గంటల్లోనే వణుకుడు వ్యాధి మాయం..! | MR Guided Focused Ultrasound Treatment For Parkinsons Disease | Sakshi
Sakshi News home page

నలుగురిలో కలవనివ్వకుండా చేసే వ్యాధి.. ! గంటల్లోనే నయం అయిపోతుందట..

Apr 18 2025 9:16 AM | Updated on Apr 18 2025 10:00 AM

MR Guided Focused Ultrasound Treatment For Parkinsons Disease

చేతులు, కాళ్లు విప‌రీతంగా వ‌ణికిపోతూ.. మ‌న‌మీద మ‌న‌కే నియంత్ర‌ణ లేకుండా చేసే దారుణ‌మైన స‌మ‌స్య‌ ..పార్కిన్స‌న్స్ డిసీజ్‌. దాదాపు ఏడాది క్రితం వ‌ర‌కు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్ అనే ఒక శ‌స్త్రచికిత్స మాత్ర‌మే ఉండేది. కానీ వైద్య ప‌రిజ్ఞానం అభివృద్ధి చెంద‌డంతో ఇప్పుడు ఓ స‌రికొత్త చికిత్స వ‌చ్చింది. అదే.. ఎంఆర్ గైడెడ్ ఫోక‌స్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్‌జీఎఫ్‌యూఎస్). దీని సాయంతో.. కేవ‌లం మూడు నుంచి నాలుగు గంట‌ల్లోనే వ‌ణుకుడు స‌మ‌స్య పూర్తిగా మ‌టుమాయం అయిపోతుంద‌ని కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన వైద్య ప్ర‌ముఖులు చెబుతున్నారు. 

పార్కిన్స‌న్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ఈ స‌మ‌స్య, దాని ల‌క్ష‌ణాలు, ఉన్న చికిత్స అవ‌కాశాల గురించి ఒక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని కిమ్స్ హాస్పిటల్స్లోని మూవ్‌మెంట్ డిజార్డర్స్ బృందం డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ మూవ్‌మెంట్ డిజార్డర్ బృందం ఆధర్యంలో గురువారం నిర్వ‌హించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబ‌స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై.. త‌మ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో న్యూరోస‌ర్జ‌రీ విభాగాధిప‌తి, చీఫ్ న్యూరోస‌ర్జ‌న్‌ డాక్ట‌ర్ మాన‌స్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు.. “పార్కిన్స‌న్స్ డిసీజ్ అనేది మ‌నిషిని పూర్తిగా కుంగ‌దీసే స‌మ‌స్య‌. దీనివ‌ల్ల వ‌చ్చే శారీర‌క స‌మ‌స్య‌ల‌తో పాటు.. అవి ఉన్నాయ‌న్న బాధ వ‌ల్ల వ‌చ్చే మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా ఎక్కువే. ఇంత‌కాలం మందులు, డీబీఎస్ లాంటి శ‌స్త్రచికిత్స‌లు మాత్ర‌మే దీనికి ప‌రిష్కారంగా ఉండేవి. 

ఇప్పుడు చిన్న కోత కూడా అవ‌స‌రం లేకుండా కేవ‌లం ఎంఆర్ఐ యంత్రానికి మ‌రో ఫోక‌స్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమ‌ర్చి మూడు నాలుగు గంట‌ల పాటు చికిత్స చేస్తాం. ఇది పూర్త‌య్యి రోగి బ‌య‌ట‌కు రాగానే ఒక‌వైపు ఉన్న స‌మ‌స్య పూర్తిగా న‌యం అయిపోతుంది. అప్ప‌టివ‌ర‌కు ఉన్న వ‌ణుకు మ‌టుమాయం అవుతుంది. 

పైగా ఈ ప్ర‌క్రియ చేసేట‌ప్పుడే వ‌ణుకు త‌గ్గిందా లేదా అని చూసుకుంటూ ఉంటాం కాబ‌ట్టి... పూర్తిగా తగ్గిన త‌ర్వాతే చికిత్స పూర్త‌వుతుంది. అంతేకాదు గ‌తంలో డీబీఎస్ లాంటి శ‌స్త్రచికిత్స‌ల‌కు ఎంత వ్య‌యం అయ్యేదో.. దాదాపుగా దీనికి కూడా అంతే అవుతుంది. వ‌ణుకు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్న‌వారి నుంచి బాగా తీవ్రంగా ఉన్న‌వారి వ‌ర‌కు ఎవ‌రైనా ఈ చికిత్స చేయించుకోవ‌చ్చు. వారికి ఒక చిన్న ప‌రీక్ష చేసి, ఈ చికిత్స వారికి స‌రిపోతుందో లేదో నిర్ణ‌యిస్తాం. ఆ త‌ర్వాత చికిత్స చేయించుకుని.. హాయిగా ఎవ‌రి సాయం లేకుండా ఒక్క‌రే న‌డుచుకుంటూ వెళ్లిపోవ‌చ్చు” అని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మానికి నిర్వాహక కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించిన కిమ్స్ ఆస్ప‌త్రి క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్, మూమెంట్ డిజార్డ‌ర్ స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ ఎం జ‌య‌శ్రీ మాట్లాడుతూ, “ఎంఆర్‌జీ ఎఫ్‌యూఎస్ అనేది చాలా అత్యాధునిక‌మైన చికిత్స‌. ఇప్ప‌టికే కిమ్స్ ఆస్ప‌త్రిలో ఎనిమిది మంది రోగుల‌కు దీని సాయంతో చికిత్స చేసి స‌త్ప‌ఫ‌లితాలు సాధించాం. 

ఇందులో ఎలాంటి కోత అవ‌స‌రం లేకుండా ఎంఆర్ఐతోనే అల్ట్రాసౌండ్ త‌రంగాల‌ను పంపుతారు. పార్కిన్స‌న్స్ వ్యాధి వ‌ల్ల మెద‌డులో ప్ర‌భావిత‌మైన ప్రాంతాల‌ను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, వెంట‌నే చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్‌తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్న్ చేసి వణుకు తగ్గిందా లేదా అని చూస్తాం. త‌ర్వాత ఎక్కువ హీట్ తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుంది. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుంది. 

సాధార‌ణంగా పార్కిన్స‌న్స్ రోగుల‌కు ఒక‌వైపే (కుడి లేదా ఎడ‌మ‌) స‌మ‌స్య తీవ్రంగా ఉంటుంది. వ్యాధి త్రీవత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల  వారికి ఎక్కువ ప్ర‌యోజ‌నం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్స‌కు సుమారు 3-4 గంటల స‌మ‌యం ప‌డుతుంది. ఫ‌లితాలు మాత్రం వెంట‌నే క‌నిపిస్తాయి.

"ఓ  కేసులో 28 ఏళ్ల యువ‌కుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచ‌ర్ అవుదామ‌నుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన త‌ర్వాత ఇప్పుడు హాయిగా టీచ‌ర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలామందికి సాయ‌ప‌డుతున్నాడు. అలాంటి నాణ్య‌మైన జీవితాన్ని అంద‌రికీ ఇవ్వాల‌ని కిమ్స్ త‌హ‌త‌హ‌లాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాల‌జీ బృందం అత్యుత్త‌మ సేవ‌లు అందిస్తోంది. అందుకు వారికి అభినంద‌న‌లు” అని కిమ్స్ ఆస్ప‌త్రి సీఎండీ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు తెలిపారు.

చీఫ్ క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ ఎస్. మోహ‌న్ దాస్, క‌న్స‌ల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్. సీతా జయలక్ష్మి, డాక్ట‌ర్ ఈఏ వ‌ర‌ల‌క్ష్మి, డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ యాడా, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ సుభాష్ కౌల్, మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సంబిత్ సాహు, క‌న్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ గోపాల‌కృష్ణ త‌దిత‌రులు మాట్లాడారు. 

“సాధార‌ణంగా పార్కిన్స‌న్స్ వ్యాధిలో రెండు ర‌కాల స‌మ‌స్య‌లు ఉంటాయి. అవి మోటార్‌, నాన్ మోటార్‌. మోటార్ స‌మ‌స్య‌లు అంటే క‌ద‌లిక‌ల‌కు సంబంధించిన‌వి. వ‌ణుకు, గ‌ట్టిగా అయిపోవ‌డం, నెమ్మ‌దించ‌డం లాంటివి ఇందులో ప్ర‌ధానంగా ఉంటాయి. చేతులు, కాళ్లు విపరీతంగా వ‌ణుకుతుంటాయి. ఏవీ ప‌ట్టుకోలేరు, స‌రిగా న‌డ‌వ‌లేరు. న‌డ‌క‌మీద నియంత్ర‌ణ ఉండ‌దు. 

ఐదు నిమిషాల్లో అయిపోయే ప‌నికి 20 నిమిషాలు ప‌డుతుంది. ముఖంలో క‌ద‌లిక‌లు త‌గ్గిపోతాయి. ఇక నాన్ మోటార్ స‌మ‌స్య‌ల్లో నిద్ర లేక‌పోవ‌డం, మూత్ర‌విస‌ర్జ‌న‌పై నియంత్ర‌ణ లేక‌పోవ‌డం, మ‌ల‌బ‌ద్ధ‌కం, మాన‌సిక స‌మ‌స్య‌లు, వాస‌న లేక‌పోవ‌డం లాంటి వాటితో పాటు.. శ‌రీరం బ్యాలెన్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల త‌ర‌చు ప‌డిపోయి గాయ‌ప‌డ‌తారు. ఈ స‌మ‌స్యల వ‌ల్ల వాళ్లు న‌లుగురితో క‌ల‌వ‌లేక ఒంట‌రిగా మిగిలిపోతారు. పెళ్లిళ్లు, ఇత‌ర ఫంక్ష‌న్ల‌కు వెళ్లలేరు. విప‌రీత‌మైన కుంగుబాటు ఉంటుంది. ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నీ పార్కిన్స‌న్స్ వ‌ల్ల అద‌నంగా వ‌స్తాయి.

(చదవండి:  శిల్పారామంలో..సమ్మర్‌ ఆర్ట్‌ క్యాంపు..   )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement