
ఐక్యరాజ్యసమితి : భారత్‌లో జర్నలిస్టుల హత్యలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. జర్నలిస్టులపై వేధింపులకు, హింసకు పాల్పడటం ఆందోళనకరమని, భారత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధకరమని ఐరాస అధ్యక్షుడు అంటోనియో గట్టర్స్ అన్నారు. ఈ విషయాన్ని అంటోనియో డిప్యూటి ప్రతినిధి ఫర్హాన్ హక్ మీడియాకు తెలిపారు.
మధ్యప్రదేశ్, బిహార్‌లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పాత్రికేయులు సోమవారం హత్యకు గురికావడం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఇసుకమాఫియాపై వరుస స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి, వారితో పోలీసుల లాలూచీని బయటపెట్టిన టీవీ జర్నలిస్ట్ సందీప్ శర్మను సోమవారం లారీతో ఢీకొట్టించి చంపించారు. లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ శర్మ చికిత్స పొందుతూ మరణించారు.
బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఓ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ నవీన్ నిశ్చల్ ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతుండగా వెనకనుంచి ఓ ఎస్‌యూవీ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నవీన్‌తో పాటు ఆయన స్నేహితుడు అక్కడికక్కడే మరణించారు. తమ కుమారుడ్ని మాజీ సర్పంచ్ అహ్మద్ అలీనే చంపించాడని నవీన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలను కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) తీవ్రంగా ఖండించింది.