1.66 కోట్ల మందికి పరీక్షలు
22.94 లక్షల మందికి బీపీ ... 11.9 లక్షల మందికి షుగర్
ఎన్‌సీడీపై ప్రభుత్వ సర్వే ఫలితాలపై ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా రక్తపోటు, మధుమేహంలాంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలో వచి్చన మార్పులు, ఒత్తిళ్ల నేపథ్యంలో గ్రామాల్లో కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఎన్‌సీడీ వ్యాధులపై ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఇతర అధికారులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వివరించారు.
30 సంవత్సరాల వయస్సు దాటిన 1.66 కోట్ల మందికి పరీక్షలు జరపగా, 22.94 లక్షల మందికి రక్తపోటు, 11.9 లక్షల మందికి మధుమేహం ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. కోఠీలోని టీజీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో గురువారం మంత్రి రాజనర్సింహతో జరిగిన ఈ సమావేశంలో సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానాలలో ఏర్పాటు చేసిన ఎన్‌సీడీ క్లినిక్‌లకు బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లలో అందుతున్న వైద్య సేవలపై రోగులకు అవగాహన కల్పించాలన్నారు.
గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా పేషెంట్ల జాబితాను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. రోగులు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూడాలని సూచించారు. బీపీ, షుగర్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్‌సీడీ సర్వేను కొనసాగించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment