
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. లాలూ ప్రసాద్ వీపు, చేతులపై పుండ్లు పడినట్లు సమాచారం. దీంతో బుధవారం రాత్రి ఆయన్ని కార్డియో క్రిటికల్ కేర్ యూనిట్(CCU)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
వైద్య బృందం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లాలూ వెంట ఆయన సతీమణి రబ్రీదేవి ఉన్నారు. వాస్తవానికి.. బుధవారం ఆయన ఢిల్లీకి బయలుదేరినప్పటికీ.. విమానాశ్రయానికి చేరుకోగానే ఒక్కసారిగా రక్తపోటులో తేడా కనిపించింది. దీంతో వెంటనే పాట్నాలోని పరాస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న అనంతరం ఢిల్లీ తరలించారు.
లాలూ ఆరోగ్యంపై ఆయన తనయుడు, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. పరాస్ ఆసుపత్రి నుంచి లాలూను తొలుత ఎయిర్ అంబులెన్స్‌లో ఎయిమ్స్‌కు తరలించాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రయాణికుల విమానంలో వెళ్తానని చెప్పడంతో తీసుకెళ్లినట్లు చెప్పారు. తన తండ్రి చాలా ధైర్యవంతుడన్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని తేజస్వి అంటున్నారు.
76 ఏళ్ల చాలా ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతుండడంతో ఇప్పటికే గుండె, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గత ఏడాది జూలైలో ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొంది కోలుకున్నారు.