‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో మాట్లాడుతున్న సాధ్వి భగవతి సరస్వతి
‘క్షమించకపోతే మీరు గతంలోనే ఉండిపోతారు’ అంటారు సాధ్వి భగవతి సరస్వతి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ యూదురాలు పాతికేళ్లుగా హృషికేశ్‌లో జీవిస్తూ ఆధ్యాతికత సాధన చేయడమే కాదు సామాజిక సేవలో విశేష గుర్తింపు పొందారు. ‘ఆధునిక జీవితంలో పరుగు పెడుతున్నవారు ఆనందాలంటే ఏమిటో సరిగ్గా నిర్వచించుకోవాలి’ అన్నారామె. ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో వెలువడి బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన తన ఆత్మకథ గురించి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో మాట్లాడారు.
ఆమె ఒక కథతో మొదలెట్టింది.
‘ఒక ఊరిలో కోతుల బెడద ఎక్కువైంది. వాటిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలి. ఏం చేశారంటే కొబ్బరి బోండాలకి కోతి చేయి పట్టేంత చిన్న చిల్లి చేసి వాటిలో కోతులకు ఇష్టమైన హల్వాను పెట్టారు. కోతులు ఆ హల్వా కోసం లోపలికి చేయి పెట్టి పిడికిలి బిగిస్తాయి. కాని చేయి బయటకు రాదు. కొబ్బరి బోండాంలో ఇరుక్కున్న చేతితో అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు దానిని పట్టుకుని అడవిలో సులభంగా వదలొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే కోతి గనక పిడికిలి వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది. కాని అది వదలదు. హల్వా కావాలి దానికి. మనిషి కూడా అంతే. తనే వెళ్లి జంజాటాల్లో చిక్కుకుంటాడు. పిడికిలి వదిలితే శాంతి పొందుతాడు’ అందామె.
హృషికేశ్‌లోని గంగానది ఒడ్డున పరమార్థ్ ఆశ్రమ్‌లో గత పాతికేళ్లుగా జీవిస్తున్న సాధ్వి భగవతి సరస్వతి నిజానికి భారతీయురాలు కాదు. భారతదేశంతో ఏ సంబంధమూ లేదు. ఆమె అమెరికాలో జన్మించిన యూదురాలు (అసలు పేరు చెప్పదు). స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత సైకాలజీలో íపీహెచ్‌డీ చేసింది. హాలీవుడ్ ఉండే లాస్ ఏంజిలస్‌లో ఎక్కువ కాలం నివసించిన ఆమె హాలీవుడ్‌లో పని చేసింది కూడా. కాని 1997లో భర్తతో కలిసి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు గంగానది చూసి ఆమె పొందిన ప్రశాంతత అంతా ఇంతా కాదు. ప్రశాంతమైన జీవన విధానం భారతీయ తత్త్వ చింతనలో ఉందని విశ్వసించి అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయింది. విచిత్రమేమంటే ఈ దేశ జీవన విధానాన్ని మరచి ఆధునికవేగంలో కూరుకుపోయిన వారికి ఆమె పరిష్కార మార్గాలు బోధిస్తున్నది.
సంతోషానికి నిర్వచనం ఏమిటి?
‘బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటారు. బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ కోర్సులోనే చేరాలి, ఈ దేశమే వెళ్లాలి, ఫలానా విధంగా పెళ్లి చేసుకోవాలి, ఫలానా విధంగా డబ్బు వెనకేసుకోవాలి... ఇంత ప్రయాస పడితే తప్ప మనిషి సంతోషంగా ఉండలేడన్న భావన తలలో నిండిపోయి ఉంది. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండగలమా? సంతృప్తిగా జీవించడంలో సంతోషం ఉంది. జీవితంలో అనుక్షణం సంతోషం పొందడం నేర్చుకోవడం లేదు. ఎప్పుడో ఏదో సంతోషం దొరుకుతుందనే తాపత్రయంతో ఈ క్షణంలోని సంతోషం పొందకుండా మనిషి పరిగెడుతున్నాడు’ అంటుందామె.
హాలీవుడ్‌ను వదిలి
సాధారణంగా చాలామంది అమెరికాలో స్థిరపడి సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటారు. కాని సాధ్వి భగవతి అమెరికాను విడిచి గంగానది ఒడ్డున ప్రశాంతంగా జీవించడంలో సంతోషం ఉందని ఇక్కడ ఉండిపోయింది. ‘నా భర్త నాకు భారతదేశం గురించి చెప్పాడు. అతనే నన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారి ఇక్కడ గంగానదిని చూశాక, గురువును పొందాక ఇక ఎక్కడికీ వెళ్లకూడదనుకుని ఉండిపోయాను’ అని తెలిపిందామె.
ఆధునిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవనంలో తాను ఎందుకు, ఎలా ప్రయాణించిందో తెలిపే ఆత్మకథను ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో రాసిందామె. అది బెస్ట్ సెల్లర్‌గా ఉంది. గత పాతిక సంవత్సరాలుగా హిమాలయాల్లో పేదవారి కోసం సామాజిక సేవ చేస్తున్నదామె. అందుకే అమెరికా ప్రెసిడెంట్ బైడన్ ఆమెను ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’తో గౌరవించాడు.
ఆ పిల్లల కళ్లల్లో నిశ్చింత
‘హిమాలయాలకు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకపోయినా పిల్లల కళ్లల్లో నిశ్చింత చూశాను. లాస్ ఏంజిలస్‌లో అలాంటి నిశ్చింతతో పిల్లలు ఉండరు. ఆ నిశ్చింత, సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? ఫిర్యాదులు, ప్రతీకారం, క్షమించకపోవడం... మనల్ని ముందుకు పోనీకుండా చేస్తాయి. ఎదుటివాళ్లు చేసిన తప్పులను మనం అంగీకరించకపోవచ్చు. కాని వాటిని దాటి ముందుకెళ్లాలంటే క్షమించడమే మార్గం. లేదంటే మనం గతంలోనే కూరుకుపోతాం. జీవితానికి ఏం మేలు చేస్తున్నావన్నది కాదు... జీవితం ద్వారా ఏం మేలు పొందుతున్నావన్నదే ముఖ్యం’ అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment