
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు గురువారం అపోలో ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా బుధవారం సాయంత్రం అనారోగ్యానికి గురైన ఆయనను.. కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో నేడు డిశ్చార్జ్ అయ్యారు.
అయితే వారం రోజుల వ్యవధిలోనే 96 ఏళ్ల అద్వానీ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం రెండోసారి. గత నెల 26న వృద్ధాప్యం కారణంగా యూరాలజీ సంబంధిత సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత కోలుకున్న ఆయనను డిశ్చార్జ్ చేశారు. మళ్లీ అద్వానీ ఆస్వస్థకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు.
కాగా ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు అద్వానీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అయితే అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది.