శోధన
కలంకారి అనే మాట ఎంతో సుపరిచితం. అయితే ఈ సుప్రసిద్ధ కళ చరిత్ర చాలామందికి అపరిచితం. ఆ ఘనచరిత్రను ఈ తరానికి పరిచయం చేయడానికి, కలంకారీని మరింత వైభవంగా వెలిగించడానికి పూనుకుంది లీలావతి. కలంకారి అద్దకపు పనికి బోలెడంత ఓపిక కావాలి అంటారు.
పరిశోధకులకు కూడా అంతే ఓపిక కావాలి. పెద్ద వస్తువు నుంచి చిన్నవాక్యం వరకు ఎన్నో ఎన్నెన్నో పరిశోధనకు ఇరుసుగా పనిచేస్తాయి. ఈ ఎరుకతో కలంకారిపై లోతైన పరిశోధన చేసిన లీలావతి.. ఆ కళపై పీహెచ్‌డీ పట్టా పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంటోంది..
కలంకారి అంటే గుర్తుకు వచ్చేది పెడన. కృష్ణాజిల్లా పెడన పట్టణంలో కలంకారి వస్త్రాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 2,500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ కళపై చరిత్ర అధ్యాపకురాలు గుడివాడకు చెందిన పామర్తి లీలావతి పరిశోధన చేసింది. ఈ పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి ఇటీవల పీహెచ్‌డీ పట్టా అందుకుంది. కలంకారిపై తొలిసారిగా పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందిన మహిళగా ప్రశంసలు అందుకుంటోంది.
పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా విధుల్లో చేరిన లీలావతికి సహజంగానే అక్కడి వాతావరణం వల్ల కలంకారి కళపై ఆసక్తి పెరిగింది. కళాశాలకు వెళ్లే సమయంలో కలంకారి వస్త్రాలపై ముద్రణ నుంచి కలంకారి కళాకారుల జీవన శైలి వరకు ఎన్నో విషయాలు గమనించేది. నాగార్జున యూనివర్శిటీలో కలంకారి పరిశ్రమలపైన, ఆయా కుటుంబాల సామాజిక పరిస్థితులపై ఒకసారి పరిశోధన ప్రసంగం చేసింది.
ఆ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ‘కలంకారి కళ’పై పీహెచ్‌డీ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ స్టూడెంట్‌గా ప్రవేశం పొందింది. ‘కలంకారి కళకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశవిదేశాల్లో గుర్తింపు ఉన్న కలంకారిపై ఇప్పటి వరకు ఎవరూ పరిశోధన చేయక పోవడంతో నేనే ఎందుకు చేయకూడదని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేశాను’ అంటుంది లీలావతి. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న లీలావతి కలంకారిపై మరిన్ని పరిశోధనలు చేయాలని ఆశిద్దాం.
ఎన్నో దారులలో...
కలంకారిపై పరిశోధనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందడం సంతోషంగా ఉంది. కలంకారి పరిశ్రమ చరిత్ర, సంస్కృతి, దేశ విదేశాల్లో ఉన్నప్రాధాన్యం, ఆదరణ, కార్మికుల జీవన స్థితిగతులపై నా పరిశోధనలో సమగ్రంగా తెలుసుకున్నాను. పరిశోధనలో ఉన్న విశేషం ఏమిటంటే ఒక దారి అనేక దారులకు దారి చూపుతుంది. ఇలా కలంకారి గురించి అనేక కోణాలలో అనేక విషయాలు తెలుసుకోగలిగాను.
– పామర్తి లీలావతి
– నారగాని గంగాధర్
సాక్షి, పెడన
Comments
Please login to add a commentAdd a comment