Driving Training
-
డ్రైవింగ్ మణి @ 71
వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్‌లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం. 1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది. స్కూటర్ నుంచి జేసీబీ వరకు సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్‌తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్‌ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్‌లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్‌ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు. సంకల్పంతో నిలబెట్టింది.. రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్‌ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్‌ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రికార్డ్ల చక్రం ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్‌తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి. సోషల్ మీడియాలో.. రాధామణి ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. -
Viral Video:అమ్మాయితో పెట్టుకుంటే అంతే మరి.. సరదా తీరిందా?
బైక్, కారు వంటి వాహనాలు నడపడం చాలా సులువని అందరూ అనుకుంటారు. కానీ అందుకు ఎంతో శిక్షణ అవసరం. ఎక్కువగా బండి నడపడం వచ్చిన వాళ్ల దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటారు. లేదంటే ప్రత్యేకంగా డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఉంటాయి. అయితే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పించడం అంతా ఈజీ కాదని భావిస్తుంటారు. మహిళలు రోడ్డు మీద బండి నడపడం చూసిన కొంతమంది భయపడుతుంటారు. ఇప్పుడీ వార్త చదివితే.. ఈ విషయం నిజమేననిపిస్తుంది. అసలేం జరిగిందంటే.. కాలేజీ గ్రౌండ్లో ఓ యువకుడు మరో విద్యార్థినికి టూ వీలర్ నడపడం నేర్పించేందుకు రెడీ అయ్యారు. యువతిని ముందు కూర్చొబెట్టి వెనకాల అతడు కూర్చున్నాడు. ఇద్దరు కలిసి మెల్లగా కొంతదూరం వెళ్లారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. బ్రేక్ బదులు స్కూటీ ఎక్సలేటర్‌ను యువతి ఒక్కసారిగా పెంచడంతో బండి రెండు మూడు వంకర్లు తిరుగుతూ ముందుకు వెళ్లింది. అబ్బాయి బండిని ఆపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఇంకేముంది చివరికి ఇద్దరు బొక్కబొర్లా పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పడం అంతా ఈజీ కాదు బ్రో. సరదా తీరిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అమ్మాయిలను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదని ఇలాగే రోడ్డుపై పడేస్తారు. ఇలాంటివి జరిగినప్పుడే డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది. వాళ్లకు డిస్టెన్స్ మెయింట్ చేయడం బెటర్’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg) -
International Womens Day: వాణిజ్య వాహనాల డ్రైవర్లుగా మహిళలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాహన తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ ఎంబ్రేస్ ఈక్విటీ పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు సమాన అవకాశాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అశోక్ లేలాండ్‌కు చెందిన ట్రైనింగ్ సెంటర్లో భారీ వాణిజ్య వాహనాలు, బస్‌లు నడపడంపై శిక్షణ పొందేందుకు 100 మంది మహిళలను న్యూఢిల్లీకి ఆహ్వానించింది. ‘వాస్తవానికి భారీ వాణిజ్య వాహనాల డ్రైవింగ్ అనేది పురుషుల బలమనే ప్రచారం ఉంది. ఎంబ్రేస్ ఈక్విటీ ద్వారా దీనిని ఛేదించాలనేది కంపెనీ ఆలోచన’ అని అశోక్ లేలాండ్ తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం కోసం ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీనిలో భాగంగా 180 మంది మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ కల్పించింది. వీరిలో చాలా మంది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్లుగా నియామకం అందుకున్నారని అశోక్ లేలాండ్ వెల్లడించింది. -
ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: ఫోటో వైరల్
భర్త నిరాధరణకు గురైతే ఆ స్త్రీ పరిస్థితి వర్ణానాతీతం. అందులోనూ పిల్లల తల్లి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇక్కడొక ఒక మహిళ కూడా అలానే ఏడాది చిన్నారితో జీవన పోరాటం సాగిస్తోంది. వివరాల్లోకెళ్తే...చంచల్ శర్మ అనే మహిళ ఏడాది వయసు ఉన్న కొడుకుని నడుంకి కట్టుకుని మరీ ఈ రిక్షాని నడుపుతోంది. ఐతే ఒక మహిళ ఇలా డ్రైవింగ్ చేయడాన్ని స్థానిక ఈ రిక్షా డ్రైవర్లు నిరాకరించారు. అంతేగాదు ఆమె నోయిడాలోని ఒక నిర్ధిష్ట రహదారిలో డ్రైవ్ చేసేందుకు కూడా ససేమిరా అంటూ గొడవ చేశారు. ఐతే ఆమె ట్రాఫిక్ పోలీసులు, ఏ1బీ అవుట్ పోస్ట్ సిబ్బంది మద్దతుతో సమస్యలను అధిగమించింది. సదరు మహిళ భర్త ఆమెను వేధింపులకు గరిచేయడంతో అతన్ని వదిలేసి వచ్చి తన కాళ్లపై తాను గౌరవప్రదంగా జీవించేందుకు తాపత్రయ పడుతోంది. ఆ క్రమంలోనే ఆమె ఈ రిక్షా డ్రైవర్‌గా జీవనోపాధిని ఎంచుకుంది. లాల్ కువాన్‌కి చెందిన చంచల్ శర్మ కొన్ని రోజులు తన తల్లి లేదా చెల్లితో కలిసి ఉంటానని వెల్లడించింది. ఈ మేరకు చంచల్ శర్మ మాట్లాడుతూ...మూడేళ్ల క్రితం 2019లో దాద్రీలోని ఛయాన్సా గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత నుంచి చిత్రహింసలకు గురి చేసి వేధించడంతో పుట్టింటికి వచ్చేసినట్లు తెలిపింది. తన భర్త పేరు చెప్పేందుకు కూడా ఇష్టపడలేదు. కోర్టులో కేసు నడుస్తోందని కూడా చెప్పింది. తన తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయాడని, తనకు నలుగు చెల్లెళ్లు ఉన్నారని చెప్పింది. ఆమె తల్లి కూరగాయాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటుందని తెలిపింది. (చదవండి: నాకు 30 ఆమెకు 12 అంటూ... షాకింగ్ వ్యాఖ్యలు చేసిన బైడెన్) -
ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ప్రతిష్టాత్మక ఫార్ములా– ఈ చాంపియన్ పోటీలకు భాగ్య నగరం సన్నద్ధమవుతోంది. ఎల్రక్టానిక్ కార్ల సామర్థ్యాన్ని, సత్తాను చాటే ఈ పోటీల కోసం హెచ్ఎండీఏ ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టింది. నెక్లెస్ రోడ్డులో 2.8 కిలోమీటర్ల ట్రాక్ పనులను ప్రారంభించారు. డిసెంబర్ నాటికల్లా ట్రాక్‌ను సిద్ధం చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్లు గంటకు 180 నుంచి 220 కి.మీటర్లకు పైగా వేగంతో పరుగులు తీసేవిధంగా ఈ ట్రాక్‌ను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ఫార్ములా–ఈ పోటీల నిర్వహణపై అధ్యయనం కోసం గత నెలలో హెచ్ఎండీఏ అధికారుల బృందం దక్షిణకొరియా రాజధాని సియోల్‌ను సందర్శించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీ సంతోష్ నేతృత్వంలో హెచ్ఎండీఏ సీనియర్ ఇంజినీర్లు, ప్లానింగ్ అధికారులు ఆగస్టులో సియోల్‌లో పర్యటించారు. ప్రస్తుతం సియోల్ ట్రాక్ తరహాలోనే హైదరాబాద్‌లో ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు పోటీలను నిర్వహించేందుకు తాజాగా పనులు ప్రారంభించారు. ఇదీ రూట్.. నెక్లెస్‌రోడ్డులోని 2.8 కి.మీ మార్గంలో ట్రాక్ ఏర్పాటు చేస్తారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి వెళ్లేవిధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు. ఎనీ్టఆర్ గార్డెన్‌లోంచి వెనక వైపు ఉన్న మింట్ కాంపౌండ్ మర్రిచెట్టు నుంచి ఐమాక్స్ థియేటర్, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 17 మలుపులు వచ్చేవిధంగా ట్రాక్ ప్లాన్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా పేరొందిన 12 ఆటోమొబైల్ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు అంచనా. ఆ సంస్థలు రూపొందించిన ఎల్రక్టానిక్ కార్ల సామర్థ్యాన్ని చాటుకొనేందుకు హైదరాబాద్ తొలిసారిగా వేదిక కానుంది. గంటకు 250 కి.మీటర్లకు పైగా వేగంతో వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ నగరంలో 180 కి.మీ వరకే పోటీ ఉండే అవకాశం ఉందని ఓ అధికారి వివరించారు. డిసెంబర్లో డెమో ... ఈ పోటీల్లో పాల్గొనే డ్రైవర్లు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఉంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోటీలకు డిసెంబర్ నాటికి ట్రాక్‌ను పూర్తి చేసి డెమో నిర్వహించే అవకాశం ఉంది. పోటీల్లో పాల్గొనే డ్రైవర్లు మొత్తం 40 లూప్స్ (రౌండ్స్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ కారు ఎంత సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసిందనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని చాంపియన్‌షిప్ ఇస్తారు. నగరవాసులు పోటీలను వీక్షించేందుకు వీలుగా ట్రాక్ మార్గంలో ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయనున్నారు. వేలాది మంది సందర్శకులు కూర్చొని చూసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయి. (చదవండి: జవహార్‌నగర్‌లో కర్చీఫ్ లేకుండా తిరగలేం) -
తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయత్నం.. ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు
-
‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా!
