మోదీ, సల్మాన్‌ల ఆలింగనం; ప్రధాని మోదీ, యువరాజు సల్మాన్‌ల సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధి బృందాల చర్చలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా దేశ రాజధానికి విచ్చేసిన సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్–సౌద్‌తో సోమవారం ప్రధాని మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఆయనకు రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు. తర్వాత ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో సల్మాన్ బిన్, మోదీ ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు.
‘ ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ సుస్థిరతకు, సంక్షేమానికి భారత్–సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకం. భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి. రెండు దేశాలు కాలానుగుణంగా సత్సంబంధాలను సుదృఢం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి’ అని మోదీ అన్నారు. సోమవారం ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి తొలి భేటీలో ద్వైపాక్షిక బంధంపై ఇద్దరు అగ్రనేతలూ సమీక్ష జరిపారు.
రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత, సంస్కృతి, సంక్షేమం తదితర అంశాలు మండలి తొలి భేటీలో చర్చకొచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి అరీందర్ బాగ్చీ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘దేశాల దగ్గరి బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అనువైన కొన్ని మార్గాలను అన్వేషించాం. ఇకపై మా భాగస్వామ్యం నూతనోత్సాహంతో కొత్త మలుపు తీసుకోనుంది. గ్రిడ్‌ల అనుసంధానం, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్లు, సరకు రవాణా గొలసు తదితర కీలక అంశాలపైనా చర్చలు జరిపాం. చర్చలు ఫలప్రదంగా సాగాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు.
సంక్షిష్ట అంశాల్లో భాగస్వామ్యం పెంపుకోసం..
ఇరు దేశాల మధ్య సంక్లిష్టంగా మారిన కొన్ని అంశాల్లో సందిగ్ధతను తొలగించుకునేందుకు ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని నెలకొల్పాలని 2019 ఏడాదిలో నిర్ణయించారు. జీ20 సదస్సు తర్వాత భారత్‌లో సల్మాన్ బిన్ అధికారిక పర్యటన కొనసాగిస్తున్నారు. ‘ భారత్‌కు రావడం ఆనందంగా ఉంది. జీ20 సదస్సుకు విజయవంతంగా నిర్వహించినందుకు భారత్‌కు నా అభినందనలు. విశ్వ శ్రేయస్సు కోసం జీ20 సదస్సులో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
మోదీతో చర్చలు ఫలవంతంగా సాగాయి. మా రెండు దేశాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇకమీదటా కలిసి పనిచేస్తాం’ అని సల్మాన్ వ్యాఖ్యానించారు. మధ్య ప్రాచ్యంలో భారత్‌కు సౌదీ అరేబియా దేశం అత్యంత కీలకమైంది. గత కొన్నేళ్లలో ఈ రెండు దేశాల మధ్య మరింత మెరుగైన సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రక్షణ, భద్రత సంబంధ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం జీవితకాల గరిష్టానికి చేరుకున్న వేళ సల్మాన్ బిన్ భారత్‌లో పర్యటించడం గమనార్హం.
2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–సౌదీ వాణిజ్య వ్యాపారం విలువ ఏకంగా 52.75 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. భారత్‌కు సౌదీ నాలుగో అతిపెద్ద వాణిజ్యభాగస్వామిగా కొనసాగుతోంది. 13 లక్షల సైన్యానికి సారథి అయిన నాటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవాణె 2020 డిసెంబర్‌లో సౌదీలో పర్యటించారు. భారత సైన్యాధ్యక్షుడు ఒకరు సౌదీలో పర్యటించడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment