.290కోట్ల బకాయిలు విడుదల చేసింది. బతుకమ్మ చీరల కంటే మెరుగైన నాణ్యతతో కూడిన చీరెలను 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించాం. ఏటా ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తాం. ఏడాదికి దాదాపు 1.30కోట్ల ఈ చీరల ఆర్డర్‌ను నేతన్నలకు ఇస్తాం. చేనేత రుణాల భారం రూ.30కోట్లను తప్పకుండా మాఫీ చేస్తాం. ప్రజా ప్రభుత్వానికి రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం. ఏ సమస్య వచ్చినా పెద్దన్నలా ముందుండి పరిష్కరిస్తా..’’అని రేవంత్ చెప్పారు. కార్యక్రమంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాది మాటలతో మభ్య పెట్టే ప్రభుత్వం కాదు: మంత్రి తుమ్మల రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టేది కాదని.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. చేనేత కార్మీకుల కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు సమర్థవంతంగా అందేలా చూసేందుకు ముఖ్య కార్యదర్శి స్థాయిలో ఉన్న శైలజా రామయ్యర్‌కు ఆ శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించామని తెలిపారు. చేనేత కార్మీకులు ఎలాంటి సమస్యలున్నా ఆమెకు నేరుగా వివరించాలన్నారు. కాళోజీకి సీఎం రేవంత్ నివాళి ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ పేరుతెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు ఐఐహెచ్‌టీకి పెడుతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు.అనంతరం ఐఐహెచ్‌టీలో వివిధ కోర్సులు నేర్చుకుంటున్న విద్యార్థులకు నెలకు రూ.2,500 ప్రోత్సాహకాన్ని చెక్కుల రూపంలో అందించారు. -
మాకెప్పుడు మాఫీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఫిర్యాదులు తీసుకుంటున్నా, గ్రామాల్లో సర్వే చేస్తున్నా తమకు న్యాయం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదనీ ప్రభుత్వం చెబుతూ సర్వే చేస్తున్నç³్పటికీ.. వారికి ఎప్పుడు రుణమాఫీ జరుగుతుందో స్పష్టత ఇవ్వక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకెందుకు రుణమాఫీ జరగడం లేదని వ్యవసాయశాఖ అధికారులను నిలదీస్తున్నారు. సురేందర్‌రెడ్డి అనే 52 ఏళ్ల రైతు తనకు రుణమాఫీ కాలేదనే ఆవేదనతో శుక్రవారం మేడ్చల్ వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. మాఫీకి దూరంగా లక్షలాది మంది గత ఆర్థిక సంవత్సరం (2023–24) మార్చి 31 నాటికి బ్యాంకులు రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు రూ.64,940 కోట్లు. ఇందులో డిసెంబర్ నాటికి ఇచ్చిన రుణాలు రూ.49,500 కోట్లు. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్ల వరకు అవసరమని మొదట్లో కాంగ్రెస్ సర్కారు ప్రాథమిక అంచనా వేసింది. అనంతరం రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవుతాయంటూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తీరా బడ్జెట్ కేటాయింపుల్లో దాన్ని రూ.26 వేల కోట్లకు కుదించారు.చివరికు మూడు విడతల్లో రుణమాఫీకి ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమే కావడంతో లక్షలాది మంది రుణమాఫీకి దూరమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రూ.లక్ష మాఫీకి 36.68 లక్షల రైతులు అర్హులు కాగా.. ప్రస్తుత ప్రభుత్వంలో రూ.2 లక్షల మాఫీకి 22.37 లక్షల మందే ఉండటం విస్మయం కలిగించే అంశం. కాగా రూ.లక్ష రుణమాఫీతో పోల్చితే రూ.2 లక్షల మాఫీలో రైతుల సంఖ్య ఏకంగా 14.31 లక్షలు తగ్గిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ జరగలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. లక్షలాది మంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. రైతుల వివరాల సేకరణ పూర్తయ్యేదెప్పుడు?రేషన్‌కార్డు లేకపోవడం, ఆధార్..బ్యాంక్ అకౌంట్లలో తప్పిదాలు, ఇతర సాంకేతిక కారణాలతో రూ.2 లక్షల వరకు మాఫీకాని రైతుల కుటుంబస భ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో సర్వే చేపట్టారు. బ్యాంకు డేటా ఆధారంగా 4.5 లక్షల మంది రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్షన్నర మంది రైతుల వివరాలను గుర్తించినట్లు చెబుతున్నారు. సర్వేలో భాగంగా కుటుంబసభ్యుల ఆధార్ నంబర్లు, వారి వయస్సులు, ఇతర వివరాలు సేకరించడంతో పాటు కుటుంబ పెద్దతో ఫొటో తీయాల్సి ఉంది.వారి సెల్ఫీ ఫొటోలను, రైతులు ఇచ్చిన అఫిడవిట్లను అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే వరదలు, వర్షాల కారణంగా ఈ ప్రక్రియ చాలాచోట్ల నిలిచిపోయింది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాల సేకరణ ఎప్పుడు పూర్తి అవుతుందో, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో అంతుబట్టడం లేదనే నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత ఐదేళ్ల కాలంలో కుటుంబ పెద్ద చనిపోయిన రైతు కుటుంబాలు చాలా ఉన్నాయి. వారికి రుణమాఫీ కాలేదని అనేకచోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫార్మాట్లో ఎలాంటి కాలమ్ లేదని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. అదనపు మొత్తంపై మార్గదర్శకాలెప్పుడు?ప్రస్తుతం రూ.2 లక్షల్లోపు రుణం ఉన్న రైతులకే రుణమాఫీ వర్తింపజేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆపై ఒక్క రూపాయి అదనంగా రుణం తీసుకుని ఉన్నా మాఫీ వర్తింపజేయలేదు. రూ.2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న రుణం సొమ్మును రైతులు చెల్లించాకే ప్రభుత్వం నుంచి సొమ్ము జమ అవుతుందని అంటున్నారు. అయితే ఇందుకు వ్యవసాయాధికారులు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల రైతులు ఇప్పటికే అదనపు మొత్తం చెల్లించి అధికారులను సంప్రదించారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని చెబుతున్న అధికారులు, కనీసం అవి ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండటంతో రైతుల పరిస్థితి దిక్కుతోచకుండా ఉంది. రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు కూడా దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.రుణమాఫీ కాలేదని..మేడ్చల్‌లో దుబ్బాక రైతు ఆత్మహత్యబ్యాంకులో తల్లి, కుమారుడికి వేర్వేరుగా పంట రుణాలుఒకే రేషన్‌కార్డులో ఇద్దరి పేర్లూ ఉండటం, ఇద్దరి రుణాలూ కలిపి రూ.3 లక్షలకు పైగా ఉండటంతో జరగని రుణమాఫీమనస్తాపంతో వ్యవసాయ కార్యాలయం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణంమేడ్చల్/దుబ్బాక రూరల్: రుణమాఫీ కాలేదని మనో వేదనకు గురైన ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్బర్పేటభూంపల్లి మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట సురేందర్‌రెడ్డి (52) మేడ్చల్ హౌసింగ్ బోర్డు కాలనీలో భార్య మంజుల, కుమారుడు నితిన్రెడ్డితో కలిసి నివాసముంటున్నాడు. కండ్లకోయలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సురేందర్‌రెడ్డికి చిట్టాపూర్‌లో ఆయన పేరుపై 4.5 ఎకరాల భూమి, తల్లి సుశీల పేరిట రెండు ఎకరాల భూమి ఉంది. ఇద్దరూ చిట్టాపూర్‌లోని ఆంధ్రప్రదేశ్æ గ్రామీణ వికాస బ్యాంకులో 2012లో పంట రుణం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ రాగా ప్రస్తుతం సుశీల పేరిట రూ.1,15,662, సురేందర్‌రెడ్డి పేరిట రూ.1,92,440 పంట రుణం ఉంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. కాగా సురేందర్‌రెడ్డి, సుశీల ఇద్దరి రుణాలూ కలిపి రూ.3,08,102 ఉండటంతో వారి రుణాలు మాఫీ కాలేదు. దీంతో సురేందర్‌రెడ్డి పలుమార్లు బ్యాంకు అధికారులను, వ్యవసాయాధికారులను సంప్రదించాడు. తనకు మాఫీ ఎందుకు కాలేదని వారిని అడగగా.. తల్లి, కుమారుడి పేర్లు ఒకే రేషన్‌కార్డులో ఉన్నాయని, రుణం రూ.3 లక్షల పైచిలుకు ఉండటం వల్ల మాఫీ కాలేదని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వం రేషన్ కార్డుకు రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేసిందని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇద్దరికీ వేర్వేరు రేషన్‌కార్డులు ఉండి ఉంటే మాఫీ అయ్యేదని వారు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సురేందర్‌రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ విషయమై పలుమార్లు తన సోదరుడు రవీందర్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. రేషన్‌కార్డు నుంచి తల్లి పేరు తొలగించేందుకు దరఖాస్తు కూడా చేశాడు. సురేందర్‌రెడ్డికి గతంలోనూ రుణమాఫీ కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసమని ఇంట్లో నుండి వెళ్లిన సురేందర్‌రెడ్డి మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయ కాంప్లెక్స్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేçహాన్ని నగరంలోని గాంధీ మార్చురీకి తరలించారు.రెండురకాల సూసైడ్ నోట్లుమృతుడి జేబులో నుంచి పోలీసులు రెండు రకాల సూసైడ్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం (ఎస్బీఐ)లోంచి వచ్చే స్లిప్పులపై ఇవి రాసి ఉన్నాయి. ఒక దానిపై ‘నా చావుకు కారణం నా అమ్మ’ అని రెండు సార్లు, మరో పత్రంపై ‘చిట్టాపూర్ బ్యాంకులో లోన్ మాఫీ కాలేదని, అందుకే నా ఆత్మహత్య’ అని రాసి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు సురేందర్ రెడ్డి బ్యాంకు రుణం రూ.192440, తల్లి సుశీల బ్యాంకు రుణం రూ.115662 ఇద్దరిది కలిపి మొత్తం రూ.308102రైతు రుణమాఫీ కాని కుటుంబాల వివరాలు నమోదురామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద శుక్రవారం రుణమాఫీ కాని రైతు కుటుంబాల ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న రామన్నపేటతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు వందల సంఖ్యలో ఉదయం 10 గంటలకే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వర్ పనిచేయకపోవడంతో రైతులు రెండుగంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం మూడు ఫోన్ల ద్వారా వివరాలను అప్లోడ్ చేయడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. -
రాహుల్‌ను సీఎం సొంతూరుకు తీసుకెళ్తా
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి గజదొంగలా వ్యవహరిస్తూ మోసం చేస్తున్నాడు. రుణమాఫీ జరగలేదని ఓవైపు మంత్రులు చెబుతుంటే రేవంత్ మాత్రం ఢిల్లీలో రాహుల్ గాం«దీని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అందుకే వరంగల్ సభకు రావాలని రేవంత్ మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్ రావట్లేదు.హైదరాబాద్‌కు రాహుల్ వస్తే విమానాశ్రయంలోనే స్వాగతం పలికి సీఎం సొంతూరుకు తీసుకెళ్లి రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని ఆయనకు చూపిస్తాం’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో హరీశ్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం రేవంత్ చిట్‌చాట్ పేరిట ‘చీట్‌చాట్’(మోసగించే ముచ్చట్లు) చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వాల్మికి స్కామ్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌లో తెలంగాణకు చెందిన తొమ్మిది కంపెనీల ఖాతాలకు డబ్బులు బదిలీ అయ్యాయని.. ఈ స్కామ్‌పై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే ఈడీ విచారణ జరగట్లేదని హరీశ్‌రావు ఆరోపించారు. దీనిపై విచారణ కోసం త్వరలో ఈడీని కలుస్తామని చెప్పారు. హైడ్రా ఆఫీసును రంగనాథ్ కూల్చివేయాలి ‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కూల్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని... దేవుళ్లపై ఒట్లతో ప్రజల విశ్వాసాన్ని కూల్చేసింది. బుద్ధ భవన్ నాలా కింద ఉన్న హైడ్రా ఆఫీసును కమిషనర్ రంగనాథ్ కూలగొట్టి ఇతర భవనాల వైపు చూడాలి. జీహెచ్ఎంసీ ఆఫీసు, నెక్లెస్ రోడ్డు రెస్టారెంట్లు, మీరాలం, ఉప్పల్, రామాంతపూర్ చెరువుల్లోని నిర్మాణాలు కూడా కూలుస్తారో లేదో చెప్పాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఫోర్త్ సిటీ పేరిట భూములు కొల్లగొట్టే కుట్ర ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సర్వే నంబర్ 9లో 385 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారని... తుక్కుగూడలో సర్వే నంబర్ 895లో 25 ఎకరాలను పేద రైతుల నుంచి బినామీల పేరుతో తీసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చెలామణి అవుతున్న తమ్ముళ్ల పీఏల పేరిట భూములు కొంటున్నారని పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేస్తే మంత్రులెవరూ రాలేదని హరీశ్ ఎద్దేవా చేశారు. కవిత బెయిల్ వ్యాఖ్యలపై ‘సుప్రీం’మొట్టికాయలు ‘సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం. వక్రబుద్ధి ఉన్నవారికి అన్నీ వంకరగానే కనిపిస్తాయి. బీజేపీ ఇస్తేనే ఓటుకు రూ. కోట్లు కేసులో రేవంత్‌కు బెయిల్ వచ్చిందా? ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. కవితకు బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచింది. ఈడీ, సీబీఐ తీరుపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ వస్తే అది బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీ అనడం రేవంత్ అపరిపక్వతకు నిదర్శనం’అని హరీశ్ విమర్శించారు. విద్యార్థులను ఎలుకలుకరవడం దారుణం మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులపై, నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేయడం దారుణమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 500 మందికిపైగా గురుకుల విద్యార్థులు ఆస్పత్రుల పాలవగా 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గురువారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. -
‘నేను ఇస్తున్న వివరాలన్నీ వాస్తవమే’
సాక్షి, హైదరాబాద్: ‘కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం నేను ఇస్తున్న నా కుటుంబ సభ్యుల వివరాలు వాస్తవం/సరైనవి. రుణమాఫీ పొందడానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినా లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు తేలినా లేదా పంట రుణమాఫీకి అర్హత లేదని నిర్ధారణ అయినా.. పొందిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి అంగీకరిస్తున్నాను. ఆ మొత్తం రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది..’ఇది రూ.2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతులు, రుణమాఫీ కోసం ఇవ్వాల్సిన అఫిడవిట్. ఇలా అఫిడవిట్ కోరడంతో పాటు రుణమాఫీ–2024 బ్యాలెన్స్ ఉన్న రైతు కుటుంబాలకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ జారీ చేసింది. రుణమాఫీ కాని రైతులను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. మార్గదర్శకాలకు రైతులు ఇవ్వాల్సిన అఫిడవిట్‌ను జత చేసింది. ఫొటో తీయాలి..సెల్ఫీ దిగాలి ⇒ పంట రుణం ఉన్న రైతు ఇంటిని ఎంఏవో తప్పనిసరిగా సందర్శించి, రైతు వెల్లడించిన కుటుంబ సభ్యుల వివరాలను ఆధార్ నంబర్‌తో సహా నమోదు చేసుకోవాలి. ⇒ ఎంఏవోతో సహా ఏ అధికారికీ ఒకటి కంటే ఎక్కువ మండలాలను కేటాయించకూడదు. మండల స్థాయిలో నియమితులైన అధికారి వివరాలను వెంటనే రుణమాఫీ విభాగానికి సమర్పించాలి. ⇒ ఎంఏవో రుణమాఫీ లాగిన్లలో కుటుంబ సభ్యుల వివరాలను అప్లోడ్ చేయడానికి మొబైల్ యాప్ అభివృద్ధి చేయడం జరిగింది. ⇒ మండలంలోని అన్ని బ్యాంకు బ్రాంచీల వారీగా కుటుంబ సభ్యులను నిర్ధారించి రుణం పొందిన రైతుల జాబితా ప్రదర్శించాలి. ⇒ రుణం పొందిన రైతు జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేయాలి. ⇒ జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేసిన తర్వాత ఇతర కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ⇒ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో పాటు వారి వయస్సు నమోదు చేయాలి. కుటుంబ పెద్దతో ఫొటో తీయాలి. ⇒ రైతు సమర్పించే అఫిడవిట్లో అతను అందించిన కుటుంబ సభ్యుల వివరాలు ఏ ప్రభుత్వ అధికారి అయినా లేదా పంచాయతీ కార్యదర్శి లేదా ఏఈవో లేదా ఏఏవో ధ్రువీకరించాలి. ⇒ రైతులు సమర్పించిన అఫిడవిట్‌ను యాప్‌లో అప్లోడ్ చేయాలి. ⇒ డేటా సేకరణ సమయంలో అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యులతో పాటు రుణం పొందిన రైతుతో ఎంఏవో సెల్ఫీ దిగి యాప్‌లో అప్లోడ్ చేయాలి. వివరాల సేకరణ షురూ రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్..బ్యాంక్ అకౌంట్లలో తప్పిదాలు, సాంకేతిక కారణాలతో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కాని రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం వ్యవసాయశాఖ అధికారులు బుధవారం గ్రామాల్లో సర్వే చేపట్టారు. మండలం యూనిట్‌గా రైతుల వివరాలను సేకరిస్తున్నారు. అనేకచోట్ల వివరాలను సేకరిస్తున్నా రైతులు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. రూ.2 లక్షలకు పైన రుణం ఉన్న రైతులు రుణమాఫీ విషయంపై నిలదీస్తున్నారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న సొమ్ము బ్యాంకులో చెల్లించాలా వద్దా? అని అడుగుతున్నారు. దీనిపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోతున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని అన్నారం గ్రామంలో ఎస్బీఐ, గ్రామీణ వికాస్‌బ్యాంక్ సైట్లు ఓపెన్‌కాగా ఎన్డీసీసీ బ్యాంక్ సైట్ మాత్రం ఓపెన్ కాలేదు. గ్రామంలో 30 మంది రైతుల వివరాలను అప్లోడ్ చేశారు. కానీ ఎన్డీసీసీ బ్యాంక్ సైట్ ఓపెన్ కాకపోవడంతో 15 మంది రైతులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇంకోవైపు రుణం తీసుకొని మృతి చెందిన రైతుల రుణమాఫీకి సంబంధించి, ఆధార్, బ్యాంక్ అకౌంట్ల నమోదులో తప్పిదాలను సరిచేయడం కోసం యాప్‌లో ఎలాంటి ఆప్షన్లు లేకపోవడంతో దీనిపై స్పష్టత కొరవడింది. ఇలాంటి వారికి సంబంధించి గ్రామంలో 11 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. -