గత కొన్ని దశాబ్దాలపాటు ఆంక్షల నడుమ జీవనం సాగించిన సౌదీ అరేబియా మహిళ లు.. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ నిర్ణయాలతో ఇతర దేశాల్లోని మహిళల వలే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో చేరుతూ తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. 2018 వరకు ఆంక్షల్లో ఉన్న... మహిళల డ్రైవింగ్, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లడం, ఒంటరి ప్రయాణాలకు అవకాశం కల్పించడం, ఆర్మీలో చేరడానికి ఒప్పుకోవడం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో అక్కడి మహిళలు సంకెళ్ల నుంచి బయటపడ్డట్టుగా భావిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న సౌదీలో ఇటీవల మక్కా మసీదులో మహిళా భద్రతా సిబ్బందిని కూడా నియమించడం సంచలనం సృష్టించింది. మొన్నటిదాకా ప్రపంచంలోనే మహిళా ఉద్యోగుల శాతం అతి తక్కువగా ఉన్న సౌదీలో.. ప్రస్తుతం ఉద్యోగాలకోసం మహిళలు వేలల్లో పోటీ పడుతున్నారు. ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’ అంటూ నిబంధనలు సడలించడంతో వివిధ రంగాల్లో పనిచేసేందుకు అక్కడి మహిళలు అవకాశాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. తాజాగా బుల్లెట్ ట్రైన్స్ నడపడానికి మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 30 వేలమంది పోటీపడ్డారు. ఈ ఏడాది జనవరి మొదట్లో సౌదీ రైల్వే పాలిటెక్నిక్ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలు రైళ్లు నడిపేందుకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. సౌదీలో అత్యంత పవిత్ర నగరాలైన మక్కా, మదీనా మధ్య రైలు సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న స్పానిష్ సంస్థ మహిళా ట్రైన్ డ్రైవర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనతో సౌదీ మహిళల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 30 ఖాళీలకుగానూ 28 వేల దరఖాస్తులు వచ్చాయి. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణను ఇస్తారు. తరువాత మక్కా నుంచి మదీనా వరకు నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లను నడుపుతారు. కొన్నేళ్లుగా అనేక పరిమితులు, ఆంక్షలతో ఇటువంటి అవకాశం, నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి కావడంతో వేలాదిమంది మహిళలు ట్రైన్ డైవర్లు అయ్యేందుకు పోటీ పడ్డారు. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ .. మహిళల అభ్యున్నతి, సాధికారతకు తీసుకుంటున్న నిర్ణయాలతో.. సౌదీలో కూడా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేటు సెక్టార్లలో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్యలో నలభై శాతం పెరుగుదల ఉండగా, ఉత్పాదక రంగంలో 14 శాతం, నిర్మాణ రంగంలో 9 శాతం వృద్ధి నమోదైంది. సౌదీ మహిళలకు ఇప్పటిదాకా టీచర్లుగా, హెల్త్ వర్కర్లుగా మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మిగతా రంగాల్లో మగవాళ్లకు మాత్రమే అనుమతి ఉండడంతో వారి ఉద్యోగపరిధి అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్ డ్రైవర్ల నియామక స్ఫూర్తితో సౌదీలో మహిళల సారథ్యంలో రైళ్లు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతాయని ఆకాంక్షిద్దాం. -
కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి?
కారులో షికారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి! కొంతమందికైతే ఇది వ్యసనంలాగా మారుతుంటుంది. కారులో పయనం సుఖవంతమైనదే కాకుండా బైక్‌తో పోలిస్తే సురక్షితమైనది కూడా! అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు అతిగా కారులో తిరగడానికే అలవాటు పడితే క్రమంగా కొన్ని శారీరక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అతిగా కారు డ్రైవ్ చేసేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. వెన్నెముక చుట్టూ ఉండే కండరాలన్నీ బ్యాలెన్స్డ్గా ఉండడం, కండరాలకు ఎలాంటి నొప్పులు రాకుండా శరీరాన్ని తీరుగా ఉంచడమే గుడ్ పోశ్చర్. మన డైలీ లైఫ్‌లో ఎదురయ్యే శారీరక ఒత్తిడి కండరాలు, ఎముకలపై పడకుండా జాగ్రత్తపడడమన్నమాట! మనం సరైన భంగిమ లేదా పోశ్చర్ మెయిన్ టెయిన్ చేస్తున్నామో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు సమాంతరంగా నేలపై ఉన్నాయా? రెండు పిరుదులపై సమాన భారం పడుతోందా? వెన్నెముక