Mohammed bin Salman
-
సౌదీ యువరాజుపై హత్యాయత్నం అంటూ కథనాలు
రియాద్: సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని పలు అరబ్ మీడియా సంస్థలు సైతం ప్రచురించాయన్నది సదరు సోషల్ మీడియా పోస్టుల సారాంశం. అయితే ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.మరోవైపు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో.. ఆయన పేరు ఎక్స్ ఖాతాలోట్రెండింగ్లో కొనసాగుతోంది.కారు బాంబు ఉపయోగించి మహ్మద్ బిన్ సల్మాన్‌పై హత్యాయత్యానికి ప్రయత్నించగా ఆయన సురక్షితంగా బయటపడ్డారన్నది ఆ వైరల్ కథనాల సారాంశం. ఇక ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ కథనాలకు కాసేపట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. -
సౌదీలో తొలి మద్యం దుకాణం
రియాద్: మద్యపాన నిషేధాన్ని పాటించే సౌదీ అరేబియాలో మొట్టమొదటి సారిగా ఆల్కాహాల్ విక్రయ కేంద్రం తెరుచుకోనుంది. ముస్లిమేతర దౌత్యవేత్తల వినియోగం కోసం ఈ మద్యం స్టోర్‌ను తెరవనున్నారు. సంబంధిత మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న మద్యం ప్రియులు మాత్రమే అక్కడ మద్యం కొనుగోలుచేసేందుకు అర్హులు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ దీనిని అనుమతులు ఇస్తుంది. నెలవారీ కోటా పరిమితి ప్రకారమే వినియోగదారులకు మద్యాన్ని విక్రయిస్తారు. పర్యాటకం, వాణిజ్యం ఊపందుకునేందుకు వీలుగా రియాద్ నగరంలో మద్యం అమ్మకాలు పెరగాలన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే ఈ స్టోర్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. రియాద్‌లో వివిధ దేశాల ఎంబసీలు, రాయబార కార్యాలయాలకు నిలయమైన ప్రాంతంలో ఈ స్టోర్‌ను మరి కొద్ది వారాల్లో ప్రారంభించనున్నారు. -
వ్యూహాత్మక స్నేహబంధం
కొన్నిసార్లు అంతే... కీలక పరిణామాలన్నీ కొద్ది వ్యవధిలో జరిగిపోతుంటాయి. ఢిల్లీలో జీ20 సదస్సు ముగియగానే మరో ముఖ్యపరిణామం సంభవించింది. సోమవారం భారత ప్రధాని మోదీ, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్‌ల సహ అధ్యక్షతన భారత – సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్పీసీ) తొలి శిఖరాగ్రస్థాయి సమావేశం జరిగింది. విస్తృత చర్చల అనంతరం రెండు దేశాలూ తమ వాణిజ్య, రక్షణ బంధాలను విస్తరించుకోవాలని నిర్ణయించాయి. భారత్‌లో ఒక రోజు పర్యటనకు వచ్చిన సౌదీ యువరాజుతో జరిగిన ఈ కీలక నిర్ణయం దీర్ఘకాలిక ప్రభావం చూపగలిగేది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండు పెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య పెరుగుతున్న సహకారం మధ్యప్రాచ్య – హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు కీలకం. అందుకే, ఈ సమావేశం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జీ20లో కీలక ‘ఇండియా– మధ్యప్రాచ్యం– యూరప్ ఆర్థిక నడవా’ (ఐఎంఈసీ) ప్రకటించిన వెనువెంటనే... ఆ నడవాలో భాగమయ్యే సౌదీతో భారత బంధాల విస్తరణ శుభపరిణామం. రెండు దేశాల మధ్య ఎస్పీసీ 2019 అక్టోబర్‌లో భారత ప్రధాని, రియాద్ పర్యటనలోనే ఏర్పాటైంది. బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తర్వాత సౌదీ అలాంటి భాగస్వామ్యం కుదుర్చుకున్న నాలుగో దేశం ఇండియానే! సరిగ్గా ఏడాది క్రితం 2022 సెప్టెంబర్‌లో మన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సౌదీ వెళ్ళి, ఎస్పీసీ మంత్రిత్వ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. అప్పట్లోనే సౌదీలో మన రూపే కార్డ్ వినియోగం సహా అనేక అంశాలు ప్రధాన సహకార అంశాలుగా చర్చకు వచ్చాయి. సోమవారం రెండు దేశాల నేతల మధ్య చర్చలు అందుకు కొనసాగింపు. నిజానికి, కొన్నేళ్ళుగా భారత, సౌదీల బంధం బలపడుతోంది. విభిన్న సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలున్న రెండు దేశాలూ వాణిజ్యం నుంచి సాంస్కృతికం దాకా బాంధవ్యాలు పెట్టుకుంటున్నాయి. ద్వైపాక్షిక బంధాలు పటిష్ఠం కావాలంటే సాంస్కృతిక సంబంధాలు కీలకం. అందు లోనూ రెండు దేశాలూ అడుగులు వేశాయి. సౌదీలో పవిత్ర మక్కా నగరానికి మనదేశం నుంచే ఏటా వేల మంది హజ్ యాత్ర సాగిస్తుంటారు. భారత్ నుంచి ఏటా 1.75 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులకు అవకాశం కల్పిస్తూ, ఈ ఏడాది మొదట్లోనే సౌదీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక దేశం నుంచి చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఇంత భారీ సంఖ్యలో యాత్రికుల్ని అనుమతిస్తామంటూ సౌదీ కోటా ఇవ్వడం విశేషం. అలాగే, ఆ రాజ్యంలో అత్యధిక ప్రవాసుల సంఖ్య కూడా మనదే! 22 లక్షల మందికి పైగా భారతీయ ప్రవాసులు సౌదీలో ఉన్నారు. ఇవన్నీ భారత్, సౌదీలను మరింత సన్నిహితం చేస్తున్నాయి. ప్రవాసులంతా తమ దేశంలో భాగమేననీ, వారిని సొంత పౌరులలా కడుపులో పెట్టుకుంటామనీ సౌదీ యువరాజు తాజా పర్యటనలోనూ స్పష్టం చేయడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన రెండు దేశాలూ ప్రధానమైనవి. భారత్‌కు నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీయే! ఇక, సౌదీకి రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి భారత్ అని 2022 లెక్క. మన ముడిచమురు దిగుమతుల్లో 18 శాతం పైగా అందిస్తున్నది ఈ అరబ్బు రాజ్యమే. కలసి ప్రగతి బాటలో సాగాలనే లక్ష్యంతో ఇరు దేశాలూ డిజిటల్ పేమెంట్స్, రక్షణ ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం లాంటి రంగాల్లోనూ వాణిజ్య అవకాశాలను అన్వేషిస్తూ వచ్చాయి. సౌదీ యువరాజు, భారత ప్రధాని సహా ఉన్నతస్థాయి వ్యక్తులు కొద్దికాలంగా జరుపు తున్న పర్యటనలు ఈ బంధాన్ని బలోపేతం చేస్తున్నాయి. దానికి తగ్గట్టే ఇరుదేశాలూ తమకు ఉమ్మడి అంశాలైన తీవ్రవాదంపై పోరు, ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారంపై దృష్టి సారిస్తున్నాయి. సోమవారం నాటి చర్చల్లో మహారాష్ట్ర తీరంలో నిర్మించనున్న 5 వేల కోట్ల డాలర్ల విలువైన వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్‌ను వేగవంతంగా అమలు చేయాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. అందుకు ఓ సంయుక్త సత్వర కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించాయి. ఇంధనం, రక్షణ, సెమీకండక్టర్, అంతరిక్ష రంగాల్లో ముమ్మర సహకారానికి వీలున్నట్టు గుర్తించాయి. డిజిటలీకరణ, పెట్టుబడులు సహా వివిధ రంగాల్లో సహకారాన్ని పెంచుకొనేందుకు 8 ఒప్పందాలపై సంతకాలూ చేశాయి. వాస్తవానికి, భారత్, సౌదీల మధ్య సత్సంబంధాల విస్తరణ కేవలం రెండు దేశాలకే కాక, మధ్యప్రాచ్యం – హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటికీ కీలకం. ఈ ప్రాంతంలో సుస్థిరత, ఆర్థికాభివృద్ధి, భద్రతకు తోడ్పడుతుంది. అందుకే భారత్ సైతం ఒకపక్క వ్యూహాత్మకంగా ఇజ్రాయి ల్తో బంధాన్ని పదిలంగా చూసుకుంటూనే, ఇతర అరబ్ దేశాలతో మాటామంతీ సాగిస్తోంది. సౌదీతో మన వ్యూహాత్మక ప్రయోజనాలూ అనేకం. చైనాను మినహాయిస్తే, పాకిస్తాన్‌పై ఒత్తిడి చేయగల ఏకైక దేశం సౌదీనే. అందువల్లే, పాక్‌తో దానికున్న సంబంధాలకు అతీతంగా మన దేశమూ అరబ్బు రాజ్యంతో బలమైన బంధం పెట్టుకుంటోంది. ఇటీవలే ఇరాన్‌తో శత్రుత్వానికి స్వస్తి పలికిన సౌదీ జొహాన్స్‌బర్గ్ సదస్సులో ‘బ్రిక్స్’లో సైతం సభ్యత్వం తీసుకుంది. ఆ పరిణామాల తర్వాత ప్రిన్స్ పర్యటనగా ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఫిబ్రవరిలో భారత్ సందర్శించిన సౌదీ ప్రిన్స్ ఇప్పుడు మళ్ళీ రావడం, ఈసారి భారత– జీసీసీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పైనా దృష్టి పెట్టడానికి ఇరుపక్షాలూ అంగీకరించడం గమనించదగ్గవి. మొత్తానికి, ఈ బంధం వేగంగా పరిణతి చెందుతోంది. తగ్గట్టే మధ్యప్రాచ్యంపై భారత విధానమూ వివిధ రూపాలు తీసుకుంటోంది. సరికొత్త వ్యూహాత్మక కూటమికి పురుడుపోస్తోంది. సౌదీతో స్నేహంలో తాజా భేటీ మరో ముందడుగు. -
G20 Summit: అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా దేశ రాజధానికి విచ్చేసిన సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్–సౌద్‌తో సోమవారం ప్రధాని మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఆయనకు రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు. తర్వాత ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో సల్మాన్ బిన్, మోదీ ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘ ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ సుస్థిరతకు, సంక్షేమానికి భారత్–సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకం. భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి. రెండు దేశాలు కాలానుగుణంగా సత్సంబంధాలను సుదృఢం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి’ అని మోదీ అన్నారు. సోమవారం ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి తొలి భేటీలో ద్వైపాక్షిక బంధంపై ఇద్దరు అగ్రనేతలూ సమీక్ష జరిపారు. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత, సంస్కృతి, సంక్షేమం తదితర అంశాలు మండలి తొలి భేటీలో చర్చకొచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి అరీందర్ బాగ్చీ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘దేశాల దగ్గరి బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అనువైన కొన్ని మార్గాలను అన్వేషించాం. ఇకపై మా భాగస్వామ్యం నూతనోత్సాహంతో కొత్త మలుపు తీసుకోనుంది. గ్రిడ్ల అనుసంధానం, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్లు, సరకు రవాణా గొలసు తదితర కీలక అంశాలపైనా చర్చలు జరిపాం. చర్చలు ఫలప్రదంగా సాగాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు. సంక్షిష్ట అంశాల్లో భాగస్వామ్యం పెంపుకోసం.. ఇరు దేశాల మధ్య సంక్లిష్టంగా మారిన కొన్ని అంశాల్లో సందిగ్ధతను తొలగించుకునేందుకు ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని నెలకొల్పాలని 2019 ఏడాదిలో నిర్ణయించారు. జీ20 సదస్సు తర్వాత భారత్‌లో సల్మాన్ బిన్ అధికారిక పర్యటన కొనసాగిస్తున్నారు. ‘ భారత్‌కు రావడం ఆనందంగా ఉంది. జీ20 సదస్సుకు విజయవంతంగా నిర్వహించినందుకు భారత్‌కు నా అభినందనలు. విశ్వ శ్రేయస్సు కోసం జీ20 సదస్సులో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీతో చర్చలు ఫలవంతంగా సాగాయి. మా రెండు దేశాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇకమీదటా కలిసి పనిచేస్తాం’ అని సల్మాన్ వ్యాఖ్యానించారు. మధ్య ప్రాచ్యంలో భారత్‌కు సౌదీ అరేబియా దేశం అత్యంత కీలకమైంది. గత కొన్నేళ్లలో ఈ రెండు దేశాల మధ్య మరింత మెరుగైన సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రక్షణ, భద్రత సంబంధ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం జీవితకాల గరిష్టానికి చేరుకున్న వేళ సల్మాన్ బిన్ భారత్‌లో పర్యటించడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–సౌదీ వాణిజ్య వ్యాపారం విలువ ఏకంగా 52.75 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. భారత్‌కు సౌదీ నాలుగో అతిపెద్ద వాణిజ్యభాగస్వామిగా కొనసాగుతోంది. 13 లక్షల సైన్యానికి సారథి అయిన నాటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవాణె 2020 డిసెంబర్లో సౌదీలో పర్యటించారు. భారత సైన్యాధ్యక్షుడు ఒకరు సౌదీలో పర్యటించడం ఇదే తొలిసారి. -
అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్
జెదాహ్: ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సౌదీ అరేబియాలో జరుగుతున్న రెండ్రోజుల సమావేశాల్లో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ యుద్ధ సమసిపోతే అంతకంటే సంతోషం మరొకటి ఉండదని అన్నారు. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించగా మొత్తం 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించేందుకే వీరంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించకపోవడం విశేషం. భారత దేశం తరఫున అధికార ప్రతినిధిగా హాజరైన అజిత్ దోవల్ రెండు దేశాల మధ్య సంధిని కుదిర్చే విషయంలో తామెల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు. అజిత్ దోవల్ మాట్లాడుతూ.. భారతదేశం తరపున మేము తరచుగా రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తూ.. దౌత్యాన్ని కుదర్చడానికి తమవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటికే యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు తమకు తోచిన ప్రతిపాదనలు తెరపైకి తీసుకు రాగా వాటిలో కొన్ని మాత్రమే రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని అన్నారు. అలా కాకుండా రెండు దేశాలకూ సమ్మతమైన, శాశ్వతమైన, సమగ్ర పరిష్కారం కోసం భారతదేశం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన అంతర్జాతీయ చట్టాల్లోని నియమ నిబంధనలను భారత్ గౌరవిస్తుందని దాని ప్రకారమే రెండు దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయాత్నం చేస్తామని.. అదే జరిగితే తమకంటే ఎక్కువగా సంతోషించేవారు ఎవ్వరూ ఉండరని అన్నారు. అంతకుముందు జపాన్‌లో జరిగిన జీ7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జిలెన్‌స్కీని కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ఆయనకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం -
ఎడారిలో స్మార్ట్ సిటీ... ఊహకందని మాయం ప్రపంచం...
ఊహకందని మాయం ప్రపంచం వంటివి టీవీలోనూ లేదా కార్టూన్ ఛానల్స్‌లో చూస్తుంటాం. అందులో ఎగిరే కార్లు, ఆకాశంలోనే ఉండే ఎలివేటర్లు తదితర మాయలోకం కనిపిసిస్తుంది. ఐతే అదంతా గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప నిజజీవితంతో సాధ్యం కాదు. ఇది సాధ్యమే అంటూ చేసి చూపిస్తున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. వివరాల్లోకెళ్తే....సౌదీ అరేబియాలో పర్వత పర్యాటకాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2017లోనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఊహకందని ఒక సరి కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని ఒక అద్భుతమైన సిటీ లా మారుస్తుందన్నారు. అంతేకాదు నియోమ్ అని పిలిచే ఒక అత్యద్భుతమైన హైటెక్ సిటీని రూపొందిస్తుంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను మార్చే లక్ష్యంతో దాదాపు రూ.40 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తోంది. ఈ ఫ్యూచరిస్టిక్ మెగాసిటీ న్యూయార్క్ నగరం కంటే 33 రెట్లు ఎక్కువ అని చెబుతోంది. ఇది సౌదీలోని అకాబా గల్ఫ్, ఎర్ర సముద్ర తీరప్రాంతం వెంబడి 26 వేల కి.మీ చదరపు విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, జురాసిక్ పార్క్, ఉద్యానవనం, ఒక పెద్ద కృత్రిమ చంద్రుడు తదితరాలు ఆ నగరానికి ప్రతిష్టాత్మకమైన విషయాలు. అంతేకాదు ఇక్కడ ఆకాశంలో ఏదో విధంగా ఎగిరే ఎలివేటర్లు, అర్బన్ స్పేస్‌పోర్ట్, డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉన్న భవంతులు, ఫాల్కన్ రెక్కలు వికసించిన పువ్వులు తదితరాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా క్లీన్ ఎనర్జీ డెస్టినేషన్(సరళ రేలో విస్తరరించిన నగరం)ను కూడా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తోంది. అంతేకాదు పురాతన ట్రాయ్ నగరం, దాదాపు రెండు మైళ్ల మానవ నిర్మిత సరస్సు, అత్యాధునిక సాంకేతికత కూడిన వర్టికల్ గ్రామం, వినోదం, అతిథి సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఉంటుందని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మా పేర్కొన్నారు. 20030 నాటికి సుమారు 7 లక్షల మంది సందర్శకులను 7 వేల మంది శాశ్వత నివాసితులను ఆకర్షిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. His Royal Highness Mohammed bin Salman, Crown Prince and Chairman of the NEOM Company Board of Directors, has announced the establishment of #TROJENA – the new global destination for mountain tourism, part of #NEOM's plan to support and develop the tourism sector in the region. pic.twitter.com/ZNa4JsamKy — NEOM (@NEOM) March 3, 2022 (చదవండి: ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్) -
సౌదీ యువరాజుపై సంచలన ఆరోపణలు.. ప్రపంచానికే ముప్పు!
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి షాకింగ్ ఆరోపణలు గుప్పించారు. సౌదీ యువరాజు ఓ సైకో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. వివరాల ప్రకారం.. సౌదీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి సాద్ అల్ జాబ్రి తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కిరాయి సైనికులతో 'టైగర్ స్క్వాడ్' అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపాడు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించాడు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్ ను అభివర్ణించారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని అల్ జాబ్రి కుండబద్దలు కొట్టారు. ఇక యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించాడు. అయితే, ఆ మాజీ అధికారి పేరు సాద్ అల్ జాబ్రి.. ఒకప్పుడు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగంలో నంబర్ 2 స్ధానంలో విధులు నిర్వర్తించాడు. అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్‌కు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా, మహ్మద్ బిన్ నయేఫ్‌ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు. ఇదిలా ఉండగా.. అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేశాడని స్పష్టం చేసింది. BIG REVEAL: Saad Aljabri, a former top Saudi intelligence official has said that Crown Prince Mohammed bin Salman keeps a team of mercenaries to kidnap—and even kill—political dissenters. @ericgarland @Abukar_Arman @TrueFactsStated pic.twitter.com/BquD2mr1i5 — Colossus Diplomacy (@ColossusDiplo) July 12, 2022 -
మతిమరుపు బైడెన్‌పై స్పూఫ్ వీడియో.. నెట్టింట వైరల్
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో దీనిపై స్పందిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన వింతగా ఉంటోంది. వయస్సులో పెద్దవాడు కావడం వల్ల జరుగుతోందో.. ఏమో కానీ ఆయన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న ఆమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. అప్పుడే నిద్ర నుంచి లేచి మీడియా ముందుకు వచ్చినట్లు కనిపించడం పట్ల పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు సంబంధించిన ఓ స్పూఫ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుతం సమయంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు మీడియాతో మాట్లాడుతూ గందరగోళానికి గురైనట్లు చాలా వ్యంగ్యంగా ఓ ఫన్నీ స్కిట్‌ను సౌదీలోని ప్రభుత్వానికి అనుకూల టీవీ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ వీడియోలో రెండు పాత్రలు.. జో బైడెన్, కమలా హారిస్‌లు వేదికపై నడుస్తూ వచ్చినట్లు వ్యంగ్యంగా చూపుతారు. వారిద్దరూ మీడియతో మాట్లాడుతూ కనిపిస్తారు. ముందుగా.. బైడెన్ పాత్ర మాట్లాడుతూ.. ఈ రోజు మనం స్పెయిన్ సంక్షోభం గురించి మాట్లాడబోతున్నామని వ్యాఖ్యానిస్తాడు. పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాత్రదారి కాదు.. కాదు.. అన్నట్లు చెవిలో చెబుతుంది. అయినా కూడా వినని బైడెన్ పాత్రదారి.. ఆఫ్రికాలో సంక్షోభం అంటూ మొదలుపెడతాడు. అది కూడా తప్పు కావడంతో చివరకు రష్యా అని అంటాడు. అక్కడితో ఆగకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును మర్చిపోయి గుర్తు చేసుకోవడానికి సహాయం తీసుకుంటాడు. ‘పుతిన్, నా మాట వినండి. మీ కోసం నా దగ్గర చాలా ముఖ్యమైన సందేశం ఉంది. ఆ సందేశం ఏమిటంటే..’ అని నిల్చొన్న చోటే ఓ కునుకు తీస్తాడు. వెంటనే నిద్ర లేవగానే పుతిన్ గురించి పూర్తిగా మర్చిపోయి ‘చైనా ప్రెసిడెంట్' తో మాట్లాడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టాడు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను పట్టుకొని.. తాను మాట్లాడున్న సమయంలో తనను సరిదిద్దినందుకు ధన్యవాదాలు, ఆమెరికా ప్రథమ మహిళా’ అని నవ్వుతూ మాట్లాడుతాడు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గురించి స్పందించాలన్న అమెరికా అభ్యర్థనను సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి స్వీకరించిన తర్వాత సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఒక్కసారిగా కూడా మాట్లాడిన దాఖలు లేకపోవడం గమనార్హం. తాజాగా ప్రసారమైన ఈ ఫన్నీ స్కిట్‌తో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నావో తెలుసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. VIDEO: A prominent Saudi television network has racked up millions of views with a comedy sketch that openly mocks US President Joe Biden, an unusual move that further signals souring ties pic.twitter.com/GRrNXx7Bjo — AFP News Agency (@AFP) April 14, 2022 -
జో బైడెన్‌కు సౌదీ అరేబియా అధ్యక్షుడి వార్నింగ్
దుబాయ్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరికలు జారీ చేశారు. తమ అంతరంగిక వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోరాదన్నారు. ‘అట్లాంటిక్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్.. ‘అమెరికా సొంత విషయాలపై అధ్యక్షుడు బైడెన్ మాట్లాడాలి. మాది సంపూర్ణ రాజరిక దేశం. నా గురించి బైడెన్ అపార్థం చేసుకున్నా పట్టించుకోను. అమెరికా గురించి మాకు అవసరం లేదు. వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ దేశంతో చిరకాల బంధాన్ని బలోపేతం చేసుకోవడమే మా లక్ష్యం’ అని చెప్పారు. బైడెన్ వచ్చాక రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. చదవండి: (మసీదుపై ఆత్మాహుతి దాడి.. 30 మంది మృతి) -
సౌదీ యువరాజుకు పుతిన్ సందేశం!
Russian-Saudi partnership:ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణకు అడ్డుకట్టే వేసే నేపథ్యంలో ప్రపంచదేశాలు పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యన్ కరెన్సీ రూబుల్ రికార్డ స్థాయిలో పతనమైంది. మరోవైపు ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్పుతిన్ సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో సంభాషించారు. పాశ్చాత్య దేశాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నందున కీలకమైన బౌగోళిక రాజకీయ కూటమి గురించి నొక్కిచెప్పారు. ఉక్రెయిన్ పై దాడి కారణంగా రష్యాను ఆర్థికంగా ఒంటరి చేశాయి. కీలకమైన రష్యా బ్యాంకులు అంతర్జాతీయ లావాదేవీల నిర్వహించకుండా ఉండేలా తొలగించింది. దీంతో వ్యాపారులు చమురు రవాణాను నిర్వహించడానికి విముఖత చూపుతారు. ఈ మేరకు సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలోని ఓపెక్ ప్లస్ బుధవారం జరిగిన సమావేశంలో తీవ్రతరం అవుతున్న ఈ సంక్షోభాన్ని తాము పెద్దగా పట్టించుకోలేదని పుతిన్ అన్నారు. కార్టెల్ క్రూడ్ ధరలను తగ్గించడానికి ఉత్పత్తిని పెంచే దిశగా కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉందని ఇది మాస్కో, రియాద్ల మధ్య ఉద్రిక్తతలను సృష్టించే అవకాశం ఉందన్నారు . అయినా ప్రపంచ ఇంధన సరఫరా సమస్యలను రాజకీయం చేయడం ఆమోదయోగ్యం కాదని కూడా పుతిన్ నొక్కిచెప్పారు. రష్యా సౌదీ భాగస్వామ్యంలో ఇరు దేశాలు పరస్పర సహకారంతో సమగ్ర అభివృద్ధిపథంలోకి దూసుకుపోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: అదే గనుక పేలితే ఐరోపా అంతమే: జెలెన్ స్కీ) -
‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా!
గత కొన్ని దశాబ్దాలపాటు ఆంక్షల నడుమ జీవనం సాగించిన సౌదీ అరేబియా మహిళ లు.. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ నిర్ణయాలతో ఇతర దేశాల్లోని మహిళల వలే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో చేరుతూ తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. 2018 వరకు ఆంక్షల్లో ఉన్న... మహిళల డ్రైవింగ్, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లడం, ఒంటరి ప్రయాణాలకు అవకాశం కల్పించడం, ఆర్మీలో చేరడానికి ఒప్పుకోవడం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో అక్కడి మహిళలు సంకెళ్ల నుంచి బయటపడ్డట్టుగా భావిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న సౌదీలో ఇటీవల మక్కా మసీదులో మహిళా భద్రతా సిబ్బందిని కూడా నియమించడం సంచలనం సృష్టించింది. మొన్నటిదాకా ప్రపంచంలోనే మహిళా ఉద్యోగుల శాతం అతి తక్కువగా ఉన్న సౌదీలో.. ప్రస్తుతం ఉద్యోగాలకోసం మహిళలు వేలల్లో పోటీ పడుతున్నారు. ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’ అంటూ నిబంధనలు సడలించడంతో వివిధ రంగాల్లో పనిచేసేందుకు అక్కడి మహిళలు అవకాశాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. తాజాగా బుల్లెట్ ట్రైన్స్ నడపడానికి మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 30 వేలమంది పోటీపడ్డారు. ఈ ఏడాది జనవరి మొదట్లో సౌదీ రైల్వే పాలిటెక్నిక్ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలు రైళ్లు నడిపేందుకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. సౌదీలో అత్యంత పవిత్ర నగరాలైన మక్కా, మదీనా మధ్య రైలు సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న స్పానిష్ సంస్థ మహిళా ట్రైన్ డ్రైవర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనతో సౌదీ మహిళల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 30 ఖాళీలకుగానూ 28 వేల దరఖాస్తులు వచ్చాయి. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణను ఇస్తారు. తరువాత మక్కా నుంచి మదీనా వరకు నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లను నడుపుతారు. కొన్నేళ్లుగా అనేక పరిమితులు, ఆంక్షలతో ఇటువంటి అవకాశం, నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి కావడంతో వేలాదిమంది మహిళలు ట్రైన్ డైవర్లు అయ్యేందుకు పోటీ పడ్డారు. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ .. మహిళల అభ్యున్నతి, సాధికారతకు తీసుకుంటున్న నిర్ణయాలతో.. సౌదీలో కూడా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేటు సెక్టార్లలో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్యలో నలభై శాతం పెరుగుదల ఉండగా, ఉత్పాదక రంగంలో 14 శాతం, నిర్మాణ రంగంలో 9 శాతం వృద్ధి నమోదైంది. సౌదీ మహిళలకు ఇప్పటిదాకా టీచర్లుగా, హెల్త్ వర్కర్లుగా మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మిగతా రంగాల్లో మగవాళ్లకు మాత్రమే అనుమతి ఉండడంతో వారి ఉద్యోగపరిధి అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్ డ్రైవర్ల నియామక స్ఫూర్తితో సౌదీలో మహిళల సారథ్యంలో రైళ్లు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతాయని ఆకాంక్షిద్దాం. -
ఈ డజన్ కొత్త విజన్
మిలిటరీ దుస్తుల్లో కనిపిస్తున్న ఆమె హజ్ యాత్రికులకు సూచనలు ఇస్తుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఓపికగా తీరుస్తుంది. నడవడానికి ఇబ్బంది పడుతున్నవారికి సహాయపడుతుంది. సైనిక దుస్తుల్లో కనిపించే గంభీరత్వం మాట ఎలా ఉన్నా, ఆమె మాత్రం పక్కింటి ఆత్మీయనేస్తం లానే కనిపిస్తుంది. పవిత్ర మక్కా, మదీనాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సైనికుల చిత్రాలు ఒక చారిత్రక మార్పుకు సూచనగా నిలిచాయి. ఎందుకీ మార్పు? సౌదీ యువరాజు మహ్మద్‌బిన్ సల్మాన్ (ఎంబీఎస్) విజన్ 2030 ప్రణాళిక రూపొందించాడు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. అది జరగాలంటే ప్రధాన స్రవంతికి దగ్గరవ్వాలి. ఇందులో భాగంగా సంప్రదాయ విధానం నుంచి కాస్త పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సౌదీ ప్రభుత్వం. మహిళలు సైన్యంలో చురుకైన పాత్ర నిర్వహించడమనేది ఈ మార్పుకు సంకేతంలా నిలుస్తుంది. సైన్యంలో పనిచేయాలనేది మోనా చిన్నప్పటి కల. అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో అది కలకే పరిమితమనే కఠిన వాస్తవం తెలిసింది. ఆ కఠిన వాస్తవం కరిగిపోయి మోనా సైన్యంలో చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘నాన్నలాగే సైన్యంలో పనిచేయాలనిది నా కోరిక. అది నెరవేరినందుకు చాలా గర్వంగా ఉంది. పవిత్రభూమిలో విధులు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది మోనా. మక్కా, మదీనాలలో సైనిక విధులు నిర్వహిస్తున్న పన్నెండు మంది మహిళలలో మోనా ఒకరు. కాబా సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమర్ సైకాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘సైన్యంలో పనిచేయాలనుకుంటున్నాను’ అని తన మనసులో మాటను ఒకరోజు కుటుంబసభ్యులకు చెప్పింది. వారు సంతోషించారు. ప్రోత్సహించారు. తల్లిదండ్రుల మానసిక దృక్కోణంలో వచ్చిన కీలక మార్పుగా దీన్ని చెప్పుకోవచ్చు. ‘ఇదొక ఉద్యోగం అనుకోవడం లేదు. పవిత్ర బాధ్యతగా భావిస్తున్నాను’ అంటుంది సమర్. 2019లోనే సైన్యంలోకి మహిళలు రావడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సోల్జర్ నుంచి సార్జెంట్ వరకు వివిధ హోదాల్లో మహిళలు పనిచేడానికి దారి పడింది. ‘మహిళలను సైన్యంలోకి తీసుకోవాలా? వద్దా? అనేది గత 30 సంవత్సరాలుగా రగులుతున్న వివాదస్పద అంశం. ఏది ఏమైనా సైన్యంలోకి మహిళల రాక అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం’ అంటున్నారు ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్ హలహ్. ఇక షాపింగ్ మాల్స్‌లో మహిళలు క్యాషియర్లుగా కనిపించడం సాధారణ దృశమైంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్‌లో పబ్లిక్ నోటరీలుగా వందమంది మహిళలను నియమించారు. త్వరలో మహిళా జడ్జీల నియామకానికి సన్నాహాలు చేస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే వివిధ రంగాలలో మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. మహిళలపై పరిమితులు విధించే సంరక్షణ విధానానికి చెల్లుచీటి ఇచ్చింది ప్రభుత్వం. మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని కూడా పక్కన పెట్టింది. రాబోయే రోజుల్లో సౌదీ అరేబియాలో మరెన్ని మార్పులు జరగనున్నాయో వేచిచూద్దాం. -
ఖషోగి హత్య వెనుక సౌదీ యువరాజు హస్తం
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు జమాల్ ఖషోగి హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని తేలడంతో సౌదీపై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని బైడెన్ ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. సౌదీ యువరాజుని ఆంక్షల నుంచి మినహాయించింది. ఖషోగిపై అక్కసు పెంచుకున్న సౌదీ యువరాజు ఆయనను సజీవంగా బంధించడం లేదంటే చంపేయండి అంటూ తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా అమెరికా ఇంటలిజెన్స్ తన నివేదికలో వివరించింది. సౌదీ యువరాజు అనుమతితోనే జర్నలిస్టు ఖషోగిని హత్య చేసినట్టుగా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక నివేదిక సమర్పించడంతో బైడెన్ సర్కార్ చర్యలకు దిగింది. ట్రంప్ హయాంలో వివిధ దేశాలతో క్షీణించిన సంబంధాలను పునరుద్ధరించి ప్రపంచంలో అమెరికాని తిరిగి అగ్రగామిగా నిలబెడతామని బైడెన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అందుకే ఆంక్షల నుంచి యువరాజుని మినహాయించింది. ‘అధ్యక్షుడు బైడెన్ సంబంధాలు పూర్తిగా తెగిపోవాలని భావించడం లేదు. మళ్లీ ఎప్పటికైనా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని ఆశిస్తున్నారు. అయితే మానవ హక్కులకు భంగం వాటిల్లుతూ ఉంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోరు’అని బైడెన్ ప్రభుత్వంలోని అధికారి ఒకరు వెల్లడించారు. -
సౌదీ పౌరుల వీసా బ్యాన్ చేసిన జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా పౌరుడైన జర్నలిస్టు జమాల్ ఖషోగి హత్య కేసులో సౌదీ అరేబియాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరులకు వీసా నిషేదిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే ఖషోగిని చంపించింది యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అని ఆరోపించిన అమెరికా.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆంక్షలను మాత్రమే విధించించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సౌదీ అరేబియాకు చేయూతనిచ్చారని, అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని అమెరికా నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ చర్యలతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న క్రమంలో తాజా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఆంక్షలు విధించారు. ఇక 76 మంది సౌదీ పౌరులకు అమెరికా ప్రభుత్వం వీసాను నిషేధించింది. జర్నలిస్టులు, ప్రభుత్వంపై అసమ్మతి తెలియజేస్తూ వారిపై దాడులకు తెగబడే వారికి ఆంక్షలు విధించేలా అమెరికా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధానాల ప్రకారమే 76 మందిపై అగ్రరాజ్యం వీసాను నిషేధించింది. అంతేగాక వారి కుటుంబ సభ్యుల్లో ఎంపిక చేసిన వారికే వీసా ఆంక్షలు వర్తిస్తాయి ప్రకటనలో పేర్కొంది. విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ సరిహద్దుల్లో భద్రతకే పెద్ద పీట వేస్తామని, ప్రభుత్వ అసమ్మతి గళం వినిపించే వారిపై దాడులను సహించబోమని అన్నారు. అలాంటి ద్వేషాన్ని తమ గడ్డపైకి రానివ్వబోమని తేల్చి చెప్పారు. మరోవైపు తమ పరిశీలనలో ఉండే సౌదీ అరేబియా, ఇతర దేశాలపై మానవ హక్కుల నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. జర్నలిస్టు జమాల్ ఖషోగిని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చంపించాడంటూ అమెరికా ఆరోపించింది. శుక్రవారం నివేదికను విడుదల చేస్తూ.. 2018 అక్టోబర్ 2న ఖషోగిని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌కు పిలిపించి ముక్కలుముక్కలుగా నరికి చంపినట్లు అమెరికా తన నివేదికలో పేర్కొంది. ఇప్పటిదాకా ఖషోగి మృతదేహం కూడా లభించలేదని వెల్లడించింది. అమెరికా పౌరుడైన ఖషోగి.. సౌదీ యువరాజు అవినీతిని బయటపెట్టాడని, అందుకే ఆయన్ను యువరాజు చంపించారని ఆమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఖషోగ్గి హత్య: అమెరికా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ : సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య జరిగినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ తన నివేదికలో వెల్లడించింది. 2018లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖషోగ్గి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆ దారుణంపై అమెరికా ప్రభుత్వం తాజాగా నివేదికను విడుదల చేసింది. ఖషోగ్గిని బంధించండి లేదా హత్య చేయాలంటూ ప్రిన్స్ సల్మాన్ ఆదేశించినట్లు ఆ నివేదికలో తెలిపింది. ప్రిన్స్ అనుమతి లేకుండా.. ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద దారుణం చోటు చేసుకోవడం అసంభవం అని నివేదికలో పేర్కొన్నది. అయితే అమెరికా నేరుగా సౌదీ రాజుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. నివేదికను వెల్లడించిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం సౌదీపై డజన్ల సంఖ్యలో ఆంక్షలను ప్రకటించింది. అయితే అమెరికా రిలీజ్ చేసిన నివేదికను సౌదీ అరేబియా కొట్టిపారేసింది. అదో నెగటివ్, తప్పుడు రిపోర్ట్ అని పేర్కొన్నది. జర్నలిస్టు ఖషోగ్గి మర్డర్ కేసులో తన పాత్రలేదని సౌదీ రాజు మహ్మద్ తెలిపారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖషోగ్గి తన మ్యారేజ్ పేపర్స్ కోసం కాన్సులేట్ భవనంలోకి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో కొన్ని పాశ్చాత్య దేశాలు, సీఐఏ ఖషోగ్గి హత్య వెనక సౌదీ రాజు ప్రమేయం ఉందని ఆరోపించాయి. అయితే వీటిని సౌదీ ప్రభుత్వం కొట్టి పారేసింది. ఈ క్రమంలో ఖషోగ్గి మర్డర్ ఆపరేషన్‌కు ప్రిన్స్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రుజువు చేసేందుకు మూడు కారణాలను అమెరికా నివేదిక పేర్కొన్నది. చదవండి: సౌదీ రాజుపై కోర్టులో దావా, కారణం? ‘ఓవెన్ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’ -
సౌదీ రాజుపై కోర్టులో దావా, కారణం?
వాషింగ్టన్: రెండు సంవత్సరాల క్రితం ఇస్తాంబుల్‌లో జరిగిన దారుణ హత్యకు నష్టపరిహారం కోరుతూ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి కాబోయే భార్య సెంగిజ్ సౌదీ అరేబియా యువరాజు, ఇతర అధికారులపై మంగళవారం అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అమెరికా రచయిత జమాల్ ఖషోగ్గి పలు కథనాలు రాశాడు.దీంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఖషగ్గీని హత్య చేయించాడని అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్ళిన ఖషోగ్గి అక్టోబరు 2, 2018న హత్యకు గురయ్యాడు. అమెరికాకు మిత్రపక్షంగా ఉన్న సౌదీ ఆరేబియా తొలుత ఖషోగ్గి హత్యలో తన ప్రమేయాన్ని నిరాకరించింది. తరువాత పలు పొంతనలేని వ్యాఖ్యలు చేసినా చివరికి ఇస్తాంబుల్‌లోని దౌత్య కార్యాలయంలో సౌదీ ఏజెంట్ల బృందం ఖషోగ్గిని హత్య చేసినట్లు అంగీకరించింది. దీనిపై విచారణ చేసిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ కూడా మహ్మద్ బిన్ సల్మాన్ ఖషోగ్గి హత్యకు ఆదేశించారని నివేదిక ఇచ్చింది. ఈ హత్యతో తమకు అపార నష్టం వాటిల్లిందని అతనికి కాబోయే భార్య అమెరికా కోర్టులో కేసు వేసింది. ఖషోగ్గి డీఏడబ్ల్యూఎన్ అనే సంస్థను స్థాపించాడని అతను మరణించిన కారణంగా దాని కార్యకలాపాలు దెబ్బతిన్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. ఖషోగ్గిని క్రూరంగా హింసించి హత్య చేశారని ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని షాక్‌కు గురిచేసిందని దావాలో తెలిపారు. అరబ్‌లో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఖషోగ్గి ప్రయత్నించారని, ప్లాన్ ప్రకారమే ఆయనను హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని వారు కోర్టుకు తెలిపారు. చదవండి: మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా -
ఆస్పత్రిలో చేరిన సౌదీ రాజు
రియాద్: సౌదీ అరేబియా రాజు కింగ్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్(84) ఆస్పత్రిలో చేరారు. పిత్తాశయం వాపుతో బాధపడుతున్న ఆయన రాజధాని రియాద్‌లోని ఆస్పత్రిలో చేరినట్లు స్థానిక వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. రాజు సల్మాన్ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు డిప్యూటీ ప్రీమియర్‌గా బాధ్యతలు చేపట్టారు. 50 సంవత్సరాలకు పైగా రియాద్ ప్రాంతానికి గవర్నర్‌గా పని చేశారు. 2012లో యువరాజుగా, 2015లో సౌదీ రాజుగా రాజ్యాధికారం చేపట్టారు. అయితే 2016లో ఆయన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను యువరాజుగా ప్రకటించినప్పటి నుంచీ సౌదీకి వాస్తవ పరిపాలకుడు ఆయనేనని పరిగణిస్తున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్.. దేశంలో అనేక సంస్కరణలకు కారణమయ్యారు. అలాగే 2017లో సౌదీ రాజు కుటుంబాన్ని నిర్బంధించి వివాదాస్పద నాయకుడిగానూ ముద్ర వేసుకున్నారు. జర్నలిస్ట్ ఖషోగ్గీని హత్య చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. (మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా) -
మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా
రియాద్: తమ తండ్రిని హతమార్చిన వారిని క్షమిస్తున్నామని దివంగత సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ కుమారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు.. ‘‘అమరుడైన జమాల్ ఖషోగ్గీ కుమారులమైన మేము.. మా నాన్నను హత్య చేసిన వారికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటన చేస్తున్నాం’’ అని ఖషోగ్గీ కుమారుడు సలా ఖషోగ్గీ ట్వీట్ చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అతడు స్పష్టతనివ్వలేదు. కాగా అమెరికా- సౌదీల పౌరసత్వం కలిగి ఉన్న ఖషోగ్గీ కుమారుడు పెద్ద కొడుకు సలా జమాల్ ఖషోగ్గీ ప్రస్తుతం సౌదీలో నివసిస్తున్నాడు. ఇక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసిన ఖషోగ్గీ.. 2018 అక్టోబరులో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. దీంతో అంతర్జాతీయ సమాజం సౌదీ యువరాజుపై తీవ్ర విమర్శలు గుప్పించింది.(ఖషోగ్గీ సంతానానికి సౌదీ ప్రభుత్వ భారీ చెల్లింపులు!) ఈ నేపథ్యంలో అమెరికా సైతం ఖషోగ్గీ హత్యోందంతానికి సంబంధించిన నిజాలు వెలికితీసేందుకు తమ గూఢాచార సంస్థ (సెంట్రల్ ఇంటలిజిన్స్ ఏజెన్సీ)ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలో రియాద్ నుంచి వచ్చిన 15 మంది ఏజెంట్లు ఖషోగ్గీని హతమార్చారని టర్కీ ఆరోపించింది. ఖషోగ్గీ అనుమానాస్పద మృతి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపడంతో.. అతడి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. ఈ క్రమంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసులో సౌదీ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించగా.. ముగ్గురు 24 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించనున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.(ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష) ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ మీద తనకు పూర్తి విశ్వాసం ఉందన్న సలా.. దోషులు కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తాజాగా దోషులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్యర్యపరిచాడు. కాగా ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్ హేటీస్ సెనీజ్ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది. -
ఇకపై అక్కడ కొరడా దెబ్బలు ఉండవు..
రియాద్: కట్టుబాట్లకు మారుపేరైన ఎడారి దేశం సౌదీ అరేబియాలో గత కొంతకాలంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజన్ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక ఆంక్షలను సడలిస్తున్నారు. సామాజిక, ఆర్థిక సంస్కరణల్లో మహిళల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడంతో పాటుగా.. తొలిసారిగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో సౌదీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన పౌరులను కొరడా దెబ్బలు కొట్టే సంప్రదాయానికి స్వస్తి పలికినట్లు సమాచారం. ఇందుకు ప్రత్యామ్నాయంగా సదరు పౌరులకు నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష లేదా జరిమానా విధించడం లేదా రెండూ అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ సుప్రీంకోర్టు జనరల్ కమిషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అనుసరించి మానవ హక్కుల సంస్కరణలను ప్రవేశపెడుతున్నాం’’అని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం తాజా నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఈ సంస్కరణ ఎన్నో ఏళ్ల క్రితమే చేపట్టాల్సిందని అభిప్రాయపడ్డాయి. ఈ విషయం గురించి సౌదీ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు అవాద్ అల్వాద్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్నిరోజులుగా రాజ్యంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. హ్యూమన్ రైట్స్ అజెండాలో సరికొత్త ముందడుగు ఇది’’అని వ్యాఖ్యానించారు. -
సౌదీ రాజుకు వ్యతిరేకంగా కుట్ర
రియాద్: సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. శుక్రవారం ఉదయం యువరాజులు ముగ్గురిని వారి ఇళ్ల నుంచి అరెస్ట్ చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. సౌదీ రాజు సల్మాన్‌తోపాటు ఆయన కొడుకు మహ్మద్ బిన్ సల్మాన్‌లను గద్దె దింపేందుకు కుట్ర పన్నినట్లు వీరిపై న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువైతే నిందితులకు జీవితకాల ఖైదు లేదంటే మరణ శిక్ష పడే అవకాశం ఉంది. నయేఫ్తోపాటు ఆయన తమ్ముడు నవాఫ్ బిన్ నయేఫ్ కూడా అరెస్ట్ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. -
వివాదాస్పద వీడియో.. విమర్శలు!
రియాద్ : సౌదీ అరేబియా భద్రతా సంస్థ(ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ) విడుదల చేసిన ఓ ప్రమోషనల్ వీడియో వివాదాస్పదంగా మారింది. ఫెమినిజం, స్వలింగసంపర్కం, ఎథిజం(నాస్తికత్వం) అనేవి తీవ్ర వాద భావాలంటూ భద్రతా సంస్థ పేర్కొనడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇలాంటి తీవ్రవాద భావాలు, వంకర బుద్ధి ఇక్కడ ఆమోదయోగ్యం కాదు. మాతృదేశ విధానాలకు వ్యతిరేకంగా ఏం చేసినా అది తీవ్రవాదంగానే పరిగణింపబడుతుంది అనే వాయిస్ ఓవర్‌తో సాగిన వీడియోలో ఫెమినిజం, స్వలింగ సంపర్కం, ఎథిజాన్ని తీవ్రవాద భావనలుగా అభివర్ణించింది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నవయుగ సౌదీ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని చెబుతూనే ఇలాంటి వీడియోలు విడుదల చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సౌదీ రాచరికం ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా విజన్ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం.. మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశం కల్పించడం, అదే విధంగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. తమ దేశ పర్యటనకు వచ్చే విదేశీ మహిళలు, పురుషులు సంయుక్తంగా హోటల్ గదుల్లో బస చేయవచ్చంటూ సరికొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి కలిసి బయటికి వస్తే బహిరంగంగానే కఠిన శిక్షలు అమలుచేసే ఎడారి దేశం.. పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటోందనే వాదనలు వినిపించాయి. ఇక తాజా వీడియోతో మరోసారి మహిళలు, నాస్తికుల పట్ల సౌదీ నిజమైన వైఖరేంటో అర్థమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇరాన్‌పై సౌదీ రాజు సంచలన వ్యాఖ్యలు
ఇరాన్‌ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు కలిసి రాకపోతే మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి ఇంధన ధరలు చేరే అవకాశముందని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అలాగే చమురు ధరలు మన జీవితకాలంలో చూడని అనూహ్య రీతిలో పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సీబీఎస్ టీవీ ఛానల్లో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో మహమ్మద్ బిన్ సల్మాన్ కార్యక్రమం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో ప్రపంచం కఠిన చర్యలు తీసుకోనిపక్షంలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయని మహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ముఖ్యంగా సైనిక చర్యకంటే..రాజకీయపరమైన, శాంతియుత పరిష్కారమే మంచిదని తాము భావిస్తున్నామంటూ ప్రకంపనలు రేపారు. ఇరాన్‌తో యుద్ధం చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ఇది ప్రపంచ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈనేపథ్యంలోనే ఆ దేశంతో శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు విఘాతం కలుగుతుందని, తద్వారా ఇంధన ధరలు జీవితంలో మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి చేరే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. సౌదీలో ఆయిల్ రిఫైరీపై ఈ నెల 14న జరిగిన క్షిపణి దాడులు ఇరాన్ చర్యేనని సౌదీ ఆరోపిస్తోంది. మరోవైపు సౌదీలోని ఆయిల్ రిఫైనరీపై జరిగిన డ్రోన్ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయమున్నట్లు సౌదీ అరేబియాతో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఇరాన్ తమ ప్రమేయం లేదని ఇరాన్ కొట్టిపారేసింది. కాగా ఏడాది క్రితం జరిగిన వాషింగ్టన్ పోస్టు కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యలో తన ప్రమేయం లేదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టంచేశారు. అయితే సౌదీ రాజ్యాధినేతగా ఖషోగ్గి హత్యకు తాను పూర్తి బాధ్యతవహిస్తున్నట్లు స్పష్టంచేశారు. సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై క్షిపణి దాడుల నేపథ్యంలో సౌదీ-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఖషోగ్గీ హత్య; పూర్తి బాధ్యత నాదే!
రియాద్ : ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ఖషోగ్గీ హత్యకు గురైన కారణంగా పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఖషోగ్గీని చంపింది ఎవరైనా తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మహ్మద్ బిన్ పాలను విమర్శిస్తూ కథనాలు రాసే సౌదీ అరేబియా జాతీయుడు జమాల్ ఖషోగ్గీ... గతేడాది అక్టోబరు 2న టర్కీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగ్గీ అదృశ్యమవడంతో సౌదీ యువరాజే పథకం ప్రకారం అతడిని అంతమొందించాడనే విమర్శలు వెల్లువెత్తాయి. యువరాజు ఆదేశాలతో ప్రత్యేక విమానంలో టర్కీకి వెళ్లిన 11 మంది బృందం అతడిని హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సైతం సౌదీ యువరాజును తప్పుబట్టింది. ఖషోగ్గీ విషయంలో సౌదీ అధికారులు క్లిష్ట సమస్యలు ఎదుర్కోబోతున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించడంతో మధ్య ప్రాచ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ మొదటి వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన వార్తా సంస్థ పీబీఎస్ మహ్మద్ బిన్ను ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా మహ్మద్ బిన్ మాట్లాడుతూ...‘ మా దేశంలో 20 మిలియన్ మంది ప్రజలు ఉన్నారు. అందులో 3 మిలియన్ల మంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు. నా దగ్గర ఎంతో మంది మంత్రులు, అధికారులు పనిచేస్తారు. నన్ను అడగకుండానే నా ప్రత్యేక విమానాలను వారు తీసుకువెళ్లే అధికారం కలిగి ఉంటారు. పైగా ఖషోగ్గీ హత్య నా హయాంలో జరిగిన కారణంగా బాధ్యత నాదే అని పేర్కొన్నారు. కాగా ఖషోగ్గీ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. గతేడాది అక్టోబరులో తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సౌదీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఖషోగ్గీ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. అయితే ప్రధాన కుట్రదారుడు సల్మానే అయినపుడు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నమ్మడం చాలా హాస్యాస్పదమైన విషయమని టర్కీ విమర్శలు గుప్పించింది. -
ఖషోగ్గీ హత్య; ఆధారాలు దొరికాయి!
జెనీవా : జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉన్నట్లుగా తనకు ఆధారాలు దొరికాయని యూఎన్ హక్కుల కార్యకర్త ఆగ్నస్ కాలామర్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో సౌదీ రాజు, అధికారులకు వ్యతిరేకంగా ఆధారాలు లభించినందున వారిపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘ఈ కేసులో ఎవరినీ దోషులుగా నిర్ధారించలేం. అయితే కొన్ని ఆధారాలు మాత్రం లభించాయి. సరైన పద్ధతిలో విచారణ జరిపినట్లైతే నిజాలన్నీ బయటకు వస్తాయి. నేరం చేసిన వారితో పాటు వారిని ప్రోత్సహించిన వారి గురించి కూడా బయటపడతుంది. సౌదీ యువరాజుకు ఉన్న అధికారాల పట్ల ఖషోగ్గికి పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన అంటే కాస్త భయం కూడా ఉండేది. ఖషోగ్గీ హత్య కేసును విచారించడంలో సౌదీ, టర్కీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి. క్రైమ్‌సీన్‌లో ఆధారాలన్నీ మాయమయ్యాయి. దీన్ని బట్టి ఈ కేసు పట్ల ఇరు ప్రభుత్వాలకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది’ అని ఆమె తన నివేదిక(ఆర్బిటరీ ఎగ్జిక్యూషన్)లో పేర్కొన్నారు. కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఇక కొంతకాలం క్రితం ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో సౌదీ ప్రభుత్వం డబ్బు అందజేసినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదించింది. ఈ క్రమంలో ఖషోగ్గీ కేసును నీరుగార్చేందుకే ఆయన సంతానానికి రాజు కానుకలు ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. -
వారికి ఖరీదైన ఇళ్లు, పెద్దమొత్తంలో డబ్బు!
వాషింగ్టన్ : ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి సంతానానికి సౌదీ ప్రభుత్వం భారీ సహాయం అందజేసిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ మేరకు ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో డబ్బు అందజేసినట్లు పేర్కొంది. పోర్టు సిటీ జెడ్డా సమీపంలో దాదాపు నాలుగు మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు ఇవ్వడంతో పాటు.. నెలకు పది వేల డాలర్ల చొప్పున వారికి చెల్లించేందుకు సిద్ధమైందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ పెద్ద కుమారుడు మాత్రమే సౌదీలో నివసించాలని అనుకుంటున్నాడని.. మిగతా వాళ్లంతా ఇక్కడ ఉన్న తమ ఆస్తులు అమ్మేసి అమెరికా వెళ్లి పోవాలనుకుంటున్నారని కథనం ప్రచురించింది. ఇక ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్డీ స్కాలర్ హేటీస్ సెనీజ్ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది.(మా నాన్నే మాకు నిరంతర ప్రేరణ) కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఈ క్రమంలో ఆయన సంతానానికి సౌదీ యువరాజు భారీ ఎత్తున సహాయం అందించడం గమనార్హం.