
దేశంలో ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఈ తరహాలో గుండెపోటు, స్ట్రోక్, గుండె, ధమనుల వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పాతికేళ్లలోపువారిలోనూ గుండపోటు కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికి కారణమేమిటి? వైద్యులు ఏమంటున్నారు?

పురుషుల్లోనే అధికం
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్నేళ్లుగా 50 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటు ముప్పు 50 శాతం, 40 ఏళ్లలోపు వారిలో 25 శాతం మేరకు పెరిగింది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.. మహిళల్లో గుండెపోటు కేసులు చాలా తక్కువని తెలిపింది. పురుషులు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ధూమపానం, మద్యపానం అనేవి యువతలో హృదయ సంబంధ వ్యాధులకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ వ్యసనాల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఇది కరోనరీ హార్ట్ డిసీజ్‌కు దారితీస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది రక్త నాళాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.

కారణాలివే..👇
👉ఆహారపు అలవాట్లు
ఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ పని ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో యువత తమ ఆహారపు అలవాట్లు, దినచర్యపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇది పలు రకాల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తోంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని కారణంగా శరీరంలోని కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
👉అధిక పని ఒత్తిడి
మానసిక ఒత్తిడి కూడా గుండెపోటుకు కారణంగా నిలుస్తోంది. పని భారం అనేది నేరుగా రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా యువకులు, మధ్య వయస్కులు రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఎనిమిది గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

👉మధుమేహం
యువతలో గుండె జబ్బులకు మధుమేహం (డయాబెటిస్) కూడా ఒక ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటిస్ రోగులు అత్యధికంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిక్ బాధితులు ఉన్నారని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2045 నాటికి డయాబెటిస్ రోగుల సంఖ్య 13 కోట్లకు పైగా పెరుగుతుందనే అంచనాలున్నాయి.
జిమ్, డ్యాన్స్ సమయంలోనే ఎందుకంటే..
అధికంగా శారీరక శ్రమ చేయడం వలన గుండె ధమనులలో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ చీలిపోయే ప్రమాదం మరింతగా పెరుగుతుంది ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండెపోటు ముప్పు కూడా మరింతగా పెరుగుతుంది. అందుకే నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా నృత్యం చేసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నృత్యం చేసే సమయంలో హృదయ స్పందన పెరుగుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఊబకాయం కలిగివారు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఎక్కువ స్టెప్స్ కలిగిన నృత్యం చేస్తున్నప్పుడు వారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్తపడండి
ఛాతీ, వీపు, గొంతు, దవడ లేదా రెండు భుజాలలో తరచూ నొప్పిగా అనిపిస్తుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే ఉన్నట్టుండి చెమటలు పడుతున్నా, ఊపిరి ఆడటం కష్టంగా అనిపించినా, రెండు అడుగులు కూడా వేయలేనంత నీరసంగా అనిపించినా వెంటనే వైద్య నిపుణులను కలుసుకోవాలి. ఇదేవిధంగా ఛాతీలో, ఉదరంలో గ్యాస్ ఏర్పడినా, విపరీతమైన అలసట లేదా తల తిరుగుతున్నట్లు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఛాతీ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, శ్వాస సమస్యలు లేదా వేగంగా శ్వాస తీసుకోవడం మొదలైనవి గుండెపోటు సంబంధిత లక్షణాలు కావచ్చని గుర్తించాలని, ఇటువంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
గుండెలో సమస్యలు
👉హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి
గుండె కండరాలు గట్టిపడే జన్యుపరమైన రుగ్మత. దీని వలన గుండె రక్తాన్ని సమర్ధవంతంగా పంప్ చేయలేకపోతుంది.
👉డైలేటెడ్ కార్డియోమయోపతి
దీనిలో ఎడమ జఠరిక పెద్దదిగా, బలహీనంగా మారుతుంది. ఇది గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా ప్రసరింపజేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
👉అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ డిస్ప్లాసియా
దీనిలో కొవ్వు లేదా పీచు కణజాలం గుండె కండరాలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ప్రాణాంతక అరిథ్మియా ముప్పును మరింతగా పెంచుతుంది.
ముందుగా చేసే పరీక్షలివే..
👉ఎకోకార్డియోగ్రఫీ (ఎకో)
గుండె పనితీరునంతటినీ అంచనా వేయడానికి చేసే గుండె సంబంధిత అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఇది.
👉స్ట్రెస్/ట్రెడ్‌మిల్ పరీక్ష
శారీరక శ్రమ చేసే సమయంలో గుండె ఎలా స్పందిస్తుందో ఈ పరీక్ష అంచనా వేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది.
👉జెనెటిక్ పరీక్ష
ఆకస్మిక గుండెపోటు, వారసత్వంగా వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు.
👉హోల్టర్ పర్యవేక్షణ
హోల్టర్ మానిటర్ అనేది హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది. ఇది గుండె సంబంధిత అసాధారణ సంకేతాలను తనిఖీ చేస్తుంది. బాధితులకు అవసరమైనప్పుడు వైద్యులు 24 గంటల హోల్టర్ పర్యవేక్షణను సూచిస్తుంటారు.
వెంటనే ఏం చేయాలంటే..
అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ అనేది ప్రాణాలను కాపాడుతుంది. సీపీఆర్ చేయడం ద్వారా మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. కణజాల మరణాన్ని కొంతసేపటి వరకూ నివారిస్తుంది. సీపీఆర్ అందని పక్షంలో ఐదు నిమిషాల్లో మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఎనిమిది నిమిషాల తర్వాత మరణం దాదాపు ఖాయమని వైద్యులు చెబుతున్నారు.
అత్యవసర సేవలకు కాల్
ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే పక్కనే ఉన్నవారు ఆ వ్యక్తిని కదిలిస్తూ ‘బాగున్నారా?’ అని గట్టిగా అడగాలి. వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలి. బాధితులు శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది గుర్తించాలి. బాధితుడు శ్వాస తీసుకోకవడం లేదని గుర్తిస్తే అతని ఛాతీ మధ్యలో గట్టిగా వేగంగా అదమండి. నిమిషానికి 100 నుండి 120 సార్లు ఇలా చేయాలి. సీపీఆర్‌లో శిక్షణ పొందినవారు 30 కంప్రెషన్ల తర్వాత రెస్క్యూ శ్వాసలను అందించగలుగుతారు. శిక్షణ పొందనివారు ఛాతీ కంప్రెషన్లను కొనసాగించాలి. అదేవిధంగా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి: Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు
Comments
Please login to add a commentAdd a comment