వాషింగ్టన్: అమెరికా పౌరుడైన జర్నలిస్టు జమాల్ ఖషోగి హత్య కేసులో సౌదీ అరేబియాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరులకు వీసా నిషేదిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే ఖషోగిని చంపించింది యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అని ఆరోపించిన అమెరికా.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆంక్షలను మాత్రమే విధించించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సౌదీ అరేబియాకు చేయూతనిచ్చారని, అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని అమెరికా నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ చర్యలతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న క్రమంలో తాజా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఆంక్షలు విధించారు.
ఇక 76 మంది సౌదీ పౌరులకు అమెరికా ప్రభుత్వం వీసాను నిషేధించింది. జర్నలిస్టులు, ప్రభుత్వంపై అసమ్మతి తెలియజేస్తూ వారిపై దాడులకు తెగబడే వారికి ఆంక్షలు విధించేలా అమెరికా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధానాల ప్రకారమే 76 మందిపై అగ్రరాజ్యం వీసాను నిషేధించింది. అంతేగాక వారి కుటుంబ సభ్యుల్లో ఎంపిక చేసిన వారికే వీసా ఆంక్షలు వర్తిస్తాయి ప్రకటనలో పేర్కొంది. విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ సరిహద్దుల్లో భద్రతకే పెద్ద పీట వేస్తామని, ప్రభుత్వ అసమ్మతి గళం వినిపించే వారిపై దాడులను సహించబోమని అన్నారు. అలాంటి ద్వేషాన్ని తమ గడ్డపైకి రానివ్వబోమని తేల్చి చెప్పారు.
మరోవైపు తమ పరిశీలనలో ఉండే సౌదీ అరేబియా, ఇతర దేశాలపై మానవ హక్కుల నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. జర్నలిస్టు జమాల్ ఖషోగిని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చంపించాడంటూ అమెరికా ఆరోపించింది. శుక్రవారం నివేదికను విడుదల చేస్తూ.. 2018 అక్టోబర్ 2న ఖషోగిని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ కాన్సులేట్‌కు పిలిపించి ముక్కలుముక్కలుగా నరికి చంపినట్లు అమెరికా తన నివేదికలో పేర్కొంది. ఇప్పటిదాకా ఖషోగి మృతదేహం కూడా లభించలేదని వెల్లడించింది. అమెరికా పౌరుడైన ఖషోగి.. సౌదీ యువరాజు అవినీతిని బయటపెట్టాడని, అందుకే ఆయన్ను యువరాజు చంపించారని ఆమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment