మాకెందుకు రుణమాఫీ కాలేదు | BJP President Payal Shankar Protest at Banks Over Rythu Bandhu Amount in Totapalli | Sakshi
Sakshi News home page

మాకెందుకు రుణమాఫీ కాలేదు

Published Wed, Aug 21 2024 6:25 AM | Last Updated on Wed, Aug 21 2024 6:25 AM

BJP President Payal Shankar Protest at Banks Over Rythu Bandhu Amount in Totapalli

తోటపల్లిలో ఇండియన్‌ బ్యాంక్‌ను ముట్టడించిన రైతులు 

మెదక్‌లో తెల్లవారుజామునే క్యూలైన్లు 

పురుగుల మందు తాగేందుకు యత్నించిన రైతు

మల్లాపూర్‌లో ఆమరణ దీక్షకు దిగిన మరో రైతు

మహారాష్ట్ర బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

సాక్షి, నెట్‌వర్క్‌: రుణమాఫీ జరగలేదంటూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. పలుచోట్ల బ్యాంకుల వద్ద బారులుదీరి మాకెందుకు రుణమాఫీ కాలే దంటూ బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సిద్దిపేట జిల్లా తోటపల్లిలో రైతులు ఇండియన్‌ బ్యాంక్‌ సిబ్బందిని బయటకు పంపి బ్యాంకును మూసివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బ్యాంక్‌ పరిధిలో 1,300 మంది రైతులుంటే కేవలం 400 మందికి మాత్రమే మాఫీ అయ్యిందని మండిపడ్డారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగగా,  లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హరిప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.   

మెదక్‌ మండల పరిధిలో అత్యధికంగా రైతులు ఆటోనగర్‌లోని ఎస్‌బీఐ ఏడీబీ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు వచ్చే రైతుల రద్దీ పెరగ్గా, బ్యాంకు అధికారులు రోజూ కొందరికి టోకెన్లు ఇచ్చి వివరాలు చెబుతున్నారు. ఆదివారం సెలవు, సోమవారం రాఖీపౌర్ణమి కావడంతో బ్యాంకుకు రైతులు పెద్దగా రాలేదు. మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు రోడ్డువెంట బారులు తీరారు. ఈ క్రమంలో చిన్నపాటి వర్షం పడుతున్నా, లెక్క చేయకుండా వరుసలోనే నిలబడ్డారు. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రైతువేదికల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద, బ్యాంకుల వద్ద  రైతులు బారులు దీరుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ యూనియన్‌ బ్యాంకుకు మంగళవారం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘సారూ.. జర మా ఖాతా చూడండి. ఎందుకు మాఫీ కాలేదో చెప్పండి’ అంటూ వేడుకున్నా రు. మరోవైపు  వరంగల్‌ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల వద్ద, మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం, నర్సింహులపేటలలో, జనగామ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు నిర్వహించారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. 

జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండల కేంద్రంలో అన్నదాతలు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. భూషణరావుపేట గ్రామానికి చెందిన రైతు ముస్కు సాగర్‌రెడ్డి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కథలాపూర్‌ ఎస్సై నవీన్‌కుమార్‌ రైతు చేతిలో నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కు న్నారు. పంటల సాగుకు చేసిన అప్పు పెరిగిపోయిందని, రుణమాఫీ కాలేదని సాగర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్‌ మండలంలోని రాఘవపేటకు చెందిన రైతు సోమ శ్రీనివాస్‌ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. రైతు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తన భార్య సోమలత పేరిట ముత్యంపేట ఇండియన్‌ బ్యాంక్‌లో రూ.1.21 లక్షల రుణం ఉందని, మాఫీకి అన్ని అర్హతలూ ఉన్నా, కాలేదన్నారు. 

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని మహారాష్ట్ర బ్యాంకు ఎదుట బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఆధ్వర్యంలో రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గుడిహ త్నూర్‌ మండల కేంద్రంలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.

మాకు రుణమాఫీ కాలేదు

⇒  ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు రైతుల ఫిర్యాదు
⇒  రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారు బ్యాంకులు 
⇒  సందర్శించే షెడ్యూల్‌ ప్రకటిస్తామని వెల్లడి  
సాక్షి, హైదరాబాద్‌: తమకు రుణమాఫీ కాలేదని, మాఫీలో అనేక సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని 566 రైతు వేదికల రైతులతో మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం ద్వారా అధికారులకు ఈ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, జనగామ, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్‌తోపాటు పలు రైతు వేదికలకు చెందిన రైతులు పంట రుణ మాఫీలో సమస్యలు ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, సంచాలకులు గోపి పంట రుణాల మాఫీ పథకానికి సంబంధించిన వివిధ ఫిర్యాదులపై స్పష్టత ఇచ్చారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ, కుటుంబ సమూహానికి సంబంధించిన సమస్యలకు ప్రభుత్వం విధివిధానాలను జారీ చేస్తుందని తెలిపారు. కుటుంబ రుణ మొత్తాలు రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రైతులు బ్యాంకులను సందర్శించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని తెలిపారు. ఇంకా రుణమాఫీ పొందని రైతులు ఆధార్‌ కార్డులకు సంబంధించిన సమాచారం, బ్యాంక్‌ డేటాలో తప్పులు, పట్టా పాస్‌ పుస్తకాల సమస్యలు, పేరు సరిగ్గా లేకపోవడం మొదలైన ఫిర్యాదు లను మండల స్థాయిలో సమర్పించవచ్చని సూచించారు.

పంట రుణమాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కారమయ్యే వరకు అన్ని పని దినాల్లో మండల స్థాయిలో నియమించబడిన నోడల్‌ అధికారులు అందు బాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన ప్రతి రైతులు రుణమాఫీ ప్రయో జనం పొందుతారని తెలిపారు. ఫిర్యా దుల స్వీకరణకు నిర్దిష్ట కటాఫ్‌ తేదీ లేనందున రుణాల మాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు రైతులు ఎప్పుడైనా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చన్నారు. 

మండల స్థాయిలో నోడల్‌ అధికారు లను నియమించాలని, రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వ్యవసాయ సంచాలకులు గోపి కిందిస్థాయి అధికారులను కోరారు. అన్ని పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పంట రుణా ల మాఫీ ఫిర్యాదులకు హాజరు కావాలని అధికారులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement