Spirituality
-
ఆధునిక రుషుల తపోవనం
సాక్షి ప్రతినిధి, కడప: స్వచ్ఛంద సేవా సంస్థల్లో రామకృష్ణ మిషన్ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్‌గా నిలుస్తోంది. అటు ఆధ్యాత్మిక చింతన..ఇటు సమాజం పట్ల బాధ్యతతో సేవలందించడమే కాకుండా విద్య, వ్యవసాయం, విలువలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. కడపలోని చెన్నూరు బస్టాండ్ సమీపంలో 1910లో రామకృష్ణ సమాజాన్ని ఏర్పాటు చేశారు. అందులో గ్రంథాలయాన్ని నిర్వహించారు. 1992లో రామకృష్ణ సేవా సమితిని భక్తులంతా కలిసి ఏర్పాటు చేసుకున్నారు. 2004 నుంచి దానిని రామకృష్ణ మఠంలో మార్చారు. రెండతస్తుల్లో గ్రంథాలయం, ఆధ్యాత్మిక బోధనలు నిర్వహించారు. 2007లో పుట్లంపల్లె వద్ద అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మఠం నిర్మాణానికి స్థలం ఇచ్చారు. అందులో 2007లో రామకృష్ణ మిషన్ ఏర్పాటైంది. పేదలు, అనాథ బాలలతో బాలకాశ్రామం నిర్వహిస్తున్నారు. వివేకానంద విద్యానికేతన్ పేరిట 7వ తరగతి వరకు మిషన్ ఆవరణంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. అదే ఆవరణంలో వివేకానందుని పేరిట భారీ ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఇందులో ఆధ్యాత్మిక, సామాజిక సభలను కొనసాగిస్తున్నారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా స్వామిజీ, బ్రహ్మచారుల గృహాలున్నాయి. ఆశ్రమమంతా నిరంతరం ప్రశాంతంగా పూల, పండ్ల తోటలతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పుస్తకాల విక్రయాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2012లో ఏర్పాటు చేసిన విశ్వజనీన ఆలయం రామకృష్ణ మిషన్‌కు తలమానికంగా నిలుస్తోంది. ఇందులో అన్ని మతాలకు చెందిన చిత్రపటాలు, వారు తమ మతాచారం ప్రకారం ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా వేదికలు ఉంటాయి. సేవలు–మిషన్ ఆధ్వర్యంలో ‘విద్య’ పేరిట నైతిక విలువలుగల విద్యాబోధన గురించి పాఠశాలలు, కళాశాలల్లో మిషన్ ప్రతినిధులు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆశ్రమ ఆవరణంలో యేటా రెండుమార్లు మూడు నుంచి వారం రోజులపాటు యువ రైతులకు పంటలు, దిగుబడిపై నిపుణులైన వారితో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యేటా ఉపాధ్యాయులకు విలువలుగల విద్యాబోధనపై మూడు రోజులపాటు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 18న జరిగిన రామకృష్ణ పరమహంస జయంతి నేపథ్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. -
ఆధ్యాత్మిక పర్యాటకం.. ఆనందమయం
ప్రపంచం ఆధ్యాత్మికతను స్మరిస్తోంది. మానసిక చింతన, ప్రశాంత జీవనం కోసం వెతుకుతోంది. హాలిడే ట్రిప్పుల్లోని సంతోషాన్ని ఆధ్యాత్మిక పరవశ పర్యటనలుగా మారుస్తోంది. ఈ క్రమంలోనే 2025లో అంచనా వేసిన ఆధ్యాత్మిక మార్కెట్ విలువ 1,378.22 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి 2,260.43 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని ‘ట్రావెల్ టూరిజం వరల్డ్’ నివేదిక పేర్కొంది. ఆధ్యాత్మిక పర్యాటకం సగటున 6.5శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయనుంది. –సాక్షి, అమరావతి విశ్వాసమే నడిపిస్తోంది..ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు వ్యక్తిగత సంపద పెరిగేకొద్దీ, ఎక్కువ మంది ప్రజలు తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక పండుగలపై ఆసక్తి చూపిస్తున్నారు. సాంకేతికత సాయంతో ముందుగా వర్చువల్ టూర్లు చేసిన తర్వాత పర్యటనలను ఖరారు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, భారతదేశం, ఇటలీ వంటి దేశాలు చాలా కాలంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని లోతైన విశ్వాసం, సంస్కృతితో ముడిపడి ఉన్న అనుభవాలను కోరుకునే సందర్శకుల సంఖ్యను పెంచుతున్నాయి. ఈ ధోరణి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల ఆధ్యాత్మిక అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చే ప్రత్యేక పర్యటనలను అందించడానికి ట్రావెల్ ఏజెన్సీలకు అవకాశాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మికతలో ఆనందం..ఆధ్యాత్మిక పర్యటనలు శారీరక–మానసిక శ్రేయస్సుతో మిళితం చేసే వెల్నెస్ టూరిజంగా మారుతోంది. ధ్యానం, యోగాపై దృష్టి సారించే విహార యాత్రలు ఆరోగ్య, ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తున్నాయి. యూఎస్, కెనడా వంటి దేశాల్లో స్థానిక ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతోంది. వాషింగ్టన్ డీసీలోని బసిలికా ఆఫ్ ది నేషనల్ ష్రైన్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ (క్యాథలిక్ చర్చి)కు తాకిడి పెరుగుతోంది. యూరప్‌లోని స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు యూరోపియన్ నాగరికతను అన్వేíÙంచడానికి మైలురాళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆసియా–పసిఫిక్‌లో అయితే భారతదేశంలో దేవాలయాలు, పీఠాలు, చర్చిలు, మసీదులను దర్శించుకునే వారు పెరుగుతున్నారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం, చైనా–జపాన్ దేశాల్లో బౌద్ధారామాలు వంటి పవిత్ర స్థలాలను లక్షలాది మంది సందర్శిస్తున్నారు. మధ్యప్రాచ్యం–ఆఫ్రికాలో అయితే సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, ఇజ్రాయెల్ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మక్కా, జెరూసలేం తీర్థయాత్రలు ఎక్కువ ఉంటాయి. -
క్లిష్ట సమయంలో అవే కాపాడాయి..!: సీఈవో అనుపమ్ మిట్టల్
షాదీ డాట్ కామ్ సీఈవో అనుపమ్ మిట్టల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లలోనే కోటీశ్వరుడి అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒక్కసారిగా ఊహించని నష్టాలతో వ్యాపారం దివాళ తీసే పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. సరిగ్గా ఆ సమయంలో తనకు సహయపడిన వాటి గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అటువైపుకి వెళ్లి ఉండకపోతే మళ్లీ ఇలా నిలబడి మీ ముందుకు వచ్చేవాడిని కాదంటున్నాడు. ఇంతకీ అతడిని వ్యాపారంలో మళ్లీ నిలబడేలా చేసినవి ఏంటో తెలుసా..!చిన్న వయసులోనే కోట్టు గడించారు. ఆయన మైక్రోస్ట్రాటజీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న సమయంలోనే కంపెనీ విలువ రూ.300 కోట్లకు చేరుకుంది. అమెరికాలో విలాసవంతమైన జీవితం గడిపే స్థాయికి చేరుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో 2008 ఆర్థిక మాంద్యం దెబ్బకు అతడి బిజినెస్ ఢమాల్ అని పడిపోయింది.మళ్లీ తిరిగా కోలుకోలేనంత నష్టాలు, అప్పులు చవిచూశాడు. చెప్పాలంటే అనుపమ్‌కి అది అత్యంత గడ్డుకాలం. క్షణమో యుగంలో భారంగా గడుస్తున్న సమయం. అయితే ఆ సమయంలో అతడిని మళ్లీ బిజినెస్‌లో తిరిగి నిలదొక్కుకునేలా చేసింది యోగా, ఆధ్యాత్మికత సాధన అని చెప్పారు. తాను ఆ సమయంలో ఓటమి అంగీకరించడానికి సిద్ధంగా లేని స్థితిలో ఉన్ననని చెప్పారు. ఒక్కసారిగా తన కలంతా చెదరిపోయిన బాధ ఒక్క క్షణం నిలువనియడం లేదు. అయినా ఏదో తెలియని ధైర్యం ఏం చేసి దీన్ని మార్చేయాలి అనే ఆలోచనలే బుర్ర నిండా అంటూ నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆ టైంలో తాను శారీరకంగా, మానసికంగా చాలా క్రుంగిపోయానని అన్నారు. అప్పుడే తాను ధ్యానం, ఆధ్యాత్మికత వైపుకి మళ్లానని, అవే తనను మళ్లీ వ్యాపార సామ్రాజ్యంలో నిలదొక్కుకునేలా చేశాయి. మళ్లీ ఇదివరకిటిలా విజయాలను అందుకునే స్థాయికి చేరుకోగలిగానని చెప్పుకొచ్చారు. అంతేగాదు అలాంటి క్లిష్టమైన సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండటమే అతిపెద్ద ఐశ్వర్యం అన్నారు. అది తనకు యోగా, ఆధ్యాత్మికత వల్లే సాధ్యమై తిరిగి పుంజుకోగలిగానని చెప్పుకొచ్చారు అనుపమ్. ఒక థెరపిస్ట్ సాయంతో ఆందోళన, ఒత్తిడిని దూరం చేసుకునే ప్రయత్నం చేసినట్లు వివరించారు. తాను ఆ సమయంలో విజయాన్ని అందుకోలేనేమో అన్నంత ఉద్విగ్న స్థితలో ఉన్నాట్టు చెప్పారు. తనకి వైఫల్యం అంటేనే వెన్నులో వణుకు వచ్చేంత భయం కలిగిందని నాటి పరిస్థితిని వివరించారు. ఇక్కడ ఆధ్యాత్మికత మన గందరగోళ పరిస్థితిని చక్కబెట్టలేదు గానీ, అది మనం ప్రతిస్పందించే విధానంలో మార్పు తీసుకొస్తుంది. గెలుపే జీవితం అనే ఒత్తిడి నుంచి బయపటడి ఎలా తనను తాను శాంతపరుచుకోవాలనే దానిపై దృష్టి కేంద్రీకరించానని అన్నారు.ఆ సమయంలో మనకు మద్దతుగా కుటుంబ సభ్యలు, అర్థం చేసుకుని జీవిత స్వామి దొరకడం తన అదృష్టం అన్నారు. వాళ్లు గనుక మనకి తోడుగా నిలబడితే ఎంతటి కఠినమైన కష్టమైన సునాయాసంగా ఛేజించి విజయాలను అందుకోగలుగుతామని పోస్ట్‌లో రాసుకొచ్చారు అనుపమ్. ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు మీరు గొప్ప పెట్టుబడుదారు, ఎల్లప్పడూ స్ఫూర్తిదాయకంగా ఉంటారంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ప్రపంచాన్ని చుట్టిరానున్న ఇద్దరు నేవీ ఆఫీసర్లు..!) -
ధర్మం అంటే..? మంచిమాట
ప్రకృతి ఎలా ప్రవర్తించాలి, ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే ధర్మం. అది మార్పు చెందే ప్రసక్తే ఉండదు. మనిషికి ఆధ్యాత్మికోన్నతి అందించేదే ధర్మం. మానవ ధర్మాల్లో ముఖ్యమైనవి– నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, అలాగే మనిషిని దహింప జేసేవి– అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ. మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతరప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు. మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించవలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ఠ, దయాగుణం, తపస్సు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, నిజాయితీ, నిష్కపటం, ఓర్పు, వినయం మొదలైనవి ప్రతి వ్యక్తి పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. ఇవి వ్యక్తిగతంగా తనకే గాక తాను జీవిస్తున్న సమాజానికి, సర్వమానవాళికి కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. మానవులకు, జంతువులకు, వస్తువులకు పరమాత్మ ధర్మాలను నిర్దేశించాడు. వినయం, సహనం, ఆచారం, పరాక్రమం మనిషికి సంస్కారం అందించే సాధనాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తన దారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం. అగ్ని వేడిని, నీరు చల్లదనాన్ని అందిస్తాయి. సింహం గర్జిస్తుంది. అటు ఇటూ పరుగెత్తుతూ చపలత్వాన్ని ప్రదర్శించడం లేడి లక్షణం. ఈ రకంగా ప్రతిదీ తన ధర్మాన్ని పాటింపజేయడం కేవలం పరమాత్మ సృజన. ఆయన సంకల్పం లేనిదే మానవ ధర్మం మృగ్యమే. ప్రతి పనిలో మనిషి అభివృద్ధిని ఆశిస్తాడు. అది సాధించాలంటే కఠోర సాధన అవసరం. సాధనే ధర్మం. అది మనిషిని పతనం కానివ్వకుండా కాపాడుతుంది. ధర్మాచరణ వ్యక్తి మనఃస్థితిని బట్టి ఆధారపడి వుంటుంది. తన వ్యక్తిగత ధర్మాన్ని విడిస్తే అది అభివృద్ధిని నిరోధిస్తుంది. అటువంటి వ్యక్తికి సుఖ సంతోషాలు, శాంతి లభించవు. ప్రతి వ్యక్తి ధర్మాన్ని రక్షించాలి. ప్రతి పనినీ ధర్మబద్ధంగా చేయాలి. ధర్మాచరణను కొనసాగించాలి. ‘ధర్మో రక్షతి రక్షితః’. ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడో, అట్టి వ్యక్తిని ధర్మమే కాపాడుతుంది. ధర్మానికి హాని చేసేవాడిని ధర్మమే హతమారుస్తుంది. కొలిమిద్వారా పుట్టిన వేడివల్ల ఇనుము వేడెక్కుతుంది. బంగారం శుద్ధి అవుతుంది. అట్లే ధర్మాచరణ వ్యక్తిని, మనసును శుద్ధిపరుస్తుంది. ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా చేసుకోవాలి గాని అధర్మం చేస్తూ ఇతరులను భయపెట్టకూడదు. ఎంత సంపాదించినా పైకి తీసుకొని పోయేటపుడు కేవలం పాపపుణ్యాలే కాని మణి మాణిక్యాలు కావు. మన తర్వాత ఉన్నవాళ్లు మనం సంపాదించింది తింటారో తినరో వారికే విధంగా విధి రాసి ఉందో తెలియదు. వారికి భగవంతుడే విధంగా తినేప్రాప్తిని రాసి పెట్టాడో వారు అలానే ఉంటారు. కనుక రాబోయే తరాలకు నువ్వు సంపాదించి ఇచ్చే తాపత్రయం పెంచుకోకూడదు. ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతనీ బాధ్యతనీ మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. అదే ధర్మో రక్షతి రక్షితః. ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి: ధర్మాచరణ వలన అర్థప్రాప్తి, ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మ సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది. స్వధర్మానికి బాధ కలిగించేది–విధర్మం, ఇతరుల ప్రేరణచే ఇతరుల ధర్మాన్ని ఆచరించేది – పరధర్మం, భగవంతుడి పట్ల విశ్వాసరహితులైన వారు చేసేది, చెప్పేది – ఉపధర్మం. తన «దర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, చెప్పబడిన ధర్మానికి విపరీతార్థాలను తీసి వివరించడం అనే అయిదు ‘అధర్మాలు’ త్యజించవలసినవిగా వేదవ్యాసుడు పేర్కొన్నాడు. కరుణ, ఆదర్శ గృహస్థ జీవనం, నిత్యకర్మాచరణ శీలత లోక కల్యాణకార కాలు, భగవద్భక్తి మార్గ నిర్దేశాలు. వీటిని మరవడం మన ధర్మాన్ని మనం మరచిపోవడమేనన్నది సత్యం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్‌వేస్‌కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్‌పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్
‘క్షమించకపోతే మీరు గతంలోనే ఉండిపోతారు’ అంటారు సాధ్వి భగవతి సరస్వతి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ యూదురాలు పాతికేళ్లుగా హృషికేశ్‌లో జీవిస్తూ ఆధ్యాతికత సాధన చేయడమే కాదు సామాజిక సేవలో విశేష గుర్తింపు పొందారు. ‘ఆధునిక జీవితంలో పరుగు పెడుతున్నవారు ఆనందాలంటే ఏమిటో సరిగ్గా నిర్వచించుకోవాలి’ అన్నారామె. ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో వెలువడి బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన తన ఆత్మకథ గురించి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో మాట్లాడారు. ఆమె ఒక కథతో మొదలెట్టింది. ‘ఒక ఊరిలో కోతుల బెడద ఎక్కువైంది. వాటిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలి. ఏం చేశారంటే కొబ్బరి బోండాలకి కోతి చేయి పట్టేంత చిన్న చిల్లి చేసి వాటిలో కోతులకు ఇష్టమైన హల్వాను పెట్టారు. కోతులు ఆ హల్వా కోసం లోపలికి చేయి పెట్టి పిడికిలి బిగిస్తాయి. కాని చేయి బయటకు రాదు. కొబ్బరి బోండాంలో ఇరుక్కున్న చేతితో అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు దానిని పట్టుకుని అడవిలో సులభంగా వదలొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే కోతి గనక పిడికిలి వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది. కాని అది వదలదు. హల్వా కావాలి దానికి. మనిషి కూడా అంతే. తనే వెళ్లి జంజాటాల్లో చిక్కుకుంటాడు. పిడికిలి వదిలితే శాంతి పొందుతాడు’ అందామె. హృషికేశ్‌లోని గంగానది ఒడ్డున పరమార్థ్ ఆశ్రమ్‌లో గత పాతికేళ్లుగా జీవిస్తున్న సాధ్వి భగవతి సరస్వతి నిజానికి భారతీయురాలు కాదు. భారతదేశంతో ఏ సంబంధమూ లేదు. ఆమె అమెరికాలో జన్మించిన యూదురాలు (అసలు పేరు చెప్పదు). స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత సైకాలజీలో íపీహెచ్డీ చేసింది. హాలీవుడ్ ఉండే లాస్ ఏంజిలస్‌లో ఎక్కువ కాలం నివసించిన ఆమె హాలీవుడ్లో పని చేసింది కూడా. కాని 1997లో భర్తతో కలిసి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు గంగానది చూసి ఆమె పొందిన ప్రశాంతత అంతా ఇంతా కాదు. ప్రశాంతమైన జీవన విధానం భారతీయ తత్త్వ చింతనలో ఉందని విశ్వసించి అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయింది. విచిత్రమేమంటే ఈ దేశ జీవన విధానాన్ని మరచి ఆధునికవేగంలో కూరుకుపోయిన వారికి ఆమె పరిష్కార మార్గాలు బోధిస్తున్నది. సంతోషానికి నిర్వచనం ఏమిటి? ‘బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటారు. బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ కోర్సులోనే చేరాలి, ఈ దేశమే వెళ్లాలి, ఫలానా విధంగా పెళ్లి చేసుకోవాలి, ఫలానా విధంగా డబ్బు వెనకేసుకోవాలి... ఇంత ప్రయాస పడితే తప్ప మనిషి సంతోషంగా ఉండలేడన్న భావన తలలో నిండిపోయి ఉంది. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండగలమా? సంతృప్తిగా జీవించడంలో సంతోషం ఉంది. జీవితంలో అనుక్షణం సంతోషం పొందడం నేర్చుకోవడం లేదు. ఎప్పుడో ఏదో సంతోషం దొరుకుతుందనే తాపత్రయంతో ఈ క్షణంలోని సంతోషం పొందకుండా మనిషి పరిగెడుతున్నాడు’ అంటుందామె. హాలీవుడ్‌ను వదిలి సాధారణంగా చాలామంది అమెరికాలో స్థిరపడి సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటారు. కాని సాధ్వి భగవతి అమెరికాను విడిచి గంగానది ఒడ్డున ప్రశాంతంగా జీవించడంలో సంతోషం ఉందని ఇక్కడ ఉండిపోయింది. ‘నా భర్త నాకు భారతదేశం గురించి చెప్పాడు. అతనే నన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారి ఇక్కడ గంగానదిని చూశాక, గురువును పొందాక ఇక ఎక్కడికీ వెళ్లకూడదనుకుని ఉండిపోయాను’ అని తెలిపిందామె. ఆధునిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవనంలో తాను ఎందుకు, ఎలా ప్రయాణించిందో తెలిపే ఆత్మకథను ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో రాసిందామె. అది బెస్ట్ సెల్లర్‌గా ఉంది. గత పాతిక సంవత్సరాలుగా హిమాలయాల్లో పేదవారి కోసం సామాజిక సేవ చేస్తున్నదామె. అందుకే అమెరికా ప్రెసిడెంట్ బైడన్ ఆమెను ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’తో గౌరవించాడు. ఆ పిల్లల కళ్లల్లో నిశ్చింత ‘హిమాలయాలకు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకపోయినా పిల్లల కళ్లల్లో నిశ్చింత చూశాను. లాస్ ఏంజిలస్‌లో అలాంటి నిశ్చింతతో పిల్లలు ఉండరు. ఆ నిశ్చింత, సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? ఫిర్యాదులు, ప్రతీకారం, క్షమించకపోవడం... మనల్ని ముందుకు పోనీకుండా చేస్తాయి. ఎదుటివాళ్లు చేసిన తప్పులను మనం అంగీకరించకపోవచ్చు. కాని వాటిని దాటి ముందుకెళ్లాలంటే క్షమించడమే మార్గం. లేదంటే మనం గతంలోనే కూరుకుపోతాం. జీవితానికి ఏం మేలు చేస్తున్నావన్నది కాదు... జీవితం ద్వారా ఏం మేలు పొందుతున్నావన్నదే ముఖ్యం’ అన్నారామె. -
అయోధ్య భక్తజన సంద్రం.. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ రేపే
అయోధ్య.. ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం. అది శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆందోళనలు..అవన్నీ సమసిపోయాయి. రాముడు పుట్టిందక్కడే అని బలంగా నమ్మే కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా, భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేయబోతున్నాడు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో భక్తవత్సలుడు కొలువు దీరబోతున్నాడు. కనులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక, ఇతర రంగాల ప్రముఖులు, ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. రూ.1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టు కావటంతో ఆలయాన్ని మూడు విడతల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం దిగువ అంతస్తు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సిద్ధం చేసిన బాల రాముడి విగ్రహానికి రేపు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. బాలరాముడిని ప్రతిష్ఠించే గర్భాలయం; 1947 నుంచి పూజలందుకుంటున్న విగ్రహం; ప్రాణప్రతిష్ఠ జరగనున్న బాలరాముడి విగ్రహం మొదటి అంతస్తులో రామదర్బార్ రావణవధ అనంతరం తిరిగి వచ్చిన సీతారాములకు అయోధ్యలో అంగరంగవైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత సోదర, ఆంజనేయ సమేతంగా అద్భుత పాలనతో సుభిక్ష రామరాజ్యం విలసిల్లిందన్నది పురాణగాధ. బాలరాముడితో దర్శనం సమాప్తమైతే.. సీతారాములను కనులారా వీక్షించాలని ఉబలాటపడే భక్తుల్లో కొంత అసంతృప్తి ఉంటుందనే ఉద్దేశంతో మొదటి అంతస్తులో ‘రామదర్బార్’ రూపంలో అద్భుత దర్శనభాగ్యం కలిగించే ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్రులు లక్ష్మణ, భరత, శత్రఘ్న, ఆంజనేయ విగ్రహాలు సమేతంగా భక్తులకు మొదటి అంతస్తులో దర్శనమివ్వనున్నాయి. రామదర్బార్ విగ్రహాలను రాజస్థాన్ తెల్లరాతితో సిద్ధం చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఆ విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ఆ దివ్య మందిరంపై నిర్మించే రెండో అంతస్తులో ఎలాంటి దర్శన ఏర్పాట్లు చేయాలన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి మొదటి రెండు అంతస్తులను పూర్తి చేసి రామ దర్బార్ దర్శనం కలిగించనున్నారు. బాలరాముడి రూపునకు మూడు విగ్రహాల పరిశీలన బాలరాముడి రూపు కోసం మూడు విగ్రహాలను పరిశీలించారు. రాజస్థాన్ , కర్నాటక ప్రాంతాలకు చెందిన శిల్పులు ఆరు నెలల క్రితమే వీటిని సిద్ధం చేసి పెట్టారు. విగ్రహాల తయారీకి కర్నాటక నుంచి మూడు కృష్ణ శిలలు, ఓంకారేశ్వర్పూజ్య అవధూత నర్మదానంద్జీ మహరాజ్ ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి పంపిన తెల్లరాయిని శిల్పులకు అప్పగించారు. ఇందులో నల్లరాయిని బాలరాముడి విగ్రహానికి కేటాయించారు. తయారైన మూడు బాల రాముడి విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ శిల్పి రూపొందించిన విగ్రహాన్ని ఇటీవల ట్రస్టు సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ విగ్రహానికే రేపు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. మూల విరాట్‌గా కొత్త విగ్రహం... ఉత్సవమూర్తిగా పాత విగ్రహం దిగువ అంతస్తులో బాలరాముడు, మొదటి అంతస్తులో పట్టాభి రాముడు దర్శనం ఇవ్వడం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులోనే బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శనభాగ్యం కూడా భక్తులకు కల్పించనున్నారు. రామజన్మభూమిలో 1947లో రాముడి విగ్రహం ఒకటి వెలుగు చూసింది. దాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోనే ఉంచి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలోని తాత్కాలిక మందిరంలో ఆ విగ్రహమే పూజలందుకుంటోంది. కొత్త ఆలయంలో ప్రాణప్రతిష్ఠకు కొత్త విగ్రహాన్ని రూపొందించిన తరుణంలో, పాత విగ్రహాన్ని ఏం చేస్తారన్న ప్రశ్నలు ఉద్భవించాయి. ఇటీవలే ట్రస్టు ఆ సందేహాలను నివృత్తి చేసింది. దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహం ముందే ఆ పాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. 30 అడుగుల దూరం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పాత విగ్రహం చిన్నదిగా ఉన్నందున సరిగ్గా కనిపించదు. అందుకోసమే కొత్త విగ్రహాన్ని రూపొందించారు. ఇన్ని దశాబ్దాలుగా పూజలందుకుంటున్న పాత విగ్రహాన్ని కూడా గర్భాలయంలోనే ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కొత్త విగ్రహాన్ని మూల విరాట్గానూ, పాత విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా మారుస్తున్నారు. ప్రత్యేక పూజాదికాల కోసం ఉత్సవ విగ్రహం వివిధ ప్రాంతాలకు తరలుతుందని, మూల విరాట్ గర్భాలయంలోనే స్థిరంగా ఉంటుందని ట్రస్టు స్పష్టం చేసింది. అయోధ్యలో సరయూ నదికి హారతి లేజర్ షో జటాయువు కంచు విగ్రహం కూడా... 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో జటాయువు కంచు విగ్రహాన్ని కూడా రూపొందిస్తున్నారు. అక్కడి కుబేర్టీలాపై ప్రతిష్ఠించే ఈ విగ్రహం మూలమూర్తి వైపు ధ్యానముద్రలో చూస్తూ వినమ్రంగా ఉండేలా దీనిని ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్రామ్ సుతార్ సిద్ధం చేస్తున్నారు. దక్షిణ భారతశైలిలో గాలిగోపురం దక్షిణాది దేవాలయాల మాదిరిగా ద్రవిడ శైలిలో ఉండే రాజగోపురాలు ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. అయోధ్య రామజన్మభూమి ప్రధాన ఆలయాన్ని ఉత్తర భారతీయ నాగర శైలిలో నిర్మిస్తున్నారు. అయితే నాగరశైలిలో గాలి గోపురాలకు చోటు లేదు. కానీ రామజన్మభూమి ఆలయ ప్రవేశం వద్ద మాత్రం భారీ గాలిగోపురం నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాముడు పుట్టిన చోటనే గర్భగుడి కట్టాలని అదనంగా స్థల సేకరణ సుప్రీంకోర్టు తీర్పుతో 72 ఎకరాలు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధీనంలోకి వచ్చాయి. అయితే రాముడు జన్మించినట్టుగా చెబుతున్న భాగంలోనే గర్భాలయం నిర్మించాలన్నది ప్రణాళిక. కానీ రాముడు పుట్టినట్టుగా పేర్కొంటున్న ఆ భూమి ఆగ్నేయ మూలలో ఉంది. అది గర్భాలయ నిర్మాణానికి అనుకూలంగా లేదు. దీంతో దాని వెనుకవైపు కొంత భూమిని ప్రైవేట్వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసి ఆ ప్రాంగణాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయ నమూనాకు వీలుగా సిద్ధం చేసింది. ఏఏఏ ఆలయ పునాదుల్లో నాలుగున్నర లక్షల ఇటుకలు రామ మందిర నిర్మాణంతో తమ చేయూత ఉండాలన్న సంకల్పంతో దేశంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఇటుకలు పంపారు. అలా నాలుగు లక్షల గ్రామాల నుంచి నాలుగున్నర లక్షల ఇటుకలు అయోధ్యకు చేరాయి. అయితే ఆలయాన్ని పూర్తి రాతి కట్టడంగా నిర్మిస్తున్నందున ఇటుకల వాడకం సాధ్యం కాదు. అలా అని మరోచోట ఈ ఇటుకలను వినియోగిస్తే.. భక్తులు అసంతృప్తికి లోనయ్యే అవకాశముంది. దీంతో వాటికి ప్రత్యేకస్థానం దక్కాల్సిందేని భావించిన ట్రస్టు, వాటిని ఆలయ పునాదుల్లో వినియోగించింది. ఇప్పుడు నాలుగున్నర లక్షల ఇటుకలు పునాది భాగంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. దిగువ అంతస్తులో బాలరాముడు ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. భూ ఉపరితలం నుంచి 20 అడుగుల ఎత్తుతో ప్రదక్షిణ పథ (పరిక్రమ్) నిర్మించారు. దాని మీద ప్రధాన ఆలయం దిగువ అంతస్తు ఉంటుంది. ఈ దిగువ అంతస్తులోనే బాల రాముడి విగ్రహం ఉంటుంది. రాముడు పుట్టినట్టుగా భావిస్తున్న చోటనే ఈ ఆలయం నిర్మిస్తున్నందున అక్కడే బాలరాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ట్రస్టు నిర్ణయించింది. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి రూపం 51 అంగుళాల విగ్రహంగా భక్తజనానికి దర్శనమివ్వనుంది. ఎన్నో ప్రత్యేకతలు రాముడి సుగుణాలు అనేకం..ప్రతిఒక్కోటి విలక్షణమే. అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని నభూతో న భవిష్యతిగా వర్ణిస్తున్నారు. ఆధునిక భారతావనిలో రాతితో నిర్మించిన అతి పెద్ద దేవాలయం కూడా ఇదే. సిమెంటు, స్టీలు, ఇతర అనుసంధాన రసాయనాలు లేకుండా పూర్తిగా రాతితోనే దీనిని నిర్మిస్తున్నారు. ఆలయం, పరిసరాలన్నీ కలుపుకొని 90 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంక్రమించినది 72 ఎకరాలు. మిగతా భూమిని ప్రైవేట్సంస్థలు, వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసింది. ఇందులో 2.7 ఎకరాల్లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం రూపుదిద్దుకుంటోంది. 2025 నాటికి మొత్తం ఆలయం సిద్ధం ప్రస్తుతానికి గర్భాలయంగా ఉండే ప్రధాన ఆలయ నిర్మాణమే జరుగుతోంది. మూడంతస్తులుగా ఉండే ఈ ఆలయంతోపాటు ఆ ప్రాంగణంలో పర్కోట (ప్రాకారం) ఆవల మరో ఎనిమిది మందిరాలు కూడా ఉంటాయి. శ్రీరాముడి జీవితంతో అనుబంధం ఉన్న భిన్నవర్గాలకు చెందిన వారి ఆలయాలు నిర్మిస్తారు. వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శబరి, అహల్య, గుహుడు..లాంటి వారితో కూడిన ఎనిమిది గుళ్లుంటాయి. మర్యాద పురుషోత్తముడి సామాజిక దృష్టి కోణానికి నిదర్శనంగా ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆలోచన జరిగిందన్నది ట్రస్టు మాట. అయితే ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఆరంభమైన వేడుకలు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఈనెల 16 నుంచే మొదలయ్యాయి. హోమాలు, జపాలు, ఇతర ప్రధాన క్రతువులతోపాటు బాలరాముడి విగ్రహానికి శోభాయాత్ర నిర్వహిస్తారు. తెల్లవారుజామునే సరయూ నదిలో విగ్రహానికి స్నానం నిర్వహించి నేత్రపర్వంగా శోభాయాత్ర ద్వారా పట్టణానికి తరలిస్తారు. అక్కడ అతి పురాతన ఆలయాల సందర్శన తర్వాత గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠకు తరలిస్తారు. అప్పటి వరకు విగ్రహ నేత్రాలను కప్పి ఉంచుతారు. బాలరాముడు అప్పట్లో అయోధ్యలో స్నానపానాదులు చేస్తూ సంచరించిన తరహాలో ఈ వేడుక నిర్వహించనున్నారు. వాస్తుశిల్పి ‘సోమ్‌పురా’ సారథ్యంలో నిర్మాణ పనులు దేవాలయ ఆర్కిటెక్ట్‌గా ప్రఖ్యాత ‘సోమ్‌పురా’ కుటుంబమే వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ కుటుంబం వందకుపైగా ఆలయాలను రూపొందించింది. ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయానికి కూడా వాస్తుశిల్పిగా పనిచేసిన ఆ కుటుంబం 15 తరాలుగా ఇదే పనిలో ఉంది. అయోధ్య రామాలయం కోసం చంద్రకాంత్ సోమ్‌పురా చీఫ్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన విఖ్యాత అక్షర్‌ధామ్‌ను రూపొందించారు. ఆయన ఇద్దరు కుమారులు నిఖిల్ సోమ్‌పురా, ఆశిష్ సోమ్పురాలు ఆర్కిటెక్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ► ప్రధాన ఆలయం 235 అడుగుల వెడల్పు, 350 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్పవచ్చు. ► ఆలయ నిర్మాణం ఆగమశాస్త్రం నాగర విధాన గుర్జర చాళుక్య శైలిలో రూపుదిద్దుకుంటోంది. ప్రధాన ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఒక్కో అంతస్తులో నృత్య, రంగ, కుడు, కీర్తన, ప్రార్థన పేర్లతో ఐదు మండపాలుంటాయి. ► ప్రధాన ఆలయంలో 366 స్తంభాలుంటాయి. ఒక్కో దానిపై 30 వరకు శిల్పాలు, ఇతర నగిషీలు ఉంటాయి. ► స్తంభాలపై శివుడు, వినాయకుడు, దశావతారాలు, యోగినులు, సరస్వతి ఇతర దేవతా రూపాలను చిత్రీకరించారు. ► గర్భాలయం అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ► దేవాలయాన్ని లేత గులాబీరంగు ఇసుక రాయితో నిర్మించారు. ఇందుకు రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లా బన్సీపహాడ్‌పూర్ క్వారీ నుంచి 5 లక్షల ఘనపుటడుగుల లేత గులాబీ రంగు రాయి, గర్భాలయం కోసం ఇదే రాష్ట్రంలోని మక్రానా నుంచి లక్ష ఘనపుటడుగుల తెలుపురంగు చలవరాతిని తెప్పించారు. ► రామ జన్మభూమికి సంబంధించి 2019 నవంబరులో సుప్రీం కోర్టు తీర్పు రాగా, 2020 ఫిబ్రవరిలో దేవాలయ కమిటీ ఏర్పాటైంది. ఆలయానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టు 5న భూమి పూజ చేశారు. ► ఆలయ పనులు మూడు షిఫ్టుల్లో రేయింబవళ్లు కొనసాగిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 3500 మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ► ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ కాగా, పనుల పర్యవేక్షణ బాధ్యత టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూస్తోంది. ► శిల్పాలను తీర్చిదిద్దేందుకు ఒడిషా నుంచి ఎక్కువమంది శిల్పులు వచ్చారు. సిమెంట్ లాంటి బైండింగ్ మెటీరియల్ వినియోగిస్తున్నారు. ఇందులో రాళ్లు జోడించటం అనేది క్లిష్టమైన ప్రక్రియ, ఈ ప్రక్రియలో విశేష అనుభవం ఉన్న రాజస్థాన్ నిపుణులకు ఆ బాధ్యత అప్పగించారు. కాపర్ క్లిప్స్ మాత్రమే వాడి రాళ్లను అనుసంధానిస్తున్నారు. ► ఒడిషా, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సిబ్బంది పనుల్లో పాల్గొంటున్నారు. ఈ మందిరం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక ‘‘రాముడు జన్మించిన చోటే ఆయన దేవాలయం నిర్మితమవుతుందన్న విశ్వాసం పదేళ్ల క్రితం వరకు లేదు. కానీ అది సాధ్యమై ఇప్పుడు ఆ ఆదర్శ పురుషుడి దివ్య దర్శనానికి నోచుకోబోతున్నాం. అందుకే రామజన్మభూమి మందిరం నిర్మించాలన్న ఆకాంక్ష దైవ సంకల్పమని నేను నమ్ముతాను. అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య మందిరం ఓ సాధారణ దేవాలయం కాదు, అది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక. అందరూ ఆ అద్భుతాన్ని దర్శించుకోవాలి. దేవుడి ముందు అంతా సమానులే, అందరిపట్లా ఆ రాముడిది సమభావనే. అందుకే ఈ నిర్మాణం సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశ నలుమూలల ఆలయ నిర్మాణ సంప్రదాయాలను ప్రతిఫలిస్తుంది. దేశంలోని ప్రతి గ్రామ చొరవ అందులో కనిపిస్తుంది. దాదాపు రూ.2 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆలయ ఖర్చులో ప్రభుత్వాలది నయా పైసా లేదు. అంతా భక్తుల విరాళమే. అందుకే మన దేవుడు, మన మందిరం.’’ – నృపేంద్ర మిశ్రా, శ్రీ రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ . ప్రధానమంత్రి కార్యాలయ మాజీ ముఖ్య కార్యదర్శి ఆ తలుపుల తయారీలో తెలుగువారు... ప్రధాన ఆలయానికి తలుపులు అమర్చే అవకాశం హైదరాబాద్‌కు చెందిన అనురాధా టింబర్ డిపోకు దక్కింది. డిపో నిర్వాహకుడు శరత్ బాబు చదలవాడ గతంలో యాదాద్రి మందిరానికి తలుపు చేయించారు. అయోధ్య రామ మందిరానికి తలుపుల నమూనా కావాలంటూ ట్రస్టు సభ్యుల నుంచి పిలుపు రావటంతో ఆయన టేకుతో దాన్ని సిద్ధం చేయించారు. ఆ పనితనానికి సంతృప్తి చెందిన కమిటీ ఆయనతో చర్చించి తలుపులు సిద్ధం చేసే బాధ్యత అప్పగించింది. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన మేలిమి రకం టేకు చెక్కతో తలుపులు రూపొందిస్తున్నారు. శరత్ బాబు చదలవాడ అయోధ్యలోని కరసేవక్ పురంలోని కార్యశాలలో ఈ తలుపులను నిపుణులు సిద్ధం చేస్తున్నారు. అక్కడి ఇన్ చార్జ్ ఆర్యన్ మిశ్రా ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన నిపుణులు వాటిని రూపొందిస్తున్నారు. మొత్తం 44 తలుపులకుగాను ప్రస్తుతానికి 18 సిద్ధమయ్యాయి. వీటిని దిగువ అంతస్తులో వినియోగిస్తారు. బాలరాముడు ఉండే గర్భాలయానికి సంబంధించి రెండు జతలు పూర్తి చేసి ఆలయానికి చేర్చారు. 9 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఇవి రూపొందాయి. నెమలి పురి విప్పుకున్నట్టు వీటిపై నగిషీలద్దారు. ఇక అంతస్తులోని ఇతర ప్రాంతాల్లో వాడే తలుపులకు ఏనుగు అర్చిస్తున్నట్టుగా.. పద్మాలు విచ్చుకున్నట్టుగా... ఇలా పలు చెక్కడాలతో అద్భుతంగా రూపొందించారు. వెయ్యేళ్లపాటు వర్థిల్లే దేవాలయానికి తలుపులు సిద్ధం చేసే అవకాశం రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చదలవాడ శరత్‌బాబు ‘సాక్షి’తో చెప్పారు. అన్నీ ఉచితమే... అందరూ సమానమే! రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం, ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. 60 కిలోల బంగారంతో తాపడం ఆలయంలోని తలుపులకు బంగారంతో తాపడం చేయించనున్నారు. అన్ని తలుపులకు కలిపి 60 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం. దిగువ అంతస్తు బాలరాముడి ఆలయ తలుపులకు తాపడం పనులు ప్రారంభించారు. అనంతరం తాపడం కోసం సిద్ధం చేశారు. తలుపులపై ఉన్న నగిషీల తరహాలోనే బంగారు తాపడంపై కూడా సిద్ధం చేస్తున్నారు. భారీ భూకంపాలను తట్టుకునేలా... రామమందిర ప్రత్యేకతల్లో పునాది కూడా ఒకటి. 161 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతున్న దివ్యభవ్య మందిరానికి 50 అడుగుల లోతుతో పునాది నిర్మించారు. అయోధ్య పట్టణ శివారు నుంచి సరయూ నది ప్రవహిస్తోంది. అయితే 400 ఏళ్ల క్రితం సరయూ ప్రస్తుతం ఆలయం నిర్మిస్తున్న ప్రాంతానికి అతి చేరువగా ప్రవహించేది. దీంతో ఆ ప్రాంత భూగర్భం ఇసుక మేటలతో నిండి ఉంది. భారీ నిర్మాణానికి పునాది పడాలంటే ఆ ఇసుకనంతా తొలగించాలి. ఇందుకోసం ఐఐటీ, ఎన్ ఐటీ నిపుణులు, రిమోట్ సెన్సింగ్ సెంటర్ పరిశోధకులు కలిసి దీనికి ప్రత్యేక పునాది నిర్మాణానికి డిజైన్ చేశారు. 50 అడుగుల లోతు నుంచి ఇసుక, మట్టిని తొలగించి వాటికి రీయింజనీర్ ఇసుక, కొన్ని రసాయనాలు, 10 శాతం ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పారలుగా వేసి వాటిని కాంపాక్ట్‌గా మార్చి 47 పొరలుగా పైవరకు నిర్మించారు. ఆ ఇసుక, మట్టి భాగం పూర్తిగా గట్టిబడి 50 అడుగుల ఏకశిలగా మారింది. దాని మీద రెండున్నర మీటర్ల మందంతో రాఫ్ట్ నిర్మించారు. ఆ పైన ఒకటిన్నర మీటరు మందంతో గ్రానైట్ రాతిని పరిచి దాని మీద ప్రధాన నిర్మాణం జరిపారు. ఇప్పుడు భూ ఉపరితలం నుంచి ప్రధాన నిర్మాణం 20 అడుగుల ఎత్తులో మొదలవుతుంది. అక్కడకు చేరాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పునాది డిజైన్ మార్చింది తెలుగు ఇంజినీరింగ్ నిపుణుడే..! అయోధ్య మందిరానికి ప్రస్తుతం ఏర్పాటు చేసిన పునాదికి డిజైన్ చేసింది తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుడే కావటం విశేషం. తొలుత ఐఐటీ మద్రాస్ నిపుణులు పునాది కోసం సిమెంటు కాంక్రీట్ పైల్స్ డిజైన్ ఇచ్చారు. ఆలయ ట్రస్టు దానికి సమ్మతించి పనులకు శ్రీకారం చుట్టింది. ఒక్కోటి మీటర్ వ్యాసం, 40 మీటర్ల లోతుతో సిమెంట్కాంక్రీట్పైల్స్ను పునాదిలో నిర్మించాలని నిర్ణయించారు. ఇలా 1200 పైల్స్ ఏర్పాటు చేసి దాని మీద ప్రధాన నిర్మాణం చేపట్టాలన్నది వారి ఆలోచన. కానీ, సిమెంటు కాంక్రీట్పైల్స్ వయసు కేవలం వందేళ్లలోపు మాత్రమే ఉంటుందని పేర్కొంటూ, వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. దాని బదులు కాకతీయులు అనుసరించిన శాండ్బాక్స్ టెక్నాలజీని వినియోగిస్తే వెయ్యేళ్ల జీవిత కాలం ఉంటుందని రామప్ప, వేయి స్తంభాల దేవాలయాలపై నిర్వహించిన పరిశోధన పత్రాలను జత చేశారు. దీంతో ఆయనకు ట్రస్టు నుంచి పిలుపు వచ్చింది. విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పాండురంగారావు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రతినిధులతో పునాది నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని నియమించారు. నిర్మాణ ప్రాంతం గుండా వందల ఏళ్ల కింద సరయూ నది ప్రవహించటంతో భూమి పొరల్లో ఇసుక మేటలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ కమిటీ కూడా నాటి పునాది డిజైన్ ను తిరస్కరించింది. తర్వాత 50 అడుగుల మేర మట్టిని తొలగించి రీయింజనీర్డ్ ఇసుక, దానికి కొన్ని రసాయనాలు, స్వల్ప మొత్తంలో ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పొరలుగా వేసి కంప్రెస్ చేయాలంటూ సిఫారసు చేసింది. అలా చేస్తేనే పునాది కనీసం వెయ్యేళ్లపాటు ఉంటుందని పేర్కొంది. పాండురంగారావు సూచన మేరకే కొత్త పునాది ప్రణాళిక అమలు చేసి, వెయ్యేళ్లపాటు నిలిచే రీతిలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. మందిర పునాది ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు వేయేళ్లు ఉండేలా... అయోధ్య రామాలయం వేయి సంవత్సరాల వరకు పటిష్ఠంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇది జరగాలంటే పెద్దపెద్ద భూకంపాలను కూడా తట్టుకుని నిలబడే నిర్మాణం అవసరం. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు నిర్మాణ డిజైన్ లో పాలుపంచుకున్నారు. నేపాల్నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల తీవ్రతను పరిశీలించి వాటికి 50 రెట్లు పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. వరదలను తట్టుకునేలా... అయోధ్య నగరం మీదుగా సరయూ నది ప్రవాహం గతంలో ఉండేది. ఇప్పుడు నగర శివారు గుండా ప్రవహిస్తోంది. ప్రతి వేయి సంవత్సరాల్లో నదీ ప్రవాహ గమనం మారడం సహజం. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇప్పుడు గుడి నిర్మిస్తున్న ప్రాంతం మీదుగా వరద పోటెత్తినా, పెద్దపెద్ద వరదలు సంభవించినా నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలా దాని పునాది పైన పీఠం ప్లాన్ చేశారు. ఇందుకు సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తల సిఫారసులను అనుసరించారు. 25 వేల మంది సామర్థ్యంతో త్వరలో బస ఏర్పాట్లు... ఆలయానికి చేరువలో భక్తులకు వసతి మందిరం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి దీంట్లో 25 వేల మంది వరకూ ఉండొచ్చు. ఈ గదులను ఉచితంగా అందిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. లక్షమంది భక్తులకు వసతి ఉండేలా గదులు సిద్ధం చేయాలన్న ఆలోచనలో ట్రస్టు ఉంది. అయితే సొంతంగా ఏర్పాటు చేయాలా, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలా అన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. ప్రతి శ్రీరామనవమీ ప్రత్యేకమే! ► నవమి నాడు బాలరాముడి నుదుటిపై సూర్య కిరణాలు ► ప్రధాని మోదీ కోరికకు తగ్గట్టుగా నిర్మాణం అయోధ్య రామమందిరంలో ప్రతి శ్రీరామనవమి ప్రత్యేకంగా నిలవబోతోంది. ఆ రోజు సూర్యోదయ వేళ ఆలయ దిగువ అంతస్తు గర్భాలయంలోని బాల రాముడి విగ్రహ నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆకాంక్షను ట్రస్టు ముందర ఉంచారు. ఆ మేరకు నిర్మాణం జరుగుతోంది. కిరణాలు దిగువ అంతస్తులోని గర్భాలయంలోకి ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గర్భాలయం ద్వారం ఎత్తు, విగ్రహ ఎత్తును ఖరారు చేశారు. చాలా విశాలమైన దేవాలయం కావటంతో సహజసిద్ధంగా సూర్యకిరణాలు లోనికి వచ్చే వీలు ఉండదేమోనన్న ఉద్దేశంతో ప్రతిబింబం రూపంలో సూర్యకాంతి లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పట్లో రోజుకు 2 వేల మంది.. ఇప్పుడు 50 వేల మంది.. రేపు లక్ష? అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. అయోధ్య రాముడి విరాళాలు రూ.3500 కోట్ల పైమాటే... ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం. (అయోధ్య నుంచి ‘సాక్షి’ ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి) ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?
తెలుగునాట సంబరంగా జరుపుకునే పెద్ద పండుగా సంక్రాంతి. ఈ నాలుగు రోజుల పండుగలో మొదటి రోజు భోగభాగ్యల "భోగి"తో మొదలవుతుంది. ఈ భోగి పండుగ రోజు పెద్ద చిన్నా అంతా నలుగుపెట్టుకుని తలంటు స్నానం చేసి భోగి మంటలతో పండుగ మొదలు పెడతారు. ఆ రోజే దేవాలయాల్లో అంగరంగ వైభవంగా గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రమే పసిపిల్లలకు తలపై భోగిపళ్లు పేరుతో రేగిపళ్లు పోయడం వంటి తతంగాలు జరుగుతాయి. ఆ రోజే ఇవన్నీ చేయడానికి గల కారణాలేంటో తెలుసుకుందామా!. పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా "భోగి" పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. ఒక రకంగా భగవంతుడి మనుసును గెలుచుకున్న ఓ భక్తురాలి గాథ ఇది. ప్రేమకు భగవంతుడైనా.. బంధీ అయిపోతాడని చెప్పే చక్కని పురాణ కథ ఇది. ఇక భోగి రోజు గోదా కళ్యాణం చేయడానికి కారణం ఏంటంటే.. గోదా కళ్యాణ ప్రాశస్యం.. శ్రీ మహావిష్ణువుకు భక్తులై ఆయనే లోకంగా జీవించి తరించిన మహాభక్తులను ఆళ్వారులు అంటారు. వీళ్లలో ముఖ్యమైన వారు 12 మంది. వీరిలో పెరియాళ్వారు అనే ఆయన శ్రీరంగనాధుడికి మహాభక్తుడు. ఈయన అసలు పేరు భట్టనాధుడు. ఈయనే తరువాతి కాలంలో విష్ణుచిత్తుడిగా ప్రసిద్ధి చెందాడు. విష్ణుచిత్తుడు రంగనాధుడికి ప్రతినిత్యం పూల మాలతో కైంకర్యం(అలంకరణ) చేసేవాడు. దీనికోసం ఒక తోటను పెంచి అందులో రకరకాలైన పూలతో అందంగా మాలలు కట్టి శ్రీరంగ నాథుడికి సమర్పించేవాడు. ఒకనాడు విష్ణుచిత్తునికి తులసి మెుక్క గుబురులో ఒక పసిపాప కనిపించింది. అతడు ఆ బిడ్డను భూదేవియే ప్రసాదింగా భావించి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. అతను ఆ బిడ్డకు గోదా అని పేరుపెట్టాడు. ఈ గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని ఎంతగానో బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు. ఇక ఆమె యుక్తవయస్సుకు రాగానే శ్రీరంగనాధుడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. దీంతో ఆమె తన తండ్రి వద్దకు వెళ్లి మానవ కాంతలెవరైనా దేవుడిని వివాహమాడిన సందర్భాలు ఉన్నాయా? అని అడుగగా ఆయన ఉన్నాయని చెప్పాడు. దానికోసం కాత్యాయని వ్రతమాచరించ వలసి ఉంటుందని చెప్పగా.. ఆమె ఆ వ్రత నియమాలను తెలుసుకొని ధనుర్మాసంలో ఆ వ్రతమును ఆచరించడమే గాక కృష్ణునిపై ప్రేమతో ఆయన్ను కీర్తిస్తూ 30 పాశురాలను కూడా పాడింది. అలా గోదా దేవి ప్రేమకు లొంగిపోయిన కృష్ణుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి గోదా దేవిని తీసుకుని శ్రీరంగనాథం రావాలని, అక్కడ ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో విష్ణుచిత్తుని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయం ఆలయ అర్చకులకు, విల్లిపుత్తూరులోని ప్రజలకు తెలియజేశాడు. అందర్ని వెంటబెట్టుకుని శ్రీరంగనాథ ఆలయానికి చేరుకున్నాడు. అయితే పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదా దేవి అందరూ చూస్తుండగానే కృష్ణునిలో ఐక్యమైపోయింది. అయితే ఈ గోదా కళ్యాణం జరిగింది మకర సంక్రమణం జరిగే ముందు రోజైన భోగి నాడు. అందువల్లనే అప్పటి నుంచి ప్రతి ఏడాది భోగి రోజున గోదా కళ్యాణం ఒక పండుగలా చేస్తారు. భోగిపళ్లు ఎందుకు పోస్తారంటే..? భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృతంలో పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని పురాణ వచనం. అలాగే ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగినవి ఈ రేగుపళ్లు. అందువల్ల వీటికి కొన్ని నాణేలను జత కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల లక్ష్మీ నారాయణుల అనుగ్రహం మన పిల్లలకు ఉండటమేగాక, ఎలాంటి దిష్టి తగలకుండా దీర్ఘా ఆయుష్షుతో ఉంటారని ప్రతీతి. ఇలా పోయడంలో మరో అంతరార్థం ఏంటంటే..? మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంధ్రం మన తల పైభాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపించి జ్ఞానవంతులు అవుతారని ఒక నమ్మకం కూడా. అంతేగాదు ఈ రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, మన శరీరం, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు పెద్దలు. (చదవండి: భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? చలి మంటలు ఎందుకు వేస్తారు?) -
ఆ ప్రభుండు పుట్టెను.. బేత్లెహేమునందున!
‘రక్షకుండు ఉదయించినాడట... మనకొరకు పరమ రక్షకుండు ఉదయించినాడట. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి... శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె’ అంటూ ఎముకలు కొరికే చలిలో రక్షకుని ఆగమన వార్తను పాడుకుంటూ, అనేకుల హృదయాలలో క్రిస్మస్ ఉల్లాసాన్ని నింపి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ మీటింగ్ నుంచి ఇంటికి బయలుదేరారు పాస్టర్ సైలస్. ఆయన దగ్గరకు ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది. దానిలో నుంచి ఒక ఘనమైన స్త్రీ దిగి పరుగు పరుగున పాస్టర్గారి దగ్గరకు వచ్చి ‘అన్నయ్యా బాగున్నారా!’ అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆమె చుట్టూ కొంతమంది అంగరక్షకులు కూడా ఉన్నారు. సామాన్య జనులంతా చాలా వింతగా చూస్తున్నారు. ఆమెను చూచి ‘బాగున్నానమ్మా! మీరెవరో గుర్తుకురావడం లేదు, కొంచెం పరిచయం చేసుకుంటారా?’ అడిగాడు. ‘నేనెవరో తెలుసుకోవాలనుకుంటే మీరొక పదేళ్లు వెనక్కు వెళ్ళాలి. యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ మధుర రాత్రిని నేనెన్నడు మరువలేను. గురి, దరి లేని నా జీవితాన్ని మలుపుతిప్పి జ్యోతిర్మయుడైన ప్రభువు గొప్పదనాన్ని చాటి చెప్పడానికే ఈరోజు మీ ముందుకొచ్చాను. ఒకప్పుడు రోగిగా, అనాథగా, మోసపోయిన వనితగా, మృత్యువు ఒడిలో చేరిన అబలగా మీ దరికి చేరిన నన్ను– ఊహించలేని పరలోకపు ప్రేమతో ఆదరించి నన్ను తన కుమార్తెగా స్వీకరించి పరలోకపు ఔన్నత్యమును అనుగ్రహించాడు నా ప్రభువు. నాడు అభాగ్యురాలిగా నిలిచిన నన్ను ఉన్నత ఉద్యోగిగా, అర్హతలేని నన్ను ఎన్నో కృపలకు అర్హురాలుగా హెచ్చించాడు. నిజమైన క్రిస్మస్కు గుర్తుగా, సాక్షిగా నేను నేడు మీముందున్నాను’ అంటూ ఆనందబాష్పాలతో తనను తాను పరిచయం చేసుకుందామె. ‘ఆరోజు అర్ధరాత్రి మీ ఇంటి దగ్గర ఒక శవంలా పడి ఉండగా మీరే నన్ను క్రీస్తు ప్రేమద్వారా బతికించారు’ అని ఆమె వివరిస్తుండగా సైలస్గారు కాస్త ఉద్వేగానికి గురై ‘ఆ!... గుర్తొచ్చావమ్మా! కవితా, నువ్వా!’ అంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దైవ సేవకుడు పాస్టర్ సైలస్ వివాహం జరిగిన తరువాత తన భార్యతో కలిసి ఊరవతల ఒక చిన్న ఇంట్లో ఉంటూ సేవ ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరూ ఒక క్రిస్మస్ కూడికను ముగించుకొని ఆ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. కడుపు ఆకలితో అలమటిస్తున్నా, హృదయమంతా ప్రభువు నామస్మరణ ఉల్లాసంతో ఉరకలు వేస్తుంటే ఆ రోజు ఆ పశువుల పాకలో దూతలు పాడినట్లు ‘క్రీస్తు జన్మించాడు, రక్షకుడు ఉదయించినాడు’ అంటూ పాట పాడుకుంటూ గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టారు. ఒక స్త్రీ తమ ఇంటి ముందు పడి ఉండటం చూసి అవాక్కయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఈ స్త్రీ ఇక్కడకు రావడమేంటి? సైలస్ గారి మదిలో చాలా ప్రశ్నలు.. అసలు ఎవరీమె? ఏమైంది? ఈమె బాధేమిటో, కథేమిటో? ఏమీ అర్థంకావట్లేదు. ఏ స్థితి లోనైనా మనం అడగగానే ప్రార్థించగానే జవాబిచ్చే పరమతండ్రి మనకు తోడున్నాడు కదా! ‘నాకు మొఱపెట్టుము నీకుత్తరమిచ్చెదను’ అని బైబిల్లో రాయబడిన మాట ఆ భార్యాభర్తలకు గుర్తుకొచ్చింది. ప్రేమ నిండిన హృదయంతో మెల్లగా ఆ స్త్రీ వద్దకు వచ్చి ఆమె మీద నీళ్ళు జల్లగానే ఆమె తేరుకుంది. భార్యాభర్తలిద్దరూ ఆమె చేయి పట్టుకొని పైకి లేవనెత్తి ఇంటిలోకి తీసుకెళ్ళారు. తీవ్రమైన జ్వరంతో ఆమె ఒళ్ళు కాలిపోతోంది. చలితో వణకిపోతున్న ఆమెకు వెచ్చని రగ్గు కప్పి తాము సిద్ధపరచుకున్న కొద్దిపాటి ఆహారం ఆమెకు ఇచ్చారు. గ్లాసుడు పాలు తాగించి, రాత్రంతా ఆమెకు పరిచర్య చేస్తూ ఆమె కోసం ప్రార్థించసాగారు. కవిత ఆ రాత్రి ఆ ఘనమైన దైవజనుల నీడలో స్వస్థత, సాంత్వన పొందింది. సూర్యుని లేలేత కిరణాలు మీద పడగా నిశీధి రాత్రి భీకర ఛాయలన్నీ మరచి ఉదయ కాంతులను ఆస్వాదిస్తూ నిద్రలేచింది. మెల్లగా పాస్టర్ సైలస్ గొంతు సవరించుకొని ‘ఏమీ భయపడకు. నీకొచ్చిన కష్టమేంటో మాతో పంచుకో! చేతనైనంత సహాయం నీకందిస్తాము’ అని ప్రభువు ప్రేమతో కవితను ఆదరించారు ఆ ఆదర్శ దంపతులు. ఆ మాటలు విన్న కవిత కృతజ్ఞతతో భోరున ఏడ్వసాగింది. ‘ముక్కూ మొహం తెలియని నన్ను, అభాగ్యురాలనై, రోగంతో, ఆకలితో బాధపడుతున్న నన్ను క్రీస్తు ప్రేమతో ఆదరించి ఆశ్రయించి అక్కున చేర్చుకొని క్రిస్మస్కు శ్రేష్ఠమైన అర్థాన్ని చెప్పారు. నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క గారాలపట్టిగా ఉన్న నేను యౌవనాశలకు లొంగిపోయి ఒక కిరాతకుని ఉచ్చులోపడి, నమ్మి మోహించి వాడి చెంతకు చేరాను. వాడు నా బలహీనతను ఆధారంగా చేసుకొని దొడ్డిదారిన నన్ను ఒక వేశ్యాగృహానికి తాకట్టుపెట్టబోయాడు. విశ్వప్రయత్నాలు చేసి వాడి చెర నుంచి బయటపడ్డాను. గత ఐదు రోజుల నుంచి ఆ రైలు ఈ రైలు ఎక్కి ఈ పట్టణంలో ప్రవేశించాను. నా అన్నవారు లేక ఈ రోడ్డుమీద తిరుగుతూ ఎంగిలి విస్తరాకులు నాకుతూ డ్రైనేజీ నీళ్ళను కూడా తాగడానికి వెనుకాడక అత్యంత హీన, దీనస్థితికి దిగజారిపోయాను. ఈ బతుకుని బతకలేక విషం తాగి శవంగా మారిపోవాలని ఓపిక తెచ్చుకొని పయనమౌతుండగా గత రాత్రి క్రిస్మస్ కార్యక్రమంలో మీరు అందించిన క్రీస్తు ప్రభువు మాటలు దూరంగా నిలబడి విన్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మీరు చెబుతుంటే కన్నీటితో నా స్థితిని దేవునితో చెప్పుకున్నాను. క్రిస్మస్ కాంతులన్నీ నా జీవితంలో విరజిమ్మాయి. నాకోసం ఒక రక్షకుడు జన్మించాడన్న వార్త నాకు ఎంతో బలాన్నిచ్చింది. రక్తం కక్కుతూ అత్యంత భయానకంగా ఉన్న నా పరిస్థితి ఒక్కసారిగా చక్కదిద్దబడింది. నా హృదయంలో యేసయ్య చేరిన మరుక్షణం నా పాపాంధకార ఛాయలు మటుమాయమైపోయాయి. నా పాపఫలితమే ఇదంతా అని గుర్తించగలిగాను. నా ప్రతీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నా మనస్సులో గొప్ప ఆనందం, ఆదరణ, సమాధానం కలిగాయి. మీచెంతకు చేరి నా బాధంతా వెళ్ళబుచ్చుకొని తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు చేరాలనే ఆశతో అతికష్టం మీద మీ అడ్రస్ సంపాదించి మిమ్ము చేరుకోగలిగాను. మీకెంతో బాధ కలిగించాను, ఇబ్బందిపెట్టాను. కానీ మీరే నాకు ఆ సమయంలో దిక్కనిపించారు. మీ వద్ద నుంచి వెళ్ళిన తదుపరి జీవంగల దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని నా తల్లిదండ్రులను చేరుకున్నాను. నన్ను నా బంధువులు ఏరికోరి వారి కోడలుగా చేసుకున్నారు. నా భర్త ఒక గొప్ప ప్రభుత్వ అధికారి. ఆయన నన్ను ప్రోత్సహించి బాగా చదివించి ఒక డాక్టరుగా చేయగలిగారు. ఆ రాత్రి మీరు ఏర్పాటు చేసిన క్రిస్మస్కు దేవుని సన్నిధికి రాకుండా ఉండుంటే, ఆ మాటలు వినకుండా వుండుంటే ఆ రాత్రే నేను దిక్కులేని చావుతో శవమైపోయేదాన్ని లేదా చిరిగిన విస్తరిలా నా జీవితం మారిపోయేది. క్రిస్మస్ మాధుర్యాన్ని నాకు కనపరిచి నవ్యకాంతులమయమైన జీవితంగా నన్ను చేసినందుకు మీకేమిచ్చినా ఋణం తీర్చుకోలేను’ అంటూ ఉండగా పరవశంలో నిండిపోయాడు దైవజనుడు సైలస్. క్రిస్మస్ అసంఖ్యాక జీవితాల్లో నిర్మలమైన వెలుగులు నింపింది. క్రీస్తు జన్మించినప్పుడు బేత్లెహేము పొలాల్లో తమ మందను కాచుకొనుచుండగా దేవుని దూత వారిని దర్శించింది. ఓ గొప్ప వెలుగు వారిని ఆవరించింది. ‘రక్షకుడు పుట్టియున్నాడు’ అనే వార్తను వారు విని యేసు దర్శించి పునీతులయ్యారు. క్రిస్మస్ అనుమాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థము. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భువిపై అరుదెంచిన శుభదినము క్రిస్మస్.యేసుక్రీస్తు శరీరధారిగా రెండువేల సంవత్సరాల క్రితం బేత్లెహేము గ్రామంలో జన్మించాడు. యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే సందేహం కొంతమందిలో ఉండవచ్చు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు. ‘యేసు గ్రీకోరోమన్ తత్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల యొక్క మానసిక ఆవిష్కరణే గాని వాస్తవం కాదు. కొత్తనిబంధన ఒక పురాణమే గాని వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు.’ దీనికి సమాధానంగా ప్రపంచప్రఖ్యాత చరిత్రకారుడు ఇ.ఎఫ్. హ్యారిసన్ ఇలా అంటాడు: ‘ప్రపంచంలోని చాలా విషయాలకు చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా కేవలం మనుషుల ఆలోచనలపై ఆధారపడి ఉన్నవి. క్రైస్తవ్యం అటువంటిది కాదు.’ క్రీస్తు రక్షకుడు, దేవుడు అని మొదటి, రెండవ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనవాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు, రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటులో గలిలయలోని దళమును నడిపిన వ్యక్తి. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెండు గ్రంథాలు– ‘ద జ్యూయిష్ వార్స్’, ‘జ్యూయిష్ యాంటిక్విటీస్’ రచించాడు. ఫ్లావియస్ అనే పేరు రోమా పేరు కాగా జోసఫస్ అనే పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు: ‘దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడు ఉండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుంచి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు.’ ఫ్లావియస్ జోసఫస్ రాసిన సంగతులు నేటికినీ చరిత్రకు ఆధారముగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జననాన్ని, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ఒప్పుకున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గురించి సవివరంగా ఉంది. ఆ సువార్తికులు ఎవరనగా... మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంగ్లండు దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. ‘యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరచే సువార్తలన్నీ క్రీస్తుశకం 70వ సంవత్సరం లోపే వ్రాయబడ్డాయి. అనగా యేసుక్రీస్తు ప్రభువు మరణించి, పునరుత్థానుడైన 40 సంవత్సరాల లోపే సువార్తలు, నూతన నిబంధనలోని చాలా పత్రికలు వ్రాయబడ్డాయి. ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. మత్తయి ఒక సుంకపు గుత్తదారుడు. మార్కు పరిస్థితులన్నీ అవగాహన చేసుకొన్న ఒక మంచి యవ్వనస్థుడు. లూకా ప్రసిద్ధిగాంచిన ఒక వైద్యుడు. యోహాను యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు. వీరందరూ క్రీస్తు జీవిత చరిత్రను వ్రాసారు. వాస్తవ సంగతుల ఆధారాలతో సువార్తలు వ్రాయబడ్డాయి గనుక ఎక్కడా కూడా భావ విరుద్ధమైనవి బైబిల్లో కనిపించవు’ అని జాన్ రాబిన్సన్ రాశాడు. యేసు శిష్యుడైన యోహాను నిర్ద్వంద్వంగా ఈ సత్యాన్ని వెల్లడిచేశాడు. ‘జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను’– (1 యోహాను 1:1,2). క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందు యెషయా అనే ప్రవక్త ఇలా ప్రవచించాడు. ‘కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు’. ఇమ్మానుయేలు అనుమాటకు దేవుడు మనకు తోడు అని అర్థము. క్రీస్తు గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్ని చరిత్రలో నెరవేర్చబడ్డాయి. మీకా అనే మరొక ప్రవక్త యేసు ‘బేత్లెహేము’లో జన్మిస్తాడని చెప్పాడు. ఆ మాట చెప్పబడిన కొన్ని వందల సంవత్సరాల తరువాత యేసు సరిగ్గా అదే గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం కనబడుతుందని, జ్ఞానులు ఆయన్ను వెదుకుతూ వస్తారని, క్రీస్తు ఆగమనాన్ని జీర్ణించుకోలేని హేరోదు రోదనధ్వనికి కారణమౌతాడని ఎన్నో విషయాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఈ ప్రవచన నెరవేర్పు ప్రపంచానికి నేర్పించే పాఠము ‘క్రీస్తు ఒక ప్రవక్త కాదుగాని, ప్రవక్తలు ఎవరిగూర్చి ప్రవచించారో ఆ ప్రవచనాల సారము.’ బైబిల్లోని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే ‘రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు’ అనే మాట యేసుప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు ఆయనను దర్శిస్తారు అనడానికి నిదర్శనంగా కనబడుతుంది. యేసు పుట్టిన తర్వాత గొఱ్టెల కాపరులు, జ్ఞానులు ఆయనను దర్శించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన అందరికీ కావలసినవాడు అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనము గ్రహించగలము. జ్ఞానులు యేసుప్రభువును వెదుక్కుంటూ వచ్చి బంగారమును, బోళమును, సాంబ్రాణిని అర్పించారు. వారు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుముందు మోకరిల్లి, సాగిలపడి పూజించారు. జ్ఞానులు వివిధ దేశాల నుంచి, వివిధ సంప్రదాయాలను అనుసరిస్తున్న వారిలో నుంచి యేసుప్రభువును వెతుక్కుంటూ మొదటిగా యెరూషలేముకు వచ్చారు. ఆ తర్వాత బేత్లెహేముకు వెళ్ళి యేసుప్రభువును దర్శించారు. జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపంచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించారని, రక్షకుడు ఉదయించాడు అనే సత్యం వారు ఆకాశంలో వెలసిన నక్షత్రం ద్వారా తెలుసుకోగలిగారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ‘రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేమునందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులరాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి’– (మత్తయి 2:12). తూర్పుదిక్కున నక్షత్రపు దిశను చూసి, నక్షత్ర పయనాన్ని చూసి వారు సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసుకుంటూ యెరూషలేము వచ్చారంటే వారికి ఖగోళశాస్త్రం మీద పట్టువుంది అని ఇట్టే మనకు అర్థమవుతుంది. అయితే జ్ఞానులను నడిపించిన ఈ నక్షత్ర మర్మమేమిటి? శాస్త్రవేత్తలలో కొన్ని అభిప్రాయాలు వెల్లడించబడ్డాయి. యేసు పుట్టిన మొదటి శతాబ్దం నుంచి ఈ బేత్లెహేము తారను గూర్చి జ్ఞానులకు అగుపడిన నక్షత్రమును గురించి పండిత వర్గాలలో విపరీతమైన చర్చ జరిగింది. అయితే కొందరు కొన్ని రకాలైన అభిప్రాయాలను వెల్లడిచేశారు. మొదటిగా సూపర్నోవా. ఈ నక్షత్రం తెల్లటి కాంతితో మిరుమిట్లు గొలుపుతూ పేలిపోతూ ఉంటుంది. నక్షత్రాలు అప్పుడప్పుడు విస్ఫోటం చెందుతూ ఉంటాయి. ఈ విస్ఫోటం వలన ఆ నక్షత్రం కాంతి నేల నుంచి లక్షల రెట్లు పెరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆకాశంలో నక్షత్రం కనబడుతుంది. గొప్ప వెలుగు ఆకాశంలో కనబడుతుంది. అయితే వాస్తవాన్ని పరిశీలన చేస్తే ఈ సూపర్నోవా విస్ఫోటం చెందినప్పుడు ఎక్కువకాలం కనిపించే అవకాశాలు ఉండవు. దీన్నిబట్టి యేసుప్రభువు పుట్టినప్పుడు నక్షత్ర విస్ఫోటం జరగలేదు. రెండవ అభిప్రాయం– హేలీ తోకచుక్క కనబడిందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. క్రీస్తు పూర్వము 5వ సంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలలో కొత్త నక్షత్రం ఒకటి కనబడినట్లుగా చైనా దేశం వారు తమ చరిత్రలో రాసుకున్నారు. అయితే ఆ నక్షత్రం తోకచుక్కా లేదా సూపర్నోవా అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. వాస్తవానికి తోకచుక్కల గురించి మనకందరికీ విదితమే! తోకచుక్కలు ప్రతి నిర్ణీత కాలానికోసారి ఆకాశంలో కనబడుతుంటాయి. ఉదాహరణకు హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతూ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం హేలీ తోకచుక్క క్రీస్తు పూర్వము 12 సంవత్సరంలో కనబడింది గనుక హేలీ తోకచుక్క కనబడిందనేది గూడా ఒక అవాస్తవంగా మనం గ్రహించాలి. మూడవది శాస్త్రవిజ్ఞాన రంగంలో యేసుప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది అని బైబిల్ చెప్పినప్పుడు దానికి చాలా దగ్గరగా ఉన్న వ్యాఖ్యానం– గ్రహకూటమి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జోహనెస్ కెప్లెర్ 1607వ సంవత్సరంలో యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఉదయించిన నక్షత్రం గురించి పరిశోధన చేశాడు. ‘యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. బృహస్పతి, శని మరియు అంగారకుడు– ఈ మూడు గ్రహాలు కూడా ఒకే కక్ష్యలోనికి వచ్చి ఒక బ్రహ్మాండమైన వెలుగును విడుదల చేశాయి. ఈ మూడు గ్రహాలు కూడా ఒక కక్ష్యలోనికి రావడం ద్వారా గొప్ప వెలుగు పుట్టి అది జ్ఞానులను నడిపించింది’ అని జోహనెస్ కెప్లెర్ వివరణనిచ్చాడు. ఆకాశంలో నక్షత్రం పుట్టినదానికి శాస్త్రయుక్తమైన వివరణ కావాలంటే జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ అత్యంత దగ్గరగా ఉంది. అయితే ఆకాశంలో నక్షత్రం పుట్టడమనేది అసాధారణ కార్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు గనుక ఆయన ఒక అద్భుతాన్ని ఆకాశంలో జరిగించి జ్ఞానులను నడిపించాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఈ రోజుల్లో శాస్త్రం దేనికైనా ఋజువులడుగుతుంది, వివరణలడుగుతుంది గనుక జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ శాస్త్రయుక్తంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు వెలసిన నక్షత్రానికి దగ్గరగా ఉంది.అయితే విచిత్రమేమిటి అంటే నక్షత్రం జ్ఞానులను యేసుప్రభు వున్నచోటికి నడిపించింది. వారు చదువుకున్న చదువు వారు సంపాదించిన జ్ఞానం వారిని ప్రభువు దగ్గరికి నడిపించడానికి ఉపయోగపడింది. వారు నక్షత్రం ద్వారా నడిపించబడి యెరూషలేముకు వచ్చి ఆకాలంలో యూదులను పరిపాలిస్తున్న హేరోదు రాజు వద్దకు వచ్చి తామెందుకు వచ్చారో వివరించారు. వారి రాకకు గల కారణాన్ని విని హేరోదు, అతనితో పాటు యెరూషలేము నివాసులు కలవరపడ్డారు. ‘హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారిచేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనునూ వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి వారిని బేత్లెహేముకు పంపెను’– (మత్తయి 2:68). ఇక్కడ హేరోదు రాజులో ఉన్న దుర్భుద్ధి కనబడుతుంది. హేరోదు దేవుని ఆరాధించాలి అనే ఉద్దేశంతో లేడు. అయితే పైకి కనిపించడం మాత్రం ప్రజలందరికీ నేను కూడా పూజిస్తాను, నేను కూడా ఆరాధిస్తాను అని చెబుతున్నాడు కానీ అతని మనసులో భయంకరమైన స్వభావం దాగియుంది. కలవరపడినవాడు దేవుడిని చంపాలనే చూశాడు తప్ప ఆయనను రక్షించాలని, పూజించాలనే ఉద్దేశం అతనిలో లేదు. హేరోదు భయంకరమైన వేషధారిగా కనబడుతున్నాడు. పైకి ఒకలా మాట్లాడటం, లోపల మరొక తత్వాన్ని కలిగియుండటం. పైకి మనుషులను ఒప్పించేలా మాట్లాడటం, లోపల ఆ దేవుడిని సమూల నాశనం చేయాలనే తలంపును కలిగి ఉన్నాడు. ఇది భయంకరమైన వేషధారణ. అందునుబట్టే వేషధారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి యేసుకు కానుకలు అర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించారు. వారు అర్పించిన కానుకలలో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయి. బంగారము దైవత్వానికి, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థతకు సంకేతాలు. ఆ తదుపరి వారు దేవుని చేత బోధించబడినవారై వారి దేశమునకు ఒక నూతన మార్గములో తిరిగి వెళ్ళారు. దేవుని చేత బోధించబడటం మానవ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. మాకన్నీ తెలుసులే, మేము కూడా జ్ఞానం కలిగినవారం, నక్షత్ర పయనాన్ని చూసే మేము దేవుడిని కనుగొనటానికి వచ్చాము గనుక ఇకపై మా జ్ఞానం, మా తెలివి, మా వివేచన ద్వారా నడుస్తాము; మా అంతటి జ్ఞానవంతులు మరొకరు లేరు, మేము ఎవరి మాట వినక్కర్లేదు అని జ్ఞానులు అనుకోలేదు గాని దేవునిచేత బోధించబడినవారై ఆ బోధకు అనుకూలంగా వారు స్పందించారు. ఆ బోధనను అనుసరించి వారు మరొక మార్గానికి తిరిగి వెళ్ళారు. మాకన్నీ తెలుసులే మాకు తెలిసిందే మేం చేస్తాం, దేవుని స్వరాన్ని మేము వినాల్సిన అవసరం మాకు లేదు అని గనుక వారు హేరోదు దగ్గరకు వెళ్ళి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవేమో గాని, దేవుని మాటకు వారు లోబడటం ద్వారా మనకందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు యేసుక్రీస్తు ప్రభువును ఏవిధంగా ఆరాధించారో, అటువంటి ఓ అద్బుత ఘటన మానవ చరిత్రలో 20వ శతాబ్దంలో చోటు చేసుకుంది. సువిశాల ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న అపోలో– 11 అనే రాకెట్ మీద అక్షరాల 2లక్షల 20వేల మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలుమోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి మనసారా మహనీయుడైన దేవుని స్తుతించారు. అక్కడకు వెళ్ళి బైబిల్లోని 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో ‘నిన్ను కాపాడువాడు’ అనే మాట ఆరుసార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్‌ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే దేవాదిదేవుడు ఇంకెంత అద్భుతమైనవాడో కదా! నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చాలామంది చంద్రుని మీదకు వెళ్ళివచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి. ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్ళి కొన్ని పరిశోధనలు చేసివచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్ళు తీసుకు వచ్చారు. జేమ్స్ బి ఇర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితమిచ్చి ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించాడు. అతను ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి. ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు. రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరచాడు. ప్రతి సభలో ఆయన ప్రకటించిన సత్యం... ‘నేను చంద్రునిపై కాలుపెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడం గొప్పకాదు. సృష్టికర్తయైన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగుపెట్టాడు. అదీ గొప్ప విషయం’. క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. ‘దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు’ అని దూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ‘తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు’ అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్యజీవితంలో అనేకసార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం గాక మరిదేని గురించి అతడు ఆలోచించడు. కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించి వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షకభటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుండి అపరాధముల నుండి నిత్యశిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ‘ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అనేది లేఖన సత్యం’– (రోమా 2:23). పాపము దేవున్ని మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి. పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడి చేశాడు. గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటలో పాల్గొనడానికి చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్ తనకిమ్మని అడుగుతాడు. ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయిస్తాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం, అది అనుభూతికి అందని అనుభవైకవేద్యం. అనుభవించే కొద్ది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే కచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ‘ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపించింది. ఆ సందర్భంలో వారు అమితానందభరితులయ్యారు’ అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం.ప్రపంచం ఎన్నడు మరువలేని హాస్యకళాకారుడు చార్లీ చాప్లిన్. డైలాగులు కూడా లేకుండా అతడు నటించిన ఎన్నో సినిమాలు అతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. చాప్లిన్ లెక్కపెట్టలేనంత ధనాన్ని కూడా ఆర్జించాడు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిపోయిన అతని జీవిత చరమాంకంలో ఎవరో అడిగారు ‘నీ జీవితాన్ని ఒక్క ముక్కలో చెప్పగలవా?’ అని. ఆ ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం ‘నా జీవితం ఓ ప్రయోగాత్మకమైన జోక్’. ఆ సమాధానాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. వాస్తవాన్ని పరిశీలిస్తే నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ‘నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు, కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు’ అని ఒక కుబేరుడు మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరచింది. భౌతిక అవసరాలు తీరితే చాలు ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు. అవి దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగియుండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది. సమూయేలు అనే భక్తుడు రాసిన పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడూ మరచిపోదు. క్రీస్తు జన్మ విశిçష్ఠతను, ఆయన జీవితాన్ని, మరణ పునరుత్థానములను అద్భుతంగా వివరించే పాట అది. ‘పాపికాశ్రయుడవు నీవే. ఉన్నతలోకము విడిచిన నీవే... కన్నియ గర్భమున బుట్టిన నీవే, యేసు నీవే. చెదరిన పాపుల వెదకెడు నీవే... చెదరిన గొర్రెల కాపరివి నీవే. రోగులకు స్వస్థప్రదుడవు నీవే... మ్రోగునార్తుల యొక్క మొఱ విను నీవే. శాత్రవాంతరమున మృతుడవు నీవే... మైత్రిజూపగ మృత్యుద్ధతుడవు నీవే!’ సాక్షి పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా. జాన్ వెస్లీ, ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
నమస్కారం అంటే..!
గురువు గారికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాను... అనడం సాధ్యమయ్యే విషయం కాదు. గురువు విషయంలో చేయగలిగినది ఏమిటి.. అంటే ...‘జలజాతేక్షణు? దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్/నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్/గలరే; దీనికి నీకు? బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం/జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!‘ అంటుంది రుక్మిణీ దేవి భాగవతంలో. అంతటి ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నేనేం చేయగలను.. అంజలి ఘటించడం తప్ప... అంటుంది. అంటే రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం. ఈ ఐదు వేళ్ళతో కూడుకున్న చెయ్యి–కర్మేంద్రియ సంఘాతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు పదింటిని, బుద్ధిస్ధానమయిన 11వదయిన శిరస్సును కలిపి మీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను... అని చెప్పడానికి నమస్కారం చేస్తారు. ఈ తలలో వచ్చిన ఎన్నో ఆలోచనలను, ఈ చేతులతో ఎన్నో చేయకూడని పనులను చేసి మనుష్య జన్మ పాడుచేసుకున్నా. మీ వాక్కులు అగ్నిహోత్రం. నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి నేను ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపించి నన్ను రక్షించండి... అని చెప్పడానికి అంజలి ఘటిస్తారు. అంతటి గొప్పరూపం గురువు. సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా కూడా ఉంటాడు. గురువు ఒకడు, భగవంతుడు ఒకడు కాదు. నిజానికి భగవంతుడే గురువు. శైవసంప్రదాయంలో దక్షిణామూర్తి చాలా చాలా గొప్ప గురువు. ఆయన నోటితో మాట్లాడకుండా చిన్ముద్రపట్టి కూర్చున్నాడు. ఆయన గురువు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువు.‘కృష్ణం వందే జగద్గురుమ్!’. అమ్మవారు గురు మండల రూపిణి. సమస్త గురుమండల రూపిణి జగన్మాతయే. భగవంతుడు ఏ అవతారంలో మనముందుకొచ్చినా గురువుపట్ల అమిత గౌరవంతో ప్రవర్తిస్తాడు. 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన నరుడెవరు? – అంటే రామచంద్రమూర్తిని చూపించాడు నారద మహర్షి సంక్షేప రామాయణంలో. అంతటి గొప్ప రాముడు కూడా గురువుకు నమస్కరించి తలవంచుకుని నిలబడ్డాడు. ఏదో యాంత్రికమైన నమస్కారం కాదు. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో తెలుసుకుని చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలన్నా, అభివాదం చేయాలన్నా ఒక పద్దతి ఉండాలి. రెండు చేతులు కలిపి తలతాకించి నమస్కారం చేయడం కూడా నమస్కారమే. అలాకాక, ప్రణిపాతం.. కర్ర ఎలా నేలమీద పడిపోతుందో అలా పడిపోవడం. అంటే ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. ఇంతకన్నా కిందపడే అవకాశం లేదు. ఇప్పుడు నన్ను పైకెత్తడం మీ చేతుల్లో ఉంది... అన్న భావనతో చేస్తే ప్రణిపాతం. అంటే అహంకారం వదిలి పెద్దలముందు పడిపోవడం. రామచంద్రమూర్తి అలా గురువుగారి ముందు నిలబడి నమస్కరించి నేను రాకుమారుడిని కాదు, కింకరుడిని.. సేవకుడిని, మీరేది ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా.. ఆజ్ఞాపించండి. అన్నాడు.. గురువుల, పెద్దల విషయంలో అలా మసలుకోవాలనేది సనాతన ధర్మం మనకు ఇచ్చిన సందేశం. గురువు గారికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాను... అనడం సాధ్యమయ్యే విషయం కాదు. గురువు విషయంలో చేయగలిగినది ఏమిటి.. అంటే ... ‘జలజాతేక్షణు? దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్/నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్/గలరే; దీనికి నీకు? బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం/జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!‘ అంటుంది రుక్మిణీ దేవి భాగవతంలో. అంతటి ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నేనేం చేయగలను.. అంజలి ఘటించడం తప్ప... అంటుంది. అంటే రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం. ఈ ఐదు వేళ్ళతో కూడుకున్న చెయ్యి–కర్మేంద్రియ సంఘాతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు పదింటిని, బుద్ధిస్ధానమయిన 11వదయిన శిరస్సును కలిపి మీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను... అని చెప్పడానికి నమస్కారం చేస్తారు. ఈ తలలో వచ్చిన ఎన్నో ఆలోచనలను, ఈ చేతులతో ఎన్నో చేయకూడని పనులను చేసి మనుష్య జన్మ పాడుచేసుకున్నా. మీ వాక్కులు అగ్నిహోత్రం. నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి నేను ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపించి నన్ను రక్షించండి... అని చెప్పడానికి అంజలి ఘటిస్తారు. అంతటి గొప్పరూపం గురువు. సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా కూడా ఉంటాడు. గురువు ఒకడు, భగవంతుడు ఒకడు కాదు. నిజానికి భగవంతుడే గురువు. శైవసంప్రదాయంలో దక్షిణామూర్తి చాలా చాలా గొప్ప గురువు. ఆయన నోటితో మాట్లాడకుండా చిన్ముద్రపట్టి కూర్చున్నాడు. ఆయన గురువు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువు.‘కృష్ణం వందే జగద్గురుమ్!’. అమ్మవారు గురు మండల రూపిణి. సమస్త గురుమండల రూపిణి జగన్మాతయే. భగవంతుడు ఏ అవతారంలో మనముందుకొచ్చినా గురువుపట్ల అమిత గౌరవంతో ప్రవర్తిస్తాడు. 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన నరుడెవరు? – అంటే రామచంద్రమూర్తిని చూపించాడు నారద మహర్షి సంక్షేప రామాయణంల.. అంతటి గొప్ప రాముడు కూడా గురువుకు నమస్కరించి తలవంచుకుని నిలబడ్డాడు. ఏదో యాంత్రికమైన నమస్కారం కాదు. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో తెలుసుకుని చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలన్నా, అభివాదం చేయాలన్నా ఒక పద్దతి ఉండాలి. రెండు చేతులు కలిపి తలతాకించి నమస్కారం చేయడం కూడా నమస్కారమే. అలాకాక, ప్రణిపాతం.. కర్ర ఎలా నేలమీద పడిపోతుందో అలా పడిపోవడం. అంటే ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. ఇంతకన్నా కిందపడే అవకాశం లేదు. ఇప్పుడు నన్ను పైకెత్తడం మీ చేతుల్లో ఉంది... అన్న భావనతో చేస్తే ప్రణిపాతం. అంటే అహంకారం వదిలి పెద్దలముందు పడిపోవడం. రామచంద్రమూర్తి అలా గురువుగారి ముందు నిలబడి నమస్కరించి నేను రాకుమారుడిని కాదు, కింకరుడిని.. సేవకుడిని, మీరేది ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా.. ఆజ్ఞాపించండి. అన్నాడు.. గురువుల, పెద్దల విషయంలో అలా మసలుకోవాలనేది సనాతన ధర్మం మనకు ఇచ్చిన సందేశం. (చదవండి: అలవాటుని అధిగమించటం అతికష్టం!) -
స్వామివారు స్వయంభువుగా వెలసిన శేషాచలం కొండల మహాత్మ్యం అదే
ఓ విదేశీయుడు భారతదేశంలోని దేవాలయాల ప్రాశస్త్యాన్ని కంప్యూటర్ ద్వారా తెలుసుకున్నాడు. శేషాచలం కొండల్లో నెలవై ఉన్న వేంకటేశ్వరస్వామి అతడిని ఆకర్షించాడు. వెంటనే స్వామిని దర్శించుకోవాలనిపించింది. అనుకున్నదే తడవుగా చెన్నై విమానమెక్కాడు. పక్కన కూర్చున్న ప్రయాణికుడి సలహా మేరకు విమానాశ్రయం నుంచి కాలి నడకన తిరుమలకి వెళ్ళదలిచాడు. సంప్రదాయ దుస్తులు ధరించి, భుజానికి సంచీ తగిలించుకుని బయలుదేరాడు. ఎప్పుడూ చెప్పులు లేకుండా నడవని అతడు, ఎర్రటి ఎండకి కాళ్ళు కాలుతున్నా లెక్కచేయలేదు. స్వామి రూపాన్నే తలుచుకుంటూ ముందుకు నడిచాడు. దారిలో కొండకి నడిచి వెళ్ళే బృందాలు కొన్ని కనిపించాయి. వారితో కలిసి నడవటం కొనసాగించాడు. అలా మైళ్ళ కొద్దీ ప్రయాణం చేశాక, తిరుచానూరు చేరాడు. తల్లి పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. అమ్మవారి ప్రసాదం తింటూ తలెత్తి చూశాడు. వెండిరంగు లో మిలమిలా మెరుస్తున్న శేషాచలం కొండ చాలా దగ్గరగా అనిపించింది. చిన్న పిల్లవాడిలాగా ఎగిరి గంతులేశాడు. చకచకా నడుచుకుంటూ తిరుపతి పట్టణంలోని గోవింద రాజస్వామి గుడికి వెళ్ళి దండం పెట్టాడు. అక్కడే నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు కొని చదువుతూ మళ్ళీ శేషాచలం కొండల వైపు చూశాడు. ఆశ్చర్యం... కొండలు దూరంగా ఉన్నట్లు కనిపించాయి. ఉండబట్టలేక అతడు, తనతో పాటు నడుస్తూ ఉన్న మరో భక్తుడితో ‘‘అదేమిటండీ...? శేషాచలం కొండలకు దూరంగా ఉంటే, అవి చాలా దగ్గరగా ఉన్నట్లు, దగ్గరికి వెళితే ఎక్కడో... దూరంలో ఉన్నట్లు కనబడుతున్నాయి’’ అని ఆసక్తిగా అడిగాడు. ఆ భక్తుడు చిన్న నవ్వు నవ్వి ‘‘అదే నాయనా శేషాచలం కొండల మహాత్మ్యం. అవి స్వామివారు స్వయంభువుగా వెలసిన పవిత్రమైన కొండలు కదా! మనం పనుల్లో పడి స్వామిని మరిస్తే ‘నీకు దగ్గరే ఉన్నాను, వచ్చిపోరాదా!’ అని పిలిచినట్లు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ‘వచ్చావు కదా, నీ కష్టాలు తీరుతాయిలే...’ అని చెప్పి దూరమైనట్లవుతుంది. అయినా... అది చెబితే అర్థమయ్యేది కాదు. అనుభూతి చెందాల్సిందే. అందుకే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి భక్తులు స్వామి దర్శనానికి పరుగులు తీస్తారు’’ అని వివరించాడు.భక్తిభావంతో ఆ విదేశీయుడి కళ్ళు తడి అయ్యాయి. గట్టిగా గోవిందనామ స్మరణలు చేస్తూ బృందాలతో కలిసి అలిపిరి చేరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
నవరాత్రుల టైంలో చేసే ఆరోగ్య తాండవం!
నవరాత్రి సందర్భంగా దాండియా ఆడటం సంప్రదాయం. చేతిలో కోలాటం కర్రలతో ఆడటమే ‘దాండియా’. కాని కర్రలు లేకుండా చేసే నృత్యం కూడా గుజరాత్ తోపాటు ఉత్తర భారతంలో అంతే ప్రముఖమైనది. దాని పేరు ‘గర్బ’. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు చేసే ఈ నృత్యం కేవలం పారవశ్య తాండవమే కాదు ఆరోగ్య తాండవం అని కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ‘గర్బ’ అనే మాట ‘గర్భ’ నుంచి వచ్చింది. స్త్రీ శక్తికి చిహ్నం గర్భధారణం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జీవశక్తికి ప్రాణం పోసే స్త్రీ శక్తిని సూచించేందుకు గుజరాత్ అంతా ‘గర్బ’ నృత్యం చేస్తారు. దాండియా అంత విస్తృతంగానే గర్బ కూడా ఆడతారు. అందులో కర్రలు ఉంటాయి. ఇందులో ఉండవు. కాని గర్బ నృత్యం శరీరానికి చాలా మేలు చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా 9 రోజుల పాటు స్త్రీలు ఈ నృత్యం చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు. కేలరీల ఖర్చు గంటసేపు గర్బ డాన్స్ చేయడం వల్ల 300 నుంచి 500 కేలరీలు ఖర్చవుతాయి. అంతే కాదు, శరీరాంగాలకు ఇందులో గొప్ప వ్యాయామం లభిస్తుంది. ఈ నృత్య భంగిమల వల్ల భుజాలు, మెడ, వీపు, మోకాళ్లు బాగా కదిలి కండరాలన్నీ చైతన్యంలోకి వస్తాయి. సునీల్ బఫ్నా అనే ఆరోగ్య నిపుణుడి ప్రకారం గంట సేపు గర్బ చేస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి ఒక ప్రశాంత స్థితి వస్తుంది. గర్బ చేసే సమయంలో శరీరం ఎండార్ఫిన్స్‌ను విడుదల చేయడమే ఇందుకు కారణం. అదీగాక ఇది బృందంతో చేసే నృత్యం కాబట్టి మనతో పాటు ఒక సమూహం ఉంది అనే భరోసా మనసుకు లభించి మంచి అనుభూతి కలుగుతుంది. అందుకే నవరాత్రుల సమయంలోనే కాదు సంవత్సరం పొడగునా గర్బా డ్యాన్స్ చేయమని ఫిట్నెస్ నిపుణులు కూడా చెబుతున్నారు. గుండెకు మంచిది గర్బలో ఆధ్యాత్మికత ఉంది. నృత్యం ద్వారా చేసే ఆరాధన కనుక దీనిని చేయడం వల్ల శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో చప్పట్లతో, సంగీతానికి తగినట్టుగా లయ కలిగిన కదలికలు ఉంటాయి కనుక అవన్నీ గుండెకు, నృత్య సందర్భంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం పెరుగుతుంది కనుక ఊపిరితిత్తులకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గర్బ ఆధ్యాత్మిక, ఆరోగ్య తాండవం. (చదవండి: అందగాడు, ఆయుష్మంతుడు కన్నా గుణవంతుడే అన్ని విధాల..) -
ప్రకృత్యైనమః
గుర్తించాలే కానీ దేవుడు అనేక రూపాల్లో ఉంటాడు. వాటిలో కనిపించనివే కాదు, కనిపించేవీ ఉంటాయి. ఎక్కడో ఉన్నాడనుకునే దేవుడు... మన చేతికందే దూరంలో ఒక మొక్కలోనూ, కొమ్మలోనూ, ఆ కొమ్మకు పూసిన పువ్వులోనూ కూడా ఉన్నాడని గ్రహించడమే లౌకిక, పారలౌకిక సమన్వయంతో కూడిన ఆధ్యాత్మిక ప్రస్థానంలో తొలి ఎరుక. దైవం మానుషరూపేణ అంటారు. అలాగే, దైవం ప్రకృతి రూపేణ కూడా! రామకృష్ణ పరమహంస ఓసారి ఆకాశంలో రెక్కలు విప్పుకుంటూ ఎగిరే పక్షిని చూసి సమాధిలోకి వెళ్లిపోయారట. చెట్టును, పిట్టను, పువ్వును, పసిపాప నవ్వును, పారే ఏటినీ, ఎగిరే తేటినీ చూసి తన్మయులైతే చాలు; ఆ రోజుకి మీ పూజ అయిపోయిందని ఒక మహనీయుడు సెలవిస్తాడు. షడ్రసోపేతంగా వండిన తన వంటకాలను తృప్తిగా ఆరగిస్తే ఇల్లాలు ఎంత ఆనందిస్తుందో, తన వ్యక్తరూపమైన ప్రకృతిని చూసి పరవశిస్తే దేవుడు అంతే ఆనందిస్తాడని ఆయన అంటాడు. నది ఒడ్డున నిలబడి దాని పుట్టుకను, గమనాన్ని, పోను పోను అది చెందే వైశాల్యాన్ని, అది ప్రవహించిన పొడవునా దానితో అల్లుకున్న మన జీవనబంధాన్ని స్మరించుకున్నా అది పుణ్య స్నానంతో సమానమేనని ఒక కథకుడు రాస్తాడు. కృష్ణశాస్త్రి గారు పల్లవించినట్టు అడుగడుగునా, అందరిలోనే కాదు; ప్రకృతిలో అన్నింటిలోనూ గుడి ఉంది. అనాది నుంచీ నేటివరకూ మనిషి ఊహలో, భావనలో మనిషీ, దేవుడూ, ప్రకృతీ పడుగూ పేకల్లా అల్లుకునే వ్యక్తమయ్యారు. ఋగ్వేద కవి చూపులో ప్రకృతి పట్ల వలపు, మెరుపు ఎంతో ముగ్ధంగా, సరళంగా, సహజసుందరంగా జాలువారుతాయి. ‘‘వెలుగులు విరజిమ్మే ఓ ఆకాశపుత్రీ, సకల సంపదలకూ నెలవైన ఉషాదేవీ! వస్తూ వస్తూ మాకు ధనరూపంలోని ఉషస్సును వెంట బెట్టుకుని రా’’ అని ఒక ఋక్కు అంటుంది. ఋగ్వేద కవి చింతనలో అగ్ని ధూమధ్వజుడు; సూర్యకాంతితో తళతళా మెరుస్తూ ధ్వనిచేసే సముద్రపు అలల్లా వ్యాపిస్తాడు. ‘‘తమసానదీ జలాలు మంచివాడి మనసులా స్వచ్ఛంగా ఉన్నా’’యని వాల్మీకి వర్ణిస్తాడు. సుగ్రీవుడితో అగ్ని సాక్షిగా స్నేహం చేసిన రాముడు, ‘‘వర్షాకాలంలో మంచి పొలంలో వేసిన పంట ఫలించినట్టు నీకార్యాన్ని సఫలం చేస్తా’’నంటాడు. ఆ మాటలకు సుగ్రీవుడు, ‘‘నదీవేగంలా హఠాత్తుగా ఉరవడించిన కన్నీటివేగాన్ని ధైర్యంతో నిలవరించుకున్నా’’డని రామాయణ కవి అంటాడు. ఏ కాలంలోనూ మనిషీ, ఋషీ, కవీ ప్రకృతి పొత్తిళ్లలో పసివాడిగానే ఉన్నాడు తప్ప ప్రకృతికి దూరం కాలేదు. ఇతిహాస కావ్య ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు తప్పనిసరి భాగాలు. శారద రాత్రుల్లో ఉజ్వల తారకలు, కొత్త కలువ గంధాన్ని మోసుకొచ్చే సమీరాలూ, కర్పూరపు పొడిలా చంద్రుడు వెదజల్లే వెన్నెల వెలుగులూ, చెంగలువ కేదారాలూ, మావులూ క్రోవులూ పెనవేసుకున్న అడవులూ, పక్షులు బారులు కట్టి ఇంటిముఖం పట్టే సూర్యాస్తమయ దృశ్యాలూ, తలను రెక్కల్లో పొదవుకుని పంటకాలువల దగ్గర నిద్రించే బాతువుల సన్నివేశాలూ... ఇలా కవి ఊహల రస్తాకెక్కని ప్రకృతి విశేషం ఏదీ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం రూపంలో ప్రకృతి భాగం కాని పూజా ఉండదు. వినాయకుని పూజలో ఉపయోగించే మాచీ,బృహతి, బిల్వం, ధత్తూరం, బదరి, తులసి, మామిడి, కరవీరం, దేవదారు, మరువకం లాంటి ఇరవయ్యొక్క పత్రాల పేర్లే చెవులకు హాయిగొలిపి ఆకుపచ్చని చలవపందిరి వేసి మనసును సేదదీర్చుతాయి. అమ్మవారి స్తుతుల నిండా పూవులూ, వనాలూ పరచుకుంటాయి. చంపకాలు, సౌగంధికాలు, అశోకాలు, పున్నాగాలతో అమ్మ ప్రకాశించిపోతుంది. కదంబ పూలగుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. చాంపేయ, పాటలీ కుసుమాలు తనకు మరింత ప్రియమైనవి. శిరసున చంద్రకళను ధరిస్తుంది. ప్రకృతి వెంటే పర్యావరణమూ గుర్తురావలసిందే. పర్యావరణ స్పృహ ఇప్పుడే మేలుకొంద నుకుంటాం కానీ, ప్రకృతిలో భాగంగా మనిషి పుడుతూనే పెంచుకున్న స్పృహ అది. రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు వెడుతూ, వానరులు ఎక్కడుంటే అక్కడ చెట్లు సమృద్ధిగా ఉండాలనీ; అవి అన్ని కాలాల్లోనూ విరగ కాయాలనీ; నదుల్లో నీరు నిత్యం ప్రవహిస్తూ ఉండాలనీ ఇంద్రుని వరం కోరాడు. పాండవులు ద్వైతవనంలో ఉన్నప్పుడు ఆ అడవిలోని చిన్న జంతువులు ధర్మరాజుకు కలలో కనిపించి, ‘‘మీరు రోజూ మమ్మల్ని వేటాడి చంపడంవల్ల మా సంఖ్య తగ్గిపోయింది, బీజప్రాయంగా మిగిలాం, మేము పూర్తిగా నశించేలోగా దయచేసి మరో చోటికి వెళ్లం’’డని ప్రార్థించాయి. విశ్వనాథవారు తన ‘వేయిపడగలు’ నవలలో పర్యావరణానికి ప్రతీకగా పసరిక అనే పాత్రనే సృష్టించారు. ఆధునిక వేషభాషల వ్యామోహంలో పడీ, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణ విధ్వంసం ఏ స్థాయిన జరుగుతోందో ఆ పాత్ర ద్వారా గంట కొట్టి చెప్పారు. పూర్వకాలపు రాజులు అడవిని, అటవీ జనాన్ని, సంపదను పర్యావరణ భద్రతకు తోడ్పడే స్వతంత్ర అస్తిత్వాలుగా చూశారు తప్ప, తమ రాజ్యంలో భాగం అనుకోలేదు. ఇప్పుడా వివేచన అంతరించి అడవులు రాజ్యానికి పొడిగింపుగా మారి బహుముఖ ధ్వంసరచనకు లక్ష్యాలయ్యాయి. ప్రకృతికి పండుగకు ఉన్న ముడి తెగిపోయి ప్రతి పండుగా పర్యావరణంపై పిడికిటిపోటుగా మారడం చూస్తున్నాం. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్న సంగతిని గుర్తు చేసుకోడానికి నేటి వినాయకచవితి కన్నా గొప్ప సందర్భం ఏముంటుంది! -
నేటి నుంచి అధిక శ్రావణమాసం? అంటే ఇది డూప్లికేటా?
ఈనెల జూలై 18వ తారీకు నుంచి అధిక శ్రావణమాసం ప్రారంభం అవుతోంది. 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం ఇది. ఈ మాసం నేటి(జూలై 18) నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది. అయితే ఈ అధిక మాసం అనేది కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలకు మాత్రమే వస్తుంది. మిగతా మాసాలకు ఎప్పుడూ అధిక మాసం రాదు. ఐతే ముందుగా ఈ అధిక మాసం వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. అసలు అధికమాసం ఎందుకు వస్తుంది?. అంటే ఇది డూప్లికేట్ అని అర్థమా? ఎలాంటి జపతప వ్రతాలు ఆచారించాల్సిన పని లేదా? అధికమాసం ఎందుకు వస్తుదంటే.. తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, రుతువులు, పంచాంగ గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంపావు రోజులు వ్యత్యాసం ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం అవదు. చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని అధికమాసం అంటారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని పిలుస్తారు. ఇది పాటించం అంటే కుదరదు.. కొన్ని ఏళ్ల తర్వాత జోడు శ్రావణ మాసాలు రావడం జరిగింది. శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తామో అదేవిధంగా మొదటి శ్రావణంలో కూడా అవే నియమాలను తప్పక పాటించాలి. ఉదాహరణకు కవల పిల్లలు పుడితే వద్దంటామా..? లేదు కదా అలాగే జోడు శ్రావణ మాసాలు వచ్చినప్పుడు కూడా ఒకటి పాటిస్తాం మరొకటి పాటించము అంటే ధర్మశాస్త్రము అంగీకరించదు. కావున రెండూ శ్రావణ మాసాలే. మొదటి శ్రావణ మాసంలో కూడా వ్రతాలు, పూజలు అనగా శ్రావణ సోమవారాలను, శ్రావణ శుక్రవారాలను, శ్రావణ శనివారాల వంటివి, అలాగే మధ్య మాంసాలను స్వీకరించకుండా కేవలం సాత్విక ఆహారాలను మాత్రమే స్వీకరించడం తదితరాలన్ని చేయాల్సిందే. విష్ణువుకి ఎంతో ఇష్టమైనది.. శ్రీమహా విష్ణువుకి మహా ప్రీతికరమైన మాసం ఇది. అందుకే దీన్ని అధిక రాధా పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో చేసే దానాలు, వ్రతాలు అధిక ఫలితాలనిస్తాయి. ఈ మాసంలో ఏది దానం చేసిన శ్రీ అధిక రాధా పురుషోత్తమ ప్రీత్యర్థం ఇస్తున్న దానం పేరు చెప్పి కరిష్యే అనాలి. అలాగే ఈ రోజుల్లో శ్రీ అధిక రాధా పురుషోత్తమాయ నమః అని 108 సార్లు జపం చేయాలి. విష్ణువు శ్రీమహాలక్ష్మికి ఓ సందర్భంలో పురుషోత్తమ మాస విశిష్టతను వివరిస్తూ ‘ఎవరైతే ఈ మాసంలో పుణ్య నదీస్నానాలు, జపహోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టనష్టాలు ఎదురవుతాయి. అధిక మాసం శుక్ల పక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి నాడైనా పుణ్యకార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన ఫలితం లభిస్తుందని వివరించాడని పురాణ కథనం. (చదవండి: ఈ అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో సమానమైనది!) -
దంభోద్భవుడి గర్వభంగం.. అందుకే విర్రవీగకూడదంటారు
పూర్వం దంభోద్భవుడు అనే రాజు ఉండేవాడు. మహా బలశాలి. సమస్త భూమండలాన్నీ పాలించేవాడు. అంతేకాదు, పేరుకు తగినట్లే మహా గర్విష్టి. రాజోచితంగా అలంకరించుకుని సభకు వచ్చి స్వర్ణ సింహాసనంపై ఆసీనుడయ్యేవాడు. ప్రతిరోజూ అతడు సభలోకి అడుగుపెడుతూనే వందిమాగధులు అతడి బలపరాక్రమాలను చిలవలు పలవలుగా పొగుడుతూ కీర్తనలను గానం చేసేవారు. సభాసదులు జయజయ ధ్వానాలు పలికేవారు. దంభోద్భవుడు వీనులవిందుగా వాటిని ఆలకిస్తూ, గర్వాతిశయంతో మీసాలను మెలితిప్పుకొనేవాడు. గుణగానాల ప్రహసనం సద్దుమణిగాక దంభోద్భవుడు గర్వాతిశయంతో సభాసదులను తిలకిస్తూ, స్వోత్కర్ష మొదలు పెట్టేవాడు. ‘ఈ భూమండలంలో నన్ను ఎదిరించి, ఓడించే వీరుడెవడైనా ఉన్నాడా? బాణ ఖడ్గ గదా యుద్ధాల్లో నన్ను మించిన వాడున్నారా? మల్లయుద్ధంలోనైనా నాతో తలపడగల వాడున్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి. క్షణాల్లోనే మట్టుబెడతాను’ అంటూ గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగరేసేవాడు. దంభోద్భవుడి మంత్రులు కూడా అతడికి తగిన వారే! రోజూ అతడి బల పరాక్రమాలను పొగుడుతూ కాలక్షేపం చేసేవారు. దంభోద్భవుడికి నానాటికీ అహంకారం పెరగసాగింది. ఒకరోజు కొందరు విప్రులు దంభోద్భవుడిని చూడవచ్చారు. దంభోద్భవుడు వారికి సాదరంగా స్వాగతం పలికి, అతిథి సత్కారాలు చేశాడు. వారి ఎదుట అలవాటు కొద్దీ స్వోత్కర్ష మొదలుపెట్టాడు. పాపం ఆ విప్రులు కిక్కురుమనకుండా అతడి ప్రగల్భాలన్నింటినీ ఓపికగా ఆలకించారు. దంభోద్భవుడు తన ప్రసంగాన్ని ఆపి, ఇక మీరేమంటారు అన్నట్లుగా విప్రులకేసి చూసి కళ్లెగరేశాడు.‘రాజా! నువ్వు మహావీరుడవు, అసామాన్య శూరుడవు, పరాక్రమవంతుడవు, అమిత బలసంపన్నుడవు. భూమ్మీద ఉన్న రాజులెవరూ నిన్ను ఎదిరించి నిలువలేరు. అంతవరకు నిజమే!’ అన్నారు.‘అంతవరకు నిజమే అనడంలో అంతరార్థమేమిటి?’ కనుబొమలు ముడివేస్తూ ప్రశ్నించాడు దంభోద్భవుడు.‘రాజా! గంధమాదన పర్వతంపై నరనారాయణులనే ఇద్దరు రుషిపుంగవులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిని జయించగల వీరులు ముల్లోకాలలోనూ లేరని విన్నాం. నీ పరాక్రమాన్ని చాటుకోవాలనే కోరిక ఉంటే, వారితో యుద్ధంచేసి సంగతి తేల్చుకోవచ్చు’ అన్నారు విప్రులు.విప్రులు ఆ మాట అనడంతోనే దంభోద్భవుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కాలు నేలకేసి బలంగా తాటించాడు. కత్తి తీసి ఝుళిపించాడు. మీసం మెలితిప్పాడు. ‘నన్ను మించిన వీరులా వాళ్లు, ఎంత కావరం?’ అంటూ అప్పటికప్పుడే యుద్ధానికి బయల్దేరమంటూ సైన్యాన్ని ఆదేశించాడు. సాయుధంగా రథం సిద్ధం చేసుకుని, హుటాహుటిన బయలుదేరాడు.దంభోద్భవుడు గంధమాదన పర్వతం వద్దకు చేరుకునే సరికి, కొండ మీద నరనారాయణులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ కనిపించారు. వారిని చూసి, తొడగొట్టి యుద్ధానికి రమ్మంటూ పిలిచాడు. పిలుపు విని నరనారాయణులు లేచి వచ్చి, అతడికి అతిథి సత్కారాలు చేయబోయారు. ‘ఇవన్నీ నాకు వద్దు. నాకు కావలసింది మీతో యుద్ధం’ అన్నాడు దంభోద్భవుడు.‘నాయనా! మేం మునులం. ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాం. మమ్మల్ని తపస్సు చేసుకోనీ. నువ్వు వచ్చిన దారినే వెనక్కు వెళ్లు’ అన్నారు. దంభోద్భవుడు వినలేదు. వికటాట్టహాసం చేస్తూ యుద్ధం చేయాల్సిందేనంటూ వారిపై సంధించడానికి బాణం తీశాడు. నరనారాయణుల్లోని నరుడు ఒక దర్భపుల్ల తీసుకుని ప్రయోగించాడు. అది దంభోద్భవుడి బాణాన్ని తుంచేసింది. అతడు వరుస బాణాలు కురిపించాడు. అతడి సైన్యం కూడా బాణాలు ప్రయోగించింది. వాటన్నింటినీ ఆ దర్భపుల్ల తుత్తునియలు చేసింది. సైనికులను గాయపరచింది. వారు హాహాకారాలు చేస్తూ పలాయనం చిత్తగించారు. దంభోద్భవుడికి ధైర్యం సడలింది. ఆయుధాలను కిందపెట్టి, నరనారాయణుల పాదాల మీద వాలాడు. ‘మహర్షులారా! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం జరిగింది’ అని ప్రార్థించాడు.‘నాయనా! పరాక్రమం ఉన్నవారు ఇతరుల రక్షణ కోసం ఆ పరాక్రమాన్ని ఉపయోగించాలి. ధనం ఉన్నవారు నిరుపేదలకు దానం చేయడానికి ఉపయోగించాలి. గర్వాతిశయంతో మిడిసిపడటం తగదు. నిస్సహాయులకు సహాయం చేయని జన్మ వ్యర్థం’ అని హితవు పలికారు. గర్వభంగమైన దంభోద్భవుడు వారి నుంచి సెలవు తీసుకుని వెనక్కు మళ్లాడు. -
అది ప్రపంచంలోని ఏకైక 5 నదుల సంగమ ప్రాంతం.. మన దేశంలో ఎక్కడున్నదంటే..
నదులు.. ఏ దేశానికైనా జీవనాధారంగా భాసిల్లుతుంటాయి. నదులు మనిషి సమస్త అవసరాలను తీరుస్తుంటాయి. మానవ నాగరికత నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందింది. నదులు తమ దారిన తాము వెళ్లిపోతూ, తమకు అడ్డుపడే వాటిని కూడా తమతోపాటు తీసువెళ్లిపోతాయని చెబుతుంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు,లేదా మూడు నదులు కలవడాన్ని మనం చూసుంటాం. ఉదాహరణకు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదులు కలవడంతో అక్కడి త్రివేణీ సంగమం ఏర్పడింది. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఐదు నదులు కలిసే ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఆ ప్రాంతం మన దేశంలోనే ఉంది. ప్రపంచంలో ఎక్కడా కనిపించని కొన్ని అద్భుతాలు భారత్‌లో కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని పచ్నద్కు సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారత కాలంలో పాండవులు తమ ప్రయాణంలో ఈ ప్రాంతంలో బస చేశారని చెబుతారు. పాండవులలో ఒకడైన భీముడు ఈ ప్రాంతంలోనే బకాసురుడిని వధించాడని చెబుతారు. శ్రీరాముని భక్తుడైన తులసీదాసు ఈ ప్రాంతంలోనే పర్యటించాడని చెబుతారు. బుందేల్‌ఖండ్ పరిధిలోని జాలౌన్‌లో ఐదు నదులు సంగమిస్తాయి. ఈ ప్రాంతాన్నే పచ్నద్ అంటారు. ప్రకృతి సౌందర్యానికి, హిందూ ఆధ్యాత్మిక నమ్మకాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఏడాదిలో ఒకసారి ఇక్కడ మేళా జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడికి లెక్కకుమించిన సంఖ్యలో భక్తులు వస్తారు. పచ్నద్ను మహాతీర్థరాజం అని కూడా అంటారు. ప్రపంచంలో ఐదు నదులు సంగమించే ప్రాంతం ఇదొక్కటే కావడం విశేషం. ఇక్కడ యమున, చంబల్, సింధు, పహుజ, కన్వరి నదులు సంగమిస్తాయి. పచ్నద్ సంగమతీరంలో బాబా సాహెబ్ మందిరం ఉంది. ఈయన గోస్వామి తులసీదాసు సమకాలికుడని చెబుతారు. ఈయన ఇక్కడే తపమాచరించి, ఒక గుహలో విలీనమైపోయారని స్థానికులు చెబుతుంటారు. ఈ పంచనదుల సంగమప్రాంతంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే కాన్ఫూర్, దేహాత్, జాలౌన్, ఔరయ్యా ప్రాంతాల రైతులకు మేలు జరగనుంది. ఇది కూడా చదవండి: అన్ని రైళ్లకూ ‘X’ గుర్తు.. ‘వందే భారత్’కు ఎందుకు మినహాయింపు? -
అందు కోసం కాపీ కొట్టండి ఫరవాలేదు?..
‘మనసులో ఉండే గదులను అసూయ, ద్వేషం, ఆగ్రహం.. వంటి ప్రతికూల శక్తులతో నింపుకుంటూ వెళితే మనసు భారంతో కుంగిపోతుంది. ఆ భారం మన అడుగులపై పడుతుంది. ఒక అడుగు కూడా ముందుకు పడదు. దీనివల్ల ఎవరికి నష్టం? అలాకాకుండా మనసును ప్రేమ, శాంతి, సంతోషాలతో నింపండి. మనసు అత్యంత తేలిక అవుతుంది. అడుగులు వడివడిగా ముందుకు పడతాయి..’ ఇలాంటి మాటలతో యువతరాన్ని ఆకట్టుకుంటున్నారు యంగ్ స్పిరిచ్యువల్ ఇన్ఫ్లూయెన్సర్లు. సోషల్ మీడియాలో వీరు ఆధ్యాత్మికతకు సంబంధించికొత్త ద్వారాన్ని తెరిచారు. వీరి ఫాలోవర్స్‌లో అత్యధికులు యువతే కావడం మరో విశేషం.. ‘కాపీ కొట్టండి ఫరవాలేదు’ అంటుంది శ్రేయాసి వాలియా. ఇంతకీ ఆమె ఏం కాపీ కొట్టమంటుంది? ‘కాపీ కొట్టండి. దయగల హృదయాన్ని, ఎంత పెద్ద విమర్శను అయినా చిన్న చిరునవ్వుతో స్వీకరించే ధీరత్వాన్ని’ అంటుంది శ్రేయాసి. దిల్లీలో జన్మించిన శ్రేయాసి కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం స్క్రిప్ట్ రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా ‘స్పిరిచ్యువల్ ఇన్ఫ్లూయెన్సర్’గా మంచి పేరు సంపాదించుకుంది. ఏడు సంవత్సరాల వయసు నుంచే ధ్యానం తరగతులకు హాజరయ్యేది శ్రేయాసి. ధ్యానంతో పాటు ఆధ్యాత్మిక విషయాలపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. లాక్డౌన్ సమయంలో కోవిడ్ మహమ్మారి భయం అనేది ఒక కోణం అయితే కరిగిపోతున్న ధైర్యం, నిలువెల్లా దైన్యం, రకరకాల మానసిక సమస్యలు మరో కోణం. ఈ సమస్యల పరిష్కారానికి ఉచితంగా మెడిటేషన్ తరగతులు నిర్వహించింది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ‘ధ్యానం ఎందుకు చేయాలంటే.. 500 కారణాలు’ అంటూ రాసిన దానికి మంచి స్పందన వచ్చింది. ‘ధ్యానం వల్ల నా కోపం తగ్గిపోయింది. ఆత్మవిశ్వాసం పెరిగింది’ అంటుంది శ్రేయాసి. ‘ధ్యానం’ తరువాత ఆధ్యాత్మిక విషయాలు కూడా రాయడం మొదలుపెట్టింది. ‘భక్తితత్వాన్ని గంభీరంగా మాత్రమే చెప్పాలని లేదు’ అనే భావనతో ఎంటర్టైన్మెంట్ వీడియోల ద్వారా కూడా ఎన్నో మంచి విషయాలు చెప్పింది. ‘ఇదంతా ఏమిటి! హాయిగా లక్షలు సంపాదించే ఉద్యోగం చేసుకోకుండా’ అని తనతో చాలామంది అనేవారు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ సరేసరి. అయితే వారి మాటలు, ట్రోలింగ్ తనపై ప్రభావం చూపించలేక పోయాయి. ‘స్పిరిచ్యువల్ ఇన్ఫ్లూయెన్సర్’గా శ్రేయాసికి సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘నేను ఎక్కువ ఇచ్చి తక్కువ తీసుకుంటున్నానా? తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకుంటున్నానా?’ అనేది శ్రేయాసి తనకు తాను వేసుకునే ప్రశ్న. తీరిక సమయంలో పెయింటింగ్స్ వేయడం, పుస్తకాలు చదవడం, బ్యాడ్మింటన్ ఆడడం అంటే తనకు ఇష్టం. కోల్‌కత్తాకు చెందిన 27 సంవత్సరాల జయ కిశోరిని ‘మీరాబాయి ఆఫ్ జెన్‌జెడ్’ అని పిలుచుకుంటారు అభిమానులు. సోషల్ మీడియా కేంద్రంగా కృష్ణుడి గాథలను 30 సెకండ్ల వీడియోలతో చెప్పడం ద్వారా జయ కిశోరి పాపులర్ అయింది. జయ కిశోరి ఉపన్యాసాలకు ప్రభావితమైన ఎంతోమంది ‘మాలో ఒంటరితనం దూరమైంది. స్నేహభావం పెరిగింది’ అంటుంటారు. జయ కిశోరికి ఫేస్బుక్లో 1.9 మిలియన్లు, యూట్యూబ్‌లో 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ‘నా తల్లిదండ్రులు ఆర్మీలో పనిచేస్తారు. దీంతో ఎన్నో ప్రాంతాలలో చదువుకోవాల్సి వచ్చింది. అయితే ఏ ప్రాంతంలో చదువుకున్నా జయ దీదీ నాతోపాటు ఉన్నట్లే ఉంటుంది. నాకు ధైర్యం చెబుతూ దారి చూపుతుంది’ అంటుంది దిల్లీకి చెందిన పదహారు సంవత్సరాల జయ పాండే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన 14 సంవత్సరాల దేవి ఉష్మ కిషోర్‌జీ ఒకవైపు పాఠశాల విద్యను కొనసాగిస్తూనే సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్, పోస్ట్‌ల ద్వారా ఆధ్యాత్మికం నుంచి సెల్ఫ్–లవ్, సెల్ఫ్–కేర్ వరకు ఎన్నో విషయాలపై తన మనసులోని భావాలను పంచుకుంటుంది. దేవికి ఇన్‌స్టాగ్రామ్‌లో పదివేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘నాకు ఉన్న ఫాలోవర్స్ సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఒక వీడియోకు మూడు లక్షలు ఇస్తాం అంటూ ఆఫర్స్ వస్తుంటాయి. అయితే నేను డబ్బు కోసం రాజీ పడదలచుకోలేదు. వీడియోలను వైరల్ చేయడానికి ఒత్తిడి తెచ్చుకోవడం నా లక్ష్యం కాదు’ అంటుంది ముంబైకి చెందిన ఒక స్పిరిచ్యువల్ ఇన్ఫ్లూయెన్సర్. ‘మీ ఉపన్యాసం విన్న తరువాత నేను ఒంటరిని అనే భావన పోయింది అని మెసేజ్‌లు వస్తుంటాయి. ఇలాంటి మెసేజ్‌లు డబ్బుకంటే ఎంతో విలువైనవి అనిపిస్తాయి’ అంటుంది ఆమె. స్థూలంగా చెప్పాలంటే యంగ్ స్పిరిచ్యువల్ ఇన్‌ప్లూయెన్సర్లు తమ ఆనందాన్ని డబ్బులలో చూసుకోవడం లేదు. తమ విజయాన్ని కరెన్సీ ధగధగలతో కొలవాలనుకోవడం లేదు. ‘మీ పోస్ట్ చదివిన తరువాత, మీ ఉపన్యాసం విన్న తరువాత నాలో చెప్పలేనంత మార్పు వచ్చింది’ ఇలాంటి చిన్న మెసేజ్ చాలు వారికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వడానికి!. (చదవండి: పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది ) -
భలే... పేడ కళ
‘ఇంకేం మిగిలింది పేడ’ అని వ్యంగ్యంగా అనవచ్చు. పేడ విలువ మన పూర్వికులకు తెలుసు. దాని ఉపయోగాలూ తెలుసు. పేడ అలికిన ఇల్లు శుభదాయకమైనది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పుడొక టీచరమ్మ పేడతో కళాకృతులు తయారు చేస్తోంది. ఆధ్యాత్మిక చిహ్నాలను పేడతో రూపొందిస్తోంది. వీటి అలంకరణ ఇంటికి సంప్రదాయకళ తెస్తుందని చెబుతోంది. ప్రస్తుతం జనం వాటిని కొనేందుకు సిద్ధమవుతున్నారు. పేడతో పిడకలు కొట్టడం, కళ్లాపి చల్లుకోవడం, ఇల్లు అలుక్కోవడం తరతరాలు చేస్తున్నదే. కాని పేడతో కళాకృతులు చేయడం ద్వారా ఒట్టిపోయిన ఆవులను, ఎడ్లను కూడా రోడ్ల మీద వదలడమో, కబేళాకు తరలించడమో చేయకుండా వాటి ఆలనా పాలనా చూడొచ్చు అంటుంది 42 ఏళ్ల పూజా గాంగ్వర్. కిలో పేడ ఎంత? కిలో పేడ మనం ఎంతకు కొంటాం? ఎంతకీ కొనం. ఎందుకంటే పేడ ఎక్కడైనా దొరుకుతుంది. ‘కాని వాటితో కళాకృతులు చేస్తే కిలో పేడ కళాకృతులకు 2000 రూపాయలు వస్తాయి. సంపాదించవచ్చు’ అంటోంది పూజా గాంగ్వర్. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు సమీపంలోని రాజన్‌పూర్ అనే గ్రామంలో ప్రైమరీ టీచర్‌గా పని చేస్తున్న పూజా గాంగ్వర్ పేడతో కళాకృతులు చేయడమే కాదు. వాటివల్ల ఒక డజను మందికి ఉపాధి కల్పిస్తోంది, ఆదాయమూ గడిస్తోంది. వాల్ హ్యాంగింగులు, నేమ్ ప్లేట్లు, బొమ్మలు, పెన్ హోల్డర్లు, అగర్ బత్తీలు, చెప్పులు... ఇలా ఎన్నో తయారు చేస్తూ ఆకట్టుకుంటోంది. తేలిక బొమ్మలు పేడతో తయారయ్యే వస్తువులు తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే పేడను సేకరించి, ఎండబెట్టి, పొడి చేసుకుని, జల్లెడ పట్టుకుని, ఆ వచ్చిన మెత్తటి పొడికి మైదా పిండిగాని, చెట్టు బంక గాని, ముల్తానీ మట్టిగాని కలిపి సాగే లక్షణం కలిగిన బంక పదార్థంగా (క్లే) చేసుకుని దానితో కళాకృతులు తయారు చేస్తారు. ‘ఇనుము, రాగి, ఫైబర్ మూసల్లో పేడ క్లేను మూసబోసి ఆరబెట్టి బొమ్మలను తయారు చేస్తాం’ అని తెలిపింది గాంగ్వర్. బొప్పాయి పాలు ‘మూసలో పోసి ఆరబెట్టుకున్న కళాకృతులకు పాలిష్ కోసం బొప్పాయి పాలుగాని, అవిసె గింజల నూనె గాని వాడతాం. ఈ కళాకృతులు పాడుగావు. నీళ్లు తగలకుండా చూసుకుంటే ఐదారేళ్లు ఉంటాయి. మా ఊళ్లోని యాభై ఆవుల పేడను నేను ఈ బొమ్మల కోసం వాడుతున్నాను. ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల నుంచి స్త్రీలు వచ్చి నేర్చుకుంటామంటున్నారు. వారికి ట్రయినింగ్ ఇస్తే ఆవు పేడ సద్వినియోగం అవుతుంది. ఆవుల సంరక్షణా జరుగుతుంది’ అని తెలిపింది పూజ.. -
ముఖేష్ అంబానీ తరచూ సందర్శించే ఆలయమిదే.. ప్రాధాన్యత ఏంటంటే
దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖేష్ అంబానీ లగ్జరీ లైఫ్ గురించి చాలా కథనాలు వినిపిస్తుంటాయి. అయితే ముఖేష్ అంబానీ ఆధ్మాత్మికతపై అమితమైన మక్కువ చూపిస్తారనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. దేశంలోని చాలా ఆలయాలకు తరచూ ముఖేష్ అంబానీ వెళుతుంటారు. వీటిలో ఒకటే నాథద్వారాలో కొలువైన శ్రీనాథ్ దేవాలయం. రాజస్థాన్‌లోని నాథద్వారాలోని ఆలయానికి ముఖేష్ అంబానీ చాలాకాలంగా వస్తున్నారు. అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ముఖేష్ అంబానీ మాత్రమే కాకుండా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ లాంటి బడా స్టార్లు కూడా ఇక్కడికి వస్తుంటారు.ఈ మందిరానికున్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నాథద్వారా ప్రాంతం ఉదయపూర్‌కు సమీపంలో ఉంది. ఈ ప్రాంతానికి రైలులో లేదా విమానంలో ఉదయ్‌పూర్ చేరుకున్నాక అక్కడి నుంచి ఆలయానికి వెళ్లవచ్చు. ఈ ఆలయంలో శ్రీకృష్టుని అవతారమైన శ్రీనాథుడు కొలువైవున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ప్రజలు ఇక్కడికి తరచూ వస్తుంటారు. శ్రీనాథ మందిర నిర్మాణం 17వ శతాబ్ధంలో జరిగింది. ఆలయాన్ని మహారాజా రాజాసింగ్ కట్టించారు. ఆలయానికి విశాల ప్రాంగణం ఉంది. అలయంలోనికి ప్రవేశించేందుకు నలువైపులా ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో శ్యామల వర్ణంలోని శ్రీనాథుడు కొలువైవున్నాడు.హోలీనాడు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. లెక్కకు మించిన జనం ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకునేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఆలయ పరిసరాల్లో భక్తులకు వసతి సౌకర్యం కూడా లభిస్తుంది. ఇటీవలికాలంలో ఇది పర్యాటక స్థలంగానూ అభివృద్ధి చెందుతోంది. -
Mann Ki Baat: మన్ కీ బాత్... నా ఆధ్యాత్మిక ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఆదివారంతో 100 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఆయన ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తనకు ఆధ్యాత్మిక ప్రయాణంగా అభివర్ణించారు. ‘‘ఇది కేవలం కార్యక్రమం కాదు. నా విశ్వాసానికి సంబంధించిన అంశం. 2014లో ఢిల్లీ వచ్చాక నాలో ఉన్నట్టనిపించిన ఖాళీని భర్తీ చేసింది. కోట్లాది ప్రజలకు నా భావాలను తెలియజేసేందుకు ఉపయోగపడింది. ప్రజల నుంచి ఎప్పుడూ దూరంగా లేనన్న భావన కలిగించింది’’ అంటూ మన్ కీ బాత్‌తో ముడిపడ్డ తన జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులను నెమరేసుకున్నారు. గత మన్ కీ బాత్‌ల్లో ప్రస్తావించిన పలువురు విశిష్ట వ్యక్తులతో ఈ సందర్బంగా ఫోన్లో మాట్లాడారు. గత ఎపిసోడ్లలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ ప్రసాద్ ను ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఇతరుల నుంచి ఎంతో నేర్చుకున్నా... ‘‘2014 అక్టోబర్ 3న విజయ దశమి నాడు మన్ కీ బాత్కు శ్రీకారం చుట్టాం. ఇప్పుడదో పండుగలా మారింది. 100వ ఎపిసోడ్ సందర్భంగా శ్రోతల నుంచి వేలాది లేఖలందాయి. అవి భావోద్వేగాలకు గురిచేశాయి. కోట్లాది భారతీయుల మనసులో మాటకు, వారి భావాల వ్యక్తీకరణకు ప్రతిబింబం మన్ కీ బాత్. స్వచ్ఛ భారత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వంటి వాటిని తొలుత మన్ కీ బాత్‌లోనే ప్రస్తావించాం. తర్వాత ప్రజా ఉద్యమాలుగా మారాయి. ఈ రేడియో కార్యక్రమం రాజకీయాలకతీతం. ఇతరుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కీలక మాధ్యమంగా మారింది. శత్రువులైనా మంచి గుణాలను గౌరవించాలని నా గురువు లక్ష్మణ్‌రావు ఈనాందార్ చెప్పేవారు. ఇతరుల్లోని సద్గుణాలను ఆరాధించడంతో పాటు వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన్ కీ బాత్ నాకో కసరత్తులా ఉపయోగపడింది. మన్ కీ బాత్ నిజానికి మౌన్ (నిశ్శబ్దం) కీ బాత్ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. చైనాతో వివాదం, అదానీ అక్రమాలు, ఆర్థిక అసమానతలు, మహిళలపై అరాచకాల వంటి కీలకాంశాలను 100వ ఎపిసోడ్లో మోదీ ఎందుకు ప్రస్తావించలేదని ఆక్షేపించింది. దేశ ప్రజలే నాకు సర్వస్వం ‘‘గుజరాత్ సీఎంగా తరచూ ప్రజలను కలుస్తూ, మాట్లాడుతూ ఉండేవాన్ని. 2014లో ఢిల్లీకి చేరాక భిన్నమైన జీవితం, పని విధానం, బాధ్యతలు! చుట్టూ పటిష్ట భద్రత, సమయపరమైన పరిమితులు. ఇలా ప్రజలను కలవని రోజంటూ వస్తుందని అనుకోలేదు. నాకు సర్వస్వమైన దేశ ప్రజల నుంచి దూరంగా జీవించలేను. ఈ సవాలుకు మన్ కీ బాత్ పరిష్కార మార్గం చూపింది. ఇది నాకు ఒక ఆరాధన, ఒక వ్రతం. గుడికెళ్లి ప్రసాదం తెచ్చుకుంటాం. ప్రజలనే దేవుడి నుంచి నాకు లభించిన ప్రసాదం మన్ కీ బాత్. ప్రజాసేవ చేస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సాగిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులు నాకు మార్గదర్శకులుగా మారారు. మన్ కీ బాత్‌లో గతంలో ప్రస్తావించిన వ్యక్తులంతా హీరోలే. వారే ఈ కార్యక్రమానికి జీవం పోశారు’’ ఐరాస, విదేశాల్లోనూ... న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మన్ కీ బాత్ 100వ ఎడిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ట్వీట్ చేశారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్రీ అజాలే మన్ కీ బాత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమంలో ఆమె కూడా భాగస్వామి అయ్యారు. పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా, చిలీ, మొరాకో, మెక్సికో, కాంగో, ఇరాక్, ఇండోనేషియా తదితర దేశాల్లో మన్ కీ బాత్కు విశేష స్పందన లభించింది. దేశమంతటా... ► మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం దేశవ్యాప్తంగా పండుగలా జరిపారు. ► ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా వీక్షించారు. ► బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రత్యేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.ళీ ‘‘ఇది కేవలం రేడియో కార్యక్రమం కాదు. సామాజిక మార్పుకు చోదక శక్తి. మోదీ సందేశం యువతకు స్ఫూర్తినిస్తోంది’’ అని అమిత్ షా కొనియాడారు. ► అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు భారత్‌లో, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అమెరికాలో కార్యక్రమాన్ని వీక్షించారు. కేరళలోని కొచ్చిన్‌లో పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులతో కలిసి మన్‌కీబాత్ 100వ ఎపిసోడ్ వింటున్న నూతన వధూవరులు -
Saurashtra Tamil Sangamam: అడ్డంకులున్నా ముందడుగే..
సోమనాథ్: మన దేశం వైవిధ్యానికి మారుపేరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విశ్వాసం నుంచి ఆధ్యాత్మిక దాకా.. అన్ని చోట్లా వైవిధ్యం ఉందని తెలిపారు. దేశంలో వేర్వేరు భాషలు, యాసలు, కళలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ వైవిధ్యం మనల్ని విడదీయడం లేదని, మన మధ్య అనుబంధాన్ని, సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ‘సౌరాష్ట్ర–తమిళ సంగమం’ వేడుక ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏదైనా కొత్త విజయం సాధించే శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయని ఉద్ఘాటించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్నదే మన ఆశయమని వివరించారు. ఈ లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, మనల్ని అటంకపరిచే శక్తులకు కొదవలేదని చెప్పారు. అయినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా దేశంలో ఇంకా బానిస మనస్తత్వం ఇంకా కొనసాగుతుండడం ఒక సవాలేనని అన్నారు. బానిస మనస్తత్వం నుంచి మనకి మనమే విముక్తి పొందాలని, అప్పుడు మనల్ని మనం చక్కగా అర్థం చేసుకోగలమని, మన ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగమని ఉద్బోధించారు. అన్ని అడ్డంకులను అధిగమించి, మనమంతా కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ఆరోగ్య సమస్యలను సరిహద్దులు ఆపలేవు న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో మన ముందున్న సవాళ్లను దీటుగా ఎదిరించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని మ్రోదీ పిలుపునిచ్చారు. ‘వన్ ఎర్త్, వన్ హెల్త్–అడ్వాంటేజ్ హెల్త్‌కేర్ ఇండియా 2023’ సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ విషయంలో సమీకృత కృషిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. మెరుగైన, చౌకైన వైద్య సేవలు అందరికీ అందాలన్నారు. -
ఐపీఎల్‌కు ముందు కోహ్లీ చేతికి సరికొత్త టాటూ.. దీని అర్థం తెలుసా?
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి టాటూలు అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన శరీరంపై ఇప్పిటికే ఆకర్షణీయమైన పచ్చబొట్లు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభోత్సావానికి ముందు కోహ్లీ చేతికి సరికొత్త టాటూ కన్పించడం అభిమానులను సర్ప్రైజ్ చేసింది. అలాగే ఈ టాటూ అర్థం ఏమై ఉంటుందా అనే ఎగ్జైట్మెంట్ కూడా నెలకొంది. అయితే ఈ టాటూ అసలు అర్థం ఏంటి? దాని వెనకాల ఎంత శ్రమ ఉంది? ఎందుకంత ప్రత్యేకత? అనే విషయాలు.. ఈ టాటు కోహ్లీకి వేసిన ప్రముఖ కళాకారుడు, ఏలియన్స్ టాటూ వ్యవస్థాపకుడు సన్నీ భానుశాలి స్వయంగా వివరించారు. 'మా టాటూలు నచ్చి కోహ్లీ స్వయంగా మా స్టూడియోకు వచ్చారు. మా పనితీరును తెలియజేసే ఫొటోలతో మా దగ్గరకు వచ్చారు. నా టాటూలకు పెద్ద అభిమానినని చెప్పారు. క్రికెట్లో సూపర్‌స్టార్ అయిన కోహ్లీ లాంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇంత సింపుల్‌గా ఉంటారని అనుకోలేదు. అసలు కోహ్లీలో గర్వం లేదు. చాలా ఒదిగి ఉంటారు. సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తారు. ఇంత మంచి ఆటిట్యూడ్ ఉన్న అతన్ని కచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఇక నా పనితీరు నచ్చి కొత్త టాటూ వేయాలని కోహ్లీ నన్ను అడిగారు. తన పాత టాటూను కవర్ చేస్తూ కొత్తది ఉండాని చెప్పారు.' అని సన్నీ పేర్కొన్నారు. ఇక కోహ్లీ కొత్త టాటూ అర్థం కూడా చెప్పాడు సన్నీ. అన్ని విషయాల పరస్పర అనుసంధానాన్ని, సృష్టి మూలాన్ని సూచించేలా, ఉన్నతమైన వాటిని, ఏకత్వాన్ని, జీవిత నిర్మాణాన్ని, అన్నింటికీ మూలాన్ని తెలియజేస్తూ కోహ్లీ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఈ టాటూను చాలా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ టాటూను చూసి కోహ్లీ మురిసిపోయాడని, అతనికి ఇది చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. 'ఈ టాటూ కోహ్లీకి ఎంత విలువైందో నాకు బాగా తెలుసు. అందుకే చాలా శ్రమించి నా మనసుపెట్టి అంకితభావంతో దీన్ని రూపొందించా. టాటూలో ప్రతీది అద్భుతంగా పర్ఫెక్ట్గా వచ్చింది. రెండు రోజులు, రెండు చోట్లకు వెళ్లి కోహ్లీకి ఈ టాటూ వేశా' అని సన్నీ పేర్కొన్నాడు. తొలిరోజు ముంబైలోనే కోహ్లీ అపాయింట్మెంట్ ఇచ్చాడని, ఆ తర్వాత మరో రోజు బెంగళూరుకు వెళ్లి టాటూ పూర్తి చేసినట్లు సన్నీ చెప్పాడు. కోహ్లీకి టాటూ వేసే సమయంలో స్టూడియోను మూసి వేసి భద్రతా కారణాల దృష్ట్యా భారీగా బౌన్సర్లను కూడా మోహరించినట్లు చెప్పాడు. టాటూ కోసం ఎన్ని గంటలు పట్టినా.. కోహ్లీ చాలా సహనంతో ఉన్నాడని, అసలు ఒక్క క్షణం కూడా అలసిపోయినట్లు కన్పించలేదని సన్నీ తెలిపాడు. టాటూ పూర్తైన తర్వాత చూసుకుని కోహ్లీ మైమరచిపోయాడని, ఆనంద పరవశంలో మునిగిపోయాడని వివరించాడు. ఈ టాటూ జీవితకాలం తనతో పాటు ఉంటుందని కోహ్లీకి తెలుసన్నాడు. చదవండి: ఐపీఎల్లో జయదేవ్ ఉనద్కట్ సరికొత్త రికార్డు! ఏకైక భారత క్రికెటర్‌గా -
షాకింగ్ నిర్ణయం తీసుకున్న వెంకటేశ్.. సినిమాలకు బ్రేక్?
విక్టరీ వెంకటేశ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇటీవలె విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన వెంకటేశ్ ప్రస్తుతం కొత్త కథలు వినేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీయగా.. ఆధ్యాత్మిక సాధన నేపథ్యంలో కొంతకాలం వరకు ఆయన సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారట. మొదటి నుంచి వెంకటేశ్‌కు ఆధ్యాత్మికత ఎక్కువే. ఈ కారణంగానే ఆయన కొన్ని రోజుల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నారట. విరామం తర్వాత కొత్త సినిమాలను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. కాగా వెంకటేశ్-రానా నటించిన రానానాయుడు వెబ్‌సిరీస్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
మంచి మాట: మన ఆలోచనలే మన జ్ఞానం
పుట్టుక, మరణాల మధ్య జీవితం చైతన్యవంతంగా కొనసాగుతుంది. ఈ జీవితంలో మనస్సు ద్వారా అనేక అనేక ఆలోచనలతో జీవితానికి సంబంధించి కీలకమైన సమాచారం వస్తుంది. ఈ ఆలోచనలన్నీ మనిషి శారీరక మానసిక కర్మలను బట్టి వస్తుంటాయి. శరీరంలో శక్తి తక్కువగా ఉంటే భౌతికపరమైన ఆలోచనలు, శక్తిస్థాయులు పెరిగే కొద్దీ మార్పు చెంది ఆధ్యాత్మికత గురించి, ఆత్మను గురించీ ఆలోచనలు వస్తుంటాయి. మనిషికి తమోగుణంతో శరీరానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. యవ్వనంలో ఇంద్రియాలు ఉద్రేకం ఎక్కువగా ఉండి రజోగుణంకు సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. వయసు మళ్లి వానప్రస్థంలో ప్రవేశించగానే ప్రేమ, దయ, జాలికి సంబంధించిన సత్వగుణ ఆలోచనలు వస్తుంటాయి. జ్ఞానపరంగా ఎదిగిన వారికి అత్యుత్తమమైన ఆలోచనలు వస్తాయి. మనుషులని తన మనసే నడిపిస్తుంది అసలు ఈ మనసు ఎక్కడ ఉంది, దానిని గుర్తించడం ఎలా అంటే గత జన్మల కర్మల అనుభవాల ప్రతిరూపమే మనసు. దీని యొక్క ప్రభావం సూక్ష్మ శరీరం పై పడుతుంది. మనసులో వచ్చే ఆలోచనలు ప్రతిరూపమే మానవ జీవితం. మనిషి కుటుంబం, సంఘం, సమాజంలో వివిధ రకాల వ్యక్తుల మధ్య జీవిస్తున్నప్పుడు, కొందరు పాతవారు దూరమవుతారు. వారి ఆలోచనల ప్రభావం కొంత ఉంటుంది. కొందరు కొత్తవారు దగ్గరవుతారు వీరు వీరి ఆలోచనలని జోప్పించడానికి సిద్ధంగా ఉంటారు. వీరి ద్వారా గాయాలు, ఘర్షణలు, సంఘర్షణలు, వ్యతిరేకతలు, అనుకూలతలు, మానసిక ఒత్తిడుల రూపంలో మనసులోకి ప్రవేశిస్తాయి. అప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచనలు మాటలు ద్వంద్వంతో కూడి ఉంటాయి. ద్వంద్వం అంటే రెండుగా ఉన్నది. ఒకటి బయటికి వ్యక్తమౌతుంది. మరొకటి లోపల దాగి ఉంటుంది. బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తే లోపల దాగి ఉన్న దాన్ని గుర్తించలేము. ఎప్పుడైతే బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తామో అప్పుడు పక్షపాతంగా, ఏకపక్షంగా, పరిమితంగా ఆలోచిస్తున్నట్లే, ఎప్పుడైతే మానవుడు లోపల దాగి ఉన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడో... పరిమితంగా ఆలోచించడం నుండి అపరిమితంగా ఆలోచించడం మొదలవుతుందో అదే అప్పుడే అజ్ఞానం నుంచి బయట పడి జ్ఞానం పొందుతాడు. అనవసర విషయాలపై అతిగా ఆలోచిస్తే శారీరక శ్రమ చేసిన దానికంటే రెట్టింపు శక్తిని కోల్పోతున్నాడు. కొందరు ఎలాంటి శారీరక శ్రమ లేని పనులు చేస్తున్న సాయంకాలానికి అలసిపోతారు. కారులోనో, బస్సులోనో, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి శారీరక శ్రమలేకున్నా అలసి పోతున్నారు అనవసరంగా అతిగా మనసు ఆలోచించటమే అందుకు కారణం.. మనస్సు ఆలోచించకుండా ఉన్నప్పుడు శూన్య స్థితికి చేరుతుంది. బాహ్య ప్రపంచంలో ఏది జరిగినా ఎలా జరిగినా అనుకూలతలకు, ప్రతికూలతలకు మనస్సు స్పందించకూడదు. ఇదే ఆధ్యాత్మిక మార్గం. అజ్ఞాని అంతరంగాన్ని విస్మరించి ప్రాపంచిక విషయాలపై ఆరాటపడుతూ ప్రపంచం నుంచి నాకేంటి అనే భావనను అతిగా పెంచుకొని ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే భావనతో అసంతృప్తి చెంది ప్రాపంచిక విషయాల మోజులో సంబంధాలు ఏర్పరుచుకున్నాడో అప్పుడు పరిమితంగా ఆలోచిస్తాడు. జ్ఞానికి విశ్వం గురించి దైవం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి, దైవం వైపు మళ్ళి బంధాలను విడనాడి ఏకత్వం వైపు మళ్లాలి. ఏ వ్యక్తి ఏకత్వం వైపు మళ్ళి తన మనసును సరి చేసుకుని సంపూర్ణతను పొందుతూ దైవం వైపుగా ప్రయాణం చేస్తాడో అతను జ్ఞానిగా మరి ముక్తి లేదా మోక్షం పొందే అవకాశం ఉంది. – భువనగిరి కిషన్ యోగి -
గురుపూర్ణిమ స్పెషల్: ఒక గురువు... వేలాది మంది శిష్యులు
గురు శిష్య సంబంధం అనేది మన జీవితాల్లో ఒక ప్రధాన అంశం. మన సాంప్రదాయక విలువల్లో విధిగా అది ఒక భాగం. మన భారతీయ సమాజం గురువుని అత్యున్నత పీఠంపై నిలిపింది. అలాగే పరమహంస యోగానంద శిష్యురాలూ, యోగదా సత్సంగ సమాజానికి పూర్వ అధ్యక్షురాలు మృణాళినీ మాత తాను రచించిన ‘గురుశిష్య సంబంధం’ అనే పుస్తకంలో శిష్యుడి జీవితాన్ని మరెవరూ మార్చలేని విధంగా ఒక గురువు మార్చగలరన్న సత్యాన్ని శక్తివంతంగా ఉద్ఘాటించారు. శిష్యుడిని అన్ని విధాలా తనకు ప్రతిరూపంగా తయారుచేయడానికి కావలసిన శక్తిని, సహజమైన సామర్థ్యాన్ని గురువు కలిగి ఉంటారు. చదవండి: నిన్ను వెలిగించే దీపం... నవ్వు నేటి ప్రపంచంలో బాగా పేరున్న ఒక గురువును పట్టుకోవడం తేలికే. అయితే యోగానంద గురువును ఎంచుకోవడంలో జాగ్రత్త వహించమని సలహా ఇచ్చారు: ‘‘జీవితమనే లోయలో నీవు గుడ్డిగా తప్పటడుగులు వేస్తూ వెళ్తున్నపుడు, కళ్ళున్నవారి సహాయం నీకు కావాలి. ఆ మార్గం సత్యమైనదా, కాదా అని తెలుసుకోవడానికి, దాని వెనుక ఎటువంటి గురువు ఉన్నారు, ఆయన చేసే పనులు తాను భగవంతుని చేత నడపబడుతున్నట్టు ఉన్నాయా, లేక తన స్వంత అహంతో నడపబడుతున్నట్టు ఉన్నాయా అని విచక్షణతో తెలుసుకోండి. ఆత్మసాక్షాత్కారం పొందని గురువుకు ఎంత పెద్ద శిష్యబృందం ఉన్నా అతడు మీకు దైవ సామ్రాజ్యాన్ని చూపలేరు.’’ అని చెప్పేవారాయన. శతాబ్దాలుగా హిమాలయాల్లో జీవించి ఉన్న మహావతార బాబాజీ తన గొప్ప శిష్యులలో ఒకరైన లాహిరీ మహాశయులకు 1861లో ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయిన క్రియాయోగంలో దీక్ష ఇచ్చారు. ఆ తరువాత ఆయన శిష్యులైన యుక్తేశ్వర్ గిరి వై.ఎస్.ఎస్./ ఎస్.ఆర్.ఎఫ్. సంస్థలను స్థాపించి ఈ మార్గంలోకి వేలాదిమందిని తీసుకువచ్చిన పరమహంస యోగానందకి శిక్షణనిచ్చి ఆయనను సిద్ధం చేసే బాధ్యత స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా జీవితాల్ని మార్చగల ఉజ్జ్వల ఆధ్యాత్మిక కావ్యంగా ప్రఖ్యాతి పొందిన తన ‘ఒక యోగి ఆత్మకథ’లో గురుశిష్య సంబంధాన్ని గురించి యోగానంద అత్యంత విశదంగా వివరించారు. ఎంతో జాగ్రత్తతోనూ సూక్ష్మదృష్టితో శ్రీ యుక్తేశ్వర్ యోగానందకి ఇచ్చిన శిక్షణతో యోగానంద భగవంతుడితోనూ గురువుతోనూ అనుసంధానంలో ఉండడం ఎలాగో చూపించిన ఒక నిజమైన దృష్టాంతంగా రూపుదిద్దుకొన్నారు. ఇక యోగానంద తన వంతుగా యోగధ్యానం, సమతుల జీవనాన్ని బోధించే తన సార్వత్రిక బోధల ద్వారా తన జీవిత కాలంలో వేలకొద్దీ శిష్యులకు, అనంతరం లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకునిగా, తత్వవేత్తగా తోడ్పాటు నందించారు. పతంజలి బోధించిన అష్టాంగయోగ మార్గంపై ఆధారపడిన తన ఆధ్యాత్మిక సాధనా పద్ధతిని విశ్వాసంతో, స్థిరంగా అభ్యసించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు యోగానంద. ప్రతి వ్యక్తీ ఒక ఆత్మ అనీ అంతర్గతంగా అది పరమాత్మ తో తన ఏకత్వాన్ని పునఃస్థాపించుకోవడానికి తపిస్తుంటుందనీ బోధించారు. సత్యాన్వేషకులందరూ లోతుగా అర్థం చేసుకోవడం కోసం... ఆయన రచించిన జీవించడం ఎలాగో నేర్పే గహాధ్యయన పాఠాలు ఆయన బోధలకు ఆనవాళ్లు. భారతదేశపు గొప్ప గురువులకు మనం అందించగల అత్యంత గొప్ప నివాళి గురుపూర్ణిమ. గురువు ఆదర్శాలకు ఈ ముఖ్యమైన రోజున పునరంకితం కావడం ద్వారా చిత్తశుద్ధి గల శిష్యుడు ఆత్మసాక్షాత్కార నిచ్చెనపై తరువాతి మెట్టును ఎక్కుతాడు. (నేడు గురుపూర్ణిమ) -
మంచి మాట: ఆధ్యాత్మికత అంటే..?
‘దేవుణ్ణి మీరు చూశారా..?’ అని ప్రశ్నించాడో యువకుడు ఒక సాధకుణ్ణి. చురుకైన కళ్ళు.. తీక్షణమైన చూపులు. గిరజాల జుట్టు.. దానిలో కొన్ని వంకీలు అతని విశాల ఫాలభాగాన నర్తిస్తుండగా. ‘ఆ“చూసాను’. అన్నాడాయన చిరునవ్వుతో. ‘చూశారా..!?’ అన్నాడా యువకుడు తన అనుమానానికి అపనమ్మకాన్ని జోడిస్తూ. ‘చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా’ అన్నాడాయన మరింత ప్రశాంతంగా నవ్వుతూ. ఆ మాటలకు ఆ యువకుడు విభ్రాంతుడే అయ్యాడు. ఆ సాధకుడి గొంతులో ధ్వనించిన విశ్వాసం.. నమ్మకం.. సూటిదనం.. అతణ్ణి ఒక నిమిషంపాటు ఆపాదమస్తకాన్ని కంపింప చేసింది. ఇంతకుముందు తను కలసిన సాధకుకులు.. యోగులు.. గురువులు... అందరూ కూడా దేవుణ్ణి చూడలేదనే చెప్పారు. ఆ దేవదేవుని సాక్షాత్కారానికి తపస్సు చేస్తూనే ఉన్నామన్నారు. ఒకవేళ ఒకరిద్దరు చూశామని చెప్పినా ఇంత గట్టిగా.. విశ్వాసంతో చెప్పలేదు. ఇందుకే ఆ వంగ దేశీయుడికి ఆ పరమహంస మీద గురి.. ఏర్పడింది. అందుకే ఆయనను గురువుగా అంగీకరించాడు. ఆ పై ఆ గురుశిష్యులిరువురూ ఎంత విశ్వవిఖ్యాతులయ్యారో లోకవిదితమే. దేవుణ్ణి చూశామన్న వారెవరైనా ఆయన భావనను, తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారని అర్థం. దేవుడి సర్వాంతర్యామిత్వ భావనను గ్రంథాలనుండి గ్రహించటమే కాదు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ సకల చరాచరసృష్టిలో ప్రతి జీవిలో చూడగలగటం. ప్రత్యక్షంగా చూసి అనుభవంగా చేసుకోవటమే కదా! ఆ పరమహంస.. నిన్ను చూసినంత బాగా చూశాను’ అని చెప్పటంలో అదే అర్థం. ‘ఇందు గలడందు లేడని సందేహం వలదు..’ అన్న పద్య సారాంశ మదే కదా. తన ఎదురుగా తను ఆరాధిస్తున్న విగ్రహమే దేముడు.. అయన ఉనికి ఇక్కడే.. ఈ నాలుగు గోడల మధ్యే అన్న ఆలోచనా పరిధి.. పరిమితులనుండి నుండి మనిషి బయటకు రానంతకాలం.. రాకూడదనుకున్నంత కాలం ఆ సర్వాంతర్యామిత్వాన్ని బుద్ధికే పరిమితం చేసుకున్నాడు. అంతే కానీ మనస్సులో ఆ భావనను ప్రతిష్టించుకోలేకపోయాడు. నిజమైన ఆధ్యాత్మికమార్గానికిది పెద్ద అవరోధం. భావన.. అనుభూతి.. దృష్టి ఈ మూడింటిని ఆధ్యాత్మికపథంలో పయనించాలనుకున్న వారు తప్పనిసరిగా అలవరచుకోవలసిన లక్షణాలు. అనేక శాస్త్రాలు.. కావ్యాలు.. వేదాంత గ్రంథాలు చదివిన ఓ పండితుడు గంగానదిలో స్నానమాచరించి తన పాప ప్రక్షాళన చేసుకోవాలన్న తన జీవితేచ్ఛను జీవిత చరమాంకంలో కాని తీర్చుకోలేకపోయాడు. ‘ఈ గంగానదికి పాపాలను పరిహరించే మహత్తు నిజంగా వుందా..? అన్న అనుమానం మదిలో మొలకె త్తింది. తత్ఫలితంగా సద్గతులు కొంచెం ఆలస్యంగా ప్రాప్తించాయి. కారణం..!? భావన, అనుభూతి. అయితే ఈ పండితుడి పలుకుల మీద విశ్వాసముంచి మామూలు నదిలో స్నానం చేసిన సాధారణ వ్యక్తి ఆ పండితుడికన్నా ముందుగా సద్గతులు పొందాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి ఉండవలసిన ప్రథమ లక్షణం భావన.. అనుభూతి.. విశ్వాసం. మన భౌతికావసరాలు, బాధ్యతలు నెరవేర్చటం కోసం ఏదో ఒక వృత్తినో .. ఉద్యోగాన్నో.. పొంది డబ్బు సంపాదించాలి. భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పోషించాలి. ఇది ప్రధాన బాధ్యత. ఇది కాని జీవితం ఇంకేమైనా ఉందా? ఇదే జీవిత పరమార్థమా? మనిషి ఈ చింతన చేయటానికి తన అంతరంగంలోకి చూడగలగాలి. తన మనస్సును న్యాయాధీశుని చేసుకుని తను చేసే పనుల మంచి చెడులను ప్రశ్నించుకోవాలి. ఆలోచనలను, ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవాలి. తను ఎంతవరకు నిజాయితీగా.. న్యాయబద్ధతతో.. ప్రవర్తిస్తున్నాడు? నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడా..? ఎదుటివారికి చేయగలిగిన మేలు చేస్తున్నానని కీడు చేయటంలేదు కదా..! ఇటువంటి ప్రశ్నలు తానే తన మీద సంధించుకోవాలి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఎవరు పొందగలరో వారు నిస్సందేహంగా చక్కని, ఆదర్శవంతమైన జీవితాన్నే గడుపుతున్నట్టే. ఈ పరిశీలన.. శోధనకే అంతర్ముఖత్వమని పేరు. ఆధ్యాత్మికతకు ఇదొక ముఖ్యమైన లక్షణమే కాదు కాదు, ఖచ్చితంగా ఉండవలసినది. ఇది ఆస్తికులకైనా, నాస్తికులకైనా.. ఆ మాట కొస్తే మనిషన్న వాడికెవడికైనా వర్తిస్తుంది. ఏ మత విశ్వాసానికైనా అన్వయించుకోతగ్గది, అందరికీ అభిలషణీయమైనదీ మార్గం. ఈ అంతరంగ యానం.. లోచూపు ఎవరైతే అలవరచుకుంటారో వారు జీవితాన్ని సరిగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. సరైన రీతిలో మలచుకుంటున్నారని అర్థం. ధనం వల్ల ఇహంలో మనం పొందే భౌతికమైన, ఉన్నతస్థితి కాక.. ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరినట్టు. కొందరు భౌతికపరమైన విషయాలను పక్కకు పెట్టి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి అంతర్ముఖులు కాబోతున్నామని ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేయనే చేయరు. మన మనస్సు తీరు.. గతి.. ఆలోచనా పద్ధతి.. మన వ్యక్తిత్వాన్ని ఒక అంచనా వేసుకుని మన జీవితాన్ని, మన ఆలోచనా ప్రవాహన్ని క్రమబద్దీ కరించుకునేందుకు మన మనస్సు చెప్పే సంగతులు తెలుసుకోవాలి. సరిగా లేకుంటే దిద్దుకోవాలి. ఇందుకు అంతర్ముఖత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. మానవ మేధ, శక్తియుక్తులకు పరిధులు, పరిమితులున్నాయని, ఆ మానవాతీత శక్తి భగవంతుడని సర్వశక్తిమంతుడని. సర్వవ్యాపకుడని, అతడివల్లే ఇంతటి సృష్టి జరిగిందని భావించే వారున్నారు. వారు అతడినే కేంద్ర బిందువు చేసుకుని తమ అంతర్ముఖ ప్రయాణపు తొలి.. ఆఖరి అడుగు అతడితోనే ముగిస్తారు. కొందరు ప్రకృతి పరిణామక్రమంలో ఏర్పడ్డదీ సృష్టి అంటూ ఒక మానవాతీత శక్తి వుందని అంటారు. కానీ దాన్ని భగవంతుడుగా భావన చేయరు. వీరిరువురూ కూడ అంతర్ముఖత్వానికి పెద్దపీట వేస్తారు. మనిషి మహాత్ముడు కాకపోయినా మనిషి గా నిలబడటానికి ఇది అవసరమని ఇద్దరూ ఏకీభవిస్తారు. జీవితం అర్థవంతమైనదవ్వాలంటే ఇది అత్యంత అవసరమైనదని ఇద్దరూ అంగీకరిస్తారు. ఈ ఆధ్యాత్మిక చింతన లేదా అంతర్ముఖత్వం ఒక సత్యాన్వేషణ. ఒక సత్యశోధన. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవటం. జీవితాన్ని అర్థం చేసుకుని, దాని పట్ల ఉన్న భయాందోళనలు తొలగి నిర్భయులమై స్వేచ్ఛానందాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులు కావాలి. ఆధ్యాత్మిక చింతనంటే కేవలం భక్తి ఒక్కటే కాదు. దానికి భావన..అనుభూతి.. విశ్వాసం.. వీటిని చేర్చాలి. ఆధ్యాత్మికత అంటే పెదవులతో దేవుడి నామాన్ని పలకటమే కాదు. భగవంతుడి రూపాన్ని అన్నిచోట్లా.. అందరిలోనూ చూడగలగటం. మన ఆణువణువునా ఆ భావనను పొందుపరచుకోవటం. అపుడే మనం ఆయన సర్వాంతర్యామిత్వాన్ని విశ్వసించినట్టు! ఆధ్యాత్మికత అంటే మనం నమ్మిన దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ దశకు చేరు కోవటమంటే నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. ఆధ్యాత్మికత తొలి మెట్టు ఇదే కావాలి. భగవంతుని తత్వాన్ని మనసులో నిలుపుకుని తోటివారితో ఎవరైతే చక్కగా సంభాషిస్తారో... అభాగ్యుల.. అనాథల మీద కరుణ, ప్రేమ చూపిస్తారో.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారన్న విషయాలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో వారు నిజమైన ఆధ్యాత్మికపరులు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
మంచి మాట: కృతజ్ఞత గొప్ప సంస్కారం
‘కృతజ్ఞత ’ అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది మానవ సంస్కారం. ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమానమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం. ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి, విధివశాత్తూ కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే –అతని పట్ల సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతజ్ఞత ఎలా ఔతుంది. మేలు చేసిన సమస్త జీవుల పట్ల కృతజ్ఞత, మేలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పాములు, తేళ్ళు.. ఇలా అన్నింటికి మేలు కలగాలనే భావన ఉండాలి. శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా సరే అందరి మేలును కాంక్షించి కృతజ్ఞత, దయ కలిగి ఉండాలి. ప్రాణులన్నింటికి దుఃఖాలు బాధలు సహజం. కనుక వాటి దుఃఖాన్ని తొలగించటానికి, సుఖాన్ని కలిగించటానికి, అవసర సమయాలలో మేలుచేయటానికి ప్రయత్నించాలి. అయితే ఇలా సమస్త జీవుల పట్ల దయ కలగాలన్నా కష్టమే. మనకు మేలు చేసిన వారిపై అనురాగం కృతజ్ఞత ఉంటాయి. కనుక తిరిగి వారికి మేలు చేయాలనిపిస్తుంది. కాని మనకు కీడు చేసిన వారైతేనో వారికి కూడా మేలు చేయాలనుకుంటామా.. అనుకోలేము. కాని వారియందు కూడా కృతజ్ఞతాభావం, మేలుచేయాలనే గుణం కలిగి ఉండాలన్నది శాస్త్ర ప్రమాణమని పెద్దలు చెబుతున్నారు. ఇది వినటానికి బాగానే ఉంది. కాని ఆచరణకు వచ్చేటప్పటికి ఈ నీతి సూత్రాలన్నీ గుర్తుకు రావు. అయితే ఎవరికి సమబుద్ధి ఉంటుందో, అందరిని ఒకేవిధంగా, ఆత్మస్వరూపులుగా, ఒక్కటిగా చూడగలుగుతారో వారే అపకారులకు కూడా ఉపకారంచేస్తూ కృతజ్ఞత చూపగలుగుతారు. మేలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా జీవులకు చేసే హితం, సేవ పరమాత్మకు చేసినట్లే. ఎందుకంటే సమస్త జీవులయందు పరమాత్మే ఉన్నాడు గనుక. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది. అందువలన మనం అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని, కృతజ్ఞతను అలవరచుకోవటానికి ప్రయత్నించాలి. సంతృప్తితో జీవించేవారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం సహజం. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే అతను తన ఆశకు పరిమితులని ఏర్పరచుకోవాలి. అన్నీ ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలనుకోవడం వలన అతనికి అనందం లభించదు. సంతృప్తి ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు. కోరికలను పెరగనిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు. అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు. తనకు దక్కిన దానితో సంతోషపడటం ప్రతివ్యక్తి నేర్చుకోవాలి. అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు. అక్కడ భౌతిక సంపదలు లేవు. అయితే వారికీ సంతృప్తి అనే సంపద ఉన్నది. అది వారికి ఆనందాన్ని ఇచ్చింది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం. మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది. – భువనగిరి కిషన్ యోగి -
మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే..
మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే, మనసు నిర్మలంగా ఉండాలి. ఐహిక చింతన ఉన్నంతకాలం, ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ. ఒక చీమ తన ఆహార అన్వేషణలో పొరపాటున ఒక ఉప్పు సీసాలో దూరింది. ఇంతలో ఆ సీసా మూత వేసివేయడం జరిగింది. అలా ఆ చీమ అందులో బందీ అయిపోయింది. తినడానికి ఏమీ లేక అప్పుడప్పుడు ఆ ఉప్పునే తింటూ కాలక్షేపం చేయసాగింది. మరొక చీమ పంచదార డబ్బాలో చేరి అందులో పంచదారను తింటూ ఎంతో ఆనందంగా జీవించసాగింది. అదృష్టవశాత్తూ ఒకసారి ఉప్పు సీసా మూత తీయడం జరిగింది. వెంటనే, ‘బతికేనురా జీవుడా’ అనుకుంటూ అందులోని చీమ బయటకు వచ్చేసింది. కానీ, సరైన ఆహారం లేక ఆ చీమ చిక్కి శల్యమైపోయింది. ఇంతలో అది పంచదార డబ్బాలో ఉన్న చీమ కంటబడింది. వెంటనే ఆ చీమ ‘ఏం మిత్రమా అలా అయిపోయేవు? క్షేమమేనా?’ అని అడిగింది. ‘ఏం క్షేమం? అంతా క్షామమే’ అంటూ మొదటి చీమ తన గోడునంతా వెళ్ళబోసుకుంది. అది వినగానే రెండవ చీమ దానిని తన నివాసమైన పంచదార డబ్బాలోకి తీసుకెళ్ళి పంచదారను తినమంది. చిత్రం. ఆ మొదటి చీమ అతి మధురమైన పంచదారనే ‘వెగటుగా ఉంది’ అంది. రెండవ చీమకు ఆశ్చర్యమేసింది. కారణం అంతు బట్టలేదు. ఎందుకైనా మంచిదని మొదటి చీమ నోరు తెరిచి అందులో ఉన్న ఉప్పు కణాలను తీసేసింది. అంతే! అంతవరకూ వెగటుగా అనిపించిన పంచదార అప్పుడు తియ్యగా అనిపించింది ఆ మొదటి చీమకు. అలాగే మనిషిలో పంచవికారాలు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం వాటిని విడనాడతామో అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండ ఆనందాన్ని అనుభవించగలం. – బ్రహ్మాకుమార్ రాజేష్ -
ఒక యోగి మహా సమాధి
ఎంతోమంది మహనీయులకు జన్మనిచ్చిన గోరఖ్‌పూర్ ప్రపంచానికి అందించిన యోగిరత్నమే ముకుందలాల్ ఘోష్. బాల్యం నుంచే భక్తిభావాలతో యోగవిద్యను తెలుసుకునేందుకు పలువురు సాధువులను, సన్యాసులను కలుసుకునే సందర్భంలో పదిహేడో ఏట కోల్కతాలోయుక్తేశ్వరగిరి అనే సాధువును కలిశారు. వీరివద్దే సన్యాసాశ్రమ స్వీకారం చేసి స్వామి యోగానందగా గుర్తింపుపొందారు. క్రియాయోగ సాధనలో మెలకువలనూ నేర్చారు. వర్గభేదం లేని ఈ బోధలు జీవితపు అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమయే ధ్యానపద్ధతులతో పాటు జీవితంలో సర్వతోముఖ విజయాన్ని, క్షేమాన్ని సాధించగలిగే సంపూర్ణ తాత్విక బోధలను, జీవన విధానాన్ని కలిగి ఉన్నాయి. యోగానందులు అందరికీ ఆచరణ యోగ్యమైన భారతదేశపు ఆత్మసాక్షాత్కార బోధలను పాశ్చాత్యులకు ఆచరణయోగ్యంగానూ, అందుబాటులోనూ ఉండే విధంగా అమెరికాలో సెల్ఫ్–రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ను స్థాపించారు. అనంతరం పశ్చిమబెంగాల్లో తొలి యోగ పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే రాంచీలో మరో యోగ పాఠశాలను స్థాపించగా, తర్వాతి కాలంలో అదే భారత యోగా సత్సంగంగా రూపొందింది. పిమ్మట ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పర్యటించి భారతీయ యోగవిద్యకు విశేష ప్రచారం కల్పించారు. వీరి ప్రభావంతో క్రియాయోగం వైపు మళ్లిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ప్రభావవంతమైన గ్రంథంగా ‘ఆత్మకథ’ ఖండాంతర కీర్తి కలిగిన పరమహంస యోగానంద జీవిత చరిత్రను యోగద సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో గ్రంథరూపంలో ప్రచురించింది. ఈ గ్రంథం 20వ శతాబ్దపు 100 అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటిగా పేరుగాంచి నేటివరకు ఎన్నో ముద్రణలను పొందుతూ ఎంతోమంది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను తీర్చుతోంది. వర్తమానంలో ఆయన ప్రభావం పరమహంస రచనలు, ప్రసంగాలు, ధార్మిక గ్రంథాలకు ఆయన చేసిన సాధికార విశ్లేషణలు, ఇంట్లో చదువుకోగలిగే పాఠాలు అవ్యక్త పరమాత్మకు చెందిన సత్యాలపై వెలుగు ప్రసరిస్తాయి. విశ్వ చైతన్యమనే అనంత సాగరంలో మనిషి నేను అనే అహంకారాన్ని అధిగమించి పరమాత్మను తెలుసుకోవడంలో క్రియాయోగ ధ్యానం పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ధ్యాన సాధనతో మీరు మీ హృదయంలోనే మీ వెంట మోసుకుపోగలిగిన స్వర్గం ఉందని కనుగొంటారన్నది ఆయన ఆచరణాత్మక బోధ. మనిషి చేసే మానసిక ఆధ్యాత్మిక కృషికి శాశ్వతమైన విలువ ఉంటుందనీ, మనిషి తన శక్తిని సరిగ్గా ఉపయోగించగలిగితే భౌతికంగా ఎదురయ్యే ఎన్నో అవరోధాలను జయించగలడనీ తన జీవితం ద్వారా నిరూపించిన పరమహంస యోగానంద.. చెడును మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, క్రూరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించగలమన్న సందేశమిచ్చారు. ప్రాచీన శాస్త్రీయ ధ్యాన పద్ధతి ‘క్రియాయోగం’ యోగానంద బోధనలకు ప్రధాన ఇతివృత్తం. మానవ అస్తిత్వపు అంతిమ మర్మాలను విడమరిచే యోగానందుల జీవితాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే మనిషి జీవితం ఉన్నతమవుతుంది. ఇద్దరి మహా సమాధి రోజులు చిరస్థాయిగా నిలిచి ఉండే మహాగ్రంథమైన హోలీ సైన్స్‌ను రచించిన స్వామి యుక్తేశ్వర్ గిరి 1936, మార్చి 9 న ఒరిస్సాలోని పూరీలో తన శరీర త్యాగం చేయగా, ప్రపంచ విఖ్యాతి పొందిన ఆయన శిష్యులు పరమహంస యోగానంద మార్చి 7,1952 లో లాస్ ఏంజలిస్ లో ఉన్న బిల్ట్ మోర్ హోటల్లో మహాసమాధి చెందారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో వారి జ్ఞాపకార్థం మహా సమాధి రోజులు నిర్వహిస్తున్నారు. – డి.వి.ఆర్ -
టీవీ చూడరు, మద్యం, మాంసం ముట్టరు.. ప్రత్యేక జీ‘వనం’
భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో వారంతా సంఘటితమయ్యారు. యాంత్రిక జీవనాన్ని వీడి ప్రకృతి వైపు అడుగులు వేశారు. పలువురికి స్ఫూర్తి కలిగేలా ప్రత్యేక జీవనం గడుపుతున్నారు. ఉరుకులపరుగుల మనుషుల మధ్య కాకుండా ఆహ్లాదకర వాతావరణంలో నివాసముంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శంగా జీవిస్తున్నారు. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే బేతంచెర్ల పట్టణానికి కిలో మీటరు దూరంలో కొలుములపల్లె రహదారిలోని రాధాస్వామి నగరిని సందర్శించాల్సిందే. బేతంచెర్ల: ఆధునిక ప్రపంచంలో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఇరుగుపొరుగు అనేది కనుమరుగవుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేదు.. అంతటా ఇదే పరిస్థితి. ఎవరి జీవితం వారిది అన్నట్లుగా మారుతోంది. ఆత్మీయతలు, ఆప్యాయతలు మసకబారుతున్నాయి. బేతంచెర్లలోని రాధాస్వామి నగరి ప్రజలు వీటికి అతీతం. అందరిదీ ఒకే మాట. ఒకే బాట. వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్నా.. పర్యావరణ రక్షణ, ఆరోగ్య సంరక్షణకు రాధాస్వామి ధార్మిక సంస్థ వైపు అడుగులు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పట్టణానికి చెందిన ఈ సంస్థ ప్రస్తుతం 8వ గురువు పరమ గురువు ప్రేమ్‌శరన్ సత్సంగి సాహెబ్ వారి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే పలు కాలనీలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, ఆసుపత్రులు అనుబంధంగా కొనసాగుతున్నాయి. చిరు తిండ్లను తయారు చేస్తున్న మహిళలు ఈ క్రమంలో బేతంచెర్ల పట్టణానికి చెందిన ప్రేమ స్వరూప్ అధ్యక్షతన 14 కుటుంబాలు ప్రత్యేక జీవనం అలవర్చుకున్నాయి. వీరికి స్ఫూర్తిగా రామళ్లకోట, కొలుములపల్లె, ముద్దవరం ప్రాంతాల్లో మరో 20 కుటుంబాలు వీరి బాటలో పయనిస్తున్నాయి. కర్నూలు నగరంలో కూడా దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. ఈ ధార్మిక సంస్థలో సభ్యులుగా ఉన్నవారంతా గురువు ఆదేశాల ప్రకారం కొన్ని నియమాలు తప్పక పాటిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ఏసీలు వినియోగించడం లేదు. వ్యవసాయంలో రసాయన, పురుగు మందులకు దూరంగా ఉంటున్నారు. అలాగే మద్యం, మాంసం తీసుకోవడం లేదు. ఉదయం వ్యాయామం తప్పక చేస్తున్నారు. ఏ ఇంట్లో కూడా టీవీలు కనిపించవు. ప్రతి ఒక్కరూ తెల్లవారు జామున 3.30 గంటల నుంచి ప్రార్థన, సత్సంగంతో వారి దిన చర్య ప్రారంభమవుతోంది. కష్టపడి పనిచేస్తూ జీవన విధానం కొనసాగిస్తూ, సేవా మార్గంలో నడవాలనేది వారి అభిమతం. సమష్టిగా వ్యవ‘సాయం’ బేతంచెర్ల రాధాస్వామి కాలనీలో నివాసం ఉంటున్న దాదాపు 100 మంది పెద్దలు, పిల్లలు, వృద్ధులు సామూహికంగా వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఎకరాల్లో సపోట, జామ, సీతాఫలం పండ్ల మొక్కలతో పాటు రోజు వినియోగించుకునేందుకు ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వ్యవసాయ పనులు చేస్తారు. ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అలాగే నాణ్యమైన వస్తువులు (కాటన్ దుస్తులు, దోమ తెరలు, దుప్పట్లు, పాదరక్షలు) తయారు చేసి సేవాదృక్పథంతో ఏడాదికోసారి లాభాపేక్ష లేకుండా విక్రయిస్తారు. స్వయం ఉపాధిని పెంపొదించుకునేందుకు మహిళలు ఖాళీ సమయంలో చిరుతిండ్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. -
ఊరికి ముందే 101 గుడులు, 101 బావులు
సాక్షి, కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో పట్టణానికి పది కిమీ దూరంలో ఉన్న గుళ్లదూర్తి గుడులకు నిలయంగా మారింది. లక్కుమాంపురి పేరుతో వెలసిన గ్రామం కాలక్రమేణ బ్రాహ్మణ అగ్రహారం(చిన్నకాశీ), గుడులదూర్తిగా పిలువబడుతూ ప్రస్తుతం గుళ్లదూర్తిగా పేరుగాంచింది. గ్రామం ఉద్భవించేనాటికి గ్రామంలో 101 గుడులు, 101 బావులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. గ్రామంలో వెలసిన ఆలయాలు, పీర్లచావిళ్లు, చర్చిలు మత సామరస్యానికి ప్రతీకగా అద్దం పడుతున్నాయి. కొన్ని ఆలయాలు, బావులు కాలగమనంలో కలిసి పోగా ఇంకా అనేక పురాతన ఆలయాలు, నూతనంగా వెలసిన ఆలయాలతో గ్రామం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. చిన్నమ్మ ఆశ్రమంలో దేవుళ్ల కొలువు 1927వ సంవత్సరంలో భర్తను కోల్పోయిన చిన్నమ్మ అనే మహిళ గ్రామానికి చెందిన వెంకటమ్మ చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతోపాటు కుందూనది ఒడ్డున బండలపై మొలచిన సీతారాముల ప్రతిమలకు పూజలు చేస్తూ భక్తురాలిగా మారింది. పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఈమెకు భక్తులుగా మారటంతో కుందూనది ఒడ్డున చిన్నమ్మ ఆశ్రమాన్ని నెలకొల్పింది. ఈ ఆశ్రమంలో 1948వ సంవత్సరం కేరళకు చెందిన వ్యాస ఆశ్రమ పీఠాధిపతి మళయాలస్వామి ఉప సభ నిర్వహించారు. ఈ సభతో ఆశ్రమ పేరు ప్రతిష్టలు దేశ నలుమూలలా వ్యాపించాయి. 1956వ సంవత్సరంలో చిన్నమ్మ మృతి చెందటంతో ప్రతి ఏటా ఆశ్రమ వార్షికోత్సవం, చిన్నమ్మ ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో సీతారాముల ఆలయంతోపాటు కృష్ణ మందిరం, వీరబ్రహ్మేంద్ర ఆలయం, దక్షిణామూర్తి, చిన్నమ్మ మందిరం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి రోజుల్లో నిర్వహించే వార్షికోత్సవం రాష్ట్రంలోని వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలకు చెందిన ఉపన్యాసకులు హాజరవుతుండటం విశేషం. శ్రీరామ నవమి పండుగను పురష్కరించుకుని సీతారాముల కల్యాణం, మూడు రోజులపాటు తిరుణాల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్రమంలో నిత్యం శ్రీరామతీర్థ సత్సంగం, ఆధ్యాత్మిక విచారణ, ధాన్యం, ప్రతి ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. మత సామరస్యానికి ప్రతీక గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా దస్తగిరిస్వామి, మౌలాలి స్వామి దర్గాలు వెలిశాయి. పూర్వీకుల కథనం మేరకు కోడి కూత, రోకలిపోటు వినిపించని సమయంలో గ్రామానికి చెందిన మాబుసాని అనే భక్తుడు చేతిలో నిప్పులు పోసుకుని వెండిని కరిగించగా ఆచారి అనే మరో భక్తుడు దస్తగిరి స్వామి పీరును తయారు చేశారు. అనేక మహిమలు ఉన్న స్వామికి ప్రతిఏటా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకునేవారు. స్వామి మహిమలు తెలుసుకున్న ఒక దొంగల ముఠా పీరును దొంగలించి నొస్సం కొండల్లో వెండిని కరిగించేందుకు ప్రయత్నించగా ఆ దొంగల కళ్లు పోవడంతో పీరును అక్కడే వదిలేసి పారిపోరినట్లు చరిత్ర. నొస్సం కొండల్లో పీరు ఉందని వెంటనే వెళ్లి తీసుకుని వచ్చి దర్గాలో ప్రతిష్టించాలని దస్తగిరిస్వామి మాబుసానికి కలలో కనిపించి చెప్పగా భక్తులు అక్కడికి చేరుకోగా స్వామి కలలో చెప్పిన మాటలు నిజం కావడంతో పీరును తీసుకొచ్చి తిరిగి ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా మొహర్రం పండుగను పురష్కరించుకుని నిర్వహించే జియారత్ వేడుకలకు ప్రాధాన్యత సంతరించుకుంది. స్వామి మహిమలకు ఆకర్షితులైన అప్పటి భక్తులు విరాళాలు సేకరించి స్వామి వారికి ప్రత్యేకంగా దర్గా నిర్మించారు. అనంతరం కొంత కాలానికి మౌలాలి స్వామి పీరును తయారు చేసి మాబుసాని వంశస్తుల ఆధ్వర్యంలో జార్తలను నిర్వహిస్తున్నారు. జంబుకేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర గ్రామంలో వెలసిన జంబుకేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. కలియుగం ఆరంభంలో పరిచిత మహారాజు( అభిమన్యుడి కుమారుడు) జన్మేజయుడు తన తండ్రి చేసిన సర్పయాగ దోశ నివారణకు దేశవ్యాప్తంగా 101 బ్రాహ్మణ గడపలు కలిగిన గ్రామాల్లో పశ్చిమాభిముఖంగా ఒకే రోజు శివాలయాలు ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా గుళ్లదూర్తిలో జంబుకేశ్వరస్వామి ఆలయం నిర్మితమైంది. ఆలయం నిర్మించి వంద సంవత్సరాలకు పైబడటంతో పదేళ్లక్రితం ఆలయ జీర్ణోద్దరణ పచేలు చేపట్టారు. ఆలయంలో ప్రతి ఏకాదశి రోజున పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో వెలసిన మరిన్ని ఆలయాలు గ్రామంలో పురాతన ఆలయాలతోపాటు మరిన్ని ఆలయాలు వెలశాయి. మూడు ఆంజనేయస్వామి, మూడు శివాలయాలు, సాయిబాబాగుడి, విఘ్నేశ్వర, వీరభద్ర, చెన్నకేశవ, లక్ష్మి నరసింహ ఆలయాలు, కర్రెమ్మ, అంకాలమ్మ, లింగమయ్య, సుంకులమ్మ, పేరంటాలమ్మ, పెద్దమ్మ గుడులున్నాయి. 2007వ సంవత్సరంలో దాతల సహకారంతోగ్రామ బస్టాఫ్ సమీపంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ప్రతి రోజు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, గురుపౌర్ణమి, శ్రీరామ నవమి, దత్తజయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చెన్నకేశవ(చెన్నుడు) ఆలయంలో దళితులు పూజారులుగా వ్యవహరిస్తూ పూజలు చేస్తున్నారు. గ్రామం ఆవిర్భావం తర్వాత కొన్ని ఆలయాలు కనుమరుగు కాగా గ్రామంలో ఇప్పటికి 30 ఆలయాల్లో దేవుళ్లు భక్తులచే పూజలందుకుంటూ గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. -
నూతనత్వం భువికి చేతనత్వం
సమగ్రమైన రీతిలో విశ్వదర్శనం చేస్తే, మార్పు లేనిది ఏదీ మనకు ఈ ధరిత్రిలో కనిపించదు. ప్రతి విషయంలోనూ, ప్రతి వస్తువులోనూ, జీవనగమనంలోనూ నిత్యం ఎంతో మార్పు కనబడుతూ ఉంటుంది. ఒక దశాబ్దం క్రితం మన జీవన శైలిని, ఇప్పటి జీవన శైలితో పోల్చుకుంటేనే, మనకు ఎంతో భేదం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నిరంతరాయంగా కదిలిపోయే కాలంతో సంభవించే మార్పులు అత్యంత సహజమైనవని మనం గ్రహించాలి. మార్పు అనేది నూతనత్వంతో ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. అంటే, ఇంతకుముందు మనం చూసిన విషయం గానీ, వస్తువు కానీ మార్పులతో ద్యోతకమవుతుంది. అదే నూతనత్వం. విశ్వం ఈ నూతనత్వాన్ని వెంటనే అంగీకరిస్తుందా అంటే.. కాదు అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అయితే, ఆ మార్పులను, చేర్పులను ఎందరో మహనీయులు తమ చేతల ద్వారా ఎంత ప్రయోజనకరమైనవో చూపించి, మిగిలిన వారికి పథనిర్దేశం చేయడం అనాదిగా జరుగుతున్న విషయమే.కాలం చలనశీలం. కదిలేకాలం ఎవరికోసమూ ఆగదు. కాలంతో నిరవధికంగా పరుగెత్తుతూ, ఆగకుండా పరుగెత్తే కాలమనే పంచకళ్యాణి వేగాన్ని తమకు నచ్చిన విధంగా అందుకుని వలసిన కార్యాన్ని సాధించిన వినూత్న పథగాములే విజేతలు. భువికి తమదైన శైలిలో ఏదో అందించాలనే ఉత్సాహమే ఊతంగా ఉరకలేస్తూ, ఉద్వేగంతో సాగుతూ సాధించిన విజేతల విజయం, మానవాళి నుదుటిపై దిద్దిన అందమైన చరిత్ర. వారి చేతల్లోని నూతనత్వం భూతలానికి మనోహరంగా అద్దిన మహత్తు. విజేతలు కొత్తగా ఏ పనులనూ చేయరనీ, ఇంతకుముందు అందుబాటులో ఉన్న, అందరికీ తెలిసిన విషయాలనే కొత్త దక్కోణంలో పరిశీలించి, పరిశోధించి, నూతన శైలిలో ఆవిష్కరిస్తారనీ మనకు నిత్యమూ ఎదురయ్యే అనుభవాలను చూస్తే అర్థమవుతుంది. నూతనత్వం అన్న విషయం గుర్తుకు రాగానే, దాదాపుగా దానికి సమానార్థంగా నిలిచే సృజనాత్మకత కూడా స్ఫురణకు వస్తుంది. నూతనత్వం, సజనాత్మకతల మధ్య అవినాభావ సంబంధమే ఉంది. కొత్తవిషయాల గురించి, కొంగ్రొత్త ఆవిష్కరణల గురించి ఆలోచించే తీరే సృజనాత్మకత. సృజనాత్మకమైన ఆలోచనలను అమలుపరచే ఆచరణాత్మక విధమే నూతనత్వం. బాహ్యమైన స్పందనల ద్వారా మనిషిలోని సంస్కారం చేతనమవుతుంది. కానీ, అంతఃకరణలో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుని, తాను నూతన పోకడను ప్రవేశపెట్టదలచిన హృదికి కలిగేది సంకల్పం. దృఢమైన సంకల్పమే నూతనత్వానికి గట్టి పునాదిగా మనం భావించవచ్చు. మానవమేధ ఎంతో శక్తివంతమైనది. నూతన ఒరవడిని సృజించడానికి సంకల్పం మదిలో జనిస్తే, సాధించడానికి ఊతమిచ్చేది మేధస్సు.. ఆదిమానవునిలా సంచరించిన సమయంనుంచి నేటి కంప్యూటర్ యుగం వరకూ మానవుడు చేతనతో సాధించిన నూతన విజయాలు మస్తిష్కంలో మెరిసిన విద్యుల్లతలవంటి యోచనలేకదా.. సిసిలీరాజు ఒక స్వర్ణకిరీటాన్ని తయారుచేయించాడు. రాజుకు కిరీటానికి వాడిన బంగారంలో వెండి కల్తీ చేసినట్లు అనుమానం వచ్చింది. కిరీటాన్ని చెడకొట్టకుండా అది స్వచ్ఛమైన బంగారంతో చేయబడిందా లేకపోతే కల్తీ జరిగిందా అనే విషయాన్ని తేల్చమని ఆర్కిమెడిస్‌ను అదేశించాడు. ఆర్కిమెడిస్ సున్నితమైన ఈ సమస్యను ఆ కిరీటాన్ని చెడకొట్టకుండానే పరిష్కరించాడు. అక్రమాకార కిరీటాన్ని క్రమాకారానికి మార్చకుండానే దాని సాంద్రతను కనుగొన్నాడు. రాజు చెప్పిన విషయాన్ని గురించి ఆలోచిస్తూ అతను స్నానాల తొట్టెలో స్నానం చేస్తున్న సందర్భంలో తాను తొట్టెలో మునిగినప్పుడు కొంత నీరు బయటికి పోతున్నట్లు గమనించాడు. ఈ చిన్న విషయమే అతనిలో గొప్ప ఆలోచనకు దారి తీసింది. ఆ విషయం తెలిసిన వెంటనే వీధులలో ‘యురేకా!‘ అని అరుస్తూ రాజుగారికి విషయం చెప్పడానికి పరుగెత్తాడు. గ్రీకు భాషలో ‘యురేకా’ అంటే ‘నేను కనుగొన్నాను‘ అని అర్థం. ఏ వస్తువైనా నీటిలో ముంచినప్పుడు ఆ వస్తువు తన ఘనపరిమాణానికి సమానమైన నీటిని వైదొలగిస్తుందని ఆర్కిమెడిస్ తెలుసుకున్నాడు. ఆ విధంగా బంగారు కిరీటాన్ని నీటిలో ముంచినపుడు అది తొలగించిన నీటి ఘనపరిమాణం ఆధారంగా కిరీటం ఘనపరిమాణాన్ని కనుగొన్నాడు. అంతే, అతని ఆనందానికి అంతే లేదు. రాజు తనకు అప్పగించిన విషయం లో దాగున్న సిద్ధాంతాన్ని కనుగొన్న అవధుల్లేని ఉత్సాహంలోనే ఆర్కిమెడిస్ ఆ విధంగా ప్రవర్తించాడు. తాను కనుగొన్న విషయం ఎన్నో నూతన ఆవిష్కరణలకు దారితీస్తుందని గొప్పవాడైన ఆ శాస్త్రజ్ఞునికి తెలుసు. రేడియోను కనుగొన్న మార్కోనీ తనలో తాను ఎంతగానో పరవశిస్తూ ఉండేవాడట. దీనికి కారణం వారి హృదయంలో నూతనత్వాన్ని జగతికి అందించినందుకు కలిగిన ఆత్మానందమే.. భారతదేశంలో అనాదికాలం నుంచీ ఎన్నో ఆవిష్కరణలు జరిగి విశ్వానికి కొత్త మార్గాలను దర్శింపజేశాయి. ఆయుర్వేదంలో కొంగ్రొత్త ఔషధాలను కనుగొన్న చరకుడు, శుశ్రుతుడూ నేటి ఆధునిక ఔషధాలెన్నిటికో మార్గం చూపారు. ఆనాడే వైద్యరంగంలో వారు చూపిన దార్శనిక ప్రతిభతో కూడిన నూతనత్వమే నేటికీ విశ్వయవనికపై వెలుగులీనడం గమనార్హం. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్టు, వరాహమిహిరుడు చూపిన నూతనత్వం నేటికీ స్మరణీయమే.. ఇక కంప్యూటర్, సెల్ ఫోన్ మనవ జీవితంలో నింపిన నూతనత్వాన్ని గురించి ఎంత విశదీకరించినా తనివి తీరదు కదా.. మానవునిగా జన్మించిన అపూర్వమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, విశ్వానికి తమ నూతన ఆలోచనా ధోరణితో, ఎన్నో రకాల ఆవిష్కరణలు చేసిన వీరి చరిత మనకు బోధించేది ఒక్కటే.. దైనందిన జీవికలో భాగంగా భుజించడం, నిద్రించడం అన్నవే కాకుండా, జగతికి ‘‘నూతనత్వాన్ని జోడించి నేను ఏం చేయగలను’’ అని ఆలోచించినప్పుడే చేతనుడు అవుతాడు మానవుడు. భూమిలో జనించిన ప్రతి మనిషీ నవీన జీవనానికి బాటలు చూపే శాస్త్రవేత్త కాకపోవచ్చు. నవ్యమైన కోణంలో ఆలోచనలు సాగితే, ఖచ్చితంగా చేతనామయమైన జగతికి తనవంతు సహకారాన్ని అందించే హితవర్తనుడవుతాడు. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
మానసిక సౌఖ్యం మహోన్నతం
సుఖం, అనేది అంగట్లో దొరికే వస్తువే అయితే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువు అయ్యేది. వెండి, బంగారం, వజ్రాల కంటే విలువైనది అయ్యేది. అది కొని తెచ్చుకునేది కాదు. ప్రతి మనిషీ తనకు తాను, తనలో తాను రూపొందించుకునే గొప్ప అనుభూతి! మణిమాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు, ధనరాశులు, రాజ్యం, అధికారం, మహా ఐశ్వర్యం ఇవన్నీ దర్పాన్ని తెచ్చిపెడతాయి కానీ, చిటికెడు సుఖాన్ని అందించలేవు. కనీసం కంటినిండా కునుకు తీసే అవకాశాన్ని ఇవ్వలేవు. కప్పినుడు అలాంటి పరిస్థితిని చవిచూశాడు. అతను కుక్కుట రాజ్యానికి రాజు. తండ్రి మరణానంతరం రాజయ్యాక జంబూ ద్వీపం మొత్తాన్ని జయించాడు. రాజులందర్నీ పొరద్రోలాడు. కానీ... మెత్తటి పడక ఉన్నా, సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉన్నా కంటినిండా నిద్రపోలేక పోయాడు. శత్రువులు ఏ క్షణాన, ఏ రూపంలో వచ్చి పడతారో అనే భయం. అతను ఒకరోజున నగర ప్రదక్షిణ చేస్తూ చెట్టుకింద హాయిగా నిద్రపోతున్న ఒక భిక్షువుని చూశాడు. ఆగి అతణ్ణి లేపి ‘‘నీ సుఖనిద్రకు కారణం ఏమిటి?’’ అని అడిగాడు. ఆ భిక్షువు రాజుని బుద్ధుని దగ్గరకు తీసుకుపోయాడు. బుద్ధ ప్రబోధం విన్నాడు రాజు. ‘‘కోరికలు ఎడతెరిపి లేనివి. వాటివల్ల కలిగే కామసుఖం తాత్కాలికం. కానీ నిష్కామసుఖం గొప్పది. శాశ్వతం. సంపాదనతో ముడిపడిన కర్మవల్ల కలిగే సుఖం కొద్దిపాటిది. అలా ముడిపడనిది మహత్తరమైనది. తృష్ణవల్ల కలిగే సుఖం తుచ్ఛం. తృష్ణారహిత సుఖం అమోఘం. లేశమంతే లౌకిక సుఖం. అద్వితీయం. అలౌకికసుఖం, శారీరక సుఖం కంటే మానసిక సుఖం మహోన్నతమైంది. సుఖం మీద ప్రీతితో పొందే సుఖం కంటే అప్రీతితో పొందే సుఖం అమరమైంది. అపేక్షతో పొందే సుఖం అమరమైంది. ఆపేక్షతో పొందే సుఖం కంటే ఉపేక్షతో పొందే సుఖం ఉన్నతమైంది. ఉత్తమమైంది. సమాధిస్థితిలో పొందే సుఖం అనిర్వచనీచమైంది. ఒక గృహస్తు పొందే సుఖం కంటే తాపసి. ధ్యాని పొందే సుఖం ధరణీతలంలో అన్నింటికంటే గొప్పది’’ అని చెప్పాడు. మనం మరొకరి సుఖాన్ని దొంగిలించినా, లాక్కున్నా అది మనకు సుఖాన్నివ్వదు. దొంగ అందుకే ఎంత ధనాన్ని దోచుకున్నా సుఖంగా బతకలేడు. పట్టుబడతానేమో అనే భయంతో బతుకుతూనే ఉంటాడు. కామ దురాచారుల గతి కూడా అంతే! ఎదుటివారి శ్రమను దోపిడి చేసినా, సంపదను దోచుకున్నా, పరుల అధికారాన్ని, రాజ్యాల్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నా, ఆస్తి, అంతస్తు అధికారాల్ని పెంచుతాయి గానీ, ఆదమరచి నిద్రపోనీయవు. కునుకు సుఖాన్ని కూడా దక్కనీయవు. కామ, క్రోధ, లోభ, మోహ, రాగాల్ని వీడినవారే అమరమైన సుఖాన్ని పొందగలరు. బుద్ధ ప్రబోధానంతరం, రాజ్యాన్ని త్యజించి, భిక్షువుగా మారాడు కప్పియరాజు. ‘ప్రజ్ఞాని మాత్రమే సుఖంగా జీవిస్తా’డనే బుద్ధవాక్కు ప్రకారం ఆ తర్వాత ఆనందంగా, సుఖంగా, కంటినిండా నిద్రపోయాడు. జీవితాంతం ధర్మాన్ని ప్రబోధిస్తూ మరణించాక కూడా అమరుడయ్యాడు. కప్పియ భిక్షువుగా కీర్తిగాంచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
వ్యాస పూర్ణిమ: వేదవ్యాసుడి జీవిత కథ
వేదవ్యాసుడి జీవిత కథ ఆద్యంతం అద్భుతం. వ్యాసుడు వసిష్ఠుడికి ముని మనమడు. శక్తి మహర్షికి పౌత్రుడు. పరాశరుడి పుత్రుడు. తపో నిధి అయిన పరాశరుడు యమున దాటడానికి పడవ ఎక్కడమేమిటి? దాటించేందుకు తండ్రి స్థానంలో దాశ పుత్రి తాను పడవ నడపడమేమిటి? మహర్షి అకస్మాత్తుగా మత్స్య గంధిని మోహించడమేమిటి? తన తపశ్శక్తి ద్వారా ఆమె అభ్యంతరాలన్నిటినీ తొలగించటమేమిటీ? ఆ యమునా నదీ ద్వీపంలో ఆమెకు అయాచితంగా పుత్రుడిని ప్రసాదిం చటమేమిటి? అప్పటికప్పుడే సకల శాస్త్రవేత్త అయిన పుత్రుడు పుట్టు కురావడమేమిటి? పుడుతూనే తల్లిని విడిచి తపోవనాలకు వెళ్లిపోవట మేమిటి? ఇదంతా లోక కల్యాణం కోసం లోకాతీతుడిని అవతరింపజే సేందుకు లోకేశ్వరుడు ప్రదర్శించిన విచిత్ర విలాసం. ఆ కారణజన్ముడి జన్మకు ప్రయోజనం మాన వాళికి చతుర్విధ పురుషార్థ సాధన రహస్యాలను బహువిధాలుగా బోధించటం. అందుకే ఆయన జగద్గురువులకే గురువుగా నిలిచిపోయాడు. అగమ్యంగా ఉన్న వేదరాశి చిక్కులు విప్పి, చక్కబరచి, అధ్యయనానికి అనువుగా చతుర్వేదాలుగా విభజించి, వైదిక ధర్మప్రవర్తనం చేసిన ఆది గురువు వేదవ్యాసుడు. పంచమవేదమైన భారతేతిహాసం ద్వారా ‘ధర్మాన్ని ఆచరించండి. అన్నీ లభిస్తాయి’ అని పదేపదే ఎలుగెత్తి ఘోషించిన సకల లోక హితైషి సాత్యవతేయుడు. అర్థ కామ సాధనల విషయాలను విస్త రించి, అనేక నీతి కథల భాండాగారాలైన అష్టాదశ పురాణాల ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఆప్తుడు వ్యాసుడు. బాదరాయణ బ్రహ్మ సూత్రాల ద్వారా వేదాంత సారాన్ని సూత్రీకరించి, మనుషులం దరికీ మహత్తర లక్ష్యమైన మోక్ష పురుషార్థానికి బంగారు బాట పరచిన వాడూ పరాశరుడే. ఇంతటి మహోపకారి అయిన ఈ జ్ఞాన చంద్రుడు ఉదయించిన ఆషాఢ పూర్ణిమ శుభతిథిని ఆసేతు శీతాచలమూ గురు పూర్ణిమ పర్వదినంగా జరుపుకోవటం సర్వవిధాలా సముచితమైన సంప్రదాయం. ఆ సందర్భంగా ప్రత్యేకంగా అస్మాదాచార్య పర్యంతమైన గురుపరంపరను సాదరంగా సంస్మరించుకొని, యథాశక్తి కృత జ్ఞతను ప్రకటించుకోవటం మన కనీసపు కర్తవ్యం. – ఎం. మారుతి శాస్త్రి -
Guru Purnima: ఆదియోగి తనను ఆదిగురువుగా మార్చుకున్నారు
గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. నిండు పున్నమి రోజు ఉండే స్పందన, ప్రకంపనాలు, ఆ రోజు ఉండే అనుభూతి, మిగతా రోజులలో కన్నా చాలా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పధంలో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి నుండి లభించిన ఒక వరం లాంటిది. సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి. యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. మొట్ట మొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేశారు. అనంతరం నిశ్చలుడయ్యాడు. తాము అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో ఆయన పొందుతున్నారని ఆయన్ని చూసినవారు అనుకున్నారు. తమతో సంభాషిస్తాడేమో అని శివుడి కోసం జనాలు ఎదురు చూడడం మోదలుపెట్టారు. కాని అక్కడ జనాలు ఉన్నారన్న స్పృహ శివుడికి లేదు. దీంతో కొంతకాలం ఎదురు చూసి అంతా వెళ్లిపోయారు. కేవలం ఏడుగురు మాత్రం అలాగే వేచి ఉన్నారు. ఈ ఏడుగురు ఆయన వద్ద నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు. చివరకు “మీకు తెలిసింది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం” అని వారు ఆయనను బతిమిలాడారు. శివుడు వారిని పట్టించుకోలేదు, “ అజ్ఞానులారా! మీరున్న స్ధితిలో కోట్ల సంవత్సరాలైనా మీకేమీ తెలియదు. ముందు మీరు అందుకు కావాలిసిన యోగ్యత పొందాలి. ఇందుకోసం ఎంతో సాధన చేయవలిసి ఉంటుంది. ఇది వినోదం కాదు” అంటూ తోసిపుచ్చాడు. శివుడి సూచనలకు తగ్గట్టు వారు యోగ్యత పొందేందుకు సిద్ధమయ్యారు. దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి సంసిద్ధమవుతూనే ఉన్నారు. 84 ఏళ్ల సాధన తరువాత, ఒక పున్నమి రోజున, సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశలోకి మారుతున్నప్పుడు, మన సంప్రదాయంలో దక్షిణాయనం ఆరంభమవుతుందనే కాలంలో ఆదియోగి ఈ ఏడుగురిని చూశారు. 84 ఏళ్లుగా సాధన చేస్తున్న వారిని శివుడు పట్టించుకోకుండా ఉండలేకపోయారు. 28 రోజుల పాటు వారిని నిశితంగా గమనించారు. మళ్ళీ పూర్ణ చంద్రోదయమైన రోజున, ఆయన గురువుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆదియోగి తనను తాను ఆదిగురువుగా మార్చుకున్నారు. దక్షిణ దిశవైపుకి తిరిగి, యోగ శాస్త్రం వారికి చెప్పడం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు. మన మనసులో తెలుసుకోవాలి అనే ఒక గాఢమైన కోరిక ఏర్పడ్డప్పుడు .... మనకు గురువు లభిస్తారు. ఉత్తమమైన గురువు కోసం వెతుక్కుంటూ వెళ్లక్కర్లేదు. మనలో తీవ్రమైన తపన ఉంటే గురువు తనంతట తానుగా సంభవిస్తాడు, -
అమ్మా! అన్నం పెట్టమ్మా...
‘ఇమ్ముగ చదువనినోరును, అమ్మాయని పిలిచి అన్నమడుగుని నోరున్...’’అన్న సుమతీ శతకంలోని పద్యం గురించి తెలుసుకుంటున్నాం. అసలు ఇటువంటి రచనలు చేసేటప్పుడు మన పూర్వకవులు అద్భుతమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏది మనం మరిచిపోకూడదో, నాలుగు కాలాలపాటు గుర్తుంచుకుని జీవితానికి అన్వయం చేసుకోవాలో అటువంటి వాటిని ఛందోబద్ధం చేసి పద్యాలు, శ్లోకాలుగా అందించారు. అంటే వాటిని ఒకసారి చదివితే అవి జ్ఞాపకం ఉండిపోతాయి. భవిష్యత్తులో కష్టాలు ఎదురయినప్పుడు లేదా సందర్భవశాత్తూ గుర్తుకు రావడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. సుమతీ శతకంలోని పద్యాలు కూడా శ్రద్ధపెట్టి చదివితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విద్యార్థులు చదువుకునే వయసులో ఏది చదివినా కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలి. అలాగే లోకంలో అమ్మంటే అమ్మే. అమ్మ అన్నం పెట్టేటప్పుడు కడుపు నిండడం కోసం మాత్రమే పెట్టదు. ఆర్తితో, సంతోషంతో పెడుతుంది. పిల్లలు వృద్ధిలోకి రావాలని, ఆరోగ్యంగా బతకాలని పెడుతుంది. వాళ్లు సరిగా తినకపోతే, తన వంటలో లోపం ఉందేమోనని బాధపడుతుంది తప్ప మరోలా ఆలోచించదు. తనకోసం అన్నం వండుకోదు, మనకోసం వండుతుంది. అందరికీ పెట్టి చివరగా తను తింటుంది. తనకు సరిపడా మిగలకపోతే ఆకలిని ఓర్చుకుంటుంది తప్ప నాకు మిగల్చకుండా అంతా వాళ్ళే తినేసారని బాధపడదు. ‘మాతా సమున్నాస్తి శరీరపోషణమ్’– అమ్మ పోషించినట్టుగా ఈ శరీరాన్ని పోషించగలిగిన వారుండరు ఈ లోకంలో. అమ్మ భగవంతునితో సమానం... అంటే తప్పు. భగవంతుడే అమ్మ అయినది, పరదేవతే అమ్మగా ఉన్నది. మాతృదేవోభవ..ఆ పరదేవతే అమ్మ రూపంలో తిరుగుతోంది. నమశ్శంకరాయచ, మయస్క రాయచ, నమశ్శివాయచ, శివతరాయచ.. అంటుంది వేదం. శంకరుడు అంటే ఎక్కడో ఉండడు. తండ్రి రూపంలో ఉంటాడు. అలాగే అమ్మ కూడా పరదేవతయై బిడ్డల ఆలనాపాలనా చూసుకుంటుంది. తన కడుపు మాడ్చుకుని కూడా పిల్లల వృద్ధికోసం త్యాగం చేయగలిగిన జీవి ఈ లోకంలో అమ్మ ఒక్కతే. తండ్రి ఎంతటి ఐశ్వర్యవంతుడయినా, బిడ్డపుట్టగానే ఆకలేసి ఏడిస్తే ఏమీ చేయలేని నిస్సహాయత. కానీ నెత్తుటిని పాలగా మార్చి పట్టగలిగినది అమ్మ ఒక్కతే. అందుకే జీవితంలో గొప్ప అదృష్టం–అమ్మను పొంది ఉండడంగా భావిస్తారు. అపార కీర్తిప్రతిష్టలు ఆర్జించిన మహామహుల జీవితాలు పరిశీలిస్తే...అమ్మ వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి తొలినాళ్ళల్లో పడిన కష్టాలు తెలుస్తాయి. మా అమ్మ పచ్చడి తాను తిని ఇడ్లీలు నాకు పెట్టి...రెక్కలు ముక్కలు చేసుకునేది..అని ప్రఖ్యాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసుకున్నారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి అమ్మ సూర్యకాంతమ్మ గారు బిడ్డ ప్రసవానికి ముందు వరకు ఎవరు వారించినా వినకుండా కడుపులో ఉన్న తన బిడ్డకు సంగీతం నేర్పే అవకాశం తరువాత తనకు వస్తుందో రాదోనని వీణ వాయించారట. ప్రసవానంతరం పదోరోజు ఆమె కన్ను మూసారు. ‘‘నన్ను కనడం కోసమే వచ్చింది ఒక అమ్మ, నన్ను పెంచడం కోసమే వచ్చింది మా పెద్దమ్మ. ఇద్దరు అమ్మల చేతిలో పెరిగి పెద్దవాణ్ణయి ఇవ్వాళ ఈ స్థితిలో ఉన్నాను..’’ అని ఆయన గుర్తు చేసుకునేవారు. అటువంటి అమృతమూర్తి అయిన అమ్మను నోరారా ‘అమ్మా!’ అని పిలిచి ‘అన్నం పెట్టు’ అని అడగకపోతే ఎలా? -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మనస్సు వడ్లగింజ లాంటిది..
మనస్సు వడ్లగింజ లాంటిది అన్నాడు బుద్ధుడు. బియ్యపుగింజల నాణ్యతల్ని చూడ్డానికి వడ్లగింజల్ని అరచేతులతో నలుపుతారు. అప్పుడు కొన్ని గింజలు చేతికి గుచ్చుకుంటాయి. కొన్ని గుచ్చుకోవు. కారణం వడ్లగింజకు ఒక చివర చిన్నసూదిలాంటి ముక్కు ఉంటుంది. అది గురిలో ఉంటే చర్మాన్ని ఛేదిస్తుంది. లేకుంటే తానే నలిగిపోతుంది. అలాగే గురిలో ఉన్న మనస్సు అవిద్యను, అజ్ఞానాన్ని ఛేదిస్తుంది. విజ్ఞానాన్ని అందిస్తుంది. మరి గురిలో లేని గింజ అవిద్యలో పడి నలిగిపోతుంది. అలాగే మనస్సు నీటి మడుగు లాంటిది అని కూడా అన్నాడు బుద్ధుడు. మడుగులో నీరు బురద బురదగా ఉంటే ఆ మడుగులో ఏమి ఉన్నాయో తెలియదు. ఎలాంటి మొక్కలున్నాయి, అడుగున ఏమైనా ముళ్ళూ రాళ్ళూ ఉన్నాయా, ఎలాంటి జలచరాలు ఉన్నాయి. ప్రాణాలు తీసే పాములు పట్టి మింగే మొసళ్ళు... ఏమి ఉన్నాయి, అసలు దాని లోతు ఎంత.. ఇవేవీ మనం తెలుసుకోలేం. అలాగే మన మనస్సు అకుశల (చెడ్డ) భావాలతో, ద్వేషం, మోసం, రాగం, మోహం, కామం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయల్లాంటి దుర్గుణాలతో నిండి ఉంటే, ఆ మనసు కూడా మురికిగా ఉన్న మడుగులాంటిదే. దానివల్ల నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, ఆవేదనలు, భయాలూ, అశాంతి అలముకుంటాయి. అవి ఆ మురికిలో పడి కనిపించకుండా కష్టాలు తెచ్చిపెడతాయి. మనల్ని అథోగతి పాలు చేస్తాయి. మరి, ఆ మడుగులోని నీరు తేటగా స్వచ్ఛంగా ఉంటే, అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. మడుగు అడుగున ఉన్న ముళ్ళూ, రాళ్ళూ, మొక్కలూ తెలుస్తాయి. పాములూ, మొసళ్ళూ కనిపిస్తాయి. ఆ మడుగులోతు ఎంతో తెలుస్తుంది. కాబట్టి అలాంటి మడుగువల్ల ఎలాంటి ఆపదలు రావు. అలాగే మనస్సు కూడా నిర్మలంగా ఉంటే కామ, రాగ, మోహ, ఈర్ష్య పగలకు దూరంగా ఉంటాం. అప్పుడు మనస్సులో శాంతి ఉదయిస్తుంది. కుశల కర్మలు విప్పారుకుంటాయి. దుఃఖం లోతులు తెలుస్తాయి. అలాగే... మనస్సు చెట్టు కలపలాంటిది అని కూడా బుద్ధుడు చెప్పాడు. మంచి మనస్సు చందనవృక్షపు కలపలాంటిది. దానికి పరిమళం ఉంటుంది. ఆ కలప మెత్తగా ఉంటుంది. కావలసిన రూపంలోకి తేలిగ్గా మలచుకోవచ్చు. పెద్ద వస్తువులుగా చిన్న చిన్న వస్తువులుగానూ, తయారు చేసుకోవచ్చు. చక్కని శిల్పాలుగానూ, మలచుకోవచ్చు. ఇలాంటి మనస్సుగల మనిషి తనను తాను చక్కగా తేలిగ్గా సంస్కరించుకోగలడు. ఇలా మనస్సుని వడ్లగింజతో... మడుగుతో చెట్టు కలపతో పోల్చి గొప్ప సందేశంగా అందించాడు బుద్ధుడు. అందుకే ఆయన మహా మనో వైజ్ఞానికుడు. – బొర్రా గోవర్ధన్ -
చదువే మనిషికి నిజమైన సంపద..
‘కళాశాల ప్రాంగణం దాటిన తరవాత మనిషిలో మిగిలిన సారమే అసలైన చదువు’ అన్నాడు ఆల్బర్ట్ ఐన్ స్టీన్. చదువు వల్ల పొందిన జ్ఞానం, విచక్షణ, వివేకం, వినయం, సంస్కారం అన్నీ జీవితంలో కనిపించాలి. చదువు మనిషికి ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి. తన కాళ్ళ మీద తాను నిలబడటానికి చదువు దోహదం చేయాలి. అర్థవంతంగా జీవించటం నేర్పాలి. అది ఎంత చిన్న చదువైనా, పెద్ద చదువైనా ఆర్థిక భద్రతనిచ్చి, తద్వారా సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. చదువుకు శ్రద్ధ అవసరం. మనిషిని మనీషిగా చేసేది ఈ శ్రద్ధే! చదువు, ప్రశ్నించే తత్వాన్ని, ప్రతీది తెలుసుకోవాలనే జిజ్ఞాసను కలిగించాలి. ప్రశ్న జ్ఞానార్జనకు సంకేతం. మూఢ నమ్మకాలను, అంధవిశ్వాసాలను పోగొట్టి, తార్కిక జ్ఞానాన్ని ఇవ్వాలి. హేతుబద్ధంగా ఆలోచించటం నేర్పాలి. కేవలం పుస్తకాలలోని చదువే చదువు కాదు. నాలుగు గోడల మధ్య తరగతి గదిలో చదివే చదువు వ్యక్తి వికాసానికి సరిపోదు. పూర్వకాలంలో గురుకుల విద్యలో శిష్యులకు అవసరమైన విద్యలు నేర్పించాక, దేశాటనానికి పంపేవారు గురువులు. వివిధ ప్రదేశాలకు వెళ్ళటం, అక్కడి చారిత్రిక విశేషాలను తెలుసుకోవటం చదువులో భాగమే! కొత్త ప్రదేశాలలో కొత్త వారితో పరిచయాలు పెంచుకోవటం, కొత్త భాషలు నేర్వటం కూడా జ్ఞానార్జనే! 19వ శతాబ్ది ప్రారంభంలో సంఘసంస్కర్తలందరూ స్త్రీల సమస్యలకు వారి అజ్ఞానం, అవిద్యే కారణమని భావించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ప్రాథమిక పాఠశాల చదువు, ఇంటి చదువుతోనే ఎంతో జ్ఞానం పొంది, తమ సమస్యలను తామే పరిష్కరించుకున్న పాత్రలను సాహిత్యంలో చూస్తాం. చదువు వ్యక్తిత్వాన్ని వికసింప చేసి, శీలనిర్మాణానికి దోహదం చేయాలి. బుద్ధిని వికసింప జేసి, తమ సమస్యలకు తామే పరిష్కారాన్ని తెలుసుకునే ఆలోచనాశక్తిని పెంచాలి. చదువే మనిషికి నిజమైన సంపద. ఇది ఉపయోగిస్తుంటే తరిగి పోయేది కాదు. ఇచ్చేకొద్ది వృద్ధి పొందే సంపద. విద్యాసంపన్నులు ఎక్కడకు వెళ్లినా గౌరవం పొందుతారు. సమాజంలో ఉపాధ్యాయులకున్న విలువ, గుర్తింపు సాటిలేనిది. చదువు ఇది మంచి... ఇది చెడు– అనే వివేక చతురత నిస్తుంది. చదువుతోనే మనిషి సమాజం లో తానేమిటో నిరూపించుకునే చైతన్యాన్ని పొందాలి. వ్యక్తీకరణ సామర్థ్యాన్నివ్వాలి. మార్కులు, శ్రేణులు చదువుకు కొలబద్దలు కావు. ముఖ్యంగా ఇప్పటి చదువుల్లో వ్యక్తికరణ నైపుణ్యాలకే పెద్దపీట. చదువు నేర్వటంలో ప్రాథమిక, ప్రధాన అంశం వినటం. ఇందులో పట్టు సాధిస్తే, సందేహాలు కలగటం, ప్రశ్నించడం, జ్ఞానాన్వేషణ, జ్ఞానార్జన వంటివి సాధ్యమవుతాయి. బాల్యం నుంచి తల్లితండ్రులు పిల్లలలో ఆరోగ్యకరమైన సొంత ఆలోచనా శక్తిని, వ్యక్తిత్వాన్ని చదువు ద్వారా పెంపొందించాలి. పెద్దయ్యాక, వాళ్ళేం కావాలనుకుంటున్నారో వాళ్లే నిర్ణయించుకోగలిగినంత ఆలోచనా స్థాయి వారికి రావాలి. నచ్చిన చదువు ఏదైనా సరే, వాళ్ళు అందులో ముందుంటారు. ఆ చదువును సార్థకం చేసుకోగలుగుతారు. ప్రతి వ్యక్తిలో అంతర జ్ఞానం దాగి ఉంటుంది. దానిని వెలికి తీయటమే చదువు చేసే పని. చదువు పరమార్థం జ్ఞానం పొందటం. ఉద్యోగం, చదువుకు ఉన్న ఫలితాలలో ఒక అంశం మాత్రమే! చదువంటే ఉద్యోగం కోసమే అనే అభిప్రాయం విద్యార్థులలో ముందు తొలగాలి. చదువు, మానసిక, నైతిక శక్తులను పెంపొందిస్తుందని గుర్తెరగాలి. చదువు జీవితానికి వెలుగు నిస్తుంది. గొప్ప మేధావులను తయారు చేస్తుంది. పూర్వం చదువును మూడవ కన్నుగా భావించారు. దేశంలో జరిగే అన్యాయాలను, ఘోరాలను, దౌర్జన్యాలను విద్యావికాసం ద్వారానే నిరోధించగలం. ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశంలో చదువు పై ఆధారపడి ఉంటుంది. అందుకే, దేశం విద్యారంగం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే, ఒక స్థాయి వరకే ఎవరికైనా ఒక పాఠశాల అధ్యాపకుడు ఉంటారు. ఆ నిర్ణీత విద్యాభ్యాస సమయం ముగిసాక, మనిషి విశాల ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అప్పటి నుండి విశ్వంలో ప్రతివారి నుండి, ప్రతి అంశం నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. చదువుకు అంతం ఉండదు. ఉద్యోగం వచ్చేసిందనో, పెళ్లయి పోయిందనో చదువుకు ఫుల్స్టాప్ పెట్టకూడదు. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త పుస్తకాలను చదువుతూనే ఉండాలి. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే, మెరుగు పరచుకుంటూనే ఉండాలి. మనిషి నిత్య విద్యార్ధిగా ఉండాలి. చదువు... స్వేచ్ఛ అనే అద్భుతమైన ప్రపంచపు తలుపును తెరిచే తాళం చెవి లాంటిదని మేధావులు చెపుతారు. చదువు బానిసత్వం నుంచి, ఆత్మ న్యూనత నుంచి విముక్తి కలిగిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువులో సారాన్ని, విలువలను గ్రహించి, జీవితానికి అన్వయించుకోవాలి. మంచి సమాజ నిర్మాణానికి తాము చదువుకున్న చదువు ద్వారా సహకరించాలి. చదువు అనే బంగారు పళ్లెరం కాంతులీనటానికి జీవితానుభవం అనే గోడ చేర్పులు కావాలి. – డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
ఎవరు బుద్ధిహీనుడు?
పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను అప్పుడప్పుడూ రకరకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇస్తూ ఉండేవాడు. ఒకసారి రాజుగారికి బుద్ధిహీనుల పోటీ నిర్వహించాలనే ఓ వింత ఆలోచన వచ్చింది. వెంటనే ‘ఫలానా రోజు ఫలానా సమయాన ఫలానా ప్రదేశంలో బుద్ధిహీనుల పోటీ నిర్వహించబడుతుంది. ఉత్తమ బుద్ధిహీనుడికి విలువైన బహుమతి ప్రదానం చేయబడుతుంది’ అని ప్రకటన జారీచేయించాడు. ఆ రోజు రానే వచ్చింది. రాజ్యంలోని బుద్ధిహీనులందరూ పోటీలో పాల్గొన్నారు. అందరూ తమ తమ ప్రావీణ్యాన్ని, కళను ప్రదర్శించారు. వారిలో ఓ వ్యక్తి తన బుద్ధిహీనతను అత్యుత్తమంగా ప్రదర్శించి విజేతగా నిలిచాడు. రాజుగారు విజేతగా నిలిచిన ఆ వ్యక్తిని ప్రశంసిస్తూ, తన మెడలో ఉన్న విలువైన హారాన్ని అతని మెడలో వేసి సత్కరించాడు. సభముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొద్దిరోజులకే రాజుగారికి సుస్తీ చేసింది. అందరూ వెళ్ళి రాజుగారిని పరామర్శించి వస్తున్నారు. ఒకరోజు బుద్ధిహీనుడు కూడా రాజు గారిని చూడడానికి వెళ్ళాడు. ‘‘రాజుగారూ.. ఏమిటీ పరిస్థితి.. ఇలా అయిపోయారు.. ఎలా ఉంది ఆరోగ్యం..’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. రాజు ఓపికగా ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. బహుశా ఇక నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండకపోవచ్చు’’ అన్నాడు. ‘‘అవునా.. వేరే చోటికి వెళుతున్నారా?’’ సంభ్రమంగా ప్రశ్నించాడు బుద్ధిహీనుడు. ‘‘అవును.. అంటే.. ఈ ప్రపంచం వదిలేసి మరోప్రపంచానికి ప్రస్థానం..’’ అన్నాడు రాజు వేదాంత ధోరణిలో.. ‘‘అవునా.. వేరే చోటికి వెళుతున్నారా? రాజుగారూ.. మీదగ్గర చాలా సంపద ఉందిగదా.. అదంతా అక్కడికి కూడా పంపించారా?’’ అడిగాడు బుద్ధిహీనుడు. ‘‘లేదు.. పంపలేదు..’’ ‘‘ఇక్కడ ఇంత పెద్ద అద్భుతమైన భవనంలో ఉంటున్నారు కదా.. మరి అక్కడ కూడా పెద్ద భవంతి కట్టించారా?’’ ‘‘లేదు.. అక్కడ పూరి గుడిసె కూడా నిర్మించలేదు’’ ‘‘ఇక్కడ మీకింతమంది సేవకులు, నౌకర్లు, రకరకాల సేవలు చేసేదాస దాసీలు ఉన్నారు కదా.. అక్కడ కూడా వీళ్ళంతా ఉన్నారా.. అక్కడ మీకెవరు సేవలు అందిస్తారు?’ ప్రశ్నించాడు బుద్ధిహీనుడు. రాజుకి బుద్ధిహీనుడి మాటల్లోని మర్మం అంతుచిక్కడం లేదు.. కాని బుద్ధి హీనుడి మాటల్లో ఎక్కడో జ్ఞానోదయ బోధ ఉన్నట్లు అనిపించ సాగింది.. అప్రయత్నంగానే ‘‘అక్కడ ఎవరూ నౌకర్లు లేరు. సేవకులు లేరు.. అక్కడికేమీ పంపలేదు కూడా..’ అన్నాడు. ‘‘మహారాజా.. ఇక్కడ మీరు సమస్త సంపదనూ సంపాదించుకున్నారు. సకల భోగభాగ్యాలూ, సమస్త విలాసాలూ అనుభవించారు. మరి అక్కడికి ఏమీ పంపుకోకుండానే వెళ్ళిపోతే అక్కడి పరిస్థితి ఏమిటి? ఆ జీవితం ఎలా గడుస్తుంది? బుద్ధిమంతులెవరైనా రేపటికోసం ఆలోచిస్తారు గదా! బుద్ధిహీనుడు ఎవరో ఇప్పుడు మీరే తేల్చుకోండి’’ అంటూ తన మెడలోని ఆ విలువైన హారాన్ని తీసి రాజు గారి మెడలో వేసి అక్కడినుండి బిరబిరా వెళ్ళిపోయాడు బుద్ధిహీనుడు. రాజుగారు ఆలోచనలో పడిపోయారు. అవును... ఈ ప్రపంచమే శాశ్వతమని, ఈ జీవితమే సర్వస్వమని రేపటి భవిష్యత్తును, రేపటి జీవితాన్ని పట్టించుకోకుండా ప్రాపంచిక వ్యామోహంలో మునిగి పోవడమే నిజమైన బుద్ధిహీనత. ఇహలోకంలో పరలోకం కోసం పాటుపడేవారు, రేపటి పరలోక జీవితానికి కావలసిన సత్కార్యాలు చేసుకునేవారే వివేకవంతులని పవిత్ర ఖురాన్ కూడా చెబుతోంది. దైవం మనందరినీ సన్మార్గపథంలో నడిపించుగాక! – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
‘క్రోధం’తో వస్తుంది విరోధం
క్రోధమనే చెడ్డగుణం రూపం లేని అరిషడ్వర్గాలనే ఆరు శత్రువుల్లో రెండవది. దానిని కోపంగా, కినుకగా, అలుకగా సందర్భానుసారం వాడుతూ ఉంటారు. క్రోధానికి గురయినవారు ఎదుటివారి మనస్సును నిష్కారణం గా బాధిస్తారు. మనిషి చేసే ఆలోచన, మాట్లాడే మాట ప్రయత్నించే పని క్రోధపూరితంగా ఉండకూడదు. క్రోధంతో ఇంటా బయటా గౌరవాన్ని కోల్పోవడమే కాక శారీరకంగా మానసికంగా వచ్చే భయంకరమైన దీర్ఘరోగ బాధలను కూడా భరించవలసి వస్తుంది. కామం, క్రోధం, లోభం ఆదిగాగల చెడ్డగుణాలు పాప కార్యాలను స్పష్టించే పరమశత్రువులని మనస్సు ను కలుషితం కావించి బుద్ధివికాసాన్ని చెరచి జ్ఞానమనే చక్కని సంపదను నశింప చేస్తాయని వేదాంతసారమైన భగవద్గీత, ఇతర ఆత్మజ్ఞాన గ్రంథాలు బోధిస్తున్నాయి. తనమాట వినలేదని వినుగుచెంది కోపాన్ని ఆపుకోలేక హిరణ్యకశిపుడు పుత్రుడయిన ప్రహ్లాదుణ్ణి నానాహింసలు పెట్టి ఉగ్రనరసింహుని చేతిలో హతుడయ్యాడు. తన వికృతచేష్టలను చూసి సీతమ్మ నవ్విందని కోపించిన శూర్పణఖ ఆమెను మింగబోయి లక్ష్మణుని వల్ల ముక్కు చెవులు కోల్పోయింది. ఇలా ఎంతోమంది క్రోధావేశాలకు గురయి మానప్రాణాలకు ముప్పు తెచ్చుకొన్నారు. అందుకే మృదువుగా సంభాషించడం, ఇతరులను హింసించకుండా ఉండటం సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవడం, తొందరపాటును నివారించుకొనడం, సత్పురుషుల సావాసం చేయడం, మనస్సును నియంత్రించుకోవడానికి యోగసాధన సల్పడం వల్ల జీవితాన్ని బంగారు మయంగా గడపగలం. – విద్వాన్ వల్లూరు చిన్నయ్య -
ధమ్మ పథం: నాలుగు భయాలు
ఆ రోజుల్లో కొందరు గృహస్తులు భిక్షువుల్ని చూసి, వారికి లభిస్తున్న గౌరవాన్ని చూసి, తామూ భిక్షువులుగా మారేవారు. కానీ అక్కడి క్రమశిక్షణ నియమావళి, నైతిక జీవనంలో ఇమడలేక, మోహాన్ని, రాగాన్నీ వదిలించుకోలేక తిరిగి భిక్షుజీవనాన్ని వదిలి పెట్టేవారు. ఇలాంటివారి గురించి బుద్ధుడు చెప్పిన గొప్ప సందేశం ఇది. నీటిలో దిగేవాడికి నాలుగు భయాలు ఉంటాయి. మొదటిది, తరంగ భయం. తరంగం మనిషిని వెనక్కి పడేస్తుంది. ముందుకు పోనీయదు. అలాగే మనస్సులోని అహంకారం కూడా అలాగే వెనక్కి పడదోస్తుంది. ఇతను నాకు చెప్పేవాడు. నాకంటే వయస్సులో చిన్నవాడు. నాకంటే వెనుక వచ్చినవాడు అనే అకుశల భావన అహంకారాన్ని ప్రేరేపించి జలతరంగంలా మనిషిని వెనక్కి నెట్టేస్తుంది. అలాగే.... నీటిలో ఉండే మొసళ్ళ భయం. ఇది చాపల్యానికి చెందిన అకుశల కర్మ. నీటిలో కనిపించని మొసలి వచ్చి, వడిసి పట్టి లోనికి లాగేస్తుంది. ఈ చాపల్యం కూడా అలాగే లాగేస్తుంది. అంతకుముందు తిన్నది ఇప్పుడు తినకూడదు. తాగింది తాగకూడదు. కానీ ఆ రుచి చపలత మనిషిని మొసలి పట్టు పట్టి వెనక్కి లాగేస్తుంది. అందుకే ఇది మకర భయం. ఇక మూడోభయం సుడిగుండ భయం. సుడిగుండం వేగంగా తనలోకి లాక్కు పోయి, గిరగిరా తిప్పేసి ముంచేస్తుంది. అలాగే గతంలో అనుభవించిన విలాసవంతమైన జీవితం తాలూకు సౌకర్యాలన్నీ మనల్ని సుడిగుండంలా చుట్టుముడతాయి. నాలుగో భయం సొరచేప భయం. మనిషిని పట్టి కత్తిరించి సొరచేప ఎలా మింగేస్తుందో కామం కూడా అలాగే మింగేస్తుంది. అలంకరణలు, అందచందాలను చూసి అదుపు తప్పిన భిక్షువు చివరికి ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఈ కామరాగాన్ని అదుపుచేయని వ్యక్తి కూడా మింగివేయబడతాడు. అంటే పూర్తిగా ఉనికినే కోల్పోతాడు.ఆదర్శ మార్గంతో నడిచే వ్యక్తికి అపాయాన్ని కలిగిస్తాయి నాలుగు భయాలు. అందుకే ఈ నాలుగింటి పట్ల భయంతో ఉండాలి. వాటికి చిక్కుపడకుండా ఉండాలి. అందుకు జాగరూకత కలిగి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి చిరకీర్తిని పొందుతాడు. పరిపూర్ణుడవుతాడు. చివరికంటూ ఆదర్శమూర్తిగా మిగులుతాడు.ధార్మికుడు తప్పనిసరిగా తన జీవితంలో ఊహించుకోవాల్సిన నాలుగు భయాలు ఇవి. వీటిని జయించినవాడు అసలైన యోధుడు. తనను తాను జయించుకున్న జితేంద్రియుడు. చదవండి: chaganti koteswara rao: బతుకుబాటకు దారిదీపం -
chaganti koteswara rao: బతుకుబాటకు దారిదీపం
మనిషి వృద్ధిలోకి రావడానికి తప్పకుండా నేర్చుకుని తీరవలసినది నీతి శాస్త్రం. ఆ నీతిని పాటించకపోతే తాను ఒక్కడే పతనమయిపోడు. తనతోపాటూ చుట్టూ ఉండే సమాజం కూడా భ్రష్టుపట్టే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తిన్న అన్నం కొద్దిగా కలుషితం అయితే ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే అనారోగ్యం వస్తుంది. కానీ ఒక ఊరివారందరూ దాహం తీర్చుకునే చెరువు విషపూరితం అయితే ఊరంతా అస్వస్థతకు గురవుతుంది. అయితే నీతి విషయంలో మాత్రం... ఒక వ్యక్తి నీతి తప్పితే కేవలం ఆ వ్యక్తి మాత్రమే పతనమయిపోడు, సమాజంలో ఉన్న అనేకమంది దాని దుష్ప్రభావానికి లోనవుతారు. అంతేకాక అతని తాత్కాలిక సుఖాలను ఆదర్శంగా భావించే అపరిపక్వ మనస్కులూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే చిన్నతనంలోనే నీతి శాస్త్రాలను బాగా చదువుకోవాలి. తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేంత సులభంగా మనకు శతకాలు అందుబాటులో ఉన్నాయి... ఎక్కువకాలం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చక్కటి పద్యాల రూపంలో ఉన్నాయి. శతకం అంటే నూరు పద్యాలతో ఉన్న గ్రంథం అని. కానీ నూరే ఉండాలన్న నియమం లేదు. శతకం – అంటే ‘నూట ఎనిమిది’ అన్న అర్థం కూడా ఉంది. 108 కానీ, 116 కానీ పద్యాలు ఉండడం సంప్రదాయంగా వస్తోంది. కొన్నిచోట్ల అవి దాటిన శతకాలు కూడా ఉన్నాయి. సంస్కృతంలో లేనిది తెలుగులో మాత్రమే ప్రత్యేకంగా కనిపించేది మకుటం. ప్రతి పద్యం చివర మాటకానీ, చివర పంక్తి కానీ, కొన్నిసార్లు చివరి భాగం కానీ, సీస పద్యాలవంటి వాటిల్లో అయితే చివరి పద్యం కానీ మకుటం అవుతుంది. సుమతీ అనీ, దాశరథీ! కరుణాపయోనిథీ! అనీ, విశ్వదాభిరామ వినురవేమ... అనీ ఉంచారు. వీటిలో భక్తికి సంబంధించినవి, ఆవేదనను వెళ్ళగక్కేవి, ప్రకృతిని వర్ణించేవి ... ఇలా చాలా శతకాలు ఉన్నా తెలుగు భాషలో నీతి శతకాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. పెద్దలు, పరిశోధకుల పరిశీలన ప్రకారం శతక రచన ప్రారంభం అయింది నన్నయతో అంటారు. భారతాన్ని ఆంధ్రభాషలో రచన ప్రారంభం చేసే సమయంలో ఆయన రాసిన కొన్ని పద్యాల చివరన ఆదిశేషుని ఉద్దేశించి ‘..నాకు ప్రసన్నుడయ్యెడున్’ అన్న మకుటంతో ముగించారు. ఇది తరువాత కాలంలో శతక రచనకు ప్రేరణనిచ్చాయంటారు వీరు. విద్యార్థులకు సంబంధించినంతవరకు అత్యంత ప్రధానమైనది నీతి శతకం. తెలుగులో ఇలా వచ్చిన మొట్టమొదటి శతకం – సుమతీ శతకం. కాకతి రుద్రమదేవి దగ్గర సామంత రాజుగా ఉన్న భద్ర భూపాలుడు .. బద్దెన అనే పేరుతో అందరికీ పనికి వచ్చే నీతుల సమాహార స్వరూపంగా దీనిని రచించారు. కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులు, పౌరులు, సమాజంలోని విభిన్న వర్గాలవారు, చివరకు కవులు కూడా తెలుసుకోవాల్సిన నీతి సూత్రాలను ఇందులో పొందుపరిచారు. ఏవి పాటించాలో, ఏవి పాటించకూడదో, వేటిని మనిషి ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోవాలో దీనిలో ప్రతిపాదించారు. వీటిని కంఠస్థం చేసుకుని ధారణలో ఉంచుకుంటే.. జీవితంలో క్లిష్ట సమస్యల వలయంలో చిక్కుకుని ఏ దారీ కనిపించ నప్పడు ఇవి వాటంతట అవే గుర్తుకు వచ్చి కాపాడతాయి. సుమతీ శతక పద్యాలు ‘సుమతీ’ అన్న మకుటంతో ముగుస్తాయి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: నిలుపుకోవలసిన అలవాట్లు -
నిలుపుకోవలసిన అలవాట్లు
ఒక పనిని ప్రతి రోజూ ఒకే సమయానికి చేస్తుంటే దానిని అలవాటు అంటాం. దానిని సూర్యోదయం, సూర్యాస్తమయాలంత సహజంగా, క్రమం తప్పకుండా చేస్తుంటాం. అలా ఇది మన జీవితంలో, వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. దీనికి అంతర్గత ప్రేరణ ఉంటుంది. అంటే, కొన్ని ఏళ్లుగా తెల్లవారు ఝామునే లేవడాన్ని అలవరచుకుంటే అలారం అవసరం లేకుండా ఆ సమయానికి అప్రయత్నంగా మెలకువ వచ్చేస్తుంది. ఒకే సమయానికి భోజనం చేయటం, పడుకోవటం కూడ ఇలాంటివే! వీటిని స్థిర అలవాట్లంటాము. సత్పురుషుల సాంగత్యంతో దానగుణం, పరోపకారం, పెద్దవాళ్ళని గౌరవించటం, నిస్సహాయులకు అండగా నిలవటం, చక్కగా సంభాషించటం, సరైన నిర్ణయాధికారం అనే మంచి అలవాట్లను ప్రయత్నపూర్వకంగా అలవరచుకుంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇవి నిలిచిపోతే, వీటి వల్ల వ్యక్తిగత ప్రగతి తద్వారా సమాజ ప్రగతి కలుగుతుంది.. అలవాట్ల మీద నియంత్రణ అవసరం. మంచి అలవాట్లు కూడ ఒక్కోసారి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఆహార పానాదులు ఒక నిర్ణీత కాలంలో తీసుకునే మనకు అన్నివేళలా అలా సాధ్యం కాకపోవచ్చు. అందుకనే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రతి మంచి అలవాటు కూడ ఒక చెడ్డ అలవాటే నంటాడు. అలవాట్లను మన అధీనంలో ఉంచుకోవాలి. మన శరీరం మన అధీనం లో ఉండాలి గాని అది చెప్పినట్లు మనం వినకూడదు. దాని వశంలోకి మనం వెళ్ళకూడదు. శరీరానికి ఏది అలవాటు చేస్తే అదే అలవాటవుతుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నడక, వ్యాయామం చేసే అలవాటున్న వాళ్లకు ఒక్కరోజు చేయకపోయినా ఆ వెలితి తెలుస్తుంది. మంచి అలవాట్లు జీవితానికి ఒక క్రమశిక్షణ నిస్తాయి. బాల్యంలో ఏర్పడిన మంచి అలవాట్ల వల్ల మనం పొందే ప్రయోజనం ఎంతగానో ఉంటుంది. ఇది చాలా కాలం కూడా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల, ఉపాధ్యాయులపాత్ర, బాధ్యత ఎంతో ఉంది. సాధారణంగా చెడుకి ఆకర్షణ ఎక్కువ. దీనివల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మంచి అలవాట్లు సైతం పోతాయి. చెడు అలవాట్లకు గురైన వ్యక్తుల కుటుంబాలు ఛిన్నాభిన్నమైన ఉదాహరణ లెన్నో! దీనివల్ల సమాజంలో మనిషికి గౌరవం ఉండదు. పైగా సమాజం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అలవాట్లనేవి మనిషి జీవితంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. మంచి అలవాట్లతో జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించు కోగలరు. చెడు అలవాట్లతో జీవితమే నాశనం అయిపోతుంది. ఒక మంచి అలవాటు మనిషిని ఉన్నత పథానికి తీసుకెళ్తే, చెడ్డది అధః పాతాళానికి తీసుకెళ్లిపోతుంది. ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు కావచ్చు. కాని, అతి ధూమపానం, మద్యపానం, పరస్త్రీ వ్యామోహం, జూదం, దుబారా చేసి అనవసరంగా అప్పులు చేయటం వంటివి చెడు అలవాట్లుగా భావించటంలో ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు. కొందరికి ప్రతి చిన్ననొప్పికి మాత్రలు వేసుకోవటం అలవాటుగా ఉంటుంది. అవసరమున్నా, లేకపోయినా డాక్టర్ల దగ్గరికి పరుగెడుతూ ఉంటారు. ప్రతి చిన్న బాధను కొంచెమైనా సహనంతో భరించలేక పోతే, విపరీతమైన మందుల వాడకం తదనంతర జీవితం పై దుష్ప్రభావం చూపుతుంది. మన దృష్టి దాని మీద నుండి మరల్చుకోవాలి. మంచి అలవాట్లు జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తాయి. మంచి ఆరోగ్యానికి పునాది మంచి అలవాట్లే! పూర్వం బైటికి వెళ్లి ఇంటికి వస్తే, వచ్చిన వెంటనే కాళ్ళు, చేతులు కడుక్కుని లోపలికి వెళ్లేవారు. అంత శుభ్రత పాటించేవారు. ఆధునికత, జీవనశైలి అన్న పేరుతో ఇప్పుడు వీటిని వదిలేశాం. పాదరక్షలతోనే లోపలికి వెళ్లిపోతున్నాం. చేతులు కడుక్కోకుండానే భోజనం చేసేస్తున్నాం. వీటివల్ల అనారోగ్యాల పాలవుతున్నాం. ఇప్పుడు, ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో భయం కొద్దీ పూర్వపు పద్ధతులను ప్రతి ఒక్కరు అనుసరిస్తున్నారు. చేతులు పదే పదే కడుక్కోవడం, కూరగాయలు బజారు నుంచి తెచ్చిన వెంటనే శుభ్రంగా కడగటం వంటివి వంద శాతం చేస్తున్నారు. పూర్వపు శుచి శుభ్రతలకు పూర్ణంగా విలువనిచ్చి పాటిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. మంచి అలవాటు. ఈ క్లిష్ట పరిస్థితి పోయాక కూడ, ఇది ఒక స్థిరమైన అలవాటుగా ఎప్పటికి కొనసాగిస్తే, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అందరూ దోహదం చేసిన వారవుతారు. ఇటువంటి మంచి అలవాట్లను యువత అవసరార్థం నేర్చుకున్నా తదనంతరం కొనసాగించటం మంచిది. అలవాట్లు పరిశీలన ద్వారా వస్తాయి. మన ప్రస్తుత అలవాట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లే మనిషికి వ్యక్తిగత పెట్టుబడి. ఈ పెట్టుబడి శీలం, వ్యక్తిత్వం అనే లాభాలనిస్తుంది. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి. మనిషి మూడు అలవాట్లను తప్పక చేసుకోవాలని మేధావులు చెపుతారు. మొదటిది – డబ్బు సంపాదించటం. జీవన గమనం కోసం, ఆర్ధిక భద్రత కోసం డబ్బు చాలా అవసరం. రెండవది – ఎప్పుడూ తన ప్రవర్తనను తానే విశ్లేషించుకుంటూ, లోపాలను సరి దిద్దుకుంటూ ఆత్మ విమర్శ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. మూడవది – ఇష్టమైన రంగంలో సృజనాత్మకత పెంపొదించుకోవటం అలవాటు చేసుకోవాలి. రచయితలు, సంగీత, నృత్య కళాకారులు, క్రీడారంగ నిపుణులు నిరంతర సాధన చేస్తూనే ఉంటారు. పోటీలు ప్రదర్శనలు వున్నప్పుడే కాక ప్రతిరోజూ సాధన చేస్తూ ఉండటం వల్ల వారి విద్వత్తు మరింత ప్రకాశిస్తుంది. వృత్తినైపుణ్యాలు మెరుగవుతాయి. ప్రజ్ఞాపాటవాలు మరింతగా పరిఢవిల్లుతాయి. మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏదైనా అలవాటు కావటానికి 21రోజులు అవసరమంటారు. ఆ నిర్ణీత కాలంలో నిష్ఠతో ప్రయత్నించటం వల్ల అది అలవాటవుతుంది. దానిని నిలుపుకోవటానికి ప్రతి రోజు ఆ అలవాటును కొనసాగించవలసి ఉంటుంది. శరీరానికి, మనసుకు కూడ మంచి అలవాట్లను అలవాటు చేయాలి. మనసుకు ఎటువంటి క్లిష్ట, విషాద పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండటం అలవాటు చేయాలి. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ, చెడు, హానికరం అనిపించినవి వదిలేయటానికి ప్రయత్నిస్తూ, మంచి అలవాట్లను వదలకుండా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూండాలి. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యం వైపు నడిపించేవి అలవాట్లు. మంచి అలవాట్లే వ్యక్తిత్వానికి చిరునామా. అలవాట్లు పరిశీలన ద్వారా వస్తాయి. మన ప్రస్తుత అలవాట్లు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లే మనిషికి వ్యక్తిగత పెట్టుబడి. ఈ పెట్టుబడి శీలం, వ్యక్తిత్వం అనే లాభాలనిస్తుంది. ఎప్పటికప్పుడు అలవాట్లను సమీక్షించుకుంటూ ఉండాలి. –డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
సముద్రం ఇచ్చే సందేశం
భగవాన్ బుద్ధుణ్ణి‘సత్తాదేవ మనుస్సానం’ అంటారు. అంటే పండితులకూ, పామరులకూ శాస్త అని. శాస్త అంటే గురువు. ఆబాలగోపాలానికీ అర్థమయ్యేట్లు చెప్పగల దిట్ట, నేర్పరి. తాత్త్విక విషయాల్ని చెప్పేటప్పుడు సరైన ఉపమానాల్ని చూపి సులభంగా అర్థమయ్యేలా చెప్పగల మహా గురువు. మనిషి పరిపూర్ణతని చెప్తూ ఆయన సముద్రాన్ని ఉపమానంగా చెప్పిన తీరు అమోఘం. ఒకనాడు బుద్ధుడు శ్రావస్తి నగరానికి తూర్పుదిక్కున విశాఖమాత నిర్మించిన పూర్వారామం లో ఉన్నాడు. అప్పుడు పరిపూర్ణతని గురించి మౌద్గల్యాయనునితో చెప్తూ ‘మౌద్గల్యా’ సముద్రానికి ఎనిమిది ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి సాగరానికున్న అద్భుత గుణాలు, అవి మనిషికీ ఉండాలి’ అన్నాడు. ‘భగవాన్! అవేమిటో తెలియజేయండి’ అన్నాడు మౌద్గల్యుడు. ‘మౌద్గల్యా! వాటిలో మొదటిది: సముద్రంలో దిగుతున్నప్పుడు ఒకేసారి లోతు రాదు. క్రమేపీ దాని లోతు పెరుగుతూ ఉంటుంది. అలాగే మనిషి కూడా తన జ్ఞానాన్ని క్రమేపీ సాధించుకోవాలి. ఒక్కసారే వచ్చిపడాలి అనుకోకూడదు. నెమ్మదిగానే క్రమంలో జ్ఞానలోతులు చూడాలి. నేను చెప్పే జ్ఞానం కూడా అంతే! అది క్రమంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందిస్తుంది’ అన్నాడు. ‘భగవాన్ అద్భుతం’ అన్నాడు మౌద్గల్యాయనుడు. ‘అలాగే... సముద్రం ఎంత హోరుపెట్టినా, అలలు ఎగసి పడుతున్నా, ఎప్పుడూ అది తన చెలియలికట్ట దాటదు. మన మనస్సూ అలాంటి స్థితినే కలిగి ఉండాలి. నా ధర్మం అలాంటి స్థిర చిత్తాన్ని కలిగిస్తుంది. భిక్షూ! సముద్రాన్ని పరిశీలించు. అదెప్పుడూ తనలో చనిపోయిన జీవుల్ని, కుళ్ళిన శవాల్ని ఉంచుకోదు. ఒడ్డుకు నెట్టేస్తుంది. అలాగే... నా ధర్మం కూడా మనస్సులోని చెడు తలపుల్ని నెట్టేస్తుంది. మనం కూడా చెడ్డ ఆలోచనల్ని అలా నెట్టేయాలి. ఇక నాలుగో ప్రత్యేకత... నదులన్నీ సముద్రంలోకి చేరాక వాటి పేరూ, తీరూ, ఉనికీ కోల్పోతాయి. అన్నీ ఒకటే అయిపోతాయి. మనుషులు కూడా జాతి, మత, కుల ప్రాంతీయ భేదాలు మరచి ఒక్కటై పోవాలి. నా ధర్మం అలాంటి సమసమాజాన్ని నిర్మిస్తుంది. ‘‘ఓ భిక్షూ! ఎన్ని నదులు వచ్చి కలసినా, ఎంతెంత వర్ష కుంభవృష్టి కురిసినా సముద్రం రవ్వంత పెరగదు. మనలో ప్రజ్ఞ కూడా అలాగే ఉండాలి. నా ధర్మంలో ఎందరు నిర్వాణం పొందినా అది ఎప్పటికీ నిండిపోదు. నిర్వాణం పొందేవారికి ఎప్పుడూ అవకాశం ఉంటూనే ఉంటుంది. ఇక సముద్రానికి ఉన్న మరో విశేషం విను, ఎక్కడైనా సముద్రానికి ఒకే రుచి ఉంటుంది. అలాగే నా ధర్మంతో కలిగే ధర్మరుచి కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. మౌద్గల్యా! మణులకూ, రత్నాలకూ, పగడాలకూ, శంఖులకూ సముద్రం నిలయం. ప్రతి మనిషీ అలాంటి సుగుణాల్ని తనలో నింపుకోవాలి. నా ధర్మంలోని పంచశీల, అష్టాంగ మార్గం దశపారమితులు, ఆర్యసత్యాలు అలాంటి మణులే! ఇక సముద్రానికున్న మరో విశేషగుణం– దాపరికం లేని తత్వం. మన మనస్సు అలాగే ఉండాలి. దాపరికం ఉన్నవాడు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. దాపరికం లేనివాడు తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటాడు. నా ధర్మం కూడా మనిషిని, మనస్సుని అలా నిష్కల్మషం చేస్తుంది. ఈ ఎనిమిది విశేషణాల్ని మనం సముద్రంనుండి నేర్చుకోవాలి. మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలి. మౌద్గల్యాయనా!’’ అన్నాడు బుద్ధుడు. ‘‘అద్భుతం, అమోషం, అద్వితీయం... భంతే!’’ అంటూ మౌద్గల్యాయనుడు బుద్ధునికి ప్రణమిల్లాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
Buddha Purnima 2021: మొక్కవోని ధైర్యం... సుఖజీవన సోపానం
వైశాలిని ఒక సంవత్సరం కరువు కాటకాలు కాటేశాయి. వర్షాభావం ఏర్పడింది. మంచినీటి తావులన్నీ తరిగిపోయి మురికి గుంటలయ్యాయి. ఆ నీటినే తాగడం వల్ల ప్రజలకు అంటువ్యాధులు సోకాయి. కలరా విజృంభించింది. వేలాది మరణాలు సంభవించాయి. వైశాలి రాజ్యవీధులు శ్మశానాలయ్యాయి. శవాలను తీసేవారే లేరు. శవాలు కుళ్లిపోయి నగరమంతా దుర్గంధం వ్యాపించింది. కొత్త కొత్త రోగాలు వచ్చిపడ్డాయి. ప్రజలు గడపదాటి రావడానికే భయపడ్డారు. వైశాలి రాజకుటుంబీకులు కూడా అంతఃపురాలకే పరిమితం అయ్యారు. ప్రజలని పట్టించుకునే వారే లేరు. దీంతో దొంగల బెడద పెరిగింది. ఆ సమయంలో బుద్ధుడు మగధ రాజధాని రాజగృహ నగరంలో ఉన్నాడు. ఎవరో బాటసారులు బుద్ధునితో వైశాలి ప్రజల బాధలు చెప్పారు. ఆ రోజుల్లో జీవకుని లాంటి బౌద్ధులు పద్ధెనిమిది రకాల వైద్యవిధానాలతో వైద్యం అందించేవారు. బుద్ధుడు వెంటనే ఐదువందల మంది భిక్షువుల్ని వెంట తీసుకుని వైశాలికి వెళ్లాడు. ఆ రోజుల్లో ఆకాశమంతా కారుమబ్బులు కమ్మి, కుంభవృష్ఠి పడింది. ఆ నీటి ప్రవాహంలో కొన్ని కళేబరాలు కొట్టుకుని పోయాయి. బుద్ధుడు తన భిక్షుసంఘంతో కలసి వీధులు శుభ్రం చేశాడు. మిగిలిన కళేబరాల్ని పొలిమేరలకు తరలించాడు. జీవకుడు మరికొందరు వైద్యులు అందించిన ఔషధాల్ని ప్రజలకు అందించారు. ఆ పరిసరాలలో దొరికిన మొక్కల నుండి రకరకాల ఔషధాల్ని తయారు చేస్తూ, నిరంతరం ప్రజలకి అందించారు. ‘బుద్ధుడే తన సంఘంతో వచ్చి తమకు సేవ చేస్తుంటే తామెందుకు ఇళ్లలో కూర్చోవాలి’ అని ఆలోచించి కొందరు ప్రజలు వచ్చి సహకరించారు. బుద్ధుడు నగరంలో రాజు అంతఃపురానికి వెళ్లి–‘‘రాజా! మీరే ఇలా భయపడి దాక్కుంటే ఎలా? మీరు మీ మంత్రులు, ఉద్యోగులు వెంటనే వీధుల్లోకి వెళ్లండి. ప్రజల్ని కలవండి. ధైర్యం చెప్పండి. అంటురోగం కంటె భయం చేసే కీడే ఎక్కువ. ఇలాంటి విపత్కర పరిస్థితులల్లో మనిషికి మనిషే తోడు. ఈ విషయంలో మీరు అడవిలో ఉన్న ఆటవికుల నుండి ఎంతో నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ద్వేషాలన్నీ పక్కనపెట్టి శత్రుత్వాన్ని చెరిపేసుకుని, ఒక్కటిగా కలసి ఎదుర్కొంటారు. అందరూ కలసి ఉంటే అంతకుమించిన బలం ఏముంది? ప్రతి వ్యక్తి ధైర్యంగా... తనకు సంఘం అండగా ఉందనే భావనతో భయరహితుడై బతికేస్తాడు. కాబట్టి రాజా! మీరు కదలండి! ప్రజలకు కావలసిన సపర్యలు చేయండి! ఔషధాలు అందించండి’’అని చెప్పిన వెంటనే రాజు తన ఉద్యోగ పరివారంతో కదలి వచ్చాడు. అటు తరువాత కాలంలోనే వైశాలి అంటురోగాలనుండి బయట పడింది. అప్పటివరకు బుద్ధుడు వైశాలిలోనే ఉండిపోయాడు. జీవకారుణ్యం, పర్యావరణం, సంఘ ఐక్యత, మొక్కవోని ధైర్యం... సుఖజీవనానికి సోపానాలు అని చెప్పిన ఈ బుద్ధవాణి ఈ విపత్కర పరిస్థితుల్లో మనకు హృదయ వాణి కావాలి! – డా. బొర్రా గోవర్ధన్ -
అక్షయ తృతీయ విశిష్టత ఏమిటో తెలుసా?
అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ. దీనిని సద్వినియోగం చేసుకుని అనంతమైన పుణ్యఫలాలు అందుకోవాలని అందరూ ఆకాంక్షిస్తారు. అక్షయ అంటే తరిగిపోనటువంటిది. నేడు చేసే పుణ్యకార్యాల ఫలం అక్షయం చేస్తూ తరగిపోకుండా చేయమని చేసే వ్రతమే అక్షయ తృతీయ వ్రతం. ఈ రోజు చేసే దేవతా ప్రీతి కర్మలు, జపదాన, హోమాలు క్షయం కానంత మంచి ఫలితాన్నిస్తాయి. ఈ రోజు చేసే దానాలు అనుష్టానపరులకు, యోగ్యులకు చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడని శాస్త్ర వచనం. మనలో జీవుడు మరొక శరీరంలో ప్రవేశించిన తరువాత కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా అక్ష్జమై సంపదలు కలుగచేసేదే ఈ పండుగ. సంకల్ప సహిత సముద్రస్నానం విశేష ఫలితాన్నిస్తుంది. నక్త వ్రతం, ఏక భుక్తం విశేషం. ఈ రోజు పరశురామ జయంతిగా కూడా కొలుస్తారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారం కావాలనుకునేవారు ‘పరశురామ స్తుతి’ ఈ రోజునుంచి మండల కాలం పారాయణ చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. రోజంతా ఉపవసించి రాత్రి సమయంలో స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మీ స్తోత్రం మొదలైనవి పారాయణ చేసినట్లయితే సౌభాగ్యవంతులై వారి కుటుంబాలు సుఖసంతోషాలతో వర్థిల్లుతాయి. ఈ రోజున చల్లని పానీయాలైన నారికేళం, తేనె, చెరకు రసం, గోక్షీరం మొదలైన వాటితో అభిషేకం చేసి, వాటిని గృహమంతా చిలకరించినట్లయితే క్షేమ సౌభాగ్యాలతో, శాంతిప్రదంగా జీవించగలుగుతారు. జాతక చక్రంలో పితృదోషం ఉంటే, దాని నివారణకు పరమ పవిత్రమైన పుణ్యదినం అక్షయతృతీయ. మన కంటికి కనిపించే గ్రహాలు సూర్యుడు, చంద్రుడు. సకల పితృదేవతలను సూర్యభగవానునిలో దర్శించవచ్చును. అక్షయ తృతీయ శుభకాలంలో పితృదేవతలను తలచుకుంటూ అన్నం, నెయ్యి, పప్పు కలిపిన చిన్న ముద్దలను ఎండు కొబ్బరిలో నిక్షిప్తం చేసి ఆహుతి చేసినట్లయితే వంశపారంపర్యంగా శుభఫలితాలు పొందవచ్చునని జ్యోతిష పండితులు చెబుతారు. అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువుకి చందనం సమర్పిస్తే విశ్వమంతా చల్లగా సుభిక్షంగా వుంటుంది. దేవాలయాలలో ధవళ వర్ణానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ధవళ పీత వస్త్రాలతో విగ్రహాలంకారాలు చేస్తారు. ఈ రోజు చేసే ఏ దానానికైనా అక్షయ ఫలితం ఉంటుంది. మనం చేసే దాన ఫలితం మన తరువాత తరాలు కూడా అనుభవించ వచ్చును అనే నమ్మకం. కొన్ని ముఖ్యమైన దానాలు తెలుసుకుందాం 1. స్వయం పాకం – బియ్యం, కందిపప్పు, రెండు కూరలు, చింతపండు, మిరపకాయలు, పెరుగు, నెయ్యి, తాంబూలంతో సహా దానమిస్తే అన్నానికి లోటు ఉండదు అని భావిస్తారు. 2. వస్త్రదానం– ఎర్రని అంచు కలిగిన పంచెల చాపు, కండువా తాంబూలంతో దానమిస్తే వస్త్రాలకు లోటుండదు. 3. ఉదక దానం – కుండ నిండుగా మంచి నీటిని నింపి దానం చేస్తే ఉత్తర కర్మ ద్వారా పరలోక యాత్రకు సహకరించే చక్కని సంతానం కలుగుతుంది. ఉత్తమ గతులు సంప్రాప్తించటానికి ఇది ఎంతో సహకరిస్తుంది. ఈ రోజు సింహాచల నరసింహుని చందనోత్సవం జరుగుతుంది. సంవత్సర కాలమంతా చందనం పూతలో సేదదీరే స్వామి తన నిజ స్వరూపాన్ని భక్తులకు చూపి కనువిందు చేస్తాడు. స్వామి వారిది ఉగ్రరూపం కావటం వలన, వారికి శాంతి కలుగుటకై చందనాన్ని ఆయనపై లేపనం గా పూస్తారు. ఈ రోజు లక్షలాది భక్తులు స్వామి వారి నిజస్వరూపాన్ని చూడటానికి అన్ని రాష్ట్రాలనుండి తరలి వస్తారు. ఈ ఆచార వ్యవహారాలు మరుగున పడిపోయి, నేడు బంగారం కొనుగోలుకు మాత్రమే పరిమితమౌతోంది. శ్రీ పార్వతీ పరమేశ్వరులను, శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి, శక్తి మేరకు దానధర్మాదులు ఆచరించి ఉత్తమ గతులు పొందుదాం. మన తోటివారిని కూడా సుఖసంతోషాలతో జీవించేలా సహకరిద్దాం. (నేడు అక్షయ తదియ) –డా. దేవులపల్లి పద్మజ -
కాయకమే కైలాసం... శ్రమయే శివనిలయం
కర్ణాటకలోని హింగులేశ్వర బాగేవాడి అగ్రహారంలో 1134వ సంవత్సరం వైశాఖ శుద్ధతదియ (అక్షయ తతీయ) రోజున మండెన మాదిరాజు, మాతాంబిక దంపతులకు బసవేశ్వరుడు జన్మించాడు. ఈయన వీరశైవ సంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప భక్తుడు. ఆయనకు భక్తి బండారి అనే మరొక పేరు కూడా ఉంది. ఆయన గొప్ప సంఘసంస్కర్త. కులతత్వ నిర్మూలన, స్త్రీ పురుష సమానత్వం మొదలైన నూతన సంప్రదాయ యుగానికి ఆయన నాంది పలికాడు. బసవన్న రాసిన నాలుగు లక్షలకు పైబడిన వచనాలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోగా నేడు కొన్ని మాత్రం ప్రజలనాల్కలపై ఆడుతూ సజీవంగా నిలిచి ఉన్నాయి. సమాజంలోని అన్ని వర్గాలప్రజలూ దైవంతో వారికున్న అనుభవాల్ని పంచుకోవడానికి అల్లమప్రభువులవారి అధ్యక్షతన అనుభవమండపాన్ని ఏర్పరచారు. తన ఆరాధ్యదైవమైన కూడలసంగమేశ్వరుడే తన వచనాలకు మకుటంగా మార్చుకుని కీర్తించాడు. ఆ వచనాలు రాసి కొన్ని శతాబ్దాలు దాటినా నేటికీ నిత్యనూతనం. దయలేని ధర్మమదేవిటయ్యా దయయే కావాలి ప్రాణులన్నిటిలో దయయే ధర్మం మూలమయ్యా కూడలసంగముని వంటీ దైవం లేదయ్యా సిగ్గొదిలి అన్యులను యాచించకుండా మతిచెడి పరులను పొగడకుండా పరసతులపై మనసు పడకుండా శివపథభక్తుల పాదాలు విడువకుండా వేరుమార్గంలో నా నడక సాగకుండా నన్ను నడిపించు కూడలసంగమదేవా ఉన్నవాళ్లు గుళ్లు గోపురాలు కట్టిస్తారు లేనివాణ్ణి నేనేమి చెయ్యాలి? నా కాళ్లే స్తంభాలు కాయమే కోవెల శిరసే బంగారు శిఖరం కూడలసంగమదేవా! విను చెడితే స్థావరం చెడుతుంది గాని జంగమం చెక్కు చెదరదు దొంగిలించకు చంపకు అబద్ధం పలుకకు కోపగించుకోకు అన్యులను ఏవగించుకోకు నీ గురించి పొగుడుకోకు ఎదుటి వ్యక్తిని నిందించకు ఇదే అంతరంగ శుద్ధి ఇదే బహిరంగ శుద్ధి ఇదే మా కూడలసంగమదేవుని మెప్పించే పద్ధతి దేవలోకం మర్త్యలోకం వేరే వేరే లేవు సత్యాన్ని పలికేదే దేవలోకం అసత్యాన్ని పలికేదే మర్త్యలోకం ఆచారమే స్వర్గం అనాచారమే నరకం కూడలసంగమదేవా –కె.వి.ఎస్. బ్రహ్మాచార్య, శాస్త్ర ప్రవీణ -
రమజాన్ పవిత్ర మాసం: చివరి రోజుల సదాచరణలు
పవిత్ర రమజాన్ చివరి దినాల్లో ఆచరించవలసిన ఆరాధనల్లో షబేఖద్ర్ బేసిరాత్రుల జాగరణ, ఏతెకాఫ్, ఫిత్రా ప్రధానమైనవి. చివరి బేసిరాత్రుల్లో విరివిగా ఆరాధనలు చేసి షబేఖద్ర్ ను పొందే ప్రయత్నం చేయాలి. ఈ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యి నెలలకన్నా శ్రేష్ఠమని పవిత్ర ఖురాన్ చెబుతోంది. అంటే షుమారు 83 సంవత్సరాల 4 నెలల ఆరాధన కన్నా అధికమన్నమాట. మానవుడి సగటు జీవితకాలంకన్నా ఎక్కువ. అలాగే ఏతెకాఫ్ కూడా చాలాగొప్ప ఆరాధనే. చివరి పదిరోజులు మసీదులోనే ఒక పక్కన చిన్న పరదా ఏర్పాటు చేసుకొని ఏకాంతంగా దైవారాధనలో గడపాలి. నమాజులు, జిక్ర్, దైవనామ స్మరణ, పవిత్ర గ్రంథ పారాయణం, హదీసు గ్రధాలు తదితరధార్మిక ఆచరణలు తప్ప, ఏవిధమైన ప్రాపంచిక కార్యకలాపాలు చేయకూడదు. మానవ సహజ అవసరాలకు తప్ప మసీదునుండి బయటికి వెళ్ళకూడదు. ఏతెకాఫ్ ద్వారా దైవంతో బంధం పటిష్టమవుతుంది. దైవప్రేమ, దేవుని సామీప్యత ప్రాప్తమవుతుంది. అలాగే ఈరోజుల్లో ఫిత్రాలు కూడా చెల్లించాలి. ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్ర్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధార్మిక పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ నెలలో విధిగా చెల్లించవలసిన దానం అన్నమాట. రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుండే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త (స) ఆదేశించారు. ఫిత్రా దానంగా ఒక ‘సా’ అంటే పావుతక్కువ రెండు శేర్లు ఆహార దినుసులు పేదసాదలకు ఇవ్వాలి. మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఏ రూపంలో ఐనా ఇవ్వవచ్చు. ఫిత్రాలవల్ల రెండురకాల లాభాలున్నాయి. ఒకటి–రోజాలను ఎంత నిష్టగా పాటించినా, మానవ సహజ బలహీనత వల్ల ఏవో చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి పరిహారంగా ఈ ఫిత్రాలు ఉపయోగపడతాయి. వీటివల్ల రోజాలు పవిత్రతను, పరిపూర్ణతను సంతరించుకొని స్వీకారభాగ్యానికి నోచుకుంటాయి.రెండు– ఫిత్రాలవల్ల సమాజంలోని పేద , బలహీనవర్గాలకు కాస్తంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారుకూడా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోగలుగుతారు. ఈకారణంగానే ప్రవక్తమహనీయులు ఫిత్రాదానాన్ని,‘నిరుపేదల భృతి ’ అన్నారు. అందుకే ఫిత్రాను ఉపవాసులకే పరిమితం చేయకుండా, పరిధిని విస్తరించారు. ఉపవాసం ఉన్నా లేకపోయినా అందరూ ఫిత్రా చెల్లించాలని చెప్పారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే, అంతమంది తరఫున కుటుంబ యజమాని ఫిత్రా చెల్లించాలి. పండుగ కంటే ముందు జన్మించిన శిశువు తరఫున కూడా తల్లిదండ్రులు ఫిత్రా చెల్లించాలి. పండుగ కంటే ముందే ఈ బాధ్యత నెరవేర్చుకోవాలి. ముందు చెల్లిస్తే లబ్ధిదారులు పండుగ సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. పండుగ సంతోషంలో అందరినీ భాగస్వాములను చేయడమే అసలు ఉద్దేశ్యం. అల్లాహ్ అందరికీ రమజాన్ చివరి దశకాన్ని సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మనకు తెలియకుండానే... మన మనసుల్ని దోచేస్తారు
నృత్యం చేసేవారు ఒక ధ్యానముద్రలో ఉంటారు. ధ్యానంలో కదిలిపోతే ఏకాగ్రత పోతుంది. సన్నివేశాలనుబట్టి వారు ఆయా పాత్రలలో ఒదిగిపోతారు. అలా కాకపోతే సభ రంజకత్వాన్ని పొందదు. కారణ జన్మురాలు, నటరాజు అనుగ్రహం పొందిన వ్యక్తి శోభానాయుడుగారు. పద్మావతీ కళ్యాణం–నృత్య రూపకంలో శ్రీమహావిష్ణువుతో పాచికలాడే సన్నివేశం. ఇలా పాచికలు వేసినట్లు, పందెం పడినట్లు, వేంకటేశ్వరుడు గెలిచినట్లు, ఈవిడకు కోపం వచ్చి అలిగినట్లు, బుంగమూతి తిప్పినట్లు, మెటికలు విరిచినట్లు, గెలిచావులే పెద్ద..అని అలిగి పాచికలను తోసేసినట్లు...అప్పుడావిడ ముమ్మూర్తులా పద్మావతే...ఎక్కడా శోభానాయుడు గారు కనబడరు. అలా పాత్రలోకి ఒదిగిపోతారు. బ్రహ్మజ్ఞాని సాయిబాబాలాగా నర్తిస్తారావిడ. చిన్నపిల్లలతో గోళీలాడే సన్నివేశాన్ని నృత్య భంగిమల్లో ఆమె చూపుతుంటే...ఒక బ్రహ్మజ్ఞానిని చూస్తున్న అనుభూతి పొందుతాం. బాలరాముడి దగ్గర్నుంచీ రామాయణాన్ని ప్రదర్శిస్తారు. అది ఆవిడకు నటరాజు అనుగ్రహం కాకపోతే మరేమిటి...మనకు ఒక కృష్ణుడు కనపడతాడు, ఒక పద్మావతి కనబడుతుంది, ఒక సాయిబాబా...అలా ఏ పాత్ర వేస్తే ఆ పాత్రలే మన ముందు నిలబడతాయి. నృత్యానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే... వాద్యం, ఆట, ఆంగికం, లాస్యం..ఇవన్నీ కలిసి మన మనసుల్ని మన ప్రమేయం లేకుండానే లాక్కుంటాయి, భగవత్ తత్త్వాన్ని ఆవిష్కరిస్తాయి. నటరాజ రామకృష్ణ గారి పేరిణి శివతాండవమే చూడండి. ఓరుగల్లులోని రామప్ప గుడికి చెందిన పేరిణి శివతాండవం ప్రక్రియ మీద విశేషమైన పరిశోధన చేసి మరుగున పడిన ఆ కళారూపాన్ని మనకు సజీవంగా అందించారు. ఒకప్పుడు కాకతీయులు యుద్ధానికి వెళ్ళే సందర్భంలో వారిలో స్ఫూర్తి నింపడానికి... మృదంగాలు మోగిస్తూ ఆ తాండవం చేస్తుంటే... మంచాన ఉన్నవాడు కూడా లేచి కత్తిపట్టుకుని యుద్ధానికి బయల్దేరేటంత ఆవేశాన్ని, ఉద్రేకాన్ని నింపేదట. దానికి ఆయన జీవం పోసారు. ఒక మహాశివరాత్రినాడు ఆయన ప్రదర్శనను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పదివేలమంది వస్తారనుకుని దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేసారు. చివరకు ఇసకేస్తే రాలనంతగా జనం వచ్చి చుట్టూ రోడ్లన్నీ నిండి రాకపోకలు స్తంభించి పోతే.... విధిలేని పరిస్థితుల్లో నిర్వాహకుల కోరిక మేరకు ఆయన దానిని ఆపకుండా తెల్లవారే దాకా కొనసాగించాల్సి వచ్చింది. నాలుగు చీరలు కట్టి, అవతలివైపు టేబుల్ ఫ్యాన్లు పెట్టి..అవి గాలికి ఊగుతుంటే..వెనుక సముద్ర ఘోష శబ్దాన్ని వినిపిస్తూ ‘ఆంధ్రజాలరి’ నృత్యరూపకం ప్రదర్శిస్తుంటే...ప్రేక్షకులకు సంపత్ కుమార్ కళాకారుల బృందం ఎక్కడా కనిపించదు. నడిసముద్రంలో చేపల వేటకు వెళ్ళిన ఒక జాలరి తన జీవికకోసం పడుతున్న పాట్లను చూస్తూ గుండెలు బరువెక్కుతాయి. చిదంబర క్షేత్రం లో పరమ శివుడు, కాళికాదేవి పోటీపడి నృత్యం చేస్తుంటారు. అయ్యవారు ఎన్ని విన్యాసాలు చేసినా అమ్మ అవలీలగా చేసి పైచేయిగా ఉండడంతో శివుడు... నృత్యం చేస్తూ చేస్తూ వచ్చి అక్కడ ఉన్న కుంకుమ భరిణలో కాలి బొటనవేలు ముంచి దానితో అమ్మవారి నుదుటున బొట్టు పెడతాడు. అమ్మ సిగ్గుతో ఆ పని చేయలేక నిలబడిపోతుంది.. అలా చిదంబరంలో నటరాజ పదవి శివుడికి దక్కిందని చూపే సన్నివేశం చూపరులను గగుర్పొడుస్తుంది. కారణం వారు కళ్ళప్పగించి చూసింది ఆదిదంపతుల నాట్యాన్నే కానీ, కళాకారుల ప్రదర్శనను కాదు. అదీ భారతీయ కళల వైభవం. వీరంతా జాతి రత్నాలు, ప్రాతఃస్మరణీయులు. మన యువతరం వాళ్ళగురించి తెలుసుకోవాలి. వారి మార్గాన్ని అనుసరించాలి. మళ్ళీ ఆ వారసత్వం, ఆ సంస్కృతి ఆగిపోకుండా కొనసాగడానికి కావలసిన సాధన, క్రమశిక్షణతో చేయాలి. లేకపోతే కొన్నాళ్ళకు అవి పుస్తకాలకే పరిమితమయిపోతాయి. అటువంటి ప్రదర్శనలను ఇచ్చేవారుండరు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: అజ్ఞాత బానిస అపూర్వ పరిచర్య -
అజ్ఞాత బానిస అపూర్వ పరిచర్య
సిరియా మహా సైన్యాధిపతి, ధీరుడు, యోధుడు, ధనికుడైన నయమానుకు కుష్టురోగం సోకింది. ఆ రోజుల్లో కుష్టువ్యాధి సోకితే ఎంతటివారైనా సమాజ బహిష్కరణకు గురై జీవచ్ఛవాలవాల్సిందే!! అయితే నయమాను ఇంట్లోనే విశ్వాసి అయిన ఒక యూదుబాలిక బానిసగా ఉంది. ఆమె నయమానుకు ఎడారిలో సెలయేటి వంటి చల్లటి కబురు చెప్పింది. తన ఇశ్రాయేలు దేశంలోని ఎలీషా ప్రవక్త ఎంతటి కుష్టువ్యాధినైనా దేవుని పేరిట బాగుచేస్తాడని ఆమె చెబితే, నయమాను ఎలీషా వద్దకు వెళ్ళాడు. ఎలీషా చెప్పినట్టు అక్కడి యొర్దాను నదిలో ఏడుసార్లు మునిగి ఆమె చెప్పినట్టే నయమాను క్షణాల్లో బాగయ్యాడు. నయమాను అత్యానందపడి బోలెడు కానుకలివ్వబోతే ‘నేను నీ వద్ద ఏమీ తీసుకోను’ అని ఎలీషా అతనికి కరాఖండిగా చెప్పి వెనక్కి పంపేశాడు. సిరియా దేశంలో ఎన్నో గొప్ప నదులుంటే, నేను యొర్దాను లాంటి చిన్న నదిలో మునగాలా? అంటూ ఆరంభంలో నయమాను మొండికేస్తే, ఆ బాలికే అతనికి నచ్చజెప్పి యొర్దానులో మునిగేలా చేసింది. కుష్ఠునే కాదు, అంతకన్నా భయంకరమైన అహంకారమనే అతని మరో రోగాన్ని కూడా అలా ఎలీషా అతని కానుకలు నిరాకరించి బాగుచేశాడు. దేవుడు ప్రలోభాలకు లొంగడని, ఆయన తన కృపను, ఈవులను మానవాళికి ఉచితంగా ప్రసాదించే ‘మహాదాత’ అని, తాను కేవలం దేవుని కృపతోనే బాగయ్యానని గ్రహించి, నయమాను వినమ్రుడై తన దేశానికి తిరిగి వెళ్ళాడు (2రాజులు 5: 1–27). ఎన్నేళ్లు బతికి, ఎంత సేవ చేశామని కాదు, చేసిన కొంచెమైనా ఎంత అద్భుతంగా చేశామన్నదే ప్రాముఖ్యం. అందుకే దేవుని సంకల్పాలు నెరవేర్చే వెయ్యేళ్ళ జీవితం కూడా చాలా చిన్నదిగా కనిపించాలన్నాడు ఒక మహాభక్తుడు. అద్భుతమైన ఈ నయమాను ఉదంతంలో ముఖ్యపాత్ర అనామకురాలైన యూదుబానిస యువతిదే!! నేనొక బానిసను, ఇది నా పని కాదు, పైగా నాకేం లాభం? అని ఆమె అనుకుంటే అసలీ అద్భుతమే లేదు. ఒక వ్యక్తి దాహంతో అలమటిస్తున్నాడు, అతని దాహం తీర్చే నీళ్లెక్కడున్నాయో ఆమెకు తెలుసు. పైగా అది దేవుని శక్తిని రుజువుచేసే అపూర్వమైన అవకాశం. వెంటనే ఆమె తనవంతు పరిచర్య చేసి పక్కకు తప్పుకుంది, అజ్ఞాతంగానే ఉండిపోయింది. వేల మైళ్ళ పొడవుండే హైవే తో పోల్చితే ఒక చిన్న మైలురాయి ఎంత? కానీ దాని ప్రత్యేకత దానిదే!! ఇందులో నాకెంత లాభం? అని ఆలోచించకుండా మైలు రాయి తనపని తాను చేసుకొంటుంది. దాహంతో అలమటించే బాటసారికి, ప్రతిఫలాపేక్షలేకుండా నీళ్లిచ్చే పనే నిజమైన సువార్త పని. యేసుప్రభువు తన శిష్యులకు, పరిచారకులకు తన పేరిట అద్భుతాలు చేయమని ఆదేశించాడు. కానీ మీరు అదంతా ‘ఉచితంగా మాత్రమే చెయ్యండి’ అని కూడా అదే వచనంలో ఆదేశించాడు (మత్తయి 10:8). మరి మేమెలా బతకాలి? అంటారా, బతకడానికే అయితే కూలిపని చెయ్యొచ్చు, కలెక్టర్ పనైనా చెయ్యొచ్చు. ‘నేను మీకు అదనంగా సంచిని, జాలెను, చెప్పుల్ని ఇవ్వకుండా పరిచర్య కు పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా?’ అని యేసు ఒకసారి తన శిష్యుల్ని అడిగితే, లేదని వాళ్ళు జవాబిచ్చారు(లూకా 22:35). అంటే, ఏమీ తక్కువకాని జీవితాన్ని దేవుడిస్తాడు. కాని అన్నీ ఎక్కువగా ఉండే జీవితం కావాలనుకునే పరిచారకులే గేహాజీ లాగా (ఈ ఉదంతంలో మరో పాత్ర) ప్రలోభాలకు గురై భ్రష్టులవుతారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఏడేళ్ల వసపిట్ట... శ్లోకాల పుట్ట
జామి: సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయే పిల్లలున్న ఈ సమాజంలో ఓ ఏడేళ్ల చిన్నారి రామాయణ ,మహాభారతం గ్రంథాల్లో, భగవద్గీతలో పట్టుసాధించడమే కాకుండా, యోగ విద్యలో చక్కని ప్రతిభ కనబరుస్తోంది. వివరాల్లోకి వెళితే...జామి మండలం విజినిగిరి గ్రామానికి చెందిన కొవ్వాడ శ్రీను, అరుణ దంపతులకు చెందిన ఏడేళ్ల కుమార్తె గౌరి. ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఆ బాలిక తండ్రి భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు, తల్లి అరుణ ప్రైవేట్ పాఠశాలలో యోగా అధ్యాపకురాలిగా పని చేయడమే కాకుండా వారిద్దరూ ఉచితంగా యోగాపై శిక్షణ ఇస్తుంటారు. వారిది మొదటి నుంచీ ఆధ్యాత్మిక చింతన ఉన్న కుటుంబం కావడంతో చిన్నారి అరుణకు కూడా భక్తిభావం వైపు దృష్టి మళ్లింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో యోగాసనాలు, రామాయణ, మహా భారత గ్రంథాలపై మక్కువతోపాటు, భగవద్గీత శ్లోకాలు 700 వరకూ అలవోకగా గుక్క తిప్పకుండా పఠిస్తోంది. మూడో సంవత్సరం నుంచే ఈ శ్లోకాలు పఠిస్తుందేండేదని, కరోనా సమయంలో గత ఏడాదిగా మరిన్ని శ్లోకాలు కంఠతా చేసి మరింత పట్టు సాధించడమే కాకుండా... పలు ఆసనాలను సునాయాశంగా వేస్తుందని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ చిచ్చర పిడుగు ప్రతిభను గుర్తించి పలు న్యూస్ చానల్స్ ప్రసారం చేశాయి. చదవండి: భర్తను భయపెట్టాలని.. ప్రాణం పోగొట్టుకుంది అవినీతి ఖాకీ ‘సెల్ఫీ బాణం’ -
ప్రశాంత జీవితాన్ని గడపాలంటే ఏం చేయాలి?
అభయం, చిత్తశుద్ధి, జ్ఞానయోగంలో నెలకొనడం,దానం, దమం,యజ్ఞం,వేదాధ్యయనం, తపస్సు, సరళత్వం, అహింస, క్రోధరాహిత్యం, త్యాగం, శాంతి, చాడీలుచెప్పకపోవడం, సర్వప్రాణుల యందు దయ కలిగిఉండడం,విషయ. వాంఛలు లేకపోవడం, మృదుత్వం, బిడియం, చపలత్వం లేకపోవడం, ద్రోహబుద్ధి, దురభి మానం లేకుండడం, తేజస్సు, క్షమాగుణం, శుచిత్వం మొదలైన సద్గుణాలు. దైవీ సంపత్తితో మూర్తీభవించి ఉంటాయి అని శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడికి చెప్పేడు. ఈ సద్గుణాలు కేవలం అర్జునునకో లేక ద్వాపర యుగానికో పరిమితమైనవి కావు. ఈ సమస్త విశ్వంలో మానవజాతి ఉన్నంత వరకు సర్వులకు అవసరమే. ఎన్ని అధునాతన సాధన సంపత్తి వున్నా మానవుడు ప్రశాంత జీవితాన్ని గడప లేక పోతున్నాడు. ఎటు చూసినా హింస, క్రౌర్యం, అసంతృప్తి పెచ్చు పెరుగుతున్నాయి. మానవతా విలువలు లేని వ్యక్తి అభివృద్ధి చెందడం అసాధ్యం. ఆత్మ నిగ్రహం లేని వాడు ఉన్నతమైన జీవితాన్ని పొందలేడు. క్షణభంగురమైన ఇంద్రియ సుఖాల కోసం పరుగులు తీస్తూ తన పతనానికి తానే కారణమౌతున్నాడు. మనిషి జీవిత ధ్యేయం ఇంద్రియసుఖానుభవం కాదు. ఇంద్రియాలను ఎప్పటికీ తృప్తి పరచలేము. అగ్నిలో ఆజ్యం పోసినట్లు సుఖాలు అనుభవించే కొద్ది మరిన్ని కోరికల పుడతాయి. కాని మనిషి తృప్తి చెందడు. మానవ జీవితానికి ఉన్నతమైన లక్ష్యం ఉండాలి. అలా కాని పక్షంలో మానవుడు సర్వావస్థలయందు అసంతృప్తి కలిగే ఉంటాడు. మనిషిలో జ్ఞాన కాంక్ష పెరిగే కొద్దీ అతడు ఉన్నతంగా తీర్చబడతాడు. మన ఆలోచనా రీతిని బట్టే మన ఆచరణ ఉంటుంది. ఇతరులను సంతోషపెట్టినప్పుడే మనిషికి నిజమైన శాంతి.'పరోపకారః పుణ్యయ పాపాయ పరపీడనం' ఎదుటి వాడికి ఉపరకారం చేయడం పుణ్యం అపకారం చేయడం పాపమని మన సనాతన ధర్మం నొక్కి వక్కా ణించింది. అనభిధ్య పరస్వేషు, సర్వ సత్త్వేషు హృదయం । కర్మ ణాం ఫలమస్తీత మనసా త్రితయంచరేత్ ॥ పరుల సొత్తుపై ఆశ లేకుండా ఉండడం, సర్వజీవులయందును కరుణ, కర్మకు ఫలితం ఉండి తీరుతుందనే భావం ఈ మూడింటినీ మనస్సులో ఉంచుకొని ప్రవర్తించాలని మనుస్మృతి చెబుతుంది. -గుమ్మా ప్రసాద రావు -
కాంతి పుంజం ప్రభాత కిరణం
బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం ఇచ్చే సంతృప్తితో కాలాన్ని గడపాలని కోరుకుంటాడు. ఓటమి అంగీకరించడం మనిషికి మింగుడు పడని వ్యవహారం. ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో... ఇంకా మరెన్నో. ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే మనిషి ఇంత సంతోషంగా ఉంటే.. ప్రతి మనిషికీ ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే... ఇంకెంత ఆనందం! సరిగ్గా రెండువేల సంవత్సరాల క్రితం అదే జరిగింది. మనిషి మెడలు వంచిన మరణానికే మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరిని తన గుప్పిట్లో బంధించిన మరణం ‘మరణించింది’. అసలు ఈ పుట్టుకకు, మరణానికి దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికీ అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. క్రీ.శ 1799లో కాన్రాడ్ రీడ్ అనే యువకుడు తన ఇంటికి దగ్గరలో ఉన్న చెరువుకు చేపలు పట్టడానికి వెళ్ళాడు. చాలాసేపు ప్రయత్నించినా ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడు. నిరుత్సాహంతో తిరుగు ప్రయాణమైన అతనికి ఒక నల్లటి రాయి దొరికింది. బరువు సుమారుగా పది కేజీలు ఉంది. ఇంటికి తీసుకెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరకు ఇంటికి తీసుకువచ్చాడు. కొంచెం పాతగా ఉన్న తన ఇంటిలో ఒక తలుపు మాటిమాటికి పడిపోతూ ఉంది. తనకు దొరికిన నల్లటి రాయిని డోర్‌స్టాప్‌గా ఉపయోగించాడు. మూడు సంవత్సరాలు గతించిన తరువాత తన తండ్రి జాన్ రీడ్ ఆ నల్లరాయిని పరిశీలించి నగలను విక్రయించే షాపులో దానిని చూపించమని సలహా ఇచ్చాడు. పెద్దగా ఆసక్తి లేకుండానే తన తండ్రి మాట ప్రకారం షాపుకు వెళ్ళి చూపించగా ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. అది ఒక నల్లరాయి కాదు... బంగారం. చాలాకాలం భూమిలో ఉండిపోయిన కారణంగా నల్లరాయిలా ఉంది. ఆ సమయంలో దాని విలువ మూడువేల ఆరువందల డాలర్లు. ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం. దాని విలువ తెలియని కారణంగా దానిని ఒక డోర్‌స్టాప్‌గా మూడు సంవత్సరాలు ఉపయోగించారు. సరియైన చోటికి తీసుకెళ్ళినప్పుడు దాని విలువేంటో అర్థమయ్యింది. మనిషి దేవుని చేతిలో ఉంటేనే తన విలువేంటో స్పష్టంగా తెలుస్తుంది. ఈ అనంత విశ్వంలో మనిషికి సాటియైనదేదీ లేదు. దేవుడు మానవునికి అత్యంత విలువైన స్థానాన్ని ఇచ్చి ఘనపరిచాడు. అత్యంతాశ్చర్యకరమైన రీతిలో మానవుని తల్లి గర్భంలో రూపించి నిర్మించాడు. తన రూపంలో తన పోలికలో చేసుకొనినందు వలన వల్లమాలిన ప్రేమను మనిషిపై పెంచుకొని ఈ సృష్టి అంతటినీ ఏలుబడి చేసే అధికారమిచ్చాడు. తాను మహోన్నతుడైనప్పటికీ మనిషితో స్నేహం చేయాలని కోరుకున్నాడు. అయితే ఇంగితం కోల్పోయిన మానవుడు తనను సృజించిన దేవుని విూదే తిరుగుబాటు చేయగా తట్టుకోలేకపోయాడు. ప్రేమాస్వరూపి కావడంతో క్రోధంతో కాక కనికరంతో మరలా మనిషికి దగరవ్వాలనే కరుణామయునిగా శరీరాకారాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ద్వేషించిన మానవుణ్ణి అపరిమితముగా ప్రేమించి ప్రాణత్యాగం చేసి రక్షించాలన్నది పరమదేవుని కోరిక. యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మ చాలా ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. పరమాత్ముని జీవనవిధానం శ్రేష్ఠమైనది, విలక్షణమైనది. ఆయన మరణం కూడా మరెవరితోను సాటికానిది. దయనీయమైనది. మూడవ రోజున జరిగిన ఆయన పునరుత్థానం అద్భుతమైనది. అత్యంతాశ్చర్యకరమైనది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మానవ జీవితాలకు పట్టిన పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగునందించాడు క్రీస్తు ప్రభువు. వాస్తవానికి క్రీస్తు మరణం, ఆ తర్వాత పునరుత్థానం సంభవించిన ఆ సమయంలో జరిగిన సంఘటనలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ‘‘నజరేయుడైన యేసు’’ పాపులను రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తును సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ తిప్పి, కొరడాలతో కొట్టి, ఝెరూషలేము వీధుల్లో సిలువను మోయించి, గొల్గతాపై మేకులు కొట్టి, సిలువలో వ్రేలాడదీసి, పక్కలో బల్లెపు పోటు పొడిచి చిత్రహింసలకు గురిచేశారు. ప్రేమ, సహనములకు కర్తయైన దేవుడు వాటినన్నిటిని సహించి, భరించి సిలువలో మరణించాడు. దేవుని లేఖనాలు యేసుక్రీస్తు సిలువపై మరణించాయని ధ్రువీకరిస్తున్నాయి. యేసుక్రీస్తు దేవుడు గనుక ఆయన రక్తం మాత్రమే మనిషిని పాపం నుండి విడిపిస్తుంది. కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తం మాత్రమే మనిషి మనస్సాక్షిని శుద్ధిచేస్తుంది. క్రీస్తు మరణ, పునరుత్థానాలు క్రైస్తవ విశ్వాసానికి, నిరీక్షణకు పునాదిగా నిలిచాయి. ఆధునిక వైద్య శాస్త్రం కూడా యేసుక్రీస్తు మరణం సిలువపైనే జరిగిందని ఒప్పుకోక తప్పలేదు. అది ముమ్మాటికి నిజం కనుక! గెత్సెమనె తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను. అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తపుబిందువులుగా మారెను. వైద్య పరిభాషలో దానిని హెమాటిడ్రోసిస్ లేదా హెమటోహైడ్రోసిస్ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్థించెను. ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. రోమన్లు ఉపయోగించే కొరడా అతి భయంకరమైనది. ఒక్కొక్క కొరడాలో నాలుగు శాఖలుంటాయి. చెక్కతో చేయబడిన పిడి దానికి ఉంటుంది. జంతువుల చర్మముతో చేయబడిన త్రాళ్ళకొనలకు పదునైన ఎండిన ఎముకలు, లోహపు గుళ్ళు ఉంటాయి. కొరడా తయారీని ఊహిస్తేనే భయమనిపిస్తుంది. అటువంటి కొరడాతో యేసుక్రీస్తు ప్రభువును అతి తీవ్రంగా గాయపరిచారు. ముందుగా కొరడా శిక్ష విధించబడిన వ్యక్తి వస్త్రములు లాగివేస్తారు. ఒక మానుకు ఆ వ్యక్తిని కదలకుండా కట్టివేస్తారు. ఆ తరువాత వెనుక భాగమున ఇద్దరు సైనికులు నిలువబడి ఒకరి తర్వాత మరియొకరు విపరీతంగా కొడతారు. దెబ్బలు కొట్టే సైనికులే అలిసిపోతారంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు. దెబ్బలు కొట్టుచున్నప్పుడు లోహపు గుళ్ళు తీవ్రమైన నొప్పిని కలుగచేస్తాయి. పదునైన ఎముకలు, ముళ్ళు శరీరంలోకి దిగబడి మాంసాన్ని పెకిలిస్తాయి. ఈ ప్రక్రియలో చాలామంది తీవ్ర రక్తస్రావం జరిగి కుప్పకూలిపోతుంటారు. రక్షకుడైన యేసుక్రీస్తు ఆ దెబ్బల ద్వారా మనిషికి స్వస్థత చేకూర్చబడాలని వాటిని భరించెను. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరిచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు, రోమన్లు ఈ శిక్షను అమలు పరిచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించేవారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి... భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. సిలువ వేసే స్థలానికి తీసుకొని వచ్చిన తరువాత నేరస్థునికి బోళము కలిపిన ద్రాక్షరసం ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభువు దానిని తీసుకోలేదు. వెంటనే నేరస్థుని సిలువపై పండబెట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు కొడతారు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు ఏడు అంగుళాల పొడవు, సుమారు ఒకటి నుండి రెండు సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ పై ఉంచి చేతులలో కాళ్ళల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు. మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వ్రేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్దకేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి కాళ్లు విరుగగొట్టడానికి సైనికులు సిద్ధపడ్డారు. వారు వచ్చి యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్థుల కాళ్ళు విరుగగొట్టారు. అయితే యేసు అంతకు ముందే మతినొందుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్లు కారెను అని బైబిల్లో వ్రాయబడింది. రోమన్లు వాడే బల్లెం పొడవు సుమారు 1.8 మీటర్లు. క్లోరోఫామ్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త సర్ జేవ్‌సు సింప్సన్, మరికొంతమంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యనిపుణులు యోహాను వ్రాసిన ఈ మాటపై పరిశోధన చేశారు. యేసుక్రీస్తు మరణించిన కొద్దిసేపటికి ఆయన దేహములో పొడవబడిన ఈటె వలన రక్తమును నీళ్ళు బయటకు వచ్చాయి. యేసుక్రీస్తు దేహములో కుడి పక్కన పొడవబడిన బల్లెపు పోటు వలన రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. ఇక్కడ బల్లెపు కొన లోతుగా గుచ్చుకొనుట ద్వారా గుండె వరకు చేరి అక్కడ ఉన్న కుడి కర్ణిక, కుడి జఠరిక నుండి రక్తం బయటకు వచ్చింది. ఆ తదుపరి నీళ్ళు అనగా దేహములో ఉన్న శ్లేష్మరసం, గుండె చుట్టూ ఉన్న పొర చీల్చబడుటను బట్టి వచ్చిన ద్రవం. వాస్తవాన్ని పరిశీలిస్తే యేసు గొప్ప శబ్ధముతో కేకవేసి అనే మాట లూకా సువార్త 23:46లో చూడగలము. ఒక వ్యక్తి చనిపోయే ముందు పెద్దకేక ఏ పరిస్థితుల్లో వేస్తాడు? ఈ విషయంపై తలపండిన వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సిలువ వేయబడడానికి ముందు సాయంత్రం నుండి తీవ్రవేదన అనుభవించారు. న్యాయస్థానాల యొద్దకు తిప్పడం వలన శరీరం బాగా అలసిపోయింది. కొరడా దెబ్బల ద్వారా చాలా రక్తం పోయింది. తలలో ముళ్ళకిరీటం, భారభరితమైన సిలువ మోయడం, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టడం ద్వారా దాదాపుగా చాలా రక్తం యేసుక్రీస్తు దేహం నుండి బయటకు పోయింది. శరీరం రక్తం కోల్పోవుట వలన గుండె రక్తప్రసరణ చేయలేని పరిస్థితి, శ్వాసావరోధము, తీవ్రమైన గుండె వైఫల్యం. వైద్య శాస్త్ర ప్రకారం సిలువపై యేసుక్రీస్తు పెద్ద కేకవేసి చనిపోవడానికి కారణములు ఇవే. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి అనేక పుస్తకాలను కూడా వెలువరించారు. వాటిలో మెడికల్ అండ్ కార్డియోలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ఎ డాక్టర్ ఎట్ కల్వరి, ద లీగల్ అండ్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రయల్ అండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్’ ముఖ్యమైనవి. ఎందుకాయనకు ఇన్ని కొరడాదెబ్బలు? ఎందుకన్ని అవమానాలు? ఎందుకాయనకన్ని రాళ్ళ దెబ్బలు, ఇన్ని అమానుష చర్యలు? ఎందుకు తలకు ముండ్ల కిరీటం? ఎందుకు పిడిగుద్దులు? ఎందుకు పరిశుద్ధ చేతులకు, కాళ్ళకు మేకులు గుచ్చడం? ఎందుకు పక్కలో బల్లెపు పోటు, సిలువ శిక్ష? పరిశుద్ధ గ్రంథము ఇలా సెలవిస్తుంది. ‘దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.’ అవును! క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ప్రేమ ఋజువుచేయబడింది. మనిషికి బదులుగా దేవుడు పాపములను తనమీద వేసుకొని వాటి శిక్షను భరించాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్స్యర్యాలను జయించిన పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పాపబంధకముల నుండి, పాపశిక్ష నుండి విడుదల చేయుటకు తన్నుతానే బలిగా అప్పగించుకున్నాడు. మానవునిగా ఈ భూమ్మీద క్రీస్తు జీవించిన కాలంలో ఆయన గడిపిన ప్రతీక్షణం పరిశుద్ధతతో, ప్రేమతత్వంతో జాలి కనికరాలతోనే జీవించారు కాని ఏనాడు ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడలేదు. సమాజాన్నిగాని, తన అనుచరులను గాని ద్రోహకార్యాలకు పాల్పడమని బోధించ లేదు. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పడమే కాదు యేసు క్రీస్తు దాన్ని అక్షరాలా చేసి చూపించారు. క్రీస్తు ప్రేమతత్వాన్ని తమ నరనరాల్లో జీర్ణించుకున్న ఎందరో మహనీయులు ప్రపంచానికి దీవెనగా నిలిచారు. తన యవ్వన జీవితాన్ని త్యాగం చేసి దేశాన్ని, తన వారందరిని విడిచి అనేకమంది అనాథలను, అభాగ్యులను చేరదీసి... తల్లికంటే, తోబుట్టువు కంటే మిక్కుటమైన ప్రేమాభిమానాలందించి పురుగుకంటే హీనంగా మారిపోయిన వారి జీవితాలకు మరలా విలువనిచ్చిన మదర్ థెరిస్సా ఒక మంచి ఉదాహరణ. ఎవరి పాపఫలితం వారనుభవించాలి, ఎవరి కర్మకు వారే కర్తలు, తండ్రులు ద్రాక్షపండ్లు తింటే పిల్లల పళ్ళు పులియవు, పాపం చేసిన వారు శాపగ్రస్తులవ్వాల్సిందేనన్న నీతి సూక్తులు, వాక్యాలు మానవులపై గుదిబండలుగా మోపుతున్న తరుణంలో పాపప్రక్షాళనకు, పాపసంహారానికి, పాప పరిహారానికి మానవుడు ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతూ ఆయా కార్యాలతో అలసిపోతూ సత్యాన్వేషణలో అలమటిస్తుండగా పాపులను రక్షించుటకు నేనీ లోకానికొచ్చానని, లోకమును ప్రేమిస్తున్నానని, ప్రతి మనిషి పాపపు శిక్షను భరించి నిత్యజీవాన్ని అందించు రక్షకునిగా దిగి వచ్చానని మాటలతో చెప్పడమే కాకుండా చేసి నిరూపించిన త్యాగమూర్తి క్రీస్తు. చేయకూడదనుకున్న వాటినే మాటిమాటికి చేస్తూ, చేయాలనుకున్నవాటిని చేయలేక చతికిలపడుతున్న మనిషిని రక్షించడమే దేవుని అభిలాష. పాప పిశాచితో మనిషి పోరాడలేక విఫలమై చిత్తుగా ఓడిపోయి పతానవస్థకు చేరిపోగా పాపానికి చేయాల్సిన పరిహారం చేసి రక్తమంతా కార్చి, ప్రేమనంతా కనుపరచి, పాపపు కోరలను విరిచి, పాపాన్ని ముక్క చెక్కలు చేసి సమాధి చేసిన ఘనుడు యేసు. ఎవరైనా ఒక మంచి వ్యక్తి చనిపోతే విచారవదనాలతో, బాధాతప్త హృదయాలతో, విలాపముతో, శోకముతో తల్లడిల్లుతారు గాని, యేసుక్రీస్తు మరణ దినాన్ని ‘గుడ్ ఫ్రైడే’గా ఘనపరుస్తున్నారంటే అందులో ఎంత అర్థముందో గమనించాలి. గుడ్ ఫ్రైడే విషాదాన్ని పంచేదికాదు పాపపిశాచితో నలిగిపోతున్న మానవాళికి శుభ ప్రారంభాన్నిచ్చేది. గుడ్‌ఫ్రైడే కేవలం యేసుక్రీస్తు మరణదినం కాదు. మానవుడు పరిశుద్ధతను పొందుకొని నూతనంగా జన్మించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు. సిలువలో యేసుప్రభువు పలికిన సప్తస్వరాలు శిథిలమైపోయిన మానవుని జీవితాన్ని అద్భుత నవకాంతిమయ నిర్మాణముగా మార్చి వేశాయి. ప్రపంచానికి ఆయనందించిన వెలలేని ప్రేమ, శత్రువుని కూడా కరిగించగలిగిన క్షమాపణ, ఎంతటి దీనులనైనా అక్కున చేర్చుకోగలిగిన ఆదరణ, ఆప్యాయత చెక్కు చెదరనివని.. ఆ సిలువలో ఆయన ప్రకటించిన నిత్యజీవము చిరస్థాయిగా నిలిచేదని ఋజువు చేశాయి. ఆ పరమాత్ముడైన ప్రభువు అంతటి ఘోరమైన సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా సిలువపై పలికిన సుమధుర స్వరాలు మానవాళి యెడల ఆయనకున్న ప్రేమ, శ్రద్ధ, బాధ్యతను తెలియ జేస్తున్నాయి. ఒక వ్యక్తి తన జీవిత చివరి క్షణంలో పలికే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు తన చివరి క్షణాలు కూడా మానవుని పట్ల తనకున్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.యేసు ‘‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనకు వీరిని క్షమించుమ’’ని చెప్పెను (లూకా 23:34). యేసు సిలువలో పలికిన మాట క్షమాపణ గొప్పతనాన్ని తెలియచేస్తుంది. ఏళ్ళ తరబడి పగను, ప్రతీకారేచ్ఛను తమలో నాటుకున్నవారికి ఓ గుణపాఠాన్ని ఈ మాట నేర్పిస్తుంది. వాస్తవానికి క్రీస్తును హింసిస్తున్న వారంతా క్షమార్హతను కోల్పోయినప్పటికి వారిని మనసారా క్షమించడానికి ఇష్టపడ్డారు. పిల్లలను క్షమించలేని తల్లిదండ్రులు, పెద్దలను క్షమించలేని బిడ్డలు ఉన్న ఈ ప్రపంచంలో క్షమాపణ ఔన్నత్యాన్ని క్రీస్తు తెలియచేశారు. ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే వారిని క్షమించడానికి చాలా ఆలోచించే ఈ రోజుల్లో...... తెలిసి తెలిసి తనకు అన్యాయపు తీర్పు తీర్చి సిలువ వేస్తున్నారని తెలిసినా క్షమించగలిగిన గొప్ప క్షమాగుణం ఆయనది. ‘‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు.’’ (లూకా 23:43) యేసుక్రీస్తును సిలువ వేసిన సమయంలోనే మరియొక ఇద్దరు వ్యక్తులను సిలువ వేశారు. వారు నేరస్థులు. ఒకతని పేరు గెట్సస్, మరొక వ్యక్తి పేరు డిస్మస్. వారు చేసిన పాపం పండిన రోజు రానే వచ్చింది. ఆ సమయంలో మొదటివాడు తన తప్పుకు తాను పశ్చాత్తాపపడకుండా ఆయనను దూషిస్తూ నీవు క్రీస్తువు గదా. నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించుమని హేళనతో మాట్లాడాడు. నేరానికి తగిన శిక్షను అనుభవిస్తున్నా పశ్చాత్తాపం అతనిలో కనబడుటలేదు. రెండవవాడు మాత్రం అతనిని వారించి యేసువైపు చూచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని హృదయపూర్వకంగా ప్రభువు శరణు కోరినపుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని దివ్య వాగ్దానం చేశారు. పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్షనుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళు లేని రాజ్యం. ‘‘యేసుక్రీస్తు తన తల్లిని ఇదిగో నీ కుమారుడు అనియు శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని పలికెను’’ (యోహాను 19:26, 27)’’. యేసుక్రీస్తు ప్రభువు తనను నమ్ముకున్నవారిని ఏనాడు ఒంటరిగా విడువడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అంతవరకు తల్లి ఆలనాపాలనా కుమారునిగా చూసుకున్న ప్రభువు తన తర్వాత తన బాధ్యతను శిష్యునికి అప్పగించాడు. సంబంధ బాంధవ్యాల విలువలు, బాధ్యతలు అంతరించిపోతున్న నేటి దినాలలో యేసుక్రీస్తు పలికిన మాట ఎంత మంచి ఆదర్శాన్ని చూపించింది. వృద్ధాప్యంలోనికి వచ్చిన తల్లిదండ్రులను పెంటకుప్పల మీద, అనాథ శరణాలయాల్లో విడిచిపెట్టి వారిని ఇబ్బందిపెడుతున్న వారికి క్రీస్తు ఇచ్చిన సందేశం చాలా గొప్పది. అంతటి మరణ వేదనలో సయితం తన తల్లి గురించి ఆలోచించిన గొప్ప మనసు ఆయనది. తన శరణుజొచ్చిన ఎన్నడును విడిచిపెట్టేవాడు కాదు. ‘‘ఏలీ, ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను.’’ (మత్తయి 27:46) ఈ మాట అరమేయిక్ అనే భాషలో క్రీస్తు మాట్లాడెను. ఆనాటి దినాలలో యూదులు హెబ్రీ భాషతో పాటుగా అరమేయిక్ భాషను వ్యవహారిక భాషగా మాట్లాడేవారు. యేసు ప్రభువు పలికిన ఈ మాటకు ‘‘నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి ’’అని అర్థం. నరావతారిగా మానవుని పాపములను తొలగించుటకు, శిక్షను భరించుటకు ఇలకు వచ్చిన ప్రభువు చేతిని తండ్రి వదిలివేసే పరిస్థితి ఎందుకొచ్చింది? పరిశుద్ధుడైన దేవుడు పాపమును ద్వేషించి పాపిని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు అయినను ఎందుకు తండ్రి నుండి ఎడబాటు పొందాల్సి వచ్చింది? ఆయన మన పాపములను ఆయన మీద మోసుకుంటూ పాపముగా మారినందుకే కదా! పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. పాపం పరిహరించబడినప్పుడు మాత్రమే మనిషి దేవునితో శ్రేష్ఠమైన సహవాసం కలిగియుండగలడు. దేవునితో సహవాసం ఓ అనిర్వచనీయ అనుభవం. ‘‘దప్పిగొనుచున్నాను (యోహాను 19:28)’’. యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మానవునిగా అందరికీ ఉండే అనుభవాలు అనుభవించారు. దేవుడు మాత్రమే చేయగలిగే అద్భుత కార్యములను ఆయన చేసెను. సంపూర్ణ దేవుడుగా ఉన్న ఆయన సంపూర్ణ మానవునిగా మారి దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలని ఇష్టపడినాడు. జీవజలమును కానుకగా ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువు దాహంలో అంత మండుటెండలో దప్పిక గొనడం ఎంత బాధాకరం. ఆ దప్పిక శారీరకమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. మానవుల రక్షణ, విమోచన ఆ దప్పిక. నీవు రక్షణ పొందిన రోజు మాత్రమే ఆయన దప్పిక తీరుతుంది. ‘‘సమాప్తమైనది.’’ (యోహాను 19:28) ఇది విజయానందంతో వేసే విజయనాదం. ఒక వ్యక్తి తాను తలపెట్టిన కార్యమునంతా ముగించి సాధించాకా వేసే కేక. మరింతకూ ఆయన ఏమి సాధించారు? అంత బిగ్గరగా విజయానందంతో కేక వేసేంత ఏమి జరిగింది? యేసుక్రీస్తు ఈ లోకానికి అనుకోకుండానో, ఏ కారణం లేకుండానో, ఆకస్మికంగానో రాలేదు. ఒక పరమార్థం కలిగి దానిని పని నెరవేర్చుటకు ఆయన వచ్చెను. అంతవరకు ధర్మశాస్త్రమనే కాడి కింద మగ్గిపోతున్న వారిని విడిపించుటకు వచ్చెను. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు కానీ దానిని నెరవేర్చి మనుష్యులకున్న తెరను తొలగించాడు. ఆయనకు అప్పగించబడిన దైవచిత్తమును సిలువ మరణం ద్వారా నెరవేర్చి సంతోషముతో కేకవేశారు. ‘‘తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను.’’ (లూకా 23:46) ఆయన సిలువలో ఎంతో తీవ్రమైన వేదనను అనుభవిస్తూ మానసికంగాను, శారీరకంగాను బాధను భరిస్తూ సిలువలో సర్వజనులను ఉద్దేశించి పలికిన మాటలలో చివరి మాట ‘‘అప్పగించుకొంటున్నాను.’’ మనలో ఉన్న ఆత్మ మనం చనిపోయాక దేవుని దగ్గరకు చేరాలి. ఈ లోకంలో ఎలా బతికినా చనిపోయాక దేవుడు అంగీకరించే యోగ్యమైన రీతిలో మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మనిషి అంటే కేవలం పైకి కనబడే దేహం మాత్రమే కాదు, లోపల ఆత్మ కూడా ఉందని గ్రహించాలి. చనిపోయాక మట్టి నుండి తీయబడిన దేహం తిరిగి మట్టిలో కలుస్తుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరుకోవాలి. మనలో ఉన్న ఆత్మ దేవుడు అనుగ్రహించిన దానము. గనుక తిరిగి ఆయనకు అప్పగించాలి. యేసుక్రీస్తు ఈ మాటలు పలికిన తర్వాత తలవాల్చి మరణించారు. అంతటితో ఆయన శకం ముగిసిందని రోమన్లు, యూదులు అనుకున్నారు. ఇంక వారికి తిరుగులేదు. తాము చెప్పిందే శాసనం అనుకున్నారు. యేసు సిలువపై చనిపోయిన తరువాత యూదుల న్యాయసభలో ప్రముఖుడైన యోసేపు అనే వ్యక్తి యేసు దేహము తనకిమ్మని పిలాతును అడిగాడు. అరిమతయి యోసేపు అనే వ్యక్తి తనకొరకు తొలచుకున్న సమాధిలో ఉంచారు. ఎవరో అడిగారట!! నీ సమాధిని యేసుకెందుకు ఇస్తున్నావని. అందుకు అతడిచ్చిన సమాధానం ‘‘కేవలం మూడురోజులకు మాత్రమే. ఆ తరువాత ఆయన దానిలో ఉండడు గదా!!’’ ఆదివారం తెల్లవారుచుండగా ఆయన సమాధిని అలంకరించడానికి కొంతమంది వెళ్ళారు. ఆనాటి దినాలలో అనేకులు ప్రవక్తలు చనిపోయాక వారి సమాధులను అలంకరించేవారు. కాబట్టి యేసు సమాధిని కూడా అలంకరించడానికి వెళ్ళారు. వారు వెళ్ళి చూసే సమయానికి ఆశ్యర్యం... అద్భుతం. యేసు సమాధి తెరవబడియుంది. అక్కడ నిలబడియున్న దేవదూత వెళ్ళిన వారికి ఇచ్చిన సందేశం ‘‘క్రీస్తు ఇక్కడ లేడు. లేచి యున్నాడు.’’ ఉరికే ఉత్సాహంతో, ఊపిరాడనివ్వని సంతోషంతో, కట్లు తెంచుకునే హృదయానందంతో శిష్యులు, స్త్రీలు అందరూ ఆ వార్తను లోకానికి చాటాలనుకున్నారు. అప్పటికే ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడేమోనని ఆనాటి యూదులు, రోమన్ సైనికులు అనేక కథనాలు రచించుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ కథలేవీ సత్యం ముందు నిలబడలేదు. విత్తనం నేలను పడి చనిపోయినట్లే ఉంటుంది కానీ అది మొలిచి మహావృక్షముగా మారుతుందని ఎవరు ఊహించగలరు? ఆయనను సిలువ మరణం ద్వారా చంపేశామని జబ్బలు కొట్టుకునే యూదులకు, రోమన్లకు మింగుడుపడని వార్త ‘‘ఆయన సజీవుడై పునరుత్థానుడుగా లేచెను’’. యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసుక్రీస్తు పునురుత్థానానికి ఆనాటి శిష్యులే సాక్షులు. ‘‘శిష్యులు భ్రమలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని చూసినా యేసులాగే కనిపించారు అని తలంచేవారు’’ అని వాదిస్తారు. నిజంగా వారికున్నది భ్రమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. క్రీస్తు శిష్యులలో చాలామంది హతసాక్షులయ్యారు. ఒక అబద్ధం కోసం అంతమంది ప్రాణాలర్పించరు కదా! ఉదాహరణకు క్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి వచ్చింది. తోమా అనేక సంఘాలను కట్టి చివరకు బల్లెము ద్వారా పొడువబడి చనిపోయాడు. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యలమీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణించింది. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికి పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. దుఃఖముతో, నిరాశా నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికి ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడయిపోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినా, మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యవసనాలు, దౌర్భాగ్యమైన శారీరక వాంఛలు, పాపపు యిచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవ లేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలను సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి ఓ అద్భుతమైన పుస్తకాన్ని వ్రాసాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణిలోనికి తీసుకొచ్చారు గాని వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు... స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలు ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా. సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కుల మతాలకు అతీతమైనవి. ఇది మానవ హృదయా లకు సంబంధించినది తప్ప ఈ భౌతికానుభవాలకు చెందినదికాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికి యిట్టే అవగతమౌతుంది. లోక వినాశనానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మానవ లోకానికి సమాధానం వచ్చింది. యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి గదిలో ఉన్న ఆయన శిష్యులకు ప్రత్యక్షమై ప్రభువు పలికిన వాగ్దానవచనం ‘‘సమాధానం కలుగును గాక !’’ పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానము ఉంటుంది. ఈనాడు అనేకులు తమ పరిస్థితులనుబట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు. సమాధానం లేకనే ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఒకసారి సుప్రసిద్ధ సంగీత కళాకారుడు ఒకాయన ప్రపంచస్థాయి సంగీత కచేరి చేశాడు. అతడు వాయించిన సంగీత సమ్మేళనానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు ఆలపించిన కొన్ని పాటలలో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘‘దుఃఖం వలన ఒరిగేదేమిటి? విచారం వలన సాధించేదేమిటి? దుఃఖాన్ని విచారాన్ని దూరంగా విసిరేసి ఆనందంగా ప్రతిరోజు గడిపేయండి.’’ ఆ రాత్రి గడిచి ఉదయం లేచేసరికి అందరూ నివ్వెరపోయే వార్త... ఆ సంగీత స్వర మాంత్రికుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని. ఆనందంగా ప్రతిరోజు గడిపేయండి అని పాడిన వ్యక్తి ఆనందంగా ఉండలేకపోయాడు. శాంతి సమాధానాలు డబ్బు, పేరు ప్రఖ్యాతులతో వచ్చేవి కాదు. శాంతిదూతయైన దేవునికి æహృదయంలో చోటివ్వడం ద్వారా మాత్రమే లభించేవి. పునరుత్థాడైన క్రీస్తు ద్వారా మానవాళి పొందుకునే మరొక వాగ్దానం ‘‘భయపడకుడి’’. ప్రస్తుత ప్రపంచమంతా ఎన్నో భయాలతో నిండియుంది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యములు, సమస్యలు... ఇంకా ఎన్నో కారణాలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. సర్వశక్తుడైన దేవుని మీద విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే విజయం సొంతం అవుతుంది. ఇకముందు ఏమౌతుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో అనే భయంతో ఏమీ సాధించలేని వాళ్లు దేవుని మీద విశ్వాసంతో గొప్ప కార్యాలు సాధిస్తున్నారు. క్రీస్తు పునరుత్థానం నిరీక్షణ ప్రసాదించింది. యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయనయందలి విశ్వాసమును కొనసాగించువారికి నిత్యజీవమును అనుగ్రహించుటకు రాబోవుతున్నారు. ఆయన పునరుత్థానుడై యుండని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురుచూసేవారు ఎన్నడు సిగ్గుపడరు. ప్రభువునందు మనిషికున్న నిరీక్షణ ఎన్నడు అవమానమునకు, సిగ్గుకు కారణము కాదు. జోబ్ సుదర్శన్ అనే ఒక క్రైస్తవ రచయిత ఇలా అంటాడు. ‘‘చీకటీ, ప్రకృతిపై నీ గొంగళి కప్పు. గేత్సెమనే తోటలో నా ప్రభువు దురపిల్లుతున్నాడు. వెలుగు అలలారా అణగారండి! సిలువపై నా ప్రభువు వసివాడుతున్నాడు. గాలీ గోల చెయ్యకు...పక్షులారా కిలకిలరావాలు మానండి! సమాధిలో నా ప్రభువు నిద్రిస్తున్నాడు. ప్రాతకామా వేగిరపడు సమాధిలోనికి తొంగిచూడు! అక్కడ లేడు, నా ప్రభువు లేచాడు. దిగ్గజాల్లారా ఘీంకరించండి! మహిమ దేహధారి ఆరోహణమవుతున్నాడు’’. తనను వినమ్రతతో సేవించే ప్రతి హృదయం తో క్రీస్తు ఇలా సంబోధిస్తున్నాడు. ‘‘నా సమాధి దగ్గర నిలుచుండి విలపించవద్దు. నేనక్కడలేను. నేనిప్పుడు వేనవేల పవనాల జవాన్ని జీవాన్ని. కోటి ప్రభలు కలబోసిన కాంతిపుంజాన్ని. పండిన చేలపై వెచ్చగా ప్రసరించే ప్రభాత కిరణాన్ని. రాత్రివేళ అల్లన మిణుకుమనే కోట్లాది నక్షత్రాల వైభవాన్ని. మెల్లని తొలకరి వర్షాన్ని. గుండెల్లో హాయిని నింపే హర్షాన్ని. నా సమాధి దగ్గర నిలుచుండి విలపించవద్దు. నేనక్కడ లేను’’. సాక్షి పాఠకులకు గుడ్‌ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు. -డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
సిలువ మాట్లాడితే... శిలలైనా కరగాల్సిందే!
రోమా ప్రభుత్వం వారు దుర్మార్గులను, నరహంతకులను దేశద్రోహులను కిరాతకంగా శిక్షించేవారు. వారుపయోగించే అత్యంత క్రూరమైన శిక్షాదండమేమంటే ‘‘నేనే’’! ఫోనీషియన్లచే ప్రవేశపెట్టబడిన అత్యంత కిరాతకమైన అస్త్రమును నేను. నా విూదనే ఈ దుష్టులను వేలాడదీసేవారు. ఇలాంటి క్రూరులకు, నేరస్తులకు చివరి మజిలీగా మిగిలిపోయి, వారి మృతదేహాల దుర్గంధంతో నా జీవితం చాలా దుర్భరంగా గడిచేది!!! నా బతుకింతేనా? నా దుస్థితిని మార్చేవారే లేరాంటూ నేను ఆక్రోశించడం నిత్యకృత్యమైపోయింది. జీవచ్ఛవంలా మిగిలిన నేను రోమా అధికారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాను. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ.. నన్ను ‘‘సిలువ’’ అని పిలుస్తారు. ఓ అడ్డుకర్ర, ఓ నిలువ కర్రను తీసుకొని వాటిని జతచేసి నన్ను తయారు చేస్తారు. అమానుషానికి, అవమానానికి చిరునామాను నేను. రోమా సైనికుల పైశాచికాలకు కేంద్రబిందువును నేను. నాకీ స్థితి వద్దంటూ నేను పెడ్తున్న నా మొరను విని నన్ను కనికరించే దాతల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూనే వున్నాను గాని, నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. అయితే ఇంతలో ఓ అద్భుతమైన రోజు నా జీవితంలోకి వస్తుందని కలలోకూడ ఊహించలేదు. సర్వలోకనాథుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు పాపులైన మానవులందరినీరక్షించడానికి పాపిగా మార్చబడి సిలువనైన నన్ను ప్రాణ బలియాగమునకై అర్పించుకున్న మధుర క్షణం... నా శరీరంలోని ప్రతి కణాన్ని ఉత్తేజింపజేసింది. ఆయన స్పర్శ నాకు తగలగానే పవిత్ర పావనమయ్యాను. అప్పటికే అన్యాయపు తీర్పు నొంది భయంకర హింసలతో, కొరడా దెబ్బలతో, చీల్చబడిన దేహముతో రక్తమోడుతున్నకరుణామయుడు, బరువైన నన్ను తన భుజము మీద పెట్టుకోగా ఆ బాధను చూడలేక ఎంత మూల్గులినానో తెలుసా! ‘‘అయ్యో! దేవా ఏ పాపము చేయని నీకెందుకు ఇంత శ్రమ’’ అంటూ అడగాలన్పించింది. ఆ భయంకర బాధలో నేనే ఆయనకు అత్యంత సమీపముగా ఉన్న దాననని సంతోషించాలో లేక ఏమీ చేయలేని నిస్సహాయురాలిగా వున్నానని దుఃఖించాలో అర్థం కాలేదు. వికృత చర్యలు చేసి క్రూరాతిక్రూరంగా ప్రవర్తించిన ఒక వన్యమృగాన్ని కూడా మనుషులు ఇలా హింసించరేమో! తమ సృష్టికి, తమ ఉనికికి, తమ ప్రాణానికి, నిత్య జీవానికి మూలాధారమైన ప్రభువుని గాయపరుస్తుంటే ఒక్క దెబ్బతో వారందరి మీద విరుచుకుపడాలనిపించింది. రాణువవారు కొడుతున్న కొరడా దెబ్బలు అడపాదడపా నాక్కూడా తగులుతుంటే కళ్ళు తిరిగి క్రింద పడేదాన్ని. రాళ్ళదెబ్బలే కాకుండా, పిడిగుద్దులతో ఇష్టానుసారంగా ఎవడుపడితే వాడు నా ప్రభువును కొడుతుంటే చూడలేక నా కళ్ళు గుడ్డివైతే బాగుండన్పించింది. ధవళవర్ణుడు పదివేలలో సుందరుడైన నా ప్రభువు విూద దురంహకారులు, అయోగ్యులైన మూర్ఖులు ఉమ్ములు వేస్తే సురూపిౖయెన నా ప్రేమమూర్తి ఎవరూ చూడనొల్లనివానిగా, అసహ్యకరముగా మారిపోయాడు! అపహాస్యపు నవ్వులతో ఇంతవరకు ఎరుగని దూషణలతో నా ప్రభువును దూషిస్తుంటే నా చెవులకు గళ్ళుపడినట్లు అయింది. ఒకటా రెండా నా కరుణామయుని శ్రమలు చూస్తుంటే నా ఆవేదన కట్టలు తెంచుకొనేది. నన్ను మోయలేక నిస్సహయంగా కిందపడిపోతున్న ప్రతిసారి ఆయనను గట్టిగా హత్తుకొని తనివితీర ఆయనకు సేవచేసి ఆదరించాలన్పించేది. కర్కశమైన సూదంటి రాళ్ళు, ఆ గొల్గతా ముండ్లు, మిట్ట మధ్యాన్నపు ఎండ వేడిమి ఒక్క పక్కనైతే ఒక్క చుక్క నీటి కోసం దాహముతో ఆయన విలవిలలాడుతుండడం చూసి ఇన్ని నదులను సృష్టించిన సృష్టికర్తకు దాహము తీర్చేవారు లేరాంటూ కుమిలిపోయాను. తాను నమ్మినవారే తనకు చేసిన ద్రోహాన్ని తలచుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఆ నిస్సహాయతను తట్టుకోలేక అహా! నాకు రెక్కలుండినా ఎంత బాగుండును నా కరుణామయుని ఎత్తుకొని ఎగిరిపోయేదానిని కదా, ఈ క్రూరులకు దొరకకుండా దాచిపెట్టేదానను కదాని ఎంత ఆశపడ్డానో! అతికష్టం మీద నన్ను మోసుకుంటూ కల్వరి కొండ శిఖరం మీదకు చేరిన ఈ త్యాగశీలుని చూచి హమ్మయ్యా ఇక నా ప్రభువుని ఇక్కడితో వదిలేస్తారేమోనని చూస్తున్న నాకు ఓ పిడుగులాంటి సంఘటన ఎదురైంది! ఏ పాపమెరుగని ఆ పావన మూర్తిని పట్టుకొని కరుకైన మేకులు తెచ్చి నిర్దయగా నా విూద పడుకోబెట్టి ఎందరికో స్వస్థతనిచ్చి ఆదరించిన ఆ మహానుభావుని చేతులలో, కాళ్ళలో గుచ్చి నాతో బంధించారు. తట్టుకోలేక... దుఃఖంతో నేను అరచిన అరుపులు అరణ్యరోదనగా మిగిలాయి! చేసేది లేక ధైర్యం తెచ్చుకొని భూమికి ఆకాశానికి మధ్యలో నా ప్రభువును చూపుతూ నిలువబడ్డాను. నా చుట్టూ మూగిన మనుషులలో మానవత్వం మచ్చుకైనా కనిపించలేదు. అంత మిక్కుటమైన శ్రమలో కూడా పల్లెత్తుమాట అనకుండా ప్రభువు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారని పించింది. ఇంతలో సృష్టంతటిని దద్దరిల్లింప చేసిన మహోన్నతుని స్వరం... ఒక్కసారిగా నా చెవులజొచ్చింది. ఆ స్వరాభిషేకంతో కొద్దిసేపటిలోనే అవివేకియైన నాకళ్ళు తెరవబడ్డాయి. మహోన్నతుడైన దేవుని అపారమైన శక్తిని తేరిచూచాను. ఘోరమైన ఉగ్రత నుండి మానవాళిని రక్షించడానికే ఈ పరమాత్ముడు ఈ నరక యాతననుభవిస్తున్నాడని అర్థమైపోయింది. ఎందుకు ఈ మనుషులపై ఈయనకింత ప్రేమ అనుకుంటూండగా నా మీద ఆనుకొని ఊపిరి సలపని స్థితిలో కూడా తాను పలికిన ఏడు మాటలు నాలో పెను మార్పును తీసుకొచ్చాయి. ఈ మహోన్నతుని ప్రేమ వాక్కులు చీకటినలుముకున్న నా జీవితాన్ని తేజోవంతంగా మార్చేశాయి. అహా! నా బ్రతుకు ఎంత ధన్యమైంది. కలువరి యాత్రలో కడవరకు ఆయనతో కొనసాగే ధన్యత దొరికిందని ఇక నా హృదయం ఉబ్బితబ్బిబ్బైంది. ‘‘సిలువ లేని సందేశం విలువ లేని సందేశం’’ అని ఈనాడు మీరందరూ గుర్తించేలా ప్రభువు నన్ను చేశారు. సిలువకే విలువనిచ్చిన శ్రీమంతుడైన క్రీస్తు ప్రభువే పూజార్హుడు కాని, నేను కానేకాదు. ఈరోజు సిలువనైన నన్ను చూచినవారంతా క్రీస్తు ప్రభువును చూడక తప్పదు. ఆయన పక్కనే వేళ్ళాడబడిన రెండవ దొంగ ప్రభువును వేడగా క్షమాపణ పొందుకొనుటే కాక తక్షణమే పరదైసులో స్థానమును పొందుకున్న విధానమును చూస్తే పాపికి నిజమైన ఆశ్రయదుర్గం యేసుక్రీస్తేనని ఏ జ్ఞానములేని నాకే అర్థమైపోతే జ్ఞానులైన మీకందరికి ఇంకెంత అర్థమవ్వాలి? ఒక్కప్పుడు హీనమైన బతుకు నీడ్చిన నేను ఈ రోజు విశ్వవ్యాప్తంగా ఇంత విలువను పొందుకున్నానంటే నా ప్రభువైన యేసుక్రీస్తును బట్టియే కదా! సిలువ శ్రమ ద్వారా సమస్త మానవులు చేసిన పాపానికి పరిహారం కలిగింది. దుష్టసంహారం జరిగింది. మానవులకు విరోధియైన సాతాను తల చితుకదొక్కబడింది. ఎంత ఘోరపాపికైనా ఎంత భయంకర రోగికైనా సిలువధారియైన యేసుక్రీస్తు యొద్ద రక్షణ, విడుదల, స్వస్థత కలుగుతుందని విదితమైంది. కొన్ని గంటలు ఆయనతో గడిపిన నాకే ఇంత భాగ్యం దొరికితే విూ కోసమే దిగివచ్చిన విూ రక్షకుణ్ణి విూరంగీకరిస్తే విూ బ్రతుకులెంత ధన్యమవుతాయో తెలుసా? ఈ పునరుత్థానుడైన ప్రభువు తన సిలువ శక్తిని విూకందరికీ అందించాలని కోరుతూ, మీరంతా పాపపు శక్తుల నుండి విడుదల పొంది, సుఖసంతోషాలతో జీవించి మరణం తర్వాత కలుగబోయే నిత్యజీవాన్ని అనుభవించాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పటికీ మీ ప్రియ నేస్తం... సిలువ -షెకీనా గ్లోరి కాలేబ్ బెరాకా మినిస్ట్రీస్, హైద్రాబాద్ -
తార కథ నుంచి తెలుసుకోవాల్సిన నీతి ఏంటో తెలుసా?
అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి అనే ఐదు పేర్లను స్త్రీలు ప్రతిరోజూ స్మరించడం వల్ల అన్ని పాతకాలూ నశించి దీర్ఘ సుమంగళిగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. పైన మనం చెప్పుకున్న పేర్లన్నీ వివాహితలవే. అయితే వీరిని కన్యలుగా చెప్పుకోవడమంటే వినడానికీ వింతగా ఉండవచ్చు. నిజానికి వీరందరూ దేవతలే. అయితే, వివిధ రకాల శాపాల కారణంగా మానవ జన్మ ఎత్తి, తిరిగి వారు చేసుకున్న పుణ్యకర్మల ఫలితంగా దేవతల వరాలను పొంది పంచకన్యలుగా పేరు పొందారు. వారిలో మనం ముందుగా తార గురించి తెలుసుకుందాం. తార వానర రాజైన వాలి భార్య. వీరి కుమారుడు అంగదుడు. కిష్కింధ కాండలో వాలిసుగ్రీవులతో తార పాత్ర ప్రముఖంగానే కనిపిస్తుంది. రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. వారిరువురూ ఒకే విధంగా ఉండడంతో వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరమాడాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. ఈసారి మళ్లీ వెళ్లి నీ అన్నని యుద్ధానికి పిలవమని చెప్పాడు. సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని రెండవసారి యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బుసలు కొడుతూ బయలుదేరిన వాలిని తార వారించేందుకు ప్రయత్నించింది. ‘ఇంతక్రితమే నీ చేతిలో చావు దెబ్బలు తిని ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వెళ్లిన నీ తమ్ముడు ఇంతట్లోనే మళ్లీ వచ్చి నీపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే, దానివెనక ఏదో మర్మం ఉండి వుంటుంది. అంతేకాదు, పైగా ఇది రాత్రి సమయం. మీరు ఇప్పటివరకు శయ్యాసుఖాలు అనుభవించి ఉన్నారు. నాకు అపశకునాన్ని సూచిస్తూ, కుడికన్ను, కుడి భుజం అదురుతున్నది. మనసు కీడు శంకిస్తోంది. ఈ సమయంలో యుద్ధం అంత మంచిది కాదని నా మనసు చెబుతోంది. కాబట్టి అతను కవ్వించినంత మాత్రాన మీరు ఆవేశపడవద్దు. దయచేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. అతనిలో కలిగిన ధైర్యానికి కారణం తెలుసుకుని, అతనికి అండగా ఉన్నదెవరో కనుక్కుని, అందుకు తగ్గట్టుగా వ్యూహాన్ని రచించుకుని, అప్పుడు యుద్ధం చేద్దురుగాని, ఇప్పుడు మీరు అతన్ని పట్టించుకోవద్దు, చూసీ చూడనట్లుగా, వినిపించుకోనట్లుగా ఉండండి నాథా!’’ అని ఎంతగానో నచ్చజెప్పింది. అయితే, పోగాలం దాపురించినప్పుడు మంచిమాటలు చెవికెక్కవు కదా, కాని వాలి ఆమె మాట చెవిని వేసుకోలేదు. యుద్ధానికి బయలుదేరాడు. అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచన మాల వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించ సాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై నాటాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు. తరువాత వాలి సుగ్రీవుని పిలిచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు. పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని నేలకు ఒరిగాడు. మేరు పర్వతం వంటి భర్త నిస్సహాయంగా నేల కూలినందుకు తార ఎంతగానో బాధపడింది. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు. ఇక్కడ మనం తార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అవేమంటే, ఆమె తొలుత వాలి భార్య. వాలి మరణానంతరం వానర రాజనీతిని అనుసరించి సుగ్రీవుడి భార్య అయింది... అదీ కూడా వాలి మరణంతో భరించరాని దుఃఖంతో ఉన్న తారకు కుమారుడైన అంగదుణ్ణి కాపాడుకోవాలంటే, అండ అవసరం. అందుకే రాముడి సలహాను అనుసరించి వాలితో సహగమనం చేయకుండా సుగ్రీవుడికి భార్యగా సహజీవనం చేయవలసి రావడం. (ఇది నేటి రోజుల్లో వాడే సహజీవనం కాదు) రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతూ, రామునికిచ్చిన మాటను దాదాపు మరచిపోయాడు. దాంతో లక్ష్మణుడు ఆగ్రహంతో సుగ్రీవుని సంహరించడానికి వెళ్లబోగా, తార సుగ్రీవుని హెచ్చరించడంతో సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకుని, తన సేనాగణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై బడ్డాడు. రాముడు అతన్ని క్షమించి ఆలింగనం చేసుకొన్నాడు. అనంతరం సుగ్రీవుడు ఆలస్యం చేయకుండా సీతాన్వేషణకు పథకాన్ని సిద్ధం చేసి రాముని అభిమానాన్ని చూరగొన్నాడు. హితవు కోరిన చెప్పిన మాటలను వినకపోవడం వల్ల వాలికి కలిగిన చేటును, హితురాలు, వివేకవతి, సౌశీల్యవతి, పతివ్రత అయిన తార మాట వినడం వల్ల సుగ్రీవునికి తప్పిన ముప్పును తలచుకుంటే ‘‘కార్యేషు మంత్రి’’ అనే సూక్తికి తార ఎంత న్యాయం చేసిందో గ్రహించవచ్చు. తార కథ నుంచి మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, భార్య ఎల్లప్పుడూ లౌకిక పరిస్థితులను గురించి భర్తకు తెలియజెబుతూ, కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. అంతేకానీ, కర్తవ్య విముఖుణ్ణి చేయరాదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో తెలుసా?
అభయం, చిత్తశుద్ధి, జ్ఞానయోగంలో నెల కొనడం,దానం, దమం,యజ్ఞం,వేదాధ్యయనం, తపస్సు, సరళత్వం, అహింస, క్రోధరాహిత్యం, త్యాగం, శాంతి, చాడీలు చెప్పకపోవడం, సర్వప్రాణుల యందు దయ కలిగిఉండడం,విషయ. వాంఛలు లేకపోవడం, మృదుత్వం, బిడియం, చపలత్వం లేకపోవడం, ద్రోహబుద్ధి, దురభి మానం లేకుండడం, తేజస్సు, క్షమాగుణం,శుచిత్వం మొదలైన సద్గుణాలు. దైవీ సంపత్తితో మూర్తీభవించి ఉంటాయి అని శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడికి చెప్పేడు.ఈ సద్గుణాలు కేవలం అర్జునునకో లేక ద్వాపర యుగానికో పరిమితమైనవి కావు.ఈ సమస్త విశ్వంలో మానవజాతి ఉన్నంతవరకు సర్వులకు అవసరమే.ఎన్ని అధునాతన సాధన సంపత్తి వున్నా మానవుడు ప్రశాంత జీవితాన్ని గడప లేక పోతున్నాడు. ఎటు చూసినా హింస, క్రౌర్యం, అసంతృప్తి పెచ్చు పెరుగుతున్నాయి. మానవతా విలువలు లేని వ్యక్తి అభివృద్ధి చెందడం అసాధ్యం. ఆత్మ నిగ్రహం లేని వాడు ఉన్నతమైన జీవితాన్ని పొందలేడు. క్షణభంగురమైన ఇంద్రియ సుఖాల కోసం పరుగులు తీస్తూ తన పతనానికి తానే కారణమౌతున్నాడు. మనిషి జీవిత ధ్యేయం ఇంద్రియసుఖానుభవం కాదు. ఇంద్రియాలను ఎప్పటికీ తృప్తి పరచ లేము. అగ్నిలో ఆజ్యం పోసినట్లు సుఖాలు అనుభవించే కొద్ది మరిన్ని కోరికల పుడ తాయి.కాని మనిషి తృప్తి చెందడు. మానవ జీవితానికి ఉన్నతమైన లక్ష్యం ఉండాలి. అలా కాని పక్షంలో మానవుడు సర్వావస్థలయందు అసంతృప్తి కలిగే ఉంటాడు. మనిషిలో జ్ఞాన కాంక్ష పెరిగే కొద్దీ అతడు ఉన్నతంగా తీర్చబడతాడు. మన ఆలోచనా రీతిని బట్టే మన ఆచరణ ఉంటుంది. ఇతరులను సంతోషపెట్టినప్పుడే మనిషికి నిజమైన శాంతి.'పరోపకారః పుణ్యయ పాపాయ పరపీడనం' ఎదుటి వాడికి ఉపరకారం చేయడం పుణ్యం అపకారం చేయడం పాపమని మన సనాతన ధర్మం నొక్కి వక్కా ణించింది. అనభిధ్య పరస్వేషు, సర్వ సత్త్వేషు హృదయం । కర్మ ణాం ఫలమస్తీత మనసా త్రితయంచరేత్ ॥ పరుల సొత్తుపై ఆశ లేకుండా ఉండడం, సర్వజీవులయందును కరుణ, కర్మ కు ఫలితం ఉండి తీరుతుందనే భావం ఈ మూడింటినీ మనస్సులో ఉంచుకొని ప్రవర్తించాలని మనుస్మృతి చెబుతుంది. - గుమ్మా ప్రసాద రావు -
మండోదరి రావణాసురుడికి ఏం చెప్పిందో తెలుసా?
పంచకన్యలలో నాల్గవ ఆమె మండోదరి. చిత్రం ఏమిటంటే రామాయణ కథానాయికగా సీత పంచకన్యలలో ఒకరిగా ఏ విధంగా స్థానం సంపాదించుకుందో, ప్రతినాయకుడైన రావణాసురుడి ఇల్లాలైన మండోదరి కూడా పంచకన్యలలో ఒకరిగా ప్రఖ్యాతి పొందడం. ఇంతకీ మండోదరికి ఎందుకని అంత ప్రాముఖ్యత కలిగిందో చూద్దాం. మయాసురుడనే రాక్షసుడు మహాశిల్పి. మహా మహా నగరాలను సైతం ఎంతో గొప్ప నిర్మాణ చాతుర్యంతో అద్భుతంగా నిర్మించగలడు. అందుకే అతడికి మయబ్రహ్మ అని పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి. సుగుణవతి. సౌశీల్యవతి. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రావణుడు అక్కడ మండోదరిని చూసి మొదటి చూపులోనే మనసు పడతాడు. ఆమెను తనకు ఇచ్చి పెళ్లి చేయమని మయుణ్ణి అడుగుతాడు. మయుడు ఒప్పుకోకపోవడంతో నయానా భయానా ఆ దంపతులను ఒప్పించి, నొప్పించి మరీ ఆమెను వివాహం చేసుకుంటాడు రావణుడు. సహృదయం, ఔన్నత్యం, నేర్పు గల ఉత్తమ ఇల్లాలు మండోదరి. ఉత్తమ సౌశీల్య సంపద గలది. అయితే దురదృష్టవశాత్తూ ఏరి కోరి చేసుకున్న ఆమెను పెళ్లాడిన రావణుడు ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోకపోగా, కొద్దికాలానికే తిరిగి పరకాంతల పొందుకోసం వెంపర్లాడుతుంటాడు. భర్తలోని బుద్ధిలోపాలన్నీ ఒకటొకటిగా తెలిసి కుమిలి కుమిలి ఏడ్చింది మండోదరి. ఇంద్రజిత్తు వంటి వీరునకు తల్లియై కొంత ఊరట చెందుతుంది. కన్నతల్లిగా తన బిడ్డకు సుశిక్షణనిచ్చి ప్రథమోపాధ్యాయిని అయింది. ఎంత గొప్ప శివభక్తుడయినా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడయినా, పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం వల్ల తన పతికి ఎప్పటికయినా ముప్పేనని గ్రహిస్తుంది. అయినా చేసేదేం లేక అతని చేష్టలన్నింటినీ మౌనంగా సహిస్తుంది, సహనంతో భరిస్తుంది. ఎన్ని పనులున్నప్పటికీ, శివపూజను ఎంతో శ్రద్ధగా, భక్తిగా చేసే భర్తకు అన్ని విధాలా సహకరిస్తుంటుంది. తాను కూడా శివుణ్ణి ఆరాధించడం ఆరంభిస్తుంది. ఈ క్రమంలోనే తానూ శివపార్వతులకు ప్రియభక్తురాలిగా మారిపోతుంది. తన భర్త రావణుడు లంకానగరానికి అధిపతి అయినప్పటికీ, అనవసరంగా అందరి మీదా కయ్యానికి కాలు దువ్వడం, నచ్చిన కన్యను లేదా మెచ్చిన పరస్త్రీని అపహరించి తీసుకురావడం తప్పు కనుక, భార్యగా తాను భర్తకు హితం చెప్పడం ధర్మం కనుక, పరస్త్రీల జోలికి వెళ్లకూడదని మాత్రం పతికి చెవినిల్లు కట్టుకుని మరీ పదే పదే చెప్పేది. రావణుడు ఆమె మాటలను ఏమాత్రం లెక్కపెట్టక తాను చేసే పనులు తాను చేసేవాడు. భర్త అనేక తప్పిదాలు చేసేవాడు, చెడు ధోరణులను అనుసరించే వ్యక్తి అయినా, భార్యగా వాటన్నింటినీ ఖండించే వ్యక్తిత్వం ఉన్న ఉన్నత స్త్రీగా, ఉత్తమ ఇల్లాలిగా, పతివ్రతామతల్లిగా మండోదరి ప్రసిద్ధి పొందుతుంది. రావణుడు సీతను అపహరించుకుని తెచ్చి ఆమెను అశోకవనంలో బంధించినప్పుడు మండోదరి భర్తను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెను వెంటనే రాముడి దగ్గరకు పంపించమని ప్రాధేయపడింది. ‘రావణా! సీత నీ పాలిట కాళరాత్రి అని తెలుసుకో’ అని భర్తను హెచ్చరించినది. రాముడు ఏదో ఒకరోజు లంకను నాశనం చేస్తాడని ఆమెకు తెలుసు. రాముడికి సీతను శాంతియుతంగా తిరిగి ఒప్పగించాలని మండోదరి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మొట్టమొదటసారిగా మండోదరి మనకు సుందరకాండలో పరిచయం అవుతుంది. రామాజ్ఞావర్తనుడైన హనుమ సీతాన్వేషణ సాగించాడు. లంకను చేరిన హనుమ సీతకై అంతఃపురాన్ని పట్టణ మారుమూల ప్రాంతాలన్నీ గాలించడం ప్రారంభించాడు. ఆ సందర్భంలో అంతఃపురాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఓ సుందరమూర్తిని చూసి సీతగా భావిస్తాడు. తర్వాత పునఃపరిశీలించుకుని నా తల్లి సీతమ్మగాదు ఈమె రావణుని యిల్లాలు మండోదరి అయి వుంటుందని, తన భావన తప్పని నిర్ధారించుకుంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, అచ్చు సీతమ్మ వంటి అందగత్తె అయిన రావణుని భార్య మండోదరి అని తెలియచెప్పడమే కావచ్చు. ఇద్దరికి అందంలో అంత అభేదకత్వం ఉన్నదన్నమాట. రాముడు రావణుడి లంకపై యుద్ధం ప్రకటించాడు. రాముడితో యుద్ధం జరగబోయే ముందురోజు, మండోదరి రావణాసురుడితో తన ఆలోచనను మానుకోమంటూ తన వంతుగా చివరిసారిగా హితబోధ చేసింది. కాని ఆ ప్రయత్నమూ విఫలమయ్యింది. రాముని పరాక్రమానికి చకితుడై, ఒకరొకరుగా దూరం అవుతున్న తన పుత్ర, మిత్ర, పరివారాన్ని చూసుకుని కుమిలిపోతూ సమరాంగణం నుంచి వచ్చిన పతిని చూసి ఊరడిస్తూ, అతని శౌర్య ప్రతాపాలన్నింటిని వివరించింది. అతడికి గల అపారమైన చతురంగ బలాన్ని గురించి గుర్తు చేసింది. పూర్వం యుద్ధరంగంలో తన భర్త ఆర్జించుకున్న విజయాలన్నింటి గురించీ ఏకరువు పెట్టింది. శత్రుభంజనం చేయవలసిన నీవు ఇప్పుడు బేలగా మారడం తప్పంటూ అతని కర్తవ్యాన్ని గుర్తుచేసింది. అయినప్పటికీ రాముడు నాటుకున్న బాణం హృదయంలో నాటుకోవడంతో తన భర్త కాటుక కొండలా కుప్పకూలాడని తెలిసిన మండోదరి పరుగు పరుగున వెళ్లి యుద్ధ ప్రాంగణాన్ని సందర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉండడం ఆమెను కలచి వేసింది. అప్పుడు రాముడిని చూసి ఆమె.. రాముడు విష్ణువు అవతారమని గ్రహించింది. స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలనూ స్వయంగా చూసి తెలుసుకుంది. రాముడికి నిండు మనస్సుతో నమస్కరించింది. ఆయన మన్ననలు అందుకుంది. అభిమానానికి పాత్రురాలయింది. తన పతి శరీరానికి అంతిమ సంస్కారాలు చేసుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడామె మాటను మన్నించాడు. విభీషణుని పిలిచి, రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. అంతేకాదు, మహా పతివ్రత అయిన మండోదరి పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం ఇస్తాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూచోకూడదు. చేతనైనంతలో ఆ చెడు లక్షణాలనుంచి భర్తను పక్కకు మళ్లించి, సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. భర్త చేసే మంచి పనులకు సంపూర్ణ సహకారం అందించాలి. భర్తలోని చెడుని నివారించేందుకు తనవంతు కృషి చేయాలి. – డి.వి.ఆర్. భాస్కర్ -
హోలీ పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
హోలీ పండుగను రెండు భాగాలుగా జరుపుకోవటం ఆనవాయితీ. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు ముక్కంటి తన కంటి మంటతో కాముడిని కాల్చివేశాడనీ, దేవతల ప్రార్థనలు మన్నించి, ఫాల్గుణ పౌర్ణమినాడు మన్మథుడికి మళ్లీ ప్రాణం పోశాడనీ ఒక గాథ. కనుక చతుర్దశినాడు కామ దహనం జరిపి, పశ్చాత్తాపంతో పరిశుద్ధుడైన పంచబాణుడిని పౌర్ణమినాడు మళ్లీ ఆహ్వానించి, అర్చించుకోవటం చాలా ప్రాంతాలలో సంప్రదాయం. కామదహనంలో దహించబడే మన్మథుడు ఒక వ్యక్తి కాదు. కామం అనే శక్తికి ప్రతీక. కామం అంటే కోరిక. విషయ వాంఛ. ఇంద్రియ, మనస్సంబంధమైన కోరికలన్నీ కామమే. కోరిక హద్దులో అదుపులో ఉన్నంతసేపూ, ధర్మ విరుద్ధం కానంతసేపూ తప్పులేదు. కోరికలు తృప్తిపరచుకోవటం పురుషార్థాలలో ఒకటి. కానీ కోరికను అదుపులో ఉంచలేని వారి మనోబుద్ధులను, కోరికే తన అదుపులోకి తీసేసుకుని, విచక్షణను నాశనం చేసి, వినాశనానికీ విషాదాంతాలకూ దారి తీస్తుంది. విజితేంద్రియుడైన విశ్వేశ్వరుడి ముందు విజృం భించబోయి పుష్పబాణుడు బూడిదయ్యాడు. కామాన్ని నియంత్రించగల వాడే కామ పురుషార్థాన్ని అర్థవంతంగా అనుభవించగలడు. కామానికి స్థానమే లేని జీవితం నిస్సారం, నిస్తేజం, కళా విహీనం. కామమూ, కాముడూ మనసులోకే రాని మను గడ, మనుగడ కాదు.. మరుభూమి. కానీ మనసును విశృంఖలమైన కామాలకు వశం చేసిన బతుకూ, బతుకు కాదు.. బానిసత్వం. మనసు లోకి ప్రవేశించి ఉత్సాహమూ, ఉల్లాసమూ కలిగించే కామం మనిషి వశంలో ఉన్నంతసేపూ–ఉన్నంతసేపే! ‘మార! మా–రమ–మదీయ–మానసే/ మాధవైక నిలయే...’ అంటుంది కృష్ణ కర్ణామృతంలో గోపిక. ‘మన్మథుడా! మాధవుడి నిల యమైన మదీయ మానసంలో, నీ ఇష్టం వచ్చినట్టు విహరించాలను కోకు! ఎందుకని?... ‘ఆ లక్ష్మీపతి చటుక్కున ఎప్పుడైనా వచ్చేయ గలడు. (నిన్ను గట్టిగా దండించనూ గలడు). తన సొంత ఇంట్లో మరొ కడు దూకి తందనాలాడుతుంటే ఎవరు ఊరుకొంటారు?’ ఎంత మంచి భావన! గోపికలే కాదు, భక్తులందరూ చెప్పాల్సిన మాట! – ఎం. మారుతి శాస్త్రి -
ఆయన కంఠం భగవద్గీత రూపంలో..
ఉపాసన– ఉప.. సమీపానికి వెళ్ళడం. పరమేశ్వరుని, పరాశక్తిని తెలుసుకోవడానికి అంతర్ముఖత్వం పొంది దగ్గరగా జరగడం. అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా...’’ ఆవిడ బయట దొరుకుతుందా? అంతర్ముఖాన్ని పొందితే దొరుకుతుంది. ద్యానంలో లోపలకి వెడితే, ఆ నిశ్శబ్దంలో అక్కడ కూర్చుని లోపలికి ప్రయాణం చేస్తే అక్కడ అమ్మవారి పాదమంజీరాల సవ్వళ్ళు వింటూ, ఆమె పాదాల జంట చూసి యోగి పారవశ్యాన్ని పొందుతాడు. అలా లోపలికి వెళ్లారు విద్వాంసులందరూ... నాదోపాసన చేసి శబ్దం ఎక్కడినుంచి పైకి వస్తుందో ఆ స్థానానికి వెళ్లిపోయారు, అక్కడ లయమయిపోయారు. అందుకే భారతీయ సంస్కృతిని అంతటినీ ఉద్దీపింపచేసిన ప్రధానమైన కళల్లో ఒకటి సంగీతం. పాట పాడుకోవడం వచ్చినవాడు, దానికి స్వరాలు వేస్తూ తాను ఆనందాన్ని పొందుతూ, సభనంతటినీ ఆనందపెట్టేస్తారు. అది భగవతి అనుగ్రహం. తెలుగునేల నిజంగా గర్వపడాలి. చలనచిత్రసీమలో పాటలు పాడినా వారు తగినంత నేపథ్యం లేకుండా విజయాలు సాధించలేదు. ఘంటసాల వేంకటేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, భానుమతీ రామకృష్ణ గార్లు... ఘంటసాలగారు శరీరం విడిచి చాలా కాలమయినా... ఇప్పటికీ మనం వేంకటాచలం వెడితే ఆనంద నిలయం దగ్గర ఆయన కంఠం మనకు భగవద్గీత రూపంలో కనబడుతుంటుంది. కీర్తి శరీరులు కావడం అంటే ఇదే కదూ! బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి సాంబమూర్తిగారు. హరికథలు చెప్పేవారు. కొన్నేళ్ళపాటు దీక్ష తీసుకుని... నెల్లూరు పట్టణంలో ప్రాతఃకాలంలో కీర్తనలు పాడుకుంటూ వీథివీథి తిరుగుతూ భిక్షాటనతో సేకరించిన బియ్యం తదితర విరాళాలతో ఏటా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో అపూర్వంగా నిర్వహించారు. ఆయన చేసిన త్యాగరాజోపాసన, దాని అనుగ్రహాల ఫలితమే కుమారుడు బాల సుబ్రహ్మణ్యం దేశవిదేశాల్లో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు. అలాగే ఎవరెవరు ఎక్కడెక్కడ సంగీతంలో చేసిన ఉపాసన ఉత్తినే పోలేదు. భగవద్భక్తితో రామనామం పట్టుకున్నవాడిని, పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నవాడిని ఏ స్థానానికి చేర్చాడో... వారి వెనుక ఉన్న వాళ్లను రక్షించాడో నాదోపాసన చేసి సంగీతాన్ని నమ్ముకున్న వాళ్ళను కూడా అలాగే కాపాడాడు. భానుమతీ రామకృష్ణగారు అంతటి విద్వాంసురాలు, లబ్దప్రతిష్టులు కావడానికి కారణం వారి తల్లి... ఆమె కీర్తనలు చాలా బాగా పాడేవారు. తండ్రి గొప్ప సంగీత విద్వాంసుడు. ఒక్కొక్కప్పుడు వారి కుటుంబం కడుపునిండా తినడానికి కూడా నోచుకోని పరిస్థితులు ఎదురయితే పెరట్లోని బచ్చలి కూర నీళ్ళలో ఉడికించి దానితో నీరసంగా రోజులు వెళ్ళదీస్తూ కూడా త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు పాడుకుంటూ సమస్త బాధల్నీ మరిచిపోయేవారు. ఆ భార్యాభర్తలు చేసిన ఉపాసనా ఫలితం భానుమతి గారి గంధర్వగానం రూపంలో మనల్ని పరవశుల్ని చేసింది. అదీ నాదోపాసన అంటే... అదీ శాశ్వతత్వాన్ని పొందడం అంటే. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అవమానాల్లోనూ ఫలించిన కొమ్మ
‘మనుషుల్ని భూకంపాలు చంపవు, భూకంపానికి కూలే భవనాలు చంపుతాయి’ అంటారు శాస్త్రవేత్తలు. గొప్పగా నిర్మించుకున్న మన జీవితాలనే భవనాలు అనూహ్యపు తుఫానులు, భూప్రకంపనలకు తట్టుకోలేక పేకమేడల్లా కూలితే అదే పెనువిషాదం!! అనుకోకుండా ఎదురయ్యే ఆత్మీయ భూకంపాల్లోనే విశ్వాసి జీవితపు పునాదుల ‘పటిష్టత’, అతని దైవిక విలువల ‘నిబద్ధత’ నిగ్గుతేలుతుంది. యాకోబు కుమారుడైన యోసేపు జీవితం 17 ఏళ్ళ నవయవ్వన ప్రాయంలోనే భయంకరమైన ఆత్మీయ భూకంపానికి గురయ్యింది. యోసేపు చాలా భక్తిపరుడన్న అసూయతో సోదరులే అతన్ని నిర్దాక్షిణ్యంగా ఈజిప్ట్ వర్తకులకు బానిసగా అమ్మేశారు. ఈజిప్తులో తన యజమాని భార్య కుట్రతో జైలుపాలై యోసేపు ఇంకా కృంగిపోయాడు. ఇలా వరుస భూకంపాలకు అతని జీవితం నిజానికి సమసిపోవాలి. కాని అతని పునాదుల పటిష్టత, దేవుని పట్ల చెరగని అతని నిబద్ధత, ముఖ్యంగా ఎడబాయని ‘దైవకృప’ లక్షలాదిమందిని భయంకరమైన కరువు కోరలనుండి కాపాడే ఆశీర్వాద స్థాయికి అతన్ని చేర్చింది. సునామీలో కుప్పకూలవలసిన ఒక జీవితం, లక్షలాదిమంది అభాగ్యులను తెప్పరిల్ల చెయ్యడం, దేవుడే చేసిన ఒక మహాద్భుతం. ఈ లోకంలో దైవభయం లేక స్వార్ధంతో సమస్యలు కొనితెచ్చుకునేవాళ్ళుంటారు. దైవభయం వల్ల ఉన్నతవిలువలకు కట్టుబడి సమస్యల్లో పడేవాళ్ళుంటారు. మరికొంతమందైతే అతి తెలివితేటలతో గొప్ప ‘ప్లానింగ్’ చేయబోయి బోర్లా పడుతుంటారు. కాని అనూహ్యమైన ప్రతికూలతల్లోనే వారి వారి ‘పునాదుల’ పటిష్టత రుజువవుతుంది. దేవుని మాటలు విని బండ మీద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు, దేవుని పక్కనబెట్టి ఇసుక మీద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు అనే రెండు తెగల విశ్వాసులుంటారని యేసుప్రభువే తన కొండమీది ప్రసంగంలో పేర్కొన్నాడు (మత్తయి 7:24–27). దేవుని హృదయపూర్తిగా నమ్మినవాడు తాత్కాలికంగా చితికినా దీర్ఘకాలంలో దీవెనలు పొందుతాడు. వేషధారులు, స్వార్థ్ధపరులు, డబ్బు మనుషులు బాగున్నట్టే కనిపిస్తూ అకస్మాత్తుగా, శాశ్వతంగా దెబ్బ తింటారు. దేవుని కోసం నిలబడి నలిగినవాళ్ళు మాత్రం, దేవుని సాధనాలుగా మారి మానవాళి కి ఆశీర్వాదకారకులవుతారంటోంది బైబిల్. యోబు, మోషే, పేతురు, గిద్యోను, పౌలు, రూతు ఇలా ఎంతోమంది జీవితాల్లో కృంగి, కూలిపోయిన అనుభవాల్లోనే ‘దేవుని కృప’ అద్భుతంగా పరిమళించి, వారికి ఆశీర్వాదాల ద్వారాలు తెరిచింది. చరిత్రలో పాప విశృంఖలత్వానికి, హేయమైన అనేక సంస్కృతులకు పుట్టినిల్లయిన ఈజిప్తు దేశంలోకి, నిష్ఠ కలిగిన యూదు వంశానికి చెందిన యోసేపు ఒక బానిసగా అడుగుపెట్టాడు. అయితే ఉగ్గుపాలతో తల్లిదండ్రులు నేర్పిన దైవిక పాఠాల ‘బైబిల్’ను గుండెల్లో భద్రంగా దాచుకొని యోసేపు తన వెంట తెచ్చుకున్నాడు. చుట్టూ బురదలోనూ తామరలాగా ఆ బలంతోనే అవిశ్వాసుల మధ్య విశ్వాసిగా రాజీపడకుండా బతికాడు. పెనువిషాదాల్లోనూ అదే అతన్ని కాపాడి గమ్యాన్నిచ్చింది. ‘దేవుని ప్రేమ మనల్ని విడువదు, ఎడబాయదు’ అని, ‘పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు’ అని బైబిల్ చెబుతోంది (ద్వితీ 31:8), (యెషయా 54:10). యోసేపు జీవితంలో ఈ వాగ్దానాలు అక్షరాలా నెరవేరాయి. కాని ఇలా అందరి జీవితాల్లోనూ ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే, ఈ వాగ్దానాలకు, ‘నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో అద్వితీయుడైన నీ దేవుని ప్రేమించాలి’ అన్న ఒక ముందస్తు షరతు ఉంది (మత్తయి 22:37–39). అంటే, బైబిల్ నమ్మే, చదివే వాళ్లందరికీ కాదు, దేవుని సంపూర్ణంగా, బేషరతుగా ప్రేమించేవారికి మాత్రమే దేవుని వాగ్దానాలు వర్తిస్తాయి. అందువల్ల, దేవుని వాగ్దానాలు నెరవేరనపుడు దేవుని ప్రేమించడంలో మనం ఎక్కడ వెనకపడ్డాము? అని ప్రశ్నించుకోవాలి. సగం లోకం లో, సగం దేవునిలో ఉంటే మనం సునామీకి సమీపంలో అన్నామని అర్థం. ఐగుప్తులో ఒక బానిసగా కాలు పెట్టింది మొదలు, యోసేపు చేసిన ఒకే ఒక పని, తాను విశ్వసించిన దేవుని సంపూర్ణంగా హత్తుకొని జీవించడమే!! అందుకే సునామీలు, భూకంపాల్లోనూ దేవుని కృప యోసేపును విడువలేదు, ఎడబాయలేదు. అతన్ని కష్టపెట్టిన అన్నలే కాదు, అన్నం లేని అనేక దేశాల లక్షలాది ప్రజలు యోసేపు ముందు తలవంచే స్థితిని దేవుడు కల్పించాడు. ‘నీటి ఊటలు, ఫలాలసమృద్ధితో గోడదాటి విస్తరించిన కొమ్మ యోసేపు’, అంటూ అతని తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన అలా అక్షరసత్యమైంది!! (ఆది 49:22). – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
సప్త ఆకాశాల పర్యటన
ముహమ్మద్ ప్రవక్త(స) వారి పావన జీవితంలో జరిగిన అనేక ముఖ్య సంఘటనల్లో సప్తాకాశాల పర్యటన ఒకటి. దైవాదేశం మేరకు హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్తవారిని ఆకాశ పర్యటనకు తీసుకెళ్ళారు. ఈ పర్యటనలో ఒకచోట కొందరు వ్యక్తులు ఒక పంటను కోస్తున్నారు. అయితే ఆ పంట కోస్తున్న కొద్దీ పెరగడం చూసి,‘ఏమిటీవింత?’ అని జిబ్రీల్‌ను అడిగారు. ‘వీరుౖ దెవమార్గంలో తమ సర్వస్వాన్నీ త్యాగం చేసినవారు.’ అని చెప్పారు జిబ్రీల్. మరొకచోట కొందరు వ్యక్తులు అతుకుల బొంతలు ధరించి పశువుల్లాగా గడ్డిమేస్తున్నారు. ఇది చూసిన ప్రవక్త(స) వీరెవరని ప్రశ్నించారు. ‘వీరు తమ సంపద నుండి జకాత్ చెల్లించని వారు.’ అని చెప్పారు జిబ్రీల్ దూత. ఇంకొకచోట కొందరి తలలను బండరాళ్ళతో చితగ్గొట్టడం చూసి, ‘మరి వీళ్ళెవరు?’ అని ప్రశ్నించారు ప్రవక్త. ‘వీరు నిద్రమత్తులో జోగుతూ దైవారాధనకు బద్దకించేవారు.’ అని చెప్పారు జిబ్రీల్. మరొకచోట ఒకమనిషి కట్టెలమోపు లేపడానికి విఫలయత్నాలు చేస్తూ, అందులోంచి కొన్ని కట్టెలు తీసి తేలిక పరుచుకునే బదులు, అదనంగా మరికొన్ని కట్టెలు కలిపి మోపుకడుతున్నాడు. ప్రవక్త(స) ఈ వింతను చూసి, ‘ఈమూర్ఖుడెవరు?’ అని అడిగారు. ‘ఈ వ్యక్తి, శక్తికి మించిన బాధ్యతలు మీద వేసుకొని కూడా, వాటిని తగ్గించుకునే బదులు మరికొన్ని బాధ్యతలు భుజాన వేసుకునేవాడు.’ బదులిచ్చారు జిబ్రీల్. మరొకచోట కొందరు వ్యక్తుల పెదవులు, నాలుకలు కత్తెర్లతో కత్తిరించబడుతున్నాయి. ఇది చూసిన ప్రవక్తవారు, ‘ఇదేమిటీ? ’ అని ప్రశ్నించారు. ‘వీరు బాధ్యత మరచిన ఉపన్యాసకులు. బాధ్యతారహిత ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టి చిచ్చుపెట్టేవారు, కలహాలు రేకెత్తించేవారు.’ అన్నారు హజ్రత్ జిబ్రీల్. ఇదేవిధంగా ఇంకోచోట, బండరాయిలో ఒక సన్నని పగులు ఏర్పడి, అందులోంచి బాగా బలిసిన ఒక వృషభం బయటికొచ్చింది. అయితే అది మళ్ళీ ఆ సన్నని పగులులో దూరడానికి విఫల యత్నం చేస్తోంది. దానికి జిబ్రీల్ దూత, ‘ఇది బాధ్యతారహితంగా, మాట్లాడి, సమాజంలో కల్లోలం రేకెత్తిన తరువాత పశ్చాత్తాపం చెందే వ్యక్తికి సంబంధించిన దృష్టాంతం. నోరు జారిన తరువాత ఇక అది సాధ్యం కాదు.’ అని చెప్పారు జిబ్రీల్. మరోచోట, కొందరు స్వయంగా తమ శరీర భాగాలను కోసుకొని తింటున్నారు. ‘మరి వీరెవరూ?’ అని ప్రశ్నించారు ప్రవక్త(స).’ వీరు ఇతరులను ఎగతాళి చేసేవారు, అవమానించేవారు, తక్కువగా చూసేవారు.’ చెప్పారు హజ్రత్ జిబ్రీల్. అలాగే ఇంకా అనేక రకాల శిక్షలు అనుభవించేవారు కూడా కనిపించారు. ఇతరులపై నిందలు వేసేవారు తమ రాగిగోళ్ళతో ముఖాలపై, ఎదరొమ్ములపై రక్కుకుంటున్నారు. వడ్డీ తినేవారు, అనాథల సొమ్ము కాజేసేవారు, అవినీతి, అక్రమాలకు పాల్పడేవారు, జూదం, మద్యం, వ్యభిచారం లాంటి దుర్మార్గాల్లో కూరుకుపోయిన వారు రకరకాల శిక్షలు అనుభవిస్తూ కనిపించారు. ఎవరైతే దైవాదేశాలకనుగుణంగా ప్రవక్త చూపిన బాటలో నడుచుకుంటూ, సత్కర్మలు ఆచరిస్తారో అలాంటివాళ్ళే ఈ భయంకరమైన శిక్షలనుండి సురక్షితంగా ఉండగలుగుతారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
నాదోపాసనతో సర్వేశ్వరుని చేరడానికి సంగీతం ఓ సాధనం
వాగ్గేయకారులైన ముత్తుస్వామి దీక్షితార్ వారి గురువు చిదంబర యోగి. తల్లిదండ్రులను విడిచిపెట్టిపోయి, బ్రహ్మచారిగా కాశీపట్టణంలో చాలాకాలం వారిని సేవించారు. ఒకనాడు గురువుగారు పిలిచి ‘‘నాయనా ముత్తుస్వామి! నువ్వూ నేనూ విడిపోయే కాలం ఆసన్నమయిందిరా..’’ అన్నారు. ‘‘అయ్యో గురువుగారూ.. కాశీ పట్టణ వాసం, విశ్వనాథ అభిషేకం, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణ సేవనం, గురువుగారి శుశ్రూష.. ఇంతకన్నా జీవితంలో నాకేం కావాలి. అటువంటి అమంగళకరమైన మాటలు అనకండి’’ అన్నారు. ‘‘అమంగళకరం కాదు నాయనా, శరీరంతో వచ్చిన వాడు శరీరాన్ని విడిచిపెట్టవలసిందే, బెంగపెట్టుకోకు. ఈ వేళ నేను ముందు స్నానం చేయడం కాదు. నీవు చేయాలి’’ అన్నారు. గురువుగారి ఆజ్ఞమేరకు ముత్తుస్వామి దీక్షితార్ వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తుండగా చేతికేదో తగిలింది. పైకెత్తారు. ‘యాళి’ అని పౌరాణిక మృగం ఆకారంలో ఉంది. ఇప్పటికీ కంచి వరదరాజ స్వామి దేవస్థానంలో స్తంభం మీద చెక్కబడి ఉంటుంది. గంగా ప్రసాదంగా దీక్షితార్ వారికి దొరికిన చిన్న వీణకు ఈ యాళి చిన్న గుమ్మడికాయ ఆకారంలో ఇతర వీణల్లో లాగా కింద కాకుండా పైకి ఉంటుంది. దాని మీద ‘శ్రీరామ’ అని రాయబడి ఉంది. తరువాత కాలంలో దానిమీద సంగీతం పాడుకుంటూ పరవశించి పోయేవారు. నాకిది ఉందా లేదా అన్న చింత లేదు. నిత్య తృప్తులు. ఒకసారి తిరుత్తణి కొండమీద కూర్చుని కీర్తన చేస్తుంటే సుబ్రహ్మణ్యుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనిపించినట్లయి వెంటనే కొన్ని కీర్తనలు చేసారు. అవి తరువాతి కాలంలో ‘తిరుత్తణి కీర్తనలు’గా ఖ్యాతికెక్కాయి.. చిట్టచివరన కూడా ‘పశుపాశ విమోచినీ కామాక్షీ’ అంటూ... ‘‘అమ్మా కామాక్షీ! పశుపాశాలను కోసి వేయగలిగిన దానివి. అద్వైత మోక్షాన్ని, కైవల్యాన్ని ఇవ్వగలిగిన తల్లీ కామాక్షీ, ఈ పాశములను కోసేయమ్మా..’’ అంటూ కీర్తన చేస్తున్నారు. పాశం చేత కట్టబడేది పశువు. మనందరం పశువులమే. మనకు పాశాలు ఏముంటాయనుకోవద్దు. మనం చేసుకున్న గత జన్మ కర్మలే మనకు పాశాలు. అది జన్మస్తంభం. దానికి కట్టబడడం, చేసుకున్న కర్మల ఫలితాలను జనన మరణాలుగా అనుభవిస్తూ... అలా తిరుగుతుంటాం. నువ్విక పశువువి కాదని కర్మపాశాలను తెగకోసి.. పశుపతిలో కలిపేస్తుంది ఆ తల్లి. అందుకని ఆయనలా వేడుకుంటూ కీర్తన చేస్తుంటే... శిష్యులు ఎదురుగా కూర్చుని ఉన్నారు. అలా పాడుతుండ గా ఒక దివ్యజ్యోతి ఆయన శరీరంలోంచి వచ్చి పూజామందిరంలో ఉన్న కామాక్షిలో లయమయిపోయింది. నాదోపాసన చేత తరించారు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత గొప్పగా ఈశ్వరుడిని సేవించుకున్నామన్నది లక్ష్యంగా బతికారు. అంటే నాదోపాసనతో సర్వేశ్వరుని చేరడానికి సంగీతాన్ని ఒక సాధనంగా స్వీకరించారు. బాహ్యంలో రంజకత్వం, మానసికోల్లాసం ఉన్నా భారతీయ సంగీతం పరమ ప్రయోజనం మాత్రం ఈశ్వరుని చేరుకోవడమే. అందుకే ఉపాసన అన్న మాట సంగీతానికి కూడా అన్వయమయింది. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఏదో పెద్ద శక్తి ఉంది.. దానిపై నాకు చాలా నమ్మకం
ఇంటి వాతావరణం ఏది నేర్పిస్తే అది నేర్చుకోవడం సహజం. అలా ప్రియాంకా చోప్రాకి నేర్పించిన విషయాల్లో ‘ఆధ్యాత్మికత’ ఒకటి. ఆధ్యాత్మికత గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘భారతదేశం పలు మతాల సమాహారం. నేను చదువుకున్నది క్రిస్టియన్ కాన్వెంట్లో. దాంతో నాకు క్రిస్టియానిటీ గురించి తెలుసు. మా నాన్నగారు మసీదులో పాడేవారు. దాంతో నాకు ఇస్లాం గురించి తెలుసుకునే అవకాశం దక్కింది. నేను హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిని. హిందుత్వం గురించి సహజంగానే తెలిసిపోతుంది. భారతదేశంలో ఆధ్యాత్మికం అనేది ఓ పెద్ద భాగం. దాన్ని విస్మరించలేం. నేను హిందువుని. మా ఇంట్లో గుడి ఉంది. నేను పూజలు చేస్తాను. వీలు కుదిరినప్పుడల్లా చేస్తుంటాను. ఆ విషయం పక్కనపెడితే, ఏదో పెద్ద శక్తి ఉందని నమ్ముతాను. ఆ శక్తిపై నాకు చాలా నమ్మకం ఉంది’’ అన్నారు. -
జ్ఞానానిధి స్వామి వివేకానందుడు
"ఏకమేవ అద్వితీయం బ్రహ్మ " సృష్టిలో బ్రహ్మం తప్ప అన్యమేదీ లేదనీ; 'సర్వం ఈశావాస్యం' = సకల చరాచర సృష్టి అంతా ఒకే దివ్య చైతన్యంతో నిండి నిబిడీ కృతమై ఉన్నదనీ; భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి, బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని పునః ప్రతిష్ఠించిన వివేకరత్నం ఆదిశంకరాచార్యులు. *ప్రతి ఒక్కరూ దివ్యాత్మస్వరూపులనీ;ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితమై ఉందనీ,అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని సాక్షారింపజేసుకోవడమే మానవ జీవితధ్యేయమనీ సర్వవేదాంత సారాన్ని ప్రపంచానికి ప్రబో దించి, సనాతన ధర్మాన్ని పరిరక్షించిన వివేక భాస్కరుడు-స్వామి వివేకానంద. *సమస్త ప్రపంచాన్నీ ప్రగతి పథంలో నడి పించగల శక్తిసామర్ధ్యాలు వివేకావందునిలో ఉన్నట్లు ఆయన గురుదేవులైన శ్రీ రామకృష్ణ పరమహంస గుర్తించారు. భారతజాతి గర్వించదగిన ప్రాచీన సంప్రదాయాల గురించి, ఆ సంస్కృతినీ, యోగ్యతల్ని ఇప్పటి ప్రజలు కూడా సంరక్షించుకొంటున్న వైనం వివేకా నందుని ద్వారా ఆయన అనుయాయుల ద్వారా ప్రపంచజాతుల ముందు వివరంగా ఆవిష్కుతం కావడం ముదావహం. *ప్రపంచదేశాలకు ఈయదగిన సంస్కృతి భారతజాతికి ఉందనీ, స్వతంత్ర దేశంగా భాసించే యోగ్యతల్ని పొంది ఉన్నదనీ స్వామి వివేకానంద నిరూపించారు; అభ్యర్ధ నల ద్వారా గాక శౌర్యంతో, పురుషాకారంతో భారతీయులు స్వాతంత్ర్య సముపార్జన చేయగలరని ఋజువు చేసారు. *వివేకానందుని ధైర్యసాహసాలు అస మానం. ఆయన పురుష సింహంగా వెలుగొందారు. ఆ మహనీయుని దివ్యశక్తి ప్రభావం ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో మనపై ప్రసరిస్తూనే ఉంది. అది ఎక్కడ ఏ రూపంలో ఉందో మనం ఊహించలేం. కానీ అది చాలా పటిష్ఠమైనదిగా, ఉత్కృష్టమై నదిగా భారతావని ఆత్మలో భాగంగా భాసిస్తోంది. ఆ విధంగా వివేకానంద తన మాతృమూర్తి హృదయంలో, ఆమె సంతతి హృదయాల్లో నివసిస్తూనే ఉన్నారు. అంటారు శ్రీ అరవిందులు. *నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో , అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగృతపరచుకో, ఆత్మ స్వరూపాన్నిగ్రహిస్తున్న కొద్దీ మనలో శక్తి అధికమవు తుంది. అప్పుడు బంధాలన్నీ తెగిపోతాయంటారు స్వామి వివేకానంద. *స్వామి వివేకానంద 39 ఏళ్లు మాత్రమే జీవించారు. కానీ ఈ పరమ శంకరుడు మానవాళికి అందించిన జ్ఞాననిధి అనంతం. ఆ పరమేశ్వరుని పవిత్ర పాదస్పర్శతో పునీతమైన ఈ పుణ్యభూమిలో జన్మించినమనం అపారమైన జ్ఞానానికి వారసులమవుదాం. అమరత్వాన్ని అర్హతలుప్రసాదించమంటూ ఆ పరమ శివుణ్ణిప్రార్థిద్దాం. - గుమ్మా ప్రసాద రావు -
అహల్య... రాయిగా మారిందా?
మనలో చాలామందికి అహల్య అనే పేరు వినగానే గౌతమ ముని శాపంతో ఆమె రాయిగా మారి, రాముడి పాదం సోకగానే తిరిగి నాతిగా మారిందనే విషయమే స్ఫురణకు వస్తుంది. అయితే, అహల్య వృత్తాంతం భిన్నమైంది. అహల్య రాయిగా మారటం పూర్తి అవాల్మీకాంశం. ఆమె బ్రహ్మ మానస పుత్రిక. అహల్య అంటే అత్యంత సౌందర్యవతి, ఎలాంటి వంకరలేని స్త్రీ అని అర్థం. అహల్య ఉదంతం మనకు రామాయణంలో బాలకాండలో కనిపిస్తుంది. తాటకను సంహరించిన తర్వాత రామలక్ష్మణులను తీసుకుని విశ్వామిత్రుడు మిథిలా నగరాధీశుడు జనక మహారాజును సందర్శించడానికి వెళ్లే సందర్భంలో, మిథిలకు సమీపంలో ఉన్న వనంలో ఒక పురాతన ఆశ్రమాన్ని చూస్తాడు రాముడు. ఆ ఆశ్రమం ఎందుకో రాముని ఆకట్టుకోవడంతో ఈ ఆశ్రమం ఎవరిది, ఇక్కడ ఎవరుంటారు అని విశ్వామిత్రుని ఆసక్తిగా అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అహల్య ఉదంతాన్ని చెపుతాడు. గౌతముడు ఇంద్రుని తీవ్రంగా శపించిన తర్వాత అహల్యను కూడా శపిస్తాడు. ‘వేలాది సంవత్సరాలు నీవు అన్నపానాదులు లేకుండా వాయుభక్షణతో తపిస్తూ ఈ ఆశ్రమం నందే పడి ఉంటావు. భస్మశాయినివై ఎవరికీ కనపడకుండా నీలో నీవు కుమిలిపోతూ ఉంటావు. దశరథనందనుడైన శ్రీరాముడు ఇక్కడకు వచ్చినపుడు ఆయన పవిత్రమైన పాదధూళి సోకినంతనే నీవు పవిత్రురాలివవుతావు.. ఆయనకు అతిథి మర్యాదలు చేసిన తర్వాత తిరిగి నీవు నన్ను చేరుకుంటావు’’ అని శపించి హిమాలయాలకు వెళ్లి పోయాడు’’ అని చెప్పి మూల రామాయణంలో ఈ గాథను విశ్వామిత్రుడు శ్రీరాములవారికి తెలుపుతూ, అహల్యను తరింప చేయమని కోరుతాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలసి గౌతమముని ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. గుర్తుపట్టలేని రీతిలో ఉన్న అహల్య కనిపిస్తుంది. ఇక్కడ వాల్మీకి ఆమె వాయుభక్షణాది కఠోరదీక్షితో, తపఃప్రభావం వలన ఆమె కాంతిమయంగా కనపడుతున్నట్లు వర్ణన ఉధృతిని పెంచుతాడు. చివరకు పొగ ఆవరించి ఎవరికీ కనిపించని రీతిలో ఉందంటాడు. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగిందంటాడు. ఆ తర్వాతే అందరికీ ఆమె కనపడుతుంది అని కూడా చెప్తాడు. అప్పుడు రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరిస్తారు. ఆమె తన భర్త చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ తిరిగి వీరి పాదాలకు నమస్కరిస్తుంది. అతిథి మర్యాదలు అయిన తర్వాత రామాగమాన్ని గ్రహించి గౌతముడు అక్కడికి చేరుకుని అహల్యాసమేతుడై శ్రీ రాముని సేవిస్తాడు. ఈ గాథలో అహల్య రాయిగా మారినట్లు కనపడదు. విశ్లేషించి ఆలోచిస్తే గౌతముడు అహల్య తొందరపాటు తనాన్ని నిరసించి, ఆమెను శాసించి త్యజిస్తాడు. అహల్య పశ్చాత్తాపంతో సమాజంలో కలవక అదే ఆశ్రమంలో ఒంటరై నివసించడం వల్ల, నిరాశానిస్పృహలతో ఉండటంవల్ల ఆమె వస్త్రాలు జీర్ణమైపోయి, దుమ్ము చేరి గుర్తించేందుకు వీలు కాకుండా ఉంటుంది. వాల్మీకి వర్ణనావిశేషణాలతో రసోధృతిని పెంచగా, అనువాదకులు అనంతరకాలంలో రాముని మహిమను మరింతగా చాటి చెప్పే ప్రయత్నం చేశారు. వాల్మీకి తదనంతర కవులు నాటకీయతను, స్థానికతను జోడించి, అహల్య రాయిగా మారిందని శ్రీరాముని పాదపద్మం సోకగానే ఆమె శాపవిమోచనం పొందిందని మార్పులు చేర్పులు చేసి రచించారు. అదే తర్వాత దృశ్యకావ్యాల్లో కూడా కనపడడం వల్ల ప్రజల మనసుల్లో స్థిరమై పోయింది. వాల్మీకి రామాయణంలో అహల్య వృత్తాంతం గురించి ప్రస్తావన ఉంది. భర్త గౌతమ మహర్షి శాపంతో రాయిగా మారిన అహల్య, శ్రీరాముడి పాదస్పర్శతో తిరిగి స్త్రీ రూపం ధరించిందనే కథనాలు ఉన్నాయి. అద్భుత సౌందర్యవతి అయిన అహల్యను ఎందరో తమ సతిగా చేసుకోవాలనుకుంటారు. అయితే, త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోడానికి అర్హులని బ్రహ్మ ప్రకటించాడు. దీంతో, తన శక్తులన్నీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చిన ఇంద్రుడు, అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని కోరుతాడు. అదే సమయంలో నారదుడు వచ్చి ఇంద్రుడికంటే ముందుగా గౌతముడు ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెబుతాడు. అదెలాగని ఆశ్చర్యపోతున్న ఇంద్రుడితో– గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడని, అలా ఒక రోజు ప్రదక్షిణలు చేస్తుండగా లేగ దూడకు ఆవు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో గో ప్రదక్షిణ చేయడం ముల్లోకాలను చుట్టడంతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలిపాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి వివాహం జరిపించమని అన్నాడు. దీంతో అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి బ్రహ్మ వివాహం చేశాడు. అహల్యను భార్యగా పొందలేకపోయిన ఇంద్రుడు, గౌతముడి రూపంలో వచ్చి తన వాంఛను తీర్చుకున్నాడని అంటారు. కానీ ఇది కూడా నిజం కాదని కొందరంటారు. అపార తపశ్శక్తి, మేధాశక్తితో ఇంద్రపదవికి కావల్సిన సర్వవిజ్ఞానం గౌతముడు పొందాక, ఆయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఓ పథకం వేశాడు. అతడు కామక్రోధ మదమాత్సర్యాలను జయించాడా? లేదా? అని తెలుసుకోడానికి గౌతమ మహర్షి రూపంలో అహల్య చెంతకు వస్తాడు. అలా వచ్చింది ఇంద్రుడేనని తన పాతివ్రత్య బలంతో అహల్య గ్రహించింది. అయితే ఇంద్రుడంతటి వాడు తనను కావాలనుకోవడాన్ని గుర్తించి అహల్య క్షణకాలం పాటు విచలితురాలయింది. ఆమె మనసును చంచలం చెయ్యగలిగినందుకు దేవేంద్రుడు తనలో తాను నవ్వుకున్నాడు. అప్పుడు సత్యం బోధపడిన ముని పత్ని ఇంద్రుణ్ణి వెంటనే అక్కడినుంచి వెళ్లిపోమని వేడుకుంటుంది. కానీ, ఈ లోగా అక్కడకు వచ్చిన గౌతముడు పొరబడి, ఆవేశంతో ఇద్దరినీ శపించాడు. అలా ఆయనకు ఇంద్రపదవిని దేవేంద్రుడు దూరం చేశాడు. అలాగే, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యేళ్లు జీవించాలని గౌతముడు ఆమెను శపించాడు. కానీ రాయివి కమ్మని అనలేదు. జనబాహుళ్యంలో బలంగా చొచ్చుకుపోయి ఉన్నకథలలో చాలా వరకు ప్రక్షిప్తాలే. అహల్యాగౌతముల కుమారుడైన శతానందుడు జనకుడి ఆస్థాన పురోహితుడు. వీరి కుమార్తె అంజన, హనుమంతుడి తల్లి. అంటే అహల్య గౌతముడి అమ్మమ్మ అన్నమాట. అహల్య పంచకన్యల్లో స్థానం సంపాదించుకోగలిగిందంటేనే ఆమె పవిత్రతను మనం అర్థం చేసుకోవచ్చు. – డి.వి.ఆర్. భాస్కర్ -
దుర్యోధనుడు ఏం చేశాడు?
స్వయంవరానికి ఎవరెవరు వచ్చారు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలుగా వంద మంది కౌరవులు, కర్ణుడు, అశ్వత్థామ, సోమదత్త, భూరిశ్రవుడు మొదలైన రాజులు వచ్చారు. స్వయంవరానికి ఇంకా ఎవరెవరు వచ్చారు? శల్యుడు, జరాసంధుడు, శకుని, అక్రూరుడు, సాంబు డు, సాత్యకి, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, కృతరవర్మ, అనిరుద్ధుడు, యుయుధానుడు మొదలైన యదు, వృష్టి, భోజ, అంధక వంశీయులు వచ్చారు. ఇంకా ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. ద్రౌపదిని చూసిన రాజులు ఏం చేశారు? ద్రౌపదిని చూసిన రాజులు మక్కువతో, ధనుస్సు దగ్గరకు వెళ్లారు. కొందరు ధనుస్సు పట్టలేకపోయారు. కొందరు వంచలేకపోయారు. వారిని చూచి మరికొందరు ప్రయత్నం మానుకున్నారు. కృష్ణుడు ఎవరెవరిని వారించాడు? వృష్టి, భోజ, యాదవులను కృష్ణుడు వారించాడు. ఎవరెవరు విఫలులయ్యారు? శిశుపాల, జరాసంధ, శల్య, కర్ణులు ప్రయత్నించి విఫలులయ్యారు. బ్రాహ్మణుల మధ్య నుంచి ఎవరు లేచారు? అర్జునుడు బ్రాహ్మణుల మధ్య నుంచి లేవటంతో, బ్రాహ్మణులు సంతోషించారు. అర్జునుడు ఏం చేశాడు? ధనువు దగ్గరకు వచ్చి, గురువులకు నమస్కరించి, ధనుస్సుకు ప్రదక్షిణం చేసి, అవలీలగా ధనుస్సు అందుకుని, ఐదు బాణాలు వేశాడు. ఆకాశంలో ఉన్న మత్స్యయంత్రం పడగొట్టడంతో సభ ఆశ్చర్యపోయింది. అందరూ అర్జునుడిని ఏ విధంగా కీర్తించారు? మత్స్యయంత్రాన్ని ఇంత సులువుగా కొట్టినవాడు నరుడు కాడు, ఇంద్రుడో, రుద్రుడో, సూర్యుడో, కుమారస్వామియో అయి ఉంటారని కీర్తిస్తూ, పూల వాన కురిపించారు. దుర్యోధనుడు ఏం చేశాడు? దుర్యోధనుడు కోపంతో, ద్రుపదుడు తమను అవమానించాడనుకుని, ద్రుపదుని వధించాలని దండెత్తాడు. భీముడు, అర్జునుడు ఏం చేశారు? ఒక చెట్టు పెరికి నిలిచాడు, అర్జునుడు బాణం ఎక్కుపెట్టాడు. అర్జునుడికి కర్ణుడికి, భీముడికి శల్యుడికి మధ్య యుద్ధం జరిగింది. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
వివాహ బంధం: బ్రహ్మముడి అంటే...?
శుభదినాన, ప్రథమంగా వరునివైపువారు వధువు ఇంటికివెళ్ళి వారికి ఆహ్వానం పలుకుతారు. అప్పుడు వధువుకు ముత్తైదువులచే మంగళస్నానాలుచేయించి, నూతన వస్త్రాలు ధరింపజేసి, కళ్యాణ తిలకం దిద్ది పాదాలకు పారాణిపెట్టి చక్కగా అలంకరించి పెండ్లికుమార్తెను చేయాలి. ఆ తర్వాత వరుడికి కూడా మంగళ స్నానాలు చేయించి, నూతన వస్త్రాలు ధరింపజేసి, కళ్యాణతిలకం దిద్ది, పాదాలకు పారాణితో అలంకరించి పెండ్లికుమారుణ్ణి చేయాలి. తర్వాత వరునిచేత ‘గృహస్థాశ్రమ ధర్మాచరణ కొరకు, సత్సంతానం కొరకు, నరకవిమోచనం కొరకు’ వివాహమాడుతున్నానని సంకల్పం చెప్పించి, గణపతి పూజ, పుణ్యహవాచనాలు చేయించి రక్షాబంధనం చేయించాలి. విడి గృహంలో ఒక కొత్త గంపలో కొద్దిగా ధాన్యం లేక అక్షింతలను వుంచి, వధువును ఆ గంపలో కూర్చుండబెట్టి, ఆమె చేత మంగళ గౌరీపూజ చేయించాలి. మన పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు కనుక, సౌభాగ్య ప్రదాయిని గౌరీదేవిగనుక, వధువుచేత మంగళగౌరీపూజ చేయించుట ఆచారం. ఆ తర్వాత, గౌరీ పూజలో వుంచిన కంకణాన్ని వధువుకు రక్షగా ధరింపజేస్తారు. తదుపరి, వరునితరపువారు, వధువు తండ్రితో వరుని గోత్రప్రవరలను చెప్పి కన్యాదానంచేయమని అర్థించుట ఆచారం. అప్పుడు వధువు తండ్రికూడా తమ గోత్రప్రవరలు చెప్పి అంగీకారం తెలియజేస్తాడు. తదుపరి కన్యాదాన సమయాన, కన్యాదాత ఆచమనంచేసి మహా సంకల్పం చెప్తాడు. ఇందులో త్వష్ట, విష్ణు, శివ, సూర్య, ఇంద్రాది సమస్త దేవతల ఆశీర్వాదాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ తరువాత కన్యాదాత సువర్ణదాన, గోదాన, భూదానాది దశమహాదానాలను చేయవలసివుంటుంది. వధువు తల్లిదండ్రులు వరుణ్ణి విష్ణుస్వరూపంగా భావించాలి. అప్పుడు వారు ఆ వరుని కాళ్ళు కడిగి తమ శిరస్సుపై చల్లుకుని, వరునికి యథా శక్తి నూతన వస్త్రాలు, ఆభరణాదులను ఇచ్చి పూజిస్తారు. కన్యాదాతకు దక్షిణతాంబూలాదులను వుంచి, జలధారతో ఆ దోసిలిని, వరుని దోసిలిలో వుంచుతారు. వధువు తండ్రి తన కుమార్తెను కన్యాదానం చేసినప్పుడు, ‘సంప్రదదే నమమ’ అని అనడు. అంటే, ఈమెను నీకు సంపూర్ణంగా దానం చేసి ఈమెపై నా హక్కును వదులుకుంటున్నాను, ఇక పై ఈమె నాది కాదు, సంపూర్ణంగా నీదే అని అనడు. అలా సంపూర్ణ హక్కును విడువకుండా ఆ కన్యాదాత దానంచేస్తాడు. ఎందుకంటే ఉత్తరోత్తరా ఏదైనా సమస్యలవల్ల ఆమెను తన భర్త విడిచినచో తనను పోషించాల్సిన బాధ్యతను తండ్రి వదులుకోడు. అందుకనే, కన్యను గ్రహించినప్పుడు వరుడిచేత ‘పరిగృహ్ణామి‘ అని అనిపించరు. కేవలం ‘స్వస్తి‘ అని మాత్రమే అనిపిస్తారు. ఆ సమయంలో, కన్యాదాత వరునిచేత కొన్ని వాగ్దానాలు చేయించుకుంటాడు. అవి ‘ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్యా‘ అని. అనగా, వారిరువురూ దంపతులైనతర్వాత, భార్య అనుమతి లేకుండా భర్త, ఎటువంటి ధర్మ, అర్థ, కామ సంబంధమైన కార్యాలు చేయరాదు అని. అందుకు వరుడు ‘నాతిచరామి‘, అనగా ధర్మ అర్థ కామసంబంధ విషయాలలో ఆమెను అతిక్రమించను అని అంగీకారం తెలియజేస్తాడు. ఆ తర్వాత, వరుడు అగ్నిప్రతిష్ఠాపన చేస్తాడు. తదుపరి మధుపర్కం అనగా, కొద్దిగా తేనె, పెరుగులను కలిపి తనకు తినిపిస్తారు. తరువాత వధూవరులు ఇరువురు జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఒకరి శిరసుపై మరొకరు వుంచుతారు. తదుపరి వధువు నడుముకు యోక్త్రమనే తాడును కడతారు. పిమ్మట, స్వర్ణశిల్పాచార్యునిచేత నిర్మించి పూజించబడిన రెండు మంగళసూ త్రాలను, వారికి తగు దక్షిణాఫల తాంబూల స్వయంపాకాదులనిచ్చి వారి ఆశీర్వచనం తీసుకుని మేళతాళాలతో కళ్యాణవేదిక వద్దకు తీసుకువచ్చి, రెండు తలంబ్రాల పళ్ళెరాలలో వుంచి, ముత్తైదువుల చేత తాకించి, అందరి ఆశీర్వాదాలను తీసుకుంటారు. పిమ్మట వరుడు మంగళసూత్రాలను తీసుకుని, వధువుకు ఎదురుగా నిల్చి ‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం‘ అను మంత్రాన్ని చదువుతూ మూడుముళ్ళు వేస్తాడు. తర్వాత, వధూవరుల దోసిళ్ళను పాలతో శుభ్రం చేసి, వానిని తలంబ్రాలతో నింపి, మొదటగా వరుడు వధువు శిరమున పోస్తాడు. ఆ సమయంలో ‘నీవలన సత్సంతాన వృద్ధి జరుగును గాక’ అను మంత్రాన్ని చదువుతారు. వధువు చేత ‘పాడిపంటలు వృద్ధియగునుగాక’ అను మంత్రాన్ని చదువుతూ తలంబ్రాలు పోయిస్తారు. మూడోసారి వరుడిచేత ‘ధన ధాన్య వృద్ధి జరుగును గాక’ అంటూ తలంబ్రాలు వధువు శిరస్సుమీద పోయిస్తారు. ఆ తర్వాత ఆ తలంబ్రాలను అన్నింటినీ వధూవరులు ఉల్లాసంగా ఒకరి శిరస్సున ఒకరు దోసిళ్ళ తో పోస్తారు. ఆ తర్వాత, వారి దాంపత్య బంధం ఆజన్మాంతం వర్ధిల్లాలను విషయానికి సూచనగా, వారి కొంగులను ముడివేస్తారు. దీనినే బ్రహ్మముడి/ బ్రహ్మగ్రంథి అంటారు. తర్వాత వరుడు, తమ బంధం నిలవాలని, వారికి సత్సంతానం కలగాలనే సంకల్పంతో దేవతలను ప్రార్థిస్తూ తన కుడిచేతిని బోర్లించి, వధువు కుడిచేతిని గ్రహిస్తాడు. దీనినే పాణిగ్రహణం అంటారు. –ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు చదవండి: ‘రాగాలు’ రాగిణులై కనబడ్డాయి పవిత్రతా స్వరూపిణి సీత -
‘రాగాలు’ రాగిణులై కనబడ్డాయి
లలితా సహస్ర నామ స్తోత్రంలో అమ్మవారిని ‘కావ్యాలాప వినోదినీ’ అని స్తుతిస్తారు. కావ్యాలను ఆలాపన చేసేవాళ్ళను చూసి అమ్మ సంతోషిస్తుంది. అందుకే మనకు కావ్యాలను చదవడం కోసం కాకుండా వీణమీద పలికించమని, నోటితో పాడమని ఇచ్చారు. శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి లవకుశులకు –వీణమీద పలికిస్తూ, పాడండి–అని ఇవ్వడంతో వారు అయోధ్యకు వెళ్ళి అలాగే పాడారు. అంటే శ్రీరామాయణం నిజానికి పాటగా పాడుకోవలసినది. శ్లోకాలు అంత గొప్పగా రచించారు. అందుకే ఆలాపన చేసే వాళ్ళు ఆ తల్లికి అంత దగ్గరగా కూర్చుంటారు. వాళ్ళు తమ ఉపాసనా శక్తిని, ఆ సంతోషానికి, వాళ్ళు అనుభవిస్తున్న తాదాద్య్మతకి అమ్మవారు దిగొచ్చేస్తుంది కూడా. ఆ విషయం బాలమురళీగారే చెప్పుకున్నారు కూడా.. బాల మురళీ కృష్ణ గారు ఒక మహానగరంలో సముద్రపు ఒడ్డున కచ్చేరీ చేస్తున్నారు. ఇసకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఆయన కళ్యాణి రాగం పాడుతున్నారు. ఆయనకు ఆ రాగమం టే మహాప్రీతి. గంటకుపైగా తనను తాను మర్చిపోయి ఆ రాగాన్ని ఆలపిస్తుండగా... ఇంతలో మహాసౌందర్యవతి ఐన ఒక పిల్ల కొప్పునిండా పూలు పెట్టుకుని జనంలోంచి నడిచి వస్తుంటే అందరూ దారి వదిలారు. ఆ పిల్ల నేరుగా వచ్చి వేదిక మీద బాలమురళీగారి పక్కన కూర్చుంది. ఆయన చూసారు. ఏ కళ్యాణి రాగాన్ని ఉపాసన చేసానో, ఆ రాగమే సాకారమై నడిచి వచ్చి నా పక్కన కూర్చుంది–అని సంతోషంతో అప్పటికప్పుడు ఆశువుగా కళ్యాణి రాగంలో పరమాద్భుతమైన ఒక కీర్తన చేసారు. ‘ఎంత సొగసైన దానివమ్మా! నేను ఈ రాగాన్ని ఆలాపన చేసి చేసి భావుకత్వంతో ఆకసానికి ఎగిరిపోయా. అక్కడ పాడుతున్నా... అంతకుముందు చంద్రుడికి కళలు పెరగడం, తరగడం ఉండేవి కావు. నా ఆలాపనకు అమృతాన్ని శరీరంగా కలిగిన చంద్రుడు కరిగిపోయి, ముద్దయిపోయి, నవనీతం అయిపోయాడు. అప్పటినుంచి చంద్రుడికి కళలు తరగడం, పెరగడం మొదలయ్యాయి... అంతకుముందు నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఊగుతుండేవి కావు. నేను అంబరవీథికి గిరి కళ్యాణి రాగాన్ని ఆలాపన చేసినప్పుడు చుక్కలు ఊగడం మొదలయ్యాయి. నేను మళ్ళీ తిరిగి వచ్చి వేదిక మీద కూర్చున్న తరువాత కళ్యాణి ప్రీతి పొంది అంతర్ధానమయింది. కళ్యాణి రాగాన్ని పాడుతున్నప్పుడు ఆ రాగమే పరవశించి అరమోడ్పు కన్నులతో కూర్చుని ఉంటే...బ్రహ్మగారు .. నేను ఇటువంటి మూర్తిని సృజించలేకపోయానని సిగ్గుపడ్డాడు...’’ అంటూ చక్కటి భావుకతతో ఒక కీర్తనను ఆయన సజించి ఆలపించారు. ఇదీ భారతీయ సంగీతం గొప్పదనం. కొంతమంది మహాపురుషులకు ఆ రాగాలు రాగిణులై దర్శనమిచ్చాయి. భారతీయ సంస్కృతికి పునాది అయిన ఇటువంటి కళలలో ఎంత భగవత్ తత్త్వాన్ని ఉపాసన చేసారో, అసలు ఆ పాట పాడుతూ పాడుతూ ఎక్కడికో వెళ్ళిపోయి ఎంత గొప్ప గొప్ప స్థితులు అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: పవిత్రతా స్వరూపిణి సీత కావ్యాలు చదవకూడదు, పాడుకోవాలి -
పవిత్రతా స్వరూపిణి సీత
భారతదేశంలో వివాహితుడు భార్య ప్రక్కన ఉంచుకోకుండా ఏ క్రతువు, వ్రతము చెయ్యకూడదు. భార్య భర్త ప్రక్కన ఉండాలి. సహ ధర్మచారిణి అనేది పత్నికి వాచకం. గృహస్థుడు అనుష్ఠించాల్సిన కర్మకలాపాలు వందల. సంఖ్యలో ఉన్నాయి. కానీ భార్య లేకపోతే సక్రమంగా ఏ కర్మ చెయ్యడానికి శాస్త్ర ప్రకారం అతడికి అర్హత లేదు. రాముడి భార్య బహిష్కరింపబడ్డ కారణంగా ఆమె అతని ప్రక్కన లేదు. కాబట్టి ప్రజలు రాముణ్ణి పునర్వివాహం చేసుకోమన్నారు. " అలా ఎన్నటికీ జరగదు.నా జీవితం సీతదే." అన్నాడు రాముడు. రాజుగా అతడు ప్రజల కోరికను ప్రతిఘటించడం ఇదే మొదలు. యజ్ఞ నిర్వహణార్థం అప్పుడు సీతాదేవికి బదులుగా బంగారంతో ఒక సీత ప్రతిమను రూపొం దించారు. రాముడు నైమిశారాణ్యంలో అశ్వమేధ యాగం చేసాడు. ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షి శిష్య సమేతంగా వెళ్ళాడు. వాల్మీకి కుశలవులను రామాయణాన్ని గానం చేయమని ఆదేశిం చాడు. రామాయణాన్ని విన్న రాముడు వారు సీత పుత్రులే అని నిశ్చయించుకున్నాడు. సీత తన శుద్ధిని తన నిర్దోషిత్వాన్ని ఋజువు చేసే శపథం చేయాలని దూతల ద్వారా కబురు పంపాడు. వాల్మీకి వెంట సీత సభలో ప్రవేశించింది. సీత చేయబోయె శపథాన్ని వినటానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజలతో ఆ సభ కిక్కిరిసిపోయింది. వాల్మీకి తన తపస్సు సాక్షిగా సీత పరిశుద్ధు రాలని ఉద్ఘోషించాడు. సీత సౌశీల్యం తనకు తెలుసని అయినా లోకాపవాదానకి వెరసి తాను సీతను పరిత్యజించినట్లు అంగీకరిం చాడురాముడు.ఈ కలవలిద్దరు తన బిడ్డలేనన్నాడు. సీత త్రికరణశుద్ధిగా తాను రాముడిని పూజించి నట్లయితే వివరమిమ్మని భూదేవిని ప్రార్థించింది మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే । తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి ॥ అప్పుడు భూమి విచ్చుకుంది. " ఇదిగో ఋజువు " అంటూ సీత భూమి ఒడిలోచేరింది. భూదేవి సీతను సింహాసనంపై కూర్చోబెట్టుకొని రసాతలానికి వెళ్ళిపోయింది. ఈ విషాద పర్యవసానానికి ప్రజలు నిర్వీణ్ణు లయ్యారు. రాముడు శోక సముద్రంలో మునిగి పోయాడు. సీతాదేవి పాతివ్రత్యమే! పవిత్రతా సరూపమే! ఆమె తన భర్త దేహాన్ని తప్ప మరొకరి దేహాన్పి స్పృశించదు. "పాతివ్రత్యమే ఆమె పరిశుద్ధత" అని రాముడన్నాడు. సీత అనే మాట భారత దేశంలో శుభం, పరిశుద్ధం,పవిత్రమైనవాటికెల్లా పర్యాయపదం, ఆమె సకల సద్గుణాలరాశి. సీత క్షమాశీలి,సర్వదా పరిశుద్ధ వర్తనం ఉన్న అర్థాంగి అంతటి బాధను అనుభవిస్తున్నా రాముని గురించి ఒక్క పరుషమైన వాక్కు కూడా పలకలేదు. సీత ఏనాడూ హానికి ప్రతిహాని తలపెట్ట లేదు.ప్రతి స్త్రీ సీతాదేవి అవడానికి ప్రయయ్నంచుగాక! -గుమ్మా నిత్యకళ్యాణమ్మ చదవండి: నమస్కారం ఎవరికి.. ఎలా? తెలివుండాలి...తెలిసుండాలి -
నమస్కారం ఎవరికి.. ఎలా?
నమస్కారం భారతీయ సంస్కృతి. అది ఉత్తమ సంస్కారం అంటారు పెద్దలు. ఎలా నమస్కారం చేయాలనే కాదు ఎన్నిసార్లు నమస్కారం చేయాలో మన శాస్త్రంలో లెక్క ఉంది. ప్రసన్న వదనంతో రెండు చేతులు జోడించి వాటిని ఛాతీకి ఆనించి నమస్కారం చేయాలి. నమస్కారం ఎవరికి... ఎలా చేయాలో తెలుసుకుందాం... ఈ భూమి మన తల్లి. మన దినచర్యలో భాగంగా తెలిసో తెలియకో మనం ఎన్నో అపరాధాలు చెస్తున్నాం. అందుకే నిద్ర లేవగానే తప్పులు మన్నించమని ముందుగా భూమాతకు నమస్కారం చేయాలి. ఆ తరువాత ఇంటిలో తల్లిదండ్రులుంటే వారికి నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం అన్ని వేళలా, అన్ని చోట్లా చేయ నవసరం లేదు. పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలనుకుంటే వక్షస్థలాన్ని నేలకు తాకేలా శిరస్సు నేలపై ఉంచాలి. రెండు చేతులు నమస్కార స్థితిలో సాగదీసి ముందుకు చాపాలి. దేవుడికి ఈ నమస్కారం చేస్తున్నప్పుడు పురుషులు ఛాతి మీద వస్త్రం ఉంచుకోరాదు. అందువలన సాంప్రదాయకంగా దేవునికి, మఠాధిపతులకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నపుడు ఈ నియమం పాటించవచ్చు. పూర్వకాలంలో అంతవరకు పరిచయం లేని పెద్దలకు నమస్కారం చేస్తున్నప్పుడు తమ వంశం పరంపర, గోత్రం, పేరు చెప్పే ఆచారం ఉండేది. ఆధునిక కాలంలో అది కుదరదు. అయినా నమస్కారం చేస్తూ స్వంత పరిచయం చేసుకోవడం మంచిది. ఒక్కొక్కప్పుడు అవతలి వ్యక్తి హోదాలో పెద్ద, వయస్సులో చిన్న కావచ్చు. వయస్సులో చిన్నవారికి నమస్కారం చెయ్యం కాని హోదాలో పెద్ద కాబట్టి తప్పక నమస్కారం చేయాలి. కొందరు ఉన్నత అధికారులు తమ కన్నా తక్కువ ఉద్యోగంలో ఉన్న పెద్దవారికి ముందుగా నమస్కారం చేసిన ఉదాహరణలున్నాయి. కొన్ని సందర్భాల్లో వంగి నమస్కరించవలసి వస్తుంది. అప్పుడు వారి పాదాలను చేతితో తాకి ఆ చేతిని మన శిరస్సు మీద ఉంచుకోవాలి. తల్లిదండ్రులకు, తనకన్నా పెద్దవారైన ఇతర కుటుంబ సభ్యులకు ఒకసారి నమస్కారం చేస్తే చాలు. సన్న్యాసులు, మఠాధీశులు, చాతుర్మాస దీక్షలో ఉన్నప్పుడు నాలుగు పర్యాయాలు నమస్కారం చేయాలి. గుడిలోనూ పూజామందిరంలోనూ దేముడి ముందు నమస్కారం చేయాలి. అది ఒక స్థానంలో నిల్చుని అయినా లేదా ఆత్మప్రదక్షిణ చేస్తూనో చేయాలి. అమ్మవారి విషయంలో నాలుగు పర్యాయాలు నమస్కారం చెయ్యాలి. భక్తితో నమస్కరిస్తే అది అనంతకోటి ఫలాలనిస్తుందని శాస్త్రవచనం. ఇంతవరకు నమస్కారం చేసేవారి ధర్మం గురించి తెలుసుకున్నాం. మరి దానిని స్వీకరించినవారి ధర్మమేమిటి? మనకు పురుషులు నమస్కరిస్తే ‘దీర్ఘ ఆయుష్మాన్ భవ’ అని, పుణ్యస్త్రీలు అయితే ‘దీర్ఘ సుమంగళీ భవ’ అనీ ఆశీర్వదించాలి. పిల్లలు నమస్కరిస్తే ‘సువిద్యా పాప్తి రస్తు’ అని, అవివాహితులయిన యువతీ యువకులను శీఘ్రమేవ వివాహ ప్రాప్తి రస్తు’ అని దీవించాలి. సందర్భానుసారంగా వారి కోరికలు సిద్ధించాలని ఆశీర్వదించాలి. భగవంతుడు అభయ ముద్రలోనే ఉంటాడు కాబట్టి ఆయన మన నమస్కారం స్వీకరించేడని సంతృప్తి పడాలి. ఒక శ్లోక భావాన్ని అనుసరించి నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా మనం ఎవరికి నమస్కరించినా అది చివరకు కేశవుడికే చెందుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. –గుమ్మా ప్రసాద రావు -
వివాహానికి ఏమి పరిశీలించాలి?
వివాహం ఎన్ని విధాలో గత వారంలో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వివాహానికి ఏమి పరిశీలించాలో అవలోకిద్దాం. ఒకే గోత్రం, లేదా ఒకే ప్రవర కలిగినవారు వివాహం చేసుకోవడాన్ని నిషేధించారు. తండ్రికి 7 తరాలవరకు, తల్లికి 5 తరాలవరకు సపిండురాలైన కన్యను చేసుకోరాదని శాస్త్రవచనం. అందరూ కూడా తమ వర్ణానికి చెందిన కన్యనే వివాహమాడాలని స్మృతులు శాసించినాయి. కానీ, బ్రాహ్మణులు మూడువర్ణాలకు చెందిన కన్యలని, క్షత్రియులు రెండువర్ణాలకు చెందిన కన్యలని, వైశ్యులు వైశ్యవర్ణానికి చెందిన కన్యలను వివాహమాడవచ్చు అని కొన్ని స్మృతులు బోధించాయి. దీనిని అనులోమ వివాహం అంటారు. కానీ నిమ్నవర్ణాలవారు హెచ్చువర్ణాలవారితో వివాహానికి స్మృతులు అంగీకరించలేదు. దీనిని విలోమవివాహం అంటారు. వర్ణధర్మాలను పాటించనివారు, మగ సంతానం లేనివారు, వేదాధ్యయనం చేయనివారు, దొంగలు, మోసగాళ్ళు, నిందలుమోసేవాళ్ళు, రాజద్రోహులు, కురూపులు, క్షయ, కుష్ఠు, పాణ్డు రొగపీడితులు, వంశపారంపర్యంగా వచ్చు రోగపీడితులైనవారు, మిక్కిలి పొడుగువారు, మరగుజ్జులు, విపరీతమైన నల్లటి / తెల్లటి శరీరంగలవారు, వికలాంగులు మొదలగు వారితో వివాహాలను శాస్త్రాలు నిషేధించాయి. ఇరువర్గాలవారు, విద్య, ఐశ్వర్యాదులలో సమానంగా వున్నప్పుడే ఆ వివాహ బంధం నిలచునని శాస్త్రకారుల వచనం. వరుణ్ణి ఎంచుకునేముందు, అతడి గుణగణాలతోబాటు, అతని వంశం, శాస్త్రపరిజ్ఞానం, వయస్సు, ఆరోగ్యం, శరీరపుష్టి, బంధుబలగం, సంపదలు అను ఎనిమిది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నియమం పెట్టారు. రోగాలతో వున్నవానికి, మారువేషాలలో తిరిగే వానికి, అవయవ సౌష్టవం లేనివానికి, విపరీతమైన బలం గలవానికి, బలహీనునికి, సంపాదన లేనివానికి, గుణహీనునికి, బుద్ధిహీనునికి, విదేశాలలోవుండువానికి, కన్యను ఇవ్వరాదని శాస్త్ర నియమం. శారీరక పరిపుష్టత, ఆరోగ్యరీత్యా, వధువు వయస్సు వరుని వయస్సుకంటే తక్కువగా వుండాలని అందరు శాస్త్రకారులు నిర్ణయించిన విషయం. శాస్త్రకారులందరు, వధువు రజస్వల కాకమునుపే వివాహం చేయాలని తీర్మానించారు. వివాహానికి ఉపయుక్తమైన కాలం గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తంచేశారు స్మృతికారులు. కొందరు ఉత్తరాయణంలో మాత్రమే చెయ్యాలని, మరికొందరు సంవత్సరమంతా చెయ్యొచ్చని చెప్పారు. చైత్ర, పుష్యమాసాలు పనికిరావని కొందరు చెప్పారు. ఆషాఢ, మార్గశిర, ఫాల్గుణ మాసాలు విడిచిపెట్టాలని కొందరు, అన్ని మాసాలలో చెయ్యచ్చని కొందరు చెప్పారు. రోహిణీ, మృగశిర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శ్రవణ, స్వాతి నక్షత్రాలు మంచివని కొందరు చెప్పియున్నారు. బుధ, గురు, శుక్రవారాలు వివాహానికి మంచివని కొందరు అంటే, రాత్రిపూటచేసే వివాహాలకు వారం పట్టించుకోనవసరం లేదని కొందరు స్మృతికారులు చెప్పారు. త్రిజ్యేష్టం, అనగా, జ్యేష్ట సంతానాలుగాని, జ్యేష్ఠ మాసంగానీ, జ్యేష్ఠా నక్షత్రంగానీ మూడు రకాల జ్యేష్ఠలు కలవకూడదని నియమంపెట్టారు. వివాహ విషయంలో, జ్యోతిష్యం ప్రముఖ పాత్రను పోషిస్తుంది. వధూవరుల వివాహ పొంతన పరీక్ష చేయడానికి, వర్ణం, వశ్యం, జన్మ/నామ నక్షత్రాలు, యోనులు, గ్రహాలు, గణాలు, రాసులు, నాడులు, కూటాలు అని ఎనిమిది అంశాలని పరిగణనలోకి తీసుకునే పద్ధతి వున్నది. వీటిలో ఆఖరి రెండు అంశాలకూ ప్రస్తుతం కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగిలినవి పెద్దగా పట్టించుకోవడంలేదు. మొత్తం 27 నక్షత్రాలు, దేవ, మానుష్య, రాక్షస అని మూడు తరగతులుగా/గణాలుగా విభజించారు. వధూవరులిద్దరూ ఒకే గణానికి చెందినవారైతే మంచిది. లేనిచో వారు కొన్ని నిబంధనల్ని పాటించాలి. వధూవరులు వారి జన్మ సమయాన్ని బట్టి వారు కొన్ని జంతుయోనులకు చెందినవారైవుంటారు. వారు జాతివైరం గల జంతువులకి చెందినవారు కాకుండా వుండాలి. ఉదాహరణకి, సింహం –జింక, పులి–మేక, పాము–ముంగిస, పిల్లి–ఎలుక, ఇలా వైరి వర్గానికి చెందకుండా వుండాలి. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు చదవండి: వివాహం కాని మానవులు పరిపూర్ణులు కారు.. కావ్యాలు చదవకూడదు, పాడుకోవాలి -
కావ్యాలు చదవకూడదు, పాడుకోవాలి
‘సంధ్యారంభవిజృంభితమ్’ .. అని శంకరాచార్యులవారు అంటారు శివానందలహరిలో. సంధ్యా కాలం లో శివుడు నాట్యం చేస్తాడు–అంటాడు. సంధ్య.. అంటే? చీకటి వెళ్ళిపోయి సూర్యుడు వస్తున్నాడు..ఆ మధ్య కాలంలో ఆకాశం ఎర్రబడుతుంది. అది ప్రాతః సంధ్య. మధ్యాహ్నం నడినెత్తి మీదికి వస్తాడు.. అది మాధ్యాహ్నిక సంధ్య. సాయంకాలం.. చీకటి వస్తుంటుంది. పగలు వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మళ్ళీ ఆకాశం ఎర్రబడుతుంది... అది సాయం సంధ్య. ఒక అవస్థలోంచి మరొకదానిలోకి మారుతున్న మధ్య కాలానికి సంధ్య అనిపేరు. దోషమ్ అంటే చీకటి. ప్రదోషమ్.. చీకటికి ముందు వెలుతురు అస్తమిస్తున్న కాలం. ఈ రెంటికీ మధ్య ఉంది కాబట్టి ప్రదోషమ్–సంధ్యాకాలం. సంధ్యాకాలంలో నిశ్శబ్దం ఉంటుంది. సంధ్య మారుతుంటే కాలం నడుస్తుంటుంది. శుక్లపక్షం, కృష్ణపక్షం, మాసాలు, రుతువులు.. నడుస్తాయి. అవి నడిస్తే సుఖం, దుఃఖం అనుభవంలోకి వస్తుంటాయి. సంధ్యలలో కాలం మారిపోతుండాలి. ఈ నడకకి సంధ్య ప్రధానం. సంధ్యాకాలం ఉంటే తప్ప విజృంభణం అన్నది ఉండదు. అంటే అసలు శివుడు ఎక్కడ ఉంటాడు? ఊపిరికీ, ఊపిరికీ మధ్యలో... నేను ఊపిరి లోపలికి తీసుకుంటున్నప్పుడూ ఆ తరువాత నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మనసు లో ఆలోచించి లోపలికి తీసుకున్న ఊపిరిని మళ్ళీ వాక్యంగా మార్చి ఆవిష్కారం చేస్తుంటాను. ఆ మధ్యలో ఆయన లోపల విజంభిస్తుంటాడు. మాటలు మాట్లాడేటప్పుడయితే...‘సంధ్యారంభ విజృంభితమ్’ అంటాం. మరి సంగీతంలో అయితే...!!! శృతి, స్వరం శబ్దంగా పైకొచ్చి వెనక్కి వెడతాయి. రెండుగా ఉన్నవి ఒకటిగా మారిపోతాయి, లోపల అణిగి పోతాయి. ఇక్కడినుంచే ‘ఝుమ్’ అన్న నాదం వస్తుంటుంది. రెండు చెవులు గట్టిగా మూసుకుంటే వినబడుతుంటుంది. మనలోంచే వస్తుంటుంది. నాదోపాసన చేసే విద్వాంసుడు పాట పాడుతూ పాడుతూ వెనక్కి వెళ్లిపోయి శృతినీ, స్వరాన్ని కలిపి నాదంలోకి తీసుకెడతాడు. ఆ నాదాన్ని వింటాడు. అప్పుడు ఒక లిప్తకాలం ఆగిపోతాడు. ఆగి నాదోపాసన చేస్తాడు. అలా నాదాన్ని ఉపాసన చేయడమే శివోపాసన. అదే ఈశ్వరోపాసన. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్రసరస్వతి మహాస్వామి వారు.. ప్రదోష కాలంలో చంద్ర మౌళీశ్వరునికి అభిషేకం చేసి చిట్టచివర చిన్న వీణ చెవి దగ్గర పెట్టుకుని తీగలు మీటుతూ నాదోపాసన చేస్తుండేవారు. నాదోపాసనం సంగీత విద్య. దానితో భగవంతుడిని చేరుకుంటారు. అంతగొప్ప స్థితి భారతీయ సంగీతానికి ఉన్నది. అందుకే అది సంస్కృతిగా వికసనాన్ని ఇస్తుంది. ఎక్కడ సంగీతాన్ని పరమ సంతోషంతో ఆలపించే అలవాటు ఉంటుందో అక్కడ రెండు లక్షణాలు పొటమరిస్తుంటాయి. ఒకటి–భక్తితో అద్భుతమైన దర్శనం కలిగి భావాలుగా ప్రకటితమవుతుంటాయి. అంటే వాగ్గేయకార స్థితి ఏర్పడుతుంది. రెండు–తాను ఆ పాట పాడుతున్నప్పుడు దానితో రమించిపోయి–వెనక్కి వెళ్ళి నాదంతో ఒకటయిపోయి నిలబడిపోతాడు. అందుకే ఆ భావుకత ఏర్పడినప్పుడు ఆయన ఎంత స్థాయికి వెడతారంటే– బ్రహ్మ సృష్టిని తాను అనుకున్నట్లు ఎలా చేస్తాడో, కవి కూడా అలాగే తాను అనుకున్నట్లు కావ్య నిర్మాణం చేస్తాడు. భావుకు డయిన సంగీత కర్త, ఉపాసకుడు, విద్వాంసుడు అలా ఉపాసన చేస్తూ గానం చేసేటప్పుడు పరదేవత ఆనందానికి కారణమవుతాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం లో అమ్మవారిని ‘కావ్యాలాప వినోదినీ’ అని స్తుతిస్తాం. అందుకే మనకు కావ్యాలను శ్లోకాలుగా చదువుకోమని ఇవ్వలేదు.. తన్మయత్వంతో ఆలపించమని ఇచ్చారు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చదవండి: అర్జునుడు అంగారపర్ణునితో ఏమన్నాడు? ప్రకృతి స్వరాలు... వికృతి స్వరాలు -
ప్రకృతి స్వరాలు... వికృతి స్వరాలు
‘‘సద్యోజాతాది పంచవక్త్రజ స–రి–గ–మ–ప–ద–ని వర సప్తస్వర విద్యాలోలమ్...’’ అన్నారు త్యాగరాజ స్వామి. జ–అంటే పుట్టినది–అని. సద్యోజాతాది పంచవక్త్రజ...పరమ శివుడికి ఐదు ముఖాలు–సద్యోజాతం, అఘోరం, సత్పురుషం, వామదేవం... పైన ఉండే ముఖం–ఈశానం. ఇది మోక్షకారకం. ఈ సప్తస్వరాలు పరమశివుడి ఐదు ముఖాల్లోంచి వచ్చాయి. వేదం కూడా భగవంతుని ముఖం లోంచే వచ్చింది కాబట్టే దాన్ని అపౌరుషేయం అంటారు. అంటే ఎవ్వరి చేత రాయబడినది కాదు–అని. శృతి–గురువుగారి దగ్గరి నుంచి స్వరంతో మంత్రాన్ని విని శిష్యడు వేదాన్ని నేర్చుకుంటాడు. అంతే తప్ప మంత్రాలు పుస్తకాల్లో రాసుకుని చదువుకోరు. వేదాలు ఎలా భగవంతుని ముఖం నుండి వచ్చాయో, అలాగే ఏ సంగీతం ఏడు స్వరాల మీద ఆధారపడిందో అది పరమశివుని ఐదు ముఖాలు... సద్యోజాతాది పంచవక్త్రజ... సద్యోజాతం మొదలయిన ఐదు ముఖాలనుండి పుట్టింది. స్వరాలు ఏడయినప్పుడు మరి మిగిలిన రెండు స్వరాల సంగతేమిటి? ఏయే స్వరాలు పరమశివుని ముఖాన్నుండి వచ్చాయి, రాని రెండు ఏవి ? అసలు స్వరాలు పరమశివుని ముఖాన్నుండి వచ్చాయి అంటే దానర్థం వాటికన్నా ముందే పరమ శివుడు ఉన్నాడనేగా. అంటే మిగిలిన రెండు స్వరాలు పరమశివుని ముఖం నుండి రాలేదా ..? సప్తస్వరాలు–షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. వీటినే స–రి–గ–మ–ప–ద–ని అని అంటాం. ఇందులో షడ్జమం–నెమలి కూత లోంచి, రిషభం–ఎద్దు రంకె లోంచి, గాంధారం– మేక అరుపు లోంచి, మధ్యమం–క్రౌంచ పక్షి చేసే శబ్దం లోంచి, పంచమం–కోయిల కూత లోంచి, దైవతం–గుర్రం సకిలింపులోంచి, నిషాదం–ఏనుగు ఘీంకారంలోంచి వచ్చాయి. స–రి–గ–మ–ప–ద–ని అనే ఏడు స్వరాలకూ ఆరోహణ, అవరోహణ ఉంటాయి. భగవంతుడి నుండి విడిపోతే అవరోహణ. మళ్ళీ పైకిపోతే ఆరోహణ... అంటే ఈశ్వరుడిలో ఐక్యం కావడం... అదీ సంగీతం ద్వారా. సప్త స్వరాల్లో రెండు– షడ్జమం, పంచమం..ఈ రెండూ శివుడి పంచముఖాల్లోంచి రాలేదు. అంటే శివుడు ఎప్పటినుంచి ఉన్నాడో అప్పటినుంచి ఉన్నాయి. అందుకే వాటిని ప్రకృతి స్వరాలని అంటారు. ఇవి అనాది–అవి ఎప్పటినుంచి ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. మిగిలిన ఐదు వికృతి స్వరాలు. అవి శివుని ముఖాల్లోంచి వచ్చాయి. ‘‘సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వరసప్తస్వర విద్యాలోలం విదలితకాలం విమలహృదయ త్యాగరాజపాలం’’...కాలుడిని.. యముడిని కూడా చంపినవాడు, కాలాతీతుడయిన శివుడున్నాడే... ఆయన విమలమైన మనసు ఉన్న త్యాగరాజును పరిపాలించే ‘నాదతను మనిశం శంకరం నమామి మే మనసా శిరసా’... ఆ శివుడికి నమస్కరిస్తున్నాను. బాలమురళీకృష్ణ గారు ఒకసారి ఫ్రాన్సులో కచేరీ చేస్తుండగా.. ఒకతను ఫ్రెంచిభాషలో ఒక గీతాన్ని రాసి పాడమన్నారు. దానిని చదివి ఆకళింపు చేసుకుని, భారతీయ సంగీతంలోని సప్త స్వరాలలోకి, రాగంలోకి, తాళంలోకి తీసుకొచ్చి ఆయన అత్యద్భుతంగా ఆలపించారు. ఆ దేశస్థులు నివ్వెరపోయారు. గొప్ప బిరుదిచ్చి సత్కరించారు. భారతీయ సంగీతంలోకి ఇమడని ఇతర సంగీతం లేదు. మన సంగీతం ఇతర సంగీతాలలోకి ఇమడదు. అదీ మన సంస్కృతి గొప్పదనం. మనం దానికి వారసులంగా గర్విస్తూ వాగ్గేయకారులకి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలం !!! -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఉత్తరాయణంలో
46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ రోజునే స్వచ్ఛంద మరణమనే వరం ద్వారా ప్రాణ త్యాగం చేసినందువల్ల మాఘశుద్ధ అష్టమికి భీష్మాష్టమి అని పేరు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయనీ విశ్వాసం. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణ లు వదలరాదు కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడిది. భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. శిరఃస్నానం చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి. పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించుకోవాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం ‘ఓం నమోనారాయణాయ‘ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు. -
రథ సప్తమి: ప్రత్యక్షదైవం పుట్టిన రోజు...
చిమ్మ చీకట్లను తరిమి.. చలిని తొలగించి నులి వెచ్చని ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించే కర్మసాక్షిగా నిలిచే సూర్యభగవానునికి కృతఙ్ఞతా సూచకంగా చేసే పండుగ ఇది. సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజు పవిత్రమైన రోజుగా భావించి సూర్యుణ్ణి ఆరాధిస్తారు. చలికాలం చివర్లో.. వేసని కాలపు ఆరంభం మాఘ మాసమవుతుంది. ‘రథసప్తమి’ పండుగను మాఘ మాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్తకిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్య భగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. ధాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పూష, పర్జన్య, అంశుమాన్, ఖగ, త్వష్ట, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయం అవుతాయని, దారిద్య్రం తొలగుతుందనీ భవిష్య పురాణం చెబుతోంది. ఈ ‘రథ సప్తమి’ రోజు తిరుమల తిరుపతిలో కూడా శ్రీవారిని ముందుగా సూర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడవాహన, పెద శేష వాహన, కల్పవృక్ష వాహన, స్వయం భూపాల వాహనాలపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా ఇదే రోజు చేస్తారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని కన్నులపండుగ గా జరుపుతారు. భక్తులు స్వామి వారిని కనులారా దర్శించుకుని తరిస్తారు. అరసవెల్లిలో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. రథ సప్తమికి ముందు రోజున రాత్రి ఉపవాసం చేసి, మరునాడు అంటే రథ సప్తమి అరుణోదయంతోనే స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దానిని శిరసుపై నుంచి, సూర్యుని ధ్యానించి, దీపాన్ని నీటిలో వదిలి, స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు, జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగుపళ్ళు నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయాలి. స్నానానంతరం.. సూర్యునికి అర్ఘ్యమిచ్చి, ధ్యానం చేయాలి. అటు తర్వాత తల్లిదండ్రులు లేని వారైతే, పితృతర్పణం చేసి, చిమ్మిలి దానం చేయాలి. ఇంకొందరు రథసప్తమి వ్రతం కూడా చేస్తారు. మాఘశుద్ధ షష్టి నాడు, అంటే రథసప్తమికి ముందు రోజు తెల్ల నువ్వులపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. బంధువులతో కలసి నూనె లేని వంటకాలతో భోజనం చేయాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. వేద పండితులను పిలిచి, వారినే సూర్య భగవానులుగా తలచి సత్కరించాలి. రాత్రికి నేలపై నిద్రించాలి. గురువుకు ఎరుపు వస్త్రాలు దానం చేయాలి. ఇలా రథసప్తమీ వ్రతంతో సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్యాది సకల సంపదలు లభిస్తాయని శాస్త్రప్రబోధం. – పూర్ణిమా స్వాతి చదవండి: ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు? ప్రపంచంలో మొదటి రాతి దేవాలయం -
ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు?
రాజుల్మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు, వారిచ్చు నం భోజాక్షీ చతురంతయాన తురగీభూషాదు లాత్మవ్యధా బీజంబుల్, తదపేక్షచాలు, పరితృప్తింపొందితిన్, జ్ఞానల క్ష్మీజాగ్రత్పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా! భావం: శ్రీకాళహస్తీశ్వరా! రాజులు గర్విష్ఠులు. వారిని ఆశ్రయించడం నరకంతో సమానం. ఆ రాజులిచ్చే స్త్రీలు, పల్లకీలు, గుర్రాలు, నగలు, మొదలైన కానుకలు మనస్సుకు దుఃఖం కలిగిస్తాయి. ఈ రాజులసేవ ఇకచాలు!!! పొందవలసిన తృప్తినిపొందాను. ఇక నాకు నువ్వు జ్ఞానలక్ష్మీ జాగ్రదావస్థను దయతో ప్రసాదించు. నీరూపంబు దలంపగా తుద మొదల్నే గాన వీవైనచో రారా రమ్మనియంచు చెప్పవు, వృధారంభంబు లింకేటికిన్ నీరన్ముంపుము పాలముంపుమిక నిన్నేనమ్మినాడంజుమీ శ్రీరామార్చితపాదపద్మయుగళా! శ్రీకాళహస్తీశ్వరా ! భావం: శ్రీకాళహస్తీశ్వరా! నీ రూపాన్ని తలచుకోవాలంటే, దాని తుద, మొదలు తెలియని అశక్తుడను. పోనీ, నీవైనా నామీద దయతలచి నన్ను రమ్మని పిలవవు. ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు? నిన్నే నమ్ముకున్నాను. నీట ముంచుతావో, పాలముంచు తావో, అది ఇక నీదయ! తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం -
బలమైన కుటుంబంతో బలమైన సమాజం
మానవజాతి మనుగడకు కుటుంబం పునాది. భార్యాభర్తల అనుబంధం ద్వారా కుటుంబం ఉనికిలోకొస్తుంది. ఈ అనుబంధమే కౌటుంబిక వ్యవస్థ పునాదులను పటిష్ట పరుస్తుంది. దానిద్వారా సమాజం ఏర్పడుతుంది. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య బంధం పటిష్టంగా ఉండాలి. ఆ బంధం పటిష్టంగా లేకపోతే సంసార నావ ముందుకు సాగదు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల బంధమే దీన్ని సురక్షితంగా కాపాడగలుగుతుంది. సంసార జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయి. సర్దుకు పోవడమే సంసార రహస్యం. అలకలు, గిల్లికజ్జాలు, బతిమాల్పులు సహజం. ఐక్యత, ప్రేమ, అనురాగం, సహనం, త్యాగం తదితర సుగుణాల మేళవింపే కుటుంబం, సంసారం. కాని, నేడు అన్ని రంగాలూ కలుషితమైనట్లుగానే కుటుంబ వ్యవస్థ కూడా పాడైపోయింది. తద్వారా సమాజం ప్రభావితమై, సామాజిక అసమానతలకు, విచ్చిన్నతకు దారితీస్తోంది. బంధాలు అనుబంధాలు అపహాస్యం పాలవుతున్నాయి. ఈ విధంగా కుటుంబంలో, సమాజంలో ఆత్మీయత, మానవీయ విలువలు మృగ్యమైపోతున్నాయి. ‘తల్లిదండ్రుల పట్ల సత్ ప్రవర్తనతో మెలగమని, వారి సేవచేయాలని మేము మానవుణ్ణి ఆదేశించాము. అతని తల్లి బాధపై బాధను భరిస్తూ అతణ్ణి కడుపులో పెట్టుకొని మోసింది. అతణ్ణి పాలు మరిపించడానికి ఆమెకు రెండు సంవత్సరాలు పట్టింది. కనుక నాపట్ల కృతజ్ఞుడవై ఉండు. నీ తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞతగా మసలుకో. చివరికి నువ్వు నావద్దకే మరలి రావలసి ఉంది.’ (దివ్యఖురాన్ 31 – 14) హజ్రత్ ఆయిషా (రజి) ఉల్లేఖనం ప్రకారం: ‘మీలో ఎవరైతే మీ కుటుంబంతో మంచిగా మసలుకుంటారో వారే ఉత్తములు.’ అన్నారు ప్రవక్త మహనీయులు. కుటుంబ సభ్యులు, బంధుగణంతో సత్సంబంధాలు కొనసాగిస్తేనే బంధాలు బలపడతాయి. కుటుంబ వ్యవస్థ, తద్వారా సమాజం బలోపేతమవుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
యేసును మురిపించిన జక్కయ్య విశ్వాసం
జీవం లేని బలమైన దుంగలు ప్రవాహంలో కొట్టుకుపోతే, జీవమున్న చిన్నారి చేపపిల్లలు ప్రవాహానికి ఎదురీదుతాయి. లోకంతో పాటు కొట్టుకుపోయే జీవితానికి జక్కయ్య అసలైన ఉదాహరణ. బోలెడు డబ్బు, సామాజిక ప్రాబల్యం జక్కయ్య సొంతం. జక్కయ్య అనే హెబ్రీ పేరుకు ‘పవిత్రుడు’ లేదా ‘నీతిమంతుడు’ అని అర్థం. జక్కయ్య ఎలాంటి వాడు కావాలని తల్లిదండ్రులు ఆశపడ్డారో వాళ్ళతనికి పెట్టిన ఈ పేరునుబట్టి అర్ధం చేసుకోవచ్చు. ధర్మశాస్త్రబద్ధంగా, తలిదండ్రులు బహుశా అతన్ని ఎనిమిది రోజుల శిశువుగా ఉన్నపుడే సున్నతి కోసం, తాముండే యెరికోకు దగ్గరే గనుక, యెరూషలేము ఆలయానికి తీసుకళ్లారేమో. పన్నెండేళ్ళు పూర్తయినపుడు యూదులంతా చేసే ‘బార్ మిట్జ్వా’ అనే ఉత్సవాన్ని కూడా అతని తల్లిదండ్రులు ఆలయంలో అట్టహాసంగా చేశారేమో. కానీ చివరికి అతని జీవితం మాత్రం వాటన్నింటికీ విరుద్ధమైంది. లోకానికి ఎదురీది మహావిశ్వాసి కావాల్సిన జక్కయ్య, లోకమలినానికి మారుపేరయ్యాడు( లూకా 19:7). ఇది అతని తల్లిదండ్రులకే కాదు, దేవునికి కూడా ఎంతో నిరుత్సాహాన్ని మిగిల్చిన పరిణామం. దేవుని ప్రేమను విస్మరించి, లోకంతో పాటు కొట్టుకోవడంలో అంతకాలం అతనికి ఆనందం, సౌలభ్యం దొరికింది. అయితే అంతమాత్రాన అతను దేవుణ్ణి ఏమీ విడిచిపెట్టలేదు. దేవుడతనికి జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. కాకపోతే జక్కయ్యకు లోకమే సర్వస్వమ్ అయ్యింది. అదీ అతని సమస్య, అదే మనలో చాలా మందికున్న సమస్య కూడా. అలా లోకపరంగా ఎంతో ఉత్తేజంతో జీవించాడు కాని ఆత్మీయంగా చాలా స్తబ్దంగా ఉండిపోయాడు. అంటే, జక్కయ్య తాజ్ మహల్ లాంటివాడన్నమాట. తాజ్ మహల్ బాహ్యంగా కళ్ళు చెదిరేంత సుందరమైన, గొప్ప కట్టడమైనా లోలోపల కుళ్ళుకంపు కొట్టే సమాధే కదా!! రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే పనిలో జక్కయ్య తన అంతరాత్మను తాకట్టుపెట్టి అవినీతిపరుడు, ధనవంతుడు కూడా అయ్యాడు. ధనవంతుడవడం పాపం కాదు, కానీ దొడ్డిదారిలో ధనార్జన చెయ్యడం, దేవుని మీద కాకుండా, డబ్బు మీదే ఆధారపడి జీవించడం పాపం. నీతిమంతుడు ఏడుసార్లు పడ్డా తిరిగి పైకి లేస్తాడన్న బైబిల్ సూక్తి ప్రకారం (సామె 24:16), అంతగా పడిపోయిన జక్కయ్య, తన జీవితంలో ఒక దశలో ఇక తాను ఆత్మీయంగా తిరిగి పైకి లేవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే యేసు వస్తున్నాడని తెలిసి యెరికోలో ఒక చెట్టెక్కి యేసు కోసం ఎదురు చూశాడు. ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఇదొక మహత్తరమైన నిర్ణయం. అలాంటి నిర్ణయాన్ని ప్రభువు కూడా గొప్పగా హర్షిస్తాడు. జక్కయ్యలో ఇన్ని లోపాలున్నా అతనిలో యేసుప్రభువు చూసిన ఒక గొప్ప సుగుణమేమిటంటే, అతను కేవలం యేసు కోసమే యేసు వద్దకొచ్చాడు. జనమంతా స్వస్థతలు, సంపదలు, సమస్యల పరిష్కారం కోసం యేసు వద్దకు తరలివస్తున్న రోజుల్లో, జక్కయ్య మాత్రం యేసే కావాలనుకొని, యేసు మాత్రమే తనకు చాలుననుకొని, యేసును ఆశ్రయించాడు, అలా యేసును జక్కయ్య, అతని కుటుంబం కూడా సంపూర్ణంగా పొందారు. తన డబ్బంతా పేదలకు, తనవల్ల అన్యాయం జరిగిన వారికి పంచి, డబ్బు కన్నా యేసే తనకు ముఖ్యమని, తాను డబ్బు మనిషిని కాదని, యేసుమనిషేనని ఆచరణలో రుజువుచేసుకున్నాడు, ఇదే అత్యున్నతమైన శ్రేణికి చెందిన విశ్వాసం. అందుకే జక్కయ్య అబ్రాహాము కుమారుడన్న బిరుదును ఏకంగా యేసు నుండే పొంది, తన విశ్వాసానికి ప్రభువు నుండే ప్రామాణికతను సంపాదించుకున్నాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
వివాహం కాని మానవులు పరిపూర్ణులు కారు..
ప్రపంచ దేశాల వైవాహిక వ్యవస్థలన్నింటిలో భారతదేశ వైవాహికవ్యవస్థ తలమానికమైనది. ఇంత బలమైన పునాదులుగల వ్యవస్థ మరి ఏ ఇతర దేశాలలోనూ లేదు అనిచెప్పవచ్చు. ఇంత పటిష్ఠమైన వ్యవస్థను భారతీయులు నిర్మించగలిగారు కనుకనే, భారతదేశం ఒక ధార్మిక సమాజాన్ని నిర్మాణంచేయగలిగింది. పాశ్చాత్య దేశాలలోని ప్రజలు, వివాహమంటే, ఇంద్రియముల సేవకై స్త్రీపురుషులు కేవలం కొంతకాలం మాత్రం నిలిచియుండే ఒక భౌతికమైన సంబంధాన్ని మాత్రం ఏర్పరచుకోవడం అనుకుంటారు. కానీ సనాతన ధర్మంలో వివాహమంటే, ఆ స్త్రీ పురుషుల మనస్సులు, వాక్కులు, శరీరాలు, ప్రాణాలు, ఆత్మలు ఒకటికావాలంటూ, వారిద్దరి మధ్యలో ఒక గాఢమైన ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక బంధాన్ని ఏర్పరుస్తారు. ఆ బంధంద్వారా వారిద్దరూ ఆజన్మాంతం కలిసిమెలిసివుండి ఇద్దరికీ మోక్షంకలిగించే ఒక ప్రయత్నమే సనాతనధర్మంలో వివాహమంటే. వివాహంలో జరిపే ప్రతి ఒక్క ఆచారమూ వివిధరకాల దేవతలతో ముడివడి ఆ నూతన వధూవరుల మనసులో, విడదీయరాని ఒక పారమార్ధిక బంధాన్ని ఏర్పరిచేవిధంగా బలమైన ఆలోచనలను కలిగిస్తుంది. అందుకే షోడశ సంస్కారాలలో వివాహం ఒక ప్రధాన సంస్కారంగా పరిగణించారు పెద్దలు. వివాహానికే ఉద్వాహం, కల్యాణం, పరిణయం, ఉపయమం, పాణిగ్రహణం అని పేర్లు. హిందూ సంస్కారాలలో వివాహ సంస్కారానికి సర్వోన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. ఎందుకంటే, అన్ని సంస్కారాలకు, అన్ని వ్యవస్థలకు మూలాధారమైన సంస్కారం ఇదే కాబట్టి. గృహస్థాశ్రమమే మిగిలిన మూడు ఆశ్రమాలకు, అంటే బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్న్యాస ఆశ్రమాలకు కేంద్రమై వున్నది. గృహస్థాశ్రమం లేకుంటే, మిగిలిన మూడు ఆశ్రమాల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. అన్ని ఆశ్రమాలు గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి వుంటాయి కనుకనే, గృహస్థాశ్రమాన్ని జ్యేష్ఠాశ్రమం అని కూడా అన్నారు. అంతేకాకుండా, వివాహం కాని మానవులు పరిపూర్ణులు కాజాలరు. ఎందుకంటే, వారు చేసిన యజ్ఞంతో దేవతలు సంతృప్తిని పొందరు. ఇదిగాక, కేవలం వివాహ సంస్కారం ఆచరించి గృహస్థుడైన పురుషుడు, తన ధర్మపత్ని ద్వారా సత్సంతానాన్ని పొంది నరకబాధల నుండి విముక్తి పొందుతాడని శాస్త్రవచనం. కనుక, వివాహంలేని మనుష్యునకు మోక్షప్రాప్తి కూడాలేదు. పైగా, దైవదత్తం, ప్రకృతిసిద్ధం, బహుబలీయమూ అయిన మానవుని కామవాంఛను విశృంఖలం కానీయక అదుపులో వుంచి, ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ఈ వివాహవ్యవస్థ ఎంతో అవసరం. – ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు -
వివాహానికి...సమావర్తనం
సమావర్తనానికే స్నాతకమని పేరు. వేదాధ్యయనం పూర్తిచేసుకున్న బ్రహ్మచారి, ఆ ఆచార్యుని కోరికననుసరించి, గురుదక్షిణ సమర్పించి, గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి గురుకులంనుండి ఇంటికి తిరిగి వెళ్ళడాన్నే సమావర్తనం అంటారు. ఈ సంస్కారానికి స్నానం అనే కార్యక్రమం ముఖ్యంగా చెప్పబడింది. ఎందుకంటే, బ్రహ్మచర్య వ్రతంలోవున్న విద్యార్థిని అనగా వేదాధ్యయనం చేసే బ్రహ్మచారిని కొన్ని దివ్యశక్తులు ఆవహించి వుంటాయి. వానిని ఈ ప్రత్యేకమైన స్నాతకం ద్వారా ఉద్వాసన చేయాలి. లేనిచో, లౌకిక జీవితంలో ప్రవేశించిన బ్రహ్మచారి ఆ దివ్యశక్తులను భ్రష్టుపట్టిస్తాడు. కాబట్టి దైవానుగ్రహం పొందలేడు అనేది శాస్త్రం. ఈ స్నాతక సంస్కారం పూర్తైన తర్వాత నుండి, బ్రహ్మచారికి మంచం మీద నిద్రించే అర్హత వస్తుంది. అంతవరకు ఆ బ్రహ్మచారి నేలమీదే నిద్రించాలి. కానీ ఒకవేళ ఆ బ్రహ్మచారి తన తండ్రి వద్దనే వేద విద్యను వంశపారంపర్యంగా అధ్యయనం చేస్తే, ఈ స్నాతకాన్ని జరిపించాల్సిన అవసరం లేదని కూడా కొందరు శాస్త్రకారుల వచనం. ఈ సంస్కారం జరిగిన తర్వాత, భిక్షాటన, యాచన చేయరాదని శతపథ బ్రాహ్మణం చెప్తుంది. బ్రహ్మచర్య నియమాలు పాటించక భ్రష్టుపట్టినవారికి, సంపూర్ణ వేదాధ్యయనం చేయనివారికి, వేదమంత్రాల అర్థం తెలుసుకోకుండా, కేవలం వేదాన్ని కంఠతా పట్టినవారికి ఈ స్నాతక సంస్కారం చేయించుకునే అర్హత ఉండదు అని శాస్త్రకారులు ఘంటాపథంగా తెలియజేశారు. ఈ సంస్కారాన్ని బ్రహ్మచర్యాన్ని మొదలుపెట్టిన 48 సంవత్సరాలలోపే జరిపించాలని, ఆ తర్వాత అనర్హుడని శాస్త్రం. ఎందుకనగా, బ్రహ్మచారికి ఒక్కొక్క వేదా న్ని అధ్యయనం చేయడానికి, 12 సంవత్సరాల కాలం పడుతుంది కాబట్టి, ఒకవేళ బ్రహ్మచారి, నాలుగు వేదాలనూ సంపూర్ణంగా అధ్యయనం చేసినా కూడా 48 సంవత్సరాల కాలం సరిపోతుంది కనుకనే ఆ నియమం విధించారు. బ్రహ్మచారి గనుక నిరుపేద ఐతే, వేదాధ్యయనం ప్రారంభించేటప్పుడే, ఆ బ్రహ్మచారి, తాను నిరుపేదననీ, ఎటువంటి గురుదక్షిణనూ ఇవ్వలేననీ గురువుతో తెలిపి, ఆయన అనుమతి తీసుకుని, వేదాన్ని అధ్యయనం చేయాలని ఒక నియమం. తన విద్యతో, గుణగణాలతో, సంస్కారంతో గురువును మెప్పించగలిగితే, అందుకు సంతోషించిన గురువు, ఆ బ్రహ్మచారికి స్నాతకాన్ని నిర్వహించే అవకాశాన్ని శాస్త్రం తెలియజేసి వుంది. ఈ సంస్కారాన్ని ఉత్తరాయణంలో, శుక్లపక్షాలలో, రోహిణీ, మృగశిరా, పుష్యమీ, ఉత్తరా, హస్తా, చిత్రా, స్వాతీ, విశాఖా నక్షత్రాలలో జరిపించాలని శాస్త్రం. సంస్కార విధానం: శుభదినాన, శుభముహుర్తాన, గణపతిపూజ, పుణ్యహ వాచనాలను జరిపించాలి. తర్వాత, విశేషించి, అప్పటివరకు ఆచరించిన బ్రహ్మచర్య వ్రతంలో తెలిసీ తెలియక తనచే ఏర్పడిన 33 రకాల దోషాలకు, అంటే, స్నాన జప సంధ్యావందన అనుష్ఠానాలని సరిగా నిర్వహించకపోవడం, మంచంపైన నిద్రించడం, భిక్షాన్నం తినకపోవడం, అగ్నికార్యం నిర్వహించకపోవడం, కౌపీన మేఖల దండాదులని ధరించకపోవడం, ధర్మాతిక్రమణం చేయడం, ధర్మ భ్రష్టులతో సహవాసం చేయడం, తినగూడనివి తినడం, మొదలగు దోషాలు పోగొట్టుకోవడానికి, పాహిత్రయోదశ హోమాన్ని చేయాలి. ఆ తర్వాత వివిధరకాలైన హోమాలు చేసి దేవతలకు హవిస్సులర్పించాలి. అష్టదిక్పాలకులను ఆవాహించిన ఎనిమిది జలకలశాలు వుంచి, కార్యక్రమం పూర్తైన తర్వాత ఆ కలశాలలోని నీటితో స్నానం చేయాలి. ఈ స్నానం, అష్టదిక్కులనుండి అతనికి రక్షణ కలగాలని గుర్తుగా ఆ ఎనిమిది కలశాలలోని నీటితో చేయిస్తారు.ఆ తర్వాత, స్వర్ణశిల్పాచార్యులచే నూతనంగా తయారుచేయించిన ఒక బంగారు పూసలో దారంగుచ్చి మెడలో ధరించాలి. తర్వాత, అప్పటివరకు ధరించిన మేఖలాలు, అజినం, దండాలని నిమజ్జనంచేయాలి. పిమ్మట, శిల్పాచార్యులకు, పురోహితులకు దక్షిణలను ఇచ్చి వారిని సంతుష్టులను చేయాలి. అప్పటినుండి అతడు స్వర్ణాభరణాలను, రంగు వస్త్రాలని, ఛత్రాన్ని, అద్దాన్ని ఉపయోగించచ్చు. క్షౌరం చేసుకోవచ్చు. రథాన్ని, అశ్వాన్ని, గజాన్ని ఎక్కవచ్చు. ఈ స్నాతకంలో ఆఖరుగా, అప్పటివరకు వేదవిద్యను నేర్పించిన గురువు, ఆ బ్రహ్మచారికి, ఆఖరిసారిగా, ‘సత్యంవద (సత్యమునే పలుకవలెను), ధర్మంచర (ధర్మాన్నే ఆచరించవలెను), మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ (తల్లితండ్రులు, గురువు, అతిథి దేవతలతో సమానం)’ అని చెప్తూ, ఆరోగ్యమే మహాభాగ్యమనీ, ధర్మ మార్గాలద్వారానే ధన సంపాదన వుండాలని, చదువుకోవడం, చదువుచెప్పడంలలో అలసత్వం వుండకూడదనీ, యజ్ఞయాగాదులు, పితృకర్మలూ మరువరాదనీ, అవైదికాలను గ్రహింపరాదని, ఇతరులచే నిందింపబడే పనులకు దూరంగా వుండాలనీ, పెద్దలను గౌరవించాలని, మూర్ఖులతో వాదించరాదని, విముఖతతో దానాలను ఇవ్వరాదనీ, గ్రహణ సమయాలలోనూ నీటిలోనూ సూర్యుణ్ణి, తన ప్రతిబింబాన్ని చూడరాదనీ, గోవులు, గురువులు, దేవతా విగ్రహాలు, ఆజ్యపాత్ర, తేనెపాత్ర, నాలుగుదారుల కూడలి కనిపించినప్పుడు ప్రదక్షిణ చేయాలని, అగ్నిని దాటకూడదని, కాళ్ళకింద నిప్పును వుంచుకోరాదని, అసుర సంధ్యవేళ భోజనం, నిద్ర, మైథునాలు కూడదనీ, ఋతుమతులతో సంభాషణ కూడదని, భుక్తాయాసం వచ్చునట్లు తినకూడదని, కంచుపాత్రలో కాళ్ళు కడగరాదని, గోళ్ళు కొరకటం,గోటితో దర్భ, గడ్డిని కోయుట కూడదని, రాత్రిళ్ళు చెట్లకింద నిద్రించరాదని, ఇద్దరు బ్రాహ్మణుల మధ్యనుండి వెళ్ళకూడదని, క్షుద్రులకు, జూదరులకు, వేశ్యలకు దూరంగా వుండాలని, భోజనం, మలమూత్ర విసర్జనం, యోగాభ్యాసం, సంగమం ఎవ్వరికంటా పడకుండా చేయాలని, తపస్సు, ఆయుష్షు, ధనం, ఆస్తులను గోప్యంగా వుంచాలని, ఇటువంటి ఎన్నో ధర్మాలను, జాగ్రత్తలను గురుబోధ చేస్తాడు. ఈ సంస్కారం పూర్తిచేసుకున్న తరువాత బ్రహ్మచారి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికై వివాహమాడటానికి అర్హుడౌతాడు. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు