Special Story: 28,000 Women Applied For 30 Train Driver Jobs In Saudi Arabia - Sakshi
Sakshi News home page

Saudi Arabia: ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్‌ ట్రైన్స్‌ కూడా..

Published Sat, Feb 19 2022 6:31 AM | Last Updated on Sat, Feb 19 2022 9:44 AM

28000 women apply for 30 train driver jobs in Saudi Arabia - Sakshi

గత కొన్ని దశాబ్దాలపాటు ఆంక్షల నడుమ జీవనం సాగించిన సౌదీ అరేబియా మహిళ లు.. యువరాజు మొహమ్మద్‌ బీన్‌  సల్మాన్‌  నిర్ణయాలతో ఇతర దేశాల్లోని మహిళల వలే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో చేరుతూ తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. 2018 వరకు ఆంక్షల్లో ఉన్న... మహిళల డ్రైవింగ్, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లడం, ఒంటరి ప్రయాణాలకు అవకాశం కల్పించడం, ఆర్మీలో చేరడానికి ఒప్పుకోవడం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో అక్కడి మహిళలు సంకెళ్ల నుంచి బయటపడ్డట్టుగా భావిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న సౌదీలో ఇటీవల మక్కా మసీదులో మహిళా భద్రతా సిబ్బందిని కూడా నియమించడం సంచలనం సృష్టించింది.

 మొన్నటిదాకా ప్రపంచంలోనే మహిళా ఉద్యోగుల శాతం అతి తక్కువగా ఉన్న సౌదీలో.. ప్రస్తుతం ఉద్యోగాలకోసం మహిళలు వేలల్లో పోటీ పడుతున్నారు. ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’ అంటూ నిబంధనలు సడలించడంతో వివిధ రంగాల్లో పనిచేసేందుకు అక్కడి మహిళలు అవకాశాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. తాజాగా బుల్లెట్‌ ట్రైన్స్‌ నడపడానికి మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్‌  ఇవ్వగా.. దాదాపు 30 వేలమంది పోటీపడ్డారు. ఈ ఏడాది జనవరి మొదట్లో సౌదీ రైల్వే పాలిటెక్నిక్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలు రైళ్లు నడిపేందుకు ట్రైనింగ్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

సౌదీలో అత్యంత పవిత్ర నగరాలైన మక్కా, మదీనా మధ్య రైలు సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న స్పానిష్‌ సంస్థ మహిళా ట్రైన్‌  డ్రైవర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనతో సౌదీ మహిళల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 30 ఖాళీలకుగానూ 28 వేల దరఖాస్తులు వచ్చాయి. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణను ఇస్తారు. తరువాత మక్కా నుంచి మదీనా వరకు నడిచే హై స్పీడ్‌ బుల్లెట్‌ ట్రైన్‌ లను నడుపుతారు. కొన్నేళ్లుగా అనేక పరిమితులు, ఆంక్షలతో ఇటువంటి అవకాశం, నోటిఫికేషన్‌  రావడం ఇదే మొదటిసారి కావడంతో వేలాదిమంది మహిళలు ట్రైన్‌  డైవర్లు అయ్యేందుకు పోటీ పడ్డారు.

యువరాజు మొహమ్మద్‌ బీన్‌  సల్మాన్‌ .. మహిళల అభ్యున్నతి, సాధికారతకు తీసుకుంటున్న నిర్ణయాలతో.. సౌదీలో కూడా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేటు సెక్టార్లలో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హోటల్స్, ఫుడ్‌ ఇండస్ట్రీస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్యలో నలభై శాతం పెరుగుదల ఉండగా, ఉత్పాదక రంగంలో 14 శాతం, నిర్మాణ రంగంలో 9 శాతం వృద్ధి నమోదైంది.

సౌదీ మహిళలకు  ఇప్పటిదాకా టీచర్లుగా, హెల్త్‌ వర్కర్‌లుగా మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మిగతా రంగాల్లో మగవాళ్లకు మాత్రమే అనుమతి ఉండడంతో వారి ఉద్యోగపరిధి అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్‌  డ్రైవర్ల నియామక స్ఫూర్తితో సౌదీలో మహిళల సారథ్యంలో రైళ్లు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతాయని ఆకాంక్షిద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement