Hypertension
-
సైలెంట్ కిల్లర్‌పై హై అలెర్ట్
ఏటా మే నెల 17వ తేదీన ప్రపంచ హైపర్‌టెన్షన్ డే నిర్వహిస్తారు. 2005వ సంవత్సరంలో ఇది ప్రారంభం అయింది. మనకు తెలియకుండానే మన మనసును కుంగదీసే ఈ అధిక ఒత్తిడి, దాని ద్వారా వచ్చే అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించి దానిని తరిమికొట్టడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. కాగా ‘మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, నియంత్రిం చండి, ఎక్కువ కాలం జీవించండి’ అనే నినాదంతో ఈ ఏడాది హైపర్ టెన్షన్ డేను నిర్వహిస్తున్నారు. సాక్షి, అమరావతి: అత్యధికశాతం గుండెపోటు మరణాలకు, మెదడు, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్న రక్తపోటును (హైపర్‌టెన్షన్) సైలెంట్ కిల్లర్‌గానూ పిలుస్తుంటారు. జీవనశైలికి సంబంధించిన ఈ సమస్య ఒకప్పుడు మధ్యవయస్సు వారు, వృద్ధుల్లో అధికంగా ఉండేది. జంక్‌ఫుడ్, శ్రమ లేని జీవనశైలి, తగినంత వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి వెరసి యువత, పిల్లలు సైతం ప్రస్తుతం ఈ సమస్య బారినపడుతున్నారు. చాపకింద నీరులా శరీరానికి ముప్పు తెచ్చిపెడుతున్న హైపర్‌టెన్షన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 27.15 శాతం మంది రాష్ట్రంలో 1.96 కోట్ల మంది 30 ఏళ్లు పైబడిన జనాభా ఉంది. కాగా, వీరిలో 27.15 శాతం 53.39 లక్షల మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే–5లో అంచనా వేశారు. కాగా, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 30 ఏళ్లు పైబడిన వారందరినీ స్క్రీనింగ్ చేసిన వైద్య శాఖ ఇప్పటి వరకు 23.50 లక్షల మందిలో సమస్యను గుర్తించింది. వీరందరికీ ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వ్యవస్థల ద్వారా క్రమం తప్పకుండా వైద్య పరీక్షల నిర్వహణ, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. కళ్ల నుంచి కాళ్ల వరకూ.. పైకి ఎలాంటి లక్షణాలు లేకుండానే లోలోపల తీవ్ర అనర్థాలకు హైపర్‌టెన్షన్ దారితీస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు మూలంగా కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కంటి చూపు మందగిస్తుంది. గుండె మరింత బలంగా పనిచేయాల్సి రావడంతో గుండె పరిమాణంలో మార్పులు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతో శరీరానికి తగినంత రక్తం సరఫరా అవ్వక గుండె వైఫల్యంకు దారి తీస్తుంది. మెదడులోని రక్తనాళాలు దెబ్బతినడం, బలహీనపడడం, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి పక్షవాతం వంటి ఘటనలు సంభవిస్తాయి. మూత్రపిండాల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినడంతో రక్తాన్ని వడపోసే ప్రక్రియ అస్తవ్యస్తమై, చివరికిది కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. బీపీ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు » ఆహారంలో ఉప్పును తగ్గించాలి. నిల్వ పచ్చళ్లు ఎక్కువగా తినకూడదు. పెరుగు, మజ్జిగలో ఉప్పు కలుపుకోవడం మానేయాలి. » శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ఒక కిలో బరువు తగ్గినా ఒక ఎంఎంహెచ్‌జీ రక్తపోటు తగ్గుతుంది. » రోజు అరగంట చొప్పున శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇతర వ్యాయామం చేస్తుండాలి. » ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు పూర్తిగా విడనాడాలి. పొగతాగడంతో రక్తనాళాలు గట్టిపడే ప్రక్రియ ఎక్కువ అవుతుంది. అదే విధంగా మద్యపానం చేసేవారు 60 ఎంఎల్ కన్నా మించకుండా చూసుకోవాలి. ఒత్తిడే ప్రధాన కారణం బీపీ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి వయోభారం రీత్యా, రెండోది షుగర్, థైరాయిడ్, కిడ్నీ సమస్యల కారణంగా వస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో, యువతి, యువకుల్లోను బీపీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇంటర్, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ చదివే పిల్లల్లోను ఎక్కువగా బీపీ మేం గమనిస్తున్నాం. ఇందుకు ప్రధాన కారణం ఒత్తిడి. అదే విధంగా పిజ్జా, బర్గర్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌ను పిల్లలు, యువత ఎక్కువగా తీసుకోవడం. వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటోంది. ఎప్పటికప్పుడు అందరూ బీపీ చెక్ చేయించుకోవాలి. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపాల్ సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ ఏటా చెకప్ చేయించుకోవాలి ఎటువంటి లక్షణాలు లేకున్నా బీపీ వస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఏటా రక్తపోటు చెకప్ చేయించుకోవాలి. చాపకింద నీరులా విస్తరిస్తూ ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తోంది. అదే విధంగా ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ లెవల్ టెస్ట్ చేసుకోవాలి. కొలె్రస్టాల్ గుండెపోటుకు దారితీస్తుంది. మరోవైపు ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా కంటి నిండా నిద్రపోవాలి. – కె.కళ్యాణ చక్రవర్తి, జనరల్ ఫిజిషియన్, గుంటూరు -
లయ తప్పుతున్న గుండె
సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాట.. ‘హార్ట్ ప్రాబ్లమ్’. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనం వెరసి గుండె జబ్బులు ఏటా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం గుండె పోటుతో మరణిస్తున్నారు. దేశంలో ఏటా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 27 శాతం గుండె జబ్బుల వల్లేనని తేలింది. దీంతో ‘గుండె ఘోష’ను ముందే పసిగట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురైతే తాత్సారం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారంతా గుండె జబ్బులేనని నిర్ధారణకు రాకుండా.. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ, ఈసీసీ రాష్ట్రంలో ఏటా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారందరికీ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. 2019–20వ సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కార్డియాలజీ, కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో 59,700 చికిత్సలు జరిగాయి. 2022–23 నాటికి ఈ చికిత్సల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. అలాగే 2023–24లో కూడా ఈ ఏడాది జనవరి నాటికి 84 వేల మందికి ప్రభుత్వం గుండె జబ్బులకు ఉచితంగా చికిత్సలు చేయించింది. ఏటా పెరుగుతున్న గుండె జబ్బులను పరిగణనలోకి తీసుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేందుకు ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్(ఈసీసీ) కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో సైతం ఛాతీనొప్పితో వచ్చే బాధితులకు ఈసీజీ తీసి, కార్డియాలజిస్ట్‌ల సూచనలతో థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్లు చేసి ప్రాణాపాయం నుంచి రక్షిస్తున్నారు. జీవన విధానం మారాలి» 40 ఏళ్లు దాటిన వారు, రిస్క్ ఫ్యాక్టర్స్(బీపీ, షుగర్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు) ఉన్నవారు తరచూ జనరల్ చెకప్ చేయించుకోవాలి.» రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి.» ఆకుకూరలు, చిరుధాన్యాలు, తాజా పళ్లు, కూరగాయలు, గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. » రెడ్ మీట్ తినడం తగ్గించాలి. జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.» ధూమపానం, మద్యపానం మానేయాలి.» శరీర బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి.» మానసిక ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం చేస్తుండాలి.మనం మారితేనే గుండె పదిలంగతంలో గుండె జబ్బులు వయసు పైబడిన వారికి లేదా వంశపారంపర్యంగా మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం అన్ని రకాల వయసు వారిలోనూ గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మారిన జీవన విధానమే.అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడికి లోనవ్వడం, శారీరక శ్రమ లేకుండా జీవించడం వంటి విధానాలను మనం వీడాలి. మనం మారినప్పుడే గుండె పదిలంగా ఉంటుంది. అలాగే గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇప్పటికే సమస్యలున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి, కర్నూలు జీజీహెచ్ -
హైపర్‌టెన్షన్‌కు కారణమేంటి? జీవనశైలిలో మార్పే పరిష్కారమా?
రక్తపోటు బాధితులు తరచూ తమ బీపీని చెక్ చేసుకుంటుండాలి. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మనం ఏదైనా వ్యాధితో బాధపడుతూ వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు ఆ వైద్యుడు ముందుగా మన రక్తపోటును పరీక్షిస్తారు. ప్రస్తుతం హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య దాదాపు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తున్నది.చాలా మంది అధిక రక్తపోటును సాధారణమైనదిగా తీసుకుంటారు. బహుశా ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలియకనే ఇలా చేస్తుంటారు. నిజానికి హైపర్‌టెన్షన్ అనేది ఒక ‘సైలెంట్ కిల్లర్’. ఇది అంతర్గతంగా శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది. రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మే 17 నుండి 25 వరకు ‘హైపర్‌టెన్షన్ వీక్’నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ హైపర్‌టెన్షన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపధ్యంలోనే హైపర్‌టెన్షన్ నుంచి బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎయిమ్స్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నదని పేర్కొన్నారు.పలు గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అస్తవ్యస్త జీవనశైలే దీనికి ప్రధాన కారణం. ఎయిమ్స్ సీసీఎం విభాగం హెచ్ఓడీ డాక్టర్ కిరణ్ గోస్వామి మాట్లాడుతూ నేటి కాలంలో యువతలో హైపర్‌టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నదని, 18 ఏళ్లలోపు పిల్లల్లో కూడా హైపర్‌టెన్షన్ సమస్య తలెత్తుతున్నదన్నారు.అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు ధూమపానం, పొగాకు వినియోగం, అధికంగా ఉప్పు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, వేయించిన ఆహారం, ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతోంది. అధిక రక్తపోటు నివారణకు ఆహారంలో పచ్చి కూరగాయలు, శుభ్రమైన పండ్లను చేర్చుకోవాలి. పొగాకు తీసుకోవడం మానివేయాలి. జీవనశైలిలో వ్యాయామం, శారీరక శ్రమలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీంతో అధిక రక్తపోటును నివారించవచ్చు. దీనితో పాటు 30 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ రక్తపోటును తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
ఓ మదీ మేలుకో..!
గుంటూరు మెడికల్: ఇంట్లో పిల్లలు అదే పనిగా వీడియోగేమ్స్ ఆడుతూ మిగతా పనులను పక్కన పెట్టేస్తున్నారా.. తదేకంగా గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయి ఉంటున్నారా.. అయితే వారిని ఓ కంట కనిపెట్టి ఉండాల్సిందే. లేకుంటే చిన్నవయస్సులోనే వారు మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని మానసిక వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చుని చాటింగ్‌లు చేయటం, ఫేస్బుక్లో తలమునకలవుతూ ఉండటం మానసిక వ్యాధులకు కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.సెల్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వినియోగం బాగా పెరగడం వల్ల మానసిక జబ్బులు ఎక్కువయ్యాయని ఈ–ఎడిక్షన్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. మానసిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా మే నెలను ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా 35 మంది మానసిక వైద్యనిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ 20 మంది వరకు వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడే వారు వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో రోజూ 100 నుంచి 130 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్నారు. మానసికవ్యాధి లక్షణాలు... చికాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పై బడి ఉంటే వారు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా తనొక్కడే ఉండి నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనిని పదేపదే చేయాలనుకోవటం, అనవసరమైన ఆలోచల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలోపం, బరువుపెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తనమీద ఆధారపడే వారందరిని ఇబ్బందికి గురిచేస్తూ తానూ ఇబ్బందులకు గురికావడం, ఎక్కువ సమయం పనిమీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేసే ధోరణిలో ఉండటం, తనకు హాని చేస్తున్నట్లు ఊహించుకుని తగాదాల వరకు వెళ్ళటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే యత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. హార్మోన్ల లోపమే కారణం ఒత్తిడి, వ్యసనాలు, మితిమీరిన సెల్‌ఫోన్, ఎల్రక్టానిక్ పరికరాల వినియోగం వల్ల ప్రస్తుతం మానసిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ జబ్బులు వంశపారంపర్యంగానూ అధికంగా వస్తుంటాయి. మెదడులో రసాయనాలు ఊరటంలో మార్పు, మెదడులో గడ్డలు ఏర్పటం, మెదడులో ‘డోపమిన్’ హార్మోన్ లోపం, హార్మోన్ అసమతుల్యం, అసమానత్వం, పుట్టుకతో మెదడు సరిగ్గా ఎదగకపోవటం, ఫిట్స్, నిద్రలేమి వల్ల కూడా మనో వ్యాధులు వస్తాయి. మానసిక వ్యాధులతో ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా బాధపడుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళనకు గురిచేసే విషయాలను పట్టించుకోకూడదు. మద్యం, పొగతాగటం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆరు నుంచి తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలి. కుటుంబ సభ్యులందరితో సమయం గడపాలి. రోజూ వ్యాయామం చేయాలి. మానసిక వ్యాధులకు అనేక ఆధునిక మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఇవటూరి శరత్చంద్ర, మానసిక వైద్య నిపుణులు సంఘం రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు పిల్లలు, పెద్దలు తేడా లేదు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ప్రస్తుతం మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్రమశిక్షణ లేని ఆధునిక జీవనశైలే దీనికి కారణం. ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే త్వరగా నయం చేసేందుకు అవకాశం ఉంది. మందులతోపాటుగా రోగులకు కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. వ్యాధి గ్రస్తులను కుటుంబ సభ్యుల పర్యవేక్షిస్తూ మందులు సక్రమంగా మింగేలా చేస్తే వ్యాధి నుంచి త్వరితగతిన బయటపడతారు. –డాక్టర్ ఐవీఎల్ నరసింహారావు, మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గుంటూరు నాలుగేళ్లుగా జీజీహెచ్‌లో మానసిక సమస్యలతో చికిత్స తీసుకున్న వారు ఇలా.. సంవత్సరం రోగుల సంఖ్య 2020 16,529 2021 22,726 2022 28,579 2023 29,371 2024 2,505జీజీహెచ్‌లో ఉచిత వైద్యం మానసిక వ్యాధులకు జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలను అందించటంతోపాటుగా మందులూ పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ 21 నబర్ ఓపీలో వైద్య సేవలు లభిస్తాయి. -
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
పతీ ఏడాది మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్తపోటు స్థాయి సాధారణ స్థాయి కంటే పెరగడాన్నే హైపర్‌టెన్షన్ అంటారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అధిక రక్తపోటు లేదా హై బీపీను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వచ్చిన సంగతి కూడా వ్యక్తులు కనిపెట్టలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో హైబీపీ లక్షణాలు, నివారణ మార్గాలను ఒకసారి పరిశీలిద్దాం.వరల్డ్ హైపర్‌టెన్షన్ డేను 85 జాతీయ రక్తపోటు సంఘాలు లీగ్‌లతో కూడిన వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ దీన్ని ప్రారంభించింది. హైపర్‌టెన్షన్‌పై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.హైపర్ టెన్షన్ లక్షణాలుసాధారణంగా హైబీపీ కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అయితే రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారు స్ట్రోక్, గుండె జబ్బులు , మూత్రపిండాల రుగ్మతలు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటారు. అధిక ఒత్తిడి రక్తపోటుకు దారితీయవచ్చు.తీవ్రమైన తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడంతల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందివికారం, వాంతులు అస్పష్టమైన దృష్టి లేదా ఇతర దృష్టి మార్పులుఆందోళన, గందరగోళంచెవుల్లో శబ్దాలు, ముక్కు రక్తస్రావం హైపర్ టెన్షన్ చికిత్స ఆహారంలో ఉప్పును బాగా తగ్గించడం శారీరకంగా చురుగా ఉండటంధూమపానం, మద్యపానాన్ని మానేయడంబరువు ఎక్కువగా ఉంటే తగ్గడంజాగ్రత్తలుకూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవడంగంటల తరబడి కూర్చోకుండా ఉండటంనడక, పరుగు, ఈత, డ్యాన్స్ లేదా బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలువారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ, లేదా వారానికి 75 నిమిషాల నడక ఉండాలి. ప్రతి వారం 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు వ్యాయామాలు చేయండి. తద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్య నిపుణులు సూచించిన మందులను తీసుకోవాలి. నోట్ : ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తపోటును ముందుగానే గుర్తిస్తే నియంత్రణ సాధ్యమవుతుంది. -
అటెన్షన్ ఉంటే..టెన్షన్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : పరీక్షల ఫోబియాతోనే ఇంటర్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సగానికి తగ్గుతోంది. హైటెన్షన్‌కు గురయ్యే విద్యార్థులు 36 శాతం ఉంటుండగా, పరీక్షల షెడ్యూల్ వచ్చాక టెన్షన్‌కు లోనయ్యేవారు 23 శాతం మంది ఉంటున్నారు. దీనికి సంబంధించి వైద్య, విద్యాశాఖలు రెండేళ్ల అధ్యయనం చేశాయి. మొదటి పరీక్ష కాస్త కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం ఫస్టియర్ పరీక్షలు 4.09 లక్షల మంది రాస్తున్నారు. సెకండియర్ పరీక్షలు 3.82 లక్షల మంది వరకూ రాస్తున్నారు. వీరిలో సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. దీంతో పరీక్షలు రాసే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల టెన్షన్ దూరం చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రిపరేషన్‌కు ఇదే అదును రెండు నెలల ముందు నుంచే పరీక్షలకు సన్నద్ధమైతే విద్యార్థుల్లో టెన్షన్ ఉండదని ఇంటర్ అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలనుకుంటున్నారు. ముందుగా విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తారు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వడానికి నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై లెక్చరర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులోనూ విద్యార్థి వెనుకబడి ఉన్న సబ్జెక్టులు, పాఠ్యాంశాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రిన్సిపల్స్‌కు ఇస్తారు. మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ఈ 60 రోజులూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో టెన్షన్ దూరం చేయడం తేలికని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పరీక్షల టైంటేబుల్‌ను బోర్డు విడుదల చేసింది. త్వరలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకునే చర్యలపైనా జిల్లా ఇంటర్ అధికారులు టైం టేబుల్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సిలబస్ సకాలంలో పూర్తికాకపోవడం కూడా విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్‌కు ఓ కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతుందని అధ్యయన నివేదికల సారాంశం. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకొని కొన్ని జిల్లాలపై ఇంటర్ అధికారులు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు కనబరుస్తున్న జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ వంటి జిల్లాలున్నాయి. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ముఖ్యాంశాలు... ♦ ప్రతీ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు – 7 లక్షలకుపైగా ♦ ఫెయిల్ అవుతున్న వారు – 2.5 లక్షల మంది ♦ పరీక్షల ఫోబియా వెంటాడుతున్న విద్యార్థులు – 1.02 లక్షల మంది ♦ పరీక్ష షెడ్యూల్ ఇవ్వగానే భయపడే వారు – 28 వేల మంది ♦ సిలబస్‌పై టెన్షన్ పడుతున్న విద్యార్థులు – 51 వేల మంది మానసిక ధైర్యం నింపాలి ఈ 60 రోజులూ లెక్చ రర్లది కీలకపాత్ర. పరీక్షల భయం ఉన్న వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. వెనుకబడ్డ సబ్జెక్టులపై రివిజన్ చేయించడం ఒక భాగమైతే, వీలైనంత వరకూ పరీక్ష తేలికగా ఉంటుందనే భావన ఏర్పడేలా చూడాలి. దీనివల్ల ఎగ్జామ్ ఫోబియా తగ్గుతుంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లిదండ్రులదీ కీలకపాత్రే పరీక్షల భయం వెంటాడే విద్యార్థి సైకాలజీని బట్టి అధ్యాపకులు వ్యవహ రించాలి. వారిని ప్రణాళిక బద్ధంగా చదివించే విధా నం అనుసరించాలి. సాధ్యమైనంత వరకూ పరీక్ష వెంటాడుతోందన్న భావనకు దూరం చేయాలి. చదివే ప్రతీ అంశం గుర్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా జాగ్రత్త పడాలి. పరీక్షల పట్ల భయం అనిపిస్తే నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పించాలి. – రావులపాటి సతీష్‌బాబు, మానసిక వైద్య నిపుణుడు స్టడీ అవర్స్ పెడుతున్నాం విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేందుకు 60 రోజుల పాటు ప్రత్యేక కార్య క్రమాలు చేపడుతున్నాం. వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, స్పెషల్ క్లాసులు నిర్వహించమని ఆదేశాలిచ్చాం. టెన్షన్ పడే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వమని ప్రిన్పిపల్స్కు చెప్పాం. అవసరమైతే టెలీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. – జయప్రదాబాయ్,ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి -
ఒబెసిటీ, హైబీపీ ఎక్కువే.. పన్నీర్, జంక్ ఫుడ్, నాన్ వెజ్ వల్ల..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీవనశైలి వ్యాధుల సూచికల్లో తెలంగాణ పరిస్థితి అత్యంత పేలవంగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. అలాగే స్థూలకాయం, రక్తపోటు కేసుల సంఖ్య సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ‘మెటబాలిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్ ఐఎన్‌డీఐఏబీ) పేరిట లాన్సెట్ రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 25 శాతం మంది సెంట్రల్ ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 మధ్య మొత్తం 1,13,043 మంది (గ్రామీణ ప్రాంతాల నుంచి 79,506 పట్టణ ప్రాంతాల నుంచి 33,537 మంది)పై నిర్వహించిన అధ్యయన ఫలితాలను లాన్సెట్ ఇటీవల ప్రచురించింది. ఊబకాయం కేసులలో తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హరియాణా, ఢిల్లీల సరసన నిలుస్తోంది. దీనికి కారణం ఉదర ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్‌కు మధ్య దగ్గరి సంబంధం ఉండటమేనని వైద్య నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం.. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం.. లాన్సెట్ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఊబకాయం, రక్తపోటు, ట్రైగ్లిజరిడెమియా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ‘ఇది తక్కువస్థాయి శారీరక శ్రమతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల పెరుగుతున్న సమస్య. ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగులను ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ సంకేతాలు. చికిత్స తీసుకోకుంటే గుండె, మూత్రపిండాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరించారు. హైపర్ టెన్షన్... స్లీప్ అప్నియాలకూ దోహదం.. ‘పన్నీర్, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధికస్థాయి కొలస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు డెస్క్ జాబ్‌లు సెంట్రల్ ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఊబకాయంతో గుండె జబ్బులు, మధుమేహమే కాకుండా హైబీపీ, స్లీప్ యాప్నియా వంటి ఇతర జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సమస్యలకు అధిక మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలవాట్లను కట్టడి చేస్తేనే.. పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు అధికంగా చేరడాన్నే సెంట్రల్ ఒబేసిటీగా పేర్కొంటారు. పెరిగిన విసరల్ ఫ్యాట్ పోర్టల్ బ్లడ్ సిస్టమ్ ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోని అదనపు కొవ్వు రక్తప్రవాహంలోకి కొవ్వు నిల్వలను విడుదల చేస్తుందన... ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో వ్యాయామం, శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం తప్పనిసరని వారు సూచిస్తున్నారు. -
విజృంభిస్తున్న జంటభూతాలు.. అప్రమత్తం కాకుంటే ప్రమాదమే..
సాక్షి, విజయవాడ: ప్రస్తుతం ఆధునిక జీవన విధానంలో ప్రజలను జంట భూతాలు పీడిస్తున్నాయి. నిండా నాలుగు పదులు దాటకుండానే చాలామంది వీటి బారిన పడి ఇల్లు, వళ్లు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజల జీవన శైలి, ఆహార అలవాట్లే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ►విద్యాధరపురానికి చెందిన 30 ఏళ్ల సురేష్ ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తుంటాడు. ఇటీవల విధి నిర్వహణలో తీవ్ర వత్తిడికి గురవుతున్నాడు. ఒకరోజు ఎక్కువ నీరసంగా ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా, అధిక రక్తపోటు ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు కిడ్నీల సమస్య కూడా తలెత్తింది. ►నీటిపారుదల శాఖలో పనిచేసే 26 ఏళ్ల వెంకట్‌కు ఇటీవల ఆకలి ఎక్కువగా ఉండటం, చెమటలు పట్టడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. శరీరంలో అధిక షుగర్ లెవల్స్‌తో పాటు హెచ్‌బీఏ1సీ 11కు చేరింది. అదృష్టవశాత్తు ఇంకా అవయవాలపై ప్రభావం చూపలేదు. ►ఇలా వీరిద్దరే కాదు మధుమేహం, రక్తపోటులకు గురై చికిత్సకోసం ప్రభుత్వాస్పత్రికి 30 నుంచి 40 ఏళ్ల మధ్యవారు నిత్యం 10 నుంచి 15 మంది వరకూ వస్తున్నారు. వీరిలో కొందరికి అప్పటికే అవయవాలపై ప్రభావం చూపడంతో ఆయా విభాగాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని వైద్యులు అంటున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో 30 సంవత్సరాలు దాటిన వారిలో 13 శాతం మంది మధుమేహులు, 11.5 శాతం మంది బీపీతో బాధపడుతున్నట్లు తేలింది. జంట వ్యాధులకు కారణాలివే... ►కదలిక లేని జీవన విధానం (శరీరానికి వ్యాయామం లేక పోవడం) ►ఆధునిక జీవనశైలిలో వత్తిళ్లు పెరిగిపోవడం ►ఆహారపు అలవాట్లలో మార్పులు ►కార్పోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే జంక్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ►వంశపారంపర్యం(తల్లిదండ్రులకు షుగర్, బీపీలు ఉండటం) అదుపునకు ఏమి చేయాలి ►ప్రతిరోజూ 45 నిమిషాలు, కనీసం వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి. ►విధి నిర్వహణలో, జీవితంలో ఎదుర్కొనే వత్తిళ్లను అధిగమించేందుకు యోగా చేయడం మంచిది. ►ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి, మాంసాహారం, జంక్‌ఫుడ్స్‌ను తగ్గిస్తే మంచిది. ►పీచు పదార్ధాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తాజా పళ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ►శరీరంలో బీపీ, చక్కెర స్థాయిలు, కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకునేలా తరచూ పరీక్షలు చేయించుకోవాలి. ►ప్రతి మనిషి నెలకు 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం. ►ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది. జీవనశైలిలో మార్పులతోనే... అధిక రక్తపోటుతో తలెత్తే దుష్పలితాలతో ప్రభుత్వాస్పత్రికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నారు. ముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారు సైతం బీపీతో పక్షవాతం వంటి వాటికి గురై చికిత్సకోసం వస్తున్నారు. అదుపులో లేని మధుమేహం, రక్తపోటుకు జీవనశైలిలో మార్పులే కారణం. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, విధి నిర్వాహణలో వత్తిళ్లు కూడా కారణమే. వ్యాయామం అసలు ఉండటం లేదు. ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. త్వరగా డైజీషన్ అయ్యే అహారం, కార్పోహైడ్రేడ్స్ ఎక్కువుగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌ను తీసుకోవడం కూడా రక్తపోటుకు కార ణమే. – డాక్టర్ ఎస్.దుర్గాప్రసాద్, ఫిజీషియన్, ప్రభుత్వాస్పత్రి మధుమేహులు పెరుగుతున్నారు యువతలో మధుమేహులు రోజు రోజుకు పెరుగుతున్నారు. శరీరంలో షుగర్ స్థాయిలో అదుపులో లేకున్నా, యువత మందులు సరిగా వాడక పోవడంతో దాని ప్రభావం కిడ్నీలు, గుండె, కన్ను వంటి అవయవాలపై పడుతుంది. తమ వద్దకు మధుమేహంలో కిడ్నీలు డ్యామేజ్ అయిన మధ్య వయస్సు వారిని చూస్తున్నాం. మధుమేహాన్ని ఆశ్రద్ద చేయడం మంచిది కాదు. ప్రతిరోజూ వ్యాయామం, శ్రమైక జీవన విధానం, సమతుల్య ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు ప్రీ డయాబెటీస్ స్టేజ్‌లో ఉన్న వారు ముందస్తు జాగ్రత్తలతో మేలుకోవాలి. – డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు -
జంట జబ్బులతో జర భద్రం!
సాక్షి, అమరావతి : ఉరుకులు పరుగుల జీవితం.. నిరంతరం పనిఒత్తిడి.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. వెరసి రాష్ట్రంలో చాలామందిని 30 ఏళ్లకే ‘రక్తపోటు, మధుమేహం’ పలకరిస్తున్నాయి. గతంలో పట్టణాలు, నగర వాసుల్లోని 45 నుంచి 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా ఈ జంట జబ్బుల సమస్య కనిపించేది. ప్రస్తుతం పల్లె, పట్టణం, నగరం అనే తేడాలేకుండా యుక్తవయస్సుల వారూ వీటి బారినపడుతున్నారు. కోనసీమలో అధికం.. ప్రజల్లోని జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారికి స్వస్థత కల్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీ–సీడీ సర్వే చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడుకోట్ల మందికి పైగా ప్రజలను వైద్య సిబ్బంది స్క్రీనింగ్ చేశారు. వీరిలో 1.87 కోట్ల మంది 30 ఏళ్ల వయస్సు పైబడిన వారిగా ఉన్నారు. ఇందులో 26.35 శాతం అంటే 49,54,106 మందిలో రక్తపోటు, 25.64 శాతం అంటే 48,20,138 మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఇక అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 6,82,189 మందిలో 30 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్ చేయగా అత్యధికంగా 38.02 శాతం మందిలో రక్తపోటు, 35.54 శాతం మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఎన్సీడీ క్లినిక్‌ల నిర్వహణ జీవనశైలి జబ్బుల నియంత్రణలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎన్సీడీ క్లినిక్‌లు నిర్వహిస్తోంది. 17 జిల్లా, 51 ఏరియా ఆస్పత్రులు, 177 సీహెచ్‌సీల్లో ఈ ఎన్సీడీ క్లినిక్‌లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయిల్లోను వీటిని నిర్వహిస్తున్నారు. కారణాలివే.. ► ఊబకాయం ► ధూమపానం, మద్యపానం ► తీవ్రఒత్తిడికి లోనవడం ► శారీరక శ్రమ లేకపోవడం ► అతిగా జంక్‌ఫుడ్ తినడం రక్తపోటు లక్షణాలివే.. తరచూ తలనొప్పి, కళ్లు తిరగడం, కంటి చూపులో మార్పులు, మూర్ఛరావడం జరుగుతుంది. ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా అవయవం దెబ్బతింటే దాని తాలూకు లక్షణాలు బహిర్గతమవుతాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలు బయటపడకుండా కూడా ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి ► మధుమేహం, రక్తపోటు బాధితులు సక్రమంగా మందులు వేసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రోజు అరగంట పాటు నడక ఉత్తమం. ► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్‌ను తినకుండా ఉండటం మంచిది. ► పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. వాటిని కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ► ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ► గర్భిణులు మధుమేహం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మ«ధుమేహం పరీక్షలు చేయించుకోవాలి. -
Health Tips: పచ్చళ్లు అతిగా తింటే అనర్థమే! ముఖ్యంగా పురుషులకు..!
What Happens If We Eat Pickles Everyday: వేడి వేడి అన్నంలో ఎర్రెర్రగా ఇంత ఆవకాయో, మాగాయో, ఇతర ఊరగాయ పచ్చళ్లో రోటిపచ్చళ్లో వేసుకుని తింటే వచ్చే రుచే వేరు. అందుకే అందరూ పచ్చళ్లకోసం నాలుక తెంపుకుంటూ ఉంటారు. అయితే రుచిగా ఉందని పచ్చడే పరమాన్నంలా రోజూ తింటూ ఉంటే ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ మహిళల కంటే మగవాళ్లకు ఈ ముప్పు మరికాస్త ఎక్కువ ఉంటుందంటున్నారు. ఇంతకూ ఆ ముప్పు ఎందుకో, ఏమిటో చూద్దాం... తక్కువగా తినండి! నవకాయ పిండి వంటలు చేసి నిండుగా విస్తరిలో వడ్డించినా పచ్చడికోసం వెతుక్కోవడం తెలుగు వారి స్వభావం. అన్నంలోనే కాదు, వేడివేడి ఉప్మా, దోసె, వడ, ఇడ్లీ.. ఇలా ఒకటేమిటి ప్రతిదానినీ పచ్చడితో లాగిస్తుంటారు. పచ్చళ్లు అతిగా తింటే అనర్థాలూ ఎక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం... పచ్చళ్లను తక్కువగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. బీపీ అమాంతం పెరిగితే! పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల అవి నిల్వ ఉండటం కోసం వేసే ఉప్పు వల్ల ముప్పు పొంచి ఉంటుంది. బీపి ఉన్న వారికి అమాంతం పెరిగిపోతే, ఇంతవరకూ ఆ సమస్యే లేని వారికి అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ప్రిజర్వేటివ్స్ వల్ల హైపర్ టెన్షన్ రోగులకు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా మార్కెట్లో కొనుగోలు చేసే పచ్చళ్లలో ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అదేవిధంగా పచ్చళ్లు ఎక్కువగా తింటే కడుపులో పుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. పొట్టలో, పేగుల్లో పొంచి ఉండే కొవ్వు.. గుండెజబ్బులు మార్కెట్లో విక్రయించే పచ్చళ్లకు రుచి కోసం నూనె, మసాలా ఎక్కువగా వాడుతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల.. మసాలాల కారణంగా.. పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. వాటితోపాటు కొలెస్ట్రాల్ వంటి ఇతర అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. తద్వారా గుండెజబ్బులు కాచుకుని ఉంటాయి. అందువల్ల పచ్చడి అంటే ఎంత ఇష్టం ఉన్నా, పరిమితంగానే పుచ్చుకోవడం మంచిది. మరీ తినాలనిపిస్తే సాధ్యమైనంతవరకూ ఇంట్లో చేసిన పచ్చళ్లను.. అది కూడా నూనె, ఉప్పు, కారం తక్కువ పాళ్లలో కలిపిన వాటిని... అదీ కొద్ది కొద్దిగానే తీసుకోవడం మంచిది. చదవండి: Pachi Batani Health Benefits: పురుషులు పచ్చి బఠానీలు ఎక్కువగా తిన్నారంటే.. Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
Health Tips: ఉప్పు, కారంతో పాటు ఆ అలవాట్లూ తగ్గించండి! లేదంటే!
హైపర్ టెన్షన్‌తో దాదాపు 10 శాతానికి మించి గుండె జబ్బుకు గురవుతున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. హైపర్‌టెన్షన్‌తో ఉన్నవారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా మరో అయిదు శాతం కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ టెన్షన్ వల్ల కొందరికీ బ్రెయిన్ స్టోక్ కూడా వచ్చే ప్రమాదముంది. ఇటీవల కాలంలో బ్రెయిన్ స్టోక్, గుండెకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. హైపర్‌టెన్షన్ ఉన్నవారికీ కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీనివల్ల కిడ్నీ దెబ్బతిని పని వేయకుండా పోయే ప్రమాదముంది. అదే విధంగా రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్ స్ట్రోక్‌లు వస్తున్నాయి. చిత్రం ఏమిటంటే, చాలామందికి తమకు హైపర్ టెన్షన్ ఉన్నట్లు కూడా తెలియకపోవడం. అయితే హైపర్ టెన్షన్‌ను గుర్తించగలిగితే దాని వల్ల కలగబోయే ముప్పును నివారించుకోవచ్చు. గుర్తించటం ఎలా? బీపీ తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు ముందు తలదిమ్ము మొదలవుతుంది. తర్వాత వివరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసక బారటం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాన తీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ప్రతిరోజూ తవ్పని నరిగ్గా 30 నుంచి 45 నిమిషాలు నడవాలి ►అస్తమానం కుర్చీకే అతుక్కుని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేస్తుండాలి. ►నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. ►చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌కు గురికావద్దు ►ఉదయం, సాయంత్రాల్లో మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది. ►టెన్షన్‌కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల టెన్షన్ దూరం అవుతుంది. ►ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏది తగ్గించాలి? ►ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జూగ్రత్త వహించాలి. ►బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీనుకోవాలి. ►ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ►ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికీ దూరంగా ఉండాలి. ►బయటి ఆహార పదార్థాల జోలికి వెళ్లరాదు. ►బరువు పెరగకుండా చూనుకోవాలి. హైపర్‌టెన్షన్ ఉన్నవారు ఏమి చేయాలి? ►తరచు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ►మందుల వాడకాన్ని ఒకరోజు కూడా నిలిపేయొద్దు. ►ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకాన్ని మార్చుకోవాలి. ►షుగర్ , గుండె , థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ►కొలస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ►మద్యపానం, సిగరెట్లను పూర్తిగా మానేయాలి. ►కారం, ఉప్పు తగ్గించాలి. చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! High Vitamin D Rich Foods: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. వీటిలో విటమిన్- డి పుష్కలం! -
బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి, కాకపోతే
హైబీపీకి సంబంధించిన సందేహాలు కాస్త చిత్రంగా ఉండవచ్చు. నిజానికి అదో అపోహలా అనిపించవచ్చు. కానీ అదే వాస్తవం కావచ్చు. అలాగే మరికొన్ని నిజమనిపించవచ్చు. కానీ అపోహ కావచ్చు. అందుకే అలాంటి కొన్ని సందేహాలూ, సమాధానాలు చూద్దాం. బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. తెలుగులో రక్తపోటు. అది ఉండాల్సిందే. కాకపోతే 140/90 కొలతతో ఉండాలి. అది నార్మల్. అంటే బీపీ ఉండాల్సిందేగానీ... ఎంత ఉండాలో అంతే ఉండాలన్నమాట. ఇది పెరిగితే హైబీపీ!! నిజానికి ఇదో జబ్బు కాదు. కానీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యేలా చేస్తుంది. భారతీయ సమాజంలో ఇంచుమించు కౌమారం దాటి యువదశ దాటినవారిలోని 25 శాతం మందికి హైబీపీ ఉన్నట్లు ఓ అంచనా. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇంతమంది హైబీపీ బాధితులు ఉండటం... వారిలో అనేక సందేహాలు, అపోహల కారణంగా మందులు సరిగా తీసుకోకపోవడం వల్ల మెదడు, మూత్రపిండాల వంటి ఎండ్ ఆర్గాన్స్ విఫలమై మృతిచెందడం, పక్షవాతం వంటి కారణాలతో జీవితాంతం వైకల్యాలతో బాధపడటం చాలా సాధారణం. ఈ నెల 17న వరల్డ్ హైపర్‌టెన్షన్ డే. ఈ సందర్భంగా ఈ అంశంపై అనేక సందేహాలూ, వాటికి సమాధానాలు తెలుసుకుని హై–బీపీ పట్ల అవగాహన పెంచుకుంటే ఎన్నెన్నో జీవితకాలపు వైకల్యాలనూ, మరణాలను నివారించవచ్చు. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. యువకులను మినహాయిస్తే... మధ్యవయసు దాటాక... ఏజ్ పెరుగుతున్న కొద్దీ... నార్మల్ అయిన 120/80 కంటే కొద్దిగా ఎక్కువగానే ఉండటం మామూలే కదా! ఈ అపోహ చాలాకాలం రాజ్యమేలింది. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కొద్దిగా ఎక్కువే ఉండవచ్చని తొలుత అనుకున్నారు. (వయసు + 100) అంటూ ఓ సూత్రం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 60 ఏళ్లు అయితే అతడి పై కొలత 160 వరకు ఉన్నా పర్లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పటి లెక్కలు వేరు. ఇప్పుడు తాజాగా... పద్దెనిమిది దాటిన ఏ వయసువారికైనా బీపీ 140/90 కి పైన ఉంటే అది హైబీపీ కిందే లెక్క. తల్లిదండ్రులకు ఉంటే, పిల్లలకూ హైబీపీ వస్తుందా? తల్లిదండ్రులకు హైబీపీ ఉంటే... పిల్లలకు అది తప్పనిసరిగా వచ్చే జన్యుపరమైన సమస్య కాదు గానీ... తల్లిదండ్రులకూ, రక్తసంబంధీకులకూ, దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు... వారి వారసులకు కూడా వచ్చే అవకాశాలు కాస్తంత ఎక్కువే. రక్తపోటు ఉన్నప్పటికీ చాలా చిన్నవయసు వారు మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదేమో కదా? రక్తపోటు ఉందని తేలాక... అది ఎంత చిన్నవయసు అయినా తప్పనిసరిగా మందులు వాడాల్సిందే. లేకపోతే దీర్ఘకాలంలో కీలకమైన అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయం కలిగించే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లల్లో హైబీపీ ఉండదు కదా? చిన్నపిల్లల్లో, అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న కౌమార బాలల్లో హైబీపీ ఉండకపోవచ్చని అనిపిస్తుంది. కానీ వాళ్లలోనూ కొందరికి హైబీపీ (హైపర్‌టెన్షన్) ఉండే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిన్నపిల్లలు.. అంటే 3 నుంచి 11 ఏళ్ల మధ్య వయసువారు, కౌమారంలోకి వస్తున్న పిల్లలు... అంటే 12 నుంచి 18 ఏళ్ల మధ్యవారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. అయితే చిన్నపిల్లల్లో హైబీపీ నిర్ధారణ విషయంలో కొలత చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పిల్లల్లో బీపీని తెలిపే ఛార్ట్‌ను ‘సెంటైల్ చార్ట్’ అంటారు. పిల్లల్లో నార్మల్ విలువలు వాళ్ల వయసునూ, జెండర్నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతుంటాయి. అంటే వారిలో కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. కొలత విలువ 95 పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే హైపర్‌టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా భావించాలి. ఈ దశలూ, తీవ్రతలను బట్టి ఆయా పిల్లలకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. సుదీర్ఘకాలం పాటు హైబీపీ మందులు వాడితే వాటికి అలవాటు పడి... డ్రగ్ అడిక్షన్ వస్తుందేమో కదా? ఒకసారి హై–బీపీ నిర్ధారణ అయ్యాక... దాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు మందులను సూచిస్తుంటారు. వారి బీపీ తీవ్రతను బట్టి కొందరిలో రెండు, మూడు, నాలుగు... రకాల మందులను డాక్టర్లు వాడమంటారు. తరచూ గమనిస్తూ... మందుల మోతాదును అడ్జెస్ట్ చేస్తుంటారు. జీవనశైలి మార్పులతో బీపీని అదుపులో పెడితే కేవలం రెండులోపు మాత్రలతోనే చాలాకాలం కొనసాగవచ్చు. కానీ బీపీ అదుపులో లేకపోతే మందులూ, మోతాదులు పెరుగుతాయి. హైబీపీ మందులైనా, డయాబెటిస్ మందులైనా సుదీర్ఘకాలం వాడాల్సిందే. అది బాధితుల బీపీ కొలతలను బట్టి ఉంటాయి తప్ప... బీపీ తగ్గినప్పటికీ వాటికే అలవాటు పడటం, మానకుండా ఉండలేకపోవడం వంటివి జరగవు. మందులు వాడుతున్నా... బీపీ నియంత్రణలో ఉండటం లేదు. బహుశా మందుల ప్రభావం తగ్గిపోయిందా? బహుశా బీపీ ఆ మందులకు రెసిస్టెన్స్ పెంచుకుని ఉండవచ్చా? కొంతమంది బీపీ బయటపడ్డాక... మొదటిసారి మాత్రమే డాక్టర్‌ను కలుస్తారు. అప్పుడు డాక్టర్ రాసిన మందులనే అదేపనిగా ఏళ్ల తరబడి వాడుతుంటారు. కానీ వాటితో బీపీ నిజంగానే అదుపులోకి వచ్చిందా... లేక ఆ డోస్ సరిపోవడం లేదా... ఇలాంటి విషయాలేమీ పట్టించుకోరు. మరికొందరు తొలిసారి మందులు వాడకం మొదలుపెట్టాక... రెండో వారంలోనో లేదా పది రోజుల తర్వాతనో మరోసారి బీపీ చూసుకుని, అది తగ్గడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు. ఇవన్నీ సరికాదు. మందుల ప్రభావం తగ్గిపోయిందనే అపోహ కూడా వద్దు. ఒకసారి బీపీ మందులు మొదలుపెట్టాక అవి పనిచేయడం ప్రారంభించి, బీపీ అదుపులోకి రావడానికి కనీసం 3 – 4 వారాలు పట్టవచ్చు. ఇవేవీ చూడకుండానే కొందరు తాము అనుకున్నదే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది సరికాదు. అందుకే బీపీ మందులు వాడుతున్న వారు డాక్టర్ నిర్దేశించిన ప్రకారం... ఆయా సమయాలకు ఫాలో అప్‌కు వస్తుండాలి. ఉద్వేగ లక్షణాలు ఉంటే అది హై–బీపీ యేనా? కొంతమంది తాము నర్వస్‌గా ఉండటం, తలనొప్పి తరచూ వస్తుండటం, చెమటలు పడుతున్నట్లుగా, నిద్రపట్టకుండా, కోపంగా లేదా బాగా ఉద్వేగంగా/ఉద్రిక్తంగా ఉన్నప్పుడు హైబీపీ ఉందనో లేదా ఆ టైమ్‌లో బీపీ పెరిగి ఉందనో చెబుతుంటారు. అంతేకాదు... కొంతమందికి హాస్పిటల్‌కు వెళ్లగానే, అక్కడి డాక్టర్లను చూడగానే బీపీ పెరుగుతుంది. అదే ఇంటిదగ్గర లేదా మరోచోట రీడింగ్ తీసినప్పుడు నార్మల్‌గా ఉంటుంది. ఇలా తెల్లకోట్లలో ఉండే డాక్టర్లను చూసినప్పుడు రక్తపోటు పెరగడాన్ని ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో లేదా పైన చెప్పిన లక్షణాలన్నీ లేదా వాటిలో కొన్ని ఉన్నప్పుడు హైబీపీ ఉన్నట్లేనా అని సందేహ పడుతుంటారు. పై లక్షణాలతోనూ, సహజ భావోద్వేగాలతోనూ రక్తపోటు కొంతమేరకు పెరగవచ్చు. కానీ వాళ్ల భావోద్వేగాలు తగ్గగానే నార్మల్ అవుతుంది. అలాంటి కండిషన్లలో పెరిగేదాన్ని హైబీపీగా పరిగణించరు. అయితే ఓ వ్యక్తిలో పలుమార్లు రీడింగ్ తీశాక కూడా... రక్తపోటు 140/90 అనే విలువకు మించి ఉంటే అప్పుడు మాత్రమే హైబీపీగా పరిగణిస్తారు. సాధారణంగా రక్తపోటుకు సంబంధించిన లక్షణాలేమీ లేకపోతే హైబీపీ లేనట్లేనా? చాలామందికి లక్షణాలేమీ కనిపించకుండానే హైబీపీ ఉండవచ్చు. వారికి హైబీపీ ఉన్నట్లే తెలియకుండానే అది ఏళ్లతరబడి ఉండే అవకాశం ఉంది. రక్తపోటు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఉండటం వల్ల మన దేహంలో ఎండ్ ఆర్గాన్స్‌గా పిలిచే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. అలా అవి పూర్తిగా పాడైపోయాక... అప్పుడుగానీ ఆయా అవయవాలు దెబ్బతిన్నందున కనిపించే లక్షణాలు బయటపడవు. హైబీపీ వల్ల దెబ్బతిని, బాధితులను ప్రాణాంతక పరిస్థితులకు నెడుతున్నందునే దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. అందువల్ల లక్షణాలు కనిపించనంత మాత్రాన బీపీ లేదని అనుకోవడం సరికాదు. ఒకసారి డాక్టర్‌ను కలిసి, చెకప్ చేయించుకున్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. కొన్నిసార్లు లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ అవి తాత్కాలికం కావచ్చు. అలాంటిప్పుడు ఒకవేళ బాధితులకు హైబీపీ లేకపోయినా, అది ఉన్నట్టుగా డాక్టర్లు పొరబడే అవకాశాలు లేవా? హైబీపీ వల్ల కొందరిలో తలనొప్పి, తలతిరగడం వంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి తలనొప్పీ అధిక రక్తపోటు వల్లనే కాకపోవచ్చు. బీపీ తాలూకు లక్షణాలు అని చెప్పుకునే కండిషన్లు కనిపించినప్పుడు అసలు బీపీని కొలవకుండానే కేవలం లక్షణాలతో ఆ సమస్య ఉందని అనుకోవడం సరికాదు. డాక్టర్లు అలా పొరబడే అవకాశం లేదు. ఎందుకంటే... రక్తపోటు పెరగడం వల్ల మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే కొందరిలో వారి బాడీ పోష్చర్ అకస్మాత్తుగా మారడం వల్ల రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ‘ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్’ అంటారు. అలాంటి సమయాల్లో కొందరికి ముందుకు తూలిపడిపోతామనే ఫీలింగ్ లేదా తలతిరగడం వంటివి కనిపించవచ్చు. బీపీ తగ్గిన ఇలాంటి సందర్భాల్లోనూ బీపీ పెరిగినప్పుడు కనిపించే గిడ్గీనెస్ వంటి లక్షణాలు æ కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా... అనేక మార్లు, అనేక సందర్భాల్లో బీపీని కొలిచిచూస్తారు. ఇలా పరీక్షించినప్పుడు అన్నిసార్లూ కొలత పెరిగి ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని హైబీపీగా నిర్ధారణ చేస్తారు. హైబీపీ ఉందని నిర్ధారణ అయ్యింది. డాక్టర్లు మందులు మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత బీపీ అదుపులోకి వచ్చిందనుకోండి. అప్పుడు మందులు మానేయవచ్చా? ఒకసారి హైబీపీ నిర్ధారణ అయి... మందులు మొదలుపెట్టాక వాటి ప్రభావంతో బీపీ అదుపులోకి వస్తుంది. దాంతో బీపీ నియంత్రణలోనే ఉంది కదా అని చాలామంది మళ్లీ మందులు మానేస్తుంటారు. మళ్లీ బీపీ చెక్ చేయించుకోరు. దీని లక్షణాలు బయటకు కనిపించవు కాబట్టి అది పెరిగిన విషయం తెలియదు. అందుకే ఒకవేళ బీపీ నియంత్రణలోకి వచ్చిందని మందులు ఆపేసినా... మాటిమాటికీ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ ఏమాత్రం పెరిగినట్లు అనిపించినా వెంటనే డాక్టర్ సలహా తో తగిన మోతాదు నిర్ణయించుకుని, మందులు తిరిగి మొదలుపెట్టాలి. అంతేకాదు... మందులు వాడుతున్నప్పటికీ తరచూ బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం మందులు వాడుతున్నప్పటికీ... ఆ మోతాదు సరిపోక బీపీ పెరిగితే... డాక్టర్లు మందులు మార్చడమో లేదా సరైన మోతాదు అందేలా మరో మాత్ర లేదా రెండు మాత్రలు పెంచడమో చేస్తారు. ఈ నేపథ్యంలో బీపీ మందులు వాడుతున్నప్పుడు వాటిని మానేయకపోవడం మంచిది. తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండటం అవసరం. బార్డర్‌లైన్‌లో ఉన్నప్పుడు మందులు అవసరం లేదనీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో బీపీని అదుపులో ఉంచుకోవాలంటూ డాక్టర్లు చెబుతారు కదా. మరి ఇప్పుడు కూడా మందులేవీ వాడకుండా మంచి జీవనశైలి అనుసరిస్తే సరిపోదా? ప్రతివారూ ఇలాగే అనుకుంటారు. కానీ జీవనశైలి నియమాలను కరెక్ట్‌గా పాటించరు. పాటించినా కొద్దికాలం మాత్రమే. లక్షణాలేవీ బయటకు కనిపించని హైబీపీ దీర్ఘకాలికంగా ఏవైనా కీలక అవయవాలపై దుష్ప్రభావం చూపితే... అప్పుడు జరిగే నష్టం... అప్పుడు వైద్యపరీక్షలకూ, చికిత్సకూ పడే ఆర్థికభారం, ఏదైనా ఎండ్ ఆర్గాన్ శాశ్వతంగా దెబ్బతింటే కలిగే నష్టం లాంటివి చాలా జబ్బుభారాన్ని (డిసీజ్ బర్డెన్ను) పెంచుతాయి. వాటికంటే అసలు మనకు భారమే తెలియని రీతిలో, చాలా చవకైన మందులను రోజూ ఒకపూట లేదా రెండు పూటలు తీసుకోవడం మేలు. దానివల్ల సుదీర్ఘకాలం, అన్ని అవయవాలనూ పదిలంగా ఉంచుతూ హాయిగా జీవించవచ్చు. గుండెపోటు, పక్షవాతం లాంటి మరెన్నో అనారోగ్యాలనూ, అనర్థాలను నివారించుకోవచ్చు. ఉప్పు పూర్తిగా మానేయాలా? హైబీపీ అనగానే ఉప్పు వల్ల రక్తపోటు పెరుగుతుందని సాధారణ ప్రజలకు కూడా ఇప్పుడు తెలిసిన విషయం. అయితే తమకు ఎలాంటి అనర్థాలూ జరగకూడదనే ఉద్దేశంతో చాలామంది ఉప్పును పూర్తిగా మానేస్తుంటారు. కానీ మన దేహంలోని చాలా కీలకమైన జీవక్రియలు (ఉదాహరణకు మెదడు నుంచి నాడుల ద్వారా కండరాలకు వచ్చే ఆదేశాలూ, వాటి అమలు వంటివి) ఉప్పు/ఇతర లవణాలలోని అయాన్ల ద్వారానే జరుగుతుంటాయి. ఉప్పు పూర్తిగా మానేసిన కొందరిలో ‘హెపోనేట్రీమియా’ అనే కండిషన్ వచ్చి, ఒక్కోసారి ప్రాణాంతకంగానూ మారవచ్చు. అందుకే ఉప్పును పూర్తిగా మానేయడం కంటే... మునుపు వాడుతున్న దాంట్లో సగం లేదా సగం కంటే తక్కువ వాడటం మంచిది. - డాక్టర్ హరిరామ్ వి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ -
‘సైలెంట్ కిల్లర్’తో జాగ్రత్త.. భారత్‌లో 30 శాతం మంది బాధితులు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య నిపుణులు ‘సైలెంట్ కిల్లర్’గా పరిగణిస్తున్న ‘హైపర్ టెన్షన్’ (బీపీ) అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దేశంలోని 30 శాతం మంది ‘అధిక రక్తపోటు’తో బాధపడుతున్నారని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 వరకు 184 దేశాల్లో 10 కోట్ల మందిపై నిర్వహించిన పరిశోధనలను శాస్త్రవేత్తలు విశ్లేషించిన సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్న అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్, భారత్‌లోని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు సహా వివిధ దేశాల శాస్త్రవేత్తల సహకారంతో సాగిన ఈ అధ్యయనంలో హైబీపీ వల్ల వచ్చే హార్డ్ ఎటాక్, కిడ్నీ, గుండె జబ్బులకు... ఏటా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మరణాలకు లంకె ఉన్నట్లు తేలింది. చదవండి: పండగలప్పుడు జరభద్రం! ప్రపంచస్థాయిలో 1990తో పోల్చితే 2019కల్లా బీపీ సమస్యల విషయంలో మహిళలు, పురుషుల సంఖ్య రెట్టింపైనట్లు వెల్లడైంది. బీపీ సమస్యను తగ్గిస్తే 40 శాతం స్ట్రోక్స్, 50 శాతం దాకా హార్ట్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయని గతంలోనే కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. బీపీతో ముడిపడిన అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ‘సాక్షి’తో క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఎ.నవీన్‌రెడ్డి, కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలితోనే.. గతంలో 50–60 ఏళ్లు దాటిన వాళ్లలోనే హైబీపీ సమస్యలొచ్చేవి. ఇప్పుడు 25–30 ఏళ్లలోని చాలామంది బీపీ సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుతోపాటు ఒత్తిళ్లు, షుగర్, ఎండోక్రైనాలజీ, కిడ్నీల పరిస్థితి తదితరాలను బట్టి వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఆహార అలవాట్లు, జీవనశైలి విధానమే వాటన్నింటిపై ప్రభావం చూపుతోంది. చేస్తున్న ఉద్యోగాలను బట్టి రాత్రి బాగా పొద్దుపోయాక పడుకోవడం, పగటిపూట ఎప్పుడో నిద్రలేవడం, పొగ తాగడం, మద్యపానం, ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయులుగా మారి ఎక్కువ మంది బీపీ బారినపడుతున్నారు. మెదడు, గుండె, కిడ్నీలు, లివర్, కళ్లు ఇలా ప్రతి అవయవంపై బీపీ ప్రభావం చూపుతుంది. జీవనశైలి పద్ధతులను మార్చుకోకుండా బీపీని నియంత్రించలేం. బీపీకి నడక చాలా మంచి మందు. 90 శాతం వరకు కారణాలు లేకుండానే బీపీ వస్తుంది. దీనినే ‘ఎసెన్షియల్ హైపర్ టెన్షన్’ అని పిలుస్తాం. – డా. ఎ.నవీన్‌రెడ్డి, క్రిటికల్‌కేర్ నిపుణుడు,నవీన్‌రెడ్డి హాస్పిటల్ -
అరుదైన సర్జరీ.. ఒక వ్యక్తిలో ఐదు కిడ్నీలు!!
ఆయనకి శరీరంలో ఐదు కిడ్నీలు ఉన్నాయి. యస్.. తనవి రెండు.. దాతలు ఇచ్చినవి మూడు. గతంలో రెండుసార్లు అవయవ మార్పిడి చికిత్సలు నిర్వహించిన వైద్యులు.. ఈమధ్యే విజయవంతంగా మరో కిడ్నీని శరీరంలోకి ఎక్కించారు. ఇంతకు ముందు సర్జరీలు ఫేయిల్ కావడానికి కారణం.. ఆయనకు ఉన్న హైపర్‌టెన్షన్(అధిక రక్తపోటు) సమస్య. దీంతో మరోసారి ప్రయత్నించిన డాక్టర్లు.. సంక్లిష్టమైన సర్జరీ ద్వారా ఐదో కిడ్నీని విజయవంతంగా అమర్చారు. తద్వారా వైద్య చరిత్రలో అరుదైన ఈ ఘటనకు చెన్నై వైద్యులు కారణం అయ్యారు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల సదరు వ్యక్తికి ఇదివరకే రెండుసార్లు రెనల్ (మూత్రపిండం)కు సంబంధిచిన సర్జరీలు జరిగాయి. పేషెంట్‌కు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. దీంతో 1994లో తొలిసారి.. 2005లో రెండోసారి కిడ్నీలను మార్చారు. ఆయనకు ఉన్న అధిక రక్తపోటు సమస్య వల్ల ఈ రెండూ సర్జరీలు విఫలం అయ్యాయి. దీంతో coronary artery disease బారినపడ్డాడు. ఈ పరిస్థితుల్లో మరో కిడ్నీ అమర్చే విషయంపై ఆయనతో చర్చించారు మద్రాస్ మెడికల్ మిషన్ డాక్టర్లు. కానీ, అప్పటికే శరీరంలో నాలుగు కిడ్నీలు ఉండడంతో ఐదవది అమర్చడం సంక్లిష్టంగా మారింది. అయినప్పటికీ పేషెంట్ ఉన్న కండిషన్‌కి ఆ ఆప్షన్ తప్ప మరొకటి కనిపించలేదు. ఇది చదవండి: పాములే ఇక సైంటిస్టులకు దిక్కు ఎక్కడ అమర్చారంటే.. సాధారణంగా దాతల కిడ్నీలను.. పేషెంట్ల కిడ్నీల పక్కనే ఉన్న నాళాలకు అమరుస్తారు. కానీ, ఈ పేషంట్‌కు ఇదివరకే నాలుగు అమర్చి ఉన్నాయి. దీంతో స్పేస్ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు డాక్టర్లు. పైగా ఇంతకు ముందు జరిగిన సర్జరీల వల్ల పేషెంట్ నుంచి యాంటీబాడీస్ రిలీజ్ అయ్యే రిస్క్ ఏర్పడొచ్చు. కాబట్టి, జాగ్రత్తగా కిడ్నీని అమర్చాలని ఫిక్స్ అయ్యారు. చివరకు పొత్తికడుపు కుహరం దగ్గర ఆ కిడ్నీని అమర్చి.. ఇక్కడే గుండెకు సంబంధించిన రక్తనాళాలకు కనెక్ట్ చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి సర్జరీలు జరగడం చాలా అరుదు. పాతవి తీయకపోవడానికి కారణం ఇదే కొత్త కిడ్నీ అమర్చేప్పుడు.. పాత కిడ్నీలను ఎందుకు తొలగించలేదని చాలామందికి అనుమానం కలగవచ్చు. ఒకవేళ పాతవి గనుక తొలిగిస్తే.. రక్తస్రావం జరగొచ్చు. అదే టైంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి.. కొత్త కిడ్నీ అమర్చడానికి పరిస్థితి ప్రతికూలంగా మారొచ్చు. అందుకే ఆ పాత కిడ్నీలను అలాగే వదిలేశారు. ఇక జులై 10న సర్జరీ విజవంతంగా జరగ్గా.. నెల తర్వాత (ఆగస్టు 10న) ఆ పేషెంట్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని, మరికొన్ని నెలలపాటు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. -
ప్రీ–హైపర్‌టెన్షన్ దశ అంటే..?
