journalist murder
-
నంద్యాలలో విలేకరి దారుణహత్య
బొమ్మలసత్రం: కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్ చానల్ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్యచేశారు. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల సమాచారం మేరకు.. కేశవ వారం కిందట గుట్కా వ్యాపారితో టూటౌన్ కానిస్టేబుల్ సుబ్బయ్యకు ఉన్న సంబంధాలను బట్టబయలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి కానిస్టేబుల్ సుబ్బయ్యను సస్పెండ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కానిస్టేబుల్ సుబ్బయ్య ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్ కాలనీలోని ఆటోస్టాండ్ వద్దకు పిలిపించాడు. కేశవ తోటి రిపోర్టర్ ప్రతాప్‌తో కలిసి ఎన్జీవోస్ కాలనీకి వెళ్లారు. అక్కడ కేశవతో ప్రత్యేకంగా మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అప్పటికే కేశవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్ అవినీతి వ్యాపారాన్ని బట్టబయలు చేసిన విలేకరిని హత్యచేయటం పట్ల జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కేశవ మృతదేహాన్ని డీఎస్పీ చిదానందరెడ్డి, తాలుకా సీఐ మురళిమోహన్‌రావు పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. -
ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు దారుణ హత్య!
ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఏబీపీ న్యూస్‌చానల్ విలేకరి సులభ్ శ్రీవాస్తవ(42) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లిక్కర్ మాఫియా తన భర్తను పొట్టన పెట్టుకుందని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం హత్య కేసు నమోదు చేశారు. సులభ శ్రీవాస్తవ మరణం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. జర్నలిస్టు మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సులభ్ శ్రీవాస్తవ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాన్ని వెలికితీసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జర్నలిస్టుల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. పోలీసుల కథనం ప్రకారం.. జర్నలిస్టు సులభ్ శ్రీవాస్తవ ఇటీవలే లిక్కర్ మాఫియాపై కీలక సమాచారం సేకరించాడు. దీని ఆధారంగా ఏబీపీ న్యూస్ చానల్‌పై పరిశోధనాత్మక కథనం ప్రసారమయ్యింది. తమ జోలికి రావొద్దంటూ లిక్కర్ మాఫియా నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సులభ్ శ్రీవాస్తవ పోలీసులకు లేఖ రాశాడు. ఆదివారం లాల్గంజ్లో వార్తల సేకరణ కోసం సులభ్ శ్రీవాస్తవ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చాడు. తర్వాత సుఖ్‌పాల్ నగర్ ఇటుక బట్టీ వద్ద తీవ్ర గాయాలతో లేవలేని స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతడి ద్విచక్ర వాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొట్టినట్లు అక్కడి దృశ్యాన్ని బట్టి తెలుస్తోంది. కానీ, లిక్కర్ మాఫియానే సులభ్‌ను హత్య చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
జర్నలిస్ట్ హత్య కేసు: డేరా బాబాకు యావజ్జీవ శిక్ష
-
సూట్‌కేసుల్లో ఖషొగ్గీ శరీర భాగాలు!
అంకారా : సౌదీ అరేబియా జర్నలిస్ట్ జమాల్ ఖషొగ్గీని అత్యంత దారుణంగా హతమార్చారనే వాదనలకు బలం చేకూరుతోంది. ఖషోగ్గీ శరీర భాగాలను కొందరు వ్యక్తులు సూట్‌కేసులు, బ్యాగుల్లో తరలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను తాజాగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు 5 సూట్ కేసులు, 2 పెద్ద సంచులను ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ జనరల్ ఇంట్లోకి తీసుకెళ్తున్నట్లుగా ఉన్న వీడియో ఫుటేజీని ఎ–హబేర్ అనే టర్కీ టీవీ చానల్ ఆదివారం ప్రసారం చేసింది. ఆ ఇంటికి సమీపంలో ఉన్న సౌదీ కాన్సులేట్‌లోనే 2018 అక్టోబర్‌లో ఖషొగ్గీ(59) హత్యకు గురైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఆ బ్యాగులు, సూట్ కేసుల్లోనే తరలించారని తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఆ చానల్ పేర్కొంది. అయితే, అప్పట్లో ఖషొగ్గీ శరీర భాగాలను యాసిడ్‌లో వేసి ఆనవాళ్లు దొరక్కుండా చేశారని అనుమానాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. (ఖషోగ్గీ హత్య; సౌదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?) Suudi Arabistan'ın İstanbul Başkonsolosluğunda katledilen gazeteci Kaşıkçı cinayetine ilişkin özel görüntüler A Haber’e ulaştı. A Haber ekranlarında ilk kez izleyeceğiniz o görüntülerde Kaşıkçı'nın parçalanmış bedeninin olduğu bavulların konsolosluk konutuna taşındığı görülüyor pic.twitter.com/ojqJ4AxyL3 — A Haber (@Ahaber) December 31, 2018 -
సౌదీపై ఆంక్షలేం ఉండవు: ట్రంప్
వాషింగ్టన్: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు సంబంధించి సౌదీ అరేబియాపై చర్యలు, ఆంక్షలేవీ విధించకూడదన్న తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా సౌదీతో వ్యూహాత్మక సంబంధాలను నెరపడం, ముడి చమురు ధరలు తక్కువగా ఉండేలా చూడటమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కంట్రిబ్యూటర్‌గా పనిచేసే ఖషోగ్గీని సౌదీ అరేబియా అధికారులు గత నెలలో ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో దారుణంగా హత్య చేయడం తెలిసిందే. -
సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య
వాషింగ్టన్: సౌదీఅరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. సల్మాన్‌కు తెలియకుండా లేదా అతని ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటన జరిగే ప్రసక్తే లేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఏను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. యువరాజు సల్మాన్ నిర్ణయాలపై విమర్శనాత్మక కథనాలు రాసిన ఖషోగ్గీ అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్లి అదృశ్యమయ్యారు. సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య జరిగిందని సీఐఏ చెప్పడం అమెరికా–సౌదీ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పథకం ప్రకారమే ఖషోగ్గీ హత్య: టర్కీ
ఇస్తాంబుల్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీని సౌదీ అరేబియా అధికారులు ముందస్తు ప్రణాళికతో పథకం ప్రకారమే హత్య చేశారని ఈ కేసు విచారణలో టర్కీ బృందానికి నేతృత్వం వహించిన అధికారి చెప్పారు. గత నెల 2న ఆయన ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయానికి రాగానే గొంతు నులిమి చంపేసి, శరీరాన్ని ముక్కలుగా నరికారని అధికారి చెప్పారు. మృతదేహం ఆనవాళ్లు లభించలేదన్నారు. సౌదీ యువరాజుకు వ్యతిరేకంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ఖషోగ్గీ వార్తలు రాసేవారు. -
రాయబార కార్యాలయానికి వెళ్లి అదృశ్యమైన విలేకరి
వాషింగ్టన్: వాషింగ్టన్ పోస్ట్‌కు విలేకరి (కంట్రిబ్యూటర్)గా పనిచేస్తున్న, సౌదీ అరేబియాకు చెందిన జమాల్ ఖషొగ్గీ కనిపించకుండా పోవడం వెనుక సౌదీ అరేబియా హస్తం ఉండొచ్చనీ, ఖషొగ్గీ హత్యకు గురై ఉంటే అందుకు కారకులను కఠినంగా శిక్షిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరోక్షంగా సౌదీని హెచ్చరించారు. ఖషొగ్గీ సౌదీ ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలను అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో రాసేవారు. తన వ్యక్తిగత పనిపై ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఖషొగ్గీ కనిపించకుండా పోయారు. కార్యాలయం లోపలే ఖషొగ్గీ్గని హత్య చేసి ఉంటారని టర్కీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో సత్వరమే చర్యలు చేపట్టాలని ట్రంప్‌పై కాంగ్రెస్ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఖషొగ్గీ ఆచూకీ విషయమై సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. ఏమయ్యాడో మేం కనిపెడతాం.. ‘టర్కీలో ఏం జరిగిందో, ఖషొగ్గీ ఏమయ్యాడో మేం కనిపెడతాం. ఈ విషయంలో ఎవ్వరికీ వివరాలు తెలియవు’ అని ట్రంప్ అన్నారు. అయితే సౌదీ రాజుతో తన చర్చలు ఏ విధంగా ఉంటాయో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. సీబీఎస్ వార్తా చానల్ ‘60 మినిట్స్’ కార్యక్రమంలోనూ.. ఖషొగ్గీ్గని సౌదీనే హత్య చేసిందంటారా? అని ట్రంప్‌ను ప్రశ్నించగా ‘ వాళ్లే అయ్యుంటారా? అవునేమో!’ అని అన్నారు. ఒకవేళ ప్రచారం జరగుతున్నట్లుగా సౌదీనే ఖషొగ్గీని హత్య చేసిందని తేలితే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా, గతంలో తాను ప్రకటించినట్లు సౌదీకి ఆయుధాల సరఫరాను మాత్రం ఆపననీ, ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఆయుధాల సరఫరాపై ఆంక్షల వల్ల ఇక్కడి ఉద్యోగాలు పోతాయి. ఆ దేశంతో మనకు ఉన్న ఒప్పందాలు రద్దవుతాయి. దేశంలో నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్యను తీసుకోను. అయితే హత్యకు కారకులపై తీవ్ర చర్యలుంటాయి. ఆంక్షలుంటాయి’ అని చెప్పారు. అన్నీ నిరాధార ఆరోపణలే: సౌదీ ఇస్తాంబుల్‌లోని తమ రాయబార కార్యాలయంలోనే ఖషొగ్గీ హత్యకు గురయ్యాడన్న ఆరోపణలను సౌదీ అరేబియా శనివారం తోసిపుచ్చింది. అవన్నీ అబద్ధాలు, ఆధారాల్లేని ఆరోపణలేనని కొట్టిపారేసింది. ఖషొగ్గీ్గని సౌదీ అధికారులు రాయాబార కార్యాలయంలోనే చంపేశారనేందుకు భవనం లోపల తీసిన వీడియో రికార్డులు ఉన్నాయని టర్కీ అధికారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఈ విషయంపై టర్కీ ప్రభుత్వంతో మాట్లాడేందుకు సౌదీ నుంచి ఓ బృందం శుక్రవారమే టర్కీకి చేరుకుంది. అక్కడ సౌదీ హోం మంత్రి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఖషొగ్గీ్గని చంపేందుకు సౌదీ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాలన్నీ అబద్ధాలు, నిరాధార ఆరోపణలేనని చెప్పారు. రికార్డర్ ఆన్ చేసి వెళ్లాడా? సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లే ముందు ఖషొగ్గీ తన చేతికున్న యాపిల్ గడియారంలో రికార్డింగ్ ఆన్ చేశారనీ, ఆయనను సౌదీ అధికారులు విచారించి, హింసించి, హత్య చేస్తున్నప్పుడు వారు మాట్లాడిన మాటలన్నీ రికార్డయ్యి, ఆ ఫైల్స్ ఆయన ఫోన్‌కు, ఐ క్లౌడ్‌కు వెళ్లాయని టర్కీ పత్రిక సబా పేర్కొంది. ఖషొగ్గీ్గ నాడు తన ఫోన్‌ను భార్యకు ఇచ్చి రాయబార కార్యాలయానికి వచ్చారని తెలిపింది. గడియారంలో రికార్డర్ ఆన్‌లో ఉండటాన్ని ఆలస్యంగా గుర్తించిన సౌదీ అధికారులు అనేక పాస్‌వర్డ్‌లతో ప్రయత్నించినప్పటికీ వాచ్‌లో ఉన్న ఫైల్స్‌ను ఓపెన్ చేయలేకపోయారనీ, చివరకు ఖషొగ్గీ వేలిముద్రతో వాచ్‌ను అన్‌లాక్ చేసి కొన్ని ఫైళ్లను మాత్రం డిలీట్ చేయగలిగారని సబా పేర్కొంది. అయితే యాపిల్ గడియారాలను వేలిముద్రతో లాక్, అన్‌లాక్ చేసే సదుపాయం లేదని యాపిల్ ప్రతినిధి ఒకరు వెల్లడించడం గమనార్హం. -
జర్నలిస్టుల హత్యలపై స్పందించిన ఐరాస
ఐక్యరాజ్యసమితి : భారత్‌లో జర్నలిస్టుల హత్యలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. జర్నలిస్టులపై వేధింపులకు, హింసకు పాల్పడటం ఆందోళనకరమని, భారత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధకరమని ఐరాస అధ్యక్షుడు అంటోనియో గట్టర్స్ అన్నారు. ఈ విషయాన్ని అంటోనియో డిప్యూటి ప్రతినిధి ఫర్హాన్ హక్ మీడియాకు తెలిపారు. మధ్యప్రదేశ్, బిహార్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పాత్రికేయులు సోమవారం హత్యకు గురికావడం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఇసుకమాఫియాపై వరుస స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి, వారితో పోలీసుల లాలూచీని బయటపెట్టిన టీవీ జర్నలిస్ట్ సందీప్ శర్మను సోమవారం లారీతో ఢీకొట్టించి చంపించారు. లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ శర్మ చికిత్స పొందుతూ మరణించారు. బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఓ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ నవీన్ నిశ్చల్ ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతుండగా వెనకనుంచి ఓ ఎస్యూవీ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నవీన్‌తో పాటు ఆయన స్నేహితుడు అక్కడికక్కడే మరణించారు. తమ కుమారుడ్ని మాజీ సర్పంచ్ అహ్మద్ అలీనే చంపించాడని నవీన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలను కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) తీవ్రంగా ఖండించింది. -
ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్ట్ దారుణ హత్య
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మరో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఓ హిందీ దినపత్రికలో పనిచేస్తున్న నవీన్ గుప్తా అనే జర్నలిస్ట్‌ను గురువారం గుర్తుతెలియని దుండగులు తుపాకీతో దారుణంగా కాల్చిచంపారు. బిలహౌర్ నగరపాలిక సంస్థ మార్కెట్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటకు వస్తున్న గుప్తాపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. గుప్తా మృతిపై సంతాపం తెలిపిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. నిందితుల్ని పట్టుకునేందుకు విచారణను వేగవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ సుల్ఖన్‌సింగ్‌ను ఆదేశించారు. హత్యకు పాతకక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు చెప్పారు. -
జర్నలిస్టు హత్యను ఖండించిన ఐఎన్ఎస్
న్యూఢిల్లీ: త్రిపుర రాష్ట్రంలో బెంగాలీ పత్రిక ‘షాన్‌దాన్ పత్రిక’ జర్నలిస్టు సుదీప్‌దత్త భౌమిక్ హత్యను ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తీవ్రంగా ఖండించింది. తన అవినీతిపై కథనాలు ప్రచురించినందుకు ప్రతీకారంగా త్రిపుర స్టేట్ రైఫిల్స్(టీఎస్ఆర్) కమాండెంట్‌కు బాడీగార్డుగా పనిచేస్తున్న నంద రెయాంగ్ అనే కానిస్టేబుల్ సుదీప్‌ను మంగళవారం కాల్చిచంపిన సంగతి తెలిసిందే. పాత్రికేయుడిని కానిస్టేబుల్ హత్య చేయడం తీవ్రమైన విషయమని ఐఎన్ఎస్ అధ్యక్షురాలు అఖిల ఉరంకార్ బుధవారం వ్యాఖ్యానించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రెండు నెలల్లోపే త్రిపురలో జర్నలిస్టు హత్యకు గురికావడం ఇది రెండోసారి. ఇలాంటి హత్యలతో పాత్రికేయుల్లో అభద్రతాభావం పెరిగే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. జర్నలిస్టులపై దాడులకు ఉసిగొల్పుతున్న ఈ హింసావాతావరణాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. -
బ్యాగులో దొరికిన జర్నలిస్టు తల, రెండు కాళ్లు
కొపెన్హాగెన్, డెన్మార్క్ : అదృశ్యమైన స్వీడన్ మహిళా జర్నలిస్టు విగత జీవిగా కనిపించారు. అది కూడా కేవలం తల, కాళ్లు మాత్రమే ముక్కలుముక్కలుగా లభించాయి. ఈ విషయాన్ని డానిష్ పోలీసులు స్పష్టం చేశారు. సొంతంగా ఓ జలాంతర్గామిని తయారు చేసిన పీటర్ మాడ్సన్ను అదే జలాంతర్గామిలో ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన స్వీడన్‌కు చెందిన కిమ్ వాల్ అనే మహిళా జర్నలిస్టు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమెకోసం గాలిస్తున్న పోలీసులకు సముద్రంలో రెండు బ్యాగులు లభించాయి. ఒక బ్యాగ్‌లో తల రెండు కాళ్లు ఉండగా మరో బ్యాగులో ఆమె దుస్తులు ఇతర వస్తువులు కనిపించాయి. విడి భాగాలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా అవి జర్నలిస్టు కిమ్ వాల్వేనని స్పష్టం చేశారు. తొలుత ఆగస్టు 21న తల లేని ఆమె మొండెం భాగం మాత్రమే కోపెన్ హాగన్లోని సముద్రంలో పోలీసులకు లభించగా మిగతా భాగాలను కూడా గాలించి చివరకు నిర్ధారించారు. ఈ హత్యలో పీటర్ మ్యాడ్సన్ను నిందితుడిగా చేర్చారు. కిమ్ వాల్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
జర్నలిస్టు హత్య.. ముగ్గురి అరెస్టు
గుజరాత్లో జర్నలిస్టు కిశోర్ దవే (53) హత్యకేసులో ముగ్గురిని అరెస్టుచేశారు. తన కార్యాలయంలో వార్తుల రాస్తుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయనను పొడిచి చంపిన విషయం తెలిసిందే. 'జైహింద్' అనే గుజరాతీ వార్తాపత్రికకు సౌరాష్ట్ర ప్రాంతంలోని జూనాగఢ్ నగరంలో బ్యూరోచీఫ్‌గా వ్యవహరిస్తున్న దవే సోమవారం రాత్రి ఓ స్టోరీ రాస్తుండగా 9 గంటల ప్రాంతంలో అతడిని పదే పదే కత్తులతో పొడిచి చంపారు. ఆ సమయానికి ఆఫీసులో ఆయనకొక్కరే ఉన్నారు. ఆఫీసు కూడా ఒకే గదిలో ఉండటంతో అందులో సెక్యూరిటీ కెమెరాలు కూడా ఏమీ లేవు. కాసేపటి తర్వాత వచ్చిన ఆఫీసు బోయ్ దవే మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలిపాడు. వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికరి ఒకరు తెలిపారు. అయితే.. బీజేపీ స్థానిక నాయకుడు రతీలాల్ సూరజ్ కొడుకే ఈ హత్య చేయించి ఉంటాడని దవే బంధువులు ఆరోపిస్తున్నారు. సూరజ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. దవే ఉప్పు అందించడం వల్లే కొన్ని స్థానిక పత్రికలలో తనపై లైంగిక ఆరోపణల కథనాలు వచ్చాయని రతీలాల్ కొడుకు డాక్టర్ భవేష్ సూరజ్ ఇంతకుముందు ఆరోపించారు. వాట్సప్ మెసేజిల ద్వారా సదరు డాక్టర్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారన్న ఆరోపణలతో దవే ఇంతకుముందు గత సంవత్సరం అక్టోబర్ నెలలో అరెస్టయ్యారు. -
విలేకరి హత్య
వేలూరు: వేలూరులోని కస్పా ప్రాంతం లో ఇంటిలో నిద్రిస్తున్న పత్రికా విలేకరిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కస్పా ప్రాంతంలోని ధర్మకర్త పరమశివం వీధికి చెందిన గోపి కుమారుడు సతీష్‌కుమార్(24). ఇతని తండ్రి మృతి చెందడంతో తల్లి వనజ సీఎంసీ ఆసుపత్రిలో పనిచేస్తోంది. అవ్వ, తాత, అన్న వసంత్‌కుమార్ కలిసి ఇంటిని అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. సతీష్‌కుమార్ వేలూరులో దినకరన్ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి వనజ విధులకు వెళ్లడంతో సతీష్‌కుమార్,అన్న వసంత్‌కుమార్ కలిసి ఇంటి మిద్దెపైన నిద్రించారు. అవ్వ, తాత బయట హాలులో పడుకుని నిద్రించారు. బుధవారం ఉదయం 3 గంటల సమయంలో సతీష్‌కుమార్ అవ్వను లేపి టీ కావాలన్నాడు. అమ్మ వచ్చిన వెంటనే చేసి ఇస్తామని చెప్పి నిద్రించారు. అనంతరం సీఎంసీ ఆసుపత్రిలో ఉన్న వనజకు వసంత్‌కుమార్ ఫోన్ చేసి సతీష్‌కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి చంపేశారని తెలిపాడు. వనజ ఇంటికి వచ్చి చూడగా సతీష్‌కుమార్ శరీరంపై బట్టలు లేకుండా మెడ, కడుపు, చేతులపై కత్తులతో నరికి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి కేకలు వేసింది. వెంటనే స్థానికులు గమనించి సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విషయం తెలుసుకొని హత్య జరిగిన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అన్న వసంత్ కుమార్ కూడా తలుపులు వేసుకొని నిద్రిస్తున్న సమయంలో ఎవరు హత్య చేసి ఉండవచ్చునని విచారణ జరిపారు. ఇంటి వెనుక వైపున సతీష్‌కుమార్‌ను హత్య చేసిన కత్తులు, మిద్దెపైన రక్తపు మరకలు ఉన్నట్లు గమనించారు. సతీష్‌కుమార్‌కు సెల్‌ఫోన్ ఆధారంగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. -
నెలలోపు ‘జర్నలిస్ట్’ ముసాయిదా బిల్లు
♦ మండలిలో వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం ♦ త్వరలో అఖిలపక్ష భేటీలో చర్చ ముంబై : పాత్రికేయుల రక్షణ చట్టం కోసం డ్రాఫ్టు బిల్లును నెల రోజుల్లోపు రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. శాసనసభ, శాసన మండలి ప్రతిపక్ష నేతలు, గ్రూపు లీడర్లతో చర్చించిన అనంతరం మండలిలో ఈ విషయాన్ని వెల్లడించింది. కాలింగ్ అటెన్షెన్ మోషన్లో భాగంగా మాట్లాడిన మండలి ప్రతిపక్షనేత ధనంజయ్ ముండే, రానురాను జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని, వారి రక్షణ బాధ్యత ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. శాంతాకృజ్‌లో సిలిండర్ పేలుడు ఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుపై దాడి జరిగిందని, బార్ గురించి తెలుసుకోడానికెళ్లిన మరో జర్నలిస్టు హత్యకు గురయ్యాడని చెప్పారు. జర్నలిస్టుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, ఎన్ని రోజుల్లో బిల్లు రూపొందిస్తారో చెప్పాలని డిమాండు చేశారు. ఇందుకు వివరణగా హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే మాట్లాడుతూ, ‘బిల్లు రూపొందించడానికి అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ మంత్రిమండలికి నివేదిక కూడా అందజేసింది. అయితే దాని మీద ఇంతవరకు చర్చ మాత్రం జరగలేదు. ఆ కమిటీలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ బిల్లుకు తుది రూపమివ్వలేదు. కొత్త బిల్లు రూపొం దించడానికి ముందే నారాయణ్ రాణే కమిటీ నివేదికను ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది’ అని వివరించారు. జర్నలిస్టుల భద్రతకు సంబంధించి డెరైక్టర్ జనరల్ తాజాగా సూచనలిచ్చారని చెప్పారు. ‘నెల రోజుల్లోపు డ్రాఫ్టు బి ల్లు రూపొందిస్తాం. అంతకుముందే ఇరు సభల ప్రతిపక్ష నేతలు, గ్రూపు లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. -
'జర్నలిస్ట్ హత్య కేసులో వేగంగా విచారణ'
చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎంవీఎన్ శంకర్ (53) హత్య కేసులో విచారణ వేగవంతం చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు కోరారు. మంగళవారం జిల్లా ఎస్పీని ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రిపోర్టింగ్ పూర్తి చేసుకుని రాత్రి సమయంలో ఇంటికి చేరుకుంటుండగా ముగ్గురు ఆగంతకులు దాడిచేసి తీవ్రంగా గాయపరచడంతో ఆస్పత్రికి తరలించగానే శంకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్‌కు తరలించడంపై వార్తలు రాసినందుకే మాఫియా గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని జర్నలిస్ట్ సంఘాల నేతలు పేర్కొన్నారు. శంకర్ (53) హత్యను ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీయూడబ్ల్యూజే), ఏపీ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీఎన్‌ఈఎఫ్), ప్రెస్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించాయి.