
హైదరాబాద్: కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న యువకుడు వేసవి సెలవుల్లో స్విగ్గీబాయ్‌గా చేరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను పోగొట్టుకున్న ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన కుతాడి జీవన్ కుమార్ (21) కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. వేసవి సెలవులు ఉండటంతో నగరానికి వచ్చి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేరాడు.
తన తండ్రికి ఇటీవల గుండె ఆపరేషన్ కావటం, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో నగరానికి వచ్చి పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా శుక్రవారం ఉదయం పుప్పాలగూడ ఈఐపీఎల్ కార్నర్ స్టోన్ సమీపంలో జీవన్ ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. కింద పడిన అతడిపై నుంచి వెనకగా వచ్చిన టిప్పర్ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, టిప్పర్‌ల డ్రైవర్‌లు పరారయ్యారు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.