సల్మాన్, ఖషోగి(ఫైల్)
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు జమాల్ ఖషోగి హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని తేలడంతో సౌదీపై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని బైడెన్ ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. సౌదీ యువరాజుని ఆంక్షల నుంచి మినహాయించింది. ఖషోగిపై అక్కసు పెంచుకున్న సౌదీ యువరాజు ఆయనను సజీవంగా బంధించడం లేదంటే చంపేయండి అంటూ తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా అమెరికా ఇంటలిజెన్స్ తన నివేదికలో వివరించింది.
సౌదీ యువరాజు అనుమతితోనే జర్నలిస్టు ఖషోగిని హత్య చేసినట్టుగా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక నివేదిక సమర్పించడంతో బైడెన్ సర్కార్ చర్యలకు దిగింది. ట్రంప్ హయాంలో వివిధ దేశాలతో క్షీణించిన సంబంధాలను పునరుద్ధరించి ప్రపంచంలో అమెరికాని తిరిగి అగ్రగామిగా నిలబెడతామని బైడెన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అందుకే ఆంక్షల నుంచి యువరాజుని మినహాయించింది. ‘అధ్యక్షుడు బైడెన్ సంబంధాలు పూర్తిగా తెగిపోవాలని భావించడం లేదు. మళ్లీ ఎప్పటికైనా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని ఆశిస్తున్నారు. అయితే మానవ హక్కులకు భంగం వాటిల్లుతూ ఉంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోరు’అని బైడెన్ ప్రభుత్వంలోని అధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment