ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తమకు ఎల్లప్పుడూ ప్రియమైన దేశమేనని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే పాకిస్తాన్ ఆర్థికంగా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ వంటి నాయకులతో పలు కీలక అంశాల్లో భాగస్వామ్యమయ్యేందుకు తమ దేశం ఎదురుచూస్తోందంటూ పాక్ ప్రధానిని కొనియాడారు. సౌదీ- పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు సల్మాన్ ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రో కెమికల్, క్రీడా రంగాలు, సౌదీ దిగుమతులు, పవర్ జనరేషన్ ప్రాజెక్టులు, సంప్రదాయ వనరుల అభివృద్ధి వంటి సుమారు 20 బిలియన్ డాలర్ల మొత్తానికి సంబంధించిన పలు ఎంఓయూలపై ఇరు దేశాధినేతలు సంతకం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయంలో సల్మాన్ మాట్లాడుతూ.. ‘ నేను యువరాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత తూర్పులో ఇదే నా మొదటి పర్యటన. నేను సందర్శించిన మొదటి దేశం పాకిస్తాన్. పాక్ మాకు అత్యంత ముఖ్యమైన దేశం. వారితో భవిష్యత్తులో మేము మరిన్ని ఒప్పందాలు చేసుకుంటాం. ప్రస్తుతం ఓ గొప్ప వ్యక్తి నేతృత్వంలో పాక్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వారితో ఆర్థిక, రాజకీయ సంబంధాలు మేము కోరుకుంటున్నాం. మా ప్రాంతంపై మాకు నమ్మకం ఉంది. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాం అంటూ ఇమ్రాన్ ఖాన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అదే విధంగా తమ దేశంలో ఖైదీలుగా ఉన్న 2107 మంది పాక్ పౌరులను జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు.
ఇందుకు స్పందనగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘ అత్యవసర సమయంలో మమ్మల్ని ఆదుకుంటున్న స్నేహితుడు సౌదీ అని వ్యాఖ్యానించాడు. తమ దేశ హజ్ యాత్రికుల ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించాలని సల్మాన్‌ను కోరారు. అదే విధంగా రియాద్ నుంచి బీజింగ్ చేరుకునేందుకు చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపెక్)ను ఉపయోగించుకోవాలని విఙ్ఞప్తి చేశారు.(జైషే చీఫ్‌పై మారని చైనా తీరు)
కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ పాక్‌ను విమర్శిస్తుండగా సౌదీ యువరాజు ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జైషే మహ్మద్ చీఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు నిరాకరించి చైనా పరోక్షంగా.. పాక్‌కు మద్దతు తెలుపుతుండగా ప్రస్తుతం సౌదీ కూడా అందుకు తోడైనట్లు కన్పిస్తోంది. ఇక భారత్- పాకిస్తాన్‌ల మధ్య వివాదానికి కారణమైన సీపెక్ గురించి ఇమ్రాన్ మాట్లాడి.. భారత్ పట్ల చైనా, పాకిస్తాన్‌లు వైఖరి ఏంటనే విషయాన్ని చెప్పకనే చెప్పారని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment