
ఇస్తాంబుల్: ప్రముఖ పాత్రికేయుడు, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగి మృతదేహాన్ని ఎట్టకేలకు కనుగొన్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా కాన్సుల్ జనరల్ నివాసంలో ఆయన శరీర భాగాలను గుర్తించినట్టు స్థానిక వార్తా సంస్థ ‘స్కై న్యూస్’ వెల్లడించింది. ముక్కలుగా చేసిన జమాల్ ఖషోగి మృతదేహాన్ని సౌదీ కాన్సుల్ జనరల్ ఇంటి ఆవరణలోని తోటలో పూడ్చిపెట్టినట్టు తెలిపింది. ఖషోగి ముఖం గుర్తుపట్టలేనట్టుగా ఉందని పేర్కొంది. ఈ దారుణానికి ఆదేశించిన వారెవరో బయటపెట్టాలని సౌదీ అరేబియాను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ కోరిన గంటల వ్యవధిలోనే ఖషోగి మృతదేహం జాడ తెలిసింది. ఈ కేసులో అరెస్టైన 18 మంది నిందితులను తమ దేశ కోర్టులో విచారిస్తామని ఎర్దోగన్ స్పష్టం చేశారు. (వేళ్లు నరికి.. బాడీని ముక్కలు చేసి..)
పార్లమెంట్‌లో మంగళవారం తమ అధికార ఏకే పార్టీని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ... ఖషోగి మృతికి కారణమైనవారు ఎంతటివారైనా శిక్షిస్తామన్నారు. ఖషోగిని హత్య చేసిన తర్వాత ఆయనలా మరొకరిని కాన్సులేట్ బయటకు పంపి నాటకం ఆడారని వెల్లడించారు. సౌదీ అధికారులు చాలా రోజుల ముందే హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. ‘ఇది కచ్చితంగా కుట్రతో చేసిన హత్య. ఖషోగి హత్య జరిగిన రోజున నిందితులు ఇస్తాంబుల్ ఎందుకు వచ్చారు? ఎవరి ఆదేశాలపై వారు ఇక్కడకు వచ్చారు? సౌదీ కాన్సులేట్‌లోనే ఖషోగి చంపబడ్డారని అధికారికంగా ఒప్పుకున్నప్పటికీ మృతదేహాన్ని ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించే వరకు ఈ కేసును మూసివేయరాద’ని ఎర్దోగన్ అన్నారు.
ఎర్దోగన్ ప్రకటనతో ఖషోగి హత్యకు గురయ్యారని తేలిపోయింది. అయితే తమ అధికారులతో జరిగిన పెనుగులాటలో ఆయన ప్రమాదవశాత్తు మరణించారని ఇప్పటివరకు సౌదీ అరేబియా చెబుతూ వస్తోంది. ఖషోగి హత్య వెనుక సౌదీ అరేబియా రాజ కుటుంబం హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను సౌదీ అరేబియా ఒప్పుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment