సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమల్లోకి తేగా.. ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేశారు. రైతు బంధు, రుణమాఫీలను వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చే యోచనలో రేవంత్ ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి.
వీటితోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఆయన దృష్టి సారించారని అంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నుంచి ముఖ్య నేతల పేర్లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లను తెప్పించుకుని.. పదవుల పంపిణీపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ హోదాపై స్పష్టత వచ్చిందని, తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి ఈ పదవి ఇవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
బ్యాంకులకు వాయిదాలు..రైతులకు ఒకేసారి
రైతుల పంట రుణాల మాఫీ విషయంలో సీఎం రేవంత్ ఒక ఆలోచనకు వచ్చినట్టు సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైతుల కు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై రేవంత్ పలు ప్రతిపాదనలను
పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణమొత్తాన్ని బట్టి నిధులు విడుదల చేస్తూ దశల వారీగా మాఫీ చేయాలా? లేక ఒకేసారి రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించాలా అన్న దానిపై ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం.
రైతు రుణమాఫీ కోసం మొత్తంగా ఎంత ఖర్చవుతుందన్న దానిపై సీఎం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంత మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం సాధ్యంకాని పరిస్థితుల్లో.. బ్యాంకులతో చర్చించడం ద్వారా రుణమాఫీ అంశాన్ని పరిష్కరించాలనే యోచనలో ఉన్నారని వివరిస్తున్నాయి.
మాఫీ కోసం రూ.36 వేల కోట్లు!
రూ.లక్ష వరకు రుణమాఫీకి రూ.18–19 వేల కోట్ల వరకు అవసరమని.. రూ.2లక్షల వరకు అయితే రూ.30 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా బ్యాంకులకు చెల్లించే ప్రతిపాదనపై ముందుకెళ్లాలని ఆయన ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మొత్తం రూ.30వేల కోట్లను ఐదేళ్లపాటు వడ్డీతో కలిపి చెల్లించాలంటే.. మొత్తంగా రూ.36 వేల కోట్లు అవుతాయన్న అంచనా వేసినట్టు తెలిసింది. దీంతో ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు రుణమాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇందుకోసం నోడల్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ)తో చర్చించాలని భావిస్తున్నట్టు తెలిసింది. బ్యాంకులకు నెలవారీ వాయిదాల్లో చెల్లించినా.. రైతులకు మాత్రం ఒకేసారి మొత్తం రుణమాఫీ చేసేలా బ్యాంకులను ఒప్పించాలన్నది సీఎం ఆలోచన అని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి సానుకూలత వస్తే.. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంటున్నాయి.
15వ తేదీకల్లా రైతు బంధు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఆ శాఖ అధికారులతో చర్చించిన సీఎం రేవంత్.. వీలైనంత త్వరగా రైతుబంధు సొమ్ము విడుదల చేసేలా నిధులు సమీకరించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార సమయంలో రైతుబంధు విడుదలకు ఈసీ అనుమతించి, తర్వాత నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతో తాము డిసెంబర్ 9న అధికారంలోకి వస్తామని, తర్వాత 10 రోజుల్లో రైతుబంధు సొమ్మును జమ చేస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 19వ తేదీనాటికి రైతుబంధు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అంతకు నాలుగు రోజుల ముందే, అంటే ఈ నెల 15వ తేదీకల్లా సుమారు 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లను జమ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది.
నామినేటెడ్ పదవులపై కసరత్తు
ఓ వైపు పాలన, మరోవైపు పథకాల అమలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్.. వాటికి సమాంతరంగా నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరమై ప్రభుత్వ పదవుల కోసం ఎదురుచూస్తున్నవారు, గత ఎన్నికల్లో పోటీ అవకాశం రాని నేతలను నామినేటెడ్ పదవుల్లో నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు గాందీభవన్ నుంచి ముఖ్య నేతలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నేతల పేర్లను తెప్పించుకున్నారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీలోని నేతలతోపాటు పార్టీకి అండగా నిలిచిన బయటి ముఖ్యుల సేవలనూ వినియోగించుకోవాలని రేవంత్ యోచిస్తున్నారని వెల్లడించాయి. ఇందులో భాగంగా టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారని వివరించాయి.
ఆప్తుడికి తొలి నామినేటెడ్ పదవి?
సీఎం రేవంత్‌రెడ్డి నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా తొలి పదవిని తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను కేబినెట్ హోదా ఉండే రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా నియమించాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలిసింది. వేం నరేందర్‌రెడ్డి చాలా కాలం నుంచి రేవంత్ వెన్నంటే ఉంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ శిబిరంలో కీలకంగా వ్యవహరించారు.
తెర వెనుక ఉండి ప్రచారం, అభ్యర్థులతో సమన్వయం, కేడర్‌ను కదిలించడం, సభల ఏర్పాటు, నిర్వహణ వంటివి చూసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా పట్టుబట్టలేదు. ఈ నేపథ్యంలో వేం నరేందర్‌రెడ్డికి తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నారని, త్వరలోనే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి.
మూడింటిపై ఫోకస్
Published Mon, Dec 11 2023 12:11 AM | Last Updated on Mon, Dec 11 2023 8:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment