
రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
రోడ్డుపై ఉన్న గేదె కళేబరాన్ని ఢీకొన్న బుల్లెట్ బైక్
ఎగిరి రోడ్డుపై పడిన యువతి..
వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఆమెపై నుంచి వెళ్లిన లారీ
మునగాల(సూర్యాపేట జిల్లా): సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చేడె జనార్దన్ కుమార్తె యశస్విని (24) మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలనుకుని యశస్విని బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి తన సహ ఉద్యోగి బడ్డుకొండ అచ్యుత్‌కుమార్‌తో కలిసి అదే బుల్లెట్‌పై తమ స్వగ్రామమైన తుందుర్రుకు బయలుదేరింది. బుల్లెట్ బైక్‌ను అచ్యుత్‌కుమార్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టారు. దీంతో యశస్విని బుల్లెట్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే లారీ అతివేగంతో వచ్చి రహదారిపై పడిఉన్న యశస్విని మీదుగా వెళ్లింది.
దీంతో యశస్విని తల, మెడభాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. అచ్యుత్‌కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యశస్విని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం మృతురాలి కుటుంబ సభ్యులు మునగాలకు చేరుకున్నారు. మృతురాలి బాబాయ్ చేడె సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యశస్విని మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.