మధుమేహం రాకూడదని బలంగా కోరుకుంటున్నారా? అయితే... మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని అంటున్నారు డేనిష్ కేన్సర్ సొసైటీ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త సెసిలీ కైరో! కాకపోతే ఈ ఆహారం పూర్తి గింజలతో చేసినదై ఉండాలి. కొన్నిభాగాలను తొలగించి సిద్ధం చేసిన గోధుమ పిండి కాకుండా గోధుమలు మొత్తాన్ని మరపట్టిన దాన్నే వాడాలన్నమాట. గోధుమలతోపాటు ఇతర ఆహారం విషయంలోనూ ఈ పద్ధతిని పాటిస్తే మధుమేహం మాత్రమే కాకుండా కేన్సర్‌ను కూడా నిరోధించవచ్చునని సెసిలీ ఇటీవల నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేస్తోంది.
రోజుకు ఒకపూటైన ఇలాంటి ఆహారం తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశం 11 శాతం వరకూ తగ్గుతుందని అంచనా. డెన్మార్క్‌లోని 50 – 65 మధ్య వయస్కులు దాదాపు 55 వేల మంది వివరాలను పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని వీరిలో 7400 మంది మధుమేహులు ఉన్నారని సెసిలీ వివరించారు. దాదాపు 15 ఏళ్లపాటు జరిగిన ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ తాము ఏ రోజు ఏం తిన్నదీ రాసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలతోపాటు వారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా గింజధాన్యాలు పూర్తి స్థాయిలో ఆహారంగా తీసుకునే వారికి మధుమేహం, గుండెజబ్బులు, పేవు కేన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
అల్ట్రాసౌండ్ ఇక చౌక అవుతుంది...
గర్భస్థ శిశువులను పరిశీలించడం మొదలుకొని శరీరం లోపలి అవయవాలను పరిశీలించడం వరకూ ఉపయోగించే అల్ట్రాసౌండ్ పరికరం ఇకపై కారు చౌకగా లభ్యమవనుంది. ఎందుకంటారా? యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు ఈ పరికరంలోని అత్యంత కీలకమైన భాగం ఖర్చును గణనీయంగా తగ్గించేశారు. అల్ట్రాసౌండ్ పరికరంలో ఓ కంప్యూటర్‌తోపాటు దానికి అనుసంధానమైన ఒక చిన్న గాడ్జెట్ ఉంటుంది. ఈ గాడ్జెట్‌ను ప్రోబ్/ట్రాన్స్‌బ్యూసర్ అని పిలుస్తారు. సిలికాన్ రబ్బర్‌తో తయారవుతుంది ఇది. శరీరం లోపలి భాగాల చిత్రాలను తీసేందుకు ఈ ప్రొబ్‌లో ఇప్పటివరకూ పీజో ఎలక్ట్రిక్ స్ఫటికాలను వాడుతున్నారు.
సిలికాన్‌తోపాటు వీటి తయారీ కోసం ప్రత్యేకమైన పరికరాలు, ఏర్పాట్లు అవసరం. దీనివల్ల వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు పీజో ఎలక్ట్రిక్ స్ఫటికాలకు సాధారణ ప్లాస్టిక్ జిగురుతో ఓ ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారు. అతితక్కువ దశల్లో తయారు చేయగల ఈ ప్రత్యామ్నాయాల కారణంగా ప్రోబ్ ఖరీదు గణనీయంగా తగ్గిపోనుంది. అంతేకాదు. సంప్రదాయ ప్రోబ్ కంటే ఎంతో స్పష్టమైన చిత్రాలు ఈ కొత్త ప్రోబ్ ద్వారా లభిస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కార్లోస్ గెరార్డో తెలిపారు. కేవలం పది వోల్టుల విద్యుత్తుతోనే పనిచేస్తుంది కాబట్టి ఈ కొత్త ట్రాన్స్‌డ్యూసర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కూడా పనిచేయించవచ్చునని వివరించారు. ట్రాన్స్‌డ్యూసర్ల సైజు మరింత తగ్గిస్తే రక్తనాళాల్లోపల ఏం జరుగుతోందో కూడా తెలుసుకునే స్థాయికి అల్ట్రాసౌండ్ పరికరాలను చేర్చవచ్చునని వివరించారు.
సముద్రపు మొక్కలతో కడుపు చల్లగా...
పేవుల్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువైతే ఆరోగ్యానికి ఎంతో మేలని ఈ మధ్యకాలంలో జరిగిన అనేక పరిశోధనలు రుజువు చేశాయి. అయితే ఈ రకమైన బ్యాక్టీరియాను పెంచుకుంటూ చెడు బ్యాక్టీరియాను తొలగించుకోవడం ఎలా అన్న అంశంపై మాత్రం ఇప్పటివరకూ ఓ స్పష్టత లేదు. ఈ లోటును భర్తీ చేశారు స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. సముద్రాల్లో పెరిగే ఒక రకమైన మొక్కలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మంచి బ్యాక్టీరియాను పెంచుకోవచ్చునని వీరు అంటున్నారు.
పుట్టినప్పటి నుంచి వయసు పెరిగే కొద్దీ మన పేవుల్లోకి రకరకాల బ్యాక్టీరియా చేరుతూనే ఉంటుందని, నియంత్రణ లేకపోవడం వల్ల చెడు చేసేవి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జస్టిన్ సోన్నెన్‌బర్గ్ తెలిపారు.ఈ సమస్యను అధిగమించేందుకు తాము చేసిన ప్రయత్నంలో పోర్‌ఫైరాన్ అనే కార్బోహైడ్రేట్‌ను ఆరగించే బ్యాక్టీరియాను గుర్తించామని తెలిపారు. సముద్రపు మొక్కల్లో కనిపించే పోర్‌ఫైరాన్‌ను ఆరగించే బ్యాక్టీరియా ఎక్కువైన కొద్దీ ఎలుకల పేవుల్లో చెడు బ్యాక్టీరియా సంతతి తగ్గినట్లు గుర్తించామనన్నారు. ఆహారం ద్వారా పేవుల్లోని బ్యాక్టీరియాను నియంత్రించేందుకు ఇదో పద్ధతి అవుతుందని.. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు సమర్థమైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని జస్టిన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment