ఖషొగ్గీ
వాషింగ్టన్: వాషింగ్టన్ పోస్ట్‌కు విలేకరి (కంట్రిబ్యూటర్)గా పనిచేస్తున్న, సౌదీ అరేబియాకు చెందిన జమాల్ ఖషొగ్గీ కనిపించకుండా పోవడం వెనుక సౌదీ అరేబియా హస్తం ఉండొచ్చనీ, ఖషొగ్గీ హత్యకు గురై ఉంటే అందుకు కారకులను కఠినంగా శిక్షిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరోక్షంగా సౌదీని హెచ్చరించారు. ఖషొగ్గీ సౌదీ ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలను అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో రాసేవారు. తన వ్యక్తిగత పనిపై ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఖషొగ్గీ కనిపించకుండా పోయారు. కార్యాలయం లోపలే ఖషొగ్గీ్గని హత్య చేసి ఉంటారని టర్కీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో సత్వరమే చర్యలు చేపట్టాలని ట్రంప్‌పై కాంగ్రెస్ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఖషొగ్గీ ఆచూకీ విషయమై సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు.
ఏమయ్యాడో మేం కనిపెడతాం..
‘టర్కీలో ఏం జరిగిందో, ఖషొగ్గీ ఏమయ్యాడో మేం కనిపెడతాం. ఈ విషయంలో ఎవ్వరికీ వివరాలు తెలియవు’ అని ట్రంప్ అన్నారు. అయితే సౌదీ రాజుతో తన చర్చలు ఏ విధంగా ఉంటాయో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. సీబీఎస్ వార్తా చానల్ ‘60 మినిట్స్’ కార్యక్రమంలోనూ.. ఖషొగ్గీ్గని సౌదీనే హత్య చేసిందంటారా? అని ట్రంప్‌ను ప్రశ్నించగా ‘ వాళ్లే అయ్యుంటారా? అవునేమో!’ అని అన్నారు. ఒకవేళ ప్రచారం జరగుతున్నట్లుగా సౌదీనే ఖషొగ్గీని హత్య చేసిందని తేలితే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా, గతంలో తాను ప్రకటించినట్లు సౌదీకి ఆయుధాల సరఫరాను మాత్రం ఆపననీ, ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఆయుధాల సరఫరాపై ఆంక్షల వల్ల ఇక్కడి ఉద్యోగాలు పోతాయి. ఆ దేశంతో మనకు ఉన్న ఒప్పందాలు రద్దవుతాయి. దేశంలో నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్యను తీసుకోను. అయితే హత్యకు కారకులపై తీవ్ర చర్యలుంటాయి. ఆంక్షలుంటాయి’ అని చెప్పారు.
అన్నీ నిరాధార ఆరోపణలే: సౌదీ
ఇస్తాంబుల్‌లోని తమ రాయబార కార్యాలయంలోనే ఖషొగ్గీ హత్యకు గురయ్యాడన్న ఆరోపణలను సౌదీ అరేబియా శనివారం తోసిపుచ్చింది. అవన్నీ అబద్ధాలు, ఆధారాల్లేని ఆరోపణలేనని కొట్టిపారేసింది. ఖషొగ్గీ్గని సౌదీ అధికారులు రాయాబార కార్యాలయంలోనే చంపేశారనేందుకు భవనం లోపల తీసిన వీడియో రికార్డులు ఉన్నాయని టర్కీ అధికారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఈ విషయంపై టర్కీ ప్రభుత్వంతో మాట్లాడేందుకు సౌదీ నుంచి ఓ బృందం శుక్రవారమే టర్కీకి చేరుకుంది. అక్కడ సౌదీ హోం మంత్రి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఖషొగ్గీ్గని చంపేందుకు సౌదీ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాలన్నీ అబద్ధాలు, నిరాధార ఆరోపణలేనని చెప్పారు.
రికార్డర్ ఆన్ చేసి వెళ్లాడా?
సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లే ముందు ఖషొగ్గీ తన చేతికున్న యాపిల్ గడియారంలో రికార్డింగ్ ఆన్ చేశారనీ, ఆయనను సౌదీ అధికారులు విచారించి, హింసించి, హత్య చేస్తున్నప్పుడు వారు మాట్లాడిన మాటలన్నీ రికార్డయ్యి, ఆ ఫైల్స్ ఆయన ఫోన్‌కు, ఐ క్లౌడ్‌కు వెళ్లాయని టర్కీ పత్రిక సబా పేర్కొంది. ఖషొగ్గీ్గ నాడు తన ఫోన్‌ను భార్యకు ఇచ్చి రాయబార కార్యాలయానికి వచ్చారని తెలిపింది. గడియారంలో రికార్డర్ ఆన్‌లో ఉండటాన్ని ఆలస్యంగా గుర్తించిన సౌదీ అధికారులు అనేక పాస్‌వర్డ్‌లతో ప్రయత్నించినప్పటికీ వాచ్‌లో ఉన్న ఫైల్స్‌ను ఓపెన్ చేయలేకపోయారనీ, చివరకు ఖషొగ్గీ వేలిముద్రతో వాచ్‌ను అన్‌లాక్ చేసి కొన్ని ఫైళ్లను మాత్రం డిలీట్ చేయగలిగారని సబా పేర్కొంది. అయితే యాపిల్ గడియారాలను వేలిముద్రతో లాక్, అన్‌లాక్ చేసే సదుపాయం లేదని యాపిల్ ప్రతినిధి ఒకరు వెల్లడించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment