రాముడు ఎందుకు ఆరాధ్యుడయ్యాడంటే... | Why god Rama ideal | Sakshi
Sakshi News home page

రాముడు ఎందుకు ఆరాధ్యుడయ్యాడంటే...

Published Thu, Mar 26 2015 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

రాముడు ఎందుకు  ఆరాధ్యుడయ్యాడంటే...

రాముడు ఎందుకు ఆరాధ్యుడయ్యాడంటే...

సద్గురు  జగ్గీ వాసుదేవ్
 
భారతీయులలో చాలామంది రాముణ్ణి ఆరాధిస్తారు. కానీ మీరు అతని జీవిత పరిస్థితులను, అతని జీవితం నడచిన తీరును గమనించినప్పుడు, అది అంతా విపత్తుల పరంపరగా అనిపిస్తుంది. అతను ధర్మబద్ధంగా తనది అయిన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు.  పైగా అడవులు పట్టిపోవలసి వచ్చింది. అంతలో అతని ధర్మపత్ని అపహరణం. అందుకోసం అతనికి ఇష్టం లేకపోయినా ఒక ఘోర సమరం చేయవలసి వచ్చింది. తన అర్ధాంగిని కాపాడి తిరిగి తెచ్చుకోగానే, చుట్టుప్రక్కల వారందరి నుండి అతి పరుషమైన వ్యాఖ్యానాలను భరించాడు. ఆ కారణంగా తన ప్రాణప్రదమైన సహధర్మచారిణిని అడవులలో వదిలిపెట్టాడు. అప్పుడామె నిండు గర్భవతి. కవలలకు జన్మనీయబోతూ ఉంది. ఆ తరువాత, తన కన్నబిడ్డలే అని  తెలియని పరిస్థితిలో, వారితోనే యుద్ధం చేశాడు. చివరకు తన భార్యను కూడా కోల్పోయాడు. అతని జీవితం ఒక ఎడతెగని విపత్తు. ఇంత జరిగినా, ఎందుకు జనులు రాముణ్ణి ఆరాధిస్తారు?

రాముని ప్రత్యేకత జీవితంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులలో లేదు. ఎదురైన విపత్తులలో ఎంత ఉన్నతంగా నడుచుకున్నాడనే దాని మీద అతని ఔన్నత్యం ఉన్నది. ఏనాడూ అతనిలో కోపం లేదు, ఎవరినీ నిందించటం లేదు, గగ్గోలు పెట్టడం లేదు. అతడు అన్ని సందర్భాలలోను ఉదాత్తతతో, హుందాగా నడుచుకున్నాడు.

అందువల్లనే, పవిత్ర జీవనాన్నీ, ఆపై ముక్తినీ సాధించాలని తపించే వ్యక్తులు రాముని కోసం తపిస్తారు. ఎందుకంటే బాహ్య పరిస్థితులు ఏక్షణంలోనైనా విషమించగలవు అని వారు తెలుసుకున్నారు కాబట్టి. ఆ విజ్ఞతను పొందారు కాబట్టి. ఎన్నో రకాలుగా జీవిత పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ఉన్నా కూడా, బాహ్య పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు విషమించే ఆస్కారం ఉంది. మీరు అన్నీ సక్రమంగానే నిర్వహించుకోవచ్చు. కానీ ఒకవేళ తుఫాను లాంటి  సమస్య వస్తే మాత్రం, అది మీ ఇంటిని, మీ సమస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది.  నాకేమీ అలా జరగదులే అని అనుకోవడమంటే మూర్ఖంగా బతకటమే అవుతుంది. ఒకవేళ అదే  జరిగినా కూడా నేను దానిని ధైర్యంగా ఎదుర్కొంటాను అని అనుకోవడం వివేకమైన జీవనమార్గం. ఈ మహత్తరమైన విజ్ఞత రామునిలో కనిపిస్తుంది. అందుకే జనులు అతనిని ఆరాధిస్తారు. మీ వద్ద ఎంత ఉంది, మీరు ఏం చేశారు, ఏం జరిగింది, ఏం జరగలేదు, ఇవన్నీ ప్రశ్న లు కావు. ఏదైనా జరగనీ, మిమ్మల్ని మీరు ఎలా నిలుపుకుంటున్నారు? అదే అసలు విషయం!

తన జీవితంలోని పరిస్థితులను చక్కదిద్దటానికి రాముడు ప్రయత్నించాడు. కానీ అన్నివేళలా అది వీలుకాలేదు. అనేక విషమ పరిస్థితులు అతడు అనుభవిస్తూ వచ్చాడు. పరిస్థితులు నియంత్రణను దాటిపోయాయి. కానీ ముఖ్యమైన విషయం ఒక్కటే... అతడు ఎప్పుడూ ఉదాత్తతతో, హుందాగా నడుచుకున్నాడు. ఇదే ఆధ్యాత్మికతలోని మౌలిక సారాంశం. మీ జీవితం ఒక సుందర పరిమళపుష్పంలాగా వికసించాలంటే  దానికి  సానుకూలమైన అంతర్గత పరిస్థితిని కల్పించుకోవాలి. అటువంటి స్థిరమైన అంతర్గత వాతావరణాన్ని మీరు ఎల్లప్పుడూ సృష్టించుకోవాలి. అందుకు రాముడు ఆదర్శం. అందుకే జనాలు ఆయనను ఆరాధిస్తారు!

దీని అర్థం, మన జీవితాన్ని  మనం సక్రమంగా నడుపుకోకూడదనా? కానే కాదు. మన చుట్టూ ఉన్న వ్యవహారాలను చక్కగా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే అది అందరికీ మంచిది. అలా ఒక పరిస్థితిని చక్కగా నిర్వహించినప్పటికీ కూడా, మనకది  తప్పకుండా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పలేము. కాని ప్రతి పరిస్థితిలోను, మనల్ని మనం మనోజ్ఞంగా నిలబెట్టుకోగలిగినప్పుడు, మనకు తప్పకుండా అద్భుతంగా  అనిపిస్తుంది.  అయినా, అందరి శ్రేయస్సు పట్లా మనకి శ్రద్ధ ఉంది కాబట్టి, మనం ఏ పరిస్థితినైనా సక్రమంగా నిర్వహించాలి.
 ప్రేమాశీస్సులతో... సద్గురు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement