Jamal Khashoggi
-
మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష.. ఇంతకీ ఆమె చేసిన నేరం..?
సల్మా అల్-షెహబ్ అనే 34 ఏళ్ల మహిళకు సౌదీ అరేబియా కోర్టు 34 ఏళ్ల సుదీర్ఘ కారాగార శిక్ష విధించింది. అసమ్మతివాదులను ట్విటర్లో అనుసరించడంతో పాటు వారి పోస్టులను రీట్వీట్ చేశారన్న నేరారోపణలతో కఠిన శిక్ష వేసిందని ‘గార్డియన్’ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేకాదు 34 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా ప్రయాణ నిషేధం విధించింది. సౌదీ అరేబియా మహిళ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న సల్మాకు సుదీర్ఘ జైలు శిక్ష విధించడం పట్ల అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆమెను విడుదల చేయాలని మానవ హక్కుల పరిరరక్షణ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అసలేం జరిగింది? బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న సల్మా అల్-షెహబ్‌ను 2021, జనవరి 15న సౌదీ అరేబియాలో అరెస్ట్ చేశారు. సెలవులకు స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆమెను నిర్బంధించారు. శాంతిభద్రతలకు విఘాతం, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇంటర్నెట్ను వినియోగించారన్న ఆరోపణలతో మొదట ప్రత్యేక ఉగ్రవాద కోర్టు ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా సోమవారం అప్పీల్ కోర్టు 34 సంవత్సరాల జైలు శిక్ష, 34 సంవత్సరాల ప్రయాణ నిషేధం విధిస్తూ తీర్పు చెప్పింది. ఓరల్, డెంటల్ మెడిసిన్‌లో నిపుణురాలైన సల్మా.. ప్రిన్సెస్ నౌరా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పైళ్లై, చిన్న వయసులో ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. Report I #SaudiArabia: 34 years sentence against the women's right activist #SalmaAlShehab 🔴 Read here: https://t.co/1S7sMV0gxY pic.twitter.com/ATjTREgxJM — ESOHR (@ESOHumanRightsE) August 16, 2022 సల్మా విడుదలకు డిమాండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్, ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్, యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఏఎల్క్యుఎస్టీ ఫర్ హ్యూమన్ రైట్స్ వంటి అనేక మానవ హక్కుల సంస్థలు ఈ తీర్పును ఖండించాయి. సల్మా అల్-షెహబ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ‘సల్మాను విడిపించాలని సౌదీ అధికారులను కోరుతున్నాం. ఆమె పిల్లల సంరక్షణకు, ఆమె చదువును పూర్తి చేయడానికి వీలు కల్పించేలా విముక్తి ప్రసాదించాల’ని ది ఫ్రీడమ్ ఇనిషియేటివ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మహిళా హక్కుల కార్యకర్తలకు సంఘీభావంగా ట్వీట్ చేయడం నేరం కాద’ని స్పష్టం చేసింది. In the #Saudi authorities’ longest prison sentence ever for a peaceful activist, the Specialised Criminal Court of Appeal on 9 August handed down terms totalling 34 years without suspension to women’s rights campaigner Salma al-Shehab. #SaudiArabiahttps://t.co/3bRLwqioec pic.twitter.com/fYgVrATNFX — ALQST for Human Rights (@ALQST_En) August 15, 2022 సుదీర్ఘ జైలు శిక్షపై అభ్యంతరాలు సోషల్ మీడియాలో పెద్దగా ఆదరణ లేనప్పటికీ సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ట్విటర్లో 2,597 మంది అనుసరిస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 159 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ‘అసమ్మతివాదులు ట్విటర్ ఖాతాలను అనుసరించడం, వారి ట్వీట్లను రీట్వీట్ చేయడం ద్వారా సమాజంలో చిచ్చు రేపడానికి, జాతీయ భద్రతను అస్థిరపరిచేందుకు కారణమయ్యారని’ ఆమెపై ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. షియా ముస్లిం కాబట్టే ఆమెను అన్యాయంగా అరెస్ట్ చేసి, కఠిన శిక్ష విధించారని నమ్ముతున్నట్టు యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ పేర్కొంది. సౌదీ అరేబియాలో మహిళల హక్కుల కోసం సల్మా గళమెత్తారు. స్త్రీలపై పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను జెడ్డాలో జూలై 15న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిసిన కొద్ది రోజుల తర్వాత సల్మా అల్-షెహబ్కు సుదీర్ఘ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు రావడం గమనార్హం. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి దారుణ హత్య కేసులో ప్రమేయంతో పాటు, అనేక మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ యువరాజుతో బైడన్ భేటీ కావడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2018లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. (క్లిక్: ఖషోగ్గి హత్య వెనుక సౌదీ యువరాజు హస్తం) -
ఖషోగి హత్య వెనుక సౌదీ యువరాజు హస్తం
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు జమాల్ ఖషోగి హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని తేలడంతో సౌదీపై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని బైడెన్ ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. సౌదీ యువరాజుని ఆంక్షల నుంచి మినహాయించింది. ఖషోగిపై అక్కసు పెంచుకున్న సౌదీ యువరాజు ఆయనను సజీవంగా బంధించడం లేదంటే చంపేయండి అంటూ తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా అమెరికా ఇంటలిజెన్స్ తన నివేదికలో వివరించింది. సౌదీ యువరాజు అనుమతితోనే జర్నలిస్టు ఖషోగిని హత్య చేసినట్టుగా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక నివేదిక సమర్పించడంతో బైడెన్ సర్కార్ చర్యలకు దిగింది. ట్రంప్ హయాంలో వివిధ దేశాలతో క్షీణించిన సంబంధాలను పునరుద్ధరించి ప్రపంచంలో అమెరికాని తిరిగి అగ్రగామిగా నిలబెడతామని బైడెన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అందుకే ఆంక్షల నుంచి యువరాజుని మినహాయించింది. ‘అధ్యక్షుడు బైడెన్ సంబంధాలు పూర్తిగా తెగిపోవాలని భావించడం లేదు. మళ్లీ ఎప్పటికైనా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని ఆశిస్తున్నారు. అయితే మానవ హక్కులకు భంగం వాటిల్లుతూ ఉంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోరు’అని బైడెన్ ప్రభుత్వంలోని అధికారి ఒకరు వెల్లడించారు. -
సౌదీ పౌరుల వీసా బ్యాన్ చేసిన జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా పౌరుడైన జర్నలిస్టు జమాల్ ఖషోగి హత్య కేసులో సౌదీ అరేబియాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరులకు వీసా నిషేదిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే ఖషోగిని చంపించింది యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అని ఆరోపించిన అమెరికా.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆంక్షలను మాత్రమే విధించించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సౌదీ అరేబియాకు చేయూతనిచ్చారని, అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని అమెరికా నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ చర్యలతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న క్రమంలో తాజా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఆంక్షలు విధించారు. ఇక 76 మంది సౌదీ పౌరులకు అమెరికా ప్రభుత్వం వీసాను నిషేధించింది. జర్నలిస్టులు, ప్రభుత్వంపై అసమ్మతి తెలియజేస్తూ వారిపై దాడులకు తెగబడే వారికి ఆంక్షలు విధించేలా అమెరికా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధానాల ప్రకారమే 76 మందిపై అగ్రరాజ్యం వీసాను నిషేధించింది. అంతేగాక వారి కుటుంబ సభ్యుల్లో ఎంపిక చేసిన వారికే వీసా ఆంక్షలు వర్తిస్తాయి ప్రకటనలో పేర్కొంది. విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ సరిహద్దుల్లో భద్రతకే పెద్ద పీట వేస్తామని, ప్రభుత్వ అసమ్మతి గళం వినిపించే వారిపై దాడులను సహించబోమని అన్నారు. అలాంటి ద్వేషాన్ని తమ గడ్డపైకి రానివ్వబోమని తేల్చి చెప్పారు. మరోవైపు తమ పరిశీలనలో ఉండే సౌదీ అరేబియా, ఇతర దేశాలపై మానవ హక్కుల నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. జర్నలిస్టు జమాల్ ఖషోగిని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చంపించాడంటూ అమెరికా ఆరోపించింది. శుక్రవారం నివేదికను విడుదల చేస్తూ.. 2018 అక్టోబర్ 2న ఖషోగిని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌కు పిలిపించి ముక్కలుముక్కలుగా నరికి చంపినట్లు అమెరికా తన నివేదికలో పేర్కొంది. ఇప్పటిదాకా ఖషోగి మృతదేహం కూడా లభించలేదని వెల్లడించింది. అమెరికా పౌరుడైన ఖషోగి.. సౌదీ యువరాజు అవినీతిని బయటపెట్టాడని, అందుకే ఆయన్ను యువరాజు చంపించారని ఆమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఖషోగ్గి హత్య: అమెరికా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ : సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య జరిగినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ తన నివేదికలో వెల్లడించింది. 2018లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖషోగ్గి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆ దారుణంపై అమెరికా ప్రభుత్వం తాజాగా నివేదికను విడుదల చేసింది. ఖషోగ్గిని బంధించండి లేదా హత్య చేయాలంటూ ప్రిన్స్ సల్మాన్ ఆదేశించినట్లు ఆ నివేదికలో తెలిపింది. ప్రిన్స్ అనుమతి లేకుండా.. ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద దారుణం చోటు చేసుకోవడం అసంభవం అని నివేదికలో పేర్కొన్నది. అయితే అమెరికా నేరుగా సౌదీ రాజుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. నివేదికను వెల్లడించిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం సౌదీపై డజన్ల సంఖ్యలో ఆంక్షలను ప్రకటించింది. అయితే అమెరికా రిలీజ్ చేసిన నివేదికను సౌదీ అరేబియా కొట్టిపారేసింది. అదో నెగటివ్, తప్పుడు రిపోర్ట్ అని పేర్కొన్నది. జర్నలిస్టు ఖషోగ్గి మర్డర్ కేసులో తన పాత్రలేదని సౌదీ రాజు మహ్మద్ తెలిపారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖషోగ్గి తన మ్యారేజ్ పేపర్స్ కోసం కాన్సులేట్ భవనంలోకి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో కొన్ని పాశ్చాత్య దేశాలు, సీఐఏ ఖషోగ్గి హత్య వెనక సౌదీ రాజు ప్రమేయం ఉందని ఆరోపించాయి. అయితే వీటిని సౌదీ ప్రభుత్వం కొట్టి పారేసింది. ఈ క్రమంలో ఖషోగ్గి మర్డర్ ఆపరేషన్‌కు ప్రిన్స్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రుజువు చేసేందుకు మూడు కారణాలను అమెరికా నివేదిక పేర్కొన్నది. చదవండి: సౌదీ రాజుపై కోర్టులో దావా, కారణం? ‘ఓవెన్ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’ -
సౌదీ రాజుపై కోర్టులో దావా, కారణం?
వాషింగ్టన్: రెండు సంవత్సరాల క్రితం ఇస్తాంబుల్‌లో జరిగిన దారుణ హత్యకు నష్టపరిహారం కోరుతూ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి కాబోయే భార్య సెంగిజ్ సౌదీ అరేబియా యువరాజు, ఇతర అధికారులపై మంగళవారం అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అమెరికా రచయిత జమాల్ ఖషోగ్గి పలు కథనాలు రాశాడు.దీంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఖషగ్గీని హత్య చేయించాడని అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్ళిన ఖషోగ్గి అక్టోబరు 2, 2018న హత్యకు గురయ్యాడు. అమెరికాకు మిత్రపక్షంగా ఉన్న సౌదీ ఆరేబియా తొలుత ఖషోగ్గి హత్యలో తన ప్రమేయాన్ని నిరాకరించింది. తరువాత పలు పొంతనలేని వ్యాఖ్యలు చేసినా చివరికి ఇస్తాంబుల్‌లోని దౌత్య కార్యాలయంలో సౌదీ ఏజెంట్ల బృందం ఖషోగ్గిని హత్య చేసినట్లు అంగీకరించింది. దీనిపై విచారణ చేసిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ కూడా మహ్మద్ బిన్ సల్మాన్ ఖషోగ్గి హత్యకు ఆదేశించారని నివేదిక ఇచ్చింది. ఈ హత్యతో తమకు అపార నష్టం వాటిల్లిందని అతనికి కాబోయే భార్య అమెరికా కోర్టులో కేసు వేసింది. ఖషోగ్గి డీఏడబ్ల్యూఎన్ అనే సంస్థను స్థాపించాడని అతను మరణించిన కారణంగా దాని కార్యకలాపాలు దెబ్బతిన్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. ఖషోగ్గిని క్రూరంగా హింసించి హత్య చేశారని ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని షాక్‌కు గురిచేసిందని దావాలో తెలిపారు. అరబ్‌లో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఖషోగ్గి ప్రయత్నించారని, ప్లాన్ ప్రకారమే ఆయనను హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని వారు కోర్టుకు తెలిపారు. చదవండి: మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా -
ఖషోగి హత్య కేసులో 8 మందికి శిక్ష
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వ్యాసకర్త, సౌదీ అరేబియా విమర్శకుడు జమాల్ ఖషోగి హత్య కేసులో రియాద్ క్రిమినల్ కోర్టు 8 మందికి శిక్షలు ఖరారు చేసింది. సౌదీ రాకుమారుడు, దేశ పాలనలో ముఖ్యభూమిక పోషిస్తున్న మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై తీవ్ర విమర్శలతో వాషింగ్టన్ పోస్ట్‌లో పలు వ్యాసాలు రాసిన ఖషోగి హత్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఖషోగి 2018లో టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో హత్యకు గురయ్యారు. సౌదీ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. రాకుమారుడు సల్మాన్ కార్యాలయంలో పనిచేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఇంటలిజెన్స్, భద్రతా సిబ్బంది నిందితులుగా విచారణను ఎదుర్కొన్నారు. ఖషోగి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించడంతో నిందితుల్లో ఐదుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. వీరికి 20 ఏళ్ల చొప్పున శిక్ష పడింది. మిగిలిన నిందితుల్లో ఒకరికి పదేళ్లు, మరో ఇద్దరికి ఏడేళ్లు శిక్ష పడింది. -
‘ఓవెన్ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’
ఇస్తాంబుల్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపడమే కాక సౌదీ అరేబియా పాలకుడి ప్రతిష్టను దెబ్బ తీసిన ప్రముఖ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసును టర్కీ కోర్టు శుక్రవారం విచారించింది. ఈ నేపథ్యంలో సౌదీ కాన్సులేట్ వర్కర్ ఒకరు సాక్ష్యం చెప్పారు. ఈ కేసులో 20మంది సౌదీ అధికారులు గైర్హాజరు కావడంతో.. టెక్నికల్ నిపుణుడు జెకి డెమిర్ సాక్ష్యం కీలకంగా మారింది. ‘ఖషోగ్గి తన పత్రాల కోసం కాన్సులేట్‌కి వచ్చాడు. అప్పుడు అక్కడ ఐదారుగురు వ్యక్తులు ఉన్నారు. ఖషోగ్గి అక్కడికి వచ్చిన కాసేపటికి వారు నన్ను పిలిచి ఒక ఓవేన్‌ని వెలిగించమని చెప్పారు. వారంతా భయాందోళనలకు గురవుతున్నట్లు కనిపించారు. ఆ తర్వాత కాన్సులేట్ గార్డెన్లో ఓవేన్‌ని పడేశారు. దాని చుట్టూ చిన్న చిన్న మాంసం ముక్కలు ఉన్నాయి.. ఆ తర్వాత ఓవెన్ చుట్టు ఉన్న పాలరాయిని రసాయనాలతో శుభ్రం చేశారనుకుంటా. అందువల్ల అది రంగు మారినట్లు కనిపించింది’ అని డెమిర్ కోర్టుకు తెలిపాడు. స్థానిక రెస్టారెంట్ నుండి ముడి కబాబ్‌లను తీసుకురావాలని తనను కాన్సుల్ ఆదేశించినట్లు కాన్సుల్ డ్రైవర్ అంతకుముందు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. (ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష) ఖషోగ్గిని ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాత హంతకులు అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కాల్చి వేయాలని భావించినట్లు టర్కీ పోలీసులు ఆరోపించారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖషోగ్గి తన మ్యారేజ్ పేపర్స్ కోసం కాన్సులేట్ భవనంలోకి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండ పోయాడు. ఈ క్రమంలో కొన్ని పాశ్చాత్య దేశాలు, సీఐఏ ఖషోగ్గి హత్య వెనక సౌదీ రాజు ప్రమేయం ఉందని ఆరోపించాయి. అయితే వీటిని సౌదీ ప్రభుత్వం కొట్టి పారేసింది. (మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా) ఈ కేసులో ఇద్దరు సౌదీ ఉన్నతాధికారులు మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్ అసిరి, మాజీ రాయల్ కోర్ట్ సలహాదారు సౌద్ అల్-కహ్తాని మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరు ముందస్తు పథకం ప్రకారమే ఖషోగ్గిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే రియాద్ కోర్టు వీటిని తోసి పుచ్చింది. అంతేకాక తగినన్నిసాక్ష్యాలు లేని కారణంగా అసిరిని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో సౌదీ అరేబియా కోర్టు అయిదుగురికి మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా
రియాద్: తమ తండ్రిని హతమార్చిన వారిని క్షమిస్తున్నామని దివంగత సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ కుమారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు.. ‘‘అమరుడైన జమాల్ ఖషోగ్గీ కుమారులమైన మేము.. మా నాన్నను హత్య చేసిన వారికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటన చేస్తున్నాం’’ అని ఖషోగ్గీ కుమారుడు సలా ఖషోగ్గీ ట్వీట్ చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అతడు స్పష్టతనివ్వలేదు. కాగా అమెరికా- సౌదీల పౌరసత్వం కలిగి ఉన్న ఖషోగ్గీ కుమారుడు పెద్ద కొడుకు సలా జమాల్ ఖషోగ్గీ ప్రస్తుతం సౌదీలో నివసిస్తున్నాడు. ఇక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసిన ఖషోగ్గీ.. 2018 అక్టోబరులో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. దీంతో అంతర్జాతీయ సమాజం సౌదీ యువరాజుపై తీవ్ర విమర్శలు గుప్పించింది.(ఖషోగ్గీ సంతానానికి సౌదీ ప్రభుత్వ భారీ చెల్లింపులు!) ఈ నేపథ్యంలో అమెరికా సైతం ఖషోగ్గీ హత్యోందంతానికి సంబంధించిన నిజాలు వెలికితీసేందుకు తమ గూఢాచార సంస్థ (సెంట్రల్ ఇంటలిజిన్స్ ఏజెన్సీ)ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలో రియాద్ నుంచి వచ్చిన 15 మంది ఏజెంట్లు ఖషోగ్గీని హతమార్చారని టర్కీ ఆరోపించింది. ఖషోగ్గీ అనుమానాస్పద మృతి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపడంతో.. అతడి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. ఈ క్రమంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసులో సౌదీ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించగా.. ముగ్గురు 24 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించనున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.(ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష) ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ మీద తనకు పూర్తి విశ్వాసం ఉందన్న సలా.. దోషులు కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తాజాగా దోషులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్యర్యపరిచాడు. కాగా ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్ హేటీస్ సెనీజ్ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది. -
ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష
రియాద్: వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తీర్పుని చ్చింది. విచారణను ఎదుర్కొన్న ఇద్దరు ఉన్నతస్థాయి వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది. సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షలాన్ అల్ షలాన్ సోమ వారం ఈ విషయాలు తెలిపారు. నేరాన్ని కప్పి ఉంచేందుకు యత్నించారన్న ఆరోపణ లపై ఈ కేసులో మరో ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో 11 మంది విచారణను ఎదు ర్కోగా ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి జైలు విధించగా మిగిలిన వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ బద్ధ వ్యతిరేకి అయిన ఖషోగ్గీ గత ఏడాది అక్టోబర్ 2న ఇస్తాంబుల్ (టర్కీ)లోని సౌదీ ఎంబసీలో హత్యకు గురయ్యారు. దౌత్య కార్యాలయ అధికారులు ముందు హత్యను నిరాకరిం చినా.. ఘర్షణలో అతడు మరణించినట్లు తర్వాత ఒప్పుకున్నారు. -
ఆ కేసులో అయిదుగురికి మరణశిక్ష
రియాద్ : జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సోమవారం అయిదుగురికి మరణశిక్షను విధించింది. ఈ కేసులో మొత్తం 11 మందిలో, ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటించింది. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు కోర్టు మరణశిక్ష విధించిందని ప్రాసిక్యూటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును విచారించిన రియాద్ కోర్టు అంతర్జాతీయ సమాజ ప్రతినిధులతో పాటు ఖషోగ్గి బంధువులు హాజరయ్యారనీ, మొత్తం తొమ్మిది సెషన్లను నిర్వహించినట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఇదొక తప్పుడు ఆపరేషన్ అని సౌదీ అరేబియా ప్రాసిక్యూటర్ నేడు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేసి విచారించారు. వారి వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. అలాగే ఈ హత్య ముందస్తు పథకం ప్రకారం చేసింది కాదని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో మాజీ డిప్యూటీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్ అసిరిని తగినన్నిసాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేశారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ హత్యలో సౌదీ పాత్ర ఉన్నట్లు అమెరికా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
సౌదీ రాజుతో గినా భేటి అందుకేనా?
రియాద్ : సౌదీ అరేబియా రాజు సల్మాన్ అమెరికా గూఢాచార సంస్థ (సెంట్రల్ ఇంటలిజిన్స్ ఏజెన్సీ) డైరెక్టర్ గినా హాస్పెల్‌తో సమావేశమయ్యారు. గురువారం జరిగిన ఈ భేటిలో ఇరు దేశాల మధ్య మైత్రి బలపడేందుకు చర్చలు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సమావేశంలో సౌదీ రాజుతో పాటు విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్, ఇంటలెజిన్స్ చీఫ్ ఖలీద్ అల్ హమ్దీన్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా ముగ్గురు సౌదీ పౌరులపై బుధవారం అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు సౌదీ రాజ కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి(సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌గా ఆరోపణలు ఉన్నాయి) ట్విటర్ ఖాతాతో అమెరికాలో గూఢచర్యం నెరిపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ రాజు గినా హాస్పెల్‌తో అత్యవసరంగా సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్ పోస్టులో కథనాలు రాసిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ టర్కీలో గతేడాది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన జమాల్ అదృశ్యం కావడంతో సౌదీ యువరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఘటనను తీవ్రంగా పరిగణించిన అమెరికా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న తమ దేశంలో నివసిస్తున్న సౌదీ పౌరులపై దర్యాప్తునకు ఆదేశించింది. అదే విధంగా ఖషోగ్గీని హత్య చేయించింది సౌదీ అరేబియా రాజే అనేందుకు తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ఈ కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో క్లిప్పులను సీఐఏ డైరెక్టర్ గినా హాస్పెల్‌కు అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖషోగ్గీ హత్య కేసును నీరుగార్చేందుకే సౌదీ రాజు గినాతో చర్చలు జరుపుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ భేటీ అనంతరం సౌదీ అధికారి మాట్లాడుతూ... తమ దేశ పౌరులు ఏ దేశంలో నివసిస్తున్నా సరే అక్కడి చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ విఙ్ఞప్తి చేయడం గమనార్హం. -
ఖషోగ్గీ హత్య; పూర్తి బాధ్యత నాదే!