ప్రతి వ్యక్తి రక్తనాళాల్లోనూ రక్తం ఒక నిర్దిష్టమైన రీతిలో, కొంత వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వేగం కొనసాగాలంటే రక్తనాళాల్లో రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించాలి. ఇలా రక్తానికి ఒత్తిడి ఉండాలంటే అది గుండె స్పందనల వల్లనే సాధ్యమవుతుంది. రక్తాన్ని గుండె పంప్ చేసినప్పుడు మంచి రక్తనాళాల్లో (ఆర్టరీస్) లో రక్తం ఎంత పీడనంతో ప్రవహిస్తుందో తెలుసుకునే కొలత (రీడింగ్)ను ‘సిస్టోలిక్ ప్రెషర్’ అంటారు. అలాగే రెండు సిస్టోలిక్ ప్రెషర్స్ మధ్యన రక్తనాళాల్లో రక్త పీడనాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఇలా రక్తపోటుకు రెండు విలువలు ఉంటాయి. దీన్నే సాధారణంగా 120/80 గా పేర్కొంటుంటారు. ఇది సాధారణ విలువ. ఇక ఇప్పుడు ప్రీ–హైపర్‌టెన్షన్ అంటే ఏమిటో చూద్దాం. ప్రీ–హైపర్‌టెన్షన్ సాధారణంగా డాక్టర్ దగ్గరికి రోగి వెళ్లగానే కొలత రక్తపోటును పరిశీలిస్తారు. ఒకవేళ అది 120/80 ఉంటే ఇక దాని గురించి ఆలోచించరు. కానీ ఈ కొలతలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా కొంత మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉందనుకోండి. అలాగే కింది విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉందనుకోండి. ఆ కొలతలు ఉన్న దశను పూర్తిగా రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్‌టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్‌టెన్షన్’ దశ భవిష్యత్తులో ‘హైబీపీ’కి దారితీయవచ్చు. వెసులుబాటు ఇదే... ప్రీ–హైపర్‌టెన్షన్‌లో రోగి వెంటనే మందులు వాడాల్సిన అవసరం లేదు. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై కొన్ని జాగ్రత్త చర్యలను మొదలుపెట్టవచ్చు. అంటే కేవలం మన జీవనశైలిలోని అలవాట్లను చక్కబరచుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకునే వెసులుబాటు మనకు ఉంటుందన్నమాట. చదవండి: ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోండిలా.. వంటలూ వడ్డింపులతో క్యాన్సర్ నివారణ తోడుగా ప్రమాదకరమైన పరిస్థితి కూడా... రక్తపోటు పెరగడం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక నష్టాలు మనకు వెంటనే కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం మొదట్లో అసలు రోగికి తేలియనే తెలియకపోవచ్చు కూడా. అందువల్ల దీనివల్ల జరిగే నష్టం అలా జరుగుతూపోయి ఏవైనా అవయవాలు దెబ్బతిన్న లక్షణాలు బయటపడేవరకు జరిగిన నష్టం మనకు తెలియదు. అప్పుడు మాత్రమే మనకు హైబీపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదో ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే వయసు నలభై దాటిన వారు అప్పుడప్పుడూ తమ బీపీని పరీక్షించుకుంటూ ఉండి, అది పంపించే హెచ్చరికలను పరిశీలించుకుంటూ ఉండటం మేలు. ప్రీ–హైపర్‌టెన్షన్ దాటి ఇక బీపీ నిర్ధారణ ఇలా... బీపీ ఉన్నట్లుగా నిర్ధారణ కోసం తరచూ రక్తపోటును చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపే కొలతలు రెండు / మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వస్తే దాన్ని హైబీపీగా నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడిక ప్రీ–హైపర్‌టెన్షన్ విషయాన్ని మరచిపోయి... తప్పక బీపీ నియంత్రణ మందులను డాక్టర్ సూచించిన విధంగా వాడాలి. హైబీపీకి కారణాలు ఇక పెరుగుతున్న వయసు, స్థూలకాయం, హైబీపీ ఉన్న కుటుంబచరిత్ర, ఒకే చోట కుదురుగా కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఎప్పుడూ పొటాషియమ్ ఎక్కువగా ఉండేలా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగాకు నమిలే అలవాటు, మద్యం తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు హైబీపీకి రిస్క్ ఫ్యాక్టర్లు. మనందరికీ రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ అంటే తెలుసు. కానీ రక్తపోటు వచ్చేందుకు ముందు మన దేహం కొన్ని హెచ్చరికలు చేస్తుంటుంది. వాటిని జాగ్రత్తగా గమనిస్తే అసలు రక్తపోటును నివారించడమో లేదా మరింత ఆలస్యంగా వచ్చేలా జాగ్రత్తపడటమో చేయవచ్చు. అలా హెచ్చరించే ఆ దశను ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ దశగా చెప్పవచ్చు. ప్రీ హైపర్‌టెన్షన్ దశలోనే జాగ్రత్త పడితే మనం మనకెన్నో ఆరోగ్య అనర్థాలూ, కిడ్నీ, బ్రెయిన్ లాంటి కీలక అవయవాలు దెబ్బతినే పరిస్థితిని నివారించవచ్చు. ఆ ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ దశపై అవగాహన కోసమే ఈ కథనం. ఈ జాగ్రత్త తీసుకోండి అంతగా హైబీపీ లేకుండా కేవలం ప్రీహైపర్‌టెన్షన్ ఉన్నప్పుడు... అది ప్రమాదకర దశ కాదని రిలాక్స్ కాకూడదు. అది పంపే హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తం కండి. వెంటనే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికీ జాగ్రత్త తీసుకోకపోతే అది గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. -డాక్టర్ సౌమ్యబొందలపాటి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ పైల్స్ నివారణ ఇలా : మొలల లక్షణాలు అంతగా బాధించని స్థితినుంచి మేల్కొని కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాటిని సమర్థం గా నివారించవచ్చు. పైగా ఇది మంచిది కూడా. దీనివల్ల బాధాకరమైన పరిస్థితులను, చికిత్సను తప్పించుకోవచ్చు. ► మలబద్దకం లేకుండా చూసుకుంటూ విసర్జన సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ∙మలబద్దకం లేకుండా ఉండటం కోసం ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, పొట్టుతో ఉన్న ధాన్యంతో చేసిన పదార్థాలు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు నీళ్లు పుష్కలంగా తాగాలి. ∙మలబద్దకానికి ఆస్కారం ఇచ్చే పచ్చళ్లు, మసాలాలు, వేపుళ్లు, కారం, బేకరీ ఐటమ్స్ అయిన పిజ్జా, బర్గర్ల వంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. ∙చాలాసేపు కూర్చుని చేయాల్సిన వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా కూర్చోకుండా గంటకు ఒకసారి లేచి పదినిమిషాలు తిరిగి మళ్లీ కూర్చోవాలి. -
కరోనా నివారణలో ‘బీపీ మందులు’
లండన్ : ‘బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్’తో బాధ పడుతున్న వారికి కరోనా వైరస్ సోకినట్లయితే ప్రాణాంతకమవుతుందని ఇప్పటికి పలు సర్వేలు వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే కరోనా బారిన పడిన ‘హై బ్లడ్ ప్రెషర్’ రోగులకు బ్లడ్ ప్రెషర్ నివారణ మందులను ఇవ్వడం వల్ల వారు అద్భుతంగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారని లండన్‌లో నిర్వహించిన ఓ తాజా సర్వే తెలియజేస్తోంది. కరోనాతో బాధ పడుతున్న బ్లడ్ ప్రెషర్ రోగులకు రామిప్రిల్, లొసార్టన్ మందులు ఇవ్వగా, వారిలో మూడోవంతు మంది, అంటే 33 శాతం మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకొని, కోలుకున్నారని ‘యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లినా’ పరిశోధకలు జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే వారిలో ఎక్కువ శాతం మంది ‘వెంటిలేటర్’ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నారని, వెంటిలేటర్ వరకు వెళ్లిన కరోనా రోగులు కూడా ఈ మందులతోని కోలుకున్నారని పరిశోధకులు తెలిపారు. అయితే బీపీ లేని కరోనా రోగులపై ఈ మందుల ప్రభావం ఎలా ఉంటుందో! ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారన్నారు. తాము ప్రస్తుతం బీపీ ఉన్న రోగులపై అధ్యయనానికే పరిమితం అయ్యామని వారు చెప్పారు. బ్రిటన్‌లో బీపీతో బాధపడుతున్న దాదాపు 60 లక్షల మంది ఈ డ్రగ్స్‌ను వాడుతున్నారు. అమెరికాలో దాదాపు కోటి మంది బీపీతో బాధ పడుతున్నారు. బీపీ రోగులు కరోనా నుంచి కోలుకునేందుకు రామిప్రిల్, లొసార్టన్ మందులు బాగా పని చేస్తున్నట్లు దాదాపు 30 వేల మంది కరోనా రోగులపై యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. చదవండి: పొగాకు అలవాటుకు కరోనా చెక్ -
పక్షవాతం వంశపారంపర్యమా?
నా వయసు 36 ఏళ్లు. మేము ముగ్గురు అన్నదమ్ములం. మా నాన్నగారు నా చిన్నతనంలో పక్షవాతానికి గురయ్యారు. అప్పట్లో సరైన వైద్యసౌకర్యాలు లేకపోవడంతో మంచానపడి పదేళ్లపాటు నరకం అనుభవించి చనిపోయారు. నా పెద్దతమ్ముడికి 29 ఏళ్లు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. నెల్లాళ్ల కిందట ‘బ్రెయిన్‌స్ట్రోక్’కు గురయ్యాడు. వెంటనే మంచి వైద్యం ఇప్పించడం వల్ల వెంటనే కోలుకున్నాడు. కుడి చేయి, కుడి కాలు ఇంకా స్వాధీనంలోకి రాలేదుగానీ ప్రాణాపాయం లేదనీ, ఫిజియోథెరపీ, మందులు వాడటం వల్ల తొందరలోనే కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. ఇప్పుడు నాకూ, మా చిన్న తమ్ముడికి ఒక భయం పట్టుకుంది. నాన్నగారిలా, తమ్ముడిలా మాకూ పక్షవాతం వస్తుందా? ‘బ్రెయిన్‌స్ట్రోక్’ వంశపారంపర్యంగా వచ్చే జబ్బా? పక్షవాతం గురించి వివరాలను విపులంగా తెలియజేయండి. పక్షవాతం (బ్రెయిన్‌స్ట్రోక్) వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. ఈ విషయంలో మీరు ఎలాంటి భయాలూ, ఆందోళనలూ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. మీ ఫ్యామిలీ హిస్టరీలో పక్షవాతం ఉంది కాబట్టి బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీసే ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్... అంటే అధిక రక్తపోటు, డయాబెటిస్, హైకొలెస్ట్రాల్ వంటి వంశపారంపర్య వ్యాధుల పట్ల మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించాలి. మీరు క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుని, ఒకవేళ ఏమైనా తేడాలుంటే క్రమం తప్పకుండా మందులు వాడుతూ, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్రెయిన్‌స్ట్రోక్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు. పరిశోధనల ప్రకారం మహిళల కంటే పురుషుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. పక్షవాతంలో రెండు రకాలున్నాయి. ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడు మొత్తానికి నాలుగు రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇందులో రెండు రక్తనాళాలు మెదడు ఎడమవైపునకూ, రెండు కుడివైపునకూ వెళ్తాయి. ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దాంతో మెదడుకు రక్తసరఫరా సరిగా జరగక, కణాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుంది. దాదాపు 80 శాతం కేసుల్లో ఇదే కారణం. హేమరేజిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో ఏదైనా చిట్లిపోయి, రక్తం బయటకు రావడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ఈ తరహా పక్షవాతం 20 శాతం కేసుల్లో కనిపిస్తుంటుంది. ఈ రెండు కారణాల వల్ల ఎడమవైపు మెదడు భాగాలు దెబ్బతింటే శరీరంలోని కుడివైపున ఉండే అవయవాలు, కుడివైపు మెదడు భాగాలు దెబ్బతింటే ఎడమ వైపున ఉండే అవయవాలు దెబ్బతింటాయి. కారణాలు : పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు అధిక రక్తపోటు. డయాబెటిస్. డ్రగ్స్, అధిక ఒత్తిడి కూడా ఇందుకు కారణాలే. ఇంతకుమునుపు ఇవి అరవై ఏళ్ల వయసులో కనిపించేవి. కానీ ఇప్పుడు మూడు పదుల్లోనే కనిపిస్తున్నాయి. అందుకే పక్షవాతం ఇప్పుడు చాలా చిన్న వయసువారిలోనూ కనిపిస్తోంది. ఎలా గుర్తించాలి : ►మాటలో తేడా రావడం, నత్తినత్తిగా రావడం ►విన్నది అర్థం చేసుకోలేకపోవడం ►మూతి పక్కకి వెళ్లిపోవడం ►ఒకవైపు కాలు, చెయ్యి బలహీనం కావడం ►నడిస్తే అడుగులు తడబడటం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సీటీ స్కాన్ చేసి, తక్షణం చికిత్స మొదలుపెట్టాలి. పక్షవాతం వచ్చిన మూడు నుంచి నాలుగున్నర గంటలలోపు చికిత్స అందించగలిగితే శరీరం చచ్చుబడకుండా కాపాడవచ్చు. ఇక ప్రధాన చికిత్స తర్వాత పక్షవాతం నుంచి పూర్తిగా కోలుకోడానికి ఫిజియోథెరపీ చికిత్స కూడా అవసరమవుతుంది. డా. జయదీప్ రాయ్ చౌధురి, సీనియర్ ఫిజీషియన్, యశోద హస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
ఎంత కష్టపడితే అంత సుఖం!
సాక్షి, అమరావతి: ఎంతగా కష్టపడితే అంతగా సుఖపడతారు అనేది జీవితానికే కాదు శరీరానికి సైతం వర్తిస్తుంది. ఆధునిక జీవనశైలి అనారోగ్యాన్ని ఆహ్వానిస్తోంది. నేటితరం మనుషులకు వ్యాయామం అంటే ఏమిటో తెలియకుండా పోతోంది. ఫలితంగా మధుమేహం, హైపర్ టెన్షన్, గుండెపోటు, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ–అసాంక్రమిక వ్యాధులు) సంక్రమిస్తున్నాయి. ఒకప్పుడు జీవిత చరమాంకంలో వచ్చే మధుమేహం ఇప్పుడు మూడు పదుల వయసులోనే పలుకరిస్తోంది. చాలామంది నలభై ఏళ్ల వయసుకు ముందే గుండెపోటు బారిన పడుతున్నారు. ఇక రక్తపోటు కామన్ డిసీజ్‌గా (సాధారణ జబ్బు) మారిపోయింది. అధిక రక్తపోటు కారణంగా ఏటా వేలాది మంది పక్షవాతం (పెరాలసిస్) బారిన పడి శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. అసాంక్రమిక వ్యాధుల వల్ల బాధిత కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు... శరీరానికి తగిన వ్యాయామం లేక జబ్బులకు గురవుతుండగా, మరోవైపు జంక్ ఫుడ్ వినియోగం పెరుగుతుండడం తీవ్ర అనర్థాలకు దారి తీస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) సర్వే ప్రకారం.. ఆధునిక యుగంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం బాగా తగ్గిపోయింది. దీనివల్ల చిన్నతనం నుంచి రకరకాల జబ్బులు సోకుతున్నాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక ఉండాలని, లేదంటే చాలా జబ్బులు చుట్టుముడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 20 శాతం మంది మధుమేహ(డయాబెటిస్) బాధితులేనని అంచనా. జీవనశైలి జబ్బులు అమాంతం పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌తో(ఐసీఎంఆర్) కలిసి పైలెట్ ప్రాజెక్టు కింద విశాఖ, కృష్ణా జిల్లాల్లో హైపర్ టెన్షన్ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. తర్వాతి దశలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. -
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు!
అప్పటివరకూ లేని బీపీ డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే వస్తోందా? ఇలా మీకు మాత్రమే కాదు.. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఇలాంటి చిత్రమైన అనుభవమే ఎదురవుతోంది. ఇంట్లో, ఆఫీసులో లేదా ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఉన్న బీపీ.. డాక్టర్ దగ్గరకు వెళ్లేసరికి నార్మల్ అయిపోతోందా? దేశంలో 18 శాతం మందికి ఇలాగే అవుతోంది. ఇంతకీ ఏమిటిది? లేని బీపీ ఉన్నట్లు.. ఉన్న బీపీ లేనట్లు.. సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న హైపర్‌టెన్షన్ తీరుతెన్నులపై ఇండియా హార్ట్ స్టడీ(ఐహెచ్ఎస్) ఇటీవల దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 9 నెలలపాటు అధ్యయనం నిర్వహించింది. ఇందులో 1,233 మంది వైద్యులు పాల్గొన్నారు. ఇండియా హార్ట్ స్టడీ ముఖ్య పరిశోధకుడు, బీహెచ్ఎంఆర్సీ చైర్మన్ అండ్ డీన్ అకడమిక్ రీసెర్చ్ డాక్టర్ ఉపేంద్రకౌల్, కార్డియోవాస్క్యులర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాస్ట్రీచ్ డాక్టర్ విల్లెం వెర్బెక్, అపోలో ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సునీల్‌కపూర్, ఉస్మానియా ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మనీషాసహాయ్ల బృందం బుధవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను విడుదల చేసింది. ‘ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 15 రాష్ట్రాల్లో 23,253 మందికి స్క్రీనింగ్ నిర్వహించాం. వీరిలో 18,918 మంది రక్తపోటును రికార్డు చేశాం. వారంపాటు రోజుకు నాలుగుసార్లు ఇటు క్లినిక్‌తో పాటు అటు ఇంట్లోనూ టెస్ట్ చేయగా.. ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి’ అని వైద్యులు తెలిపారు. వైట్‌కోట్.. మాస్క్డ్: అప్పటివరకూ బీపీ లేని వ్యక్తి వైద్యుడి వద్దకు వచ్చినప్పుడు ఆ పరిసరాలు అవి చూసి ఆందోళనకు గురవడంతో పరీక్షలో బీపీ ఉన్నట్లు తేలుతోంది. దీన్ని వైట్‌కోట్ హైపర్‌టెన్షన్ అని అంటారు. దీని వల్ల బీపీ ఉన్నట్లుగా భావించి.. వైద్యుడు మందులు రాస్తున్నాడు.. బీపీ లేకున్నా మందులు వాడటం వల్ల రోగుల ఆరోగ్యం దెబ్బతింటోంది.. దేశవ్యాప్తంగా వైట్‌కోట్ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నవారి శాతం 23గా ఉండగా.. తెలంగాణలో అది 35.9 శాతంగా ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. అలాగే ఉన్న బీపీ లేనట్లుగా కనిపించే మాస్్కడ్ హైపర్ టెన్షన్ రాష్ట్రంలో 14.3% మందిలో ఉన్నట్లు తేలింది. సాధారణంగా హృదయ స్పందన రేటు నిమిషానికి 72 ఉండాలి.. అయితే.. భారతీయుల్లో అది 80గా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయంతో పోలిస్తే.. సాయంత్రం బీపీ ఎక్కువగా ఉంటోందని చెప్పారు. 41% మందికి తమకు అధిక రక్తపోటు ఉన్న సంగతే తెలియదట.. సరైన వ్యాధి నిర్ధరణ జరగకపోవడం, నిర్లక్ష్యం వంటి వాటి వల్ల గుండెతోపాటు మూత్రపిండాలూ దెబ్బతింటున్నాయని వైద్యులు తెలిపారు. అందుకే బీపీ ఉన్నట్లు సరిగా నిర్ధా రణ కావాలంటే కనీసం వరుసగా నాలుగైదు రోజుల పాటు పరీక్షించుకుని నిర్ధారించుకోవడం ఉత్తమమని వైద్యులు ప్రకటిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
హైపర్ ‘టెన్షన్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా హైపర్ టెన్షన్(అధిక రక్తపోటు) బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పట్టణాల నుంచి గ్రామాలకు సైతం విస్తరించిన ఈ జీవనశైలి జబ్బుపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధిక రక్తపోటును ప్రాథమిక దశలోనే గుర్తించి నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, దీనివల్ల బాధితులు శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారని రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, నియంత్రించడానికి రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లో కేంద్రం పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. తాజాగా దీన్ని మరో 100 జిల్లాలకు విస్తరింపజేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనూ రెండు జిల్లాలను ఎంపిక చేయనుంది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో చేపట్టనున్న స్క్రీనింగ్ పరీక్షలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారం అందిస్తోంది. హైపర్ టెన్షన్‌ను సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే రానున్న ఐదేళ్లలో మరో ఐదారు కోట్ల మంది దీనిబారినపడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అధిక రక్తపోటు బాధితులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, 2025 నాటికి ఈ వ్యాధి విస్తరణను కనీసం 25 శాతం అరికట్టాలని సూచించింది. బాధితులకు ప్రభుత్వం తరపున మందులివ్వాలి హైపర్ టెన్షన్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్‌కు (పక్షవాతం) గురవుతున్నారని, వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తాజాగా రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ (నిర్ధారణ) పరీక్షలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని, ఇందుకోసం నర్సులకు, హెల్త్ వర్కర్లకు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని, బాధితులకు ప్రభుత్వం తరఫునే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ‘హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్’గా మార్చాలని, గ్రామస్థాయిలో అధిక రక్తపోటు బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికం ఆంధ్రప్రదేశ్‌లో హైపర్ టెన్షన్ బాధితుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల నివేదికలో తేలింది. రాష్ట్రంలో దాదాపు కోటి మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్లు అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా బాధితులు ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోనూ బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. హైపర్ టెన్షన్ బాధితులు పెరుగుతున్న కారణంగా గుండెపోటు, పక్షవాతం కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రాథమిక దశలోనే గుర్తించాలి ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాము హైపర్ టెన్షన్ బారిన పడినట్లు కూడా తెలియదు. పట్టణాల్లో కూడా చాలామంది తమకు వ్యాధి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తూ హైపర్ టెన్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన వారు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అసాధారణంగా ఉన్నవారికీ గుండెపోటు వచ్చే ప్రమాదం 10 శాతం ఎక్కువ. ప్రాథమిక దశలోనే గుర్తించి, మందులు వాడితే జబ్బును అదుపులో ఉంచుకోవచ్చు’’ – డా.చంద్రశేఖర్, హృద్రోగ నిపుణులు, సూపరింటెండెంట్, కర్నూలు జనరల్ ఆస్పత్రి -
వీటితో అకాల మరణాలకు చెక్
లండన్ : బీపీని అదుపులో ఉంచుకుని ఉప్పు, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉంటే రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2040 నాటికి గుండె జబ్బులను ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా పెద్ద ఎత్తున నియంత్రించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఉప్పు, కొవ్వు పదార్ధాలతో తయారయ్యే ప్రాసెస్డ్ ఆహారాన్ని అధికంగా తీసుకుంటే రక్తపోటు తీవ్రమై గుండె జబ్బులకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బీపీని చికిత్స ద్వారా నియంత్రించడం వల్ల కోట్లాది మందిని అకాల మృత్యువాత పడకుండా కాపాడవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. బీపీకి సరైన చికిత్స ద్వారా 4 కోట్ల మందిని, ఉప్పు వాడకం తగ్గించడం ద్వారా మరో 4 కోట్ల మందిని మరణాల ముప్పు నుంచి తప్పించవచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధక బృందం వెల్లడించింది. ఇక కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండటం ద్వారా 2040 నాటికి రెండు కోట్ల మందిని మృత్యువు అంచు నుంచి బయటపడవేయవచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలు అథ్యయనాల్లో వెల్లడైన గణాంకాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. -
డజనుకు రెండు డజన్ల మేలు
అరటిపండు అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. మిగతా పండ్లతో పోలిస్తే ఒకింత చవక కూడా. ఇందులోని అనేక రకాల పోషకాలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అరటితో ఆరోగ్యానికి కలిగే లాభాల్లో కొన్ని..! ►అరటిపండులో పొటాషియమ్ ఎక్కువ. పొటాషియమ్ అధిక రక్తపోటు (హైబీపీ)ని నియంత్రిస్తుంది. అందుకే హైబీపీ ఉన్నవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది. ఇందులోని పొటాషియమ్ మన మూత్రపిండాల ఆరోగ్య నిర్వహణకు కూడా బాగా తోడ్పడుతుంది ►అరటిపండులో అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి. ఈ వేసవికాలంలో ఒంట్లో ఖనిజలవణాలు తగ్గి మాటిమాటికీ కండరాలు పట్టేస్తున్న వారు అరటిపండు తింటే మంచిది. అందులోని ఖనిజలవణాల కారణంగా అరటిపండ్లు తింటే ఆ సమస్య తగ్గుతుంది. ఈ కారణం వల్లనే బాగా చెమటను కోల్పోయే ఆటగాళ్లు తాము కోల్పోయే ఖనిజలవణాలను భర్తీ చేసుకోడానికి ఆటమధ్యలో తరచూ అరటిపండు తింటుండటం మనం టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఆటల్లో చూస్తుంటాం. వ్యాయామం తర్వాత రెండు అరటిపండ్లు తింటే వ్యాయామ సమయంలో కోల్పోయిన శక్తి త్వరగా భర్తీ అవుతుంది. అంతేగాక వ్యాయామ అనంతరం మనకు సమకూరే ఆరోగ్యాన్ని చాలాకాలం పాటు పదిలంగా కొనసాగేలా చూస్తుంది ►అరటి పండులోని విటమిన్ సి, విటమిన్ బి6... గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడతాయి ►ఆస్తమా ఉన్నవారు అరటిపండు తినకూడదనే అభిప్రాయం ఉంది. కానీ అది కేవలం అపోహ మాత్రమే. కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం... చిన్నప్పుడు అరటిపండ్లు పుష్కలంగా తిని పెరిగిన పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశాలు 34 శాతం తగ్గుతాయని నిరూపణ అయ్యింది ►అరటిపండు జీర్ణశక్తిని పెంచి, ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండ్లు మలబద్దకం లాంటి సమస్యలనూ నివారిస్తాయి ►అరటిపండులోని అమైనో యాసిడ్స్ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. -
హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి... రాకుండా జాగ్రత్తలేమిటి?
ఈమధ్య ‘హార్ట్ ఫెయిల్యూర్’తో చనిపోయారు అనే వార్తలు తరచూ వింటున్నాం. అసలు హార్ట్‌ఫెయిల్యూర్ అంటే ఏమిటి? ఎందుకిలా జరుగుతుంది? అసలు హార్ట్ ఫెయిల్యూర్ అయితే మనిషి ఎలా బతుకుతాడు? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరంగా తెలపండి. గుండె మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం. శరీరంలో అవయవాలన్నింటికీ నిరంతరం రక్తం సరఫరా చేస్తుండే ఒక అద్భుతమైన పంపింగ్ మోటార్ ఇది. ఈ రక్తప్రసరణ వల్లనే అన్ని అవయవాలకూ పోషకాలు, ఆక్సిజన్ అందడం మాత్రమే కాకుండా రక్తంలో చేరిన కార్బన్ డై ఆక్సైడ్, శరీరంలోని జీవక్రియల వల్ల ఉత్పన్నమైన ఇతర వ్యర్థపదార్థాల తొలగింపు జరుగుతుంటుంది. ఈ విధంగా దేహంలో ప్రసరణ వ్యవస్థ నిర్వహణలో గుండె కీలకమైన బాధ్యతను నిర్వహిస్తూ ఉంటుంది.ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు పంపించే ప్రక్రియను నిర్వహించడంలో ఊపిరితిత్తులతో కలిసి పనిచేస్తుంది. అనేక రకాల పరిస్థితుల్లో గుండె దెబ్బతింటుంది. వీటిలో ముఖ్యమైనది అధికరక్తపోటు (హైపర్‌టెన్షన్/హైబీపీ), కరోనరీ ఆర్టరీ డిసీజ్, డయాబెటిస్, స్థూలకాయం (ఒబేసిటీ). వీటితో పాటు వాల్వ్‌లార్ డిసీజ్, వైరల్ ఇన్ఫెక్షన్లు, మితిమీరిన మద్యపానం, పోషకాహార లోపం, కీమో–రేడియేషన్ల (క్యాన్సర్ చికిత్సల్లో) అనంతర స్థితి, వాపు (ఇన్ఫ్లమేటరీ స్టేట్) వల్ల కూడా గుండె దెబ్బతింటుంది.ఈ పరిస్థితులను నివారించడం, ఇందుకు కారణమయ్యే అంశాల నుంచి దూరంగా ఉండటం వల్ల గుండెకు జరిగే నష్టాన్ని చాలావరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల గుండెకు వాటిల్లబోయే నష్టాన్ని చాలావరకు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం తొలిదశలోనే వ్యాధిని గమనించడం, దానికి దారితీస్తున్న కారణాలను గుర్తించడం ముఖ్యం. ఒకసారి గుండె దెబ్బతింటే మళ్లీ మునపటి స్థితిని పునరుద్ధరించుకునే సామర్థ్యం గుండెకు ఉండదు. అందుకే గుండె దెబ్బతినకుండానే తీసుకునే నివారణ చర్యలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా కీలకమైన భూమిక నిర్వహిస్తాయి. లక్షణాలు ఇటు డాక్టర్లు, అటు పేషెంట్లు హార్ట్‌ఫెయిల్యూర్ లక్షణాలను వెంటనే గుర్తించాలి. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా, పడుకొని ఉన్నా శ్వాస అందకపోవడం, అలసట, కాళ్లవాపు, ఊపిరితిత్తుల్లో ఒత్తిడి ఏర్పడటం, పొట్ట ఉబ్బడం మొదలైనవి హార్ట్‌ఫెయిల్యూర్ లక్షణాలు. ఇవి కనిపించిన వెంటనే రోగి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి, తీవ్రతను అంచనా వేయాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈసీజీ, 2–డి ఎకో కార్టియోగ్రఫీ, మరికొన్ని రక్తపరీక్షల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్‌ను డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.ఇటీవల మరిన్ని ఆధునిక విధానాలు వాడుకలోకి వచ్చాయి. బయోమార్కర్లను ఉపయోగించి హార్ట్‌ఫెయిల్యూర్‌ను గుర్తించడం, వర్గీకరించడం చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఇమేజింగ్ పద్ధతులు కూడా చాలా అభివృద్ధి చెందాయి. వీటివల్ల వ్యాధిని వేగంగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయగలుగుతున్నారు. వీటిలో 3–డితో కూడిన ఎకోకార్డియోగ్రఫీ వ్యాధి నిర్ధారణ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచింది. ఇది గుండెపనితీరు, గుండె కవాటాల పనితీరు, గుండెలోని ఒత్తిడిని అధ్యయనం చేయడానికి సాయపడుతుంది. ఎకో ద్వారా పూర్తిగా నిర్ధారణకు రాలేని సందర్భాల్లో కార్డియాక్ ఎమ్మారై ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం. వీటితోపాటు కార్డియాక్ కాథటరైజేషన్, న్యూక్లియార్ స్కాన్ (పెట్, స్పెక్), ఎండోకార్డియల్ బయాప్సీ, టాక్సికాలజీతో రోగనిర్ధారణ చేస్తున్నారు. గుండెను కాపాడుకోవడం ఇలా... మనం ముందుగా మన అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవాలి. అయితే అధిక రక్తపోటు విషయంలో చాలామంది నిర్లక్ష్యంగానో లేదా ఉదాసీనంగానో వ్యవహరిస్తుంటారు. అధిక రక్తపోటును (హైబీపీని) అదుపులో ఉంచడం ద్వారా రక్తనాళాలకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అలా జరగకపోతే గుండె దమనులు తీవ్రంగా దెబ్బతీసి, గుండెకండరాలను మందంగా తయారుచేస్తుంది. దాంతో గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం చాలావరకు తగ్గిపోతుంది. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నప్పుడు కూడా దాదాపు ఇలాంటి అంశాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అటు హైబీపీ, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం, ఇటు స్థూలకాయాన్ని నివారించుకొని ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం అవసరమవుతుంది. జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా గుండెకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రోజుకు కనీసం 30 – 35 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, తాజా పండ్లు, కూరగాయలు–ఆకుకూరలతో కూడిన పోషకాహారం తీసుకోవడం, ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత వంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగతాగడం వల్ల గుండె మీద తీవ్రమైన భారం పడుతుంది. మద్యం కూడా గుండెకు అనర్థాలను తెచ్చిపెడుతుంది. ఆ అలవాట్లను వెంటనే ఆపేయాలి. ఇక రక్తంలో కొలస్ట్రాల్ ఉంటే దానివల్ల కరొనరీ దమనల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి.మొత్తంమీద పూర్తిగా నష్టం జరగకమునుపే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం వల్ల గుండెకు వాటిల్లే నష్టం నివారించడానికి వీలవుతుంది. తద్వారా హార్ట్‌ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఒకసారి గుండెపోటుకు గురైతే ఆలస్యం చేయకుండా గుండెకు రక్తసరఫరాను పునరుద్ధరించడం కూడా చాలా కీలకం. దానివల్ల తక్షణ రక్షణతో పాటు మున్ముందు మరింత నష్టం జరగకుండా చూసుకోడానికి, దీర్ఘకాలంలో దుష్ఫలితాలు ఏర్పడకుండా చూడవచ్చు. డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
టెండనైటిస్ తగ్గుతుందా?
నా వయసు 35 ఏళ్లు. నేను క్రీడాకారుణ్ణి కావడంతో అన్ని రకాల ఆటలు బాగా ఆడుతుంటాను. నాకు కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు కలుగుతుంది? హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి హోమియో ద్వారా పూర్తి పరిష్కారం లభిస్తుంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటారు. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. వీటికి సాగే గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కారణాలు వయసు పెరగడం, గాయం కావడం, వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిక ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. క్రీడల వల్ల : ►పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల. ►డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారిలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. ►కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ టెండినైటిస్ సంభవించే అవకాశం ఉంది. లక్షణాలు టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడంవంటి లక్షణాలను గమనించవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం. ►పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం ►వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం ►క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం ద్వారా రోగి తాలూకు రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా దానిని నయం చేయడమే కాకుండా టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మైగ్రేన్‌కు చికిత్స ఉందా? నా వయసు 25 ఏళ్లు. నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధిక ప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంవశిక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్స్టిట్యూషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తారు. బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లమచ్చలు... తగ్గేదెలా? నా వయసు 39 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
రక్తపోటు, మధుమేహం ఉందా? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి
మన శరీరంలో మూత్రపిండా(కిడ్నీ)లను చాలా సంక్లిష్టమైన, కీలకమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. అవి శరీరంలో విషతుల్యమైన పదార్థాలను మూత్రం ద్వారా వడపోసి బయటకు విసర్జిస్తాయి. అంతేకాదు... కీలకమైన హార్మోన్లు, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. చిక్కుడుగింజ ఆకృతిలో ఉండే మూత్రపిండాల్లో ఎడమవైపుది కొంచెం పెద్దగా ఉండి, కుడివైపు దానికంటే కాస్త ఎగువన ఉంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు బరువుండే మూత్రపిండాలు 11–14 సెంమీ. పొడవు, 6 సెం.మీ. వెడల్పు, 4 సెం.మీ. మందంగా ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలోనూ కిడ్నీలది ప్రధాన పాత్ర. అందుకే బీపీ ఎక్కువగా ఉంటే కిడ్నీ పరీక్షలను కూడా పూర్తిగా చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహం తో బాధపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి. మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 1. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ 2. కిడ్నీ స్టోన్స్ 3. కిడ్నీ ఫెయిల్యూర్ 4. కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాల వరకు పాకి అక్కడా ఇన్ఫెక్షన్లను కలగజేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే మూత్రపిండాలలోని రాళ్లలో ఇసుకరేణువు పరిమాణం మొదలుకొని గోల్ఫ్‌బాల్ సైజువరకూ ఉంటాయి. వీటిలో కొన్ని రకాలు అంత ప్రమాదకరం కాకపోయినా తీవ్రమైన నొప్పిని, బాధను కలిగిస్తాయి. సైజును బట్టి అనేకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అధిక బరువు, స్మోకింగ్, ఆల్కహాల్, రక్తపోటు, షుగర్‌లెవల్స్ అదుపులో లేకపోవడం వల్ల ఆ దుష్ప్రభావాలు మూత్రపిండాల మీద పడి అది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యకు దారితీయవచ్చు. మూత్రపిండాలు ఫెయిల్ అయనప్పుడు మాత్రమే లక్షణాలు బయటపడుతుంటాయి. అందుకే దీన్ని ఒక సైలెంట్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స పద్ధతులు అనుసరించడం తప్పనిసరి కావచ్చు.పుట్టుకతో వచ్చే మూత్రపిండాల్లో కణుతులు, పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ దగ్గరికి చెకప్స్‌కు తీసుకెళ్లినప్పుడు బయటపడుతూ ఉంటాయి. కణితి పరిమాణం బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి–బరువు తగ్గడం, అజీర్ణం, అధికరక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్‌గా చెప్పుకునే మూత్రపిండాల్లో కణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతూ ఉంటాయి. వీటిని పూర్తిగా నయం చేయడం సాధ్యమే. రీనల్‌సెల్ కార్సినోమా (ఆర్సీసీ): ఈ రకం కణితి పెద్ద వయసు వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కొక్కసారి ఇలా ఇతర చోట్లకు పాకిన (మెటాస్టాసిస్ అయిన) భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం జరుగుతూంటుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలో కూడా ఈ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్–టైప్లలో ఉండే ఈ క్యాన్సర్... ఇతర కిడ్నీ సంబంధిత పరీక్షలలో, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలో కనుగొనడం కూడా జరుగుతూ ఉంటుంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే స్మోకింగ్ చేసేవారిలో చిన్నవయసు వారిలోనూ ఈ క్యాన్సర్ నమోదువుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్, అధికబరువు వంటి వాటితో పాటు జీన్మ్యుటేషన్స్ ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పుడు ఫిజికల్ ఎగ్జామ్, బ్లడ్ టెస్ట్‌లు, యూరినరీ టెస్టులు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవల్స్ తెలిపే పరీక్షలతో పాటు, ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడే సమయానికి అది ఊపిరితిత్తులకు, ఎముకలు పాకి ఉండవచ్చు. కాబట్టి చెస్ట్ ఎక్స్‌రే, బోన్ స్కాన్స్ కూడా చేయిస్తూ ఉండాలి. కిడ్నీని మొత్తంగా తీసివేసే సర్జరీతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలను ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కిడ్నీలను లాపరోస్కోపిక్ పద్ధతిలో కూడా తొలగించడం జరుగుతోంది. క్యాన్సర్ కాని కణుతుల్లో కూడా సైజును బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా, మూత్రపిండాలలో అవి చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా కిడ్నీని తొలగించడం జరుగుతుంది. సర్జరీ తర్వాత కిడ్నీ ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి సర్జరీని 3 రకాలుగా చేస్తుంటారు. రాడికల్ నెఫ్రోక్టమీ: ఎక్కువగా చేసే ఈ సర్జరీలో మూత్రపిండంతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలను, టిష్యూలను మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీ చేస్తారు. సింపుల్ నెఫ్రొక్టమీ స్టేజ్–1: కిడ్నీ క్యాన్సర్‌కు ఒక మూత్రపిండాన్ని మాత్రం తీసివేయడం జరుగుతుంటుంది. పార్షియల్ నెఫ్రోక్టమీ: పుట్టుకతో ఒకే ఒక మూత్రపిండం ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంత మేరకే దాన్ని తీసేవేయడం జరుగుతుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలోనూ కణుతులు ఏర్పడినప్పుడు కూడా మూత్రపిండాలను ఇలా కణితి ఉన్న మేరకు మాత్రమే తీసివేయడం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తీసివేసినప్పుడు సర్జరీ అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణం జీవితాన్ని గడపగలుగుతారు. రెండు మూత్రపిండాలను తీసివేశాక, రెండోది సరిగా పనిచేయకపోతే... వారు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం అవసరం. చికిత్స ముగిశాక కూడా ఫాలో అప్ కేర్ తప్పనిసరి. సీటీస్కాన్, చెస్ట్ ఎక్స్‌రే వంటి టెస్ట్‌లు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి విషాలకు దూరంగా ఉంటే మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలం. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001