యువరాజు గారి పర్యటన | Sakshi Editorial On Saudi Crown Prince Mohammed Bin Salman India Visit | Sakshi
Sakshi News home page

యువరాజు గారి పర్యటన

Published Fri, Feb 22 2019 12:20 AM | Last Updated on Fri, Feb 22 2019 12:20 AM

Sakshi Editorial On Saudi Crown Prince Mohammed Bin Salman India Visit

చతుష్షష్టి శాస్త్రాల్లో ద్యూతం(జూదం) ఉందిగానీ... దూత్యం(దౌత్యం) లేదు. కానీ వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో రెండింటికీ పెద్ద తేడా లేదు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మన దేశంలోనూ, అంతకుముందు పాకిస్తాన్‌లోనూ జరిపిన పర్యటనలు, విడుదల చేసిన సంయుక్త ప్రకటనలనూ గమనిస్తే ఈ సంగతి అర్ధమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశం ఏ దేశాన్నీ ‘మీరు ఎటువైపు?’ అని ప్రశ్నించడం సాధ్యపడదు. ఉన్నంతలో సర్దుకుపోతూ, లౌక్యంగా మాట్లాడుతూ గరిష్టంగా ప్రయోజనాలు రాబట్టుకోవడం ఒక్కటే మిగిలింది. మన దేశంలో బిన్‌ సల్మాన్‌ పర్యటన సందర్భంగా ఇంధనం, ఖనిజాలు, వ్యవసాయం, మౌలిక సదు పాయాలు, పెట్రో కెమికల్స్, చమురుశుద్ధి, విద్య, తయారంగం తదితరాల్లో సౌదీ పెట్టుబడులు పెట్టడానికి అవగాహన కుదిరింది. ఈ పెట్టుబడుల విలువ 10,000 కోట్ల డాలర్లు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్యా ఉన్న వ్యూహాత్మక సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి కూడా అంగీకారం కుదిరింది. అలాగే ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్‌ యాత్రకు ఇప్పుడున్న కోటాను మరో 25,000కు పెంచి 2 లక్షలమంది యాత్రీకులను అనుమతించేందుకు సౌదీ అరే బియా సమ్మతించింది. ఉగ్రవాదంపై సమష్టి సమరం చేయడానికి భారత్‌కూ, దాని పొరుగు దేశాలకూ తమ పూర్తి సహకారం అందజేస్తామని ఈ సందర్భంగా సల్మాన్‌ ప్రకటించారు. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. సల్మాన్‌ నేరుగా పాక్‌ పర్యటన ముగించుకుని మన దేశం రాలేదు. అటునుంచి స్వదేశానికెళ్లి ఆపై న్యూఢిల్లీ పర్యటనకొచ్చారు. పుల్వామా దాడి నేపథ్యమే ఇందుకు కారణమని వేరే చెప్పనవసరం లేదు. 

ఉగ్రవాదం, దానిపై పోరాటం అనేవి ఇప్పుడు అంతర్జాతీయ పరిభాషలో అమూర్తమైనవిగా మారాయి. తన సొంత గడ్డపై 2001లో ఉగ్రవాదులు జంట టవర్లు కూల్చేసి వందలమందిని పొట్టనబెట్టుకున్నప్పుడు ఉగ్రవాదంపై అమెరికా ఏకంగా యుద్ధమే ప్రకటించింది. ప్రపంచంలో ఏమూల ఉగ్రవాది ఉన్నా వెంటాడి, వేటాడి మట్టుబెడతామని అప్పట్లో హెచ్చరించింది. కానీ ఇన్నేళ్ల దాని ఆచరణ గమనిస్తే ఆ పేరిట వివిధ దేశాల్లో అది సాగించిన మారణకాండ, దురాక్రమణ వంటివి మాత్రమే కనబడతాయి. లక్షలమంది అమాయక పౌరుల ప్రాణాలు పోయాయి, అంచనా కట్టలేనంత విధ్వంసం జరిగింది. పైపెచ్చు సిరియాలో అసద్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి అది చేసిన విఫలయత్నం ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) అనే అతి భయంకరమైన ఉగ్రవాద సంస్థ పుట్టుకు రావడానికి కారణమైంది. మన దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద దాడుల వెనక పాకిస్తాన్‌ ఉన్నదని తెలిసినా ఆ దేశానికి అమెరికా ఏనాడూ సైనిక సాయాన్ని, ఆర్థిక సాయాన్ని నిలిపేయలేదు. అదే సమయంలో ‘ఉగ్రవాదంపై యుద్ధం’ నామస్మరణ విడనాడలేదు. సౌదీ అరేబియా అమెరికా మిత్ర దేశం గనుక ఈ లక్షణాలను అది పుణికిపుచ్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో యువరాజు బిన్‌ సల్మాన్‌ పాకిస్తాన్‌ పర్యటనపై కాస్త అనిశ్చితి నెలకొన్నా చివరికది సజావుగా సాగింది. కాకపోతే ఆయన పర్యటన ఒక రోజు వాయిదా పడింది. సోమ, మంగళవారాల్లో యధావిధిగా రెండురోజుల పర్యటన పూర్తయింది. ఆ సందర్భంగా పాకిస్తాన్‌తో 2,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడుల ఒప్పం దాలు కుదిరాయి. మన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంతో పోలిస్తే అది చాలా చాలా తక్కువ మొత్తమని కొందరు సంబరపడుతున్నారు.

దాని సంగతలా ఉంచి ఉగ్రవాదంపై పాకిస్తాన్‌–సౌదీలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన చాలా ఆసక్తిదాయకంగా అనిపిస్తుంది. ‘ఇరుపక్షాలూ తీవ్రవాదంపై, ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగిస్తాయ’ని ఆ ప్రకటన పునరుద్ఘాటించింది. అయితే ఐక్యరాజ్యసమితి లిస్టింగ్‌ విధానాన్ని రాజకీయం చేసే పద్ధతులను విడనాడాల్సిన అవసరం ఉన్నదని రెండు పక్షాలూ అభిప్రాయపడు తున్నట్టు ఆ ప్రకటన చెప్పింది. ఏమిటా ‘లిస్టింగ్‌ విధానం’? ఐక్యరాజ్యసమితి ఆమధ్య ప్రపంచ ఉగ్రవాదుల జాబితాను రూపొందించింది. ఎవరైనా ఒక వ్యక్తి సాగిస్తున్న ప్రమాదరకమైన కార్య కలాపాలను ఏ దేశమైనా సమితి దృష్టికి తీసుకొస్తే భద్రతామండలిలో ఏకాభిప్రాయంతో తీర్మానం చేయడం ద్వారా ఆ వ్యక్తి పేరును ఆ ఉగ్రజాబితాలో చేరుస్తారు. మసూద్‌ అజర్‌ను అందులో చేర్పిం చడానికి మన దేశం కొన్నేళ్లుగా నానా కష్టాలూ పడుతోంది. కానీ చైనా అడ్డుపుల్ల వేయడంతో ఎప్ప టికప్పుడు అది ఆగిపోతోంది. ఈమధ్య పుల్వామా దాడి జరిగాక సైతం ‘మసూద్‌ అజర్‌పై సందే హాతీతమైన సాక్ష్యాలు అందజేస్తే అతగాడి పేరును ఉగ్ర జాబితాలో చేర్చడానికి సహకరిస్తామ’ని చైనా చెప్పింది. పుల్వామా దాడి తమ నిర్వాకమేనని మసూద్‌ అజర్‌ జబ్బలు చరుచుకోవడం దానికి వినబడలేదనుకోవాలి! మంగళవారం విడుదలైన పాకిస్తాన్‌–సౌదీల సంయుక్త ప్రకటన సైతం ఆ రాగమే అందుకుంది. ఐక్యరాజ్యసమితి ఉగ్రజాబితాను ‘రాజకీయం’ చేయొద్దని అది సుద్దులు పలి కింది.

అయితే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు దానిపై సంతకం చేసిన సల్మానే మన దేశం వచ్చి ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేయడం, అందులో రెండు దేశాలూ ఐక్యరాజ్యసమితి ఉగ్రజాబితా అవసరాన్ని నొక్కివక్కాణించడం గమనించిన వారెవరైనా విస్మయపడతారు. కానీ వర్తమాన ప్రపంచంలో దౌత్యం అనే పదానికి అర్ధం మారిపోయింది. స్థల కాలాలను బట్టి దేశాధినేతల అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇతర అంశాల సంగతలా ఉంచి కనీసం ఉగ్రవాదం వంటి మహమ్మారి విషయంలోనైనా ఏ దేశం వాస్తవ వైఖరేమిటో ఎవరూ చెప్పగలిగే స్థితి లేదు. ఇది విచారించదగ్గ విషయం. కాకపోతే పుల్వామా దాడిని ఇరు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని సంయుక్త ప్రకటన తెలిపింది.  మొత్తానికి సౌదీతో సంబంధాల విష యమై అతిగా ఆశించకూడదని సల్మాన్‌ పర్యటన తేటతెల్లం చేసింది. అదే సమయంలో మన వైఖరిని అంగీకరింపజేయడానికి నిరంతరం ప్రయత్నించడం తప్పనిసరి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement