Hit and run
-
యూపీలో హిట్ అండ్ రన్.. మైనర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు మహిళ బలి
ఉత్తర ప్రదేశ్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగుచూసింది. మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఓ స్కూటర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్పైనున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కూతురు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది.ఈ ఘటన కాన్పూర్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై శుక్రవారం చోటుచేసుకుంది. మైనర్ అయిన డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై ఉన్న మహిళ, చిన్నారి గాల్లోకి ఎగిరి దూరం పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మహిళ మృతిచెందినట్లు ప్రకటించారు. చిన్నారి గాయాలతో చికిత్స పొందుతుంది.Woman dies, her daughter survives many fractures after their two-wheeler was hit by a speeding car in Uttar Pradesh's Kanpur.The car was being driven by a minor boy who had bunked his school. He was accompanied by another boy and two girls, all his classmates and minors. All… pic.twitter.com/5VIXUbEbgu— Vani Mehrotra (@vani_mehrotra) August 3, 2024 ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. 17 ఏళ్ల మైనర్ బాలుడు కారు నడిపినట్లు తెలిపారు. రోడ్డుపై స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
HYD: రాయదుర్గంలో హిట్ అండ్ రన్..! వ్యక్తి మృతి
సాక్షి,హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సోమవారం(జులై 15) హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసున్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి ఎక్సెల్ వాహనంపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కాకినాడకు చెందిన సోము సుబ్బు (35) గా పోలీసులు గుర్తించారు. సుబ్బు టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై టిఫిన్స్ అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం 5:30గంటలకు ఇంటి నుంచి బయలు దేరిన సుబ్బు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అతడి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే ఏదైనా వాహనం ఢీ కొట్టిందా లేదంటే సెల్ఫ్ స్కిడ్ అయి పడ్డాడా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
నాసిక్‌లో హిట్ అండ్ రన్.. మహిళ మృతి
నాసిక్: ముంబయిలో బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టి మహిళ మృతి చెందిన ఘటన మరువక ముందే మరో హిట్ అండ్ రన్ ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాసిక్ నగరంలోని గంగాపూర్ రోడ్డులో 36 ఏళ్ల వైశాలి షిండేను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొట్టడంతో ఆమె ఏకంగా 20 మీటర్ల దూరంలో ఎగిరి పడింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహిళను ఢీకొట్టిన అనతరం కారు ఆగకుండా వెళ్లిపోయింది. ఈ మధ్యే ముంబయి నగరంలోని వర్లిలో దంపతులు స్కూటర్‌పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలయింది. కారు ఢీకొట్టడమే కాకుండా మహిళను ఒకటిన్నర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. ఈ కేసులో నిందితుడు, అధికార శివసేన నేత కొడుకు అయిన మిహిర్షాను మూడు రోజుల తర్వాత అరెస్టు చేశారు. అంతకుముందు ఇదే ఏడాది పుణెలో పోర్షే కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. -
హైదరాబాద్ బొల్లారంలో మరో హిట్ అండ్ రన్ కేసు
-
‘హిట్ అండ్ రన్’కు టెక్నికల్ పరిష్కారం?
ఢిల్లీ: కొత్త చట్టాలను అనుసరించి.. హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలను నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన కేంద్రం.. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు ‘హిట్ అండ్ రన్’కు పరిష్కారం.. రవాణాశాఖ(MoRTH.. The Union road transport and highways ministry) కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసే సాంకేతిక వ్యవస్థను ట్రక్కు డ్రైవర్లు వినియోగించేందుకు అనుమతించాలని సూచించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా అటువంటి వాటిని ‘హిట్ అండ్ రన్’ కింద పరిగణించకుండా ఉండవచ్చని తెలిపింది. అయితే ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని.. తుది నిర్ణయం ఆ శాఖ తీసుకుంటుందని రవాణాశాఖ పేర్కొంది. ‘ప్రమాదం జరిగిన అనంతరం బాధితులకు సహాయం చేసేందుకు అక్కడే ఉంటే స్థానికులు వారిపై దాడి చేసే ప్రమాదం ఉందని ట్రక్కు డ్రైవర్లు భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా మనం సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసేందుకు డ్రైవర్లు సాంకేతికత వాడుకోవచ్చు. ఆ తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 25-50 కి.మీ పరిధిలో ఉన్న పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. అటువంటి దాన్ని ‘హిట్ అండ్ రన్’ కేసుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉండవచ్చు’ అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు సూచించామన్నారు. -
‘హిట్ అండ్ రన్’కు అంత కఠిన శిక్ష సబబేనా?
న్యాయ శిక్షాస్మృతుల్లో ఇటీవల కేంద్రం గణనీయమైన మార్పులతో కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్(IPC)కి ప్రత్యామ్నాయంగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు ట్రక్ డ్రైవర్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. హిట్ అండ్ రన్లకు మరీ అంత శిక్ష సబబేనా? అనే చర్చ సోషల్ మీడియాలోనూ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ‘హిట్ అండ్ రన్’ గణాంకాలు ఆందోళన కలిగించే అంశమేనని కొందరు గణాంకాలతో చెబుతున్నారు. హిట్ అండ్ రన్.. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఎక్కడైనా పరిమితికి మించిన వేగంతో టూ వీలర్, కార్లు, ట్రక్కులు రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రమాదానికి కారణమైన వ్యక్తి అక్కడి నుంచి పారిపోతే అది హిట్ అండ్ రన్ అవుతుంది. అలా పరారు కావటాన్ని మన గత చట్టం.. ఇప్పుడు కొత్త చట్టం కూడా నేరపూరిత చర్యగా పేర్కొంటోంది. అయితే.. భారతీయ న్యాయం సంహిత ప్రకారం.. హింట్ అండ్ రన్, ప్రమాదకర డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత చర్యల కిందకు వస్తాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 104లో రెండు నిబంధనలు ఉన్నాయి. మొదటి నిబంధన.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక ప్రాణం పోవడానికి కారణమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైటు శిక్ష ఉంటుంది. దీంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇక రెండో నిబంధన: రోడు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదంటే స్థానిక మెజిస్ట్రేట్‌కు సమాచారం అందించాలి. అలా ఇవ్వకుండా.. ఘటన స్థలం నుంచి పారిపోతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, దాంతో పాటు రూ. 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంత ఆందోళనకరంగా ఉంది కాబట్టే.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో మొత్తంగా 2022 ఏడాది కాలంలో అధికారంగా 67,387 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఆ ప్రమాదాల్లో 30,486 మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 12,250 ప్రమాదాల నమోదయ్యాయి. మహారాష్ట్ర (8768), ఉత్తరప్రదేశ్ (7585), రాజస్థాన్ ( 5618) వంటి పెద్ద రాష్ట్రాల్లో హిట్ అండ్ రన్ ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే.. హిట్ అండ్ రన్ ప్రమాదాలకు మధ్య భారతం కేంద్ర బిందువుగా ఉండటం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ (2099), ఆంధ్రప్రదేశ్(1560) హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో లెక్కలు ఉన్నాయి కాబట్టే.. కఠిన శిక్షల అమలును సమర్థిస్తున్నవాళ్లు లేకపోలేదు. అభ్యంతరాలు అందుకే.. భారతీయ శిక్షాస్మృతి (IPC)లో హిట్ అండ్ రన్ కేసులు సెక్షన్ 304 ఏ కిందకు వస్తాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే గరిష్టంగా రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉంది. అయితే మాములు రోడ్డు ప్రమాదాల కంటే హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో విచారణలు పూర్తై శిక్షలు పక్కాగా అమలవుతున్నాయి. 2022లో విచారణ పూర్తిన హిట్ అండ్ రన్ కేసుల రేటు 47.9గా నమోదైంది. అయితే ఇతర రోడ్డు ప్రమాదాల్లో ఈ రేటు కేవలం 21.8 శాతం మాత్రమే నమోదు కావటం గమనార్హం. కానీ, కొత్త చట్టం ప్రకారం హిట్ అండ రన్ కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తుండడంపై ట్రక్కులు, లారీ, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారురు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ఎవరూ ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే శిక్షతోపాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన బాట పట్టిన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. దీంతో.. ట్రక్కు డ్రైవర్లు తాత్కాలికంగా శాంతించి సమ్మె విరమించారు. -
పోలీసునంటూ షాపులో దౌర్జన్యం
సాక్షి, గుంటూరు: సెల్ టెంపర్ గ్లాసు వేయించుకుని, డబ్బులు అడిగిన షాపు యజమానిని ‘నేను పోలీస్’ అంటూ కొట్టి షాపులోని కొన్ని సామాన్లు ఎత్తుకుపోయిన ఓ వ్యక్తిపె బాధితుడు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పంగడిగుంటలో నివసించే వెనిగళ్ల కిరణ్ మహిళా కళాశాల రోడ్డులో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం మహ్మద్ అబ్దుల్ సిరాజ్ అనే వ్యక్తి షాపునకు వచ్చి సెల్ ఫోన్ పై టెంపర్ గ్లాసు వేయమన్నాడు. గ్లాసు సెల్‌ఫోన్‌కు బిగించుకున్న అనంతరం డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నాడు. కిరణ్ అతనిని డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు అబ్దుల్ సిరాజ్ తాను కానిస్టేబుల్‌ను అని చెప్పి డబ్బులు ఇవ్వనన్నాడు. కిరణ్ అదేమిటని ప్రశ్నించడంతో ఇరువురికి గొడవ జరిగింది. కిరణ్‌పై అబ్దుల్ సిరాజ్ చేయిచేసుకుని షాపులోని సెల్ సామగ్రి కొన్నింటిని తీసి తన బండిలో పెట్టుకుని వాహనం నడుపుకుంటూ వెళ్లి పోయాడు. ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న కిరణ్ వెళ్లిపోతున్న అబ్దుల్ సిరాజ్‌ను వెనుక నుంచి సెల్‌ఫోన్‌తో ఫొటో తీశాడు. దీనిపై కిరణ్ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిరాజ్ బాగా మద్యం తాగి ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
హిట్ అండ్ రన్ : రేడియో జాకీ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌జనశక్తి పార్టీ కార్యకర్త మృతికి కారణమైన కేసులో రేడియో జాకీ (ఆర్జే) అంకిత్ గులాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఆర్జేని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేడియో సిటీ ఆర్జే అంకిత్ గులాటి తన కారును వేగంగా నడుపుతూ ఎల్జేపీ కార్యకర్త ధీరజ్ కుమార్ బైక్‌ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ధీరజ్ కుమార్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద స్థలంనుంచి పారిపోయిన గులాటిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుడి కుటుంబ సభ్యులను శుక్రవారంపరామర్శించారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు గులాటిని అరెస్ట్ చేశారు. -
ముగ్గుర్ని చిదిమేసిన కారు : డ్రైవర్‌ను కొట్టి చంపిన జనం
సాక్షి, పట్నా: బీహార్‌లోని పట్నాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తు, అతివేగం ముగ్గురు చిన్నారుల ఉసురు తీయగా, గ్రామస్తుల ఆగ్రహం, ఆవేశం డ్రైవర్ చావుకు కారణమైంది. అగం కువాన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నలుగురు పిల్లలపై ఒక కారు అతి వేగంగా దూసుకు వచ్చింది. దీంతో ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్‌ను కొట్టి చంపేశారు. డ్రైవర్‌తోపాటు కారులో మరో వ్యక్తిపై కూడా దాడి చేయడంతో అతను తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ మద్యం సేవించి వున్నాడని స్థానికులు మండి పడుతున్నారు. మరోవైపు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అప్తాబ్ అనే వ్యక్తి అతివేగంగా కారు నడుపుతున్నాడు. ఈ క్రమంలో తన కారుతో అదే మార్గంలో వెళ్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న చేతన్ దానియాకు గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా కారుతో అక్కడి నుంచి పరారు కావాలని నిందితుడు అప్తాబ్ యత్నించడంతో మరో కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. నిందితుడు అప్తాబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
జర్నలిస్టుల హత్యలపై స్పందించిన ఐరాస
ఐక్యరాజ్యసమితి : భారత్‌లో జర్నలిస్టుల హత్యలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. జర్నలిస్టులపై వేధింపులకు, హింసకు పాల్పడటం ఆందోళనకరమని, భారత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధకరమని ఐరాస అధ్యక్షుడు అంటోనియో గట్టర్స్ అన్నారు. ఈ విషయాన్ని అంటోనియో డిప్యూటి ప్రతినిధి ఫర్హాన్ హక్ మీడియాకు తెలిపారు. మధ్యప్రదేశ్, బిహార్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పాత్రికేయులు సోమవారం హత్యకు గురికావడం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఇసుకమాఫియాపై వరుస స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి, వారితో పోలీసుల లాలూచీని బయటపెట్టిన టీవీ జర్నలిస్ట్ సందీప్ శర్మను సోమవారం లారీతో ఢీకొట్టించి చంపించారు. లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ శర్మ చికిత్స పొందుతూ మరణించారు. బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఓ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ నవీన్ నిశ్చల్ ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతుండగా వెనకనుంచి ఓ ఎస్యూవీ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నవీన్‌తో పాటు ఆయన స్నేహితుడు అక్కడికక్కడే మరణించారు. తమ కుమారుడ్ని మాజీ సర్పంచ్ అహ్మద్ అలీనే చంపించాడని నవీన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలను కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) తీవ్రంగా ఖండించింది. -
అలా.. మాజీ లవర్‌ను చంపించింది!
సాక్షి, థానే: మహారాష్ట్రలో మరో స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ స్వాతి భర్తను హత్య చేయిస్తే.. మహరాష్ట్రలో మాజీ ప్రియుడిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మాజీ ప్రియుడు చేస్తున్న విపరీత ఒత్తిడిని తట్టుకోలేకే ప్రస్తుత ప్రియుడితో.. అతన్ని హత్య చేయించినట్లు నిందితురాలు 45 ఏళ్ల సుమారి యాదవ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సుమారి యాదవ్‌కు 46 ఏళ్ల రాంజీ శర్మ మధ్య చాలాకాలం పాటు ప్రేమాయణం సాగింది. ఇద్దరూ కొన్నేళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగించారు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. మూడేళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సుమారీ యాదవ్.. ఈ మధ్య 35 ఏళ్ల జయప్రకాష్ చౌహాన్‌తో సహజీవనం సాగిస్తోంది. దాదాపు నాలుగు నెలల నుంచి మాజీ ప్రియుడు రాంజీ శర్మ డబ్బుకోసం సుమారిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపులు, ఇతర ఒత్తిడులు తట్టుకోలేక శర్మను హత్య చేసేందుకు ప్రస్తుత ప్రియుడు చౌహాన్‌తో కలిసి సుమారి ప్లాన్ వేసింది. రాంజీ శర్మకు మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉండడంతో.. పార్క్‌లోనే అతన్ని హత్య చేసేందుకు ఇద్దరూ ప్రణాళిక రూపొందించారు. అనుకున్నట్లుగానే నవంబర్18న శర్మ మార్నింగ్ వాక్నుంచి తిరిగి వస్తున్న సమయంలో.. చౌహాన్ అత్యంత వేగంగా కారుతో అతన్ని ఢీకొట్టి హత్య చేశాడు. ఈ ఘటన తరువాత కారును శుభ్రం చేసి.. యాక్సిండెంట్ అయినట్లు అందరినీ నమ్మించాడు. తాను కొన్నాళ్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు నటించాడు. ఎవరికీ అనుమానం రాకుండా కారును సర్వీసింగ్ చేయించాడు. ఇంత వరకూ బాగానే ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులకు విస్మయం కలిగించే ఈ విషయం బయట పడింది. వెంటనే పోలీసులు సుమారి యాదవ్, చౌహాన్, శర్మల ఫొన్ రికార్డును పరిశీలించారు. విషయం అర్థమైన వెంటనే చౌహాన్, సుమారి యాదవ్‌లను అదుపులోకి తీసుకుని విచానించడంతో.. విషయం మొత్తం బయటపడింది. ఇదిలావుండగా సుమారి యాదవ్‌కు మొత్తం ఐదుగురు సంతానం ఉన్నట్లు తెలిసింది. -
హిట్ అండ్ రన్.. అనాథగా 6 నెలల చిన్నారి!
