
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ టాలీవుడ్ కోలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన ప్రసిద్ధ నటి. 90లలో తన అందం, నటనతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన నటి ఆమె. ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలో ప్రేక్షకుల, విమర్శకుల మెప్పుని పొందారు. అంతేగాదు వేలాదిగా అభిమానులను సొంతం చేసుకున్న తమిళ నటి. అలాగే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ కూడా తన హవాను చాటుతున్నారు. అవసరమైనప్పుడూ ప్రజల తరుపున గళం విపుత్తు..వార్తల్లో నిలుస్తున్నారు కూడా. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉండే ఆమె కూడా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతుంటారు. అందుకు నిదర్శనమే ఆమె కొత్త గ్లామరస్ లుక్. ఎంతో లావుగా ఉండే ఆమె ఒక్కసారిగా పదహారణాల పడుచు పిల్లలా మారిపోయారు. నెటిజన్లు సైతం ఆమె కొత్త లుక్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరీ.. అంతలా బరువు కోల్పోయినా..ఖుష్బు వెయిట్‌లాస్ సీక్రెట్ ఏంటో ఆమె మాటల్లోనే చూద్దామా..!.
ఐదుపదుల వయసులో ఖుష్బూ అద్భుతంగా తన బాడీ ఆకృతిని మార్చుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారామె. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నిజంగా ఆమెనా..? ఖుష్బు కూతురా..? అని కన్ఫ్యూజ్ అయ్యేలా గ్లామరస్ లుక్‌లో కనిపించారామె. అయితే ఆమె కొత్త లుక్‌ని చూసి.. కొందరు నెటిజన్లు మెచ్చుకోగా మరికొందరు మాత్రం ఇంజెక్షన్లు ఏవో తీసుకునే బరువు తగ్గారామె అంటూ కామెంట్లు చేశారు. అయితే ఖుష్బూ వాటిన్నంటిని కొట్టిపారేస్తూ..తాను ఎలా బరువుని తగ్గించుకోగలిగరో షేర్ చేసుకున్నారు. అలాగే తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో కూడా చెప్పారు.
బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఉండవని నర్మగర్భంగా తేల్చి చెప్పారామె. ఒకవేళ్ల తగ్గినా..అది తాత్కాలికమే అని కూడా అన్నారు ఖుష్బూ. కేవలం క్రమశిక్షణాయుతమైన జీవనశైలి, బరువు తగ్గాలన్న కృత నిశ్చయాలే..అద్బుతంగా బరువు తగ్గేందుకు దారితీస్తాయని అంటున్నారామె. అంతేగాదు అందుకోసం తాను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని అనుసరించారో కూడా పంచుకున్నారు.
మనసుపెట్టి తినడం, ఒక గంటపాటు వర్కౌట్లు, అలాగే సాయంత్రం 45 నుంచి 50 నిమిషాలు తప్పనిసరి వాక్ తదితరాలే ఈ సరికొత్త లుక్‌కి కారణమని అన్నారు. అయితే తాను ఇలా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం కూడా వివరించారు. షూటింగ్‌ల సమయంలో సంవత్సరాల తరబడి అయిన గాయాలు, శస్త్రచికిత్సలు తన మోకాళ్లను పూర్తిగా బలహీనపరిచాయన్నారు.
వాటిపై ఒత్తిడిపడకూడదంటే బరువు తగ్గక తప్పదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. చీలమండలాలు బాగానే ఉన్నాయని, మోకాళ్లు ఆల్‌మోస్ట్ అరిగిపోయాయని అన్నారు. అప్పుడే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే అంతే సంగతులని భావించి..బరువు తగ్గాలని గట్టిగా ఫిక్స్ అయ్యానన్నారు. అలా తాను దాదాపు 20 కేజీల బరువుని కోల్పాయానన్నారు.
ఇక్కడ ఖుష్బూ బరువు తగ్గేందుకు ఎటువంటి సౌందర్య చికిత్సల జోలికిపోకుండా.. అందంగా..ఆరోగ్యకరంగా వృద్ధాప్యాన్ని ఎలా మలుచుకోవచ్చో చూపించారు. ఏదీఏమైనా.. వయసురీత్యా మార్పులనేవి సహజం. వాటిని దాచే ప్రయత్నం కంటే..ఆరోగ్యదాయకమైన పద్ధతిలో తీసుకొస్తే..అటు అందం, ఇటు ఆరోగ్యాన్ని పదిలపరుచుకున్న వాళ్లమవుతామని తన చేతలతో చెప్పకనే చెప్పింది నటి ఖుష్బూ.
(చదవండి: ఎవరీ రేష్మా కేవల్‌రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..)