
నాగర్ కర్నూల్: లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారి కుటుంబం పాలిట యమపాశమైంది. అప్పటివరకు నలుగురు(ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు) పిల్లలతో సరదాగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన భార్యభర్తలు సక్కభాయి (40), పాండు (45) 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
వారికి నలుగురు పిల్లలు మధుమిత, మధురుషిత, యాద్విక్, యశిత్..పిల్లలున్నారు. సక్కుభాయి మహేశ్వరం మండలంలోని ఎన్‌డీతండాలో పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్‌పేట్‌లోని పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై సుక్కుభాయి తమ అమ్మగారి గ్రామమైన కొందుర్గులో ఉన్న తమ వ్యవసాయ పొలంలో జరుగుతున్న పండ్లతోట పనులను పరిశీలించి తిరిగి సాయంత్రం రామంతాపూర్‌కు బయల్దేరారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ శివారు ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ అతివేగంగా ఢీ కొట్టింది.
దీంతో సక్కుభాయి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాలను రఘుపతిపేటకు తరలించి బుధవారం సాయంత్రం అంత్యక్రియలు ముగించారు.