Ultrasound
-
గంటల్లోనే వణుకుడు వ్యాధి మాయం..!
చేతులు, కాళ్లు విపరీతంగా వణికిపోతూ.. మనమీద మనకే నియంత్రణ లేకుండా చేసే దారుణమైన సమస్య ..పార్కిన్సన్స్ డిసీజ్. దాదాపు ఏడాది క్రితం వరకు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక శస్త్రచికిత్స మాత్రమే ఉండేది. కానీ వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఓ సరికొత్త చికిత్స వచ్చింది. అదే.. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్జీఎఫ్యూఎస్). దీని సాయంతో.. కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా మటుమాయం అయిపోతుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్య ప్రముఖులు చెబుతున్నారు. పార్కిన్సన్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబసభ్యులకు ఈ సమస్య, దాని లక్షణాలు, ఉన్న చికిత్స అవకాశాల గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్స్‌లోని మూవ్మెంట్ డిజార్డర్స్ బృందం డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ మూవ్మెంట్ డిజార్డర్ బృందం ఆధర్యంలో గురువారం నిర్వహించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై.. తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగాధిపతి, చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు.. “పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనిషిని పూర్తిగా కుంగదీసే సమస్య. దీనివల్ల వచ్చే శారీరక సమస్యలతో పాటు.. అవి ఉన్నాయన్న బాధ వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా ఎక్కువే. ఇంతకాలం మందులు, డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు మాత్రమే దీనికి పరిష్కారంగా ఉండేవి. ఇప్పుడు చిన్న కోత కూడా అవసరం లేకుండా కేవలం ఎంఆర్ఐ యంత్రానికి మరో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమర్చి మూడు నాలుగు గంటల పాటు చికిత్స చేస్తాం. ఇది పూర్తయ్యి రోగి బయటకు రాగానే ఒకవైపు ఉన్న సమస్య పూర్తిగా నయం అయిపోతుంది. అప్పటివరకు ఉన్న వణుకు మటుమాయం అవుతుంది. పైగా ఈ ప్రక్రియ చేసేటప్పుడే వణుకు తగ్గిందా లేదా అని చూసుకుంటూ ఉంటాం కాబట్టి... పూర్తిగా తగ్గిన తర్వాతే చికిత్స పూర్తవుతుంది. అంతేకాదు గతంలో డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలకు ఎంత వ్యయం అయ్యేదో.. దాదాపుగా దీనికి కూడా అంతే అవుతుంది. వణుకు ప్రాథమిక దశలో ఉన్నవారి నుంచి బాగా తీవ్రంగా ఉన్నవారి వరకు ఎవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. వారికి ఒక చిన్న పరీక్ష చేసి, ఈ చికిత్స వారికి సరిపోతుందో లేదో నిర్ణయిస్తాం. ఆ తర్వాత చికిత్స చేయించుకుని.. హాయిగా ఎవరి సాయం లేకుండా ఒక్కరే నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు” అని తెలిపారు.ఈ కార్యక్రమానికి నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించిన కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం జయశ్రీ మాట్లాడుతూ, “ఎంఆర్జీ ఎఫ్యూఎస్ అనేది చాలా అత్యాధునికమైన చికిత్స. ఇప్పటికే కిమ్స్ ఆస్పత్రిలో ఎనిమిది మంది రోగులకు దీని సాయంతో చికిత్స చేసి సత్పఫలితాలు సాధించాం. ఇందులో ఎలాంటి కోత అవసరం లేకుండా ఎంఆర్ఐతోనే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపుతారు. పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులో ప్రభావితమైన ప్రాంతాలను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, వెంటనే చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్‌తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్న్ చేసి వణుకు తగ్గిందా లేదా అని చూస్తాం. తర్వాత ఎక్కువ హీట్ తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుంది. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుంది. సాధారణంగా పార్కిన్సన్స్ రోగులకు ఒకవైపే (కుడి లేదా ఎడమ) సమస్య తీవ్రంగా ఉంటుంది. వ్యాధి త్రీవత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్సకు సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. ఫలితాలు మాత్రం వెంటనే కనిపిస్తాయి."ఓ కేసులో 28 ఏళ్ల యువకుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచర్ అవుదామనుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన తర్వాత ఇప్పుడు హాయిగా టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలామందికి సాయపడుతున్నాడు. అలాంటి నాణ్యమైన జీవితాన్ని అందరికీ ఇవ్వాలని కిమ్స్ తహతహలాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాలజీ బృందం అత్యుత్తమ సేవలు అందిస్తోంది. అందుకు వారికి అభినందనలు” అని కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు.చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్. మోహన్ దాస్, కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్. సీతా జయలక్ష్మి, డాక్టర్ ఈఏ వరలక్ష్మి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాడా, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ తదితరులు మాట్లాడారు. “సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో రెండు రకాల సమస్యలు ఉంటాయి. అవి మోటార్, నాన్ మోటార్. మోటార్ సమస్యలు అంటే కదలికలకు సంబంధించినవి. వణుకు, గట్టిగా అయిపోవడం, నెమ్మదించడం లాంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. చేతులు, కాళ్లు విపరీతంగా వణుకుతుంటాయి. ఏవీ పట్టుకోలేరు, సరిగా నడవలేరు. నడకమీద నియంత్రణ ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోయే పనికి 20 నిమిషాలు పడుతుంది. ముఖంలో కదలికలు తగ్గిపోతాయి. ఇక నాన్ మోటార్ సమస్యల్లో నిద్ర లేకపోవడం, మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం, మలబద్ధకం, మానసిక సమస్యలు, వాసన లేకపోవడం లాంటి వాటితో పాటు.. శరీరం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల తరచు పడిపోయి గాయపడతారు. ఈ సమస్యల వల్ల వాళ్లు నలుగురితో కలవలేక ఒంటరిగా మిగిలిపోతారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లలేరు. విపరీతమైన కుంగుబాటు ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ పార్కిన్సన్స్ వల్ల అదనంగా వస్తాయి.(చదవండి: శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు.. ) -
ఆరగింజండి... ఆరోగ్యంగా ఉండండి!
మధుమేహం రాకూడదని బలంగా కోరుకుంటున్నారా? అయితే... మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని అంటున్నారు డేనిష్ కేన్సర్ సొసైటీ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త సెసిలీ కైరో! కాకపోతే ఈ ఆహారం పూర్తి గింజలతో చేసినదై ఉండాలి. కొన్నిభాగాలను తొలగించి సిద్ధం చేసిన గోధుమ పిండి కాకుండా గోధుమలు మొత్తాన్ని మరపట్టిన దాన్నే వాడాలన్నమాట. గోధుమలతోపాటు ఇతర ఆహారం విషయంలోనూ ఈ పద్ధతిని పాటిస్తే మధుమేహం మాత్రమే కాకుండా కేన్సర్‌ను కూడా నిరోధించవచ్చునని సెసిలీ ఇటీవల నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. రోజుకు ఒకపూటైన ఇలాంటి ఆహారం తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశం 11 శాతం వరకూ తగ్గుతుందని అంచనా. డెన్మార్క్‌లోని 50 – 65 మధ్య వయస్కులు దాదాపు 55 వేల మంది వివరాలను పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని వీరిలో 7400 మంది మధుమేహులు ఉన్నారని సెసిలీ వివరించారు. దాదాపు 15 ఏళ్లపాటు జరిగిన ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ తాము ఏ రోజు ఏం తిన్నదీ రాసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలతోపాటు వారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా గింజధాన్యాలు పూర్తి స్థాయిలో ఆహారంగా తీసుకునే వారికి మధుమేహం, గుండెజబ్బులు, పేవు కేన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అల్ట్రాసౌండ్ ఇక చౌక అవుతుంది... గర్భస్థ శిశువులను పరిశీలించడం మొదలుకొని శరీరం లోపలి అవయవాలను పరిశీలించడం వరకూ ఉపయోగించే అల్ట్రాసౌండ్ పరికరం ఇకపై కారు చౌకగా లభ్యమవనుంది. ఎందుకంటారా? యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు ఈ పరికరంలోని అత్యంత కీలకమైన భాగం ఖర్చును గణనీయంగా తగ్గించేశారు. అల్ట్రాసౌండ్ పరికరంలో ఓ కంప్యూటర్‌తోపాటు దానికి అనుసంధానమైన ఒక చిన్న గాడ్జెట్ ఉంటుంది. ఈ గాడ్జెట్‌ను ప్రోబ్/ట్రాన్స్బ్యూసర్ అని పిలుస్తారు. సిలికాన్ రబ్బర్‌తో తయారవుతుంది ఇది. శరీరం లోపలి భాగాల చిత్రాలను తీసేందుకు ఈ ప్రొబ్లో ఇప్పటివరకూ పీజో ఎలక్ట్రిక్ స్ఫటికాలను వాడుతున్నారు. సిలికాన్‌తోపాటు వీటి తయారీ కోసం ప్రత్యేకమైన పరికరాలు, ఏర్పాట్లు అవసరం. దీనివల్ల వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు పీజో ఎలక్ట్రిక్ స్ఫటికాలకు సాధారణ ప్లాస్టిక్ జిగురుతో ఓ ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారు. అతితక్కువ దశల్లో తయారు చేయగల ఈ ప్రత్యామ్నాయాల కారణంగా ప్రోబ్ ఖరీదు గణనీయంగా తగ్గిపోనుంది. అంతేకాదు. సంప్రదాయ ప్రోబ్ కంటే ఎంతో స్పష్టమైన చిత్రాలు ఈ కొత్త ప్రోబ్ ద్వారా లభిస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కార్లోస్ గెరార్డో తెలిపారు. కేవలం పది వోల్టుల విద్యుత్తుతోనే పనిచేస్తుంది కాబట్టి ఈ కొత్త ట్రాన్స్‌డ్యూసర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కూడా పనిచేయించవచ్చునని వివరించారు. ట్రాన్స్డ్యూసర్ల సైజు మరింత తగ్గిస్తే రక్తనాళాల్లోపల ఏం జరుగుతోందో కూడా తెలుసుకునే స్థాయికి అల్ట్రాసౌండ్ పరికరాలను చేర్చవచ్చునని వివరించారు. సముద్రపు మొక్కలతో కడుపు చల్లగా... పేవుల్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువైతే ఆరోగ్యానికి ఎంతో మేలని ఈ మధ్యకాలంలో జరిగిన అనేక పరిశోధనలు రుజువు చేశాయి. అయితే ఈ రకమైన బ్యాక్టీరియాను పెంచుకుంటూ చెడు బ్యాక్టీరియాను తొలగించుకోవడం ఎలా అన్న అంశంపై మాత్రం ఇప్పటివరకూ ఓ స్పష్టత లేదు. ఈ లోటును భర్తీ చేశారు స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. సముద్రాల్లో పెరిగే ఒక రకమైన మొక్కలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మంచి బ్యాక్టీరియాను పెంచుకోవచ్చునని వీరు అంటున్నారు. పుట్టినప్పటి నుంచి వయసు పెరిగే కొద్దీ మన పేవుల్లోకి రకరకాల బ్యాక్టీరియా చేరుతూనే ఉంటుందని, నియంత్రణ లేకపోవడం వల్ల చెడు చేసేవి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జస్టిన్ సోన్నెన్బర్గ్ తెలిపారు.ఈ సమస్యను అధిగమించేందుకు తాము చేసిన ప్రయత్నంలో పోర్ఫైరాన్ అనే కార్బోహైడ్రేట్‌ను ఆరగించే బ్యాక్టీరియాను గుర్తించామని తెలిపారు. సముద్రపు మొక్కల్లో కనిపించే పోర్ఫైరాన్ను ఆరగించే బ్యాక్టీరియా ఎక్కువైన కొద్దీ ఎలుకల పేవుల్లో చెడు బ్యాక్టీరియా సంతతి తగ్గినట్లు గుర్తించామనన్నారు. ఆహారం ద్వారా పేవుల్లోని బ్యాక్టీరియాను నియంత్రించేందుకు ఇదో పద్ధతి అవుతుందని.. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు సమర్థమైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని జస్టిన్ తెలిపారు. -
అల్ట్రాసౌండ్ స్కానర్‌తోనే సీటీ, ఎంఆర్ఐ
ఇప్పటివరకు ఉన్న అల్ట్రాసౌండ్ స్కానర్ల గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఉన్నవన్నీ 2డీ స్కానర్లే. గర్భంలోని శిశువు, గుండె, ఇతర అవయవాల త్రీడీ చిత్రాలతో వైద్య రంగంలో ఎన్నో ఉపయోగాలున్న విషయం తెలిసిందే. కాకపోతే వీటి ఖరీదెక్కువ. తాజాగా దాదాపు కోటిన్నర రూపాయలు విలువ చేసే త్రీడీ అల్ట్రాసౌండ్ యం త్రం లక్షల్లో వచ్చేలా చేశారు డ్యూక్, స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు. ఇందుకు మన స్మార్ట్ఫోన్లలో ఉండే యాక్సెలరోమీటర్ సాయం తీసుకున్నారు. ఫోన్ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వెయ్యి రూపాయలు ఖరీదు చేసే మైక్రోప్రాసెసర్‌తో దీన్ని 2డీ అల్ట్రాసౌండ్ ప్రోబ్‌కు అనుసంధానించడం ద్వారా త్రీడీ ఇమేజింగ్ చేయగలిగామని, ఇది సీటీ స్కాన్, ఎంఆర్‌ఐలకు ఏమాత్రం తీసిపోదని జోషువా బ్రూడర్ అనే శాస్త్రవేత్త వివరించారు. ‘మా అబ్బాయి వీడియే గేమ్స్ ఆడుతుంటే దాని కం ట్రోలర్ నన్ను ఆకట్టుకుంది. కన్సోల్ స్థానాన్ని కచ్చితంగా గుర్తుపట్టే సామర్థ్యాన్ని 2డీ అల్ట్రాసౌండ్కు అందించాలన్న ఆలోచనతో మా ప్రాజెక్టు మొదలైంది’అని ఆయన పేర్కొన్నారు. 2డీ అల్ట్రాసౌండ్ ప్రోబ్‌కు ఓ ప్లాస్టిక్ ఉపకరణాన్ని అనుసంధానిస్తే, అందులోని మైక్రో ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుందని చెప్పారు. -
అల్ట్రాసౌండ్ స్కాన్ లో భూతం?!
యూకే : అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఓ భూతం ఉన్నట్లు కనిపిస్తే? కడుపులో ఉన్న శిశువును ఆ భూతం తదేకంగా గుడ్లు మిటకరించి చూస్తున్నట్లు అనిపిస్తే? వామ్మో.. ఓరి దేవుడో.. అని అరవాలనిపిస్తుంది కదూ. సరిగ్గా అలాంటి ఓ అల్ట్రాసౌండ్ స్కాన్ కాపీ జనాలకి పిచ్చెక్కించింది. దాదాపు పది లక్షల మంది ఆ స్కాన్ కాపీని చూసి ఆలోచనలో పడ్డారు. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో భూతాలు,దుష్ట శక్తులు వంటి వాటి గురించి మాట్లాడేందుకు కూడా కొంతమంది ఇష్టపడరు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు వార్తల్లోకి రాకుండా ఉండవు. 8 నుంచి 10 వారాల గర్భవతికి చెందిన అల్ట్రాసౌండ్ స్కాన్ కాపీలో శిశువును చూస్తున్నట్లుగా ఓ వింత ఆకారం కనిపించడం అనుమానాలకు దారితీసింది. గుండ్రటి ముఖం, నల్లటి కళ్లు,తలపైన చిన్న కొమ్ములాంటి భాగాలతో ఉన్న ఓ వింత ఆకారం గర్భంలోని శిశువును గమనిస్తున్నట్లుగా ఉంది. యూకేలో కొన్ని నెలల క్రితం పలువురిని విస్మయపరిచిన ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ కాపీని 2015కు సంబంధించి ఎంపికైన ఉత్తమ పోస్ట్‌ల్లో ఒకటిగా వర్ణిస్తూ ఓ ప్రముఖ వెబ్సైట్ మూడు రోజుల క్రితం పోస్ట్ చేసింది.అంతే.. ఆ స్కాన్‌కు సంబంధించి బోలెడన్ని కామెంట్లు, ఆనక చర్చలు జరిగాయి. అంతా జరిగాక కూడా అసలు విషయమేంటో తేల్చలేకపోయారు. కొందరు భూతం అంటారు, ఇంకొందరు దేవత అంటారు, మరికొందరు అసలక్కడ ఏదీ లేదంటూ కొట్టిపారేస్తారు.ఇక ఆ స్కాన్ సెంటర్లోని ఉద్యోగులైతే ఈ విషయంపై నోరుమెదిపితే ఒట్టు. మొత్తానికి ఆ శిశువు మాత్రం ప్రసవ సమయానికి రెండు నెలల ముందే ప్రపంచాన్ని చూసేశాడు.మరి ఆ వింత ఆకారం సంగతేంటంటారా.. మీకేమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్.. -
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
కడుపులో విపరీతమైన నొప్పి, మంట! నా వయసు 40 ఏళ్లు. గత నెలరోజులుగా కడుపులో మంట, నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. పరీక్షల్లో కడుపులో చిన్న పుండు ఉంది అని తేలింది. అల్ట్రాసౌండ్‌లో పిత్తాశయంలో రాయి ఉన్నట్లుగా వచ్చింది. ఈ సమస్య మందులతో తగ్గుతుందా, ఆపరేషన్ అవసరమా? - సుధీర్‌కుమార్, వరంగల్ సాధారణంగా వయసు పెరిగేకొద్దీ పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్‌లో) రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నంతమాత్రాన ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రాళ్ల వల్ల తరచూ నొప్పి వస్తుంటే అప్పుడు గాల్‌బ్లాడర్‌ను తొలగించాల్సి ఉంటుంది. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీరు యాసిడ్ పెప్టిక్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీకు వచ్చే నొప్పి పిత్తాశయానికి సంబంధించినది కాదు. కాబట్టి మీరు భయపడాల్సిందేమీ లేదు. ఒకసారి వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఆర్నెల్ల నుంచి మలవిసర్జనలో మార్పు కనిపిస్తోంది. మలవిసర్జనకు ముందు రక్తం పడుతోంది. ఆకలి కూడా బాగా తగ్గింది. మలవిసర్జనకు వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? - శంకర్, సంగారెడ్డి మలవిసర్జనకు ముందు రక్తం పడటానికి చాలా కారణాలు ఉంటాయి. హెమరాయిడ్స్ (పైల్స్) అంటే మొలలు, పెద్దపేగుల్లో కణితులు, క్యాన్సర్ కణితులు, పుండ్లు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్‌లో ఇలా రక్తం పడటం కనిపిస్తుంది. మీ వయసునూ, ఆకలి మందగించడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటే మీరు పెద్దపేగుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారనిపిస్తోంది. మలవిసర్జనలో మార్పు కనిపిస్తోందని రాశారుగానీ, అది ఏ రకమైన మార్పు అన్నది రాయలేదు. పెద్దపేగుల్లో కణితులు ఉంటే మొదట మల విసర్జన ప్రక్రియలో తేడా వస్తుంది. రానురానుపూర్తిగా మలవిసర్జన కష్టమవుతుంది. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోండి. దీని వల్ల రక్తం పడటానికి కారణం తెలుస్తుంది. దాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ పి. భవానీ రాజు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్