రియాద్ : ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ఖషోగ్గీ హత్యకు గురైన కారణంగా పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఖషోగ్గీని చంపింది ఎవరైనా తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మహ్మద్ బిన్ పాలను విమర్శిస్తూ కథనాలు రాసే సౌదీ అరేబియా జాతీయుడు జమాల్ ఖషోగ్గీ... గతేడాది అక్టోబరు 2న టర్కీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగ్గీ అదృశ్యమవడంతో సౌదీ యువరాజే పథకం ప్రకారం అతడిని అంతమొందించాడనే విమర్శలు వెల్లువెత్తాయి. యువరాజు ఆదేశాలతో ప్రత్యేక విమానంలో టర్కీకి వెళ్లిన 11 మంది బృందం అతడిని హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సైతం సౌదీ యువరాజును తప్పుబట్టింది. ఖషోగ్గీ విషయంలో సౌదీ అధికారులు క్లిష్ట సమస్యలు ఎదుర్కోబోతున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించడంతో మధ్య ప్రాచ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ మొదటి వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన వార్తా సంస్థ పీబీఎస్ మహ్మద్ బిన్ను ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా మహ్మద్ బిన్ మాట్లాడుతూ...‘ మా దేశంలో 20 మిలియన్ మంది ప్రజలు ఉన్నారు. అందులో 3 మిలియన్ల మంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు. నా దగ్గర ఎంతో మంది మంత్రులు, అధికారులు పనిచేస్తారు. నన్ను అడగకుండానే నా ప్రత్యేక విమానాలను వారు తీసుకువెళ్లే అధికారం కలిగి ఉంటారు. పైగా ఖషోగ్గీ హత్య నా హయాంలో జరిగిన కారణంగా బాధ్యత నాదే అని పేర్కొన్నారు. కాగా ఖషోగ్గీ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. గతేడాది అక్టోబరులో తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సౌదీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఖషోగ్గీ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. అయితే ప్రధాన కుట్రదారుడు సల్మానే అయినపుడు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నమ్మడం చాలా హాస్యాస్పదమైన విషయమని టర్కీ విమర్శలు గుప్పించింది. -
ఖషోగ్గీ హత్య; ఆధారాలు దొరికాయి!
జెనీవా : జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉన్నట్లుగా తనకు ఆధారాలు దొరికాయని యూఎన్ హక్కుల కార్యకర్త ఆగ్నస్ కాలామర్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో సౌదీ రాజు, అధికారులకు వ్యతిరేకంగా ఆధారాలు లభించినందున వారిపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘ఈ కేసులో ఎవరినీ దోషులుగా నిర్ధారించలేం. అయితే కొన్ని ఆధారాలు మాత్రం లభించాయి. సరైన పద్ధతిలో విచారణ జరిపినట్లైతే నిజాలన్నీ బయటకు వస్తాయి. నేరం చేసిన వారితో పాటు వారిని ప్రోత్సహించిన వారి గురించి కూడా బయటపడతుంది. సౌదీ యువరాజుకు ఉన్న అధికారాల పట్ల ఖషోగ్గికి పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన అంటే కాస్త భయం కూడా ఉండేది. ఖషోగ్గీ హత్య కేసును విచారించడంలో సౌదీ, టర్కీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి. క్రైమ్‌సీన్‌లో ఆధారాలన్నీ మాయమయ్యాయి. దీన్ని బట్టి ఈ కేసు పట్ల ఇరు ప్రభుత్వాలకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది’ అని ఆమె తన నివేదిక(ఆర్బిటరీ ఎగ్జిక్యూషన్)లో పేర్కొన్నారు. కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఇక కొంతకాలం క్రితం ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో సౌదీ ప్రభుత్వం డబ్బు అందజేసినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదించింది. ఈ క్రమంలో ఖషోగ్గీ కేసును నీరుగార్చేందుకే ఆయన సంతానానికి రాజు కానుకలు ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. -
వారికి ఖరీదైన ఇళ్లు, పెద్దమొత్తంలో డబ్బు!
వాషింగ్టన్ : ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి సంతానానికి సౌదీ ప్రభుత్వం భారీ సహాయం అందజేసిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ మేరకు ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో డబ్బు అందజేసినట్లు పేర్కొంది. పోర్టు సిటీ జెడ్డా సమీపంలో దాదాపు నాలుగు మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు ఇవ్వడంతో పాటు.. నెలకు పది వేల డాలర్ల చొప్పున వారికి చెల్లించేందుకు సిద్ధమైందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ పెద్ద కుమారుడు మాత్రమే సౌదీలో నివసించాలని అనుకుంటున్నాడని.. మిగతా వాళ్లంతా ఇక్కడ ఉన్న తమ ఆస్తులు అమ్మేసి అమెరికా వెళ్లి పోవాలనుకుంటున్నారని కథనం ప్రచురించింది. ఇక ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్ హేటీస్ సెనీజ్ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది.(మా నాన్నే మాకు నిరంతర ప్రేరణ) కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఈ క్రమంలో ఆయన సంతానానికి సౌదీ యువరాజు భారీ ఎత్తున సహాయం అందించడం గమనార్హం. -
హ్యాకైన అమెజాన్ సీఈఓ ఫోన్
సాక్షి, వాషింగ్టన్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్‌కు గురైంది. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులు ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్టు సమాచారం. జెఫ్ బెజోస్ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడానికే హ్యాకింగ్ జరిగినట్టు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కాలమిస్ట్ అయిన జమాల్ ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు సౌదీ ప్రభుత్వమే కారణమంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. దీనికి ప్రతిచర్యగా బెజోస్ ఫోన్‌ను సౌదీ హ్యాక్ చేసిందని, ఆయనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సౌదీ అధికారులు దొంగిలించారని బెజోస్ సెక్యూరిటీ అధికారి గవిన్ బెకర్ తెలిపారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని గెవిన్ బెకర్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఖషోగ్గి హత్యను ప్రిన్స్ సల్మాన్ చేయించారని అమెరికా ఇంటెలిజన్స్ సంస్థ సీఐఏ సెనేట్‌కు సమాచారమందించింది. -
పథకం ప్రకారమే కొలిమి రూపొందించారు!
ఖతార్ : అమెరికాలో జర్నలిస్టుగా పని చేసిన సౌదీ జాతీయుడు జమాల్ ఖషొగ్గీని అత్యంత దారుణంగా హతమార్చారని ఖతార్‌కు చెందిన న్యూస్ ఏజెన్సీ ఆల్ జజీరా పేర్కొంది. ఖషోగ్గీ హత్య జరిగిన తర్వాత అతడి శవాన్ని ముక్కలు చేసి.. సౌదీ కాన్సులేట్ జనరల్ ఇంటికి తరలించారని వెల్లడించింది. అనంతరం అక్కడ ఉన్న భారీ కొలిమిలో వేసి మండించినట్లు తమ విచారణలో తేలిందని తెలిపింది. ఈ విషయం గురించి కొలిమిని నిర్మించిన వ్యక్తి మాట్లాడుతూ.. వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతా సామర్థ్యం కలిగిన కొలిమి రూపొందించాలని సౌదీ కాన్సుల్ తనను ఆదేశించినట్లు అతడు చెప్పాడని ఆల్ జరీరా పేర్కొంది. అంతేకాకుండా సౌదీ కాన్సుల్ ఆఫీస్ గోడలపై ఖషోగ్గీ రక్తపు మరకలు కూడా ఉన్నాయని తెలిపింది. దీంతో ఖషోగ్గీ హత్యోదంతం మరోసారి చర్చనీయాంశమైంది. కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. -
మోదీ ఎందుకు ప్రొటోకాల్ ఉల్లంఘించారు ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ను సాదరంగా స్వాగతించారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఆయనకు స్వాగతం చెప్పాల్సి ఉంది. మరి ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ ఎందుకు ప్రొటోకాల్‌ను పక్కన పెట్టారు ? సౌదీ యువరాజు అంత శక్తివంతుడా ? మనకు అంత ముఖ్యుడా? ఆయన్ని అంతలా గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందా ? ఉంటే ఎందుకు ? మన దేశ ఆర్థిక వ్యవహారాలను, రాజకీయాలను ప్రభావితం చేసే ప్రతిభావంతులైన విదేశీ నాయకులను స్వాగతించేందుకు ప్రొటోకాల్‌ను పక్కన పెడితే తప్పులేదు. సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తర్వాత అంతటి శక్తిమంతుడు సౌదీ యువరాజ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అనడంలో సందేహం లేదు. ఐక్యరాజ్య సమితిలో కుదుర్చుకున్న అంతర్జాతీయ అవగాహన ప్రకారం మానవ హక్కులను కాలరాస్తున్న దేశాధిపతులకు స్వాగతం చెప్పడంలో ఏ దేశమైనా ప్రత్యేక ఆదరాభిమానాలను ప్రదర్శించకూడదు. అంటే, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించాల్సిన అవసరం లేదు. వృత్తికి అంకితమైన ధీరోదాత్తమైన జర్నలిస్టుగా ప్రశంసలు అందుకున్న జమాల్ ఖషోగ్గిని హత్య చేసి, ఆయన శరీర భాగాల ఆనవాళ్లు కూడా దొరక్కుండా యాసిడ్‌లో కరగించి మురికి కాల్వలో పారబోసారని, సౌదీ యువరాజు కుట్ర వల్లనే ఇది జరిగిందని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం సౌదీని బహిష్కరించాలంటూ పలు దేశాలు పిలుపునిచ్చాయి. ఖషోగ్గి గతంలో ఆల్ వతన్ అనే సౌదీ పత్రికకు ఎడిటర్‌గా, ఆల్ అరబ్ న్యూస్ ఛానల్‌కు జనరల్ మేనేజర్‌గా, ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. సౌదీ యువరాజు అణచివేత చర్యలను భరించలేక అమెరికా వచ్చి స్థిరపడిన ఖషోగ్గి ‘ది వాషింఘ్టన్ పోస్ట్’లో కాలమిస్ట్‌గా స్థిర పడ్డారు. ఆయన తన మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం గత అక్టోబర్ రెండో తేదీన ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఆయన్ని హత్య చేశారు. ‘ఇస్తాంబుల్‌లో కషోగ్గి హత్యకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉత్తర్వులు జారీ చేశారని సీఐఏ ధ్రువీకరణకు వచ్చింది. అందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా సీఐఏ సేకరించింది’ అంటూ వాషింగ్టన్ పోస్ట్ నవంబర్ 18వ తేదీన ఓ వార్తను ప్రచురించింది. దీనిపై స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాసిన సుదీర్ఘ లేఖను కూడా ఆ పత్రిక నవంబర్ 20వ తేదీన ప్రచురించింది. అందులో ‘ నేను గతేడాది సౌదీ పర్యటనకు వెళ్లి విస్తతంగా చర్చలు జరపడం వల్ల ఆ దేశం అమెరికాలో 45 000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. దాని వల్ల మా దేశంలో ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. చమురు ఉత్పత్తులో కూడా ప్రపంచంలో మా రెండు దేశాలు ముందున్నాయి. మా సూచనల మేరకు ప్రపంచ దేశాల అభ్యున్నతి దృష్టిలో పెట్టుకొని సౌదీ అరేబియా చమురు ధరలను తగ్గించింది కూడా. కానీ జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య గురించి మా ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక సమాచారాన్ని రాబట్టాయి. అందులో పూర్తి నిజాలు మాకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. మేము విన్న వార్తలు కూడా అబద్ధం కావచ్చు. మాకు అంతర్జాతీయ సంబంధాలకన్నా అమెరికా అంతర్గత సంబంధాలు మాకు ముఖ్యం. మా దేశ ప్రయోజనాలు ముఖ్యం. దేశాధినేతగా దేశ ప్రయోజనాలను పరిరక్షించడం నా బాధ్యత. కషోగ్గి హత్య విషయంలో సౌదీని దూరం పెట్టక తప్పడం లేదు’ అన్నది ట్రంప్ సుదీర్ఘ లేఖలోని సారాంశం. మరి అలాంటి సౌదీ యువరాజును మనం ఎందుకు దగ్గర తీసుకున్నట్లు ? పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాక్‌ను ఏకాకిని చేయడంలో సౌదీ రాజు పనికి వస్తారన్నది మోదీ వ్యూహమా? పుల్వామా సంఘటనపై ఐక్యరాజ్య సమితిలో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటూ పాక్ ప్రధానితో కలిసి సంయుక్త ప్రకటన చేసిన సౌదీ యువరాజు మనతో కలిసి వస్తారా ? అంత ఘనంగా స్వాగతించి పిలిచినప్పుడు పాక్‌లో చేసిన సంయుక్త ప్రకటనను ఉపసంహరించుకునేలా మోదీ ఒప్పించి ఉండాల్సింది. ఆర్థికంగా, రాజకీయంగా ప్రధాన భాగస్వామిగా పరిగణిస్తున్నా పాకిస్థాన్‌ను సౌదీ దూరంగా పెట్టడమనేది కలలోని మాట. -
సూట్‌కేసుల్లో ఖషొగ్గీ శరీర భాగాలు!
అంకారా : సౌదీ అరేబియా జర్నలిస్ట్ జమాల్ ఖషొగ్గీని అత్యంత దారుణంగా హతమార్చారనే వాదనలకు బలం చేకూరుతోంది. ఖషోగ్గీ శరీర భాగాలను కొందరు వ్యక్తులు సూట్‌కేసులు, బ్యాగుల్లో తరలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను తాజాగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు 5 సూట్ కేసులు, 2 పెద్ద సంచులను ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ జనరల్ ఇంట్లోకి తీసుకెళ్తున్నట్లుగా ఉన్న వీడియో ఫుటేజీని ఎ–హబేర్ అనే టర్కీ టీవీ చానల్ ఆదివారం ప్రసారం చేసింది. ఆ ఇంటికి సమీపంలో ఉన్న సౌదీ కాన్సులేట్‌లోనే 2018 అక్టోబర్‌లో ఖషొగ్గీ(59) హత్యకు గురైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఆ బ్యాగులు, సూట్ కేసుల్లోనే తరలించారని తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఆ చానల్ పేర్కొంది. అయితే, అప్పట్లో ఖషొగ్గీ శరీర భాగాలను యాసిడ్‌లో వేసి ఆనవాళ్లు దొరక్కుండా చేశారని అనుమానాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. (ఖషోగ్గీ హత్య; సౌదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?) Suudi Arabistan'ın İstanbul Başkonsolosluğunda katledilen gazeteci Kaşıkçı cinayetine ilişkin özel görüntüler A Haber’e ulaştı. A Haber ekranlarında ilk kez izleyeceğiniz o görüntülerde Kaşıkçı'nın parçalanmış bedeninin olduğu bavulların konsolosluk konutuna taşındığı görülüyor pic.twitter.com/ojqJ4AxyL3 — A Haber (@Ahaber) December 31, 2018 -
ఈసారి నలుగురు ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘టైమ్’ మాగజైన్ 2018 సంవత్సరానికి ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ హోదాను ప్రకటించింది. అయితే ఈసారి ఒక్కరికి కాదు, నలుగురు వ్యక్తులకు ఓ వార్తా పత్రికకు కలిపి ప్రకటించింది. వీరందరిని కలిపి ‘ది గార్డియన్స్’గా వ్యవహరించింది. టైమ్ పత్రిక ప్రతి ఏడాది వార్తాలను అత్యధిక ప్రభావితం చేసిన వ్యక్తులకు సాధారణంగా ఈ హోదాను కల్పిస్తోంది. వార్తలను అత్యధికంగా ప్రభావితం చేసిన వారిలో మంచివారే ఉండాల్సిన అవసరం లేదు. విలన్లుగా పరిగణించే వారు కూడా ఉంటారు. అందుకనే 1938లో ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను పేర్కొంది. ఈసారి గత అక్టోబర్ 2వ తేదీన సౌదీ యువరాజు కుట్రకు బలైన సౌదీ సీనియర్ జర్నలిస్ట్, రచయిత, కాలమిస్ట్ జమాల్ అహ్మద్ ఖషోగ్గి, ఫిలిప్పినో జర్నలిస్ట్ మారియా రెస్సా, ఇద్దరు రాయిటర్స్ యువ జర్నలిస్టులు వా లోన్, క్యా సో ఊలతోపాటు అమెరికా నుంచి వెలువడుతున్న ‘ది క్యాపిటల్ గెజిట్’ను కలిపి ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటించింది. ఈ ఏడాది వార్తాలపై వారు చూపించిన ప్రభావాన్నే కాకుండా జర్నలిజం వత్తిపట్ల వారు ప్రదర్శించిన నిబద్ధతతోపాటు వాస్తవాలను వెల్లడించాలనే వారి సంకల్పాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈసారి ఈ హోదాను ప్రకటించినట్లు టైమ్ సంపాదకవర్గం ప్రకటించింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, ఆయన తండ్రి వ్యవహారాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు వారి పాలనాతీరును విమర్శించినందుకు యువరాజు కాన్సులేట్‌లోనే జమాల్ అహ్మద్ ఖషోగ్గిని దారుణంగా హత్య చేశారు. అనవాళ్లు దొరక్కుండా ఆసిడ్‌తో మృతదేహాన్ని కరిగించారు. మాజీ సీఎన్ఎన్ కరస్పాండెంట్ మెరియా రెస్సా ఏడేళ్ల క్రితం రాప్లర్ న్యూస్ వెబ్‌సైట్‌ను స్థాపించి నిక్ష్పక్షపాతంగానే కాకుండా ధైర్యంగా నిజాలను రాశారు. ఫిలిప్పినో అధ్యక్షుడు డ్యూడర్టే నియంత్రత్వ విధానాలను ఎప్పటికప్పుడు విమర్శించారు. డ్రగ్ మాఫియా కనిపిస్తే కాల్చివేయడంటూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఆయన 12 వేల మందిని చంపించారు. వాటిని ఎప్పటికప్పుడు వెల్లడించడంతో ఆన్లైన్లో ఆమెను డ్యూడర్ట్తోపాటు ఆయన సైన్యం కూడా ఎన్నో వేధింపులకు గురిచేసింది. అమెను పన్నులు ఎగ్గొట్టారన్న సాకుతో ఆమెకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు అధికార రహస్యాల చట్టం కింద వా లోన్, క్యా సో ఊన్లకు వారి ప్రభుత్వం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ‘ది క్యాపిటల్ గెజట్’ కార్యాలయంలోని గత జూన్ నెలలో ఓ ఉన్మాది జొరబడి ఐదుగురు జర్నలిస్టులను కాల్చి చంపారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల స్ఫూర్తికి గుర్తింపుగా ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ టైమ్ సంపాదకవర్గం ప్రకటించింది. -
మా నాన్నే మాకు నిరంతర ప్రేరణ
జమాల్ ఖషోగ్గి జటిల మైన వ్యక్తి. కానీ ఆయన కుమార్తెలమైన మాకు ఆయన సింపుల్ ‘డాడ్’ మాత్రమే. మా కుటుంబా నికి ఆయన చేసే పనంటే గౌరవం. ఆయన పాస్ పోర్ట్ నిండా ఎన్నో దేశాల ముద్రలు, తిరిగి వచ్చిన ప్రదేశాల ఆనవాళ్లూ ఉండేవి. తెచ్చిన అనేక పత్రి కలు, పుస్తకాలు, ముతక వాసన వేస్తూ, ఆయన టేబుల్ చుట్టూ క్లిప్పింగులుగా అమర్చి ఉండేవి నిత్యమూ. తిరిగి వచ్చేటప్పుడు, ఆయన మాకెన్నో బహుమతులను తేవడమే కాక, ఉత్కంఠ కలిగించే దూరదేశాల కథలెన్నో చెప్పే వాడు. మేం అమ్మా నాన్నల జ్ఞాన సముపార్జన ప్రేమ వలయంలో పెరిగాం. వాళ్ళు మమ్మల్ని ఎన్నో మ్యూజియంలకు, చారిత్రిక ప్రదేశాలకు తీసుకువెళ్లి, అవన్నీ విపులంగా చెప్పేవారు. జెడ్డా నుంచి మెదినా దాక కార్లో ప్రయాణం చేసేటప్పుడు చుట్టూ çవున్న ప్రదేశాల చారిత్రిక ప్రాధాన్యత మాకు చెప్పేవారు. ఎప్పుడూ ఆయన తన చుట్టూ పుస్తకాలతో ఉన్నా, ఇంకా పుస్తకాలు కావాలనే వారు. చదివిన విస్తార గ్రంథాలలో, ఎప్పుడూ ఇవే కావాలి అనో, అవి వద్దు అనో ఆయనకు ఎంపికలు ఉండేవి కావు. ఆ పుస్త కాల్లోని భిన్న వాదనలు, అభిప్రాయాలను ఆకళింపు చేసుకునేవారు. ఆయన జీవితం నిండా ఎన్నో అనూహ్యమైన మలుపులు, మెలికలు. అవి మా కుటుంబాన్నంత టినీ ప్రభావితం చేసేవి. కొద్ది సంవత్సరాల వ్యవ ధిలో, ఎవరైనా రెండుసార్లు ఉద్యోగం నుంచి తొలగించబడి ఉండరు. ‘అల్ వతన్’ పత్రిక ప్రధాన సంపాదకులుగా ఉండగా నాన్నకి ఈ అనుభవం ఎదురయింది. ఏం జరిగినా సరే, నాన్న ఒక ఆశా వాది. ప్రతి సవాలులో ఒక కొత్త అవకాశాన్ని చూడడం నాన్న తత్వం. అభిప్రాయాలు వ్యక్తపర్చ డం, తన భావాలను పంచుకోవడం నాన్నకి చాలా ముఖ్యమైన అంశం. అలాగే ఆయనకి రచన కేవలం పని కాదు. అదొక తప్పనిసరి కర్తవ్యం. రంజాన్ పండుగ రోజుల్లో మేం వర్జీనియాలో ఉండగా, ఏడాదిగా తన కోసం నిర్మించుకున్న చిన్న లోకాన్ని చూపించాడు. మమ్మల్ని తన స్నేహితులకు పరిచయం చేశాడు. తను తరచుగా వెళ్లే ప్రదేశాలు చూపెట్టాడు. అక్కడ అమెరికాలో ఎలా తన కోసం ఒక చిన్న లోకం ఏర్పాటు చేసుకున్నాడో, అలాగే, తన స్వదేశం సౌదీ చూసేందుకు, తన కుటుంబాన్ని, తన ప్రియ సహచరులను కలిసేందుకు తపన పడే వాడు. సౌదీ అరేబియా వదిలి వెళ్లవలసిన రోజున తన గుమ్మంలో నిలబడి తను తిరిగి వస్తానా మళ్ళీ, అన్న అబ్బురపాటుకి గురయ్యాను అని చెప్పాడు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేసిన ప్రయా ణాలు, వీటివల్ల ఎంత తలమునకలుగా ఉన్నా, తాను తిరిగి స్వదేశం వస్తాను అన్న ఆశతోనే నాన్న బతికారు. ఎందుకంటే, నిజానికి, నాన్న అసమ్మతి దారు కాదు. అక్టోబర్ రెండు తరువాత, మా కుటుంబం వర్జీనియాలో నాన్న ఇంటికి వెళ్లాం. అక్కడ మా గుండెలు కలచి వేసింది, నాన్న కూచునే ఖాళీ కుర్చీ. ఆయన లేని శూన్యం మా చెవుల్లో హోరెత్తింది. మాకు అక్కడ కూచుని ఉన్న నాన్న కనిపిస్తున్నాడు. తలపైకి పెట్టుకున్న కళ్ళద్దాలు, ఏదో చదువుతూ, తీరిక లేకుండా. ఆయన రచనలు చూస్తూ ఉంటే, తాను సౌదీ తిరిగి వచ్చే నాటికి, తనకు, ఇతర సౌదీ పౌరులకు, ఆ దేశం మరింత జీవన భద్రతతో కూడిన మెరుగైన ప్రాంతంగా మారాలన్న ఆశ కనిపిస్తుంది. ఇది నాన్నకి నివాళి కాదు. ఎందుకు కాదు అంటే నివాళి అయితే, అక్కడితో ఈ విషయం ఆగి పోతుంది. అంతకన్నా ముఖ్యంగా ఇదొక వాగ్దానం. ఆయన వేలార్చిన కాంతి ఎప్పటికీ వెలిసి పోదు అని. ఆయనకు జ్ఞానం, సత్యం అంటే ఉన్న గౌరవం, ప్రేమ మాకు నిరంతర ప్రేరణ. వచ్చే జన్మలో మేము ఆయనను కలిసే దాకా. – నోహా ఖషోగ్గి, రజన్ జమాల్ ఖషోగ్గి (అక్టోబర్ రెండున టర్కీ లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో, సౌదీ రాజ్య ఆమో దంతో 58 ఏళ్ల జమాల్ ఖషోగ్గి హత్యకు గుర య్యారు. ఆయన కుమార్తెలు నిండైన ఆత్మ గౌర వంతో చేసిన రచనకు తెలుగు అనువాదం) వ్యాసకర్త : రామ తీర్థ, ప్రముఖ కవి, రచయిత మొబైల్ : 98492 00385 -
సౌదీపై ఆంక్షలేం ఉండవు: ట్రంప్
వాషింగ్టన్: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు సంబంధించి సౌదీ అరేబియాపై చర్యలు, ఆంక్షలేవీ విధించకూడదన్న తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికా ప్రయోజనాల దృష్ట్యా సౌదీతో వ్యూహాత్మక సంబంధాలను నెరపడం, ముడి చమురు ధరలు తక్కువగా ఉండేలా చూడటమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కంట్రిబ్యూటర్‌గా పనిచేసే ఖషోగ్గీని సౌదీ అరేబియా అధికారులు గత నెలలో ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో దారుణంగా హత్య చేయడం తెలిసిందే. -
సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య
వాషింగ్టన్: సౌదీఅరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. సల్మాన్‌కు తెలియకుండా లేదా అతని ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటన జరిగే ప్రసక్తే లేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఏను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. యువరాజు సల్మాన్ నిర్ణయాలపై విమర్శనాత్మక కథనాలు రాసిన ఖషోగ్గీ అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్లి అదృశ్యమయ్యారు. సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య జరిగిందని సీఐఏ చెప్పడం అమెరికా–సౌదీ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
యువరాజే చంపమన్నారు!
వాషింగ్టన్: ప్రముఖ జర్నలిస్ట్, వాషింగ్టన్ పోస్టు కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ(సీఐఏ) నిర్ధారణకు వచ్చినట్టు యూఎస్ మీడియా వెల్లడించింది. ఆయన ఆదేశాల మేరకే ఖషోగ్గీని పథకం ప్రకారం అంతమొందించినట్టు తెలిపింది. సౌదీకి చెందిన 15 మంది ఏజెంట్లు ప్రభుత్వ విమానంలో ఇస్తాంబుల్ వెళ్లి, సౌదీ రాయబారా కార్యాలయంలో ఖషోగ్గీని హత్య చేశారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. దీనిపై స్పందించేందుకు సీఐఏ నిరాకరించింది. యువరాజు మహ్మద్ బిన్ సోదరుడు, అమెరికాలోని సౌదీ రాయబారి ఖలీద్ బిన్ సల్మాన్ ద్వారా ఖషోగ్గీని ఇస్తాంబుల్‌కు రప్పించినట్టు సీఐఏ వర్గాలు గుర్తించినట్టు సమాచారం. ఇస్తాంబుల్‌లోని తమ కాన్సులేట్‌కు వెళ్లి ఖషోగ్గీకి అవసరమైన పత్రాలు తీసుకోవాలని, ఎటువంటి ముప్పు ఉండబోదని ఆయనతో ఫోన్లో ఖలీద్ బిన్ చెప్పినట్టు సమాచారం. దీన్ని సౌదీ కాన్సులేట్ తోసిపుచ్చింది. ఇదంతా అవాస్తవమని తెలిపింది. టర్కీకి వెళ్లే విషయం గురించి ఖషోగ్గీతో ఖలీద్ బిన్ మాట్లాడలేదని సౌదీ ఎంబసీ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. టర్కీ మహిళను పెళ్లాడేందుకు అవసరమైన పత్రాల కోసం వెళ్లి ఆయనను సౌదీ ఏజెంట్లు హత్య చేశారు. ఖషోగ్గీ అదృశ్యం గురించి తమకేమీ తెలియదని బుకాయించిన సౌదీ తర్వాత నేరాన్ని ఒప్పుకుంది. ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ యువరాజు ప్రత్యక్ష ప్రమేయానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలను సీఐఏ సంపాదించలేదని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఖషోగ్గీ హత్య చేసిన బృందంలో సభ్యులు ఫోన్లో యువరాజు సన్నిహితులతో మాట్లాడిన దాన్ని బట్టి ఆయన ప్రమేయం ఉందన్న అంచనాకు వచ్చిందని వివరించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో ఖషోగ్గీ హంతకులకు మరణశిక్ష అమలు చేస్తామని సౌదీ అరేబియా చెబుతోంది. ఖషోగ్గీ నన్ను పెళ్లాడారు జమాల్ ఖషోగ్గీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తనను పెళ్లాడారంటూ ఈజిప్టు మహిళ ఒకరు తెరపైకి వచ్చారు. వాషింగ్టన్లో జూన్ నెలలో తాము పెళ్లి చేసుకున్నామని ‘వాషింగ్టన్ పోస్ట్’తో చెప్పారు. అయితే తన వివరాలు వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు. ‘ముస్లిం భార్యగా గుర్తింపు కోరుకునే పూర్తి హక్కు తనకుంద’ని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఖషోగ్గీ కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈజిప్టు మహిళను ఖషోగ్గీ పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలియదని ఆయనను పెళ్లాడాలనుకున్న టర్కీ మహిళ హార్టిస్ సెంగిజ్ చెప్పారు. ఆమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. -
ఖషోగ్గీ హత్య.. మరో ట్విస్ట్
న్యూయార్క్: ‘మీ బాస్‌కు చెప్పండి’.. వాషింగ్టన్ పోస్టు కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యానంతరం తన పై అధికారికి సౌదీ అరేబియా నిఘా బృందంలోని సభ్యుడొకరు ఫోన్లో చెప్పిన మాట ఇది. ‘ఆ బాస్’ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ హత్యోదంతంలో సల్మాన్ పాత్ర ఉందనడానికి ఇదే బలమైన ఆధారమని భావిస్తున్నారు. ఖషోగ్గీ హత్య జరిగిన సమయంలో ముగ్గురు వ్యక్తులు రికార్డు చేసిన ఆడియో టేపులను టర్కీ నిఘా విభాగం సేకరించింది. వీటిని గత నెలలో అమెరికా గూఢాచార సంస్థ(సీఐఏ) డైరెక్టర్ గినా హాస్పెల్‌కు అప్పగించింది. ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య అనంతరం ఆయన మృతదేహాన్ని సౌదీ రాయబార కార్యాలయంలోనే ముక్కలుగా నరికి యాసిడ్‌లో కరిగించి మాయం చేశారని టర్కీ ఆరోపించింది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్ చంపించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి బలం చేకూర్చే ఆధారాలు ఆడియో టేపుల్లో ఉన్నాయని అమెరికా నిఘా అధికారులు విశ్వసిస్తున్నారు. ఖషోగ్గి కోసం సౌదీ ప్రభుత్వం పంపించిన 15 మంది సభ్యులు బృందంలో ఒకరైన మహెర్ అబ్దులాజీజ్ ముత్రెబ్ ఒకరు. ఖషోగ్గీ హత్యానంతరం అతడు ఉన్నతాధికారికి ఫోన్ చేసి అరబిక్‌లో ‘మీ బాస్‌తో చెప్పండి’ అన్నాడని వెల్లడైంది. భద్రతా అధికారిగా పనిచేస్తున్న ముత్రెబ్ తరచుగా సల్మాన్‌తో కలిసి ప్రయాణిస్తుంటాడని అమెరికా అధికారులతో టర్కీ నిఘా అధికారులు చెప్పారు. ఖషోగ్గీని హత్య చేసిన తర్వాత సల్మాన్ సన్నిహితులకు అతడు ఫోన్ చేసివుంటాడని వెల్లడించారు. అయితే ముత్రెబ్ అరబిక్‌లో చెప్పిన మాటలను తర్జుమా చేస్తే మరో అర్థం వచ్చింది. ‘మాకు అప్పగించిన పని పూర్తయింద’నే అర్థం వచ్చేలా అతడు మాట్లాడినట్టు తేలింది. అమెరికా ఏం చేస్తుంది? సల్మాన్ పాత్రపై అమెరికా ఆచితూచి అడుగులు వేస్తోంది. సల్మాన్ పేరు ప్రస్తావన రాకపోవడంతో దీన్ని గట్టి ఆధారంగా పరిగణించలేకపోతున్నారు. ఖషోగ్గీ హత్యతో తమ యువరాజుకు ఎటువంటి సంబంధం లేదని సౌదీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టర్కీ సేకరించిన ఆడియో టేపులను పరిశీలించేందుకు తమ నిఘా అధికారులను అనుమతించాలని కోరింది. ఆడియో టేపులు, టెలిఫోన్ కాల్స్ డేటాను టర్కీ తమకు నమ్మకమైన దేశాలతో మాత్రమే పంచుకుంది. సౌదీ యువరాజుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు వెలుగులోకి రావడంతో కచ్చితంగా వైట్‌హౌస్‌పై ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరబ్‌లో అమెరికాకు సౌదీ అరేబియా కీలక భాగస్వామి. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్తో సౌదీ యువరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు వ్యతిరేకంగా చర్యలకు అమెరికా ఉపక్రమిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదముంది. అయితే ఈ విషయంలో తాను నిక్కచ్చిగా వ్యవహరిస్తారని ట్రంప్ చెబుతున్నారు. సౌదీ యువరాజు సల్మాన్‌కు ట్రంప్ అండగా నిలబడతారనే అభిప్రాయాన్ని అమెరికా ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు వ్యక్తపరిచారు. -
మా నాన్న మృతదేహమైనా ఇవ్వండి!
వాషింగ్టన్: టర్కీలోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో దారుణ హత్యకు గురైన వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ మృతదేహాన్నైనా తమకు ఇవ్వాలని ఆయన కుమారులు సౌదీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కనీసం భౌతిక కాయాన్నైనా తమకు ఇస్తే పవిత్ర మదీనాలోని స్మశానవాటికలో ఖననం చేస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 2న టర్కీలోని సౌదీ ఎంబసీలోకి వెళ్లిన ఖషోగ్గీ అప్పటినుంచి అదృశ్యం కావడం, సౌదీ యువరాజుపై విమర్శనాత్మక కథనాలు రాసినందుకు ఆయనను సౌదీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఎంబసీలోనే దారణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఖషోగ్గీ మృతదేహాన్ని ముక్కలుగా చేసి, యాసిడ్ లో కరిగించారని ఇటీవల టర్కీ అధికారులను ఉటంకిస్తూ ఒక వార్తాకథనం కూడా వెలువడింది. నెల రోజులకు పైగా అత్యంత వేదనను అనుభవిస్తున్నామని, ఇప్పటికైనా తమ తండ్రి మృతదేహాన్ని ఇవ్వాలని సౌదీ అధికారులను కోరామని ఖషోగ్గీ కుమారులు సలా ఖషోగ్గీ, అబ్దుల్లా ఖషోగ్గీ సోమవారం మీడియాకు తెలిపారు. తమ తండ్రి దేశద్రోహి కాదని, ఆయనకు సౌదీ రాచరిక వ్యవస్థపై నమ్మకం ఉండేదని, అదే దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని భావించేవాడని సలా వివరించారు. దోషులందరికీ శిక్ష పడుతుందన్న సౌదీ రాజు హామీని తాము విశ్వసిస్తున్నామన్నారు. -
జమాల్ ఖషోగ్గీ హత్య తర్వాత సౌదీ కాన్సులేట్‌లో దారుణం
-
ముక్కలు చేసి యాసిడ్‌లో కరిగించి..
అంకారా: పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీ హత్య అనంతరం ఆయన మృతదేహాన్ని ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలోనే ముక్కలుగా నరికి యాసిడ్‌లో కరిగించి ‘మాయం’చేశారని టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ సలహాదారు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు అధికారులు విచారణ చేపడుతున్నారు. ‘ఆయన శరీర భాగాలను కేవలం ముక్కలుగా చేయలేదు. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యాసిడ్‌లో కరిగించేశారు’అని ఎర్డోగన్ సలహాదారు యాసిన్ అక్తయ్, టర్కీ అధికార పార్టీకి చెందిన ఓ నేత హరియత్ వార్తా పత్రికకు చెప్పారు. యాసిడ్‌లో కరిగించడం సులువనే ఉద్దేశంతో ముక్కలుగా కోశారని అక్తయ్ చెప్పారు. తమపై విమర్శలు చేసినందుకు ఖషోగ్గీని హత్య చేయించిందని సౌదీ అరేబియాపై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సౌదీ కాన్సులేట్‌లోకి అక్టోబర్ 2న ప్రవేశించిన వెంటనే ఖషోగ్గీని గొంతు నులిమి చంపేశారని, తర్వాత ముక్కలుగా చేసి, యాసిడ్‌లో కరిగించారని టర్కీ ప్రధాన ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఆయన శరీరానికి సంబంధించి చిన్న ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకే ఈ పని చేసి ఉంటారని చెప్పారు. సౌదీ కాన్సులేట్ ఆవరణలోని బావిలో వెతికేందుకు టర్కీ అధికారులను సౌదీ అధికారులు అనుమతివ్వలేదు. నీటి శాంపిల్స్‌ను తీసుకెళ్లేందుకు అనుమతించారు. -
పథకం ప్రకారమే ఖషోగ్గీ హత్య: టర్కీ
ఇస్తాంబుల్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీని సౌదీ అరేబియా అధికారులు ముందస్తు ప్రణాళికతో పథకం ప్రకారమే హత్య చేశారని ఈ కేసు విచారణలో టర్కీ బృందానికి నేతృత్వం వహించిన అధికారి చెప్పారు. గత నెల 2న ఆయన ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయానికి రాగానే గొంతు నులిమి చంపేసి, శరీరాన్ని ముక్కలుగా నరికారని అధికారి చెప్పారు. మృతదేహం ఆనవాళ్లు లభించలేదన్నారు. సౌదీ యువరాజుకు వ్యతిరేకంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ఖషోగ్గీ వార్తలు రాసేవారు. -
అమెరికా చేరుకున్న ఖషోగ్గీ కుమారుడు
వాషింగ్టన్ : అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వాషింగ్టన్ కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ కుమారుడిని అమెరికాకు పంపించేందుకు సౌదీ ఎట్టకేలకు ఒప్పుకొంది. దీంతో అతడు గురువారం అమెరికాకు చేరుకున్నాడని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అమెరికా- సౌదీల పౌరసత్వం కలిగి ఉన్న ఖషోగ్గీ కుమారుడు పెద్ద కొడుకు సలా జమాల్ ఖషోగ్గీ పాస్‌పోర్టును సౌదీ అధికారులు సీజ్ చేశారు. దీంతో గత కొన్ని నెలలుగా అతడు రియాద్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తండ్రి మరణం తర్వాత కూడా అమెరికా వెళ్లేందుకు అతడికి అనుమతి లభించలేదు. ఈ విషయమై అమెరికా విదేశాంగ అధికారులు మాట్లాడుతూ.. ‘విదేశాంగ మంత్రి మైక్ పాంపియో.. సలా పాస్‌పోర్టును పునరుద్ధరించాల్సిందిగా కోరారు. ఇందుకు సౌదీ విదేశాంగ అధికారులు సానుకూలంగా స్పందించారు. సలా ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని’ పేర్కొన్నారు. ఖషోగ్గీ హత్య కేసులో సౌదీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలోనే సౌదీ అమెరికా కోరిన విధంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సౌదీ జాతీయుడైన జర్నలిస్టు టర్కీలో ఉన్న సౌదీ ఎంబసీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్ హేటీస్ సెనీజ్ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఆయన హత్యకు గురయ్యారు. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది. -
ఖషోగ్గీ హత్య; సౌదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?
వాషింగ్టన్ : వాషింగ్టన్ పోస్టు కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో సౌదీ అరేబియాకు ఉచ్చు బిగుస్తున్నట్లుగానే కన్పిస్తోంది. ఖషోగ్గీని హత్య చేయించింది సౌదీ అరేబియానే అనేందుకు తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ హత్య కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో క్లిప్పులను అమెరికా గూఢాచార సంస్థ డైరెక్టర్(సీఐఏ) గినా హాస్పెల్‌కు అందించినట్లుగా సమాచారం. ట్రంప్ క్యాబినెట్లో అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న గినా ప్రస్తుతం టర్కీలో రహస్యంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆడియో క్లిప్పులను విన్నట్లుగా తెలుస్తోంది. దీంతో సౌదీకి చెక్ పెట్టి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా ఖషోగ్గీ ఉదంతాన్ని వాడుకునే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. మధ్య ప్రాచ్య రాజకీయాల్లో సౌదీ కీలక శక్తిగా ఎదిగేందుకు తోడ్పడిన ట్రంప్... ఖషోగ్గీ మృతిపై మొదట సౌదీ అరేబియాపై తమకు అనుమానాలు లేవన్నారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ అధికారులు అత్యంత క్లిష్ట సమస్యలను ఎదుర్కోబోతున్నారంటూ మంగళవారం వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఖషోగ్గీ హత్య కుట్రలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది సౌదీల వీసాలను కూడా అమెరికా రద్దు చేసింది. ఈ విషయం గురించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. ‘ఇవి చాలా చిన్న విషయాలు. నేరస్తులు ఎవరైనా సరే జవాబుదారీగా ఉండాల్సిందే. అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు మేము వెనుకాడబోం’ అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఖషోగ్గీ హత్యోదంతం గురించి సీఐఏ మాజీ అధికారి మాట్లాడుతూ.. ’ ప్రస్తుతం బాల్ వాషింగ్టన్ కోర్టులో ఉంది. ప్రజలతో పాటు కాంగ్రెస్ కూడా గినా మాటల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే.. సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ నెల 2న తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సౌదీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఖషోగ్గీ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. అయితే ప్రధాన కుట్రదారుడు సల్మానే అయినపుడు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నమ్మడం చాలా హాస్యాస్పదమైన విషయమని టర్కీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
ఖషోగ్గీ హత్య; స్పందించిన సౌదీ యువరాజు
రియాద్ : ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఎట్టకేలకు స్పందించారు. ఖషోగ్గీ హత్యను అత్యంత క్రూరమైన చర్యగా సల్మాన్ అభివర్ణించారు. ఇటువంటి హేయమైన నేరాలను ఎవరూ కూడా సమర్థించరంటూ వ్యాఖ్యానించారు. ఖషోగ్గీ హత్య సౌదీలందరినీ ఎంతగానో బాధించిందన్నారు. బుధవారం రియాద్‌లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ.. ఖషోగ్గీ హంతకులను పట్టుకునేందుకు సౌదీ అరేబియా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో టర్కీ తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఖషోగ్గీ మరణం టర్కీ- సౌదీ సంబంధాల మధ్య అడ్డుగోడగా నిలుస్తుందని తాను భావించడం లేదన్నారు. నేరస్తులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, చివరికి న్యాయమే గెలిచి తీరుతుందంటూ వ్యాఖ్యానించారు. కాగా సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ అమెరికాలో ఉంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ నెల 2న తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. అయితే, తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందుకు ఖషోగ్గీని మహమ్మద్ బిన్ సల్మాన్ చంపించాడని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఖషోగ్గీ హత్య గురించి అంతర్జాతీయ సమాజం నుంచి.. ముఖ్యంగా తనకు ఇన్నాళ్లుగా అనుకూలంగా మాట్లాడుతూ వస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒత్తిడి వస్తోన్న నేపథ్యంలోనే సల్మాన్ స్పందించక తప్పలేదు. ఖషోగ్గీ మరణం వెనుక సల్మాన్ ఉన్నారంటూ ట్రంప్ అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఖషోగ్గీ హత్య.. మధ్యప్రాచ్య రాజకీయాలు!
టర్కీలోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో వాషింగ్టన్ టైమ్స్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ అనుమానాస్పద మరణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. అయితే, తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చంపించాడని ప్రపంచమంతా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ మరణంపై పలు వివరాలు.. ముడి చమురుపై ప్రభావం ప్రఖ్యాత జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ మరణం ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలపై కూడా పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ దేశం చమురు ఉత్పత్తులకు ఇప్పటికే డిమాండ్ భారీగా తగ్గిపోయింది. రోజుకు ఏడు లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఇప్పటికే తగ్గిపోగా.. వచ్చేనెల 4 నుంచి అమెరికా రెండో విడత ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీంతో వచ్చే ఏడాదికల్లా ఇరాన్ చమురు ఉత్పత్తి మరో 9 లక్షల బ్యారెళ్లు (రోజుకు) తగ్గిపోనుంది. అత్యధిక చమురు నిల్వలు ఉన్న సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచకపోతే ధరలు కొండె క్కుతాయి. ఈ నేపథ్యంలో సౌదీ తను చెప్పినట్లు నడుచుకునేలా చేసేందుకు అమెరికా ఖషోగ్గీ ఉదంతాన్ని వాడుకుంటోందని భావిస్తున్నారు. టర్కీ రాజకీయం ఖషోగ్గీ హత్యకు సౌదీ అరేబియా ప్రణాళికలు రచించిందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించడం మధ్యప్రాచ్య రాజకీయాలకు నిలువు టద్దమని విశ్లేషకులు అంటున్నారు. ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మరణం నేపథ్యంలో టర్కీ సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా నిలబడిన విషయం తెలిసిందే. సౌదీ విరోధి ఖతార్‌తో నెయ్యం.. మోర్సీ మరణానంతరం అతడి అనుచరులకు ఆశ్రయం కల్పించడం టర్కీ ఎత్తుగడలకు అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖషోగ్గీ మరణం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు అనుకోని అవకాశంగా కలిసివచ్చింది. అందువల్లనే ఎర్డోగాన్ స్వయంగా సౌదీ యువరాజుపై హత్యారోపణలకు సిద్ధమయ్యారని.. తద్వారా మధ్యప్రాచ్యంలో సౌదీ ఆధిపత్యాన్ని తోసిరాజని టర్కీని ముస్లిం రాజ్యానికి కేంద్ర బిందువుగా మార్చాలని యత్నిస్తున్నారని అంచనా. టైగర్ స్క్వాడ్ తనకు వ్యతిరేకంగా గొంతెత్తే ఎవరినైనా మట్టుబెట్టేందుకు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఓ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలున్నాయి. ‘ఫిర్కత్ – ఏ– నెమ్ర్’ లేదా టైగర్ స్క్వాడ్ అని దీనికి పేరు. నిఘా, మిలటరీ వర్గాల్లో అత్యున్నత సామర్థ్యం చూపిన 50 మందితో ఈ ప్రైవేట్ సైన్యం ఏర్పడిందని, ‘మిడిల్ ఈస్ట్ ఐ’ అనే పత్రిక వెల్లడించింది. ఖషోగ్గీని చంపేందుకు ఈ బృందంలోని 15 మంది టర్కీ వెళ్లారని తెలిపింది. మాహెర్ అబ్దుల్ అజీజ్ ముత్రిబ్ టైగర్స్క్వాడ్కు వెన్నెముకలాంటి వాడని.. నిఘా వర్గానికి చెందిన మేజర్ జనరల్ అహ్మద్ అల్ అస్సిరీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఖషోగ్గీని అంతమొందించిందని వార్తలున్నాయి. తనను విమర్శించే వారి చేతులు తెగనరుకుతానని మహమ్మద్ బిన్ సల్మాన్ తరచూ చెప్పేవాడని.. అందుకు తగ్గట్టుగానే ఖషోగ్గీ మృతిని ధ్రువీకరించేందుకు టైగర్స్క్వాడ్ అతడి చేతి వేళ్లను యువరాజుకు చూపిందని ‘మిడిల్ ఈస్ట్ ఐ’ పేర్కొంది. టర్కీకి సీఐఏ డైరెక్టర్ వాషింగ్టన్: ఖషోగ్గీ అనుమానాస్పద మృతిపై సమాచారం సేకరించేందుకు అమెరికా కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) డైరెక్టర్ గినా హాస్పెల్ను అధ్యక్షుడు ట్రంప్ టర్కీకి పంపారు. టర్కీ నుంచి పూర్తి సమాచారం లభించిన తరువాతే ఈ వ్యవహారంలో అధికారికంగా స్పందిస్తానని ట్రంప్ చెప్పారు. సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న భారీ ఆయుధ ఒప్పందాన్ని రద్దుచేసుకోబోమని వెల్లడించారు. ఇస్తాన్బుల్లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఖషోగ్గి హత్యకు సౌదీ అరేబియా చాన్నాళ్ల క్రితమే ప్రణాళికలు రచించిందని టర్కీ అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మంగళవారం ఆరోపించారు. ఈ హత్యతో సంబంధమున్న వారి వివరాల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు, సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌లు రియాద్‌లో ఖషోగ్గీ కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి. -
ఖషోగి శరీర భాగాలు గుర్తింపు
ఇస్తాంబుల్: ప్రముఖ పాత్రికేయుడు, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగి మృతదేహాన్ని ఎట్టకేలకు కనుగొన్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా కాన్సుల్ జనరల్ నివాసంలో ఆయన శరీర భాగాలను గుర్తించినట్టు స్థానిక వార్తా సంస్థ ‘స్కై న్యూస్’ వెల్లడించింది. ముక్కలుగా చేసిన జమాల్ ఖషోగి మృతదేహాన్ని సౌదీ కాన్సుల్ జనరల్ ఇంటి ఆవరణలోని తోటలో పూడ్చిపెట్టినట్టు తెలిపింది. ఖషోగి ముఖం గుర్తుపట్టలేనట్టుగా ఉందని పేర్కొంది. ఈ దారుణానికి ఆదేశించిన వారెవరో బయటపెట్టాలని సౌదీ అరేబియాను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ కోరిన గంటల వ్యవధిలోనే ఖషోగి మృతదేహం జాడ తెలిసింది. ఈ కేసులో అరెస్టైన 18 మంది నిందితులను తమ దేశ కోర్టులో విచారిస్తామని ఎర్దోగన్ స్పష్టం చేశారు. (వేళ్లు నరికి.. బాడీని ముక్కలు చేసి..) పార్లమెంట్లో మంగళవారం తమ అధికార ఏకే పార్టీని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ... ఖషోగి మృతికి కారణమైనవారు ఎంతటివారైనా శిక్షిస్తామన్నారు. ఖషోగిని హత్య చేసిన తర్వాత ఆయనలా మరొకరిని కాన్సులేట్ బయటకు పంపి నాటకం ఆడారని వెల్లడించారు. సౌదీ అధికారులు చాలా రోజుల ముందే హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. ‘ఇది కచ్చితంగా కుట్రతో చేసిన హత్య. ఖషోగి హత్య జరిగిన రోజున నిందితులు ఇస్తాంబుల్ ఎందుకు వచ్చారు? ఎవరి ఆదేశాలపై వారు ఇక్కడకు వచ్చారు? సౌదీ కాన్సులేట్‌లోనే ఖషోగి చంపబడ్డారని అధికారికంగా ఒప్పుకున్నప్పటికీ మృతదేహాన్ని ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించే వరకు ఈ కేసును మూసివేయరాద’ని ఎర్దోగన్ అన్నారు. ఎర్దోగన్ ప్రకటనతో ఖషోగి హత్యకు గురయ్యారని తేలిపోయింది. అయితే తమ అధికారులతో జరిగిన పెనుగులాటలో ఆయన ప్రమాదవశాత్తు మరణించారని ఇప్పటివరకు సౌదీ అరేబియా చెబుతూ వస్తోంది. ఖషోగి హత్య వెనుక సౌదీ అరేబియా రాజ కుటుంబం హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను సౌదీ అరేబియా ఒప్పుకోవడం లేదు. -
నగ్నసత్యాలు వెల్లడిస్తా: ఎర్దోగన్
ఇస్తాంబుల్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ తమ రాయబార కార్యాల యంలో జరిగిన గొడవలోనే మరణించాడని సౌదీ అరేబియా ఎట్టకేలకు ఒప్పుకోవడం అంతర్జాతీయంగా దుమారం రేపుతోంది. ఖషోగ్గీ హత్య విషయంలో కొన్ని నగ్నసత్యాలను బయటపెడతామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ ప్రకటించడంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఖషోగ్గీ కేసు విషయానికి సంబంధించి తాను మంగళవారం ప్రసంగిస్తాననీ, అప్పుడు కొన్ని కొత్త విషయాలను చెబుతానని ఎర్దోగన్ గత వారాంతంలోనే ప్రకటించారు. టర్కీ అధికార పార్టీ ప్రతినిధి, ఎర్దోగన్‌కు సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ ‘ఇది పథకం ప్రకారం, క్రూర, దారుణ కుట్రతో జరిగిన హత్య’ అని ఆరోపించారు. అటు జర్మనీ కూడా ఒప్పందం ప్రకారం ఈ ఏడాది సౌదీకి ఎగుమతి చేయాల్సిన 480 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయాన్ని నిలిపేస్తోందని ఆ దేశ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ఖషోగ్గీ హత్య విషయంలో ఏం జరిగిందో విశ్వసనీయ ఆధారాలతో సౌదీ అత్యవసరంగా బయటపెట్టాల్సిన అవసరం ఉంద న్నాయి. ఖషోగ్గీ మృతి విషయంలో సౌదీ వివరణ నమ్మశక్యంగానే ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మాట మార్చి సౌదీ అబద్ధాలు చెబుతోందన్నారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్కు సౌదీ యువరాజుతో సన్నిహిత సంబంధాలున్నాయి. ట్రంప్ సొంత పార్టీ నేతలు కూడా యువరాజుకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు నమ్ముతున్నామన్నారు. 15 ముక్కలుగా నరికేశారు సౌదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, యువరాజు సల్మాన్‌ను విమర్శిస్తూ ఖషోగ్గీ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. టర్కీ మహిళను పెళ్లి చేసుకునేందుకు అవసరమైన పత్రాలు పొందే విషయమై ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీకి ఈ నెల 2న వెళ్లిన ఆయన అక్కడే హత్యకు గురయ్యారు. హురియత్ అనే పత్రికలో వ్యాసాలు రాసే అబ్దుల్ఖదీర్ మాట్లాడుతూ సౌదీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఖషోగ్గీ గొంతు నులిమి చంపిందన్నారు. అనంతరం లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న సలాహ్ మహ్మద్ అల్–తుబైగీ సంగీతం వింటూ ఖషోగ్గీ శరీరాన్ని 15 ముక్కలుగా నరికేశారన్నారు. -
వేళ్లు నరికి.. బాడీని ముక్కలు చేసి..
అంకారా: ప్రముఖ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి(59) హత్యకేసులో సౌదీ అరేబియా ప్రమేయానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సౌదీకి కాబోయే రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు ఖషోగి హత్యతో సంబంధం ఉందని టర్కీకి చెందిన ప్రముఖ దినపత్రిక ‘యెని సఫాక్’ వెల్లడించింది. ఖషోగి హత్య జరిగిన రోజు ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ నుంచి సల్మాన్ అనుచరుడొకరు రాజు కార్యాలయానికి నాలుగుసార్లు ఫోన్ చేసినట్టు సదరు పత్రిక తెలిపింది. రియాద్‌లో ఉన్నతస్థాయి పెట్టుబడుల శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ఈ విషయం వెలుగు రావడం గమనార్హం. మరోవైపు ఖషోగి హత్య కేసులో వాస్తవాలను వెలికి తీస్తామని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ హామీయిచ్చారు. ‘యెని సఫాక్’ వివరాల ప్రకారం... ఖషోగి తన పెళ్లికి అవసరమైన డాక్యుమెంట్ కోసం కాన్సులేట్‌కు వస్తున్నారని తెలుసుకుని 15 మంది సభ్యుల బృందం అక్టోబర్ 2న సౌదీ నుంచి ఇస్తాంబుల్‌కు వచ్చింది. ఖషోగి కాన్సులేట్‌లోకి ప్రవేశించగానే ఈ బృందం ఆయనను చుట్టుముట్టింది. ఆయన వేళ్లను నరికేసి, కిరాతకంగా హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని ముక్కులు చేశారు. సల్మాన్ అనుచరుడైన మహెర్ ముత్రెబ్ కాన్సులేట్ నుంచి సౌదీ నిఘావర్గాల ఉపాధ్యక్షుడు అహ్మద్ అల్ అసిరికి నాలుగుసార్లు ఫోన్ చేశాడు. మరొక ఫోన్ కాల్ అమెరికాకు చేశాడు. ఎంత వరకు నమ్మొచ్చు! ‘యెని సఫాక్’ వెల్లడించిన విషయాలను ఎంత వరకు నమ్మొచ్చు అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే టర్కీ సెక్యురిటీ వర్గాల సహాయంలో ఖషోగి హత్యకు సంబంధించిన విషయాలను ప్రభుత్వ అనుకూల దినపత్రికలు లీక్ చేస్తూ వచ్చాయి. కాన్సులేట్ బయట వేచివున్న ఖషోగి ప్రియురాలికి ఆనవాలు తెలియకుండా ఉండేందుకే ఆయన మృతదేహాన్ని ముక్కలు చేశారని గత వారమే ‘యెని సఫాక్’ వెల్లడించింది. అయితే ఈ విషయంపై అసోసియేటెడ్ ప్రెస్ ఎన్నిసార్లు ప్రశ్నించినా సౌదీ అరేబియా అధికారుల నుంచి సమాధానం రాలేదు. మహెర్ ముత్రెబ్.. ఇస్తాంబుల్‌లో ఉన్నారన్న విషయాన్ని కూడా సౌదీ అంగీకరించలేదు. ఖషోగి వచ్చిన సమయంలో ముత్రెబ్ కాన్సులేట్‌కు వచ్చిన ఫొటో బయటకు రావడంతో ఆయన అక్కడున్నట్టు తేలింది. సౌదీ రాజు సంతాపం మరోవైపు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్సౌద్, కాబోయే రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సోమవారం ఉదయం ఖషోగి కుమారుడి సలా ఖషోగికి ఫోన్ చేసినట్టు సౌదీ మీడియా వెల్లడించింది. ఖషోగి మృతి పట్ల వారు సంతాపం ప్రకటించారని తెలిపింది. ఖషోగి మృతదేహం ఎక్కడుందో తమకు తెలియదని సౌదీ విదేశాంగ మంత్రి అదెల్ ఆల్-జుబెయిర్ చెప్పారు. ఖషోగి హత్య ‘మూర్కపు చర్య’గా ఆయన వర్ణించారు. దీన్ని ఎంతమాత్రమూ సమర్థించబోమని స్పష్టం చేశారు. ఖండించిన ఐరోపా దేశాలు ఖషోగి హత్యను జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఖండించాయి. ఈ హత్యోదంతంపై తక్షణమే వివరణ ఇవ్వాలని సౌదీ అరేబియాను డిమాండ్ చేశాయి. జర్నలిస్టులపై దాడులను సహించబోమని స్పష్టం చేశాయి. సౌదీ ప్రత్యేక దర్యాప్తు బృందం వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరముందన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆచితూచి స్పందించారు. సౌదీతో ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్న ప్రతిపాదనకు ఆయన అంగీకరించలేదు. -
వీడిన ఖషోగ్గీ హత్య మిస్టరీ
రియాద్: ఇస్తాంబుల్‌లోని తమ రాయబార కార్యాలయంలోనే జమాల్ ఖషోగ్గీ చనిపోయాడని సౌదీ అరేబియా ఎట్టకేలకు శనివారం ఒప్పుకుంది. సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ అమెరికాలో ఉంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ను, ఆయన విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ నెల 2న తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి బయటకురాలేదు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అదే నిజమైతే సౌదీని శిక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఖషోగ్గీ ఏమయ్యాడో తమకూ తెలీదని సౌదీ ఇన్నాళ్లూ బుకాయించింది. అంతర్జాతీయసమాజం నుంచి ఒత్తిడి, టర్కీ దర్యాప్తు నేపథ్యంలో తమ కార్యాలయంలోనే ఖషోగ్గీ చనిపోయాడని ఎట్టకేలకు సౌదీ ఒప్పుకుంది. ఎంబసీలో ఖషోగ్గీని ప్రశ్నిస్తున్నపుడు అధికారులకు, ఖషోగ్గీకి గొడవ జరిగిందనీ, ఆ గొడవలోనే మరణించాడని సౌదీ అటార్నీ జనరల్ చెప్పారు. కాగా, మృతదేహం జాడను బయటపెట్టలేదు. ఖషోగ్గీ హత్య విషయమై నిఘా విభాగం ఉప ప్రధానాధికారి అహ్మద్ అల్–అస్సీరి, మీడియా సలహాదారు సౌద్ అల్–కహ్తానీలను విధుల నుంచి సౌదీ తప్పించింది. వీరిద్దరూ యువరాజుకు సన్నిహితులు. 18 మంది సౌదీ జాతీయులను అదుపులోకి తీసుకుంది. ‘సౌదీ వివరణను నేను నమ్ముతున్నా. 18 మందిని అదుపులోకి తీసుకోవడం విచారణలో తొలి, గొప్ప ముందుడుగు’ అని ట్రంప్ అన్నారు. ఖషోగ్గీ మరణం తమకు విచారం కలిగిస్తోందని అమెరికా అధ్యక్షభవనం అధికారిక ప్రతినిధి సారా శాండర్స్ పేర్కొన్నారు. అయితే సౌదీపై ఆంక్షలు విధించే అంశాన్ని అమెరికా అసలు ప్రస్తావించలేదు. భవిష్యత్తులో సౌదీపై ఆంక్షలేమైనా ఉండొచ్చని సమాచారం. -
ఖషోగ్గీ ఎమయ్యాడో తెలీదు: సౌదీ రాజు
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ కనిపించకుండా పోవడంపై సౌదీ అరేబియాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రాజు సల్మాన్ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. ఖషోగ్గీ ఏమమయ్యాడో తమకు తెలియదని చెప్పారు. సౌదీ పౌరుడైన ఖషోగ్గీ అమెరికాలోఉంటూ సౌదీపై వాషింగ్టన్ పోస్ట్‌లో విమర్శనాత్మక కథానాలు రాసేవారు. ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోపలికెళ్లిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడం, ఆయనను సౌదీనే హత్య చేసిందని ఆరోపణలు రావడం తెల్సిందే. సౌదీలో రాజకుటుంబానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వ్యతిరేక పోస్ట్‌లు కూడా వస్తున్నప్పటికీ వాటిని సౌదీ ప్రభుత్వం వెంటనే తొలగిస్తోందని తెలుస్తోంది. ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీలో ఖషోగ్గీ అదృశ్యంపై టర్కీ పోలీసులు అక్కడ సోదాలు చేశారు. -
రాయబార కార్యాలయానికి వెళ్లి అదృశ్యమైన విలేకరి
వాషింగ్టన్: వాషింగ్టన్ పోస్ట్‌కు విలేకరి (కంట్రిబ్యూటర్)గా పనిచేస్తున్న, సౌదీ అరేబియాకు చెందిన జమాల్ ఖషొగ్గీ కనిపించకుండా పోవడం వెనుక సౌదీ అరేబియా హస్తం ఉండొచ్చనీ, ఖషొగ్గీ హత్యకు గురై ఉంటే అందుకు కారకులను కఠినంగా శిక్షిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరోక్షంగా సౌదీని హెచ్చరించారు. ఖషొగ్గీ సౌదీ ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలను అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో రాసేవారు. తన వ్యక్తిగత పనిపై ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఖషొగ్గీ కనిపించకుండా పోయారు. కార్యాలయం లోపలే ఖషొగ్గీ్గని హత్య చేసి ఉంటారని టర్కీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో సత్వరమే చర్యలు చేపట్టాలని ట్రంప్‌పై కాంగ్రెస్ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఖషొగ్గీ ఆచూకీ విషయమై సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. ఏమయ్యాడో మేం కనిపెడతాం.. ‘టర్కీలో ఏం జరిగిందో, ఖషొగ్గీ ఏమయ్యాడో మేం కనిపెడతాం. ఈ విషయంలో ఎవ్వరికీ వివరాలు తెలియవు’ అని ట్రంప్ అన్నారు. అయితే సౌదీ రాజుతో తన చర్చలు ఏ విధంగా ఉంటాయో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. సీబీఎస్ వార్తా చానల్ ‘60 మినిట్స్’ కార్యక్రమంలోనూ.. ఖషొగ్గీ్గని సౌదీనే హత్య చేసిందంటారా? అని ట్రంప్‌ను ప్రశ్నించగా ‘ వాళ్లే అయ్యుంటారా? అవునేమో!’ అని అన్నారు. ఒకవేళ ప్రచారం జరగుతున్నట్లుగా సౌదీనే ఖషొగ్గీని హత్య చేసిందని తేలితే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా, గతంలో తాను ప్రకటించినట్లు సౌదీకి ఆయుధాల సరఫరాను మాత్రం ఆపననీ, ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఆయుధాల సరఫరాపై ఆంక్షల వల్ల ఇక్కడి ఉద్యోగాలు పోతాయి. ఆ దేశంతో మనకు ఉన్న ఒప్పందాలు రద్దవుతాయి. దేశంలో నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్యను తీసుకోను. అయితే హత్యకు కారకులపై తీవ్ర చర్యలుంటాయి. ఆంక్షలుంటాయి’ అని చెప్పారు. అన్నీ నిరాధార ఆరోపణలే: సౌదీ ఇస్తాంబుల్‌లోని తమ రాయబార కార్యాలయంలోనే ఖషొగ్గీ హత్యకు గురయ్యాడన్న ఆరోపణలను సౌదీ అరేబియా శనివారం తోసిపుచ్చింది. అవన్నీ అబద్ధాలు, ఆధారాల్లేని ఆరోపణలేనని కొట్టిపారేసింది. ఖషొగ్గీ్గని సౌదీ అధికారులు రాయాబార కార్యాలయంలోనే చంపేశారనేందుకు భవనం లోపల తీసిన వీడియో రికార్డులు ఉన్నాయని టర్కీ అధికారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఈ విషయంపై టర్కీ ప్రభుత్వంతో మాట్లాడేందుకు సౌదీ నుంచి ఓ బృందం శుక్రవారమే టర్కీకి చేరుకుంది. అక్కడ సౌదీ హోం మంత్రి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఖషొగ్గీ్గని చంపేందుకు సౌదీ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాలన్నీ అబద్ధాలు, నిరాధార ఆరోపణలేనని చెప్పారు. రికార్డర్ ఆన్ చేసి వెళ్లాడా? సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లే ముందు ఖషొగ్గీ తన చేతికున్న యాపిల్ గడియారంలో రికార్డింగ్ ఆన్ చేశారనీ, ఆయనను సౌదీ అధికారులు విచారించి, హింసించి, హత్య చేస్తున్నప్పుడు వారు మాట్లాడిన మాటలన్నీ రికార్డయ్యి, ఆ ఫైల్స్ ఆయన ఫోన్‌కు, ఐ క్లౌడ్‌కు వెళ్లాయని టర్కీ పత్రిక సబా పేర్కొంది. ఖషొగ్గీ్గ నాడు తన ఫోన్‌ను భార్యకు ఇచ్చి రాయబార కార్యాలయానికి వచ్చారని తెలిపింది. గడియారంలో రికార్డర్ ఆన్‌లో ఉండటాన్ని ఆలస్యంగా గుర్తించిన సౌదీ అధికారులు అనేక పాస్‌వర్డ్‌లతో ప్రయత్నించినప్పటికీ వాచ్‌లో ఉన్న ఫైల్స్‌ను ఓపెన్ చేయలేకపోయారనీ, చివరకు ఖషొగ్గీ వేలిముద్రతో వాచ్‌ను అన్‌లాక్ చేసి కొన్ని ఫైళ్లను మాత్రం డిలీట్ చేయగలిగారని సబా పేర్కొంది. అయితే యాపిల్ గడియారాలను వేలిముద్రతో లాక్, అన్‌లాక్ చేసే సదుపాయం లేదని యాపిల్ ప్రతినిధి ఒకరు వెల్లడించడం గమనార్హం.