నిటారుగా ఉందా? భుజాలను చెవులకు సమాంతరంగా రిలాక్స్‌గా ఉంచామా? నిలుచున్నప్పుడు మోకాలి జాయింట్లు లాక్ అవకుండా నిల్చుంటున్నామా? పడుకున్నప్పుడు శరీరం సమాంతరంగా ఉంటోందా? వంటివి చెక్ చేయడం ద్వారా పోశ్చర్ మెయిన్ టెయిన్ అవుతుందా, లేదా తెలిసిపోతుంది. సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయకపోతే, వెన్నుముక పెళుసుగా మారి, ఈజీగా దెబ్బతింటుంది. కండరాల నొప్పులు ఆరంభమై క్రమంగా పెరిగిపోతాయి. మెడ, భుజం, వెన్ను నొప్పులు పర్మినెంట్‌గా ఉండిపోతాయి. కీళ్ల కదలికలు దెబ్బతింటాయి. క్రమంగా ఈ మార్పులు జీర్ణవ్యవస్థను మందగింపజేస్తాయి. ఆపైన శ్వాస ఆడడం ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇబ్బందులన్నీ మరీ ముదిరిపోతే తీవ్ర వ్యాధుల పాలు కావాల్సిఉంటుంది. అందువల్ల కారు డ్రైవింగ్ చేసే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి... మీ కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లు పొడవుగా ఉన్నవారు సీట్‌ను మరీ ముందుకు ఉంచకుండా తగినంత దూరంలో ఫిక్స్ చేసుకోవాలి. అలాగే మీ ఎత్తుకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం. మీ సీట్‌ను నిటారుగా ఉండేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది. మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి. సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మీకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే కాదు... మరెన్నో విధాలుగా మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ఒకవేళ పోశ్చర్ బాగా దెబ్బతిన్నదనిపిస్తే డాక్టర్ సలహాతో కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్స్, తేలికపాటి పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు. బాడీ భంగిమను నిలబెట్టే ఉపకరణాలు(పోశ్చర్ బెల్ట్స్ లాంటివి) వాడవచ్చు. మరీ ఎక్కువగా ఇబ్బందులుంటే అలెగ్జాండర్ టెక్నిక్ టీచర్స్, ఫిజియోథెరపిస్ట్, ఖైరోప్రాక్టర్, ఓస్టియోపతీ ప్రాక్టీషనర్ సహాయం తీసుకోవాలి. అవసరమైతే వీరు సూచించే ఎలక్ట్రోథెరపీ, డ్రైనీడిలింగ్, మసాజింగ్, జాయిట్ మొబిలైజేషన్ లాంటి విధానాలు పాటించాలి. స్మార్ట్ పోశ్చర్, అప్రైట్ లాంటి మొబైల్ యాప్స్‌లో సరైన భంగిమల గురించి, గుడ్‌పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయడం గురించి వివరంగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కారులో షికారు హుషారునిస్తుంది. – డి. శాయి ప్రమోద్ -
‘ఆర్టీసీ’ డ్రైవింగ్ స్కూల్
జగిత్యాలటౌన్: ఉద్యోగం లేని యువతకు ఉపాధిమార్గం చూపుతోంది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. ఇదే క్రమంలో నష్టాల్లో కొనసాగుతున్న సంస్థకు ఆదాయాన్ని సాధించేలా వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కార్గోబస్సులతో మంచి లాభాన్ని గడిస్తున్న సంస్థ.. ‘ఆర్టీసీ’ డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభించింది. సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలుస్తున్న ఆర్టీసీ.. డ్రైవింగ్‌లో యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా జగిత్యాల డిపోలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మూడో బ్యాచ్ శిక్షణ పొందుతోంది. తొలి శిక్షణకేంద్రం జగిత్యాలలో.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక డిపోలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. నిరుద్యోగ యువతకు ఆర్టీసీలోని సీనియర్ డ్రైవర్లతో నెలరోజుల పాటు బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి, స్వయం ఉపాధి సాధించేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోనే తొలి ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణకేంద్రాన్ని జగిత్యాల డిపో ఆధ్వర్యంలో జనవరి 17న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ప్రస్తుతం మూడో బ్యాచ్ శిక్షణ పొందుతోంది. కరీంనగర్–2 డిపో ఆధ్వర్యంలోనూ ఫిబ్రవరి 2 నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఫీజు రూ.15,600.. బ్యాచ్‌కు 16మంది డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న వారు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో నెలకో బ్యాచ్ చొప్పున 16మందిని ఎంపికచేసి 30రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఇందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15,600 ఫీజుగా వసూలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తే ప్రభుత్వమే పూర్తిఫీజు భరిస్తుందని జగిత్యాల డిపో మేనేజరు జగదీశ్ వివరించారు. నెలరోజుల పాటు శిక్షణ ఒక్కోబ్యాచ్‌కు నాలుగువారాల పాటు డ్రైవింగ్ శిక్షణ ఇస్తారు. కేవలం డ్రైవింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి ఐదురోజులు బస్సు విడిభాగాలపై, కండీషన్ గుర్తింపు, బ్రేక్‌డౌన్ అయిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఆర్టీసీ మెకానికల్ ఇంజినీర్, బ్రేక్ ఇన్స్పెక్టర్, డ్రైవింగ్ శిక్షకులతో థియరీ క్లాసులు చెబుతారు. అనంతరం 25రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. బ్యాచ్‌లో 16మంది ఉంటే.. ఒక్కొక్కరికి అరగంట పాటు స్టీరింగ్ కేటాయిస్తారు. ఉపాధికి అవకాశం.. 30రోజుల శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఆర్టీసీ సంస్థ నుంచి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. భవిష్యత్‌లో సంస్థలో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ పడినప్పుడు ప్రాధాన్యం కల్పిస్తారు. సింగరేణి, కోర్టు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో డ్రైవర్ ఉద్యోగాలు సాధించేందుకు ఈ శిక్షణ, ధ్రువీకరణ పత్రం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఎక్కువగా యువత గల్ఫ్ వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకుంటే.. విదేశాల్లో సైతం మంచి ఉపాధి లభిస్తుందని జగిత్యాల డిపో మేనేజర్ జగదీశ్ తెలిపారు.శిక్షణకు ప్రత్యేక బస్సు..అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచారు. శిక్షణ బస్సులకు డ్యూయల్ స్టీరింగ్, సీట్లు ఏర్పాటు చేశారు. ఇద్దరి వద్ద క్లచ్, బ్రేక్, ఎక్స్‌లేటర్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులను ఒకవైపు కూర్చోబెట్టి.. మరోవైపు శిక్షకులు మెలకువలు నేర్పిస్తారు. రద్దీరోడ్లు, ఖాళీరోడ్లు, నైట్ డ్రైవింగ్, జిగ్‌జాగ్ ట్రాఫిక్ ప్రాంతాలతో పాటు ఘాట్‌రోడ్లపై శిక్షణ ఇస్తారు. డ్రైవింగ్ అంటే ఇష్టం ఆర్టీసీ సంస్థ ఇచ్చే డ్రైవింగ్ సర్టిఫికెట్తో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిసి ట్రైనింగ్‌లో జాయిన్ అయ్యాను. రోజు క్లాస్లులకు హాజరవుతున్నా. థియరీ క్లాసులు పూర్తయ్యాయి. రోడ్డుమీద బస్సు నడుపుతున్నా. ముందు శిక్షకుడి సహాయంతో నడిపాను, ప్రస్తుతం సొంతగా నడపగలుగుతున్నా. – బి. వెంకటేశ్, ల్యాగలమర్రి ఉపాధికి భరోసా మాది గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామం. డ్రైవింగ్‌నే ఉపాధిగా ఎంచుకుని శిక్షణకు వస్తున్నా. ఆర్టీసీలో డ్రైవింగ్‌తో పూర్తిస్థాయిలో బస్సు నడపడం నేర్చుకున్నాను. డ్రైవింగ్‌తో ఉపాధి పొందగలుగుతానని విశ్వాసం కలిగింది. – జయాకర్, లొత్తునూర్ ప్రొఫెషనల్‌గా తయారు చేస్తున్నాం ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఆర్టీసీ ట్రైనింగ్‌లో ప్రొఫెషనల్ డ్రైవర్లను తయారు చేస్తున్నాం. పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి పొందేలా తీర్చిదిద్దుతున్నాం. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ సైతం ఇస్తున్నాం. – జగదీశ్, జగిత్యాల డిపో మేనేజర్ -
టాప్‌గేర్‌లో హైదరాబాద్ మహిళలు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మహిళలు టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. డ్రైవింగ్‌లో సత్తా చాటుతున్నారు. అభిరుచి కోసం.. అవసరాల కోసం వాహనాలను నడుపుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. డ్రైవర్లపై ఆధారపడకుండా సొంత వాహనాలను వినియోగించేందుకే ఆసక్తి చూపుతున్నారు. మగువల అభిరుచికి తగ్గట్లు పలు మోడళ్లలో బైక్‌లు, కార్లు వచ్చేస్తున్నాయి. గేర్‌లెస్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రవాణా శాఖ గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో 1,26,340 మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోవడమే ఇందుకు నిదర్శనం. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 33 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు తీసుకున్నారు. వీరిలో 65 శాతం ఫోర్ వీలర్ లైసెన్సులు కాగా, 35 శాతం వరకు టూ వీలర్ లైసెన్సులు ఉన్నాయి. చాలా మంది రెండు రకాల లైసెన్సులు తీసుకోవడం గమనార్హం. అభిరుచి.. అవసరం! ఇంట్లో నాలుగు కార్లు, 24 గంటల పాటు అందుబాటులో డ్రైవర్లు ఉన్నా.. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారి కారు డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. తన వ్యక్తిగత అవసరాల కోసమే ఆమె శిక్షణ పొందారు. ఉదయాన్నే జిమ్‌కు వెళ్లడం.. సాయంత్రం షాపింగ్‌కు వెళ్లడం.. పిల్లలను బయటకు తీసుకెళ్లడం.. ఇలాంటి పనులకు డ్రైవర్లపై ఆధారపడాల్సి రావడం ఇబ్బందిగానే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తమ ప్రయాణాన్ని, అవసరాలను వ్యక్తిగతంగా భావించే చాలామంది మహిళలు ఇలా సొంత వాహనాలనే ఇష్టపడుతున్నారు. సురక్షిత ప్రయాణం.. కోవిడ్ కారణంగా ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. కానీ, సాధారణంగా అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ శాతం సొంత వాహనాలనే వాడుతారు. సాఫ్ట్వేర్ మహిళలకు సొంత కార్లు తప్పనిసరి అవసరంగా మారాయి. రాత్రింబవళ్లు విధులు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లేందుకు, తిరిగి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకునేందుకు ఎక్కువ మంది సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. 2018లో 42 వేల మందికి పైగా మహిళలు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకున్నారు. పైగా కోవిడ్ నేపథ్యంలో చాలామంది సొంత వాహనాలకే మొగ్గు చూపు తున్నారు. డ్రైవింగ్‌ను అభిరుచి కోసమే కాకుండా షీ క్యాబ్స్ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలు కూడా ఉన్నారు. సౌకర్యంగా ఉంటుంది సొంత వాహనాల్లో ఇంటిల్లిపాది కలసి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి క్యాబ్‌లు, ఇతర వాహనాల్లో వెళ్లట్లేదు. నేనే స్వయంగా వాహనం నడపడం నేర్చుకొన్నాను. – శ్రీలక్ష్మి, గృహిణి ఉపాధి కోసం నేర్చుకున్నా.. షీ క్యాబ్ ద్వారా ఉపాధి పొందాలనే ఆలోచనతో ఇటీవలే డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ప్రభుత్వ సహకారంతో బ్యాంకు రుణంతో కారు కొనుక్కొన్నాం. – కోలా కరోలిన్ కోవిడ్ తర్వాత డిమాండ్ పెరిగింది కోవిడ్ తర్వాత ప్రజా రవాణా వినియోగం తగ్గడంతో సొంత వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో శిక్షణకు వచ్చే మహిళలు కూడా పెరిగారు. ఇటీవల గృహిణులు ఎక్కువ సంఖ్యలో శిక్షణ తీసుకున్నారు. – సామ శ్రీకాంత్‌రెడ్డి, రెడ్డి మోటార్ డ్రైవింగ్ స్కూల్, బంజారాహిల్స్ -
ఆమె చేతిలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్
సాక్షి, కడప: మేము సైతం.. అంటూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడేందుకు ముందుకు వస్తున్నారు. ఆకాశమే హద్దుగా దూసుకు పోతున్నారు. ద్విచక్రవాహనాలు.. ఆటోలు.. కార్లు మాత్రమే కాదు.. భారీ వాహనాలు నడిపేందుకు కూడా సిద్ధపడుతున్నారు. వివరాల్లోకెళితే.. ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ) ఉన్నతాధికారులు శనివారం నుంచి భారీ వాహనాలు నడపడంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. కడప ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయ ఆవరణలోని డ్రైవింగ్ స్కూల్లో జరుగుతున్న శిక్షణకు కడప నగరానికి చెందిన వై.మాలశ్రీ అనే యువతి హాజరయ్యారు. ఈమె ఇదివరకే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉన్నారు. ఇప్పుడు భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందేందుకు వచ్చారు. శిక్షణలో భాగంగా శనివారం కడప రోడ్లపై బస్సు నడిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నె, ముంబయి లాంటి నగరాలలో మహిళలు బస్సు డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా కడప నగరంలో మాలశ్రీ దరఖాస్తు చేసుకుని శిక్షణకు రావడం విశేషం. శిక్షణ పూర్తి చేసుని హెవీ లైసెన్స్ పొందిన తర్వాత ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం చేసే అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని ఆమె పేర్కొంటున్నారు. తనకు కుటుంబంలో భర్త ప్రోత్సాహం కూడా ఉందన్నారు. బస్సు నడిపేందుకు ధైర్యంగా ముందుకు వచ్చిన యువతిని ఆర్టీసీ ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. -
శిష్యురాలికి ట్రైనింగ్.. ఆ వ్యక్తి చనిపోయాడని..
ముంబై : శిష్యురాలికి కారు డ్రైవింగ్ నేర్పాలనే ప్రయత్నం ఓ గురువును ఆమెతో పాటు జైలు పాలుచేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, వాసై ఈస్ట్ ఫాధర్‌వాడి.. విజయ్ రెసిడెన్షీకి చెందిన లాయర్ బీరేంద్ర మిశ్రా, అతడి శిష్యురాలు వర్షా మిశ్రాకు ఆదివారం కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. మధువన్ ఏరియాకు చేరుకోగానే కారు ఓ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళుతున్న ఇంద్రేశ్ యాదవ్ కిందపడి స్పృహ కోల్పోయాడు. ( ‘నా కూతురిని పొట్టనపెట్టుకున్నారు’) దీంతో యాదవ్ చనిపోయాడని భావించిన ఇద్దరు అతడి బాడీని ముంబై-అహ్మదాబాద్ నేషనల్ హైవే దగ్గర పడేశారు. అయితే యాదవ్‌ను కారులోంచి కిందకు తీసి రోడ్డు పక్కన పడేయటాన్ని ఓ వ్యక్తి చూశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్టీసీ ద్వారా హెవీ డ్రైవింగ్‌పై శిక్షణ
ఒంగోలు: ఆర్టీసీ ద్వారా ఔత్సాహికులైన అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్‌లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి శిక్షణను ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జి.విజయగీత పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ హెవీ డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే సంస్థలు అతి తక్కువుగా ఉన్నాయని, తద్వారా హెవీ డ్రైవింగ్ డ్రైవర్ల కొరత తీర్చేందుకు ఆర్టీసీ సంకల్పించిందన్నారు. అందులో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఒంగోలులో డిపోలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో బ్యాచ్‌లో 16 మంది అభ్యర్థులు ఉంటారని, వారికి 16 రోజుల థియరీ క్లాసులు, మరో 16 రోజుల పాటు బస్సులపై 15 గంటల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. మొత్తం ఒక బ్యాచ్ పూర్తికావడానికి 40 రోజుల సమయం పడుతుందన్నారు. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం శిక్షణ సిలబస్ ఉంటుందని, ఎంవీ రూల్స్, డ్రైవింగ్ నైపుణ్యత నేర్పిస్తామన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత ఫారం–5, ఫారం–14, ఫారం–15 సర్టిపికెట్లు జారీ చేస్తామన్నారు. తద్వారా అభ్యర్థి ఆర్టీఏ నిర్వహించే టెస్టులో పాల్గొని డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చన్నారు. ప్రతి అభ్యర్థి శిక్షణకు ఆర్టీసీ డ్రైవింగ్ స్కూలుకు రూ.24 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ పొందగోరు అభ్యర్థులు ఒంగోలు డిపో మేనేజర్ / ఒంగోలు కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7382801048, 9959225691 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఆర్టీఏలో డ్రైవింగ్ సిమ్యులేటర్లు
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ శిక్షణలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రవాణాశాఖ ఆర్టీఏ కార్యాలయాల్లో సిమ్యులేటర్(అనుకరణ యంత్రం)లను ఏర్పాటు చేయనుంది. డ్రైవింగ్‌లో కనీస అవగాహన లేని వారికి నేరుగా వాహనం ఎక్కించి రోడ్లపై శిక్షణ ఇవ్వడం సరికాదని రవాణాశాఖ భావిస్తోంది. డ్రైవింగ్ నేర్చుకునేవాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు, పాత డ్రైవర్ల అనుభవాన్ని, మెళకువలను అంచనా వేసేందుకు వీటిని ఏర్పాటు చేయనుంది. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ వంటి వాటి కోసం ఆర్టీఏకు వచ్చే వినియోగదారులు వీటి ద్వారా శిక్షణ పొందవచ్చు. నగరంలో ఒకటి రెండు మాత్రమే: సిమ్యులేటర్ ద్వారా శిక్షణ ఇచ్చే డ్రైవింగ్ స్కూళ్లు నగరంలో ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. మిగతా డ్రైవింగ్ స్కూళ్లన్నీ రోడ్లపైనే శిక్షణ ఇస్తున్నాయి. ఈ విధమైన శిక్షణతో సరైన నైపుణ్యం, అవగాహన లేకుండానే డ్రైవర్లుగా మారిపోతుండటంతో రహదారి భద్రత అతి పెద్ద సవాలుగా మారుతోంది. అందుకే ఆర్టీఏ కార్యాలయాలతో పాటుగా డ్రైవింగ్ స్కూళ్లలోనూ సిమ్యులేటర్లపై శిక్షణ తప్పనిసరి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏతోనే ప్రారంభం మొదట ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సిమ్యులేటర్లను ఏర్పాటు చేసి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే వీటి ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ పరిశీలించారు. ఆ తరువాత వీటిని మరిన్ని కేంద్రాలకు విస్తరించనున్నారు. సిమ్యులేటర్లతో దళారుల ఆటకట్టు: చాలా దేశాల్లో సిమ్యులేటర్ల ద్వారా డ్రైవింగ్ శిక్షణ తప్పనిసరి. ఆ శిక్షణలో నైపుణ్యం వచ్చాకే రోడ్డు మీద వాహనం నడిపేందుకు అనుమతిస్తారు. కానీ నగరంలోని కొన్ని డ్రైవింగ్ స్కూళ్లు వినియోగదారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించేందుకు ఆర్టీఏ అధికారులకు, వినియోగదారులకు మధ్య దళారీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో దళారీల ఆట కట్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవీ ప్రయోజనాలు - డ్రైవింగ్‌లో ఎలాంటి అనుభవం లేక పోయినా సిమ్యులేటర్ల ద్వారా నేరుగా శిక్షణ పొందవచ్చు. - రహదారి భద్రతా, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. - క్లిష్టమైన పరిస్థితుల్లో అనుసరించవలసిన మెళకువలు తెలుసుకోవచ్చు. - నేర్చుకునే వాళ్ల ప్రవర్తనను విశ్లేషించేందుకు అవకాశం ఉంటుంది. - సీనియర్ సిటిజన్లకు డ్రైవింగ్ లైసెన్సుల పునరుద్ధరణలో సిమ్యులేటర్ పరీక్ష ఉపయుక్తంగా ఉంటుంది. -
ఇక ఆర్టీసీ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్
స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా ఆర్టీసీ శిక్షణ కళాశాలలు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్న కేంద్రం ప్రైవేటు అభ్యర్థులకూ శిక్షణ ఒక్కో సెంటర్‌కు రూ.కోటి కేంద్ర నిధులు హైదరాబాద్: రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి, సరైన డ్రైవింగ్ నైపుణ్యం లేక చోదకులు ఇష్టానుసారం వాహనాలను పరుగుపెట్టించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. మొత్తం ప్రమాదాల్లో 95 శాతం మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయని ఇటీవల ఓ అధ్య యనం వెల్లడించింది. డ్రైవింగ్ నైపుణ్యం అంతంత మాత్రంగానే ఉన్నా.. భారీ వాహనాలను నడిపేందుకు నియమితులవుతున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రప్రభుత్వం.. భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలో అతి తక్కువ ప్రమాదాలు నమోదు చేస్తున్న రవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీకి ఉన్న గుర్తింపు నేపథ్యంలో.. సంస్థ పరిధిలోని 3 కేంద్రాలను శిక్షణ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆర్టీసీ డ్రైవర్లకు మాత్రమే శిక్షణ ఇస్తున్న ఈ కేంద్రాల్లో కేంద్రం ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్న నేపథ్యంలో.. ప్రైవేటు అభ్యర్థులకూ శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా డ్రైవర్లకు నైపుణ్యంతోపాటు దేశవ్యాప్తంగా డ్రైవర్ల కొరత తీరుతుందని కేంద్రం భావిస్తోంది. ఆర్టీసీ ప్రత్యేక సర్టిఫికెట్లు.. రాష్ట్రంలో ఇప్పటివరకు భారీ మోటారు వాహనాల డ్రైవింగ్ శిక్షణకు ప్రభుత్వపరంగా కేంద్రాలు లేవు. కేవలం ఆర్టీసీ డ్రైవర్ల కోసం సంస్థ ఆధ్వర్యంలో 3 కేంద్రాలు కొనసాగుతున్నాయి. హకీంపేటలోని ట్రాన్స్‌పోర్టు అకాడమీ, జోనల్ శిక్షణ కళాశాల, వరంగల్‌లో సిబ్బంది శిక్షణ కళాశాలల్లో డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇక వీటిని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా మార్చనున్నారు. ఇందుకోసం ఒక్కో కేంద్రానికి రూ.కోటి వరకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఆర్టీసీ డ్రైవర్లతోపాటు ప్రైవేటు అభ్యర్థులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో ఉత్తీర్ణులైన వారికి ఆర్టీసీ ప్రత్యేక సర్టిఫికెట్లు మంజూరు చేస్తుంది. భవిష్యత్తులో ఆర్టీసీనే నేరుగా వారికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా మోటారు వాహన చట్టానికి కేంద్రం మార్పులు చేయనున్నట్టు సమాచారం. -
ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు
కేంద్రం సహకారంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రూ.5 కోట్లతో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఏపీ, తెలంగాణల మధ్య వాహన రాకపోకలకు సింగిల్ పర్మిట్ సదుపాయం కల్పించే అంశంపై వారంలో ఏపీ ప్రభుత్వంతో మరో దఫా చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
118 మంది మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ
సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో మహిళలు నడిపే టాక్సీల సంఖ్య పెరుగనుంది. ట్యాక్సీలో మహిళపై అత్యాచార ఘటన నేపథ్యంలో నగరంలో మహిళా క్యాబ్‌ల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ఢిల్లీ పోలీసులు ట్యాక్సీలు నడపడంలో మహిళలు శిక్షణ ఇప్పించి లెసైన్స్‌లు అందించాలని నిర్ణయించారు. ఆయా కాలనీల్లో మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణపై అవగాహన కల్పించారు. ఇందుకు మహిళల నుంచి ఆశించిన స్పందన లభించింది. డ్రైవింగ్‌లో శిక్షణ పొందడానికి పేరు నమోదు చేసుకోవడం కోసం సోమవారం ఒక్కరోజే 143 మంది మహిళలు వచ్చారని అదనపు డీసీపీ విజేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు. వయసు, సర్టిఫికెట్లు పరిశీలించి 118 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఎంపికైన వారికి నిరంకారీ గ్రౌండ్లో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకొన్న వారికి వాణిజ్యపరమైన లెసైన్స్ అందచేయనున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.