మీ భంగిమ 'వెన్ను'దన్నుగా ఉందా..? సరైన పోష్చర్‌ అంటే..? | Postural Awareness: What It Is How To Correct And Effect Of Your Health | Sakshi
Sakshi News home page

మీ భంగిమ 'వెన్ను'దన్నుగా ఉందా..? సరైన పోష్చర్‌ అంటే..?

Published Tue, Apr 15 2025 9:11 AM | Last Updated on Tue, Apr 15 2025 12:44 PM

Postural Awareness: What It Is How To Correct And Effect Of Your Health

ఇటీవల చాలా చిన్న వయసులో ఉన్నవారు కూడా కండరాల నొప్పులని ఒళ్లునొప్పులనీ అంటుండటం మామూలే. దీనికి కారణం ఏదో జబ్బు లేదా వ్యాధి కాకపోవచ్చు. సరిగా నిలబడటం, కూర్చోవడం వంటివి చేయక΄ోవడమే కావచ్చంటున్నారు నిపుణులు. చాలామంది సరిగా నిల్చోవడం, ఆఫీసుల్లో లేదా ఇతరత్రా కూర్చోవడం, ఏదైనా వస్తువులు అందుకోవడం కోసం ఒంగడం వంటివి సరిగా చేయడం లేదంటే  చాలామందికి అది ఆశ్చర్యమే. కానీ ఇదే నిజమంటున్నారు నిపుణులు. సరైన రీతిలో నిలబడటం, కూర్చోవడం, వంగడం, సెల్‌ఫోన్‌ మాట్లాడేటప్పుడు మెడ కండరాలపైన ఒత్తిడి పడేలా ఒక పక్కకు పూర్తిగా మెడ వంచకపోవడం వంటి శారీరక భంగిమలను (పోష్చర్‌ను) సరైన రీతిలో ఉంచడం వంటి మామూలు జాగ్రత్తలతోనే చాలా నొప్పులు నివారించవచ్చనీ, ఎప్పుడో వృద్ధాప్యంలో రావాల్సిన అరుగుదల సమస్యలను ముందే తెచ్చుకోకుండా రక్షించుకోవచ్చని తెలుసుకోవడం మేలు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... 

సరిగ్గా నిలబడటం, నడిచేటప్పుడు ముందుకు లేదా పక్కకు ఒంగినట్లుగా కాకుండా సరిగ్గా నడవడం, కార్‌ లేదా బైక్‌ నడిపేటప్పుడు సరిగా కూర్చోవడం వల్ల ఒంటికి సంబంధించిన చాలా నొప్పులనూ, చాలా అరుగుదల సమస్యలను రాకుండా చూసుకు΄ోవచ్చు. ఇలా నడిచేటప్పుడు, నిలబడినప్పుడు, కార్‌ లైదా బైక్‌ నడిపేటప్పుడు మనం ఉండే శారీరక భంగిమల్లో (పోష్చర్స్‌లో) మన కండరాలు, ఎముకలపైన ఒత్తిడి పడుతుంటుంది. దాని కారణంగా ఆయా కండరాల్లో నొప్పులు రావడం లేదా అక్కడి ఎముకలు ఎప్పుడో చాలాకాలం తర్వాత అరగాల్సినవి కాస్తా  ముందుగానే అరగడం జరగవచ్చు. 

తప్పుడు భంగిమల వల్ల కండరాల మీద పడే అలాంటి ఒత్తిడులను వీలైనంత తగ్గించగలిగితే / నివారించగలిగితే కండరాలనూ, లిగమెంట్లనూ, టెండన్లనూ చాలాకాలం బలంగా, పటిష్టంగా కా΄ాడుకోవచ్చు. దాంతో కండరాల నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. దీనికి కావల్సిందల్లా మనం సరిగ్గా నిలబడటం, సరిగా కూర్చోవడంలో సరైన భంగిమలు (పోష్చర్స్‌) పాటించడమే. ఇలా దేహ భంగిమను (పోష్చర్‌ను) ఎంత బాగా మెయింటెయిన్‌ చేసుటే ఎముకల అరుగుదల సమస్యలనూ (డీజనరేటివ్‌ ప్రాబ్లమ్స్‌ను), కండరాలపై పడే ఒత్తిడిని అంతగా నివారించుకోచ్చు అని తెలుసుకోవడం ముఖ్యం.  

సరైన పోష్చర్‌ అంటే... 
ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తిపైనా భూమ్యాకర్షణ శక్తి ప్రతినిత్యం పనిచేస్తూ, ప్రతివారూ నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఆఖరికి పడుకుని ఉన్నప్పుడు కూడా మనందరి మీదా ప్రభావంచూపుతూనే ఉంటుంది. తప్పుడు పద్ధతుల్లో నిలబడటం, కూర్చోవడం జరిగినప్పుడు ఆ ప్రభావం గరిష్టంగా ఉంటుంది. అందుకే అరుగుదల, కండరాలపై ఒత్తిడి దుష్ప్రభావం ఎక్కువ. 

దీనికి బదులు సరైన భంగిమల్లో  నిలబడటం, కూర్చోవడం, వాహనం నడపడం, ఫోన్‌ మాట్లాడటం చేస్తుంటే అన్ని అవవయవాల మీద ఒత్తిడి సమంగా పడటంతో అరుగుదల, దుష్ప్రభావాలు ఒకేచోట కేంద్రీకృతం కావడం వంటి సమస్యలు ఉండవు. దాంతో నొప్పులూ, బాధలూ లేకుండా చాలాకాలం పాటు హాయిగా ఉండవచ్చు. సరైన పోష్చరల్‌ భంగిమలంటే ఏమిటో, అవి ఎలా 
ఉంటాయో తెలుసుకుందాం.

చాలా సేపు నిలబడాల్సిన వాళ్లు ఎవరంటే... 
ఏదైనా వైకల్యమో లేదా ఆరోగ్య సమస్య ఉంటేనో తప్ప ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తీ తన రెండు కాళ్లపై నిలబడటం మొదలుపెట్టిన నాటినుంచి సరిగా నిలబడటం నడవటం చేస్తుంటారు. ఇక ట్రాఫిక్‌లో నిలబడి డ్యూటీ చేసే పోలీసులు, ముఠాలు చెప్పడం కోసం బోర్డు దగ్గర లేదా టేబుల్‌ దగ్గర నిలబడే ఉపాధ్యాయులు / లెక్చరర్లు, సిటీ బస్సుల్లోని కండక్టర్లు, వంట చేసే మగవారు లేదా గృహిణులు, సేల్స్‌ గర్ల్స్, సేల్స్‌ బాయ్‌స్, మెషిన్‌ ఆపరేటర్లు... ఇలాంటి వారందరికీ తమ వృత్తులపరంగా  చాలాసేపు నిలబడే ఉండాల్సిన అవసరముంటుంది. వీళ్లలో కాళ్లపైనా, ΄ాదాలపైనా ఒంటిబరువు చాలాసేపు పడటం వల్ల కాళ్లల్లో నీరసం, నిస్సత్తువ, కాళ్లవాపులు, వేరికోస్‌ వెయిన్స్, మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి.

మంచి పోష్చర్‌లో నిలబడటం ఎలా? 
సరైన శారీరక భంగిమలో (మంచి పోష్చర్‌లో) నిలబడటం వల్ల కాళ్లు, కండరాలు, నడుము, మెడ వంటి అవయవాలపై తక్కువ భారం పడుతుంది. అలా తక్కువ భారం పడేలా సరైన రీతిలో నిలబడటానికి ఈ కింద పేర్కొన్న సూచనలు /  జాగ్రత్తలు పాటించడం మేలు. అవి...  

  • నిలబడి చేసే పనులకు ఉపయోగించే ప్లాట్‌ఫారాన్ని (ఉదాహరణకు వంట చేసేవారు వంట టేబుల్, నిలబడి డ్రాయింగ్‌ వేసేవారు తమ ప్లాంక్‌ వంటి వాటిని) తమ ఎత్తుకు తగినట్లుగా అడ్జెస్ట్‌ చేసుకోవడం. 

  • నిలబడి ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న రకరకాల వస్తువులను అందుకునే క్రమంలో  పూర్తిగా ఒంగి తీసుకోవాల్సి వచ్చే దూరంగా ఉంచకుండా, తేలిగ్గా తీసుకునేంత దూరంలోనే వస్తువులను 
    ఉంచుకోవడం. 

  • ఫ్లాట్‌ఫారమ్‌కు సరిగ్గా ఎదురుగా ఉండే పనులను చేసుకోవడం (ఉదాహరణకు వంట లేదా డ్రాయింగ్‌ వంటివి చేసేప్పుడు మీ ప్లాట్‌ఫారానికి పక్కగా ఉండకుండా ఎదురుగానే ఉండటం అవసరం).  

  • మడమలను పూర్తిగా ఫ్లాట్‌గా ఉంచకుండా వాటి కింద కాస్తంత ఎత్తుగా ఉండేలా చూసుకోవడం. (అయితే మడమల కింద ఉంచుకునే ఎత్తు మరీ ఎత్తుగా లేకుండా జాగ్రత్త పడటం). 

  • చాలాసేపు నిలబడి వంట చేయాల్సి వచ్చినప్పుడు ఒంటి బరువును కాళ్లపై మార్చి మార్చి వేస్తుండటం. (అంతేతప్ప... మొత్తం బరువును చాలాసేపు ఒకే కాలిపైన మోపడం సరికాదని గుర్తుంచుకోవాలి). 

  • నిలబడి చేసే పనులు (అంటే నిలబడి ఫ్లోరింగ్‌ శుభ్రం చేయడం, మాపింగ్, గార్డెనింగ్‌) వంటివి వీలైనంత నిటారుగా నిలబడే చేయడం. (అంతే తప్ప...  చాలాసేపు ముందుకు ఒంగిపోయి చేయడం సరికాదు. అలా ఒంగిపోయి చాలాసేపు పనిచేయడం వల్ల వెన్నెముకపై ఎక్కువ భారం పడుతుందని తెలుసుకోవాలి).

సరైన పోష్చర్‌లో కూర్చోవడమిలా...
గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో కూర్చొని పనిచేసే ఉద్యోగాలే ఎక్కువ.  అయితే ఇలా కూర్చుని పని చేసేటప్పుడు సరైన పోష్చర్‌లో కూర్చోకపోవడమే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు మూలం. కూర్చుని కంప్యూటర్‌పై పనిచేసేవారు మొదలుకొని బల్లలపై కూర్చొని రాత పనిచేసే అనేక మందిలో సరిగా కూర్చోకపోవడం వల్లనే నడుమునొప్పి, కండరాల నొప్పులు, మెడ బిగుసుకుపోవడం (స్టిఫ్‌నెక్‌), తరచూ పాదాలకు తిమ్మిరిపట్టడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. 

ఇలా అదేపనిగా, సుదీర్ఘంగా కూర్చోవడం వల్ల భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, కొన్ని రకాల మానసిక సమస్యలూ వచ్చే అవకాశాలున్నాయి.  కండరాలు, ఎముకలపై వీలైనంత తక్కువ భారం పడేలా కూర్చోవడం ఎలాగంటే... 

  • కుర్చీలో వీలైనంత నిటారుగా కూర్చోవాలి. అంతేతప్ప వెన్నుపై అధికమైన భారం పడేలా భుజాలను వేలాడేసి లేదా ఒంగి΄ోయి కూర్చోవడం సరికాదు.

  • కంప్యూటర్‌ మానిటర్‌ సరిగ్గా ఉపయోగించేవారి కళ్లకు సరిగ్గా ఎదురుగా ఉండేలా అమర్చుకోవాలి. అంతే తప్ప మెడను బాగా ఎత్తిగానీ లేదా మెడను మరీ ఎక్కువగా ఒంచి చూసేలా దాన్ని అమర్చుకోకూడదు. 

  • కీబోర్డు  చేతులకు, వేళ్లకు సౌకర్యంగా అందేలా ఉండాలి. కీబోర్డుపై పనిచేసే పమయంలో మోచేతులకు సపోర్ట్‌ ఉండేలా కూర్చీ తాలూకు హాండ్‌రెస్ట్‌లను అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతులు అలసిపోకుండా చాలాసేపు పని చేయడానికి వీలవుతుంది. 

  • కంప్యూటర్‌ పై పనిచేస్తున్నప్పుడు వీపును కుర్చీ తాలూకు బాక్‌రెస్ట్‌కు ఆనించి ఉంచాలి. అలాగని కుర్చీ బ్యాక్‌రెస్ట్‌ మరీ వెనక్కువాలి ఉండకూడదు. పనిచేసే సమయంలో వెనక్కు ఆనకపోవడం వల్ల భుజాలు, మెడ, వెన్ను సమస్యలు వచ్చే అవకాశముంది. నడుం కండరాలపై ఎక్కువ భారం పడి, ఎక్కువ శ్రమ కలుగుతుంది.  పని చేసే సమయంలో కూర్చీ బ్యాక్‌రెస్ట్‌ను నిటారుగానే ఉంచి, వీపును దానికి ఆనించి ఉంచాలి. అప్పుడు వీపుకు తగినంత సపోర్ట్‌ దొరికి, వెన్నుపై భారం తగ్గుతుంది. 

  • కంప్యూటర్‌ అదేపనిగా కంటిన్యువస్‌గా ఉపయోగించడానికి బదులుగా ప్రతి గంటసేపు పని తర్వాత  10 నిమిషాలు విశ్రాంతి ఇవ్వడం మందిది. అది కూడా ఆ 10 నిమిషాలూ మళ్లీ కూర్చునే ఉండటానికి బదులుగా లేచి కాస్త అటు ఇటు తిరగడం మేలు.  

  • ఎదురుగా ఉన్న బల్లపైన మనం తరచూ ఉపయోగించే వస్తువులను మూడు అంచెల్లో పెట్టుకోవచ్చు. మొదటి అంచెలో అనుక్షణం అందుకునే వస్తువులు / పనిముట్లు / పుస్తకాలు / ఉపకరణాలు ఉంచుకోవాలి. రెండో అంచెలో తరచూ ఉపయోగించేవి పెట్టుకోవాలి. ఎప్పుడోగాని ఉపయోగించని వాటిని డెస్క్‌/టేబుల్‌కు అటు చివర ఉంచాలి. ఇలా మన వస్తువుల అమరిక ఉండటం వల్ల... వస్తువులను అందుకునే సమయంలో వెన్నుపై భారం చాలావరకు తగ్గుతుంది. 

  • కూర్చొని ఉన్నప్పుడు కాళ్లను ఫుట్‌రెస్ట్‌పైన కాస్తంత ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. దాంతో వెన్ను/నడుము నొప్పి నివారించవచ్చు.

కార్‌ డ్రైవింగ్‌లో పాటించాల్సిన పోష్చర్‌ జాగ్రత్తలు...
డ్రైవింగ్‌ చేసే సమయంలో కారులో లేదా వాహనంలో కూర్చునే పోష్చర్‌ సరిగా లేకపోతే వెన్నుకు, మెడకు, నడుముకు సంబంధించిన చాలా సమస్యలు వచ్చేందుకు అవకాశాలెక్కువ.

డ్రైవింగ్‌ సమయంలో సరిగా కూర్చోకపోతే... 
డ్రైవింగ్‌ పోష్చర్‌ సరిగా లేకపోతే ‘రిపిటిటివ్‌ డ్రైవింగ్‌ ఇంజ్యురీస్‌’ (ఆర్‌డీఐ) అనే  సమస్యలు వస్తాయి. దాంతో మెడ బిగుసుకు΄ోవడం (స్టిఫ్‌నెక్‌), పాదాలు, కాళ్లకు తిమ్మిర్లు రావడం, భుజాలు నొప్పి పెట్టడం, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కార్‌డ్రైవింగ్‌ చేసేవారు పోష్చర్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

డ్రైవింగ్‌లో సరిగా కూర్చోవడమిలా... 
ఫోర్‌వీలర్‌ డ్రైవింగ్‌ సమయంలో వెన్నుపైన సాధ్యమైనంత తక్కువ భారం పడేలా కూర్చోవడానికి పాటించాల్సిన సూచనలివి...  

డ్రైవ్‌ చేసేవాళ్లు సౌకర్యంగా కూర్చునేలా డ్రైవింగ్‌ సీట్‌ ఉండాలి. డ్రైవింగ్‌ చేసే సమయంలో స్టీరింగ్‌పై చేతులు పెట్టే పద్ధతి ఎలా ఉండాలంటే... మన డెస్క్‌పై చేతులు ఉంచినప్పటికంటే... స్టీరింగ్‌పై చేతులు కాస్త ఎత్తుగానే ఉండాలి. స్టీరింగ్‌ వీల్‌కూ, డ్రైవర్‌ ఛాతీకి మధ్య 25 – 30 సెం.మీ. (10 – 12 అంగుళాల) స్థలం ఉండేలా స్టీరింగ్‌ అడ్జెస్ట్‌ చేసుకోవాలి. డ్రైవ్‌ చేసేవారు ఎలా కూర్చోవాలంటే... స్టీరింగ్‌వీల్‌ ఎట్టిపరిస్థితుల్లో తమ కాళ్లకు ఆనకుండా చూసుకోవడం అవసరం. 