ఓ కారు డ్రైవర్ అతివేగం కుటుంబం మొత్తాన్ని చిదిమేసింది. భార్యాభర్తలతో పాటు వాళ్ల కొడుకు కూడా మరణించాడు. ఇంటి దగ్గర ఉండిపోయిన ఆరు నెలల చిన్నారి అనాథగా మారింది. ఈ విషాదకరఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో రామ్ సజీవన్ అనే వ్యక్తి సైకిల్ మీద వెళ్తుండగా ఎర్రలైటు పడటంతో సిగ్నల్ వద్ద ఆగాడు. వెనక సీటుమీద భార్య సుందర, ముందు రాడ్ మీద కొడుకు ముకేష్ కూర్చున్నారు. వాళ్లు అలా ఆగారో లేదో.. వెనక నుంచి సిల్వర్ కలర్ శాంత్రో కారు ఒకటి వచ్చి సైకిల్‌ను ఢీకొట్టింది. దాంతో వాళ్లు ముగ్గురూ గాల్లోకి ఎగిరి, డివైడర్‌కు అవతలివైపు రోడ్డుమీద పడ్డారు. తలకు తీవ్రగాయాలు కావడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న తమ కూతురికి మందులు కొనుక్కోడానికి బయటకు వెళ్లిన సజీవన్ కుటుంబం.. అలా నిర్జీవంగా మిగిలిపోయింది. కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసినా, తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. ప్రమాదస్థలంలో కారు నంబర్ ప్లేటు కూడా పడిపోవడంతో డ్రైవర్‌ను గుర్తించడం సులభమైంది. ఆ సమయానికి అక్కడ ఉన్నవాళ్లు కారు పగిలిన విడిభాగాలను సేకరించారు. వాటిలో నంబర్ ప్లేటు కూడా ఉంది. వాటన్నింటినీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు సీసీటీవీ కెమెరా ఫీడ్ కూడా చూసి, శివకుమార్ అనే కారు డ్రైవర్‌ను అతడి ఇంటి వద్ద అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగే సమయానికి తాను కూడా వాళ్ల వెనకాలే సైకిల్ మీద వెళ్తున్నానని, ఉన్నట్టుండి వాళ్లు గాల్లో ఎగిరి రోడ్డుకు అవతలివైపు పడిపోయారని, అయితే కారు బాగా వేగంగా వెళ్లిపోవడంతో పట్టుకోలేకపోయామని సుందర అన్న శారదా ప్రసాద్ తెలిపారు. అనాథగా చిన్నారి.. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు అన్నను కూడా పోగొట్టుకున్న 6 నెలల రిధి అనాథగా మారిపోయింది. ఎప్పుడూ అమ్మానాన్నలతోనే ఉండటంతో... వాళ్లకోసం విపరీతంగా ఏడుస్తోంది. ఇంకా తల్లిపాలే అలవాటు ఉండటంతో కనీసం సీసాతో పాలు కూడా తాగడం లేదు. ఆమెను ఎలా సముదాయించాలో తమకు అర్థం కావడం లేదని.. సజీవన్ ఇంటి పక్కనే ఉండే అతడి బావమరిది శారదా ప్రసాద్ చెప్పారు. -
దూసుకెళ్లిన లారీ: హోంగార్డ్ మృతి
-
దూసుకెళ్లిన లారీ: హోంగార్డ్ మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద తనిఖీ చేస్తున్న హోంగార్డ్ అహ్మద్పైకి శనివారం లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే లారీ మాత్రం ఆగకుండా వెళ్లి పోయింది. దీంతో అక్కడే సహాచర పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనకు బాధ్యుడైన లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అలాగే అహ్మద్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
వరంగల్ : వరంగల్ జిల్లా మరిపెడ మండలం నీలికుర్తి స్టేజి సమీపంలో ఓ వృద్ధుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నీలికుర్తి పంచాయతీ భజనతండాకు చెందిన బానోతు హనుమ (70) గా స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
100 కి.మీ వేగంతో వరుసగా ముగ్గురిని ఢీకొట్టి..
న్యూఢిల్లీ: ఓ పార్టీలో పీకలదాకా మద్యం తాగి ఇష్టం వచ్చినట్లు కారునడుపుతూ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలుపోయేందుకు కారణమయ్యాడు ఓ యువకుడు. వరుసగా రెండుసార్లు తన కారుతో ఢీకొట్టి ఇద్దరు ప్రాణాలు తీయడమే కాకుండా మరొకరిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు అతడు 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాడట. 1.5కిలోమీటర్ల దూరంలోనే వరుసగా ఈ ముగ్గురుని అతడు ఢీకొట్టి అనంతరం పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం ఢిల్లీలోని జనక్ పురికి చెందిన రిషబ్ అనే 21 ఏళ్ల యువకుడు తన తండ్రి హోండా సిటీ కారు తీసుకొని పార్టీకి వెళ్లాడు. నగరంలోని ఓ ప్రముఖ వర్సిటీలో బిజినెస్ మేనేజ్ మెంట్ చదువుతున్న అతడు పార్టీలో ఫుల్లుగా తాగి వస్తూ తొలుత మార్నింగ్ వాక్ కు వెళ్లొస్తున్న కామేశ్వర్ ప్రసాద్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా మరింత వేగంగా వెళుతూ అశ్వని ఆనంద్ అనే 67 ఏళ్ల పెద్ద మనిషిని ఢీకొట్టాడు. తిరిగి అదే వేగంతో పేవ్ మెంట్ మీదుగా వెళుతూ సంతోష్ అనే వ్యక్తిని గుద్దేయగా అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసుల పెట్రోలింగ్ వాహనం అతడిని చేజ్ చేసి పట్టుకుంది. ఆ కారును సీజ్ చేసి అతడిపై కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాలపాలయిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఆ కారులో మద్యం సీసా కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు. -
కారు ఢీకొట్టడంతో.. ఎగిరిపడినా..!
లండన్: హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకుని మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. వేగంగా వెళ్తున్న కారు 53 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టి, ఆపకుండా వెళ్లిపోయింది. కారు ఢీకొట్టగానే బాధితుడు కారుపై ఎగిరిపడి వెనకాల రోడ్డుపై పడ్డాడు. ఈ నెల 14న ఇంగ్లండ్‌లోని బ్రిగ్టన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు నమోదైన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. కెంప్టౌన్ ప్రాంతంలో బాధితుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుడి తలకు తీవ్రంగా గాయలయ్యాయి. బాధితుడు కోలుకుంటున్నాడని, ప్రమాదం లేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ముంబైలో హిట్ అండ్ రన్
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం అర్ధరాత్రి హిట్ రన్ అండ్ రన్ ఘటన జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి మెర్సిడెజ్ బెంజ్ కారు దూసుకెళ్లింది. దక్షిణ ముంబైలోని మహ్మద్ అలీ రోడ్డులో అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో నలుగురు మహిళలు, చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను జేజే ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన కారు డ్రైవర్ ను తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుట్ పాత్ పైకి దూసుకొచ్చే ముందు మరో రెండు వాహనాలను కారు ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. జార్ఖండ్ నంబర్ ప్లేటుతో ఉన్నట్టు ఈ కారు ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, కారులో ఎంత మంది ఉన్నారనేది ఇంకా తెలియలేదని పోలీసు సీనియర్ అధికారి అశోక్ దూధే తెలిపారు. -
వాహనం ఢీకొని తండ్రీకూతుళ్లు మృతి
వరంగల్ : వరంగల్ కురువి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని తండ్రీకూతుళ్లు మరణించారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
మరి మా నాన్నను చంపిందెవరు?
ముంబై: 13 ఏళ్ల పాటు తన మదిలో మెదిలిన ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయంటూ 2002 హిట్ అండ్ రన్ కేసు బాధితుడు బాంబే హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సల్మాన్ ఖాను నిర్దోషిగా ప్రకటించడంపై ఆవేదన వెలిబుచ్చాడు. ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నూరుల్లా ఖాన్ కుమారుడు ఫిరోజ్ షేక్(25) తన తండ్రిని ఎవరు చంపారన్న ప్రశ్నకు ఇప్పటికీ తనకు సమాధానం దొరకలేదని వాపోయాడు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అతడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తన తండ్రికి ఆత్మకు శాంతి కలగలేదంటూ షైక్ కన్నీరు పెట్టాడు. ఆయన (సల్మాన్) అమాయకుడైతే మరి తన తండ్రిని చంపింది ఎవరని ఫిరోజ్ ప్రశ్నిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమాలంటే పడి చచ్చిపోయే తనకు, సల్మాన్ విడదల కావడంపై బాధ లేదన్నాడు. కానీ, తన తండ్రిని పొట్టన పెట్టుకుంది ఎవరో తనకు తెలియాలని డిమాండ్ చేస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణమైన సల్మాన్ ను క్షమిస్తాను.. కానీ నిజమేంటో సమాజానికి తెలియాలని కోరుతున్నాడు. కాగా 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. అయితే ఆనాటి ప్రమాదంలో తండ్రి నూరుల్లా ఖాన్ చనిపోవడతో ఫిరోజ్ షేక్ చదువు మానేసి కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు. కాగా, సల్మాన్ ఖాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. -
'ఉమ్మేసి పారిపోవడం రాహుల్ విధానం'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శల స్థాయిని మరింత పెంచింది. ఉమ్మేసి పారిపోవడం, ఢీకొట్టి పారిపోవడం రాహుల్ గాంధీ రాజకీయ విధానాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ కోసం ర్యాలీ నిర్వహించిన మాజీ మిలటరీ అధికారులకు రాహుల్ తన మద్ధతు తెలిపి అనంతరం బీజేపీ విమర్శలు చేయడంపట్ల స్పందిస్తూ రవిశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓపక్క రాహుల్ పార్టీ నడుపుతున్న విధానంపై ఆ పార్టీలోని ఎందరో సీనియర్ నేతలు పెదవి విరుస్తుండగా.. కొంతకాలం తర్వాత పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని అధినేత్రి సోనియాగాంధీ భావిస్తున్నారని విమర్శించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, సమస్యను పరిష్కరించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్యాకేజీ, రిప్యాకేజీ ఇచ్చేందుకు సోనియాగాంధీ ప్రయత్నించారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు రాహుల్‌కు వెంటనే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని పెద్ద స్థాయిలో గొంతెత్తి నినదిస్తే ఈరోజు అలా నినదించేవారి సంఖ్య తగ్గిందని అన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీ కొని మహిళ మృతి
ఖమ్మం : గుర్తు తెలియని వాహనం ఢీ కొని మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం ఖమ్మం రూరల్ మండలం నాయుడిపేట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఆరేకొడూ గ్రామానికి చెందిన లక్ష్మీ(50) అనే మహిళను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వాహనం వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు. -
యాక్సిడెంట్ చేస్తే 304 కొరడా
- హిట్ అండ్ రన్‌గా పోలీసుల నిర్ణయం - నటుడు సల్మాన్‌ఖాన్‌పై ఇదే తరహా కేసు - గొల్లపూడి ప్రమాదంలో లారీడ్రైవర్పై నమోదు - నగరంలో ఇదే తొలిసారి విజయవాడ సిటీ : బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై పెట్టిన రోడ్డు ప్రమాదం కేసు గుర్తుందా? ఇప్పటికే ఆ కేసులో సల్మాన్‌కు శిక్ష పడింది. ఇదే తరహా కేసుల నమోదుకు నగర పోలీసులూ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి గొల్లపూడి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన లారీడ్రైవర్పైనా సల్మాన్‌ఖాన్‌పై నమోదుచేసిన సెక్షన్ 304 (ప్రాణహరణం) కింద కేసు నమోదుచేశారు. ఇదే మొదటిసారి రోడ్డు ప్రమాదాలపై సీరియస్‌గా దృష్టిసారించిన ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్య వైఖరిపై సెక్షన్ 304 నమోదుచేయడం నగరంలో ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన ఎవరైనా మృత్యువాత పడితే సెక్షన్ 304ఎ (నిర్లక్ష్యపు డ్రైవింగ్) ఐపీసీ కింద ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసేవారు. ప్రమాదాలను అరికట్టేందుకే.. కేసు నుంచి బయటపడిన డ్రైవర్లు పదేపదే వాహనాలు నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇకపై వీరిని ఉపేక్షించరాదంటూ తీసుకున్న నిర్ణయంలో భాగంగానే.. గొల్లపూడిలో మంగళవారం రాత్రి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన లారీడ్రైవర్పై సెక్షన్ 304 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. 304 కింద కేసు అయితే లెసైన్‌స లేనట్టే.. 304 సెక్షన్ ప్రకారం సంబంధిత డ్రైవర్ లెసైన్స్ సస్పెండ్‌చేసి విచారణ జరుపుతారు. కేసు విచారణలో ఉండగా లెసైన్స్ పునరుద్ధరించడం జరగదు. గతంలో మాదిరి జరిమానాలు చెల్లించి బయటపడొచ్చనే ఆలోచించే వారికి నగర పోలీసు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ఇబ్బందికరమేనని చెప్పొచ్చు. అధికారులతో విచారణ ప్రతి రోడ్డు ప్రమాద కేసును ప్రాధాన్యత కలిగినదిగా పరిగణించి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించనున్నట్టు నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ ప్రమాద కారణాలను నిష్పక్ష పాతంగా నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నిర్ధారణ అయిన అంశాల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. పెద్ద వాహనాల డ్రైవర్లను నేరస్తులుగా పరిగణించే సంప్రదాయానికి స్వస్తిపలికి వాస్తవాల ఆధారంగా శాస్త్రీయ పరిశోధన నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వాహనాలకు పూర్తిస్థాయిలో ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆయన సూచించారు. -
సల్మాన్ ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందా?
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచి మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హిట్ రన్ కేసులో సల్మాన్ ఖాన్.. ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించి సంచలనానికి తెరలేపారు. అంతేకాదు వీధి కార్మికులకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి, సల్మాన్‌ఖాన్‌కు వత్తాసు పలికిన బాలీవుడ్ సింగర్‌ను అరెస్టు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. సల్మాన్ ముస్లిం కాకపోయి వుంటే బెయిల్ లభించేది కాదని సాధ్వి ప్రాచీ అభిప్రాయాపడ్డారు. చట్టం దృష్టిలో అందరూ సమానమని, బాధితులైన నిరుపేదలకు కూడా న్యాయం జరగాలని ఆమె సూచించారు. అలాగే మాలేగావ్ పేలుళ్ల కేసులో జైల్లో ఉన్న సాధ్వి ప్రగ్యాను విడుదల చేయాలని సాధ్వీ ప్రాచి డిమాండ్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చిన ముంబై సెషన్స్ కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం రెండురోజుల తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది. అనంతరం శుక్రవారం సెషన్స్ కోర్టు తీర్పును నిలుపుదల చేసిన ముంబై హైకోర్టు సల్లూ భాయ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే సాధ్వీ ప్రాచీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సాధ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటూ ఇటీవల వ్యాఖ్యానించి వివాదం రేపారు. పైగా తానేమీ తప్పు మాట్లాడలేదనీ..30,40 మందిని కనమన్నానా అంటూ సమర్ధించుకున్నారు. పైగా ఎక్కువమంది పిల్లల్ని కన్న హిందూ మహిళలకు అవార్డులు ఇచ్చి సత్కరించాలని సూచనలు చేశారు.