చేతకాని సన్నాసి సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఎక్కడా చారాణా రుణమాఫీ కాలేదు. ఆ తప్పు.. ఈ చేతకాని సన్నాసి సీఎం రేవంత్‌రెడ్డిది. రేవంత్‌రెడ్డీ నీ భాషలోనే చెబుతున్నా.. నువ్వు మగాడివైతే..బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు.. పోలీసు సెక్యూరిటీ లేకుండా ఊళ్లలోకి రా..నువ్వు ఏ ఊరికి పోదామో చెప్పు. అక్కడికి వెళ్లి రుణమాఫీ అయ్యిందా అనే విషయాన్ని అడుగుదాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ వారు ఊళ్లలోకి వస్తే తరిమికొట్టాలన్న ఆలోచనతో రైతులు ఉన్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అయితే రుణమాఫీ విషయంలో పోలీసులు, వ్యవసాయ అధికారులను తప్పు పట్టాల్సిన పనిలేదని, ఆ తప్పు సీఎం రేవంత్‌దే అన్నారు. తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై జరిగిన దాడి, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడులు, పోలీసు నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. రుణమాఫీ జరిగిన తీరుపై ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయిన ఇద్దరూ మహిళా జర్నలిస్టుల పైన, ఇతర జర్నలిస్టులపైన దాడి చేసిన తీరుపై కూడా ఫిర్యాదు చేశారు.అనంతరం డీజీపీ కార్యాలయ ఆవరణలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తిలో ప్రజాస్వామ్యపద్ధతిలో శాంతియుతంగా చేస్తున్న రైతు నిరసన దీక్షపై కాంగ్రెస్ గుండాలు ఆకస్మికంగా రాళ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు. ‘మా వారు తిరగబడి ఉంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మిగలరు. కానీ శాంతియుతంగా నిరసన తెలపాలనే మేం ప్రతిఘటనకు పాల్పడలేదు’ అన్నారు. రుణమాఫీపై ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ రేవంత్‌రెడ్డిఅని, క్షేత్రంలో తిరగాల్సిన సీఎం ంఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.కొండారెడ్డిపల్లిలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఒక పార్టీకి శాశ్వతం కాదని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని కేటీఆర్ సూచించారు. తిరుమలగిరి ఘటనలో దాడి చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీని కలిసినవారిలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్, ఆర్.రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, ఎన్.భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్, నోముల భగవత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్లవి ముందు కూల్చండి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీ వంటి నేతల భవనాలను కూల్చేసి.. ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయండి అని పేర్కొన్నారు. ‘చలో ఢిల్లీ కాదు..చలో పల్లె’ చేపట్టాలి రుణమాఫీ జరగక లక్షలాది మంది రైతులు రగిలిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ ‘చలో ఢిల్లీ’కి బదులుగా ‘చలో పల్లె’ చేపట్టాలని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. డెంగీ మరణాలు, పెరుగుతున్న నేరాలు, రైతుల ఆందోళనలు రాష్ట్రంలో పాలన గాడి తప్పడాన్ని సూచిస్తున్నాయన్నారు. విపత్కర పరిస్థితుల్లో సీఎం, మంత్రులు పార్టీ అధిష్టానం ఆశీస్సుల కోసం పాకులాడకుండా ప్రజల నడుమకు వెళ్లాలని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఏదో ఒక రోజు సీఎం కుర్చీ లాగేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. -
కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత బీఆర్ఎస్కు లేదు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: లక్ష రుణమాఫీ చేసేందుకు బీఆర్ఎస్కు ఐదేళ్లు పట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఐదేళ్లైనా లక్ష రుణమాఫీ చేయని బీఆర్ఎస్కు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతు రుణమాఫీ చేశామని తెలిపారు.ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ధనిక రాష్ట్రం అని అన్నారు కానీ.. ఖజానా మొత్తం ఖాళీగా ఉందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యామని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గించి రైతును రాజును చేసే పనిలో పడ్డామని చెప్పారు తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మాజీ మంత్రుల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు.‘ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ చేశాం. మిగతా ఖర్చులు తగ్గించుకుని రైతులకు మేలుచేశాం. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు పైన ఉన్న మొత్తంచెల్లిస్తే రుణమాఫీ అవుతుంది. బీఆర్ఎస్లా మేం రూ. వేల కోట్లు దోచుకోలేదు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ముందే చెప్పాంకేటీఆర్ ఆరోపణలకు కౌంటర్రేవంత్పైకేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్లో కేటీఆర్ ఇల్లు అని పెట్టారు. ఇప్పుడా ఇల్లు నాది కాదు అని కేటీఆర్ అంటున్నారు. నాపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే బఫర్ జోన్లో పాంహౌజ్ కట్టుకున్నారు. మీలాగా మీరు ఉండే ఇల్లు నాది కాదు అని చెప్పనునా ఇళ్ళు బఫర్ జోన్లో ఉన్నా.. ఎఫ్టీఎల్లో ఉన్నా మొత్తం పడగొట్టండి. కేటీఆర్ చౌకబారు విమర్శలు మానుకోండి.. కేటీఆర్ విమర్శలకు కట్టుబడి ఉండాలి. కొత్త టేప్ తెచ్చుకుని కొలవండి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చాలని హైడ్రా అధికారులను ఆదేశిస్తున్నా’ అని తెలిపారు. -
రుణమాఫీపై చర్చకు సిద్ధమా?
జనగామ: కాంగ్రెస్ తొలుత రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణమాఫీ చేసినట్టు భావిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి తనతో చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్ విసిరారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా పోలీస్ కంట్రోల్ రూం ఏరియాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొన్నారు.ఎక్కడైనా తేదీ ఖరారు చేసి కబురు పంపిస్తే జనగామ ఎమ్మెల్యే పల్లాను వెంట బెట్టుకుని వస్తామని.. ఆ దమ్ము, ధైర్యం సీఎంకు ఉందా? అని హరీశ్ అన్నారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న, వరంగల్‌కు వెళ్లి భద్రకాళి, ములుగు సభలో సమ్మక్క, సారలక్క, భువనగిరికి వెళ్లి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి, భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామిపై.. ఇలా ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో పంట రుణమాఫీపై ఒట్టు వేసిన రేవంత్.. ఎలక్షన్లు ముగియగానే దైవ ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవీప్రసాద్, క్యామ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. -
పావుశాతం మాఫీతో వంద శాతం మోసం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను పచ్చి దగా చేస్తోందని, రైతులందరికీ రుణమాఫీ జరిగేంత వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. కేవలం పావు శాతం రుణమాఫీతో వంద శాతం రైతులను మోసం చేశారని.. ఈ అంశంపై సీఎం, మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ కోరుతున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ఏమిటని నిలదీశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని, ఆయన పన్నిన వలలో తాము చిక్కుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసేలా ప్రభుత్వం మెడలు వంచేందుకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘రైతు ధర్నా’ కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.. ‘‘సీఎం రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు రైతులకు ఎంత మేర రుణం మాఫీ అయిందో కూడా సీఎం, మంత్రులకు తెలియనట్టుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమయ్యాయని చెప్తున్నారు. నిజంగా వంద శాతం రుణమాఫీ అయి ఉంటే రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో సీఎం చెప్పాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఆందోళన చేస్తూ, బ్యాంకులను ముట్టడిస్తున్నారని.. రైతు రుణమాఫీ కోరుతున్న రైతులపై ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, బజార్‌హత్నూర్‌లలో ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. కేసులను ఉపసంహరించుకోని పక్షంలో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జైల్‌భరోకు పిలుపునిస్తామని చెప్పారు. లక్షలాది మంది రైతులను మోసం చేసిన ప్రభుత్వంపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. బజారు భాషకు వ్యతిరేకంగా పాలాభిషేకాలు ‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నందుకు సీఎం రేవంత్ బజారు భాష మాట్లాడారు. ఆ బజారు భాషకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి రైతు ధర్నాను ప్రారంభించాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గి మండలంలో ఐదు బ్యాంకుల్లో కలిపి 20,239 రైతు ఖాతాలుంటే.. కేవలం 8,527 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు. రుణమాఫీకి ఎన్నో కుంటిసాకులు చెబుతూ ఆంక్షలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుబంధుకు ఇంకెన్ని ఆంక్షలు పెడుతుందోననే అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండాం వెంటాడుతాం, వేటాడుతామని చెప్పారు. రేవంత్ ఫామ్‌హౌజ్‌ను కూల్చివేయాలి హైడ్రా పేరిట హైడ్రామా ఆపండి.. ‘‘జన్వాడలో నాకు ఎలాంటి ఫామ్‌హౌజ్ లేదు.. ఓ మిత్రుడి ఫామ్‌ను లీజుకు తీసుకున్నా. ఒకవేళ ఆ ఫామ్‌హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి. ప్రభుత్వానికి దమ్ముంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, మహేందర్‌రెడ్డి, వివేక్ వంటి కాంగ్రెస్ నాయకుల రాజభవనాలు కూడా కూల్చేయాలి. ఇప్పటికైనా హైడ్రా పేరుతో చేస్తున్న హైడ్రామా ఆపాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే అన్ని అక్రమ నిర్మాణాలను ఒకేరోజు కూల్చాలని.. రేవంత్‌రెడ్డి అ«దీనంలోని అక్రమ నిర్మాణాలను కూడా కూల్చి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు. -
మాకెందుకు రుణమాఫీ కాలేదు
సాక్షి, నెట్వర్క్: రుణమాఫీ జరగలేదంటూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. పలుచోట్ల బ్యాంకుల వద్ద బారులుదీరి మాకెందుకు రుణమాఫీ కాలే దంటూ బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ⇒ సిద్దిపేట జిల్లా తోటపల్లిలో రైతులు ఇండియన్ బ్యాంక్ సిబ్బందిని బయటకు పంపి బ్యాంకును మూసివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బ్యాంక్ పరిధిలో 1,300 మంది రైతులుంటే కేవలం 400 మందికి మాత్రమే మాఫీ అయ్యిందని మండిపడ్డారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగగా, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ⇒ మెదక్ మండల పరిధిలో అత్యధికంగా రైతులు ఆటోనగర్‌లోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు వచ్చే రైతుల రద్దీ పెరగ్గా, బ్యాంకు అధికారులు రోజూ కొందరికి టోకెన్లు ఇచ్చి వివరాలు చెబుతున్నారు. ఆదివారం సెలవు, సోమవారం రాఖీపౌర్ణమి కావడంతో బ్యాంకుకు రైతులు పెద్దగా రాలేదు. మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు రోడ్డువెంట బారులు తీరారు. ఈ క్రమంలో చిన్నపాటి వర్షం పడుతున్నా, లెక్క చేయకుండా వరుసలోనే నిలబడ్డారు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతువేదికల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద, బ్యాంకుల వద్ద రైతులు బారులు దీరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ యూనియన్ బ్యాంకుకు మంగళవారం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘సారూ.. జర మా ఖాతా చూడండి. ఎందుకు మాఫీ కాలేదో చెప్పండి’ అంటూ వేడుకున్నా రు. మరోవైపు వరంగల్ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల వద్ద, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, నర్సింహులపేటలలో, జనగామ కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ⇒ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో అన్నదాతలు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. భూషణరావుపేట గ్రామానికి చెందిన రైతు ముస్కు సాగర్‌రెడ్డి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కథలాపూర్ ఎస్సై నవీన్‌కుమార్ రైతు చేతిలో నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కు న్నారు. పంటల సాగుకు చేసిన అప్పు పెరిగిపోయిందని, రుణమాఫీ కాలేదని సాగర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేటకు చెందిన రైతు సోమ శ్రీనివాస్ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. రైతు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన భార్య సోమలత పేరిట ముత్యంపేట ఇండియన్ బ్యాంక్‌లో రూ.1.21 లక్షల రుణం ఉందని, మాఫీకి అన్ని అర్హతలూ ఉన్నా, కాలేదన్నారు. ⇒ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహారాష్ట్ర బ్యాంకు ఎదుట బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గుడిహ త్నూర్ మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.మాకు రుణమాఫీ కాలేదు⇒ ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు రైతుల ఫిర్యాదు⇒ రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారు బ్యాంకులు ⇒ సందర్శించే షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తమకు రుణమాఫీ కాలేదని, మాఫీలో అనేక సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని 566 రైతు వేదికల రైతులతో మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా అధికారులకు ఈ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, జనగామ, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్‌తోపాటు పలు రైతు వేదికలకు చెందిన రైతులు పంట రుణ మాఫీలో సమస్యలు ఉన్నాయని తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, సంచాలకులు గోపి పంట రుణాల మాఫీ పథకానికి సంబంధించిన వివిధ ఫిర్యాదులపై స్పష్టత ఇచ్చారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ, కుటుంబ సమూహానికి సంబంధించిన సమస్యలకు ప్రభుత్వం విధివిధానాలను జారీ చేస్తుందని తెలిపారు. కుటుంబ రుణ మొత్తాలు రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రైతులు బ్యాంకులను సందర్శించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని తెలిపారు. ఇంకా రుణమాఫీ పొందని రైతులు ఆధార్ కార్డులకు సంబంధించిన సమాచారం, బ్యాంక్ డేటాలో తప్పులు, పట్టా పాస్ పుస్తకాల సమస్యలు, పేరు సరిగ్గా లేకపోవడం మొదలైన ఫిర్యాదు లను మండల స్థాయిలో సమర్పించవచ్చని సూచించారు.పంట రుణమాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కారమయ్యే వరకు అన్ని పని దినాల్లో మండల స్థాయిలో నియమించబడిన నోడల్ అధికారులు అందు బాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన ప్రతి రైతులు రుణమాఫీ ప్రయో జనం పొందుతారని తెలిపారు. ఫిర్యా దుల స్వీకరణకు నిర్దిష్ట కటాఫ్ తేదీ లేనందున రుణాల మాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు రైతులు ఎప్పుడైనా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చన్నారు. మండల స్థాయిలో నోడల్ అధికారు లను నియమించాలని, రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వ్యవసాయ సంచాలకులు గోపి కిందిస్థాయి అధికారులను కోరారు. అన్ని పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పంట రుణా ల మాఫీ ఫిర్యాదులకు హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. -
ఎస్‌హెచ్‌జీలకు రూ.లక్ష కోట్ల రుణాలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీలు) రూ.లక్ష కోట్లు వడ్డీ లేని రుణాల రూపంలో ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుందని, వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు. రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు ప్రభుత్వం రూ.18 వేల కోట్లు జమ చేస్తే, బ్యాంకులు ఇచ్చిన కొత్త రుణాలు రూ.7,500 కోట్లు మాత్రమేనంటూ అసహనం వ్యక్తం చేశారు. రుణాల మంజూరుకు బ్యాంకర్లు మానవీయ కోణంలో చొరవ చూపాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రానికి వెన్నెముకగా వ్యవసాయ రంగంరూ.2 లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని భట్టి చెప్పారు. ఇది వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తున్నామని, భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందని చెప్పారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి రూ.36 వేల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరచడం హర్షణీయమన్నారు.రూ.2,005 కోట్లు పెరిగిన డిపాజిట్లుఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.2,005 కోట్ల మేరకు డిపాజిట్లు పెరిగాయని ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ ప్రకాశ్ చంద్రబరార్ తెలిపారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు రూ.17,383 కోట్ల పంట రుణాలు మంజూరు చేశామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.23,848 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రూ.220.49 కోట్ల మేర విద్యారుణాలు ఇచ్చినట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.57.079 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ప్రాధాన్యతా సెక్టార్లకు మొత్తం రూ.1,00,731 కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కమల్‌ప్రసాద్ పట్నాయక్, నాబార్డు సీజీఎం సుశీలా చింతల తదితరులు పాల్గొన్నారు.సంపూర్ణ రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించాలి: తుమ్మలకేవలం అంకెలు చదువుకునేందుకు మూడు నెలలకో సారి మీటింగ్‌లు పెట్టడం, బ్యాంకర్ల సదస్సు నిర్వహించడంలో అర్థం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కష్టకాలంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం రూ.18 వేల కోట్లు రుణమాఫీ కింద విడుదల చేసిందని చెప్పారు. రుణ ఖాతాల్లో తప్పులు సరిది ద్దేటట్లు బ్రాంచ్ మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వా లని కోరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.