అలా స్టీరింగ్‌ వీల్‌కూ తమ దేహానికి మధ్య అవసరమైనంత స్థలం ఉన్నప్పుడు స్టీరింగ్‌ను సౌకర్యంగా తిప్పడానికీ, ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోడానికీ  వీలుగా ఉండి, ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్‌ చేసేవారికి ఎక్కువ రక్షణ కలుగుతుంది. 

కారు కుదుపుల్లో సైతం కాళ్లకు స్టీరింగ్‌కు ఆనకూడని విధంగా సీట్, స్టీరింగ్‌వీల్‌ అడ్జెస్ట్‌ చేసుకోవాలి.  
వాహనం ఆగాక డ్రైవింగ్‌ చేసేవారు చాలా సౌకర్యంగా దిగగలిగే విధంగా కారు సీట్‌ ఉండాలి.  స్టీరింగ్‌కూ, సీట్‌కూ మధ్య...  డ్రైవ్‌ చేసే వ్యక్తి దిగేందుకు అనువుగా ఉండేంత స్థలం ఉండాలి. 

డ్రైవింగ్‌ చేసేవారు... మరీ 90 డిగ్రీలు నిటారుగా కూర్చొని డ్రైవ్‌ చేయడమూ సరికాదు. కాస్తంత వెనక్కు వాలి సౌకర్యంగా కూర్చుని డ్రైవ్‌ చేయాలి. అయితే డ్రైవింగ్‌ సీట్‌లో అలా వెనక్కి వాలినప్పుడు ఆ కోణం 120 డిగ్రీలకు మించకూడదు. డ్రైవింగ్‌ సీట్‌ వర్టికల్‌గా డ్రైవింగ్‌ చేసేవారి వెన్నుకూ, కింది భాగంలో వారి తొడలకు మంచి సపోర్ట్‌ ఇవ్వాలి. అలా మంచి సపోర్ట్‌ ఇచ్చేలా సీట్‌ కుషన్‌ ఉండటం మేలు. డ్రైవ్‌ చేసేప్పుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలి. బ్రేక్, క్లచ్‌ పెడల్స్‌ వంటి కారు భాగాలన్నీ డ్రైవింగ్‌ చేసేవారి కాళ్లకు సౌకర్యంగా తక్షణం అందేలా డ్రైవింగ్‌ సీట్‌ అమర్చుకోవాలి.

టూవీలర్‌ (బైక్‌) డ్రైవింగ్‌లో పోష్చర్‌ ఇలా... 
సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్‌ వంటి భాగాల అమరికలో కొన్ని ప్రమాణాలను  పాటిస్తుంటారు. వాటిని అనుసరించడం వల్ల చాలా సమస్యలు రావు. అయితే బాగా స్టైల్‌గా కనిపించడం కోసం కొంతమంది తమ బైక్‌ హ్యాండిల్‌ బార్స్‌ను, సీట్‌ కోణాన్ని రకరకాలుగా మార్చి అమర్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు పొట్టి హ్యాండిల్‌ బార్స్‌ వాడటం, సీట్‌ను మరీ ఏటవాలుగా ఉండేలా అమర్చుకోవడ వంటివి చేస్తుంటారు. అలా కాకుండా బైక్‌ తయారీదారులు ప్రామాణికంగా ఉంచిన విధంగానే హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్‌లు ఉంచుకోవడం మేలు. మరీ ఇబ్బందిగా ఉంటేనే తప్ప వాటిలో వ్యక్తిగతమైన మార్పులు చేసుకోకపోవడమే మంచిది. బైక్‌ వాడుతున్నప్పుడు నడుమునొప్పి, వెన్నునొప్పి వస్తుంటే... డ్రైవింగ్‌ చేసేవారికి  బైక్‌ సీట్‌ అనువుగా, సౌకర్యంగా ఉండేలా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది.  అవి... 

బైక్‌ల హ్యాండిల్స్‌ తగినంత విశాలంగా, రెండు చేతులు సరైన గ్రిప్‌ ఉండేలా  పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్‌ వల్ల ముందుకు ఒంగిపోవడంతో ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.  

హ్యాండిల్‌ పట్టుకున్నప్పుడు డ్రైనింగ్‌ చేసేవారు తమ దేహం నిటారుగా ఉండేలా కూర్చోవాలి. అయితే ఇటీవల కొన్ని స్పోర్ట్స్‌ బైక్‌లలోని సీట్లు, హ్యాండిల్‌ బార్స్‌ శరీరం బాగా ముందుకు వాలిపోయి ఉండేలా మార్పులు చేస్తున్నారు. ఇలా  వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్‌ బైక్స్‌ వల్ల వెన్ను నిటారుగా ఉండకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి హ్యాండిల్‌బార్‌నూ, సీట్లను అలాంటి ఫాల్టీ పోష్చర్స్‌కు అవకాశమిచ్చేలా అమర్చుకోవడం సరికాదు. 

కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్‌ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయి΄ోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి వచ్చేందుకు అవకాశం ఉంది. కాళ్లతో బ్రేక్‌ వేయడానికీ, గేర్లు మార్చడానికీ సౌకర్యంగా, వీలుగా ఉండేలా ఫుట్‌రెస్ట్‌లు ఉండాలి. 

చాలామంది బైక్‌లపై ప్రయాణాలు చేసేవారు తమ వీపుపై ఉండే బ్యాగ్స్‌ (బ్యాక్‌΄్యాక్స్‌) పెట్టుకొని వెళ్తుండటం ఇటీవల చాలా సాధారణంగా కనిపించే దృశ్యం.  ఈ భారం నడుంపై ఎక్కువగా పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్‌ భారం వీపుపై కాకుండా, అది సీట్‌పై ఆనేలా చూసుకోవడం చాలా మంచిది.  

పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీలైనంత ఎక్కువ కాలం పోటు నొప్పులు రాకుండా కండరాలను సంరక్షించుకోవడం, ఎముకలు అరగకుండా నివారించుకోవడం సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. 

సెల్‌ఫోన్‌ వాడకంలోజాగ్రత్తలివి...

  • ఇటీవల టూవీలర్‌ డ్రైవ్‌ చేస్తుండే వాళ్లు అలాగే డెస్క్‌ మీద కంప్యూటర్‌పై పనిచేస్తూనే  భుజానికీ చెవికీ మధ్య సెల్‌ఫోన్‌ ఉంచుకుని, మెడతో ఆ ఫోన్‌ను నొక్కిపట్టి ఉంచి మాట్లాడటం చేస్తుంటారు. అది సరికాదు. ఇందుకు బదులుగా వాహనం ఆపి ఉన్నప్పుడు ఇయర్‌ఫోన్స్‌ వాడటమన్నది మెడ, వెన్ను ఆరోగ్యానికి చాలా మంచిది. 

  • డ్రైవింగ్‌ చేస్తూ ఇయర్‌ఫోన్స్‌తోగాని మరే రకంగానూ సెల్‌ఫోన్‌ మాట్లాడకూడదు.  పైగా అది చట్టరీత్యా నేరం. అలాగే అది ప్రాణానికి ప్రమాదం కూడా. 

  • సెల్‌ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ వాడుతుండటం వల్ల బొటనవేలి వెనక ఉండే టెండన్‌ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై వాపు  వస్తుంది. అ తర్వాత కూడా అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానకుండా  మాటిమాటికీ తిరగబెడుతుంది. దీన్నే బ్లాక్‌బెర్రీ థంబ్‌ లేదా గేమర్స్‌ థంబ్‌ అంటారు. అందుకే వీలైనంత వరకు అత్యవసర పరిస్థితుల్లోనే సెల్‌ఫోన్‌ ఉపయోగించాలి. 

  • సెల్‌ఫోన్‌ సంభాషణలు వీలైనంత క్లుప్తంగా ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

  • ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడటం కన్నా మెసేజ్‌లనే ఎక్కువగా అలవాటు చేసుకోవడం మంచిది. అయితే ఇలా మెసేజ్‌లు ఇచ్చేటప్పుడు మెడను హానికరమైన కోణాలలో ఒంచకూడదు. మీ మెడను ఎంతగా ఒంచితే వెన్నుపై పడే భారం అంతగా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. సెల్‌ఫోన్‌ నెంబరును బాగా సన్నిహితులకు మాత్రమే ఇవ్వడం వల్ల అనవసరమైన కాల్స్‌ను అవాయిడ్‌ చేయవచ్చు.  

  • పొద్దున్నే లేవడానికి అలారం మొదలుకొని... రిమైండర్లు, ఆటలు, పాటలు, కాలిక్యులేటర్‌... ఇలా ప్రతిదానికీ సెల్‌ఫోన్‌ మీదే అతిగా ఆధారపడటం అంత  మంచిది కాదు. అది వెన్నుకు చేటు చేయడంతోపాటు సెల్‌ఫోన్‌ అడిక్షన్‌కు దారితీయవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement