ప్రతీకాత్మక చిత్రం
కారులో షికారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి! కొంతమందికైతే ఇది వ్యసనంలాగా మారుతుంటుంది. కారులో పయనం సుఖవంతమైనదే కాకుండా బైక్‌తో పోలిస్తే సురక్షితమైనది కూడా! అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు అతిగా కారులో తిరగడానికే అలవాటు పడితే క్రమంగా కొన్ని శారీరక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అతిగా కారు డ్రైవ్ చేసేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. వెన్నెముక చుట్టూ ఉండే కండరాలన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం, కండరాలకు ఎలాంటి నొప్పులు రాకుండా శరీరాన్ని తీరుగా ఉంచడమే గుడ్ పోశ్చర్. మన డైలీ లైఫ్‌లో ఎదురయ్యే శారీరక ఒత్తిడి కండరాలు, ఎముకలపై పడకుండా జాగ్రత్తపడడమన్నమాట! మనం సరైన భంగిమ లేదా పోశ్చర్ మెయిన్ టెయిన్ చేస్తున్నామో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు.
కూర్చున్నప్పుడు రెండు పాదాలు సమాంతరంగా నేలపై ఉన్నాయా? రెండు పిరుదులపై సమాన భారం పడుతోందా? వెన్నెముక నిటారుగా ఉందా? భుజాలను చెవులకు సమాంతరంగా రిలాక్స్‌గా ఉంచామా? నిలుచున్నప్పుడు మోకాలి జాయింట్లు లాక్ అవకుండా నిల్చుంటున్నామా? పడుకున్నప్పుడు శరీరం సమాంతరంగా ఉంటోందా? వంటివి చెక్ చేయడం ద్వారా పోశ్చర్ మెయిన్ టెయిన్ అవుతుందా, లేదా తెలిసిపోతుంది. సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయకపోతే, వెన్నుముక పెళుసుగా మారి, ఈజీగా దెబ్బతింటుంది. కండరాల నొప్పులు ఆరంభమై క్రమంగా పెరిగిపోతాయి. మెడ, భుజం, వెన్ను నొప్పులు పర్మినెంట్‌గా ఉండిపోతాయి. కీళ్ల కదలికలు దెబ్బతింటాయి. క్రమంగా ఈ మార్పులు జీర్ణవ్యవస్థను మందగింపజేస్తాయి. ఆపైన శ్వాస ఆడడం ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇబ్బందులన్నీ మరీ ముదిరిపోతే తీవ్ర వ్యాధుల పాలు కావాల్సిఉంటుంది. అందువల్ల కారు డ్రైవింగ్ చేసే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.
ఏం జాగ్రత్తలు తీసుకోవాలి...
మీ కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లు పొడవుగా ఉన్నవారు సీట్‌ను మరీ ముందుకు ఉంచకుండా తగినంత దూరంలో ఫిక్స్ చేసుకోవాలి. అలాగే మీ ఎత్తుకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం. మీ సీట్‌ను నిటారుగా ఉండేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి.
మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది. మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్‌రెస్ట్ ఉండాలి. సీట్‌లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మీకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే కాదు... మరెన్నో విధాలుగా మేలు చేస్తుందని గుర్తుంచుకోండి.
ఒకవేళ పోశ్చర్ బాగా దెబ్బతిన్నదనిపిస్తే డాక్టర్ సలహాతో కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్స్, తేలికపాటి పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు. బాడీ భంగిమను నిలబెట్టే ఉపకరణాలు(పోశ్చర్ బెల్ట్స్ లాంటివి) వాడవచ్చు. మరీ ఎక్కువగా ఇబ్బందులుంటే అలెగ్జాండర్ టెక్నిక్ టీచర్స్, ఫిజియోథెరపిస్ట్, ఖైరోప్రాక్టర్, ఓస్టియోపతీ ప్రాక్టీషనర్ సహాయం తీసుకోవాలి. అవసరమైతే వీరు సూచించే ఎలక్ట్రోథెరపీ, డ్రైనీడిలింగ్, మసాజింగ్, జాయిట్ మొబిలైజేషన్ లాంటి విధానాలు పాటించాలి. స్మార్ట్ పోశ్చర్, అప్‌రైట్ లాంటి మొబైల్ యాప్స్‌లో సరైన భంగిమల గురించి, గుడ్‌పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయడం గురించి వివరంగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కారులో షికారు హుషారునిస్తుంది.
– డి. శాయి ప్రమోద్
Comments
Please login to add a commentAdd a comment