సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీవనశైలి వ్యాధుల సూచికల్లో తెలంగాణ పరిస్థితి అత్యంత పేలవంగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. అలాగే స్థూలకాయం, రక్తపోటు కేసుల సంఖ్య సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ‘మెటబాలిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్ ఐఎన్‌డీఐఏబీ) పేరిట లాన్సెట్ రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 25 శాతం మంది సెంట్రల్ ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారు.
దేశవ్యాప్తంగా 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 మధ్య మొత్తం 1,13,043 మంది (గ్రామీణ ప్రాంతాల నుంచి 79,506 పట్టణ ప్రాంతాల నుంచి 33,537 మంది)పై నిర్వహించిన అధ్యయన ఫలితాలను లాన్సెట్ ఇటీవల ప్రచురించింది. ఊబకాయం కేసులలో తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హరియాణా, ఢిల్లీల సరసన నిలుస్తోంది. దీనికి కారణం ఉదర ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్‌కు మధ్య దగ్గరి సంబంధం ఉండటమేనని వైద్య నిపుణులు అంటున్నారు.
శారీరక శ్రమ లేకపోవడం.. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం..
లాన్సెట్ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఊబకాయం, రక్తపోటు, ట్రైగ్లిజరిడెమియా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ‘ఇది తక్కువస్థాయి శారీరక శ్రమతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల పెరుగుతున్న సమస్య. ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగులను ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ సంకేతాలు. చికిత్స తీసుకోకుంటే గుండె, మూత్రపిండాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరించారు.
హైపర్ టెన్షన్... స్లీప్ అప్నియాలకూ దోహదం..
‘పన్నీర్, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధికస్థాయి కొలస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు డెస్క్ జాబ్‌లు సెంట్రల్ ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఊబకాయంతో గుండె జబ్బులు, మధుమేహమే కాకుండా హైబీపీ, స్లీప్ యాప్నియా వంటి ఇతర జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సమస్యలకు అధిక మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
అలవాట్లను కట్టడి చేస్తేనే..
పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు అధికంగా చేరడాన్నే సెంట్రల్ ఒబేసిటీగా పేర్కొంటారు. పెరిగిన విసరల్ ఫ్యాట్ పోర్టల్ బ్లడ్ సిస్టమ్ ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోని అదనపు కొవ్వు రక్తప్రవాహంలోకి కొవ్వు నిల్వలను విడుదల చేస్తుందన... ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో వ్యాయామం, శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం తప్పనిసరని వారు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment